కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

painting: Mamatha Vegunta

painting: Mamata Vegunta

 

సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు

లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.

ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?

మర్చిపోయాననుకున్న నవ్వుల్నీ
మామూలైపోయానుకున్న బెంగల్నీ
ఇష్టమైన పాటలోని నచ్చిన పదాల్లాగా
మళ్ళీ మళ్ళీ వినిపించకపోతేనేం!?

నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?

వద్దు వద్దు ఈవేళప్పుడొద్దని మొత్తుకుంటున్నా
మొదలయ్యే వాన..
మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
లోపలంతా ఒకటే వాన
తడిచి తడిచి చిత్తడి అయినా
మట్టిపాత్ర దాహాన్ని తీర్చనూలేక.. ఒడుపుగా మూయనూలేకా
ఎందుకొస్తాయో కొన్ని రాత్రిళ్ళు!

ఏదో లేనితనమా లేక ఏమీ మారనితనమా?

సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని
చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో…

ఆకుల మధ్యలో గాలీ
గూళ్ళల్లో పక్షులూ
విత్తనం చిట్లిన చప్పుడూ
అన్నీ సద్దుమణుగుతాయి

లీలగా మెదిలే పేదరాసి పెద్దమ్మ కధ
మగత మబ్బులో మెల్లగా చుడుతుండగానే
ఉన్నట్టుండి అమ్మ గుర్తొస్తుంది
అమ్మ కొచ్చిన జొరమూ గుర్తొస్తుంది!

ఒక్కసారిగా వణికించిన దిగులుకైనా తెలుసో లేదో

కొన్ని రాత్రుళ్ళు ఎందుకొస్తాయో?
వచ్చి వలయాలై ఎందుకు తిరుగుతాయో!?

                                            -నిషిగంధ

Download PDF

23 Comments

 • “మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
  లోపలంతా ఒకటే వాన”
  “చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
  ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో…”

  చాలా బాగుంది.

  • డా. జడా సుబ్బారావు says:

   చదివిన వెంటనే ఏవో జ్ఞాపకాలలోకి లాక్కెళ్లి మంచి అనుభూతిని మిగిల్చిన కవిత.
   ప్రత్యేకించి “కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు/లోయలోకి జారిపడుతుంది/
   ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది” అనే పాదాలు చాలా బాగున్నాయి.

 • S. Narayanaswamy says:

  Bravo!

 • Radhika says:

  మాటల్లేవు….చుట్టూ నీ అక్షరాలే మిగిలాయి

 • ns nurty says:

  నిషిగంధ గారూ,

  మీ కవితకి వేసిన బొమ్మలాగే, మీ పదాల canvas కూడా మనోహరంగా ఉంది. you have that fine skill to elevate a subjective experience into universal. Your poems take me back and walk me through a forgotten fraction of time hibernating in the subconscious.
  హృదయపూర్వక అభినందనలు

 • Prasuna says:

  బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ …. నిషి. పెయింటింగ్ కూడా సరిగ్గా సరిపోయింది కదూ కవితకి .

 • Dr.Ismail says:

  (ఇస్మాయిల్ /వాన వచ్చిన రాత్రి/ ని గుర్తుకు చేసారు)
  …వాన లో ముంచి తేల్చారుగా!
  తడవడం అయ్యింది…ఆరబెట్టుకోవడమే మిగిలింది!

 • మణి వడ్లమాని says:

  అందమైన పదాలు,అందమైన చిత్రం అందమైన కవితా,నిషిగంధ పేరు లాగా కవిత కూడా చక్కటి పరిమళ సౌరభాన్ని వెదజల్లుతోంది.

 • sailajamithra says:

  భావగర్భితం .. ఒక అద్భుతం

 • k siva nageswararao says:

  చాలా చాలా బాగుంది

 • చరసాల ప్రసాద్ గారు, డా. జడా సుబ్బారావు గారు, నారాయణస్వామి గారు, మూర్తి గారు, రాధిక, ప్రసూన, ఇస్మాయిల్ గారు, మణి వడ్లమాని గారు, శైలజామిత్ర గారు, మరియు శివ నాగేశ్వరరావు గారు — అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

  :)

 • మమత గారూ, మీ పెయింటింగ్ కవితకి ఎంతో ప్రత్యేకతని తెచ్చిపెట్టింది.. థాంక్యూ సో మచ్!!

 • N Venugopal says:

  నిషిగంధ గారూ,

  మంచి కవిత్వ లక్షణమైన పొరలు పొరలుగా భిన్నమైన తాత్వికత అర్థాలను చెపుతూ, నిర్దిష్టమైన, ప్రత్యేకమైన అనుభూతులను అమూర్తమైన, సాధారణమైన తలాలకు తీసుకువెళ్తూ చాల చాల బాగుంది. కృతజ్ఞతలు. అభినందనలు.

  తా.క. మీరేమీ అనుకోకపోతే, మీ కలం పేరు ని’షి’గంధ అని ఎందుకు పెట్టుకున్నారు, అది నిశిగంధ కదా? క్షమించాలి.

  • ధన్యవాదాలు వేణుగోపాల్ గారు.

   అయ్యో అనుకోవడానికి ఏమీ లేదండీ. కలంపేరు మీద ఇదే ఫిర్యాదు ఇతర స్నేహితుల నించి కూడా వచ్చింది. :)
   ఈ పేరుకి మూలం మరాఠీ కాబట్టి అదే ఉచ్ఛారణలో ఉన్నదీ, అలానే నాకు పరిచయమైనదీ, ఇష్టపడినదీ నిషిగంధ నే! అందుకే మార్చాలనిపించదు.

 • nmraobandi says:

  నిషిగంధ :

  like thy name, a class of your own
  prolific poetry fresh and so clean
  every read (always) gives me the feel of evergreen
  hope this four liner gives you a bigger grin,come the light of the dawn …
  (just fun…)

  just beguiling as always …
  regards …

 • Naresh Nunna says:

  దేనికదే కవిత్వాన్ని పరిమళంలా వెదజల్లుతోన్న కొన్ని ఖండికల్ని ఆర్టిస్టిక్ గా అల్లిన పూదండలాంటి ఈ కవిత aura నుంచి బైటపడ్డాక, పాఠకుడి plane నుంచి తలవిదుల్చుకొని మామూలు స్థితికి దిగివచ్చాక, రోషమో, ఉక్రోషమో పొడుచుకొచ్చింది లోపల.
  కారణం- ఈ వాక్యాల gender (అచ్చు తప్పు కాదు- genre అని చదువుకోవద్దు)!
  కవితల్లో ఆడ/ మగ ఉంటాయని నా బోటి సగటు మగ పాఠకుడికి కొన్ని అంచనాలు ఉంటాయి. వస్తు- రూపాలకి సంబంధించి వేటి హద్దుల్లో అవి ఉండకుండా కనిపించని కంచెలే కదా అని అటుదిటు దూకేస్తే అస్తవ్యస్తమే. మగ కవితలు అటుదూకి స్త్రీసానుకూల, ఫెమినిస్టు సంఘీభావ కవిత్వాలుగా భుజకీర్తులందుకోవడం నాకు bone of contention కావడం లేదు గానీ, ఈ కవిత లాగా ఎత్తైన, విశాలమైన మగ domains లోకి చొరబడటం కంటగింపుగా ఉంది.
  వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?
  ఏ మగకవితలో ఉండవలసిన ఈ పాదం ఈ కవితలో కొరడా అంచులా తాకుతుంది. అన్వేషించేది/ అన్వేషించవలసింది- అలౌకిక, అగోచర జ్ఞానదాహంతో అతలాకుతలమయ్యే.. అస్తిత్వవేదనతో అల్లకల్లోలమయ్యే… సంతప్తాంతరంగంతో సతమతమయ్యే…. పురుషుడే గానీ, వంటింటి కుందేలు వంటి స్త్రీ కాదు. ఇది క్రీ.శ. 2014 యే అయినా, 1914 లేదా 1814 …. కాకపోయినా, ఎన్ని ఫెమినిస్టు ఉద్యమాల దన్ను ఉన్నా, రోదసీలోకి కూడా ఆమె దూసుకుపోతున్నా… స్త్రీ ప్రపంచం పూర్తిగా ఐంద్రియికం. పచ్చి భౌతికమైన నేల విడిచి వెదుకులాటల సాముచేయడం ఆమెకి స్వాభావికం కాదు. మగ territoriesలోకి అడుగుపెట్టే దుస్సాహసానికి ఆమె ఒడిగట్టకూడదు.
  పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలా? అక్కడ చిమ్మచీకటి కమ్ముకొని ఉంటే వెల్తురున్న చోట వెదకాలా? ఈ తేలని సందిగ్ధలో, పూర్తిగా పురుషసంబంధి అయిన పూర్వోత్తర మీమాంసలో ఒకపక్క మల్లగుల్లాలు పడుతుంటే; ఝాముల మలుపుల రాత్రి దారుల్లో తప్పిపోక ముందే ఒక్కత్తే ఒంటరిగా వెదుకులాడుతూ- వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!? అని కొత్త ప్రశ్నలు రేపడం… నిషిగంధ చేస్తున్న చొరబాటుగా, దురాక్రమణగా తోస్తోంది.
  సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని ఆశించడం, ఖాళీగా వెనక్కి తీసుకునేంత వరకీ చీకట్లోకి చేతుల్ని చాచీ చాచీ ఎదురుచూడ్డం… అన్నీ తెంపరి మగ లక్షణాలే తప్ప ఒద్దికైనది ఒక్కటైనాలేదు.
  అసలు జండర్ జాగిలాన్నై కవితని ఆడ- మగ బేధాలు ఎంచడం ఎందుకు? అసలు నిషిగంధనే ‘మగ’ అని సరిపెట్టుకుంటే పోలా? పోతుంది గానీ, ఈ కవిత అందుకు అవకాశం ఇవ్వలేదు.
  జలతారు తెరమాటున స్త్రీమూర్తి నారింజ silhouetteలా చలిస్తున్నట్టు ఈ కవిత చాటున ఓ స్త్రీగొంతుక ప్రతీక మల్లే తారాడి, ఇది మగ కవిత అని సరిపుచ్చుకోడానికి వీల్లేకుండా చేసింది.
  నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
  వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
  వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి….. అని మగకవితలో ఉండే అవకాశమే లేదు.
  జెండర్ వివక్షకి సంబంధించిన పేచీలు, ఫిర్యాదులు ఉన్న కవిత అయితే, తగవులు తీరి, లేదా సమస్యలు పాతబడిపోయి, లేదా అలవాటైపోయి ‘కవిత for కవిత sake’ గా మిగిలిపోయి, అవసరమైనప్పుడు నిరపాయకరమైన blackmailing చేసుకునే సౌలభ్యమన్నా ఉండేది. నిక్షేప రేఖ చెదిరితే గొల్లుమనో, సుడో- సుఖాల పడవ పట్టుతప్పి బెసికితే గొలపెట్టే కవిత అయినట్టయితే- మర్చిపోయాననుకున్న నవ్వులు…. మామూలైపోయానుకున్న బెంగలు… వణికించిన దిగుళ్లు ఉండనే ఉండవు.
  అందుకే రోషం…. ఉక్రోషం….!

 • “నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
  వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
  వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
  వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?” అని చీకట్లో వానలో తడిసి… ముద్దవుతుంటే.. ఆ వెంటనే “సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని” చీకట్లో వెనక్కి తీసుకున్న చేతుల్లోని ఖాళీలోకి దిగులు మేఘంలా వాలిపోయానా… అనిపించింది ఈ కవిత చదువుతుంటే.
  ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
  కొన్ని రాత్రిళ్ళు రాకపోయినా ఫర్వాలేదు… కానీ ఈ కవిత్వాన్ని తెచ్చిన ఈ రాత్రి మాత్రం ఎంతో బాగుంది.

 • K.Sasidhar says:

  మీ అక్షరాలే మా చుట్టూ వలయాలై తిరుగుతున్నాయి … నాలోంచి తొణికిపోయిన పలు నేనులు.. అద్బుతం ………

 • నిద్రలేచి ఇలా అంతర్జాల కిటికీ తెరవగానే
  బయట రాల్తున్న చినుకులు
  లోపలికి చొచ్చుకుస్తున్న చల్లని గాలి

  కొన్ని అక్షరాలు
  కొన్ని జ్ఞాపకాలను తెరిచే కిటికీ
  **
  చాలాసార్లు నాకూ అన్పించింది
  కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!? .. అని

  …..అలా రాకపోతే ఈ అక్షరాల వాన ఎలా కురుస్తుందంటారు ?

  రావల్సిందే ! తడవాల్సిందే !

 • mnrao gaaru, నరేష్ గారు, శ్రీధర్ బాబు గారు, శశిధర్ గారు, జాన్ గారు — హృదయపూర్వక ధన్యవాదాలు..

  నరేష్ గారు, థాంక్యూ సో మచ్! కానీ, మీ ఆరోపణలు మాత్రం చాలా అమానుషంగా ఉన్నాయండీ! :) :)
  అయినా ఎదురుచూడటం… వెదుక్కోవడం లాంటివన్నీ కేవలం తెంపరి/మగ లక్షణాల కోవలోకి ఎప్పుడు వచ్చిచేరాయ్ అంటారూ?
  నిర్వేదమో, నిర్లిప్తతతో, అన్నీ అర్ధమైపోయాక మిగిలిన తాత్వికతో… మనల్ని ఆవరించినప్పుడు వెలువడే భావాల్లో ఆడా మగా అన్న వివక్షత కనిపించదేమోనండి.. ఐ మీన్, కనిపించకూడదు కదా!?

 • కవిత చాలా బావుంది. ప్రారంభమే పాఠకుడిని ఒక ప్లేన్ లోకి తీసుకుపోతోంది సుతారంగా, లోతుగా. మిగిలిన కవిత ఆ ప్లేన్ లో స్థిరంగా నిలబెడుతుంది. ఒక అద్భుతమైన కవిత చదివినప్పుడల్లా ‘ఎలా రాస్తారు ఇలా’ అని ఆశ్చర్యం కలుగుతుంది, ఇప్పుడూ అదే ఆశ్చర్యం.

 • ప్రసాద్ గారూ, ఆలశ్యంగా ప్రతిస్పందిస్తున్నాను… సారీ!
  మీ ప్రశంస కి హృదయపూర్వక ధన్యవాదాలు…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)