తాత్విక ‘జీవధార’

kara_featured
karalogo
నిర్వహణ: రమాసుందరి బత్తుల

’జీవధార’ కారా కధలన్నిటిలోకీ విశిష్టమైనది. ఇది కేవలం ఒక కధ కాదు. కారా కధలన్నిటా అంతర్వాహినిగా ప్రవహించి వాటిని సుసంపన్నం చేసిన ఆయన ప్రాపంచిక దృక్పధం. ఇది ఆయన తాత్విక జీవధార.

కారా తనకాలం విసిరిన సవాలును స్వీకరించి ప్రజలపక్షం తీసుకోవడంలో ఆయన నిబధ్దత ఉంటే , తను ఏ వైపు ఉన్నాడో ఆ ప్రజల జీవితాన్ని, వారి నిత్యజీవిత సంఘర్షణను అతి సమీపంనుండి నిశితంగా గమనించి అక్షరీకరించడంలో ఆయన సంవేదన ఉంది. నక్సల్బరిలో రాజుకొని దేశమంతా కార్చిచ్చులా అల్లుకుంటున్న విప్లవోద్యమానికి ఇరుసయిన వర్గ సంఘర్షణ తాలూకు ఆనవాళ్ళను తన చుట్టూ జీవితంలో కనిపెట్టగలగడంలోనే కారా అనన్య సామాన్యమయిన ప్రతిభ ఉంది.

ఆయన ఎంచుకున్న వస్తువు నీళ్ళు. మనిషి ప్రాధమిక జీవనాధారం. అందుకే ఆయన ‘జీవధార’ అన్నాడు. అదే మానవ నాగరికతకు ఆలంబన. అందరికీ సమాన హక్కులున్న ఒక సహజ వనరు. నీరు పల్లమెరుగు. అది దాని సహజ ధర్మం.

మరి పల్లానికి ప్రవహించాల్సిన నీరు బంగళాల మీది తోటల్లోకి ఎట్లా పరిగెత్తింది? శక్తి దానిని నడిపింది?

దాహం గొన్న మనిషికీ దాన్ని తీర్చే నీటికీ మధ్య శక్తి అడ్డుగా నిలిచింది?

దాన్ని దాచి కాపాడే శక్తి ఎక్కడుంది?

ఇనుప గేటులోనా? యజమాని గొంతు లోని భావన్ని కనిపెట్టి మీదికి దూకే ’బేపి’ల్లోనా? యజమాని మాట మాత్రమే వినిపించే నరసింహులులోనా? వీళ్ళందరి మీదుగా కనిపెట్టి చూస్తున్న పోలీసులూ, చట్టాలూ, కోర్టుల్లోనా? కారా మనల్ని ఈ ప్రశ్నలు అడగడు. జవాబులూ చెప్పడు. ఆయన తన మానాన తాను ఒక జీవన చిత్రాన్ని ఆవిష్కరించి వెళ్తాడు. రక్తమాంసాలున్న మనుషుల్ని మన ముందుంచి వెళ్తాడు. వాళ్ళతో కలసి అన్వేషించడం మనపని.

తొలి యవ్వన మాధుర్యం ’సిటం’ సేపు మైమరిపించినా జీవన కాఠిన్యతను మర్చిపోని అమ్మాజీ.. బతిమాలైనా, కొట్లాడయినా బ్రతకడం ముఖ్యమని, దీనికి మంది బలం అవసరమని గుర్తించిన సత్యవతి.. పల్లెనుండి వచ్చి నగరం ఉక్కపోతకి ఉక్కిరిబిక్కిరయినా బిడ్డ ఏడుపుకు కారణం తెలుసుకొని చెమట తుడుచుకొని స్తన్యమిచ్చినంత సులువుగా పరిస్థితులనర్ధం చేసుకోగలిగిన తవిటమ్మా.. రాజీపడటం తప్పుకాదనీ, తప్పదనీ చెప్పి పోరాటాన్ని ఫలప్రదంగా ముగించగలిగిన లౌక్యమున్న అప్పాయమ్మ .. ఇంకా ఇలాంటివాళ్ళే చాలామంది పేదోళ్ళవాడలోనుండి తాగేందుకు గుక్కెడు నీళ్ళకోసం రావుగారి గేటు ముందు నిలబడతారు. గేటు లోపల కూడా స్త్రీలే. కాకపోతే వాళ్ళ పేర్లే తెలీదు. ముసలావిడా, మధ్యవయసు స్త్రీ, తెల్లపిల్ల.

రచయిత ఇక్కడే తనెటు వైపు నుండి కధ చెబుతున్నాడో చెప్పకనే చెబుతాడు. వాడలోని వాళ్ళు తనకి పరిచితులు. బంగళా తనకి అపరిచితం, పరాయి. లోపల గదిలో వాళ్ళెందుకు నవ్వుకుంటున్నారో అమ్మాజీకెంత తెలుసో మనకూ అంతే తెలుసు. అంతకుమించి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనకు పరాయి. కానీ అమ్మాజీ ఎంత అవమానపడ్డదో, సత్యవతి ఎంత రోషపడ్డదో, తవిటమ్మ ఎంత బెదిరిపోయిందో మనమూ అంతే అవమానపడతాం.. రోషపడతాం.. బెదిరి పోతాం. రచయితగా కారా మనల్ని తనతో పాటు వాడలోకి తీసుకెళ్తాడు. సత్యవతి మొదటిసారి తవిటమ్మ ఇంటికి వెళ్ళినట్టుగా మనంకూడా అట్లా గోడవారగా వెళ్ళి నిలబడతాం.

ఫోటో: కూర్మనాధ్

ఫోటో: కూర్మనాధ్

వీధి కొళాయి నుండి నీరు ఝాకొడుతూ వస్తున్నప్పుడు ఒకరినొకరు పలకరించుకున్నవాళ్ళు, ధార తగ్గేసరికి వాదులాడుకోవడం మొదలెడతారు. ఇంకా సన్నబడితే తోసుకుంటారు. కడవలు తిరగబడతాయి. ఇక్కడ శాంతిభద్రతలు కాపాడ్డానికి పోలీసులొస్తారు. కోర్టులు, కేసులు. పోనీ సరిపడినన్ని నీళ్ళివ్వచ్చు కదా! సత్యవతి మాటల్లో ’ఎక్కడలేని నీళ్ళు వీళ్ళలాటోళ్ళ మొక్కలకే సాలవ్’. అవి కూడా ఎలాంటి మొక్కలూ..? ఒక పువ్వు పూయని, ఒక కాయ కాయని మొక్కలు. ఆ బంగళాలోని టాపుని మున్సిపాలిటీ వాళ్ళు కట్టెయరు. వాడలోని వాళ్ళకి ఆ బంగళా వాళ్ళు ఒక కడవ పట్టివ్వరు. ముసలమ్మ మాటల్లో ఒకసారి పట్టుకోనిస్తే రోజూ వస్తారు. అదే అలవాటవుతుంది. ఆ తర్వాత హక్కవుతుంది. అసలు అందరికీ హక్కున్న నీరు కొద్ది మంది దెట్లయింది?.. ఇక్కడే ఈ కధ ’ప్రాసంగికత’ ఉంది.

ఈ దేశంలో’అభివృద్ధి’ పేరుతో జరిగిందీ, జరుగుతున్నదీ అందరికీ చెందిన సహజ వనరులను కొందరికి దఖలు పరచడమే. పెట్టుబడి బలపడని కాలంలో మౌలిక వసతులు, పరిశ్రమల పేరుతో నెహ్రూ ఆర్ధిక నమూనా చేసింది పెట్టుబడిదారులకు కావలసిన సౌకర్యాలు అందించడమే. రావుగారు వాడలోని వాళ్ళపేరుతో నీళ్ళూ కరెంటూ తెప్పించినందువల్ల జరిగింది ఆయన స్థలాల విలువ ఒకటికి పదిరెట్లు పెరగటమే.. ఒక కారు రెండు కార్లయ్యాయి. అదే నిష్పత్తిలో ఆయన హోదా కూడా పెరిగింది. సహజంగానే మున్సిపాలిటీ వాళ్ళు బాబుగారి టాపు కట్టేయడం మానేశారు. ఇంతా జేస్తే ప్రాణావసరమైన నీళ్ళు రావుగారి తోటలో పూలు పూయని , కాయలు కాయని మొక్కల విలాసానికి ఖర్చయిపోతాయి. అందుకే నీటి విలువ తెలిసిన తవిటమ్మ “మా ఊళ్ళో ఈ మాత్తరం తోట సొంతానికుంటే ఒక కుటామం సునాయాసంగా బతికేస్తది” అనుకుంటుంది.

ఇక్కడ నీరు ధర్మం తప్పింది. ఒక్క పువ్వుకీ, ఒక్క కాయకీ నోచుకోని తోట కోసం దారి తప్పింది. ఈదేశంలో ఇది నీటికి మాత్రమే పరిమితమైంది కాదు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములనుండి మొదలుకొని దట్టమైన అడవులూ, పచ్చనికొండలూ, సముద్రతీరాలూ అన్నీ వాటి సహజధర్మాల్ని వదిలిపెట్టి, కుళాయిలోని నీళ్ళు మెరక మీద బంగళాలోనికి ప్రవహించినట్టుగా, రావు గారు పనిచేసిన కంపెనీల సంపదగా మారిపోయాయి. కాకపోతే ఇప్పుడు రావుగారి వారసులకు ప్రభుత్వ సాయం అవసరంలేదు. వాళ్ళే తవ్వుకోగలరు, పైపులు వేసుకోగలరు, కరెంటు చేసుకోగలరు, వీటన్నిటికీ ఆవసరమయిన అనుమతులిచ్చే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే గెలిపించుకోగలరు.

మరి వనరుల అసలు హక్కుదారులైన ప్రజలెట్లా బ్రతకాలి? ఎక్కడికెళ్ళాలి?

ఆ అనివార్యత లోంచే వీళ్ళు బంగళాల ఇనుప గేట్ల ముందు గుమి గూడతారు. గొడవపడతారు. బంగళాల వాళ్ళకు, వాటికి కాపలా కాసే నరసింహులులాంటి వాళ్ళకూ అది దొమ్మీలా కన్పిస్తుంది. పోలీసులూ కుక్కలూ ఉండనే ఉన్నాయి. అయినా అప్పాయమ్మ ముసలావిడతో “ఒక అందం ఉందని ఇరగబాటా, ఒక సందం ఉందని యిరగబాటా, లేప్పోతే మళ్ళూ మాన్నేలూ డబ్బూ మాకు మీకన్నా ఎక్కువుండాయని యిరగబాటా, ఏటి సూసుకొని మీ ముందు యిరగబడిపోతాం’ అన్నప్పుడు తలా ఒక బిందె పట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇది కేవలం తన అహం సంతృప్తి పడటం వల్లనే కాదు, ఈ గొడవను కొనసాగించడవల్ల వచ్చే పర్యవసానాల పట్ల గల సంశయం వల్ల కూడా కావచ్చు. ఇక్కడే కలవాళ్ళ భయం లేనివాళ్ళ తెగింపుతో రాజీకొస్తుంది. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందై కలవాళ్ళ గేటుముందు గొడవపడక తప్పదు. ఇది ఎప్పటిదాక?

ఈ కధ రాసేనాటికి కలవాళ్ళు, లేని వాళ్ళ మధ్య గొడవను శాశ్వతం గా ముగించేందుకు ఒక పెనుగులాట మొదలైంది. ఒక యుద్ధం, ఒక పోరాటం మొదలైంది. దమ్ముంటే కుక్కను విప్పమని సవాల్ చేసిన సత్యవతి లాంటి వాళ్ళు ఆ యుద్ధానికి సైనికులయ్యారు, సేనానులయ్యారు.

కలవాళ్ళూ లేనివాళ్ళ మధ్య తగవు ఏ అంశాన్నీ వదిలిపెట్టలేదు. పదేళ్ళ కిందటి పరిచయం శేషుబాబుకీ, ఆ యింటి ఆడపిల్లలకీ ’ఓ నువ్వా’ అనే వేళాకోళం. ఇదంతా అమ్మాజీకి అవమానకరమైన సందర్భం. మనసులో ఎర్రగా బుర్రగా టెర్లిన్ షర్ట్ టక్ చేసుకున్న శేషుబాబు గురించి ఊహయినా రానివ్వని అమ్మాజీ ’సవుద్రాల్ని’ మాత్రం రావొద్దని చెప్పలేదు.

తవిటమ్మ ఊరినుండి వచ్చింది. అమ్మాజీ వాళ్ళు షరాబులు కాకపోయినా వడ్రంగం పని ఎట్లా చేస్తున్నారా అని ఆశ్చర్యపోతుంది. నగర జీవితంలో కులాల నుండి వృత్తులు వేరవడం తవిటమ్మ అనుభవంలో లేని విషయం. రావు గారి కులమేంటన్న తవిటమ్మ ప్రశ్నకి సమాధానంగా అమ్మాజీ “ఏదో పెద్ద పనే” అంటుంది. వాడలోవాళ్ళకి బంగళా వాళ్ళంతా ఒక కులమే.

ఈ దేశంలో.. ఆమాట కొస్తే ఏ దేశంలోనైనా, కొద్దిమంది కలవాళ్ళు ఆసంఖ్యాకులైన లేనివాళ్ళ మధ్య కలహం ఇప్పటిది కాదు. ఇప్పుడప్పట్లో ముగిసేదీ కాదు. ఎన్నో అంతర్బహిర్ యుద్ధాలు జరగాలి. దానికి కావలసిన పూనికను ఈ కధ విజయవంతంగా అందిస్తుంది. అందుకే ఇది కేవలం కధ కాదు. తాత్విక ’జీవధార’.

                                                                                      -యెనికపాటి కరుణాకర్

కరుణాకర్

వై కరుణాకర్ ప్రకాశం జిల్లాలో టీచరుగా పని చేస్తున్నారు. కార్టూన్లు వేయటం వీరికి ప్రియమైన విషయం. Karunacartoon.blogspot.in పేరుతో ఉన్న కరుణాకర్ గారి బ్లాగ్ లో సీరియస్ పొలిటికల్ విమర్శ, కార్టూన్ల రూపంలో ఉంటుంది. కరూణాకర్ గారు రాసిన కధా విమర్శలు గతంలో అరుణతార, సాహిత్య నేత్రం పత్రికల్లో వచ్చాయి. స్వాతంత్రం ముందు రచయితల్లో కరుణకుమార అంటే ఇష్టమట. అల్లం రాజయ్య, కొడవటిగంటి కుటుంబరావు గారు ఈయన ఇష్టమైన రచయితలు. వర్ధమాన రచయితల్లో బమిడి జగదీశ్వరరావు, ఆర్. ఎం. ఉమామహేశ్వరరావులను ఇష్టపడతారు. విమల, తెరేష్ బాబు, మద్దూరి నగేష్ బాబు, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని కవిత్వం చాలా ఇష్టం.

వచ్చే  వారం జి.ఎస్ రామ్మోహన్ గారి “శాంతి” కధ గురించిన పరిచయం

‘జీవధార’ లింక్ ఇక్కడ:

Download PDF

13 Comments

 • raghava says:

  కరుణాకర్ గారూ…ఎంత చక్కగా చెప్పారండీ! కధలనెలా ఎంచుకోవాలో..ఎలా అర్ధం చేసుకోవాలో..చదివి ఏం ఇంకించుకోవాలో అర్ధం చేయించారు..బోలెడు అభినందనలు..ధన్యవాదాలు కూడా.

 • Bhasker koorapati says:

  ‘అందుకే కారా కథల్లో మానవ సంభందాల జీవధార …,’ అని అన్నారెవరో….బహుశః వేణుగోపాల్ గారు అనుకుంటాను.
  భాస్కర్ కూరపాటి.

 • karunanakar says:

  రాఘవ, భాస్కర్ గార్లకులకు ధన్యవాదాలు.

 • వేణు says:

  కరుణాకర్ గారూ! మీ పరిచయం, విశ్లేషణ.. ‘జీవధార’ కథను లోతుగా అర్థం చేసుకోవటానికి దారి చూపుతుంది. బాగా రాశారు.

 • amarendra dasari says:

  ఈ కథ విషయం లో ఇంకో మాట చెప్పుకోవాలి ..కథలోని పెద్దింటి లోని నీళ్ళ ట్యూబ్ పాములన్నీ చీమలు పెట్టిన పుట్టల్లోంచి వచ్చినవే ! ఆ పేదల సంతకాలే ఆ పెద్దల మంచినీళ్ళకు మూలాధారం ..సమీక్ష చాలా బావుంది కరుణాకర్ గారూ ..థాంక్స్

 • N Venugopal says:

  కరుణాకర్ గారూ,

  చాల బాగుంది. అభినందనలు.

 • S. Narayanaswamy says:

  మంచి సమీక్ష.

 • S. Narayanaswamy says:

  గుడ్డుకి ఈక : రచయిత పరిచయంలో బమ్మిడి జగదీశ్వర్రావునీ ఆర్ యెం ఉమామహేశ్వర్రావునీ ఇంకా వర్ధమాన రచయితలు అనడం బాలేదు!

  • నారాయణస్వామి గారు,
   వాళ్ళిద్దరిని వర్ధమాన రచయితలు అనటం పొరపాటే. కాని ఇంకో చేదు నిజం. వాళ్ళ తరువాత ఎక్కువ మంది కారాగారిని చదవలేదని అర్ధం అయ్యాక నాకు వాళ్ళే వర్ధమాన రచయితలుగా అనిపించి ఉంటారు. .

 • Aparna says:

  ఎంత బాగా పరిచయం చేసారండీ… నాకిష్టమైన కథ!

 • Thirupalu says:

  // అందుకే ఇది కేవలం కధ కాదు. తాత్విక ’జీవధార’.//
  చాలా బాగా చెప్పారండీ! అసలు నీటినే జీవదార అనే ఒక కొత్త పేరుతో పిలవడం ఒక తాత్వికాంశం. పైకి సాదారణంగా కనిపించే నీరు మానవ మనుగడకు ఎంత ముఖ్య వనరో చెపుతుంది. నిన్న మొన్నటి వరకు సాధరణంగా సహజంగా దొరికిన నీరు ఇవాలా అమ్మకపు సరుకై కూర్చుంది.దీని వనుక పనిగట్టుకొని డిమాండ్‌ కలిగిన సరుకుగా మార్చిన రాజాకీయం ఎంత ఉందో, దీన్ని 70 లలోనే ఊహించిన కారా మాష్టారు ఎంత ముందు చూపు కలవా రో తెలుస్తుంది. కధ వెనుక నున్న తాత్వికతకు చాలా బాగా అద్దం పట్టారు.

 • karunanakar says:

  స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. కారా జీవధార కదని చదివినప్పుడు నాకు స్స్ఫురించినవి మీతో పంచుకున్నాను. ఇంకా నేను చూడలేని అంశాలు, నా అశక్తత వల్ల చెప్పలేని ఆంశాలు మిత్రులు ప్రస్త్సావిస్తే ఈ శీర్షిక ప్రయోజనం నెరవేరుతుందనుకుంటున్నాను

 • bhaskar k says:

  కరుణాకర్, కథా పరిచయం బాగుంది ,. రాస్తూవుండు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)