సూర్యుని పండుగే క్రిస్టమస్!

bull sacrifice of Mitras

శ్రీశ్రీ రాసుకున్న ఓ సంగతి అస్పష్టంగా గుర్తొస్తోంది…

ఆయన ఓ సినిమా పాటలో ‘బతుకు బరువు’ అని కాబోలు, రాశారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నటుడు చదలవాడ అక్కడే ఉన్నారు. ఆయన పూర్తి పేరు చదలవాడ కుటుంబరావు. పాత సినిమాలు చూసేవారికి తెలిసిన పేరే. బతుకు బరువు అనే మాట వినగానే ఆయన భారంగా నిట్టూర్చి, ‘బతుకు మా సెడ్డ బరువు’ అంటే ఇంకా బాగుంటుం దన్నారట. ఆ మాట శ్రీశ్రీకి నచ్చి అలాగే ఉపయోగించారు. దీనికి ఓ బరువైన ముగింపు కూడా ఉంది. ఆ మరునాడే చదలవాడ కన్నుమూశారు!

పాపం, ఆ సవరణ సూచించిన సమయంలో చదలవాడ గుండెల్లో ఎంత బతుకు భారం మోస్తున్నారో! మరునాడే ఆయన మరణానికీ, ఆ సవరణకూ ఎలాంటి ముడి ఉందో తెలియదు. తెలిసే అవకాశంలేదు.

నిజమే, బతుకు మా సెడ్డ బరువే. ఇంతకీ మనిషి చరిత్రలో బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పుడు మారిందని అడిగితే, కచ్చితంగా చెప్పడం కష్టమే. లేక, మొదటినుంచీ అంతేనా?! ప్రకృతిశక్తులతో పోరాడుతున్న సమయంలోనూ బతుకు మా సెడ్డ బరువుగా అనిపించే ఉంటుంది. అయితే, అప్పుడు మనిషి ప్రకృతిశక్తులతో సంఘటితంగా పోరాడి ఉంటాడు. మనిషికి మనిషి తోడన్న భరోసా బతుకు భారాన్ని ఎంతో కొంత తగ్గించి ఉంటుంది. కానీ మనిషి మనిషితోనే పోరాడవలసిన దశ వచ్చేసరికి ఆ భరోసా పలచబారి బతుకు మా సెడ్డ భారంగా మారిపోయిందా?!

మొత్తానికి ఇహలోకం నరకమై, బతుకు భారమైపోయింది. కనుక కాసింత సుఖ సంతోషాలనిచ్చే స్వర్గం కోసం పాకులాడక తప్పదు. అంతవరకు ప్రకృతిశక్తులపై దేవతారోపణ చేసి ప్రసన్నత కోసం ప్రార్థించి ఉండచ్చు. కానీ తోటి మనిషే క్రౌర్యం మూర్తీభవించి కాలయముడు అయినప్పుడు ఒక చల్లని దేవినో, కరుణామయుడైన ఓ దేవుణ్ణో మానవరూపమిచ్చి సృష్టించుకోవడం అనివార్యమవుతుంది.

అసలు ఈ బతుకనే మా సెడ్డ బరువే లేకపోతే ఎలా ఉంటుంది?! అప్పుడు కావలసింది జన్మరాహిత్యం, లేదా మోక్షం. పోనీలే, ఈ జన్మలో సుఖం లేకపోతే వచ్చే జన్మలోనైనా ఉండకపోతుందా? దాంతో పునర్జన్మ మీద ఆశ…

ఇది చదివి నేనేదో ఆస్తిక-నాస్తిక చర్చలోకి వెడుతున్నానని దయచేసి అనుకోవద్దు. చరిత్రలోకి వెడితే, బతుకు మా సెడ్డ బరువుగా ఎప్పటినుంచీ అయిందో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని నా తాపత్రయం.

   ***

ఈ బతుకు బరువవడం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో విధంగా అయుండచ్చు. మనం రోమన్ సామ్రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం కనుక అప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

క్రీస్తుశకం మొదటి రెండు శతాబ్దాలకు వచ్చేసరికి రోమన్ సామ్రాజ్యంలో మనిషి ఆత్మ సంక్షుభితం అయిపోయిందనీ, అంతులేని బాధా, నిస్పృహలలోకి జారిపోయిందనీ హెచ్.జి. వెల్స్ అంటారు. నిర్బంధమూ, క్రౌర్యమూ స్వైరవిహారం చేస్తూవచ్చాయి. గర్వించడానికీ, వైభవప్రదర్శనకూ లోటు లేదు. కానీ గౌరవప్రదమైన జీవితం, ప్రశాంతత, నిలకడైన సుఖసంతోషాలు లోపించాయి. పేదలు తిరస్కృతికి, అవమానానికి, దుర్భరమైన పీడనకు గురయ్యేవారు. అలాగని సంపన్నులు సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు. నిరంతర అభద్రతలోనూ, ఎంతకూ తీరని కోరికల దాహంతోనూ అలమటించేవారు. రోమ్ నగరాలలో అర్థచంద్రాకారంలో రంగస్థలాలు ఉండేవి. అవే పౌరజీవితానికి కేంద్రంగానూ, కీలకంగానూ ఉండేవి. అక్కడ మనుషులకు, పశువులకు ప్రాణాంతకమైన పోరు జరుగుతూ ఉండేది. ఆ పోరులో వారు/అవి పడే చిత్రహింసలోనూ, అప్పుడు మడుగులు కట్టే ఎర్రని రక్తంలోనూ, పోరాడి పోరాడి నేల కొరిగే ఆ దురదృష్ట జీవుల్లోనూ వికృతానందాన్ని వెతుక్కునేవారు. కానీ అంతరాంతరాలలో అందరిలోనూ ఒక అశాంతి గూడుకట్టుకుని ఉండేది. అది మతరూపంలో వ్యక్తమవుతూ ఉండేది.

ప్రతి మతంలోనూ క్రమంగా ఆత్మ గురించిన భావన ఏర్పడుతూ వచ్చింది. మరోపక్క తర్కానికి అందని, చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో బహుదేవతారాధన సాగుతూనే ఉంది. మతంలో ఓదార్పును వెతుక్కునే ప్రయత్నంలో ఈజిప్షియన్లలో అమరత్వంపై కోరిక బలంగా వ్యక్త మవడం ప్రారంభించింది. అంతవరకు ఏ మతంలోనూ లేని అమరత్వ భావనను ప్రపంచానికి పరిచయం చేసింది ఈజిప్షియన్ మతమేనని వెల్స్ అంటారు. ఈజిప్టు విదేశీ దురాక్రమణలకు గురవుతూ, ఈజిప్టు దేవతలు రాజకీయ ప్రాముఖ్యాన్ని కోల్పోతున్న కొద్దీ, అమరత్వంలో ఓదార్పును వెతుక్కోవడం ఈజిప్షియన్లలో బలీయమవుతూ వచ్చిందని ఆయన అంటారు.

విదేశీ దురాక్రమణలు మన దేశం మీదా జరిగాయి కనుక, ఒకవైపు బహుదేవతారాధన, ఇంకోవైపు ఆత్మ, అమరత్వం గురించిన ఆలోచనలతో ఈజిప్షియన్ అనుభవం మన దగ్గరా ప్రతిబింబించి ఉండచ్చు. ఈ సందర్భంలో వెల్స్ మన దేశం గురించి ప్రస్తావిస్తూ, బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచే ఈ దేశంలోని ఆడా, మగా జీవితానందాలను త్యాగం చేసేవారనీ, వివాహబంధాన్ని, సంపదను నిరసించేవారనీ, ఇహ లోకపు ఒత్తిడులు, సమస్యలనుంచి తప్పించుకుంటూ ఆధ్యాత్మిక శక్తుల కోసం పాకులాడేవారనీ, ఆ ప్రయత్నంలో శరీరాన్ని హింసించుకునే వారనీ, ఏకాంత జీవితానికి మొగ్గు చూపేవారనీ ఆయన అంటారు. గ్రీకులలో కూడా ఇలాంటి ఆత్మహింసా పద్ధతులనే అనుసరించే పంథాలు ఉండేవి. ఆ పంథాలవారు శరీర అవయవాలను నరుక్కునే వరకూ వెళ్ళేవారు. మన దగ్గర కూడా మధ్యయుగాలలో వీరశైవం మొదలైన పంథాలలో ఇటువంటి పద్ధతులు ప్రబలంగా ఉండేవి. జుడియా, అలెగ్జాండ్రియాలలోని యూదు తెగల్లో కూడా ఇహలోక జీవితం మీద తీవ్ర వైముఖ్యం ఉండేది. క్రీస్తు శకం తొలి రెండు శతాబ్దాలలో ఈ ధోరణి ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రతి ఒకరూ మోక్షం గురించిన అన్వేషణలో తలమునకలయ్యేవారు. ఆ కాలపు పరిస్థితుల వల్ల కలిగిన నిరాశా, నిస్పృహలే అందుకు కారణమని వెల్స్ అంటారు. అంతకు ముందు దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన ఒక సమష్టి మతవ్యవస్థ ఉండేది. దేవాలయం పట్ల, పూజారి పట్ల జనంలో అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉండేవి. నియమనిబంధనలపై, మతపరమైన తంతుపై పట్టింపు ఉండేది. ఈ కాలానికి వచ్చేసరికి అవి అంతరించాయి. దుర్భరమైన బానిసత్వం. క్రౌర్యం, భయాందోళనలు, ఆత్మన్యూనత, స్వార్థం, అట్టహాసం పడగవిప్పిన నాటి వాతావరణంలో ప్రతి ఒకరూ విరక్తికీ, అభద్రతకూ లోనయ్యేవారు. జీవితం పట్ల నిరాసక్తత, నిస్పృహలలోనే శాంతిని వెతుక్కునే వారు.

ఈజిప్టులో టొలెమీ చక్రవర్తి నిర్మింపజేసిన సెరాపియమ్ లో పీడితులు, తాడితుల కన్నీళ్లు వరదలు కట్టేవి…

   ***

రోమ్ సామ్రాజ్యం విస్తరించిన కొద్దీ ఈ సెరాపిస్-ఐసిస్ ఆరాధనా రూపం పశ్చిమ యూరప్ కు కూడా వ్యాపించింది. సెరాపిస్-ఐసిస్ ఆలయాలు, పూజారి వ్యవస్థ, అమరత్వం గురించిన ఆకాంక్షలు స్కాట్లాండ్, హాలండ్ ల దాకా వెళ్ళాయి. అయితే దీనితో పోటీపడే మతాలూ చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది మిత్రాయిజం. ఇది పర్షియన్ల మతం. సంస్కృతంలో మిత్రు డంటే సూర్యుడని చెప్పుకున్నాం. బ్రాహ్మణులలో సంధ్యావందనం సూర్యుని ఉద్దేశించినదే. సంధ్యావందన మంత్రాలలో మిత్ర శబ్దం వస్తుంది. బ్రాహ్మణులలో, బహుశా క్షత్రియులలో కూడా మిత్రావరుణులు ఋషులుగా ఉన్న గోత్రాలవారు ఉన్నారు. క్షత్రియులలో సూర్యవంశ క్షత్రియులున్న సంగతి తెలిసినదే. పురాచరిత్ర కాలంలో సిరియాను మితానీ అనే తెగవారు పరిపాలించారు. వీరు మిత్ర సంబంధీకులే. ఒకనాటి అమెరికాతో సహా ప్రపంచమంతటా సుర్యారాధన ఉండేది. ఇంకా విశేషమేమిటంటే, డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్టమస్ కు, సుర్యారాధనకు సంబంధం ఉంది. అసలు డిసెంబర్ 25 సూర్యుడికి సంబంధించిన రోజు. సుర్యారాధకులను, అంటే మిత్రమతం వారిని క్రైస్తవులుగా మార్చే ప్రయత్నంలో వారికి ముఖ్యమైన రోజునే క్రిస్టమస్ గా మార్చారు. అంటే క్రైస్తవ మతంలో కూడా తనకు ముందున్న వివిధ ఆరాధనా పద్ధతులను తనలో కలుపుకునే థియోక్రేసియా జరిగిందన్నమాట. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశంలోకి ఇప్పుడు వెళ్ళలేం.

మిత్రమతం సెరాపిస్-ఐసిస్ ఆరాధనలా సంక్లిష్టమైన, అధునాతనమైన (అప్పటికి) ఆరాధనా విధానం కాదు. ఇది జంతుబలుల కాలానికి చెందిన మతం. ఈ మతం వారు ఒక మంచె మీద ఎద్దును ఉంచి డానిని బలి ఇచ్చేవారు. భక్తులు ఆ మంచె కింద నిలబడి ఆ ఎద్దు నుంచి ప్రవహించే రక్తంలో తడిసేవారు. ఈ రక్తం నుంచి కొత్త జీవితం పుట్టుకొస్తుందని నమ్మేవారు.

పై రెండే కాక మరెన్నో ఆరాధనా పంథాలు ఉండేవి. మన దేశంలో ఇప్పటికీ వివిధ కులాలవారికి, లేదా వేర్వేరు సామాజిక స్థాయులకు చెందినవారికి తమవైన ఆరాధనాపద్ధతులు, దేవీదేవతామూర్తులు ఉన్నట్టే, బానిసలతో సహా రోమన్ సామ్రాజ్యంలోని జనాలకూ ఉండేవి. రోమన్ నగరాలు అన్నింటిలోనూ అందరు దేవతలకు లెక్కకు మించిన ఆలయాలు ఉండేవి. అవిగాక రోమన్ల ప్రధానదైవమైన జూపిటర్ ఆలయం తప్పనిసరిగా ఉండేది. మరోవైపు రాజకీయ విధేయతను చాటుకోడానికి మొక్కుబడిగానైనా సీజర్ అలయానికీ వెళ్ళేవారు. అయితే, తమను ఈతిబాధలనుంచి కాపాడగలిగిన దయగల తల్లిగా ఐసిస్ నే నమ్ముకునేవారు.

ఆపైన మరెందరో స్థానిక దేవతలు ఉండేవారు. కొందరు దేవతల రూపాలు చిత్రవిచిత్రంగానూ ఉండేవి. ఉదాహరణకు సెవిల్లే అనే దేవత. ఫొనీషియన్లు కార్తేజ్ నగరంలో చాలాకాలంగా పూజిస్తూ వచ్చిన వీనస్ కు, ఈ దేవతకు సంబంధం ఉంది. మరోవైపు ఒక గుహలోనో, భూగర్భ ఆలయంలోనో మిత్రుని ఆరాధన జరుగుతూనే ఉండేది. ఇందులో సైనికులు, బానిసలు పాల్గొంటూ ఉండేవారు. మరోచోట యూదులు తమ ప్రార్థనామందిరంలో బైబిల్ చదువుకునే వారు. యూదుల దేవుడు అదృశ్యంగా ఉంటాడు. వారు విగ్రహారాధనకు విముఖులు. బహుశా వారు సీజర్ ఆలయానికి వెళ్ళి మొక్కడానికి, అక్కడ జరిగే పూజా తంతులో పాల్గొనడానికి వ్యతిరేకించి ఉంటారు. అలాగే, రోమన్ పాలకులు ఆదరించే ఇతర దేవుళ్ళను కూడా! అది వారికి రాజకీయంగా చిక్కులు తెచ్చిపెట్టే ఉంటుంది.

ఇంతకీ ఈ వివరాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మన దేశంలో ఉన్నట్టే బహురూప ఆస్తికత క్రీస్తుశకానికి ముందూ, ఆ తర్వాత మరికొంతకాలమూ రోమన్ సామ్రాజ్యంలోనూ ఉండేదని చెప్పడానికే. రోమన్ సామ్రాజ్యంలోనే కాదు, దాదాపు ప్రపంచమంతటా ఉండేది. ఈ సందర్భంలోనే మతరంగంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పునూ గుర్తుచేసుకోవాలి. అదేమిటంటే, పైన చెప్పుకున్న వాటిలో అనేకం ఇష్టదేవతారాధనలు. వ్యక్తిగత ముక్తిని లేదా బాధలనుంచి విముక్తిని కోరే ప్రైవేట్ ఆరాధనలు. అంతకు ముందున్న మతరూపం ఇలాంటిది కాదు. అది వ్యక్తిగతం కాక, సామూహికం, సాంఘికం. అది పారలౌకికం-లౌకికం, లేదా మతం- ప్రభుత్వం అన్న విభజన లేని దశ. ఉదాహరణకు నగర దేవతారాధన ప్రధానంగా రాజ్యానికి సంబంధించిన తంతు. ఆ తర్వాతే వ్యక్తిగతమైన తంతు. అప్పట్లో బలులు, పూజలు సామూహిక, బహిరంగ చర్యలే కానీ ప్రైవేట్ చర్యలు కావు. పైగా అవి సమష్టి భౌతిక అవసరాల కోసం జరిపే చర్యలు.

ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేసుకోవాలి. మతమూ, రాజకీయమూ ఇలా గాఢంగా పెనవేసుకున్న స్థితిలో రెండింటినీ విడదీయడానికి; అంటే రాజకీయం నుంచి మతాన్ని తప్పించడానికి మొదట ప్రయత్నించింది గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు. విశేషమేమిటంటే, రెండువేల సంవత్సరాల క్రితమే మతాన్నీ, రాజకీయాన్నీ విడదీయాలన్న ఆలోచన జరిగినా, ఇప్పటికీ దాని సాధ్యాసాధ్యాల గురించీ, దాని అవసరం గురించీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం! కనీసం మనదేశానికి పరిమితమై చూసినా ఈ విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత ఏర్పడలేదు. ఇంకోటి గమనించాలి. గ్రీకులు గానీ, రోమన్లు గానీ మతాన్నీ, రాజకీయాన్ని విడదీయాలని అనుకోడానికి కారణం- నాటి బహురూప ఆస్తిక ధోరణులే. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, లేదా రాజ్యం ఏదో ఒక మతం వైపు అతిగా మొగ్గడం కందిరీగల తుట్టను కదపడమే నని వారు గ్రహించి ఉంటారు.

మొత్తానికి మతరంగంలో ఎన్ని మార్పులు జరిగినా అవన్నీ బహురూప ఆస్తికత అన్న చట్రంలోనే! ఆ చట్రం చెక్కు చెదరలేదు. కానీ ముందు ముందు ఆ చట్రం మీదే దెబ్బ పడబోతోంది. రాజకీయం నుంచి మతాన్ని వేరు చేయడానికి చూసిన రోమన్ పాలకులే క్రమంగా ఒకే ఒక అధికారికమతం వైపు అడుగు వేయబోతున్నారు. క్రౌర్యం, దౌర్జన్యం, పీడన, కన్నీళ్లు నిండిన నాటి పరిస్థితులలో; ఇంత శాంతి కోసం, కారుణ్యం కోసం సామాన్యజనం పరితపించడంలో ఆశ్చర్యంలేదు. పరోక్షంగా పాలకులను కూడా ఆ వాతావరణం ప్రభావితం చేయడంలోనూ ఆశ్చర్యంలేదు. దానికితోడు, అప్పటికి ఎంతో కాలంగానే ధర్మం, నీతి, కరుణ నిండిన ఒకే దేవుడి గురించిన భావనను యూదులు ప్రచారం చేస్తున్నారు. చివరికి అలాంటి దేవుడిలో శాంతిని వెతుక్కోడానికి నాటి పరిస్థితులు రోమ్ ప్రజానీకాన్ని మానసికంగా సిద్ధం చేశాయి.

మనం ఇప్పుడిక జీసస్ దగ్గరికి వస్తున్నాం!

     ***

తొలి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ సీజర్ కాలంలో జీసస్ జుడియాలో జన్మించాడు. ఆయన గురించిన మొత్తం చరిత్రలోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు. కాకపోతే క్రైస్తవ సిద్ధాంతానికి ఒక రూపమిచ్చిన సెయింట్ పాల్ గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన అసలు పేరు సౌల్. ఆయన ఎన్నడూ జీసస్ ను చూడలేదు. పైగా మొదట్లో జీసస్ బోధలను వ్యతిరేకించాడు. జీసస్ ను శిలువ వేసిన తర్వాత స్వల్ప సంఖ్యలో ఉన్న ఆయన అనుచరబృందాన్ని హింసించడంలో ప్రముఖపాత్ర వహించాడు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా క్రైస్తవంలోకి మారి, తన పేరును పాల్ గా మార్చుకున్నాడు. ఆయన మంచి జిజ్ఞాసి అనీ, మేధావి అనీ, తన కాలం నాటి మతధోరణులను ఎంతో ఆసక్తిగా, లోతుగా ఆకళించుకున్నవాడనీ చెబుతారు. యూదుమతాన్ని, మిత్రమతాన్ని, అలెగ్జాండ్రియాలోని నాటి ఇతర మతాలను బాగా అధ్యయనం చేశాడు. వాటిలోని అనేక అంశాలను క్రైస్తవంలోకి తీసుకొచ్చాడు. ఉదాహరణకు, ఈజిప్టు దేవుడు ఓసిరిస్. ఈయన చావు-పుట్టుకల చక్రానికి ప్రతీక అని చెప్పుకున్నాం. సెయింట్ పాల్ జీసస్ కు ఓసిరిస్ తో సామ్యం చూపించి ఓసిరిస్ అనుయాయులను క్రైస్తవం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశాడు. జీసస్ కు కూడా పునరుత్థానాన్ని, అంటే చావు-పుట్టుకల చక్రాన్ని ఆపాదించాడు. అలాగే సూర్యారాధకులను క్రైస్తవం వైపు ఎలా ఆకర్షించారో పైన చెప్పుకున్నాం.

రోమన్ పాలకులు అనేకులు మొదట్లో క్రైస్తవాన్ని అంగీకరించలేదు. అణచివేయడానికి ప్రయత్నించారు. క్రీ. శ. 303 లో, డయోక్లెటియన్ చక్రవర్తి కాలంలో చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బైబిల్ రాతప్రతులను జప్తు చేసి ధ్వంసం చేశారు. క్రైస్తవులకు చట్ట రక్షణను తొలగించారు అనేకమందిని చంపేశారు. పుస్తకాలను ధ్వంసం చేయడం ఇక్కడ ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవలసిన విషయమని హెచ్. జి, వెల్స్ అంటారు. అక్షరానికి ఉన్న శక్తి ఆ కొత్త మతాన్ని సంఘటితంగా ఉంచుతోందని నాటి పాలకులు గ్రహించారు. క్రైస్తవం, జుడాయిజం అనే ఈ ‘పుస్తక మతాలు’ జనాన్ని విద్యావంతుల్ని చేసిన మతాలని కూడా వెల్స్ అంటారు. చదివి, అర్థం చేసుకోగలిగినవారివల్లే ఇవి అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఇక్కడే వెల్స్ ఇంకో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. పురాతన మతాలు ఏవీ ఈ రెండు మతాల్లా మనిషి బుద్ధికీ, మేధకు పని కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే పురాతన మతాల దగ్గరికి వచ్చేసరికి మనం బుద్ధిని, మేధను పక్కన పెట్టేయాలి.

క్రైస్తవాన్ని తుడిచిపెట్టడానికి డయోక్లెటియన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనేక ప్రాంతాలలో సాధారణ ప్రజలే కాక, అధికారులు కూడా క్రైస్తవంలోకి మారిపోయారు. క్రీ.శ. 317లో, అప్పటి గలేరియస్ చక్రవర్తి క్రైస్తవం పట్ల సహనం పాటించాలని ఉత్తర్వు జారీ చేశాడు. క్రీ.శ. 324లో కాన్ స్టాన్ టైన్ చక్రవర్తి మరణశయ్య మీద ఉండి బాప్టిజమ్ తీసుకుని క్రైస్తవంలోకి మారాడు. తన సైనిక ఫలకాల మీదా, జెండాల మీదా క్రైస్తవ చిహ్నాలు ఉండేలా ఆదేశించాడు.

ఆ తర్వాతే కొన్నేళ్లకే క్రైస్తవం రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతం అయిపోయింది. అంతవరకూ దానితో పోటీ పడిన పురాతన మతాలు అన్నీ అదృశ్యమైపోయాయి. లేదా క్రైస్తవంలో కలిసిపోయాయి. క్రీ.శ. 390లో థియోడోసియస్ చక్రవర్తి అలెగ్జాండ్రియాలోని బ్రహ్మాండమైన జూపిటర్ సెరాపిస్ విగ్రహాన్ని నేలమట్టం చేయించాడు. 5వ శతాబ్దినుంచి రోమన్ సామ్రాజ్యంలో అంతటా క్రైస్తవ ప్రార్థనా మందిరాలూ, క్రైస్తవ పూజారులే!

చక్రవర్తి నేలమట్టం చేయించిన జూపిటర్ సెరాపిస్ విగ్రహం, నిజానికి నేలమట్టమైన బహురూప ఆస్తికతకు ప్రతీక మాత్రమే. ఇలా ఏకరూప ఆస్తికతలోకి అడుగుపెట్టిన రోమ్, ఈ విషయంలో ప్రపంచానికే అతి పెద్ద వరవడి అయింది. అప్పటికీ బహురూప ఆస్తిక పంథాలను అనుసరిస్తూనే ఉన్నవారిని వెతికి వెతికి మరీ పట్టుకుని వారిపై మంత్రగాళ్ళు లేదా మంత్రగత్తెలన్న ముద్ర వేసి చంపుతూ వచ్చారు. అది నిఘంటువుకు witch-hunt అనే మాటను అందించింది.

మిగతా విశేషాలు తర్వాత….

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)–కల్లూరి భాస్కరం

 

 

 

 

Download PDF

2 Comments

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)