క్షమ

క్షమ

Smilebox_3704884

‘‘మనతో ఒచ్చేయి మన ఆలోచనలు, ముందు తరాలకి మిగిలేయి మనం చేసే పనులు.  ఆలోచనలకి ఉపయోగపడే పనులు తోడయితే అదే మంచి’’.
ఇదేం కొటేషన్‌రా బాబు మనిషి, మనిషికీ మంచికినే దానికి అర్థం వేరు కదా అనుకుంటా లోపలికి తొంగి చూశా.
‘‘లోవ్‌’’
‘‘ఏం చేస్తన్నావు క్షమా’’
‘‘గోడలు అలుకుతున్నా, కూచ్చో’’
లుంగీ, కొద్దిగా ఒదులుగా ఉండ చొక్కా, జుట్టంతా పైకి మడిచి, ఛామన ఛాయ చేతులకి ఎఱ్ఱెఱ్ఱని మట్టి పూసుకుని ఏటి మట్టిపయిన కొండ మట్టి అలుకులాగా ఉంది.
‘‘ఏంటి ప్రయోగమా, మళ్ళీ కొత్తయ్యా’’
ప్రకృతిలో దొరికే సహజ పదార్ధాలతో ఇళ్ళు కట్టటం గురించి, ఆస్ట్రేలియాలో ప్రదర్శన దానికి ఈ ప్రయోగాలు.
‘‘ఎప్పుడు ఎలతావు, ఉత్తమ్‌ (కొడుకు) ఎట్టా ఉన్నాడు’’.
‘‘ఎక్కడో ఆడతా ఉంటాడు, నిమ్మ ఛాయ్‌, అంది’’
‘‘కాదు, నువ్వు చేసే పుదీనా ఛాయ్‌, సరేగానీ ఎప్పుడూ ఖాళీగా ఉండవా’’.
‘‘అరవైల తరవాత, చేద్దాం అన్నా పనీ ఉండదు, చెయ్యటానికి ఉత్సాహం కూడా తగ్గుద్ది’’.
‘‘ఉత్తమ్‌ చదువు ఎక్కడ’’
‘‘నాకు రోజూ బడికి పంపటం, పొద్దినే లెగిసి పరిగెత్తుత్తా పిల్లలు బడికి ఎల్లటం నచ్చదు.  వాడు నాతో ఎక్కువ సమయం గడపలేడు.  ఆళ్ళకన్నా చదువు నేనే బాగా చెబుతాను.  అందుకే ఇంట్లో ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్‌ నేర్పుతున్నాను.  తోట పనిచేసే ‘గిరిటం’ దగ్గిర తెలుగు, కన్నడ నేర్చుకుంటన్నాడు.  అయినా పదిహేడేళ్ళకి కదా మన పిల్లలు ఏం చదవాలి అనేది నిర్ణయించుకునేది.  ఇప్పుడు వాడి వయసు పన్నెండే కదా’’.  ఏంటీ అప్పుడే పన్నెండేళ్ళ వాడయ్యాడా నిన్నో మొన్నో నువ్వు హంపి వచ్చినట్టుగా ఉంది.
‘‘అవును నాకు కూడా’’.
అప్పుడే ఇద్దరు విదేశీయులతో ఉండ పది మంది భారతీయ విద్యార్థుల బృందం బొంబాయి నించీ ఒచ్చింది.  నాఎంక తిరిగి నువ్వు ఛాయ్‌ తాగు.  ఆగదిలో కాసేపు పడుకో, పెయింటింగ్స్‌ ఉన్నయ్యి చూడు, అక్కడే రంగులు కూడా ఉండయ్యి, బోర్‌ కొడితే ఏదన్నా గియ్యి అని ఎల్లింది.

***

గట్టమీదున్న రాతికొండమీద రెల్లు గడ్డితో ఏసిన గుడిసె, చుట్టూ చిన్నచిన్నగా పెరుగుతున్న మహాగని చెట్లు, ఆటి మజ్జలో నేలంతా కప్పేసిన కొండపిండి పొట్టు తీగ మొక్కలు, అక్కడక్కడా సబ్జా మొక్కల వగరు వాసన, సూర్యుడి కూకే ఎలుగు ప్రత్యర్థిలాగా పోటీ పడతా నాతో ఆడతంది.  బ్లాక్‌కాఫీని తాగటం కన్నా, వాసన ఎక్కువ పీలుత్తా రాతిపయిన కూచ్చున్నా.  ఎనక నించీ హాయ్‌ అనే మాట ఇనిపిచ్చింది.  ఇరవై అయిదేళ్ళ మహిళ, నా దగ్గిరకి వచ్చింది, పొట్ట ఎత్తుగా ఉంది.
‘‘నేను ఇప్పుడు ఆరునెలల గర్భవతిని, నాకీ ప్రకృతి, ఊరు నచ్చింది. ఎవరో ఒకళ్ళు పుట్టేదాకా ఉండాను.  నచ్చితే జీవితం అంతా ఇక్కడే.  ఇక్కడి మనుషులయిన మీ సహాయం కావాలి’’.
ఎంతో ముచ్చటేసింది.  మళ్ళీ అనుమానం, భయం.  గుట్ట కిందకి చూత్తే ‘మహింద్రా బొలెరో’ ఉంది.  డ్రైవరు కూడా లేడనుకుంటా, స్వంతంగా నడుపుకుంటా ఒచ్చినట్టుంది.  రిజిష్ట్రేషన్‌ చూత్తే యమ్‌.హెచ్‌. అని ఉంది.
‘‘సరే స్వాగతం, మీకూ, మీపుట్ట బోయే బిడ్డకీ’’.
‘‘అలసిపోయాను భోజనం చేసి పడుకోవాలి’’.
కిందకి ఒచ్చి ఆమె సామానుకోసం చూశాను.  కారులో చేతి సంచి నిండా డబ్బులు, పెద్ద నారసంచి లో బ్రెష్‌లు, పెయింటింగ్‌ స్టాండులు, క్యాన్వాస్‌లు, బట్టలు లేవు. ఒక లుంగీ షర్టు       ఉండయ్యి.  రెండు మరాఠీ కవితల పుస్తకాలు, మరాఠీ మహిళనుకుంటా.
‘‘బట్టలు రేపు ఎల్లి కొనుక్కుంటా.  వేడినీళ్ళూ, భోజనం కావాలి అని డబ్బులు, కెమెరా చేతికిచ్చి అరగంటలో తిని పొడుకుంది’’.
‘‘ఎవరు? ఎందుకొచ్చింది, గర్భిణి?   పైగా ఒక్కటి? అర్థం కాలేదు’’ సాయంత్రం ఏడుగంటలకి పొడుకుంది, పొద్దిన ఏడుకి లెగిసింది.
‘‘తీరిందా అలసట’’
‘‘మసాలా ఛాయ్‌ ఇత్తే’’
‘‘ధుని దగ్గిర కూచ్చో, ఏడిగా ఉంటది, ఐదు నిమిషాల్లో ఛాయ్‌ తెత్తా’’
‘‘దగ్గిరలో బట్టల షాపు ఏదయినా ఉందా’’
పనోడితో ఎల్లి కొన్ని పొడుగు గౌన్లు, అరడజను కుర్తా ఫైజమాలు, కొన్ని లుంగీ చొక్కాలు తెచ్చుకుంది.
రొండు రోజులు పని లేకుండా గడపాలని ఉంది, నాతో గడపగలవా?  సరే అంటే ఆరొండు రోజులూ వంట పనిలో చెయ్యేసింది.  పాత శివాలయం శుభ్రం చేశాము, నదిలో ఈత, చేపలు పట్టి కాల్చుకు తిన్నాము.  తిరిగి, తిరిగి అలసిపోయి సాయంత్రం ఇంటికి బయలుదేరాము.  అప్పుడే నాలుగు ఉబ్బ చినుకులు ఆకాశం నించీ రాలినయ్యి.  మట్టి భలే కమ్మటి వాసన వత్తంది, నేలని మట్టిని చూత్తా ఉంది.
‘‘ఏంటి చూత్తన్నావు’’
‘‘మట్టి వాసన కడుపులోకి ఎల్లింది.  నా కడుపులో బిడ్డ కోరిక, కొద్దిగా తినాలనిపిత్తంది’’
నల్లచీమల పుట్టమీద ఎఱ్ఱమట్టి తీసి కొద్దిగా ఇచ్చాను, నోట్లో ఏసుకుని చప్పరిత్తంది.
‘‘క్షమా నికేరంగులంటే ఇష్టం’’
‘‘మట్టి, భూమి మీద ఎన్ని రకాల మట్టుంటే అన్ని రంగులు, మట్టి వర్ణాల కన్నా అద్భుతమయినయ్యి ఇంకేం ఉంటయ్యి.  ఎక్కడ మనుషులు అక్కడే మరణం తరవాత మట్టిగా మారతారు.  అందుకే మన పెద్ద వాళ్ళు మన్ను చేసిన భూమంటే మనకి ప్రేమలెక్కువ.  నానా చెత్తా మనం ఏసినా తనతో దోపుకుని, కుళ్ళించుకుని, తనలా స్వచ్చంగా మార్చుకునే భూమి రూపాలు, హోయలు అంటే ఇష్టం’’.
మట్టే కాదు దానితో ప్రయెగాలన్నా ప్రాణం.  స్థానికంగా దొరికే వస్తువులతో ఇళ్ళు కట్టుకోటం, అంటే చాలా ఇష్టం.
‘‘అయితే నాకో ఇల్లు కట్టి పెట్టు’’.
‘‘అయితే కనీసం నువ్వు నాతో రొండునెల్లన్నా గడపాలి.  నీ మనస్సు దానితత్వాన్ని బట్టీ ఇల్లు రూపం తీసుకుంటది’’.
‘‘వాస్తుని నమ్ముతావా క్షమా’’?
‘‘వాస్తు కన్నా గాలీ, ఎలుగూ పడటం, ప్రకృతిని నాశనం చెయ్యక పోవటం ముఖ్యం’’.

***

Smilebox_3704888

మరసటిరోజు పొద్దిన్నే కెమోరా, పెన్సిలు, కాయితాలతో తయారయ్యింది.
‘‘ఎవరన్నా తోడు కావాలా’’
నచ్చిన వాళ్ళని తప్ప ఎవరినీ భరించలేను, ఒంటరిగానే ఇష్టం.  సాయంత్రం చాలా స్కెచ్‌లు, ఫొటోలు తెచ్చింది.  నమూనాల చిత్రాలు, పదిపేజీల నోట్సు తెచ్చింది.
‘‘క్షమా మాపొలాలు చూత్తావా, బహుశా ఓ వందేళ్ళ నించీ సాగు చేత్తన్నాం అనుకుంటా.  తరతరాలుగా మావాళ్ళంతా వ్యవసాయాన్నీ, భూమిని దున్నటాన్నీ వ్యసనంగా చేత్తన్నారు.  చేల నిండా ఎన్నో చిన్న చిన్న శిల్పాలు, గుడులు ఉండయ్యి.  గుడి అంటే నాలుగు లేక ఆరు స్తంబాలపై కప్పులు.  అరటి, కొబ్బరి, వరి పంటల చేలల్లో ఇయ్యన్నీ గమ్మత్తుగా ఉంటయ్యి’’.
‘‘అయితే రేపు ఎలదాం’’
మరసటి రోజు పొద్దిన్నే తన జీప్‌ రెడీ చేసింది.  దాంటో చాలా సరంజానూ ఉంది.  స్టాండు, కెమెరా రకరకాల పెన్నిళ్ళు (సీసపు కడ్డీలు) కాయితాలు.
‘‘ఇయ్యన్నీ ఎందుకు’’?
‘‘బొమ్మలెయ్యటానికి, ఎందుకంటే నేను మొదట చిత్రకారిణిని, తరవాతే అన్నీ’’
‘‘చాలా ఆసక్తిగా, సౌందర్యంతో చిటపటలాడతన్నట్టుగా అనిపిత్తన్నావు’’ అన్నాను.
తిరిగివచ్చి భోజనం చేసి నిద్దర పోయింది.  మరురోజు పొద్దిన్నే స్టాండు, కాయితాలు రంగులూ తీసుకుని కొండ కిందకి ఎలతా, నాపెయింటింగ్‌లకి మోడల్‌గా ఉంటావా అంది.
‘‘నేనా’’
‘‘నువ్వే, బ్యాక్‌ డ్రాప్‌ ఏసేస్తాను.  భోజనం తీసుకుని వచ్చెయ్‌, సాయంత్రం తిరిగి వద్దాం, ఏదన్నా మట్టిరంగుల్లో ఉండ నూలు చీర అయితే మంచిది లేదా ఆకాశ నీలం’’ ఆగకుండా ఎల్లిపోయింది.  మధ్యాహ్ననికి నేనూ కొండ దిగాను.  రొండు చీరలతో, నీళ్ళు సుడులు తిరిగి నున్నపడిన రాళ్ళు, ఎన్నో ఆకారాలు తీసుకున్నయ్యి.  అటు లోయా, ఇటు కొండకీ మధ్య, గుహా లో స్టాండు, అవతల పక్క నది రాతి గోడ కట్ట ఇంకో భాగం, అక్కడ నించీ య్యూ చాలా బాగుంది.  నాకు కనపడలేదు, తన ఎట్టా కనిపెట్టాందబ్బా అనుకున్నా.
‘‘లోవ్‌’’
‘‘హా… రా… తొందరగా బట్టలు తీసెయ్‌, నీలం చీర చుట్టుకో అదీ కొన్ని భాగాలు మాత్రమే కప్పుకో, అలంకరణ ఏమీ వొద్దు, జుట్టు రాతిపయిన వొదిలేసెయ్‌, జుట్టు పయిన  నీలాంబరాలు పోస్తాను.  గుహ బయట నీలపు ఆకాశం, కింద నీలం రంగు నీరు, మొత్తం నీలమే’’.  ‘‘అంటే రోరిక్‌’’ లాగానా, అది హిమాలయాల్లో సాధ్యం, కానీ ఇక్కడ ఎఱ్ఱమట్టి గాలి, నారింజ కొండలు, కనకాంబరపు వెలుగు మొత్తం మారిపోద్దేమో.
‘‘చిత్రకారిణిని నేను నువ్వుకాదు, పనికి సహకరించు’’
సరే అని చీరని కప్పుకుని రాతిపయిన ఒక కాలు మడిచి ఆలోచనలో కూచ్చున్నా.  స్తనాలపయిన చీర కొద్దిగా కిందకి దించు అంది.  నది అవతల ఒడ్డుపయిన దృష్టిపెట్టి కూచ్చోమని చెప్పింది.  కానీ కదులుతూ ఉన్నా, చిరాకుగా ఏంటి, ఎందుకు కదిలావు, అసహనంగా ఉండావు, ఇవ్వాళ కనీసం అవుట్‌లైన్‌ అన్నా తెద్దాం అనుకున్నా… చెయ్యి పెట్టి అవతల రాతి గుహని చూపిచ్చా.  ఒక విదేశీ స్త్రీ, పురుషుడు శృంగారంలో మునిగి తేలతన్నారు.  ‘‘అది అది’’ …
‘‘నువ్వు నేనూ కళాకారులం, సమాధి స్థితికి ప్రస్తుతం వారసులం, చేసే పని తప్ప చేస్టలు ముఖ్యం కాదు,  నీ స్థనాల ఒంపుల్లో మాతృత్వపు మధురిమలు, నీ నడుం గీతల్లో వయస్సు పెంచే అనుభవాల తాత్వాకత, నీ రెండు కాళ్ళు ముక్తి, విముక్తి తప్ప నాకంటికి ఏమీ కనిపిచ్చదు.  నువ్వు కూడా స్త్రీ రహస్య దేహాన్ని, దాని తాత్వికతని నాకు చూపించటానికి ప్రయత్నించు, మాములు మహిళలా ప్రవర్తించకు’’.
పదకొండు గంటలపాటు అమెలో నేను లీనమై, ఆమె కుంచగా మారి, ఒక రూపంగా కుదురుకున్నాం.

***

Kadha-Saranga-2-300x268

అట్టా రొండు మూడు నెలలు బొమ్మలు గీత్తానే ఉంది.  ఆటితో పాటు ప్రకృతి పదార్థాలయిన సున్నం, మట్టి, బెల్లం, చింతగింజలు, కోడిగుడ్డు, పేడ, ఇసక, వంటి వాటితో రకరకాల గూడుల్లాగా, గిన్నెల్లాగా కట్టి ఆటికి బెజ్జాలు పెట్టి ఎండపెట్టింది.  ఆటిని చల్లటి నీళ్ళలో, ధుని (హోమం) దగ్గిర ఉంచి ఆటి వేడిని ధర్మామీటరుతో కొలిచి నమోదు చేసుకునేది.  పెద్ద ఫ్యాను దగ్గిర ఉంచి గాలి చొరబడే వేగం చూసేది, కొన్నిటిని రాళ్ళతో పగలకొట్టింది, మళ్ళా ఆపొడిని నీళ్ళలో కరిగించేది.  అట్టా కొన్ని వందలసార్లు ప్రయోగాలు చేసింది.
బాగా ఒళ్ళు చేసింది, పొట్టకూడా కిందకి జారింది.  అదోవింత అందంతో నిండి  ఉంది. పార్లర్‌ కి ఎల్లి జుట్టు బ్లంట్‌ కట్‌ చాలా కురచగా చేయించుకుంది.  గోళ్ళు కత్తిరిచ్చుకుంటంది.  తన పక్కనే బండ మీద కూచ్చున్నా.
‘‘ఏంటి ప్రసవానికి సిద్దమవుతున్నావా’’ ?
‘‘అవును మరణానికి కూడా’’
‘‘అట్టా మాట్లాడకు, నీ చిన్ని ప్రాణికి భూలోకం తరుపున నేను మొదట స్వాగతం చెబుతున్నాను.  వాడు పుట్టంగానే ఎత్తుకోవటానికి ఈచల్లని చేతులున్నయ్యి’’ అని పొట్టపయిన చేయివేశాను.  బిడ్డ కూడ నన్ను పలకరిచ్చినట్టయ్యింది.
‘‘నీతో చాలా మాట్టాడాలి అంది క్షమ’’
‘‘మాట్టాడుదువు గాని కానీ నీకు ఎన్నో నెల రేపు ఒకసారి డాక్టరు దగ్గిరకి ఎలదాం’’.
‘‘సరే కానీ నేను పొట్టలో బిడ్డతో ఇక్కడకి వొచ్చాను.  నువ్వు కనీసం ఎవరు? ఏంటి అని కూడా అడగలేదు, పెళ్ళయ్యిందా, లేదా లాంటి పిచ్చి ప్రశ్నలు, మొగుడు ఏమయ్యాడు లాంటియ్యి అడక్కుండా చాలా హుందాగా ఉండి అండ అయ్యావు.  ఎప్పుడూ ఒక లక్షరూపాయలు స్త్రీకి బ్యాంక్‌లో ఉంటే ఒక మగాడు తోడున్నట్టు అనుకునే దాన్ని, కానీ నీలాటి మహిళ తోడుంటే అమ్మ ఉండట్టే, కాని ఒకటి చెప్పు ఏం చూసి నన్ను నీదగ్గిర అట్టి పెట్టుకున్నావు … ఎలా ఏమీ ప్రశ్నించకుండా ఉండావు.  దీనికి సమాధానం చెబితే నాగురించి చెప్పి ప్రసవానికి ప్రశాంతంగా బయలుదేరతాను’’.
కొంచెం కష్టం, అయినా చెబుతాను, ఈ ప్రపంచంలో ఒకరోజు కాకపోతే ఒకరోజయినా దేని గురించయినా నిర్వచించవచ్చు.  కానీ ఒక్కదానికే అర్థం, నిర్వచనం, కొలత, లెక్కలు వెయ్యలేనిది, అది స్త్రీ, ఆమె ప్రవృత్తి.  మొదటిగా నువ్వునాకు నచ్చింది మహిళ కావటం, ఇక ఇంతెత్తు పొట్టతో ఒంటరిగా అంత దూరం నించీ రాటం అబ్బరం, అదీ ఈ భూమిని మెచ్చి ఒక గర్భిణి వచ్చి ఉంటాననటం, ఏప్రదేశంకి చెంది ఉండావో, ఇవ్వాళ నా అథిది అవ్వటం నాపుణ్యం.  నువ్వు ఎవరివయినా కావచ్చు, ఇప్పుటికి మాత్రం నాబిడ్డవే.  నువ్వు చిత్రాలు వేస్తే చూసి మురిశాను, పాటలు పాడితే విన్నాను.  హాస్యం ఆడితే నవ్వాను, నువ్వు కడుపులో నీదయిన బిడ్డని మోస్తంటే అంతే ఇష్టపడ్డాను.  మిగతావన్నీ ఓర్చుకున్నదాన్ని నీగర్భం గురించి అసలు ప్రశ్నించటానికి నేనెవరు.  దానికి కర్త, కారణాల అన్వేషణ అనవసరం.  ఏప్రాణికయినా బిడ్డల్ని కనే హక్కు ఉంది.  కావలసిందల్లా నాకూ నాలాంటి వాళ్ళకి నిన్ను భరించటం, ఓర్చుకోవటం.  ఒక్క నిన్ను ఓర్చుకుంటే నీతోపాటు ఇంకో ప్రాణి ప్రాణం పోసుకుని ఆనందం ప్రవాహం లాగా మారుద్ది.  ఏనుగు పాదాలకింద పడిన గులాబీని తియ్యాలా ఒదలాలా అంటే కొంచెం సాహసం చేసయినా తీసి అపురూపంగా రొండు చేతుల్తో పట్టుకోవాలి.  నువ్వు ఇంత సాహసంగా బిడ్డని కనాలనుకున్నావంటే దాని ఎనకాల ఏదో పెద్ద గాథలు, కతలు, ఉండయ్యనుకోను, కానీ తప్పకుండా మాతృత్వం, మమకారం ఉండయ్యని అర్థం అయ్యింది.  క్షమా నువ్వునానించీ వేరుకాదు.  నా స్వరూపానివే.  నేను చెయ్యలేని ఈపని నువ్వుచేస్తన్నందుకు గర్వంగా ఉంది.  అయినా చిన్న కథ చెబుతాను.
‘‘మా అమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు నాన్న అనుకోకుండా మాబందువులు మరణిస్తే ఊరికి ఎల్లాల్సి ఒచ్చింది.  అప్పుడు నావయసు ఆరేళ్ళ మాఅమ్మకి నెప్పులు మొదలయినయ్యి.  చిన్నగా నాతో వేడి నీళ్ళు, బ్లేడు, దారం, అన్నీ పెట్టిచ్చుకుని తనే మంచం వాల్చుకుని చాలా ధేర్యంగా నేను చూస్తావుండగానే మాతమ్ముణ్ణి కన్నది.  అస్సలు బాధ పడలేదు.  మనం పరిస్థితులని అనుకూలంగా అల్లుకోవాలి.  నీకు ఈ సమయంలో తోడు, అండ నేనవటం గొప్పకాదు.  జంతువులయినా గర్భిణికి సహాయం చేత్తయ్యి.  అందరి అమ్మలూ బిడ్డలకి చనుపాలిచ్చే పెంచుతారు.  ఎవరూ విషం చుక్కలు తాగిచ్చరు.  నేనూ అమ్మపాలు శాంతంగా తాగే పెరిగాను.  నువ్వు కూడా నీ బిడ్డకి అట్టాగే స్వాగతం చెప్పాలి.  మన బాధలో చిరాకులో బిడ్డల మీద అస్సలు పడకూడదు.  స్త్రీలంతా తల్లుల్లాగా మారి చల్లిని చేతులతో బిడ్డలకి లాలి పొయ్యాలి, అని ఆగి తనవయిపు చూశా.  నిదానంగా నాఒడిలో తలని దూర్చి పడుకుంది, కాస్సేపు తరవాత,
‘‘నువ్వు నిండు మనిషివి కనకే మోడల్‌గా తీసుకున్నాను.  నాకే కాదు చాలా మంది స్త్రీత్వన్నీ, స్త్రీ తత్వాన్నీ పంచుతూనే ఉండు’’.
‘‘పంచుతాగానీ బిడ్డ పుట్టంగానే ఎవరికయినా విషయం చెప్పాలా’’?

‘‘చాలా తెలివయిన ప్రశ్న, చెప్పాలి.  మరణస్థితికి అటూ, ఇటూ అని తెలిసినా తెగిచ్చేదే ఈస్థితి క్రిస్టఫర్‌కి చెప్పాలి.  ఒక వేళ అటూ, ఇటూ అయితే అతను వచ్చేదాకా శిశువుని కాపాడి అతనికి అందిచ్చు’’.
‘‘నీకేంకాదు, నేనున్నా నీ కోసం’’.
జరకూడదు, జరగదు, జరిగితే జాగ్రత్త కోసం.  మాది మహారాష్ట్రలోని నాగపూర్‌.  కొన్ని పదుల సంవత్సరాల కింద వలస ఎల్లిన తెలుగు కుటుంబం.  బందువులంతా ఆంద్రాలో, మేం మహారాష్ట్రలో తెలుగు మాట్టాడతా, చదవటం, రాయటం మరాఠీలోనే.  అమ్మా, నాన్నా చాలా స్వేచ్ఛగా పెంచారు.  ముఖ్యంగా నాన్నకి ఇష్టంతో, నమ్మిన, శ్వేచ్ఛా జీవితాన్ని ఎవరికి వాళ్ళు ఎంచుకోవాలనేది ఆయన సిద్దాంతం.
నాగపూర్‌లో బాల్యం, కాలేజీకి బొంబాయి, మంచి ఖరీదయిన కాలేజీలో చదువు, నాన్న పోలీసు శాఖ ఉద్యోగి, డబ్బుకి కరువు లేదు.  చిత్ర లేఖనం చిన్నప్పటినించీ నేర్చుకున్నా.  చిత్రాలు రాయటంలో తదేకదీక్ష.  చదువుకన్నా ఈచదువే లోకంగా మారిపోయింది.  రొండో లోకంగా చిత్ర లేఖనం, ఖాళీ దొరికితే క్యాన్వాస్‌కి అంటుకుపోయేదాన్ని.  మాధ్యమ కళ (మీడియం ఆర్ట్‌) ని బాగా అభ్యసించేదాన్ని.  సంవత్సరం తేడాతో అమ్మా, నాన్న మరణం, అన్నయ్యకి కార్ల పందేల గొడవ.  చిత్రాలు రచించటంలో పూర్తిగా లీనమయ్యాను.  ఎంత అంటే ఎవరన్నా పెడితేనే తినలేదని తెలిసేది.  పక్కన ఏం జరిగినా పట్టిచ్చుకోనంతగా లీనమయ్యాను.  ఒక స్నేహితురాలు ప్రదర్శన పెట్టింది.  అందరూ బాగానే కొన్నారు.  అలాగే విదేశాల్లో కూడా ప్రదర్శించాను.  నిదానంగా ఫ్రాన్స్‌ చేరుకున్నాను.  కళలకి, కళాకారులకి, పర్యాటకులకి, కొత్తదనానికి నిర్వచనం ఫ్రాన్స్‌.  అక్కడ గ్యాలరీలో ఇండియన్‌ ఆర్ట్‌ కింద కొన్ని చిత్రాలు ఉంచాను.  రెండు మూడు అమ్ముడయినయ్యి కొన్నిటిని కొంత డబ్బు కట్టి పక్కన పెట్టుకున్నారు.  ఒంటరిగా కూచున్నాను, చలి ఎక్కువగా ఉంది.  పొడవు చేతుల కోటులో వళ్ళు కప్పుకుని టీ తాగుతున్నాను.  ఇదేం చలిరా బాబూ ఫ్రాన్స్‌లో వాళ్ళు ఎట్టా బతుకుతున్నారా అనుకుంటన్నా.
‘‘హాయ్‌, నా పేరు క్రిష్టఫర్‌, మీ బొమ్మలు చూశాను, మామూలు భారతీయుల ఆధ్యాత్మిక    చిత్రాలలా కాకుండా స్వేచ్ఛ, ధైర్యం తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉన్నయ్యి.  నాకు బాగా నచ్చినయ్యి’’.
‘‘థ్యాంక్స్‌, ధన్యురాలిని’’
‘‘నేనూ చిత్రకారుణ్ణే, మీ చిత్రాలు చూసి కలిశాను, మీరు నా చిత్రాలు చూడండి.  దక్షిణ వరండా గది నెం.2లో ఉన్నయ్యి, రేపు కలుద్దాం, ఈలోపు నచ్చితే పిలవండి’’ అని కార్డ్‌ ఇచ్చి వెళ్ళిపోయాడు.
మనిషి తెల్లగా రాగిరంగుజుట్టు, పిల్లకళ్ళు, సరళరేఖ లాంటి దుస్తులిన్న బట్టి ఐరోపా వాసి అనుకున్నా, నాబసనించీ మరురోజు ప్రదర్శనశాలకి ఎలితే అతను గుర్తొచ్చాడు.  దక్షిణం ఏపుకి నడిచాను, ఎనక్కి తిరిగి నిలబడి ఉన్నాడు.
‘‘హాయ్‌’’
‘‘ఓ దుర్గా’’
‘‘ఏంటీ’’ ?
‘‘దేవత దుర్గా, ఐలైక్‌ హర్‌ పవర్‌’’
నవ్వాను, అతని చిత్రాలు చూడమని సాదరంగా ఒంగి మరీ రొండు చేతులతో ఆహ్వనించాడు.
వాటిని చూస్తామాయలో పడిపోయాను. సన్నని రేఖలతో రేఖా గణితంలో (జామెట్రికల్‌) కలిసిపోయినయ్యి.  రంగుల మిశ్రమంతో అద్భుతాలు ఆవిష్కరణకి, కష్టం, సుఖం, ముఖం పయిన అనుభవాల మడతలు, ఆనందం, వెలుగు, చీకటి, రాత్రి, పగలు, కలిమి, శాంతం, క్రూరత్వం, రోడ్డు, ఊరిని, ఇంటిని చూసిన విధానం అబ్బా ఎంత సరళమయిన రేఖలతో గీశాడు.  ఒక గీత ఆత్మతో ఒంకలు, ఒంకలుగా గీస్తే ఇంత అందమయిన చిత్రంగా మారతయ్యి అని అతన్ని చూసినాక తెలిసింది.  ఆమైకంలో ఓ రొండుగెంటలు ఉండిపోయా …
రాత్రి భోజనానికి రండి, భారతదేశాన్ని వినాలి అన్నాడు.
ఇంటికెల్లాను, పెద్ద ఇంటో ఒక్కడే ఉన్నాడు, బటర్‌ చికెన్‌, రోటీ, ఖీర్‌, బిర్యానీ వండాడు.
‘‘అమ్మో, అబ్బా ఆకలి, కడుపు నిండా తినాలి, ఇన్ని ఎలా వచ్చు’’?
‘‘భారత్‌ నారెండో ఇల్లు’’
చాలా సేపు మాట్టాడుకుంటా తిన్నాము.  చాలా నగరాల గురించి మాట్లాడాడు.  ముఖ్యంగా హంపి తనక్కడ ఎంత హాయిగా బొమ్మ లేసుకున్నదీ చెప్పాడు.  అలా చిత్రాల ప్రదర్శన నెలరోజులు జరిగింది.  కళాకారులం కదా, సున్నిత మనస్సులు, ఎన్నో మాటల పంపకాలు, జ్ఞాపకాల సంచుల గుమ్మరింతలు, ఇద్దరిలో ఒకరికి నచ్చినయ్యి ఒకరం ఏరుకున్నాం, కలుసుకున్నాం, కరిగిపోయాం, ఒకటయ్యి అర్థనారీశ్వరతత్వంలో ఓచిత్రంగా మారిపోయాం. నేను భారత్‌ బయలు దేరాల్సిన రోజు వచ్చింది.  చాలా సేపు కలిసి గడిపాం.
తనకీ మనస్సులు కలవటమే ముఖ్యం, బందాలలో ఇమడటం కన్నా భావనలకోసం వేచి చూట్టం, చూడాలి అనుకున్నప్పుడల్లా కలుద్దాం, ఎవరికి వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా విడిపోయాం, అలా చాలాసార్లు కలిసాం.  ఓ మూడేళ్ళలో పదిసార్లనుకుంటా, అతని సహచర్యంలో తడిసి ముద్దయి అది నాపొట్టలో పిండంగా మెలకెత్తింది.  అమ్మా, నాన్నా ఇద్దరూ ఈరూపం తీసుకుని ఉంటారని పిచ్చింది. అతనికి ఇష్టమయిన హంపీలో గడపాలని, అతను ఎల్లిన చోటకల్లా ఎలతా ఉంటే తను దగ్గిర లేడు అనే భావమే లేదు.  ఫోన్లలో, ఉత్తరాల్లో జాగ్రత్తలు చెబుతా ఉంటాడు.  అంతగా అవసరం అంటే వస్తానంటాడు.  కానీ అతని స్వేఛ్చని హరించి మన సంస్కృతిలో బందీని చెయ్యటం నాకు ఇష్టం లేదు.  నాకెవరు పుట్టినా తనకి ఇష్టమే.  ఏదయినా ఆపదనాకు జరిగితే బిడ్డని అతను వచ్చేదాకా కాపాడు. తను తీసుకెల్లి తప్పకుండా చూసుకుంటాడు…. అని రెండు ఫోన్‌ నెంబర్లు నాచేతిలో పెట్టింది.
పొద్దిన్నే నెప్పులు మొదలయినయ్యి, నెప్పుల్లో కూడా కారు నడిపింది.  ఆకాశం, భూమి ఏకమై భాదపడినట్టుగా నెప్పులు పడిరది.  పదకొండుగంటలకి బుద్దపౌర్ణమినాడు బాబు పుట్టాడు, వాడు ఎంత బాగున్నాడో, నర్సులు స్నానం చేయించినాక పోలియో చుక్కల కోసం తీసుకెలతన్నా….
‘‘హాయ్‌, నేను క్రిష్టఫర్‌’’ అని ఇనపడిరది.
బిడ్డని అతని చేతుల్లో ఉంచి కళ్ళతోనే సంతోషాన్ని తెలిపి నవ్వేశాను, క్షమ అతన్ని పట్టుకుని చాలాసేపు ఉండిపోయింది.  మూడోరోజు ఇంటికి వచ్చి పనిలో పడిపోయాం.  క్రిష్టఫర్‌ ఏదో దేశంలో ప్రదర్శన ఉంటే ఎల్లిపోయాడు.  ఆమె ఏపని చేస్తన్నా, ఎక్కడికి ఎల్లినా, వీపు మీదో, చెట్టుకి యాలాడతానో ఉయ్యాలలోనో బాబు ఉండేవాడు.  బుద్ద పౌర్ణమి రోజున పుట్టినందున వాడికి ‘‘ఉత్తమ్‌’’ అని పేరు పెట్టింది.
ఆలోచనలనించీ తేరుకుని చూస్తే మాటలు ఇనపడతన్నయ్యి.
‘‘క్షమా క్రిష్టఫర్‌ ఎప్పుడొస్తాడు’’? అన్నా
‘‘తెలియదు’’
‘‘ఉత్తమ్‌ అడగట్లేదా’’
‘‘ఉత్తమ్‌ నావాడు, నేను కన్నాను, నాకోసం, ఈబందాలు, కట్టుబాట్లు, కావాలంటే భారతీయుణ్ణే వరించేదాన్ని’’.
‘‘కేవలం నాకు బిడ్డకావాలి, అదీ నా ప్రపంచంలో ఒక భాగం కావాలి, దానికి క్రిష్టఫర్‌ సహకారి అంతే’’.
‘‘దటీజ్‌ క్షమా, ఒక మీడియం ఆర్ట్‌’’.

sindhu-1_336x190_scaled_croppమన్నం సింధుమాధురి
8790906686

Download PDF

4 Comments

  • Jayashree Naidu says:

    మనిషికీ మట్టికీ మట్టి వాసనకీ మనసు స్వేచ్ఛకీ కథా రోపమిచ్చారు మీరు…

  • రాఘవ says:

    కధ లోని పాత్రలు ఎక్కడివీ…? ఏ భాష మాట్లాడుతున్నాయీ?
    గ్రామీణ తెలుగు యాస నీ, ఇంగ్లీషు పదాల్నీ కలిపి ….భలే కృతకమైన భాషని తయారు చేశారు
    టైపోలు మరీ ఎక్కువగా ఉన్నై.
    ఏంటిది మాధురి గారూ….
    మగవాళ్ళకు భలే అనుకూలమైన స్వేచ్చ ను ప్రతిపాదిస్తోందే ఈ కధ!

  • వస్తువులో, శైలిలో భిన్నంగా వున్నమన్నం గారి క్షమ కథ చదివితే …ఆకలిగొన్న వాడికి అన్నం తిన్నట్టు…ఆవిరిగొన్న నేల మీద గంగ పారినట్టు…వుంది . పిలిచి అన్నం పెట్టిన మన్నం సిందు మాధురి గారికి దేవతలకు పెట్టినట్టు అదో మాదిరి దణ్ణం !

  • “నానా చెత్తా మనం ఏసినా తనతో దోపుకుని, కుళ్ళించుకుని, తనలా స్వచ్చంగా మార్చుకునే భూమి రూపాలు, హోయలు అంటే ఇష్టం’’.
    ‘‘మట్టి వాసన కడుపులోకి ఎల్లింది. నా కడుపులో బిడ్డ కోరిక, కొద్దిగా తినాలనిపిత్తంది’’

Leave a Reply to Jayashree Naidu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)