నేను కూడ ఒక ‘నాటు’ మనిషినే!

AmericaAnubhavalu

మనం ఎవ్వరూ కని, విని, ఎరగని కైలాస్ సత్యార్థి కి నోబెల్ శాంతి బహుమానం వచ్చిందని తెలియగానే “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” అన్న గీతా ప్రబోధం గుర్తుకి వచ్చింది.

నిష్కామ కర్మ గొప్పతనం అది. ఏ ఫలితం ఆశించకుండా ఎవరి పని వారు చేసుకుని పోతూ ఉండడం. కాయ పండగానే అదే రాలుతుంది.

వంగూరి సంస్థ వారు గత నాలుగు దశాబ్దాలబట్టీ చేస్తూన్న పని కూడ ఇలాంటిదే. వారు చెయ్యాలనుకున్న పనిని, విధాయకంగా, చేసుకుపోతున్నారు. దీని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకా కనిపిస్తుంది.

. విత్తు నాటిన వారు పండు తినే అవకాశం తక్కువ – అయినా కొందరు నాటుకు పోతూ ఉంటారు. వీళ్లని “నాటు మనుష్యులు” అందాం.

నేను కూడ ఒక నాటు మనిషినే! ఒక ఫలితాన్ని కాని, ఒక పురస్కారాన్ని కాని ఆశించి రాయడం మొదలెట్టలేదు. ఈ పురస్కారం నాకు చెయ్యాలని నేను ఎవ్వరినీ అడగలేదు. అయినా సరే ఈ పురస్కారానికి నన్ను కూడా ఎన్నుకున్నందుకు వంగూరి సంస్థ అధినేతలకు నా కృతజ్ఞతలు.

నేను ఇండియాలో చదువుకునే రోజులలో “కథ కాని కథ” అనే శీర్షిక ఆంధ్రపత్రిక నడిపింది. నా మొట్టమొదటి కథ, పోస్టు కార్డు మీద రాసి, పంపేను. వారు 5 రూపాయలు బహుమానం ఇచ్చేరు. తరువాత దీక్షతో రచనా వ్యాసంగం మొదలు పెట్టినది అమెరికా వచ్చేకనే – నిక్కచ్చిగా చెప్పాలంటే 1967 లో. అప్పటి నుండి ఇప్పటి వరకు, తరచుగా ఏదో ఒకటి అలా ప్రచురిస్తూనే ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 10 పుస్తకాలు అచ్చయాయి, మరో 6 పుస్తకాలు  నా కంప్యూటరులో ఉన్నాయి – ప్రకాశకుల కోసం ఎదురు చూస్తూ. లెక్కపెట్టలేదు కాని కథలు కనీసం 50 ఉండి ఉండొచ్చు. వ్యాసాలు మరొక 50 ఉంటాయి. టూకీగా ఇదీ నేను చేసిన పని.

ఎందుకు రాస్తున్నాను? ఏ విషయాల మీద రాస్తున్నాను? ఈ విషయాలమీదే ఎందుకు రాస్తున్నాను? ఈ పని వెనక అంతర్లీనంగా ఏదైనా ఒక సూత్రం ఉందా? – అని పలువురు అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానాలు వెతుకుదాం.

 

  1. తెలుగులో ఎందుకు రాస్తున్నానా?

 

సైన్సుని తెలుగులో – నలుగురుకీ అందుబాటులో ఉండేలా – చెప్పాలనే కోరిక నాలో చిన్నప్పటినుండీ ఉంది. నేను ఇంగ్లీషు అర్థం అవుతుంది . ఇంగ్లీషులో రాయగలను కూడా. కానీ, తెలుగులో చదివినా, రాసినా ఆనందంగా ఉంటుంది. సైన్సుని తెలుగులో ఆస్వాదించి ఆనందించేవారు ఎవరైనా ఉంటే, వారి కోసం రాస్తున్నాను. అలాంటివారు ఎవ్వరూ లేకపోతే నా ఆనందం కోసం రాసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే చదవకండి – కాని, నన్ను రాయొద్దని అడగకండి.

 

“సైన్సుని తెలుగులో ఎలా రాస్తారండీ? మనకి వొకేబ్యులరీ లేదండీ,” – ఒకరు.

 

“సైన్సుని తెలుగులో బోధించడం మొదలుపెడితే ఇప్పటికే వెనకబడి ఉన్న మనం ఇంకా వెనకపడి పోతాం అండీ!” – మరొకరు

 

తెలుగులో “వొకేబ్యులరీ” లేకేమి? కావలసినంత ఉంది. ఆర్వీయస్ సుందరం గారు ఒక సారి లెక్క వేసేరు. షేక్స్‌పియర్ నాటకాలలో వాడిన ఏకైక ఇంగ్లీషు మాటల కంటె తిక్కన తెలుగు భారతంలో వాడిన ఏకైక తెలుగు మాటలు ఎక్కువట!

 

సైన్సుని తెలుగులో బోధించాలని అనటం లేదు. ఇంగ్లీషుని తరిమికొట్టాలనీ అనటం లేదు. తెలుగులో కూడ రాయమంటున్నాను. రాసినవి చదవమంటున్నాను. తెలుగులో మాట్లాడమంటున్నాను. ఇది తప్పయితే క్షమించండి.

 

వాడుక లేక తెలుగు మాటలు వాడితనం పోయి వాడిపోతున్నాయి. తుప్పు పట్టి మూల పడిపోతున్నాయి. అవసరం అయినప్పుడు కొత్త మాటలు సృష్టించుకునే ధైర్యం మనలో చచ్చిపోయింది. నా గమ్యం ఒక్కటే. “సైన్సు ని తెలుగులో రాయకలం” అని రాసి చూపించడం. అందుకని తెలుగులో రాయడం మొదలు పెట్టేను.

 

  1. తెలుగులో ఏమిటి రాస్తున్నానా?

 

మొదట్లో, సైన్సు విషయాలని నలుగురికీ అర్థం అయే రీతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నమే అమెరికాలో నా మొట్టమొదటి తెలుగు రచన. దాని పేరు “కంప్యూటర్లు.” దానిని 1967 లో రాసేను. నా అదృష్టం బాగుండి శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ఆ రోజులలోనే తెలుగు భాషా పత్రిక స్థాపించేరు. అందులో నా పుస్తకం ధారావాహికగా మూడేళ్ల పాటు ప్రచురించేరు. దానికి అనూహ్యంగా స్పందన వచ్చింది. అప్పుడు తెలుగులో ఇంకా రాయాలనే కోరిక ఇనుమడించింది.

 

ఇలా వచ్చిన స్పూర్తితో నాలుగైదు “సైన్సు” కథలు, వ్యాసాలు కూడ ప్రచురించేను – తెలుగు భాషా పత్రికలోనూ, ఆంధ్ర పత్రికలోను, భారతిలోనూ. నా “బ్రహ్మాండం బద్దలయింది” కథకి  తెలుగు భాషా పత్రిక వారు ప్రోత్సాహక బహుమతి కూడ ఇచ్చేరు. ఇదే కథని సాహిత్య అకాడమీ వారు 2013 లో ప్రచురించిన “తెలుగులో సైన్సు ఫిక్షన్” అనే కథల సంపుటంలో వేసుకున్నారు. నాకు 1500 రూపాయలు పారితోషికం కూడ ఇచ్చేరు. నలభయ్ ఏళ్ల పాటు పాట్లు పడ్డ తరువాత “తెలుగులో సైన్సు ఫిక్షన్” అనే ప్రక్రియకి గుర్తింపు వచ్చింది కదా అని సంతోషించేను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.

 

తరువాత – 1970-80 దశకంలో జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టుకొచ్చిందో వివరిస్తూ “జీవరహశ్యం” అనే పుస్తకం, ఇంటింటా, వంటింటా కనబడే పదార్థాల వెనక ఉండే రసాయన శాస్త్రం చెబుతూ “రసగంధాయరసాయనం” అనే పుస్తకం ప్రచురించేను – నా సొంత ఖర్చులతో! ఈ రెండూ డాక్టర్ గవరసాన సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగేయి.

 

ఆ దశకపు చివరి రోజులలోనే తానా ప్రారంభం అయింది. అప్పుటి నుండి వారు  సభ జరిపినప్పుడల్లా  కథో, వ్యాసమో కావాలని అడిగేవారు. ఆ రోజుల్లో రాయగలిగే వాళ్లు తక్కువ. అందుకని నాకు తప్పకుండా ఆహ్వానం వచ్చేది. అప్పుడు ఎక్కువగా వ్యాసాలు రాసేను. ఈ వ్యాసాలు తెలుగు భాషని, లిపినీ సైన్సు రచనకి అనుకూలంగా ఎలా  మలచాలి అన్న అంశం మీద ఉండేవి. అప్పుడప్పుడు తెలుగు సంస్కృతికి సంబంధించినవి కూడ రాసేవాడిని.

 

నేను రాసినంత జోరుగా అమెరికాలో ప్రచురణకి అవకాశాలు దొరికేవి కావు. నా రాతలు ఇండియా పంపిస్తే ఆ పత్రికల వారు వేసుకున్నారో, నిరాకరించేరో చెప్పరు కదా. పైపెచ్చు తట్టెడు తపాలా ఖర్చులు. కనుక ఏమిటి రాయాలో, ఎక్కడికి పంపాలో తెలియని అంధకార యుగంలో పడ్డాను. శ్రీ కిడాంబి రఘునాథ్ గారి తెలుగు జ్యోతిలో అవకాశం దొరికినప్పుడల్లా ఇరికేవాడిని.

 

ఈ పరిస్థితులలో, 1987లో అనుకుంటా, శ్రీ చందూరి మురళి రచన అని ఒక పత్రిక స్థాపించి, జీవిత చందా కట్టమని అడిగేరు. “కడతాను కాని సైన్సుకి ఒకటో, రెండో పేజీలు కేటాయిస్తారా?” అని అడిగేను. “మీరు సైన్సుని “సైన్సు”లా  రాస్తే ఎవ్వరూ చదవరు. కథ రూపంలో రాయండి, వేసుకుంటాను” అన్నారు. అప్పుడు సైన్సు ప్రాతిపదిక మీద చాల కథలు రాసేను. కల్పనలు కాదు. పక్కా సిద్ధాంత పరంగా పటిష్ఠమైన సైన్సు. ఎక్కువగా వైద్యానికి సంబంధించిన కథలు. ఈ కథలు చదివి నేను వైద్యుడననే భ్రమతో పాఠకులు  ఉత్తరాలు రాసేరని రచన శాయి గారు చెప్పేరు. తెలుగు కథల ద్వారా సైన్సు ప్రచారం చేసినందుకు మా యూనివర్శిటీ వారు నాకు “పబ్లిక్ సర్విస్ ఎవార్డ్”తో పాటు 250 డాలర్లు బహుమానం కూడ ఇచ్చేరు.

 

మరొక పక్కనుండి, 1980 దశకంలో, అంతర్జాలం అందుబాటులోకి రావడంతో  కంప్యూటర్ తెర మీద తెలుగు అక్షరాల కోసం తాపత్రయం మొదలైంది. ఈ కొత్త మాధ్యమంలో  చెయ్యి నలగాలంటే ఏదో ఒకటి రాస్తూ ఉండాలి కదా. రాయడానికి వెంటనే వస్తువు దొరకొద్దూ? అందుకని కొత్తగా వస్తూన్న ఖతులతో (ఫాంట్లతో) అనుభవం సంపాదిద్దామని నా జీవిత చరిత్ర రాసుకోవడం మొదలు పెట్టేను. అదొక పుస్తకం అంత పొడుగు అయింది. ఆ పుస్తకానికి “అమెరికా అనుభవాలు” అని పేరు పెట్టి, ఎమెస్కో వారి ద్వారా ప్రచురించేను. బాగా ఆదరణ పొందింది.

 

కంప్యూటరు మాధ్యమంతో తెలుగు రాయడానికి వెసులుబాటు దొరికిన తరువాత నా కథా రచన కొంత ఊపు అందుకొందనే చెప్పాలి. కంప్యూటర్ మీద కథలు రాసేటప్పుడు రకరకాల వాక్య నిర్మాణాలతో ప్రయోగాలు చేసి చూసుకోవడం తేలిక అయింది. అదే విధంగా అనువాకాల క్రమాన్ని అమర్చడం కూడ తేలిక అయింది. ఈ తరుణంలో రాసిన  కథలు కొన్నింటిని “కించిత్ భోగో భవిష్యతి” అన్న పేరుతో వంగూరి సంస్థ వారు ప్రచురించేరు. తరువాత కొన్ని కథలని “మహాయానం” అన్న పేరుతో “ఇ-పుస్తకం” గా కినిగె సంస్థ వారు వెలువరించేరు. ఈ రెండవ సంకలనంలో ఉన్న “మరోలోకం” అన్న కథకి వంగూరి సంస్థ వారు $116/ బహుమానం ఇచ్చేరు.

 

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను రాసేవాటిని మెచ్చుకునేవారు తక్కువే.

 

“వేమూరి రాసే కథలలో సైన్సు మన సంపాదకులకి, విమర్శకులకి, సమీక్షకులకి అర్థం కాదు. అందుకని వేమూరికి దక్కవలసిన గుర్తింపు దక్కడం లేదు,” అని కవన శర్మ ఒక చోట రాసేరు.

 

“ఈ మధ్య మీ కథ చదివేను. విలక్షణంగా ఉంది. సైన్సు అర్థం కాలేదు” అని మధురాంతకం రాజారాం అన్నారు.

 

నా “కించిత్‌భోగో భవిష్యతి” కి అట్ట మీద బొమ్మ వేసిన బాపు నాకు స్వహస్తంతో ఉత్తరం రాస్తూ: “పంటికింద పోకచెక్క”  కథలో మీరు వర్ణించిన ఇల్లు మా ఇంటిని గుర్తుకి తెచ్చింది,” అని రాసేరు. కథ బాగుందో బాగులేదో చెప్పలేదు.

 

“ఆడవారి పాత్రలు ఉన్న కథలు కూడా రాయండి,” అని పెమ్మరాజు గారు అన్నారు.

 

“సైన్సు లేని కథలు రాయండి” అని మరికొందరు అన్నారు.

 

“అమెరికా జీవితాన్ని ప్రతిబింబించే కథలు రాయరాదూ?” అన్నవాళ్లూ ఉన్నారు.

 

ఈ రకం ఆక్షేపణలని ఎదుర్కోవాలని కొన్ని కథలు రాసేను: పెళ్లికూతురు మనస్సుకి క్షోభ కలిగించేరంటూ మగ పెళ్ళివారిని కోర్టుకి ఈడ్చిన వయినం “లోలకం” లో కథా వస్తువు. రచన శాయి గారు ఈ కథని “కథా పీఠం” లో వేసుకుని వెయ్యినూటపదహార్లు ఇచ్చేరు.

 

డిట్రాయిట్ లో నేను చదువుకునే రోజుల నేపథ్యంలో, “ఎమిలీ” అనే కథ రాసేను. ఇందులో ముఖ్యమైన పాత్రలు స్త్రీలే. ఈ కథ చదివి వసంత లక్ష్మి గారు “ఓ. హెన్రీ కథలా ఉంది” అని కితాబు ఇచ్చి వారి పత్రికలో వేసుకున్నారు.

 

“అభయారణ్యంలో ఏంబర్” మా యూనివర్సిటీ నేపథ్యంలో రాసిన కథ. ఇందులో ఒక భారతీయుడు ఒక అమెరికన్ అమ్మాయితో అమెజాన్ అరణ్యాలలో తిరగడానికని వెళ్లి తప్పడిపోతారు. అయిదు రోజులు నిద్రాహారాలు లేకుండా ఇద్దరూ ఒకరికొకరు ఆసరాగా బతికి బయటపడతారు. ఈ అయిదురోజుల పరిచయం అనురాగంగా మారుతుంది. “ఈ కథని చాలా సంయమనంతో నడిపేరు” అని ఈమాట సంపాదకుడు కె. వి. యస్ రామారావు కితాబు ఇచ్చి వారి పత్రికలో వేసుకున్నారు.

 

నేను రాసిన “భయం” కథ చదిన వారందరు, వంగూరి చిట్టెన్‌రాజు తో సహా, “అయ్యా, మీరు నిజంగా అలాస్కా వెళ్లేరా?” అని అడిగేరు.

 

ఎంత బాగా వంట చెయ్యడం వచ్చినవారైనా ఎప్పుడూ బాగా వండలేకపోవచ్చు. తినేవాళ్లకి కూడ ఒక రోజు రుచించిన వంటకం మరొక రోజు రుచించకపోవచ్చు. కథల విషయం కూడ అంతే. రాసిన కథలు అన్నీ బాగా రావు. ఒకనాడు నచ్చని కథ మరొకనాడు నచ్చవచ్చు. ఒకరికి నచ్చిన కథ మరొకరికి నచ్చదు. కనుక ఒకరి మెప్పు పొందాలని కాకుండా నాకు నచ్చిన కథలు నేను రాసుకుంటాను. కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన!

 

vemuriratease-వేమూరి వేంకటేశ్వరరావు

 

Download PDF

2 Comments

  • వంగూరి చిట్టెన్ రాజు says:

    విన్నప్పుడు ఎంత బావుందో. చదివినప్పుడు కూడా అంత బాగానూ, నిజాయితీ గానూ ఉంది.

  • Mythili Abbaraju says:

    మీ ‘ కించిత్ భోగే ‘ లో కథలు నాకు ఇష్టం. ఒకటికి రెండుసార్లు చదివాను. మంచి అల్లిక, భాష, వస్తువు అన్నిట్లో. తాయారమ్మ గారి బాసిల్లై కథ , కత్తిపోటు తిన్నవాడి కథ – చాలా గుర్తుంటాయి.

    మీ అమెరికా అనుభవాల పుస్తకం కూడా చదివాను- Bombay విమానాశ్రయం లో నల్ల ముఖాలు చూసి పిల్లలు బెదిరిపోయరని రాసినది చదివి నోచ్చుకున్నాను.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)