పెద్రో పారమొ-7

pedro1-1

పొద్దుటి ఎండకి నా జ్ఞాపకాలు వెలిసిపోతూ ఉన్నాయి.
అప్పుడప్పుడూ మాటల శబ్దాలు విన్నాను. తేడా గమనించాను. ఎందుకంటే అప్పటిదాకా నేను విన్న మాటలన్నీ నిశ్శబ్దమైనవి. శబ్దమేదీ లేదుగానీ అర్థం తట్టేది. కలలో మాటలు విన్నట్లు నిశ్శబ్దంగా.
“ఎవరయి ఉంటాడు ఇతను?” ఆమె అడుగుతూంది.
“ఎవరికి తెలుసు!” అతను బదులిచ్చాడు.
“ఎందుకొచ్చాడో ఇక్కడికి?”
“ఎవరికి తెలుసు!”
“వాళ్ల నాన్న గురించి ఏదో అన్నట్లు గుర్తు.”
“నేనూ విన్నాను.”
“దారి తప్పాడంటావా? ఒకసారి దారి తప్పామని కొందరు వచ్చారు గుర్తు ఉందా? లాస్ కంఫైనెస్ అనే ఊరి కోసం చూస్తున్నామంటే నీకు తెలియదని చెప్పావు”
“అవును, గుర్తుందిలే. నన్ను పడుకోనియ్! ఇంకా తెల్లవారలేదు.”
“తెల్లారుతూనే ఉంది. నిన్ను లేపాలనే నీతో మాట్లాడుతూంది. తెల్లారకముందే గుర్తు చేయమని అన్నావు, నేను గుర్తు చేస్తున్నాను. లే!”
“నన్నెందుకు లేపుతున్నావు?”
“నాకు తెలియదు. లేపమని నాకు రాత్రి చెప్పావు. ఎందుకో చెప్పలేదు.”
“అదే కారణమయితే నన్ను పడుకోనియ్. రాత్రి అతను వచ్చినప్పుడు ఏమన్నాడో గుర్తుందిగా? తనను నిద్రపోనివ్వమని. అతని నోట్లోంచి వచ్చిందంతా ఆ ముక్కే.”

 

గొంతులు దూరంగా పోతున్నట్టున్నాయి. మాసిపోతూ. ఊపిరి తిరగనివ్వకుండా చేసినట్టు. ఎవరూ ఏమీ అనడం లేదు. అది కల.
కానీ కాసేపయ్యాక అది మళ్ళీ మొదలయింది.
“అతను కదులుతున్నాడు. లేవబోతున్నాడనుకుంటాను. మనల్ని ఇక్కడ చూస్తే ఏవో ప్రశ్నలన్నీ అడుగుతాడు.”
“అతనేం అడుగుతాడు?”
“అతనేదో మాట్లాడాలి గదా! కాదా?”
“అతన్ని వదిలెయ్! బాగా అలసిపోయి ఉండాలి.”
“నువ్వలా అనుకుంటున్నావా?”
“ఇక చాలించు తల్లీ!”
“చూడు, కదులుతున్నాడు. ఎట్లా ఎగిరెగిరి పడుతున్నాడో చూడు. లోపలేదో అతన్ని కుదిపేస్తున్నట్టు. నాకు కూడా అలా అయింది కనక నాకు తెలుసు.”
“నీకేం అయింది?”
“అది.”
“నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు.”
“అతన్ని అట్లా చూసినప్పుడు నువ్వు మొదటిసారి నాకు అది చేసినప్పుడు నాకేమయిందో గుర్తుకు వచ్చింది. అంతకంటే ఏమీ చెప్పలేను . అది నన్నెంత బాధించిందీ, అది చేసినందుకు ఎంత చెడ్డగా అనిపించిందీ..”
“అది అంటే?”
“నువ్వు అట్లా చేయగానే నాకనిపించిందీ, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎట్లా సరిగ్గా చేయనిదీ..”
“మళ్ళీ మొదలుపెట్టావా? నువ్వు పడుకుని నన్ను పడుకోనివ్వు!”
“నువ్వే అడిగావు గుర్తు చేయమని. నేను అదే చేస్తున్నాను. ఓరి దేవుడా, నువ్వు నాకేం చెప్పావో అదే చేస్తున్నాను. లే! నువ్వు లేచే సమయమయింది.”
“నన్నొదిలేయి తల్లీ!”
అతను నిద్రపోయినట్టున్నాడు. ఆమె మెత్తటి గొంతుతో తిడుతూనే ఉంది.
“అదుగో తెల్లగా తెల్లారిపోయింది. ఎంత వెలుతురుగా ఉందో చూడు. ఇక్కడినుంచి అతను కనిపిస్తున్నాడంటే అంత వెలుతురు ఉండబట్టే కదా! కాసేపట్లో ఎర్రగా పొద్దు పైకొస్తుంది. అది నీకు నేను చెప్పనవసరం లేదు. అతనేదో తప్పు చేసి ఉండాలి. మనం లోపలికి రానిచ్చాం. ఈ ఒక్క రాత్రికే అయినా సరే, అతనికి ఆశ్రయమిచ్చాం. ముందుముందు లేనిపోనివి మన తలకు చుట్టుకుంటాయి. చూడు అతనెంత దొర్లుతున్నాడో కుదురుగా పడుకోకుండా. గుండెలమీద పెద్ద బరువు పెట్టుకుని ఉండాలి.”
వెలుతురు ఎక్కువవుతూంది. దినం నీడల్ని పారదోలుతూంది. వాటిని చెరిపేస్తూంది. నిద్రపోతున్న దేహాల వేడితో నేను పడుకున్న గది వెచ్చగా ఉంది. పొద్దుటి ఎండ నా కనురెప్పలపై వాలడం తెలుస్తూంది. నాకు వినిపించింది:
“అతను శపించబడ్డట్టు కొట్టుకుంటున్నాడు. దురాత్ముడి ఆనవాళ్ళన్నీ కనపడుతున్నాయి. లే డోనిస్, అతన్ని చూడు. చూడు అతను ఎట్లా తన్నుకులాడుతూ అటూ ఇటూ దొర్లుతున్నాడో! చొంగ కారుస్తున్నాడు. చాలా మందినే చంపి ఉండాలి. నువ్వు చూడను కూడా చూడడంలేదు.”
“పాపం! పడుకో.. మమ్మల్ని పడుకోనివ్వు.”
“నాకు నిద్ర పట్టకపోతే ఎట్లా పడుకోను?”
‘లేచి పో అయితే. నన్ను సతాయించకుండా ఎక్కడికన్నా పో!”
“పోతా. పోయి నిప్పు రాజేస్తా. పోతూ ఏం పేరో అతన్ని వచ్చి నీ పక్కనే నా చోట్లో పడుకోమంటా.”
‘అదే చెప్పు అతనికి.”
“కాదులే. నాకు భయం.”
“అయితే మమ్మల్ని వదిలేసి నీ పని చూసుకో!”
“పోతున్నా!”
“ఇంకా దేనికి ఆగావు?”
“పోతున్నా.”
ఆమె మంచం మీదినుంచి లేవడం వినిపించింది. ఆమె నగ్న పాదాలు నేలను తాకిన చప్పుడు. నా తల మీదుగా దాటుకుంటూ పోయింది. నేను కళ్ళు తెరిచి మూసుకున్నాను.
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పొద్దు బాగా పైకెక్కింది. నా పక్కనే మట్టి కప్పులో కాఫీ ఉంది. తాగడానికి ప్రయత్నించాను. కాసిని గుక్కలు మింగాను.
“మా దగ్గర అదే ఉంది. ఏం చేయను? ప్చ్! కొద్దిగానే ఉంది. అన్నిటికీ కొరతగానే ఉంది. ఎంతో కొరతగా.”
అది ఒక స్త్రీ గొంతు.
“నాగురించి చింతించకండి.” ఆమెకి చెప్పాను. “నాగురించి చింత ఏమీ వద్దు. నాకలవాటే. ఇక్కడి నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి?”
“ఎక్కడికి పోతున్నావు?”
“ఎక్కడికయినా.”
“బోలెడు దారులున్నాయి. ఒకటి కోంట్లాకి వెళుతుంది. ఒకటి అక్కడ్నుంచి వస్తుంది. ఒకటి తిన్నగా కొండల్లోకి పోతుంది. ఆ కనపడేది ఎక్కడికి పోతుందో నాకు తెలియదు.” పడిపోయిన కప్పు స్థానంలో రంధ్రం గుండా పైకి చూపిస్తూ అంది. “ ఇంకొకటి మెదియాలూనా మీదుగా పోతుంది. మరొకటి ఊరంత పొడుగూ పోయేదుంది. అది అన్నిటికంటే పొడవయింది.”
“అయితే నేను అటునుంచే వచ్చి ఉండాలి.”
“ఎటు పోతున్నావు?”
“సయులా వైపు.”
“నా మతి మండ. ఇంకా సయులా అటు వైపనుకున్నాను. అక్కడికి వెళ్ళాలని ఎన్నాళ్లనుంచి అనుకుంటున్నానో. అక్కడ చాలా మంది జనం ఉంటారని చెప్తారు.”
“మిగతా చోట్ల లాగే.”
“మరే! ఇక్కడేమో మేం ఒంటరిగా ఉన్నాము. ఒక్క పురుక్కి కూడా మొహం వాచి ఉన్నాం.”
“మీ ఆయన ఎక్కడికి పోయాడు?”
“మా ఆయన కాదు, అన్న. ఆ సంగతి ఎవరికీ తెలియడం ఇష్టం లేదు తనకి. ఎక్కడికి పోయాడో! దూడేదో ఈ చుట్టుపక్కల తప్పించుకు తిరుగుతుంటే దాని కోసం పోయినట్టున్నాడు. నాకు చెప్పడమయితే ఆ మాటే చెప్పాడు.”
“ఇక్కడ ఎన్నాళ్ళ నుంచీ ఉంటున్నారు?”
“ఎప్పటినుంచో! మేం ఇక్కడే పుట్టాం.”
“అయితే నీకు డలోరిస్ ప్రెసియాడొ తెలిసే ఉండాలే!”
“డోనిస్ కి తెలుసేమో! జనాల గురించి నాకంతగా తెలియదు. బయటికి ఎప్పుడూ వెళ్ళను. శాశ్వతంగా ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది. అన్నాళ్ళు కాదులే కానీ, నన్ను తనదాన్ని చేసుకున్నప్పటి నుంచీ. అప్పటినుంచీ ఇక్కడే ఉండిపోయాం. ఎవరయినా చూస్తారని భయం. తను నమ్మడు కానీ నామొహం చూసి ఎవరయినా దడుచుకోరా?” నడిచి వచ్చి ఎండలో నిలుచుంది. “ నా మొహం చూడు.”
అది మామూలు మొహం.

Pedro_Páramo
“ఏం చూడమంటావు?”
“ నా పాపం కనపడటం లేదా? ఊదారంగు మచ్చలు కనపడటం లేదా? అదింకా బయటే. లోపల నేనొక బురద సముద్రాన్ని.”
“ఇక్కడ ఎవరూ లేనప్పుడు ఇక నిన్నెవరు చూస్తారు? ఊరంతా తిరిగాను కానీ ఒక్కరూ కనపడలేదు.”
“కనపడలేదని నువ్వనుకుంటున్నావు కానీ ఇంకా ఇక్కడ కొందరున్నారు. నీకు ఫిలోమెన కనపడలేదా? డరోటియా, మెల్క్విలాడెస్, లేకపోతే ముసలి ప్రెడెన్సియో? ఇంకా సొస్టేనెస్ వాళ్ళంతా బతికే ఉన్నారు కదా! విషయమేమిటంటే వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు. పగలంతా ఏం చేస్తారో తెలియదు కానీ, రాత్రుళ్ళు తలుపులు వేసుకుని లోపలే ఉంటారు. ఇక్కడ రాత్రులన్నీ దయ్యాలతోటే నిండి ఉంటాయి. ఆ ఆత్మలన్నీ వీధుల్లో నడిచివెళ్ళడం నువు చూడాలి. చీకటి పడగానే అవన్నీ బయటకు వస్తాయి. ఎవరికీ వాటిని చూడాలని ఉండదు. అవి చాలా ఉంటాయి, మేమా కొద్దిమందిమి. వాళ్ళు పాప ప్రాయశ్చిత్త లోకం నుంచి బయటపడేందుకు ప్రార్థన చేయడానికి కూడా ప్రయత్నించం. అన్ని ప్రార్థనలు మావద్ద లేవు. ఏదో దైవప్రార్థన, తలా నాలుగు మాటలు.అది వాళ్ళకు ఏమూలకి? వాళ్ళ పాపాలపైన మా పాపాలు. బతికి ఉన్నవాళ్ళవెవరమూ దైవకృప కలిగి లేము. సిగ్గుతో నిండిన కళ్ళను ఎత్తి చూడలేము. సిగ్గు సాయపడదు. కనీసం బిషప్ చెప్పిన మాట అదీ. ఆ మధ్య దీవెనలివ్వడానికి వచ్చాడు. నేను వెళ్ళి అన్నీ కన్ ఫెస్ చేశాను.
“’నేను నిన్ను క్షమించలేను,’ అన్నాడు.
“’సిగ్గుతో నా వొళ్ళంతా చితికిపోతూంది.’
“’అది సమాధానం కాదు.’
“’మా ఇద్దరికీ పెళ్ళి చేయండి!’
“’విడివిడిగా బతకండి!’
“నేనతనికి చెప్పడానికి ప్రయత్నించాను. బతుకు మమ్మల్ని కలిపింది. పశువుల్లా తరిమింది. ఒకళ్ళమీదికొకళ్ళని బలవంతాన తోలింది. మేమెంతో వొంటరిగా ఉన్నాము, ఇద్దరమే మిగిలాం. మళ్ళీ ఎట్లాగో ఊళ్ళోకి కొంతమంది వచ్చారు. అతను ఈసారి వచ్చేసరికి దీవెనలివ్వడానికి ఎవరో ఒకరు ఉంటారని చెప్పాను.”
“’ఎవరి దారిన వాళ్ళు పోండి. మార్గాంతరం లేదు.”
“’మరి మేమెలా బతకం?’
“’అందరూ బతికినట్టే.’
“మొహం గంటు పెట్టుకుని కంచరగాడిదనెక్కి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూడకుండా. ఇక్కడేదో శాపగ్రస్త దృశ్యాన్ని వదిలి పోతున్నట్టు. అతను మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే ఈ చోటంతా ఆత్మలు ముసురుకొని ఉన్నాయి. క్షమాపణ దొరకకనే చనిపోయిన నిమ్మళం లేని ఆత్మలగుంపులు. జనాలకి క్షమాపణ ఎటూ దొరకదు, అందులోనూ మా మీద ఆధారపడి ఉన్నప్పుడు. అతను వస్తున్నాడు. వినిపిస్తుందా?”
“అవును. వినపడుతుంది.”
“అది అతనే!”
తలుపు తెరుచుకుంది.
“దూడ దొరికిందా?” అడిగింది.
“తిరిగి రాకూడదని దాని బుర్రకెక్కినట్లుంది. దాని అడుగుజాడలు దొరికాయి. తొందరలోనే ఎక్కడుందీ కనుక్కుంటాను. రాత్రికి పట్టుకుంటాను.”
“మళ్ళీ రాత్రికి ఒంటరిగా వదిలి పోతావా?”
“పోవలసివస్తుందేమో!”
“నావల్ల కాదు. నువు నాతో ఉండాలి. అప్పుడే నాకుహాయిగా ఉంటుంది. రాత్రిపూట.”
“కానీ ఈరాత్రికి దూడ కోసం వెళ్ళాలి.”
“నాకిప్పుడే తెలిసింది.” అడ్డు తగిలాను. “మీరిద్దరూ అన్నా చెల్లెళ్లని.”
“నీకిప్పుడే తెలిసిందా? నాకు చాలాకాలం నుంచీ తెలుసు. అందులో నువు వేలు పెట్టకు. జనాలు మాగురించి మాట్లాడుకోవటం నాకిష్టం లేదు.”
“నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే ప్రస్తావించాను. అంతే.”
“అర్థం చేసుకునేదేమిటి?”
“ఏం లేదు.” చెప్పాను. “క్షణక్షణానికీ నాకు అర్థమవడం తగ్గుతూ ఉంది.” ఇంకా జతకలిపాను. “ నాకు కావలసిందల్లా నేను బయలుదేరిన చోటుకి తిరిగి వెళ్లటమే. మిగిలిన కాస్త వెలుతురూ పోకముందే బయలుదేరాలి.”
“నువ్వాగటం మంచిది.” అతనన్నాడు. “పొద్దుటి దాకా ఆగు. తొందరగా చీకటి పడుతుంది. ఈ దారుల్లో తప్పిపోతావు. రేపు పొద్దున నీకు సరైన దారి చూపిస్తాను.”
“సరే.”

 

కప్పుకున్న రంధ్రంలోంచి పిట్టల్ని చూస్తున్నాను. సందెవేళ చీకటి దారులు మూసేలోపు గుంపు కట్టి పోతున్నాయి. దినాన్ని తీసుకువెళ్లడానికి వస్తున్న గాలి కొన్ని మబ్బుల్ని అప్పటికే చెదరగొట్టింది.
తర్వాత శుక్రనక్షత్రం బయటికి వచ్చింది. మరి కాసేపటికి చంద్రుడూ.
అతనూ, ఆమే దగ్గరలో లేరు. వరండాలోంచి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేప్పటికి చీకటి పడిపోయింది. కాబట్టి వాళ్లు వెళ్ళిపోయాక ఏం జరిగిందో వాళ్ళకు తెలిసే అవకాశం లేదు.
ఇదీ జరిగింది:
వీధిలోంచి ఒక స్త్రీ వచ్చింది. పురాతనమైన ఆమె ఎంత సన్నగా ఉన్నదంటే చర్మం బొమికెలకు అతుక్కునిపోయింది. తన పెద్ద కళ్ళతో గది చుట్టూరా కలయజూసింది. ఆమె నన్ను కూడా చూసే ఉండొచ్చు. బహుశా నేను నిదరపోతున్నాననుకుందేమో! సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని కిందనుంచి ట్రంకు పెట్టె బయటికి లాగింది. డాని లోపలంతా వెతికింది. కాసిని దుప్పట్లు చంక కింద పెట్టుకుని నేనెక్కడ నిద్ర లేస్తానో అన్నట్టు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పోయింది.
ఊపిరి బిగబట్టి, ఆమెవేపుకు కాకుండా ఎటో చూడడానికి ప్రయత్నిస్తూ బిర్రబిగుసుకుని ఉండిపోయాను. చివరికి తల తిప్పడానికి కాస్త ధైర్యం కూడదీసుకుని ఆమె వంక చూశాను.శుక్రతార చంద్రుడితో కలుస్తున్న దిశలో.
“ఇది తాగు” నాకు వినిపించింది.
తల తిప్ప సాహసించలేకపోయాను.
“ఇది తాగు. నీకు మంచే చేస్తుంది. ఇది నారింజ పూల తేనీరు. నువు వణుకుతున్నావు కనుక భయపడుతున్నావని నాకు తెలుసు. ఇది నీ భయాన్ని తగ్గిస్తుంది.”
చేతులు గుర్తు పట్టాను. కళ్ళెత్తి చూశాక మొహాన్నీ గుర్తు పట్టాను.ఆమె వెనక ఉన్న అతను అడిగాడు: ”ఒంట్లో బాగా లేదా?”
“నాకు తెలియదు. మీకెవరూ కనపడని చోట నాకు మనుషులూ, వస్తువులూ కనపడుతున్నాయి. ఇప్పుడే ఇక్కడికి ఒకామె వచ్చింది. ఆమె వెళుతుండగా మీ కళ్ళపడే ఉండాలి.”
“దా!” తన భార్యతో అన్నాడతను “ అతన్ని ఒంటరిగా వదిలేయి. మర్మయోగిలా మాట్లాడుతున్నాడు.”
“అతనికి మంచం ఇద్దాం. చూడు ఎట్లా వణికిపోతున్నాడో. జ్వరం తగిలిందేమో!”
“అతన్ని పట్టించుకోకు. ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఆకట్టుకోవడానికి కావాలనే ఈ పరిస్థితి కొని తెచ్చుకుంటారు. మెదియాలూనా దగ్గర ఒకతను నాకు తెలుసు. దైవాంశ ఉందని చెప్పుకునే వాడు. అతనికి ఆ దైవాంశ చెప్పనిదేమిటంటే అతనెంత అబందరగాడో వాళ్ళ అయ్యగారికి తెలియగానే వాడికి చావు మూడిందని. వాళ్ళు ఒక ఊరినుంచి ఇంకో ఊరికి పోతూ బతుకు గడిపేస్తారు ‘దేవుడు ఏం ఇవ్వదలచాడో కనుక్కోవడానికి’. కానీ అతనికి ఇక్కడ తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకదు. చూడు వణకడమెట్లా ఆపాడో! మన మాటలు వింటున్నాడు.”

కాలం వెనక్కి తిరుగుతున్నట్లుంది. తార మళ్ళీ చంద్రుడి వద్దకు చేరుతూంది. చెదిరిన మేఘాలు. పిట్టల గుంపులు. అప్పుడు అకస్మాత్తుగా మిట్టమధ్యాహ్నపు వెలుతురు.
గోడలపై మధ్యాహ్నపు ఎండ పరావర్తనమవుతూంది. బండరాళ్ల మీద నా అడుగులు చప్పుడు చేస్తున్నాయి. గాడిదలు తోలేవాడు అంటున్నాడు “పైకి చూడు దోనా ఎదువిజస్! నువ్వింకా బతికుంటే.”
అప్పుడొక చీకటి గది. నా పక్కనే గురక పెడుతున్న ఒక స్త్రీ. ఆమె కల కంటున్నట్టో, లేక మెలకువగా ఉండే నిద్రపోతున్నట్లు చప్పుడు చేస్తూనో ఉన్నట్లు ఊపిరి హెచ్చుతగ్గులుగా పీలుస్తూంది. ఎప్పుడూ ఎండలో వేయక ఉచ్చ కంపు కొడుతున్న గోతం సంచులు పరిచిన రెల్లుమీద కప్పి ఏర్పాటు చేసిన పక్క. ఒక మొద్దు మీదో ఊలు చుట్ట మీదో జీను మెత్తని చుట్టి చేసిన దిండు. అది చెమటకంపు కొడుతూ రాయిలా గట్టిగా ఉంది.
నగ్నంగా ఉన్న స్త్రీ కాళ్ళు నా మోకాళ్ళకు తగులుతున్నట్లు తెలుస్తూంది. నామొహం మీద ఆమె ఊపిరి. ఆ రాయి లాంటి దిండును ఊతం చేసుకుని లేచి కూచున్నాను.
“నువు నిద్రపోలేదా?” ఆమె అడిగింది.
“నిద్ర పట్టడం లేదు. పగలంతా పడుకున్నాను. మీ అన్న ఎక్కడ?”
“ఎక్కడికో పోయాడు. ఎక్కడికి వెళతానన్నాడో నువుకూడా విన్నావు కదా? ఈరాత్రికి ఇక రాకపోవచ్చు.”
“అయితే వెళ్ళాడా? నువు వద్దని చెబుతున్నా?”
“అవును. తను ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు. వాళ్లంతా అలాగే చేస్తారు. ‘నేనక్కడికి పోవాలి; ఇటు వెళ్లాలి.’ ఎపుడో చాలా దూరం , తిరిగి రావడం అంత తేలిక కానంత దూరం పోతారు. తను పైకి చెప్పకపోయినా నన్ను నువ్వు చూసుకుంటావని వదిలేసి పోయుంటాడు. తన వీలు తను చూసుకున్నాడు. తప్పిపోయిన దూడ ఒక సాకు. చూస్తూండు. ఇక తిరిగి రాడు.”
“నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గాలి కోసం బయటకు వెళుతున్నాను.” అందామనుకున్నాను. బదులుగా అన్నాను. “కంగారు పడకు. అతను తిరిగి వస్తాడు.”
నేను మంచం దిగేసరికి ఆమె అంది.
“కుంపట్లో బొగ్గుల మీద నీకు కాస్త ఉంచాను. అంత ఎక్కువ లేదు కానీ నువు మరీ పస్తు ఉండకుండా ఉంచుతుంది.”
ఎండు ఆవు మాంసపు ముక్కా, కొన్ని వేడి రొట్టెలూ కనిపించాయి.
“అంతే నాకు దొరికింది,” వేరే గదిలోంచి ఆమె మాటలు నా చెవిన పడ్డాయి. మా అమ్మ చస్తూ వదిలివెళ్ళిన రెండు మంచి దుప్పట్లు మా చెల్లికి ఇచ్చి ఇవి తెచ్చాను. అవి మా మంచం కింద దాచాను. అవి తీసుకు వెళ్ళడానికే వచ్చి ఉంటుంది. డోనిస్ ఎదురుగా నీకు చెప్పదల్చుకోలేదు కానీ నువ్వు చూసింది ఆమెనే. బాగా భయపెట్టినట్టుందిగా!”
ఒక నల్లటి ఆకాశం, నిండా నక్షత్రాలు. చంద్రుడి పక్కనే అన్నిటికంటే పెద్ద నక్షత్రం.

“నామాట వినపడటం లేదా?” లోగొంతుకతో అడిగాను.
ఆమె గొంతు బదులిచ్చింది: ”నువ్వెక్కడ?”
“నేను ఇక్కడ, నీ ఊరిలో, నీ మనుషులతో. నేను కనపడటం లేదా?”
“లేదు కొడుకా, నువు నాకు కనపడటం లేదు.”
అన్నిటినీ ఆవరిస్తూ ఉంది ఆమె గొంతు. ఎక్కడో దూరంలో మాయమవుతూంది.
“నాకు నువు కనపడటం లేదు.”

 

నేను ఆమె నిద్రపోతున్న గదికి తిరిగి వెళ్ళి చెప్పాను.
“నేను ఈ మూలన పడుకుంటాను. ఆ మంచమెటూ రాయంత గట్టిగా ఉంది. ఏమన్నా అయితే నన్ను లేపు.”
“డోనిస్ తిరిగి రాడు.” ఆమె అంది. “తన కళ్ళు చూస్తే తెలిసిపోయింది. ఎవరన్నా వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాడు తప్పించుకుపోవచ్చని. ఇప్పుడు నా బాగోగులు నువ్వే చూడాలి. చూడవా? నన్ను చూసుకోవా? నా పక్కనే పడుకుని నిద్రపో!”
“ నాకిక్కడ బాగానే ఉంది.”
“ ఇక్కడ ఈ మంచంలో ఇంకా బాగుంటుంది. అక్కడ నల్లులు నిన్ను బతికుండగానే పీక్కు తింటాయి.”
నేను లేచి ఆమె పక్కలోకి దూరాను.

(సశేషం)

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)