ఈజిప్టులో ‘ఈశాని’ పూజ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

జూలియస్ సీజర్ తనను దేవుడిగా ప్రకటించుకుని, గుడి కట్టించుకోవడం; రోమ్ ను సామ్రాజ్య దశవైపు మళ్ళించడం ఒక దానితో ఒకటి సంబంధం లేనివి కావు. రెండింటిలోనూ ఉన్నది ఒకటే…అది వ్యక్తి ప్రాధాన్యం. వ్యక్తి రాజకీయ సామ్రాజ్యానికి అధికారకేంద్రం అయినట్టే, ఆస్తిక సామ్రాజ్యానికీ అవుతున్నాడు. గణతంత్రవాదులు సీజర్ ను చంపగలిగారు కానీ గణతంత్రాన్ని మాత్రం బతికించుకోలేక పోయారు. సీజర్ వరవడిలోనే రోమ్ క్రమంగా సామ్రాజ్యదశవైపు అధికారికంగా మళ్ళిపోయింది.

అయితే ఇక్కడ కొంత తేడా ఉంది. సీజర్ దేవుడిగా అవతరించినా అప్పటికి అనేకమంది దేవీ, దేవతలలో ఒకడు మాత్రమే. కానీ రాజకీయ సామ్రాజ్యంలో మాత్రం చక్రవర్తి ఏకైకుడు. ఆస్తికరంగాన్ని కూడా అలాంటి సామ్రాజ్యంగా మార్చడానికి మరికొంత కాలం పట్టింది. అందులో రోమన్లు పోషించిన కీలక పాత్ర గురించి చెప్పుకోబోయే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళడం అవసరం.

పురాచరిత్రలో ఒక ముఖ్యమైన తెగ అసీరియన్లు. వీరు మొదట్లో మెసపొటేమియాలోని బాబిలోనియా సామ్రాజ్యానికి ఉత్తర, తూర్పు దిక్కులలో సన్నని పీలికలా ఉండే టైగ్రిస్ నదీలోయలో ఉండేవారు. లోపలికి అంత తేలిగ్గా చొరడానికి వీలు లేని విధంగా ఆ లోయ చుట్టూ కొండలు. అసీరియన్లు క్రూరత్వానికి మారు పేరు. వీరి దేవుడు ఆసూర్. ఆ దేవుడి పేరు మీదనే వీరు ఆసూరు అనే నగరాన్ని, ఆ తర్వాత నినవే అనే నగరాన్ని కట్టుకున్నారు. మన పురాణ, ఇతిహాస ప్రసిద్ధులైన అసురులతో ముడిపెట్టుకుని అసీరియన్ల గురించి చెప్పుకోవలసిన ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే…

కాలక్రమంలో గొప్ప సైనిక శక్తిగా ఎదిగిన ఆసీరియన్లు క్రీ.పూ. 745 నాటికి బాబిలోనియాను ఆక్రమించుకున్నారు. బాబిలోనియా అప్పటికి అత్యధిక జనాభాతో, నినవే కన్నా చాలా పెద్ద నగరం. అక్కడి ప్రధాన దైవం బెల్ మర్దుక్. ఆసీరియన్లు ఆసూర్ అనే దేవుడిని కొలిచే వారే అయినా, బెల్ మర్దుక్ పై కూడా భక్తిప్రపత్తులు చాటుకునేవారు. మర్దుక్ పూజారులనే కాకుండా, బాబిలోనియాలోని వర్తకలను కూడా మర్యాదగా చూసేవారు. అంతేకాదు, శత్రువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన చరిత్ర తమకు ఉన్నా ప్రజలతో మాత్రం సామరస్యంగా ఉండేవారు. వాళ్ళ మనసు గెలుచుకోడానికి ప్రయత్నించేవారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, విజేతలు విజితులను(ఓడిపోయినవారిని) తమలో లీనం చేసుకోవడం కాక, తామే విజితులలో, వారి విశ్వాసాలలో కలసిపోవడం అప్పటి విధానం. అసీరియన్లలో సర్దనాపలస్ అనే పాలకుడు పూర్తిగా బాబిలోనియన్ గా మారిపోవడమే కాదు, ఆ నగరాన్ని గొప్ప మేధోనగరంగా తీర్చిదిద్దాడు. అప్పట్లోనే అతను మట్టి పలకల రూపంలో ఉండే పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాడు.

అయితే, నూట యాభై ఏళ్ల తర్వాత, క్రీ. పూ. 606లో మెసపొటేమియా ఆగ్నేయదిశనుంచి సెమెటిక్ జాతికి చెందిన చాల్దియన్లు, ఈశాన్య దిశనుంచి పర్షియన్లుగా గుర్తింపు పొందిన ఆర్యులైన మీదులు చుట్టుముట్టేసరికి ఆసీరియన్ రాజ్యం కుప్పకూలింది. ఉత్తరదిశలో నినవే నగరాన్ని కూడా కలుపుకుంటూ సియాక్జెరెస్ నాయకత్వంలో మీదుల రాజ్యమూ, బాబిలోనియాలో చాల్దియన్ రాజ్యమూ అవతరించాయి. మీదుల రాజ్యం తూర్పున భారతదేశ సరిహద్దుల దాకా విస్తరించింది.

చాల్దియన్లలో చివరి పాలకుడైన నబోనిడస్ విజ్ఞానవ్యాప్తిలో అసీరియన్ పాలకుడైన సర్దనాపలస్ ను కూడా మించిపోయాడు. పురాచరిత్ర మీద అతను పరిశోధనలు చేయించాడు. అప్పటికి రెండు వేల ఏళ్ల క్రితం బాబిలోనియాలో అక్కాడియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి సారగాన్ రాజ్యకాలాన్ని పరిశోధింపజేసి, నిర్ధారణ చేయడం ఆయన చేసిన పనుల్లో ఒకటి.

అదే సమయంలో నబోనిడస్ ఒక అనాలోచితమైన పని కూడా చేశాడు. అది చివరికి అతని రాజ్యానికే ఎసరు పెట్టింది. అదెలా జరిగిందంటే, బాబిలోనియా జనంలో అనైక్యతా ధోరణులు నానాటికీ పెరుగుతుండడం నబోనిడస్ గమనించాడు. ఆ రోజుల్లో ప్రజల లౌకిక, మత జీవితాలు రెండింటికీ దేవుడే కేంద్రబిందువుగా ఉండేవాడు. దేవుళ్ళ నందరినీ ఒక చోట చేర్చితే జనంలో ఐక్యత ఏర్పడుతుందని నబోనిడస్ అనుకున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న స్థానిక దేవతల నందరినీ బాబిలోనియా నగరానికి రప్పించి, వారికి అక్కడ దేవాలయాలు నిర్మింపజేయడానికి ప్రయత్నించాడు. రాజ్యంలో ప్రధాన దైవం బెల్ మర్దుక్ కనుక ఆ దేవుడి పూజారులు మంచి పలుకుబడీ, ప్రాభవాలతో మిగిలిన పూజారులకంటే ఉన్నతస్థితిలో ఉండేవారు. నేటి మన తిరుమల పూజారుల్లా అన్నమాట. స్థానిక దేవుళ్ళ నందరినీ రాజధానిలో కేంద్రీకరించి మర్దుక్ పక్కనే చోటు కల్పించే నబోనిడస్ ప్రయత్నం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

దాంతో వారు నబోనిడస్ నే పక్కకు తప్పించాలని పథకం వేశారు. పొరుగునే మీదు రాజ్యాన్ని ఏలుతున్న పర్షియన్ పాలకుడు సైరస్ తో కుమ్మక్కయ్యారు. సైరస్ బాబిలోనియా మీదికి యుద్ధానికి వచ్చాడు. కోట గోడల అవతల ఇరు సైన్యాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సైరస్ దే పైచేయి అయింది. అంతలో కోట ద్వారాలు తెరచుకున్నాయి. సైరస్ తన సైన్యంతో లోపలికి ప్రవేశించాడు. అతనికి అక్కడ ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు.

బైబిల్ కథనం ప్రకారం, ఆ సమయంలో యువరాజు బెల్షజ్జర్ విందు ఇస్తున్నాడు. అంతలో ఒక చెయ్యి ప్రత్యక్షమై గోడ మీద నిప్పు కణికల్లా వెలిగే అక్షరాలతో కొన్ని మార్మికమైన మాటలు రాసింది. అవి అర్థం కాని యువరాజు అప్పటికప్పుడు డేనియల్ అనే ప్రవక్తను రప్పించి వాటి అర్థం చెప్పమని కోరాడు. ‘దేవుడు మీ రాజ్యానికి రోజులు లెక్కించాడు. మీ రాజ్యాన్ని అంతమొందించాడు. మిమ్మల్ని తాసులో పెట్టి తూచినప్పుడు మీలో ఎన్నో సుగుణాలు లోపించిన సంగతి బయటపడింది. దాంతో మీ రాజ్యాన్ని మీదులకు, పర్షియన్లకు ఇవ్వాలని నిర్ణయించాడు’ అని డేనియల్ ఆ మాటలకు అర్థం చెప్పాడు.

ఆ రోజు రాత్రే బెల్షజ్జర్ ను హత్య చేశారు. నబోనిడస్ ను బందీగా పట్టుకున్నారు. ఆ విధంగా పర్షియన్ల బాబిలోనియా ఆక్రమణ ఎంత ప్రశాంతంగా, చడీచప్పుడు లేకుండా జరిగిపోయిందంటే, ఆ సమయంలో కూడా మర్దుక్ ఆలయంలో నిత్యపూజాదికాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయట!

ఆ గోడమీది రాత రహస్యం బహుశా మర్దుక్ పూజారులకు తెలిసి ఉంటుందని హెచ్.జి. వెల్స్ చమత్కరిస్తారు.

Rembrandt_-_Belshazzar's_Feast_-_WGA19123

  ***

ఇంతకీ విషయమేమిటంటే, నబోనిడస్ తెలివితక్కువగా తలపెట్టి తన రాజ్యానికే ముప్పు తెచ్చుకున్న దేవుళ్ళ కేంద్రీకరణ చర్యనే అనంతర కాలంలో రోమన్లు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఈ మధ్యలో కనీసం మూడు, నాలుగువందల సంవత్సరాల అంతరం ఉంది. అప్పటికి రాజకీయంగా కేంద్రీకృత అధికారానికి అలవాటు పడుతున్నట్టే, ఆస్తికరంగంలో కూడా కేంద్రీకృత ధోరణులకు జనం అలవాటు పడుతూ ఉండాలి. అయితే అప్పటికి కూడా బహురూప ఆస్తికత కొనసాగుతూనే ఉంది. నబోనిడస్ చర్య ప్రధానదైవమైన మర్దుక్ ప్రాభవాన్ని తగ్గిస్తుందన్న ఉద్దేశంతో పూజారులు వ్యతిరేకించి ఉండచ్చు కానీ, స్థానిక దేవతల అస్తిత్వం మీద వారికి వ్యతిరేకత ఉండే అవకాశం లేదు.

రోమన్లు తమ అధీనంలో ఉన్న విశాల భూభాగాలపై ఏకీకృత నాగరికతను రుద్దడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రాంతానికీ ఇంకో ప్రాంతానికీ మధ్య ఎన్నో వ్యత్యాసాలు, సంస్కృతుల మధ్య అసమానతలు ఉండేవి. హెచ్.జి. వెల్స్ ఈ సందర్భంలో రోమన్ గణతంత్రాన్ని బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంతో పోలుస్తారు. రాజ్యం అంతటా అక్కడక్కడ రోమన్ స్కందావారాలూ, కాలనీలూ ఉండేవి. వాటిలో జనం రోమన్ దేవతలను పూజించేవారు. లాటిన్ మాట్లాడేవారు. అయితే, రోమన్ ఆక్రమణకు ముందు నుంచీ ఉన్న నగరాలు, పట్టణాలలో మాత్రం జనజీవితం ఎప్పటిలానే ఉండేది. రోమన్ అధికారానికి లొంగి ఉంటూనే అక్కడి జనం తమ వ్యవహారాలను తామే నడుపుకునేవారు. తమ దేవీ దేవతలను తమ పద్ధతిలో పూజించుకునేవారు.

మత తాత్విక రంగాలలో మార్పులు లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే, అవి బహురూప ఆస్తికత అనే చట్రం లోపలే జరుగుతూ వచ్చాయి. అంతకుముందు పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన జనం వందలు, వేల తరాలపాటు దేవాలయం చుట్టూ తమ జీవితాలను, ఆలోచనలను అల్లుకుని జీవించారు. మతపరమైన తంతును ఎంతో శ్రద్ధగా జరిపేవారు. నిత్యవిధులకు ఏమాత్రం భంగం కలిగినా ఏదో కీడు జరుగుతుందని భయపడేవారు. బలులు ఇచ్చేవారు. ఏదో మార్మికతా, అంతుపట్టని నిగూఢతా వారి ఆలోచనలను ఆక్రమించుకుని ఉండేవి. ఆర్యీకృత ఆధునిక ప్రపంచానికి వారి దేవతలు భయానకంగానూ, తర్కరహితంగానూ కనిపించవచ్చుకానీ, వారు మాత్రం గాఢస్వప్నంలో ఆయా దృశ్యాలను, వస్తువులను ఎంత స్పష్టంగా చూస్తామో అంత స్పష్టంగా వారిని దర్శించేవారు. వారితో మమేకమయ్యేవారు. అదొక స్వాప్నిక జగత్తు. ఆ కాలంలో సుమేరియాలో కానీ, ఈజిప్టులో కానీ ఏదైనా నగరాన్ని ఇతరులు జయించినప్పుడు మహా అయితే, అక్కడి దేవీ దేవతల పేర్లు మారేవేమో కానీ, పూజా విధానం, దాని వెనుక ఉండే స్ఫూర్తీ అలాగే ఉండేవి. స్వప్న ప్రపంచంలోని మూర్తులు మారేవే తప్ప స్వప్నం మాత్రం యథాతథంగా కొనసాగేది. తొలినాటి సెమెటిక్ విజేతలు, సుమేరియన్ల ఆలోచనా సరళి, ఆరాధనా పద్ధతులు ఒకలానే ఉండేవి కనుక సెమెటిక్ విజేతలు సుమేరియన్ల మత సంస్కృతులను దాదాపు యథాతథంగా స్వీకరించేవారు. ఈజిప్టుకు వస్తే, గ్రీకు టోలెమీల పాలనలోనూ, రోమన్ సీజర్ల పాలనలోనూ కూడా ఈజిప్టు దేవాలయాలు, పూజారివ్యవస్థ, పూజావిధానాలు ఈజిప్టువిగానే ఉండిపోయాయి.

విజేతలు, విజితులు ఒకరితో ఒకరు కలసిపోయినట్టే వారి దేవతలూ కలసిపోయేవారు. దీనినే థియోక్రేసియా అన్నారని ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దేవతల మధ్య పోలికలు లోపించి విలీనానికి అవకాశం లేనప్పుడు వారి మధ్య ఒక సంబంధాన్ని కల్పించేవారు. ఉదాహరణకు గ్రీకులు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి ముందు ఏజియన్లు అమ్మవారి రూపంలో స్త్రీదేవతను పూజించేవారు. గ్రీకులు ఆక్రమించుకున్నాక ఆ స్త్రీదేవతను ఒక పురుషదేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఇద్దరినీ విలీనం చేసుకున్నారు. అలాగే ఒక జంతు దేవతకు, పక్షి దేవతకు, సర్పదేవతకు, నక్షత్రదేవతకు, సూర్యుడికి, లేదా ఒక ఖగోళ విశేషానికి మానవ రూపమిచ్చో, లేదా యథారూపంలోనో పూజించేవారు. ఒక్కోసారి ఓడిపోయిన వారి దేవతలను క్షుద్రదేవతలుగా పరిగణించేవారు. ఆస్తిక చరిత్ర అంతా ఇలా దేవీదేవతలను ఇచ్చిపుచ్చుకోవడం, రాజీపడడం, స్థానిక దేవతలను సంస్కరించడమే నని హెచ్.జి. వెల్స్ అంటారు.

గమనించే ఉంటారు… వెల్స్ ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశ చరిత్ర చెప్పడంలేదు. అయినాసరే, పైన చెప్పిన ప్రక్రియ మనదేశపు దేవీ, దేవతలకు కూడా పూర్తిగా అన్వయిస్తుంది. వేర్వేరు దేవీదేవతలను పూజించేవారు ఇరుగుపొరుగున ఉన్నప్పుడు వారిని ఏకం చేయవలసివచ్చేది. అమ్మవారి రూపంలో స్త్రీ దేవతను ఆరాధించేవారిని, పురుష దేవుణ్ణి ఆరాధించేవారిని ఏకం చేయడం; సాధారణంగా ఆ ఇరువురి దేవతల మధ్య దాంపత్య సంబంధాన్ని కల్పించడం రూపంలో జరిగేది. శక్తి, శివుడు ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోని అనేక ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఈ సయోధ్య సూత్రం మీద ఆధారపడే అభివృద్ధి చెందినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. భ్రమరాంబా, మల్లికార్జునస్వామీ కొలువైన శ్రీశైలక్షేత్రాన్నే తీసుకుంటే, భ్రమరాంబ మొదట్లో ఆ ప్రాంతంలోని ఆటవికులైన చెంచులు పూజిస్తూ వచ్చిన అమ్మవారి రూపమని చెబుతారు. అప్పట్లో ఆమె ఉగ్రరూపిణి కూడా. బ్రాహ్మణీయ సంప్రదాయం ఆ రూపాన్ని స్వీకరించి, సాత్వికమూర్తిగా మలచి, బహుశా చెంచుల పూజా పద్ధతులను కూడా సంస్కరించి శివుని రూపమైన మల్లికార్జున స్వామి సరసన ప్రతిష్టించింది. ఆది శంకరాచార్య శ్రీశైలక్షేత్రంలో ప్రముఖ పాత్ర పోషించారనీ, అమ్మవారి ముందు వారే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని క్షేత్రచరిత్ర చెబుతోంది. చెంచులు భ్రమరాంబను తమ ఆడబడుచుగానూ, మల్లికార్జున స్వామిని అల్లుడిగానూ చెప్పుకుంటారు. అక్కడి పూజారి వ్యవస్థలో కూడా సర్దుబాటు కనిపిస్తుంది. మల్లికార్జునస్వామి అర్చకులు బ్రాహ్మణేతరులైన జంగములైతే, అమ్మవారి అర్చకులు బ్రాహ్మణులు. శ్రీ కాళహస్తి క్షేత్రానికి కూడా ఇదేవిధమైన ఆటవిక, బ్రాహ్మణీయ సంబంధం కనిపిస్తుంది. భక్త కన్నప్ప కథ దానికి సూచన. భద్రాచల క్షేత్రం అవతరించింది కూడా ఇలాంటి సయోధ్య సూత్రం మీదే. గిరిజన మహిళ అయిన పోకల దమ్మక్కకు రాముడు కలలో కనిపించి తనకు గుడి కట్టమని కోరినట్టు స్థలపురాణం చెబుతోంది. భద్రాచలం ప్రసాదంలో విప్పపూలు కూడా ఇవ్వడం గిరిజన సంబంధాన్ని సూచిస్తుంది.

ప్రసిద్ధ దేవాలయాలు అనేకం కొండలు, గుట్టలు, అడవుల్లో ఉండడానికి కూడా అనేక కారణాలను చెప్పుకోవచ్చు. వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆటవిక, గిరిజన తెగలు ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు జనావాసాలను విస్తరించేవారు. వ్యవసాయ భూమినీ, దేవాలయం ఉన్న ప్రాంతాన్నీ కూడా ‘క్షేత్రం’ అనడం రెండిటికీ ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చని ఇంతకు ముందు ఒక వ్యాసంలో అన్నాను. వ్యవసాయ, జనావాసాలు విస్తరించడమంటే రాజ్యం విస్తరించడమే. శ్రీశైలంలోని ఆలయమే కాక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కూడా పురాతన దేవాలయాలు అనేకం ఎత్తైన, పటిష్టమైన ప్రాకారాలతో, ద్వారాలతో, బురుజులతో అక్షరాలా కోటలను తలపిస్తూ ఉంటాయి. ఆవిధంగా పుణ్యక్షేత్రం రాజులకు రెండవ రాజధానిగా ఉండేదనుకోవచ్చు. దేవుడికి చేసే ఉపచారాలు కూడా రాజోపచారాలే. స్థానిక దేవీ దేవతలను, పూజా విధానాలను సంస్కరించి, బ్రాహ్మణీయ సంప్రదాయంలో విలీనం చేయడం రూపంలో సామదాన ఉపాయాలను అనుసరిస్తూనే; అవసరమైతే, భేద, దండోపాయాలను కూడా అమలు చేసే ఏర్పాటుకు వీలుగా దేవాలయ నిర్మాణం ఉండేదనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే, దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన పురాతన నగర రాజ్యాల సరళీ వీటిలో ప్రతిబింబిస్తూ ఉండచ్చు. ఈ మాట అంటున్నప్పుడు, ప్రాచీన సుమేరుసంస్కృతికీ, ప్రత్యేకించి దక్షిణభారత సంస్కృతికీ ఉన్న పోలికల చర్చలోకి పరుగుపెట్టాలని కీబోర్డు మీద నా వేళ్ళు ఉత్సాహపడుతున్నాయి కానీ, దాంతోపాటు పై విషయాలు అనేకం మరింత విపులంగా చెప్పుకోవలసినవి కనుక ఆ ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పదు.

పైన జంతు దేవత, సర్ప దేవత, నక్షత్రదేవత అని హెచ్. జి. వెల్స్ అన్నప్పుడు వాటితో కూడా మనకున్న సామ్యాలకు లెక్కే లేదు. కుక్కకు కాలభైరవ రూపమిచ్చి జంతురూపంలోనూ, మనిషి రూపంలోనూ కూడా కొలవడం మన దగ్గర ఉంది. అలాగే, నందిని శివునికి వాహనమైన వృషభ రూపంలోనే కాక మానవ రూపంలోనూ చెప్పుకుంటాం. విష్ణువు వాహనమైన గరుత్మంతుడు అనే పక్షి విషయంలోనూ అంతే. సర్పానికీ, సూర్యచంద్రులకీ, ఇతర ఖగోళ విశేషాలకు మానవ ఆకృతిని ఇవ్వడం మన దగ్గరా మామూలే. సర్పాన్ని యథారూపంలో పూజించడమూ ఉంది.

ఇలాంటి బహురూప ఆస్తికత మన దేశంలో సమకాలీన వాస్తవం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం.

   ***

దేవతల కూర్పులు, చేర్పులు, మార్పుల (థియోక్రేసియా) ప్రక్రియను వెల్స్ ఈజిప్టు నేపథ్యం నుంచి వివరిస్తారు. ఇందులో దొర్లే దేవీ, దేవతల పేర్లు కొత్తగా అనిపించి ఆసక్తి గొలపక పోవచ్చు కానీ, వారిలో మన దేవీ, దేవతల పోలికలను పట్టుకుంటూ వెడితే ఆసక్తిని కలిగించవచ్చు.

ఈజిప్టు నగరరాజ్యాల దశనుంచి, ఐక్య సామ్రాజ్యంగా అభివృద్ధి చెందే క్రమంలో థియోక్రేసియా పెద్ద ఎత్తున సంభవించింది. వారి ప్రధాన దైవం ఓసిరిస్. ఈజిప్టు చక్రవర్తి(ఫారో) భూమి మీద ఈ దేవుడి ప్రతిరూపం. ఓసిరిస్ బలులు స్వీకరించే పంటల దేవుడు. విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడం, దానినుంచి మళ్ళీ మొక్క రావడం –చావు, పుట్టుకల చక్రానికి ప్రతీకగా చెబుతారు. ఈ పంటల దేవుడు కూడా అంతే. చచ్చి మళ్ళీ పుట్టడమంటే, మృత్యుంజయత్వమే. ఆవిధంగా ఓసిరిస్ మృత్యుంజయుడు. మన శివుడు కూడా మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయత్వాన్నే మనం అమరత్వం అంటాం. ఈ అమరత్వం అనే భావనను ఈజిప్షియన్లే ప్రపంచానికి పరిచయం చేశారని వెల్స్ అంటారు. అందుకు ప్రత్యేకమైన సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అందులోకి తర్వాత వెడదాం. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉంటాయి కనుక ఓసిరిస్ సూర్యుడు కూడా. ఆ తర్వాత ఓసిరిస్ ను ఎపిస్ అనే వృషభదేవుడిగా గుర్తించడం ప్రారంభించారు. అప్పుడతని అర్థాంగి ఐసిస్. ఆమె హేతర్ అనే పేరు ఉన్న గోదేవత కూడా. అంతేకాదు, ఆమె చంద్రవంక, సముద్రం నుంచి ఆవిర్భవించిన తారా కూడా. తార మన అమ్మవారి పేర్లలో ఒకటి. అమ్మవారి తల మీద, శివుని తల మీద చంద్రవంక ఉంటుంది. మన లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవిస్తుంది.

ఓసిరిస్ చనిపోయిన తర్వాత ఐసిస్ కు హోరస్ అనే కొడుకు పుడతాడు. ఇతడు మొదట్లో మన గరుత్మంతుడిలాంటివాడు. ఇతనే ఆ తర్వాత ఓసిరిస్ అవుతాడు. ఐసిస్ చంద్రవంక మీద నిలబడి కొడుకుని ఎత్తుకుని ఉన్న రూపంలో కనిపిస్తుంది. ఈ రూపం బాల వినాయకుణ్ణి ఎత్తుకుని ఉన్న పార్వతిని గుర్తుచేస్తుంది. వృషభం, సూర్యుడు, చంద్రుడు, సర్పం మొదలైనవి నాటి బహురూప ఆస్తికతకు గుర్తుగా ఈజిప్టు, మనదేశపు ఆస్తికతలలోనే కాక, పురాతన ఆస్తికతలు అన్నిటా ప్రధాన పాత్ర వహించాయి. ఎంతో ఆసక్తికర సమాచారం ఉన్న ఆ కోణంలోకి ఇప్పుడు వెళ్లలేం.

గ్రీకులు ఈజిప్టును జయించిన తర్వాత నూతనంగా నిర్మించిన అలెగ్జాండ్రియా నగరం ఈజిప్టు మతజీవితానికే కాక, హెల్లెనిక్ (పురాతన గ్రీసు, దానిని దగ్గరలో ఉన్న దీవులు, క్రీటు ద్వీపం, ఆసియా మైనర్ తీరప్రాంతం, ఇటలీ దక్షిణ ప్రాంతాలను ఇలా పిలిచేవారు) ప్రపంచ మతజీవితం మొత్తానికి కేంద్రస్థానం అయింది. మొదటి టోలెమీ చక్రవర్తి అలెగ్జాండ్రియాలో ‘సెరాపియమ్’ అనే బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మింపజేసి, అందులో ఒకవిధమైన త్రిమూర్తులను ప్రతిష్టింపజేశాడు. వారు: సెరాపిస్, ఐసిస్, హోరస్ లు. సెరాపిస్ మరెవరో కాదు, ఓసిరిస్-ఎపిస్ లను కలిపేసి సృష్టించిన దేవుడు. నిజానికి ఈ త్రిమూర్తులు వేర్వేరు దేవుళ్ళు కారు, ఒకే దేవుడికి భిన్న అంశలు. ఈ సెరాపిస్ నే గ్రీకుల జియస్ (ఈయన మన బ్రహ్మ దేవుడిలాంటివాడు) గానూ, రోమన్ల జూపిటర్ గానూ, పర్షియన్ల సూర్యదేవుడిగానూ గుర్తిస్తారు.

హెల్లెనిక్ ప్రభావంతో ఈ త్రిమూర్తుల ఆరాధన ఉత్తరభారతం, పశ్చిమ చైనాల వరకూ వ్యాపించిందని వెల్స్ అంటారు.

మన దేశంలో అమ్మవారిని పూజించినట్టే అసంఖ్యాక భక్తులు ఐసిస్ ను ఆరాధించేవారు. ఆ చల్లని తల్లి తమను కష్టాలు, కడగండ్ల నుంచి గట్టెక్కిస్తుందని నమ్మేవారు. ఐసిస్ అనే పేరు మన ఈశాని(పార్వతి)ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ఆమె స్వర్గరాణి. దేవాలయాలలో ఆమె హోరస్ ఎత్తుకుని ఉన్న రూపంలో ఉంటుంది. ఆమె ముందు దీపారాధన చేసి, నైవేద్యాలు అర్పించేవారు. విశేషమేమిటంటే, ఐసిస్ ఆలయంలో అర్చకులు శిరోముండనం చేసుకునేవారు. బ్రహ్మచర్యం పాటించేవారు.

మన అమ్మవారి ఆలయాలలోని మనకు చిరపరిచితమైన దృశ్యాల ప్రతిబింబాన్ని ఈ వివరాలలో మీరు ఈపాటికి స్పష్టంగా పోల్చుకుని ఉండవచ్చు.

అదీ సంగతి!

 

 

మిగతా విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

 

 

 

 

Download PDF

2 Comments

 • జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి says:

  ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు.
  ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి మీరు రాసిన వ్యాసాలన్నీ ఏకబిగిన చదివి పూర్తి చేసాను. ప్రతి వ్యాసం చాలా విలువైనది. చరిత్ర అధ్యయనం చెయ్యడంలో మీది విశిష్టమైన శైలి. చరిత్ర నుండి సంస్కృతిలోకి ప్రవహించే ఆచారాలు, ఆచరణలు, విశ్వాసాలూ సారూప్యతలు ఇలా ప్రతిదాన్నీ మీరు విడమరచి చెబుతూంటే చదవడం ఒక అద్భుతమైన అనుభవం. మన దేశంలో మతం ఆచరణలు, చరిత్ర, ఇతిహాసాలు ఒకదానికి ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయంటే ఆ చిక్కు ముడుల్లోంచీ బయట పడటానికి ఒక జీవిత కాలం సరిపోదేమో అనిపిస్తుంది. చాలా శ్రమతో కూడుకున్న పనిని తలకు ఎత్తుకున్నారు..
  మీరు ముందుకు సాగుతుంటే మీ వెంట నడవటమే మా పని.
  జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

 • kalluri bhaskaram says:

  ధన్యవాదాలు శ్రీరామచంద్రమూర్తిగారూ…

  మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. నా వ్యాసాలపై మీ స్పందన ఎంతో విలువైనది. “మన దేశంలో మతం ఆచరణలు, చరిత్ర, ఇతిహాసాలు ఒకదానికి ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయంటే ఆ చిక్కు ముడుల్లోంచీ బయట పడటానికి ఒక జీవిత కాలం సరిపోదేమో అనిపిస్తుంది.” అన్న మీ వ్యాఖ్య ఎంతో లోతైనది. సరిగ్గా నా ఆలోచనకు, అనుభవానికి అద్దంపడుతోంది. ఒక జీవితకాలం కాదు, అనేక జీవిత కాలాలు కూడా సరిపోవేమో. నిజానికి నేను రాస్తున్నది సముద్రంలో బిందువు. రాయనిదే చాలా ఎక్కువ. నా వ్యాసాలు అన్నీమీరు ఏకబిగిన చదివాననడం నా ప్రయత్నానికి అపురూపమైన అభినందన. మరోసారి కృతజ్ఞతలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)