అమ్మ…దేవత…జయలలిత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నాకు ఇక్కడ ఒకసారి వర్తమానంలోకి రావాలని బలంగా అనిపిస్తోంది…

అలాగని నేనిప్పుడు ప్రస్తావించబోయే అంశాలు, గత కొన్ని వ్యాసాలుగా చర్చిస్తున్న అంశంతో సంబంధం లేనివి కావు. మన పురాచరిత్రకూ; లౌకిక, పారలౌకికతలతో జమిలిగా అల్లుకున్న మన సంక్లిష్ట మనస్తత్వానికీ, చర్చించబోయే అంశాలకూ ఏదో ముడి ఉందనుకుంటున్నాను. లోపలికి వెడుతున్నకొద్దీ అది ఎలాంటిదో అర్థమవుతుందేమో చూద్దాం.

తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి… ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తు గురించి భయం కూడా ఉండచ్చు. తమ నాయకుడు/నాయకురాలు ఇలాంటి విషమపరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అభిమానులు ఆత్మహత్యకు సైతం పాల్పడడం తమిళనాడులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని జయలలిత విజ్ఞప్తి కూడా చేశారు. సరే, రాజకీయనాయకులు చేసే అలాంటి విజ్ఞప్తిలో, ‘తనకు ఇంత అభిమానుల బలం ఉంది సుమా’ అని ఇతరులకు చేసే ఒక హెచ్చరికా ఇమిడి ఉంటుంది, అది వేరే విషయం.

జయలలిత అశేష అభిమానుల దృష్టిలో కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆమె ‘అమ్మ’. జనానికి నిత్యజీవనభారాన్ని ఎంతో కొంత తగ్గించే కొన్ని జనప్రియ(పాపులిస్ట్) పథకాలను ఆమె అమలు చేశారు. ఆవిధంగా ఆమెను ‘అమ్మ’ అని పిలుచుకోవడంలో అభిమాన, ఆత్మీయతలతోపాటు ఆరాధనాభావం కూడా కలగలసి ఉంటుంది. అంటే, అమ్మ అక్షరాలా ‘దేవత’ అయిపోతుంది. ఆమె సాక్షాత్తు అమ్మ, దేవత అనే భావన జనంలో ఎంత బలంగా ఏర్పడిపోతుందంటే; ‘ముఖ్యమంత్రి’ అన్న లౌకిక నామం ఆ అభిమానపు వెల్లువలో కొట్టుకుపోతుంది. అంతేనా? ముఖ్యమంత్రి చట్టబద్ధంగా, నీతినిజాయితీలతో, జవాబుదారీ పాలన అందించాలన్న భావనకూ అదే గతి పడుతుంది. ‘అమ్మ’ తమను చల్లగా చూసినంతవరకూ ఆమె వ్యక్తిగత నీతినిజాయితీలు ఎలా ఉన్నా జనానికి అనవసరం.

నేనిక్కడ కేవలం జయలలితనే వేలెత్తి చూపించడం లేదు. ఆమె స్థానంలో ఆమెలా జనాభిమానాన్ని పొందిన ఎవరున్నా ఇదే జరుగుతుంది. లౌకిక ప్రపంచానికి చెందిన పాలకునిలో వ్యక్తిగత లోపాలు ఎన్ని ఉన్నాసరే, తమ భౌతికజీవితానికి మేలు చేసే పనులు చేసినప్పుడు అతనికి/ఆమెకు పారలౌకిక ప్రపంచానికి చెందిన దేవుడు/దేవతతో అభేదం కల్పించి విగ్రహంగా మార్చడం తరతమ భేదాలతో దేశమంతటా ఉంది. కాకపోతే, తమిళనాడు జనాలలో మాత్రం ఇది మరింత పతాకస్థాయిలో వ్యక్తమవుతుంటుంది. తాము అభిమానించి ఆరాధించేవారికి ఆలయాలు నిర్మించడం కూడా అక్కడే ఎక్కువ. మన రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ధోరణులు కనిపించినా తమిళనాడే దీనికి తగిన నమూనా అనిపిస్తుంది.

ఈ మనస్తత్వ మూలాలు ఎక్కడున్నాయని వెతుకుతూ వెనక్కి వెడితే, బహుశా మనం పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన నగరరాజ్యాల దశకు చేరుకుంటాం. ఆనాటి జనం నగర దేవతకు గుడి కట్టుకుని ఆమె చుట్టూ తమ లౌకిక, పారలౌకిక జీవితాన్ని గాఢంగా అల్లుకునేవారు. ఆ దేవత కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. పరిపాలన అంతా దేవత పేరు మీదే జరిగేది. వ్యవసాయభూములకు దేవతే యజమాని. భూముల పంపకానికి దేవాలయమే కేంద్రంగా ఉండేది. అన్నవితరణా అక్కడే జరిగేది. తమకు జీవనోపాధిని కల్పించేది, అన్నం పెట్టేది దేవతే కనుక అందులో లౌకికం, పారలౌకికం అన్న తేడాకు అవకాశమే లేదు.

ఆ ఛాయలే కాలం కల్పించిన వేల సంవత్సరాల హద్దులను దాటుకుంటూ తమిళనాడులోకి ఇప్పటికీ ప్రవహిస్తున్నాయా అనిపిస్తుంది. ఇక్కడ జయలలిత రూపంలో పాలక స్థానంలో ఉన్నది మనిషి కావచ్చు; కానీ ఆమె దేవతలానే తమకు పని కల్పించి, అన్నం పెట్టినప్పుడు దేవతే అవుతుంది. ఇదంతా కేవలం ఊహాప్రాయంగా తీసుకొచ్చిన పోలిక కాదు. ఈజిప్టు, మెసపొటేమియా, ఏజియన్, సింధు నాగరికతల నాటి నగర రాజ్యాల ఉమ్మడి వారసత్వం ప్రత్యేకించి దక్షిణభారతంలో, అందులోనూ తమిళనాడులో నేటికీ గజ్జె కడుతోందనడానికి అనేక చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. దానిని అలా ఉంచి, గత కొన్ని వ్యాసాలుగా చర్చించుకుంటున్న విషయానికి పరిమితమై చెప్పుకుంటే; రాజ్యం విస్తరిస్తూ కేంద్రీకృత అధికారం అనే అంకుశం జనజీవితంపై బిగుసుకుంటున్నకొద్దీ , ఆర్థిక అసమానతలు, బానిసత్వం, పీడన పెరిగిన కొద్దీ జనం తమను ఈతిబాధలనుంచి గట్టెక్కించే ఇష్టదేవతల కొలుపులూ పెరుగుతూవచ్చాయి. దాంతోపాటే, నగరరాజ్యాల కాలంవరకూ కొనసాగిన సమష్టి ఆరాధనా పద్ధతుల స్థానంలో వ్యష్టి(వ్యక్తిగత) ఆరాధనా పద్ధతులూ అడుగుపెట్టాయి. రోమన్ల కాలంలో ఆ పరివర్తన ఎలా ఎందుకు జరిగిందో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ఇంకొకటి గమనించాలి. లౌకికమైన ముఖ్యమంత్రి లాంటి పదవికి, పారలౌకికమైన దేవత హోదాకు మధ్య హద్దులు చెరిగిపోవడం; దాంతోపాటే లౌకికమైన అవినీతి తదితర బలహీనతలు కూడా పారలౌకికమైన గంగలో కలసి పోవడం కేవలం చదువుసంధ్యలు లేని అట్టడుగువర్గాల ఊహలోనే సంభవిస్తాయని అనుకోవద్దు. ధనవంతులు, విద్యావంతులలోనూ ఇదే ధోరణి ఉంటుంది. కాకపోతే అట్టడుగువర్గాలలో ఇది నాటుగానూ, మోటుగానూ వ్యక్తమైతే; మిగతావారిలో నాజూకుగానూ, మెరుగుపెట్టిన భాషలోనూ వ్యక్తమవుతుంది.

నా కీ సందర్భంలో ఒక వ్యక్తిగతమైన విషయం గుర్తుకొస్తోంది.

***

నాకప్పటికి ఇరవయ్యేళ్లు దాటాయేమో! మా ఊళ్ళో ఉన్నప్పటి సంగతి. ఓ రోజు నేను నిద్ర లేచేసరికి, మా ఇంటి దక్షిణం వైపు దొడ్లో మా నాన్నగారు, మా పినతండ్రిగారు దంతధావనం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు కిటికీలోంచి నా చెవిన పడ్డాయి. వారిద్దరూ కంచి పరమాచార్యకు చాలాకాలంగా చాలా దగ్గరి అనుయాయులు. మా పినతండ్రిగారు వృత్తిరీత్యా పౌరాణికులు. ఆయన సహజమైన తన కథనచాతుర్యంలో భక్తి తన్మయత్వాన్ని రంగరించి ఒక ముచ్చట చెబుతున్నారు. నాన్నగారు ఊకొడుతూ వింటున్నారు. నేను కూడా ఆసక్తిగా వింటూ ఉండిపోయాను.

“అన్నయ్యా, ఏం జరిగిందో విన్నావూ? చెన్నపట్నం(మా పినతండ్రిగారు మద్రాసును ఎప్పుడూ చెన్నపట్నం అనే అనేవారు)లో ఆ చెట్టియార్ లేడూ! నువ్వూ వినే ఉంటావు. కోటీశ్వరుడు. తస్సదియ్య, గుర్రప్పందాల మీద సంపాదించాడు. చాలా వ్యాపారాలు పెట్టాడు. దొంగనోట్లు అచ్చేస్తాడని కూడా చెప్పుకుంటారు. అయితేనేం, శ్రీవారికి(కంచి పరమాచార్యకి) పరమభక్తుడు. ఏమైందో, గుర్రప్పందాలు కలసి రావడం మానేశాయి. వ్యాపారాల్లో నష్టం వచ్చింది. దాంతో లబోదిబో మంటూ శ్రీవారి దగ్గరకు పరుగెత్తాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. శ్రీవారు అంతా విన్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత “మీ ఇంట్లో ఎక్కడైనా పత్తిచెట్టు ఉందా?” అని అడిగారు. అతను ఆశ్చర్యపోతూ, “ఉంది” అన్నాడు. “వెంటనే దాన్ని తీయించు. నీకు కలసివస్తుంది” అని శ్రీవారు అన్నారు. వాడు అలాగే చేశాడు. దాంతో వాడికి మళ్ళీ దశ ఎత్తుకుంది.”

ఈ ముచ్చట చెబుతున్నప్పుడు ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నది చెట్టియారూ, అతని గుర్రప్పందాలూ, దొంగనోట్లూ, వ్యాపారాలూ కావు. అతనికి సలహా ఇచ్చి గట్టెక్కించిన కంచి పరమాచార్యులవారి మహిమా, వారి మీద తన భక్తిప్రపత్తులూ…

నాది ఉడుకు రక్తం. దానికితోడు ఆధునికమైన వాసనలు. ఇది వినగానే చాలా కోపం వచ్చింది. గుర్రప్పందాలు ఆడేవాడి మీదా, అందులోనూ దొంగనోట్ల ఆరోపణ ఉన్నవాడి మీదా కంచివారు అనుగ్రహం ఎలా చూపిస్తారనుకున్నాను. మా పినతండ్రి గారి స్పందన, నా స్పందన గీత గీసినట్టు ఎలా వేరైపోయాయో చూడండి! పారలౌకికానికి చెందిన కంచివారి మహిమావిశేషాన్ని ఒత్తి చెప్పడం మీదే ఆయన ఆసక్తి. చెట్టియారు అంత డబ్బు ఎలా సంపాదించడన్న లౌకిక విషయం మీద ఆయనకు పెద్ద ఆసక్తీ లేదు, పట్టింపూ లేదు. కానీ నా తక్షణ స్పందన చెట్టియారు మీదా, అతను సంపాదించిన పద్ధతి మీదే, అంటే లౌకికం మీదే!

చెప్పొచ్చేదేమిటంటే, భారతదేశం ఇప్పటికీ మా పినతండ్రిగారి దగ్గరే భద్రంగా ఉంది, నా దాకా(నా లాంటి చాలామంది దాకా) రాలేదు.

ఆ తర్వాత చాలాకాలానికి ఆవేశం తగ్గి ఆలోచించిన కొద్దీ ఆయన స్పందనలో కూడా ఒక సహేతుకత, ఒక తర్కమూ లేకపోలేదనిపించింది. అంటే, ఇప్పుడు నేను ఉభయస్పందనలకు మధ్య ఒక తటస్థ పాత్ర తీసుకుంటున్నాను. ఎలాగంటే, చెట్టియారులో కూడా లౌకికం, పారలౌకికం అనే రెండు కోణాలు ఉన్నాయి. లౌకిక కోణంలో అతడు చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ఉండవచ్చు. దానిపై నిఘా ఉంచి దోషి అని తేలితే అతనిని శిక్షించవలసింది లౌకిక యంత్రాంగం, అంటే ప్రభుత్వం. పారలౌకిక కోణానికి వస్తే, అతడు కంచి పరమాచార్యులవారికి భక్తుడు. ఆయనను నమ్ముకున్నవాడు. కనుక అందుకు ప్రతిగా కంచివారు అతన్ని కష్టాల నుంచి గట్టెక్కించారన్నమాట! ఇలా అన్నానని, కంచివారి చర్యనో, లేదా పత్తి మొక్క ఇంట్లో ఉండకూడదన్న నమ్మకాన్నో నేను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నానని అనుకోవద్దు. ఇందులో నా వ్యక్తిగతానికి తావులేదు.

ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యే ఉదాహరణతో కూడా దీనిని చెప్పుకోవచ్చు. ఒకతను అవినీతిమార్గంలో సంపాదించి స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని గుట్టలకొద్దీ దాచుకున్నాడనుకుందాం. అతను ఏ విదేశాలకో వెళ్లదలచుకుని విమానంలో టిక్కెట్టు బుక్ చేసుకుంటాడు. నువ్వు అక్రమంగా డబ్బు సంపాదించావు కనుక నీకు టిక్కెట్టు ఇచ్చేదిలేదని ఎయిర్ లైన్స్ వాళ్ళు అనరు. అది వాళ్ళ పని కాదు. అనకపోగా, ప్రయాణంలో అతని డబ్బుకు సరితూగే వసతులన్నీ కల్పించి అతన్ని ఎంతో మర్యాదగా చూస్తారు. అతని డబ్బు ఎలాంటిదన్నది పట్టించుకోవలసింది ప్రభుత్వమూ, అందులోని ఆదాయం పన్ను శాఖ మాత్రమే.

కానీ ఆ లౌకిక వ్యవస్థ ఉండవలసినంత బలంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆ వ్యవస్థను నడిపేవారు కూడా ఆ తానులో ముక్కలే కనుక. లౌకిక వ్యవస్థ చొరడానికి సాహసించని పారలౌకికపు హద్దులు ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. మన అనుభవంలో లౌకికం, పారలౌకికం కలసిపోవడమే కాదు; లౌకికాన్ని, పారలౌకికం పూర్తిగా లోబరచుకుంటుంది. లౌకికంగా మనం తప్పు పనులు ఎన్నైనా చేయవచ్చుగాక, పారలౌకికం వాటిని ప్రక్షాళన చేసేస్తుంది. కనుక మన అంతిమ హద్దు లౌకికం కాదు, పారలౌకికం మాత్రమే. ఇదేదో నేను విమర్శదృష్టితో అంటున్న మాటగా దయచేసి పొరబడవద్దు. కేవలం చారిత్రక తటస్థ దృష్టితో అంటున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ పారలౌకిక ప్రాబల్యం మనకు క్రీస్తుశకానికి పూర్వంనుంచీ ఇప్పటికీ పదిలంగా వస్తున్న చారిత్రక వారసత్వం.

ఇంకోవైపు నుంచి చూడండి…ఇది వర్తమానంతో నేరుగా ముడిపడి ఉన్న చాలా గంభీరమైన విషయమే తప్ప, ఆషామాషీ విషయం కాదని మీకే అర్థమవుతుంది. ఎలాగంటే, ఇప్పుడు మన దేశం అవినీతితో మహాయుద్ధం చేస్తోంది, లేదా చేస్తున్నాననుకుంటోంది. పాలకులు మారితేనో, లోక్ పాల్ లాంటి (లౌకిక) వ్యవస్థలలోనో దీనికి పరిష్కారం ఉంటుందనుకుంటోంది. కానీ నా ఉద్దేశంలో దీనికి పరిష్కారం పారలౌకిక ప్రపంచాన్ని శాసించే లోకపాలకుడైన ఆ భగవంతుడి చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ లేదు.

క్షమించాలి…ఈ విషయంలో నేనంత ఆశావాదిని కాదు.

***

ఎంతమంది గమనించారో కానీ, లౌకిక, పారలౌకికతల పద్మవ్యూహంలో పడి గిజగిజలాడిన చరిత్ర పాశ్చాత్యసమాజాలకూ ఉంది. అంతేకాదు, అది ప్రాచ్య(తూర్పు)మతాల పుణ్యమంటూ వారు ఆడిపోసుకోవడమూ ఉంది. ప్రాచ్య మతాలు అన్నప్పుడు మనవే కాక, ఈజిప్టు, మెసపొటేమియా తదితర ప్రాంతాల మతాలు కూడా వస్తాయి. తేడా అల్లా ఆ పద్మవ్యూహంలోంచి బయటపడడానికి పాశ్చాత్యసమాజాలు ప్రయత్నించాయి. ‘పారలౌకికం’ అనే సరిహద్దు రాయిని అతి కష్టం మీద పెకలించి, వెనక్కి జరిపి, ఆ చోట్లో ‘లౌకికం’ అనే సరిహద్దు రాయిని ప్రతిష్టించుకున్నాయి. రెండింటి మధ్య సమతూకం తేవడానికే కాక, లౌకికం వైపు ఒకింత ఎక్కువ మొగ్గు చూపించాయేమో కూడా. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, పారలౌకికత కన్నా ముందు మనం జీవించే ఈ లౌకిక జగత్తును మరింత వాసయోగ్యం చేద్దామన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రాచ్య, పాశ్చాత్యుల మధ్య ఉన్న దృష్టిభేదాన్ని ఎత్తి చూపిన పాశ్చాత్య రచయితలు కొందరు గుర్తొస్తున్నారు కాని, సర్ జేమ్స్ ఫ్రేజర్ ను ఒక్కరిని ఉదహరించుకుందాం. పనిలో పనిగా ఆయన ప్రాచ్య మతాల ప్రభావం యూరప్ ను పాడుచేసిందని ఒక రాయి కూడా విసిరాడు. తన Golden Bough అనే బృహద్రచనలో ఇలా అంటాడు:

Greek and Roman society was build on the conception of the subordination of the individual to the community, of the citizens to the state; it set to the safety of the commonwealth, as the supreme aim of conduct, above the safety of the individual whether in this world or in a world to come. Trained from infancy in this unselfish ideal, the citizens devoted their lives to the public service and were ready to lay them down for the common good…

All this was changed by the spread of Oriental religions which inculcated the communion of the soul with God and its eternal salvation as the only objects worth living for, objects in comparison with which the prosperity and even the existence of the state sank into insignificance. The inevitable result of this selfish and immoral doctrine was to withdraw the devotee more and more from the public service, to concentrate his thoughts on his own spiritual emotions, and to breed in him a contempt for the present life which he regarded merely as a probation for a better and an eternal…

A general disintegration of the body politic set in. The ties of the state and the family were loosened; the structure of society tended to resolve itself into its individual elements and thereby to relapse into barbarism; for civilization is only possible through the active co-operation of the citizens and their willingness to subordinate their private interests to the common good.

పాశ్చాత్య ప్రభావాలే మన లాంటి ప్రాచ్యదేశాలను పాడు చేశాయని మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రాచ్య మతాలే పాశ్చాత్యులను పాడు చేశాయని ఫ్రేజర్ అనడం విచిత్రంగా ఉంటుంది. పైగా పారలౌకికాన్ని లౌకికం భ్రష్టు పట్టించిందని మనం అనుకుంటుంటే, పారలౌకికమే లౌకికాన్ని భ్రష్టు పట్టించిందని ఫ్రేజర్ అంటున్నాడు. ప్రాచ్య మతాలు వెయ్యేళ్ళపాటు యూరప్ సమాజాన్ని నాశనం చేస్తే, చివరికి రోమన్ చట్టాన్ని, అరిస్టాటిల్ తాత్వికతను పునరుద్ధరించడం ద్వారా మధ్యయుగాలనాటికి యూరప్ తిరిగి తనవైన పురాతన కళా సాహిత్యాలు, జీవితాదర్శాలు, ప్రవర్తనాసరళి, ఆరోగ్యవంతమైన, పురుషప్రయత్నంతో కూడిన ప్రాపంచిక దృక్పథంవైపు మళ్లిందని ఆయన అంటాడు. ఆ సందర్భంలో ప్రాచ్య మతాల తీరు గురించి పై వ్యాఖ్యలు చేశాడు. వాటి సారాంశాన్ని ఇలా చెప్పుకోవచ్చు:

వ్యక్తి ప్రయోజనాలకన్నా సమష్టి ప్రయోజనాలు, పౌర ప్రయోజనాలకన్నా రాజ్యం ప్రయోజనాలు ప్రాధాన్యం వహించే విధంగా గ్రీకు, రోమన్ సమాజాల నిర్మాణం జరిగింది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వాటి ఉన్నతోన్నత లక్ష్యం సమష్టి సంపదా, శ్రేయస్సులే తప్ప వ్యక్తిగత సంక్షేమం కాదు. చిన్నతనం నుంచీ నిస్వార్థతను నూరిపోయడం వల్ల పౌరులు ప్రజాశ్రేయస్సుకు తమ జీవితాన్ని అంకితం చేసేవారు. ఉమ్మడి హితం కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రాచ్య మతాల వ్యాప్తితో ఇదంతా మారిపోయింది. పరమాత్మలో ఆత్మను లీనం చేయడం, ముక్తిని పొందడం తప్ప ఈ లోకంలో సాధించవలసిన లక్ష్యాలు ఏవీ లేవని అవి నొక్కి చెబుతాయి. దాంతో ఈ లోకంలో అభ్యుదయాన్ని సాధించాలన్న తపనే కాక రాజ్యం ఉనికి కూడా అప్రధానంగా మారిపోయింది. ఈ స్వార్థపూరిత, అనైతిక సిద్ధాంతం భక్తులను సమష్టి హితం నుంచి తప్పించివేసింది. లౌకిక జీవితంపై విముఖతను నూరిపోసింది. లౌకిక జీవితం కేవలం పరలోక జీవితానికి అవసరమైన శిక్షణ పొందడానికి మాత్రమే నన్న భావనను కలిగించింది. దాంతో రాజకీయవ్యవస్థ విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. రాజ్యానికీ, కుటుంబానికి మధ్య సంబంధాలు సడలిపోయాయి. సామాజిక నిర్మాణం వ్యక్తుల స్థాయికి కుదించుకుపోయింది. అది ఆటవిక ధోరణులకు దారితీయించింది. ఎందుకంటే, నాగరికత అనేది పౌరుల క్రియాశీల సహకారంతోనూ, తమ వ్యక్తిగతప్రయోజనాలకు బదులు ఉమ్మడి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడంతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఫ్రేజర్ చేసిన ఈ వ్యాఖ్యలు మనలో చాలామందికి కోపం తెప్పించే మాట నిజమే. వీటిలో యూరోపియన్ అహంకారమూ తొంగి చూస్తూ ఉండచ్చు. ఆయన ఇంత గొప్పగా చెప్పుకున్న యూరోపియన్ సమాజం కడిగిన ముత్యమని భావించే అమాయకులు ఎవరూ లేరు. కాకపోతే, మిగతా సంగతులు పక్కన పెట్టి, లౌకికం-పారలౌకికం అనే ఒక్క అంశానికి పరిమితమైనప్పుడు ఆయన మాటలు మనం మొహం చూసుకోడానికి అద్దంలా ఏమైనా ఉపయోగపడతాయా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవచ్చు.

మిగతా విశేషాలు తర్వాత…

 

 

 

 

 

Download PDF

9 Comments

 • ప్రేజర్ అన్నదాంట్లో నాకేమీ తప్పు కనిపించట్లేదు.

  ఎప్పట్లానే మీరు ఎంతో క్లిష్టమయిన వాటిని చాలా సరళంగా చెబుతున్నారు.

 • అనామకుడు says:

  నమస్సులు భాస్కరం గారు,

  అస్పష్టంగా కొట్టుకుంటున్న కొన్ని ఆలోచనలకు ఒక రూపం వచ్చింది – మీ వాక్యాలు చదివాక.

  ధన్యోస్మి!

 • kalluri bhaskaram says:

  ధన్యవాదాలండీ…

 • mohan says:

  Bhaskaram garoo

  Mana problems ki source emito chala baga chupimcharu. Loukika vyavastha ni paripusthimchadaniki eeroju oka “Swachha bharat” vudyamanni buddhijeevulu tevali.

  Mohanam

  • kalluri bhaskaram says:

   ధన్యవాదాలు మోహన్ గారూ…

   మీరు స్వచ్చభారత్, బుద్ధిజీవుల ప్రస్తావన చేశారు కనుక వ్యాసంలో చెప్పలేకపోయిన విషయాలను ఇక్కడ చెప్పాలనిపించింది. స్వచ్చ భారత్ లో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది, వ్యక్తిగత స్వచ్ఛత. రెండవది సామూహిక స్వచ్ఛత. మనదేశంలో వ్యక్తిగత స్వచ్ఛతను మెజారిటీ జనానికి బోధించాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది తమ ఇంటిని ఒంటిని స్వచ్ఛంగానే ఉంచుకుంటారు. లేనిదల్లా సామూహిక స్వచ్ఛత.

   1. చాలా ఏళ్ల క్రితం మా ఇంటిముందు, మిగతా చోట్ల అద్దంలా కాంక్రీట్ రోడ్డు వేశారు. ఆరే దాకా రోడ్డు మీద అడుగుపెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కానీ చాలాచోట్ల అడుగుల ముద్రలు, ద్విచక్రవాహనాలు నడిపిన గుర్తులు, గోతులు. అవి ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. అదే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అలా చేయం. రోడ్డు కూడా మనదే నన్న స్పృహ ఉండదు. 2. మొన్న వేసవి కాలంలో రోడ్డు మీద నడుస్తున్నాను. అంతలో పైనుంచి కుండపోతగా నీళ్ళు పడుతుంటే పైకి చూశాను. ఒకాయన పై అంతస్తు నుంచి రోడ్డు మీద ఉన్న తన కారు మీద బక్కెట్ తో నీళ్ళు పోస్తున్నాడు. కారు కడుక్కునే అందం అన్నమాట. రోడ్డు మీద ఆ నీళ్ళు మడుగులు కట్టి ఇతరులకు ఇబ్బంది అవుతుందన్న జ్ఞానం ఆ మనిషికి లేదు. 3. ఇప్పుడు నగరాల్లో చాలా రోడ్లు కార్ పార్కింగ్ లు అయిపోయి రోడ్లు ఇరుకైపోతున్నాయి. పట్టించుకునే వారు లేరు. 4. మన ఇంట్లో ఉన్న చెత్తను అంతటినీ పక్కింట్లోనో, రోడ్డు మీదో వేస్తాం.

   మీరు బుద్ధిజీవులు అన్నారు. బుద్ధిజీవులను ఏ కొలమానంతో నిర్ణయిస్తారో నాకు పెద్ద సందేహం. డబ్బు, చదువు ఉన్నవారు కూడా ఇందిరమ్మ ఇల్లు సంపాదించుకున్నారు. అందువల్ల ఇల్లు లేనివారికి తాము అన్యాయం చేస్తున్నామన్న జ్ఞానం లేదు. అలాగే వృద్ధాప్య పింఛన్లు తమ ఇంట్లో వాళ్ళకు ఇప్పించుకున్నారు. కోటీశ్వరులు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు సంపాదించుకున్నారు. కరుణానిధి ప్రభుత్వం ఉచిత టీవీలు ఇచ్చినప్పుడు మీరన్న సోకాల్డ్ బుద్ధిజీవులు కూడా క్యూలో నిలబడ్డారు.

   కనుక స్వచ్చభారత్ కే కాక, అవినీతి లాంటి అనేక సమస్యలకు అసలు కీ ఫ్రేజర్ మాటల్లోనే ఉందా?!

 • Saikiran K says:

  “Six Glorious Epochs of Indian History” అనే పుస్తకంలో వి.డి.సావర్కర్ గారు అశోకుని కాలంలో బౌద్ధమతం గురించి దాదాపు ఇలాంటి విశ్లేషణే (ఫ్రేజర్ చెసినట్లు) చేసారు.

  You always have a different and interesting take on the issues Sir. Thank you for this article.

  W/Regards – Saikiran

  • kalluribhaskaram says:

   థాంక్స్ సాయికిరణ్… ఆసక్తికరమైన పుస్తకం గురించి చెప్పినందుకు కూడా. బహుశా ఆయన ప్రధానంగా అహింస కోణంలో విశ్లేషించి ఉంటారు. అశోకుడి దగ్గరకు వెళ్ళినప్పుడు చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి.

 • mohan says:

  Bhaskaram garoo
  Detailed response ichhinamduku chalaa thanks.

  మీరన్న వాటితో ఏకీభవిస్తాను.
  నా ఉద్దేశ్యం లో బుద్ధిజీవులంటే మీరు పైన చెప్పిన పనులు చేసే వాళ్ళు కాదు.
  అలాంటివే చెయ్యకుండా,సైలెంట్ గ, స్వచ్చంగా వున్నా వ్యక్తులు చాలామందే వుంటారు మన దేశంలో. వాళ్ళను వెతికి పట్టుకొనే మార్గాలు ఆలోచించాలి. కుర్రవాళ్ళను కూడా,మంచి లీడర్షిప్ వుంటే,ఎదుచతె చేయవచ్చు.
  ఇది నా డ్రీం!!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)