కాసింత సంతోషం!

 

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు

అవును, కచ్చితంగా అప్పుడే

కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.

ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో

వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

 

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

 

1

బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు

వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్

శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని

రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

 

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,

ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,

వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

 

2

పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ

కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు

వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి

నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

 

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,

అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి

నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,

ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

 

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ

నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో

వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో

అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

 

కాసింత సంతోషంగా వున్నప్పుడు

కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై

వూయల వూగామే అనుకో,

అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

 

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,

అలలోపలి సంతోషపు కడలిలో

కొంచెమే అయినా సరే,

తేలిపో.

యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో

కళ్ళలోని వెల్తురు నీడల్లో

కొంచెమే అయినా సరే,

వెలిగి రా!

4

జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు

కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

అఫ్సర్

Download PDF

20 Comments

  • S. Narayanaswamy says:

    ఇవన్నీ ఎం చెయ్యలేదుగానీ హ్యూస్టనులో మిమ్మల్ని కలుసుకున్నా. కాసేపు ముచ్చట్లాడుకున్నా .. అదీ కాసింత చిన్న సంతోషమే :)

  • bhaskar k says:

    :), చిన్న సంకేతమై వెలగాల్సిన సమయాలు, ఇలా వాక్యాలై ఎదురుగా నిలబడ్డట్లు.

  • సంతోషపు అలలో, లోపలి సంతోషపు కడలిలో
    దీపంకళ్లలో కళ్లవెల్తురునీడలో…కొంచెమైనా సరే–సున్నుతమైన మనోభావాల అణ్వేషణ.

  • మణి వడ్లమాని says:

    అఫ్సర్ తో ఒక సాయత్రం అని కవిసంగమం లో మిమల్ని కలిసినప్పుడు నాకు కాసింత సంతోషమే కలిగింది.

    ఇప్పుడు ఈ కవిత చదివి

    మనసు గాలిపటంలా విహరించి, ,సంద్రపు అలలై పొంగి,కన్నుల వెలిగే దీపపు కాంతి లా మెరిసి
    కాసింత సంతోషం తో పొంగి పోతోంది.

  • అవును…. చాలవా చిన్ని చిన్ని ఆనందపు జ్ఞాపకాలు….. జీవన నావలో సంతోషపు పయనానికి!!?

  • Jayashree Naidu says:

    జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు

    కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

    —- పూగుత్తిని పలకరించినట్టున్న కవిత అఫ్సర్ జి

  • Jayashree Naidu says:

    జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు

    కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

    — పూగుత్తిని పలకరించినట్టున్న కవిత…

  • Prasuna says:

    ఏం చెప్పను ఈ కవిత చదివాక కలిగిన ఉద్వేగం గురించి! ఒక విస్ఫోటం జరిగి పేలిపోయిన క్షణాలన్నీ, మళ్ళీ మళ్ళీ ఈ కవిత చదువుకుంటూంటే, ఒక్కొక్కటిగా దగ్గరవుతున్న అనుభూతి కలుగుతోంది. అతిశయం కాదు.

  • నిశీధి says:

    మీ వాక్యాలు చదువుకున్నపుడల్లా ఎదో దిగులు మేఘం ఆవరించి మళ్ళీ జాలి పడి వదిలి వెళ్ళినట్లు పెయిన్ అండ్ రిలీఫ్ రెండు ఒకే కవితలో వచ్చే ఫిల్ . kudos జీ .

  • తిలక్ బొమ్మరాజు says:

    యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,

    అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి

    నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,

    ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

    ఇటువంటి వాక్యాలు చదివినప్పుడు మనసులో తడియారని జ్ఞాపకాలు మనల్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి.అఫ్సర్ గారు నేను ప్రత్యేకంగా చదివే పోయెట్రీ మీది.ఎప్పటికీ మనసును తడిమే కవిత్వం అఫ్సర్ పోయెట్రీ.

  • Kuppili Padma says:

    మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు – అంటూనే యెంత నిండైన సంతోషపుదిగుల్ని యిచ్చిందో యీ కవిత.Thank You Afsar.

  • మైథిలి అబ్బరాజు says:

    ” జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు ”- ఇది కదా కవి ఇవ్వవలసిన భరోసా…! వెలుగులోకి చూడనివ్వటం కవి చేయవలసిన పని అని ఎంతమంది మరచిపోయినా మీరు గుర్తుంచుకుంటారు , ధన్యవాదాలు .

  • మీకు అర్ధమౌతుందో లేదో, మీ కవిత ఏదైనా సరే, చదివాక స్పందించాలంటే పదాలు కూడగట్టుకోవడం ఎంత కష్టమో!!

    నిజమే! అలాంటి సంతోషపు పూర్వపు క్షణాలన్నిటినీ భద్రంగా సందూక పెట్టెలో దాచుకోవాల్సిందే! దిగులు గుబులు సమయాల్లో అవి ఇచ్చే భరోసా అంతా ఇంతా కాదు!!

  • స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకాసింత సంతోషం వేసింది!

  • ఇందులో కాసింత కాదు బోలెడంత సంతోషం ప్రోది చేసుకోవచ్చు. ఎన్నాళ్ళైనా మీ వాక్యం అలా ఫ్రెష్ గా పరిమఌస్తూనే వుంటుంది.

  • సాయి కిరణ్ says:

    ఎంత బాగా చెప్పారు సర్ , జీవితం ఎప్పుడూ ఉత్సవంలా ఉన్నా బాగోదు . ఎప్పుడైనా కలిగే సంతోషాలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి అప్పటికప్పుడైనా ఆ తర్వాత ఎప్పుడో అయినా .

  • N Venugopal says:

    ప్రియాతిప్రియమైన అఫ్సర్

    ముప్పై ఏళ్లుగా చూస్తున్న అఫ్సర్ లాగే. ఒక దిగులు మేఘానికి ఒక దరహాసపు వెండి అంచు. ఒక మహా పరిమళపు గులాబీ అంచున కసుక్కున మునివేలు పొడిచే ముల్లు జ్ఞాపకం….అన్నీ నువ్వే….

  • N.RAJANI says:

    ఒక చిన్న సంతోషం అదే కదా మనసుకి మనిషికి కావాల్సింది.ఒక జ్ఞాపకం కలిగించే ఆనందం మాటల్లో చెప్పలేం.అఫ్సర్ గారూ మీ కవిత చాలా బాగుంది.

  • gsrammohan says:

    బాగుంది. ప్రత్యేకంగా ‘కవిత్వపు భాష’ను ‘కవిత్వపు అనుభూతు’లను ఆశ్రయించకుండా మామూలు పదాలతో రాయడం బాగుంది. ఐడియా అన్నింటికంటే బాగుంది.

  • ప్రతి పదమూ సంతోష పరిమళాన్ని వెదజల్లిన అద్భుతమైన కవిత. అభినందనలు అఫ్సర్ గారూ.

Leave a Reply to N Venugopal Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)