ఓ దిగులు గువ్వ

 1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్న గుర్తు
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోవడమూ గుర్తు.

3

చుక్కలు నవ్వితే మెచ్చనిదెవరు కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి గుర్తొచ్చేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..

               -మానస చామర్తి
Download PDF

7 Comments

 • Jayashree Naidu says:

  లవ్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మానస…

 • bhaskar k says:

  జ్వలిస్తున్న ఓదార్పుల్లో కలగనాలి
  చిగురులెత్తే కొత్త ఆకుల ఆశల వెలుగులను,.

 • mani vadlamani says:

  హాయ్,మానస
  కవిత చాల హృద్యంగా రాసావు
  కానీ చాల తమషాగా అనిపించింది ఈ మాటు తరంగ.
  two contradictory statements ,ఒక కవిత సంతోషం గురుంచి,ఒక కవిత దిగులు గురుంచి.

 • Rekha Jyothi says:

  మానస గారూ చాలా బావుంది . మొదటి రెండు stanzas మరీ ఎక్కువగా కట్టేశాయి .

 • Prasuna says:

  లోపలి దిగులుని చాలా చక్కగా చెప్పారు మానసా. మణి గారు చెప్పినట్టు ఈ సారి తరంగ చాలా ప్రత్యేకంగా ఉంది.

 • చాలా నచ్చిందీ కవిత, మానసా!!

  “ఈ దిగులంతా ఓదార్పని….” — కవిత మొత్తం చదివాక ఇక్కడికొచ్చేసరికి, ఒకలాంటి సుకూన్ అంటారే, అలా ప్రశాంతంగా అనిపించింది!

  పైన రేఖ గారు చెప్పినట్టు మొదటి రెండు స్టాంజాలు అవుట్‌స్టాండింగ్!!

 • మైథిలి అబ్బరాజు says:

  ” ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
  ఈ దిగులంతా ఓదార్పని ” – ఇది ఎంతో ప్రత్యేకమైన గమనింపు !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)