చరిత్రలో ఒక అద్భుతం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎప్పుడో క్రీస్తు పూర్వ కాలంలో యూదుమతం, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవం మనిషిలోని బుద్ధిని లేదా ఇంగితజ్ఞానాన్ని తృప్తి పరచడానికి ప్రయత్నించాయని, క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న మాటే చూడండి…

ఈ మాట వెలుగులో మనల్ని పరిశీలించుకుంటే ఏమనిపిస్తుంది?!

ఇప్పటికీ మనదగ్గర బుద్ధి అనే పాత్రను ఖాళీగా ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తున్నామనిపిస్తుంది. పైగా దానిని ఇంత అయోమయపు మట్టితో నింపుతున్నాం కూడా. మన దేశం ఇంకా క్రీస్తుశకంలోకి రాలేదనడానికి ఇది కూడా ఒక నిదర్శనం.

ఈ సందర్భంలో నాకొకటి గుర్తొస్తోంది. ఓ రోజు పొద్దుటే టీవీలో ఒక ప్రసిద్ధ పౌరాణికుని ప్రవచనం వింటున్నాను. ఆయన భారతదేశం ఎంత గొప్పదో వివరిస్తున్నారు. ఇతర దేశాలకు భిన్నంగా ఇది కర్మభూమి అనీ, యజ్ఞభూమి అనీ, మిగతా భూములు పవిత్రమైనవి కావనీ అంటున్నారు. అలా కాసేపు ఆత్మస్తుతి, పరనింద చేసి, చివరగా భారతదేశం మొత్తమే ఒక దేవాలయం అని తేల్చారు.

విచిత్రం ఏమిటంటే, ఆయన సరిగ్గా ఆ మాటలు అంటున్నప్పుడే కింద వార్తలు స్క్రోల్ అవుతున్నాయి. వాటిలో ఒక టీచర్ అయిదేళ్ళ పసిపిల్లపై అత్యాచారం జరిపిన వార్త కూడా ఉంది!

ఆయన మాటలకూ, కింద స్క్రోల్ అవుతున్న ఆ వార్తకూ మధ్య ఎంత అంతరం, ఎంత అవాస్తవికత వ్యాపించి ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తాను. అంతకు మించి భయపెట్టేది అందులోని ఆత్మవంచన. ఆపైన ఆయన ఇంకో ఉద్ఘాటన కూడా చేశారు. అగ్ని ఆరాధన భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదన్నదే ఆ ఉద్ఘాటన. నాకు ఆశ్చర్యమూ, బాధా కూడా కలిగాయి. ఆయనకు కొంచెం చరిత్ర తెలిస్తే ఎంత బాగుండుననిపించింది. నిజానికి అగ్ని ఆరాధన ప్రపంచమంతటా ఉంది. ఆ సంగతి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కూడా.

పురాతన మతాలకు భిన్నంగా యూదుల జుడాయిజం, క్రైస్తవం అనే రెండు పుస్తక మతాలు వ్యక్తుల బుద్ధికి పదును పెట్టే ప్రయత్నం చేస్తే; వ్యక్తులలోని ఇంగితజ్ఞానాన్ని చిన్నబుచ్చి, బుద్ధిని మొద్దుబారేలా చేసే ప్రయత్నం నేటికీ మనదేశంలో జరుగుతూనే ఉందన్న మాట!

దీనిని విమర్శగా కాక, ఆత్మవిమర్శగా తీసుకోవాలని కోరుతూ విషయంలోకి వెడతాను.

***

ప్రపంచంలో యూదుల ప్రాముఖ్యానికి కారణం, వారు లిఖిత సాహిత్యాన్ని అందించడమే నని వెల్స్ అంటారు. అంతేకాదు, ప్రపంచ చరిత్రను, శాసనాల సంపుటిని, ఉపదేశ గ్రంథాలను, కవిత్వాన్ని, కల్పిత సాహిత్యాన్ని, రాజకీయభావజాలాన్ని లిఖిత రూపంలో ప్రపంచానికి మొట్టమొదటగా అందించినది యూదులే. వీటిని పొందుపరచుకుంటూ క్రీ.పూ. 4-5 శతాబ్దాలలో రూపొందినదే హిబ్రూ బైబిల్. అదే క్రైస్తవంలో ‘ఓల్డ్ టెస్ట్ మెంట్’గా వ్యవహారంలోకి వచ్చింది.

యూదులు ప్రపంచం మొత్తంలోనే ఒక విలక్షణమైన జాతి. తటస్థంగా చెప్పుకుంటే, వారిలా విపరీతమైన వేధింపులకు, ఊచకోతకు గురైనవారు; వారిలా కొన్ని వందల ఏళ్లపాటు ప్రవాసదుఃఖాన్ని అనుభవించినవారు ఇంకొకరు కనిపించరు. చరిత్రపూర్వకాలం నుంచి, ఆధునిక కాలం వరకు వారి ఆరాట,పోరాటాలకు ఒక అవిచ్ఛిన్నచరిత్ర ఉండడం మరింత ఆశ్చర్యం గొలుపుతుంది. చరిత్రపూర్వకాలంలో ఈజిప్షియన్లు, చాల్దియన్లు తదితరులతో మొదలుపెట్టి ఆధునిక కాలంలో హిట్లర్ కత్తికి మెడవంచడం వరకు వారు పడిన హింసలోనూ ఒక క్రమం కనిపిస్తుంది.

అలాగే, రోమన్ల కంటే ముందు బహురూప ఆస్తికతను తుడిచిపెట్టి ఏకరూప ఆస్తికతను స్థాపించిడానికి ప్రయత్నించినవారు యూదులే. అది క్రీస్తుపూర్వ కాలంలో! అప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం క్రీస్తుశకంలో క్రైస్తవంతో ఒక కొలిక్కి వచ్చింది.

 

యూదులు లేదా హిబ్రూలు సెమెటిక్ జాతి. మొదట్లో వారికంత ప్రాముఖ్యమూ, గుర్తింపూ లేవు. క్రీ.పూ. 1000కి ముందే వారు జుడియాలో స్థిరపడ్డారు. ఆధునిక చరిత్రకారులనే ప్రమాణంగా తీసుకుంటే అది, మన మహాభారత కాలం కంటే కూడా ముందు. ఆ తర్వాత జెరూసలెం వారి రాజధాని అయింది. వారికి దక్షిణంగా ఈజిప్టు; ఉత్తరంగా సిరియా, అసీరియా, బాబిలోన్ ఉన్నాయి. అప్పట్లో చక్రం తిప్పుతూ వచ్చిన ఈ సామ్రాజ్యాల మధ్య ఒక రహదారిగా జుడియా ఉండేది. ఆ విధంగా యూదుల అస్తిత్వం మంచికైనా, చెడుకైనా ఈ సామ్రాజ్యాలతో పెనవేసుకోవలసివచ్చింది.

ప్రారంభంలో యూదులు అంత నాగరికులూ కారు, ఐకమత్యంగానూ లేరు. వారిలో చదవడం, రాయడం తెలిసినవారు కూడా చాలా కొద్దిమంది. మన కశ్యపప్రజాపతి, దక్షప్రజాపతిలా వారికి కూడా ఒక ప్రజాపతి(పేట్రియార్క్) ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి(క్రీ.పూ. 1750)కాలం వాడని అంచనా. అబ్రహాం నాయకత్వంలో యూదులు సంచారజాతిగా ఉండేవారు. బైబిల్ కథనం ప్రకారం, అబ్రహాం కనాన్ అనే ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ పాడి పంటలతో తులతూగే ఈ ప్రాంతాన్ని మీకు నివాసంగా చేస్తున్నానని చెప్పాడు.

అబ్రహాం కొడుకు మోజెస్. అతని కాలంలో యూదులు ఈజిప్టుకు బందీలయ్యారు. చాలాకాలం పాటు అక్కడ ప్రవాస జీవితం గడిపారు. ఆ తర్వాత నలభై ఏళ్లపాటు దేశదిమ్మరులుగా గడిపారు. అప్పటికి పన్నెండు తెగలుగా విస్తరించారు. అయితే, అబ్రహాం తమకు వాగ్దానం చేసిన కనాన్ తీరప్రాంతాన్ని ఏజీయన్లు అయిన ఫిలిస్తీన్లు అప్పటికే ఆక్రమించుకుని ఉన్నారు. ఆర్యులు తరిమేస్తే ఫిలిస్తీన్లు అక్కడికి వలస వచ్చారని ఇంతకుముందు చెప్పుకున్నాం. అబ్రహాం వారసులు కనాన్ ఆక్రమణకు ప్రయత్నించారు. ఏవో కొన్ని కొండ ప్రాంతాలు మాత్రమే వారి చేజిక్కాయి. కొన్ని తరాలపాటు అబ్రహాం వారసులు ఆ కొండప్రాంతాలలో అనామక జీవితం గడిపారు. మధ్య మధ్య వారికీ, ఫిలిస్తీన్లకు, అక్కడున్న చిన్న చిన్న ఇతర తెగలవారికి ఘర్షణలు జరుగుతూనే ఉండేవి. బైబిల్ లోని బుక్ ఆఫ్ జడ్జెస్ లో వాటి వివరాలు ఉన్నాయి.

జడ్జీలు అంటే ఇక్కడ యూదుల పూజారులు. వారే యూదులను పాలించేవారు. కానీ, యుద్ధాలకు నాయకత్వం వహించే వ్యక్తి అవసరమని భావించి క్రీ.పూ.1000 ప్రాంతంలో పూజారుల స్థానంలో యూదులు సౌల్ అనే అతన్ని రాజుగా చేసుకున్నారు. ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో సౌల్ మరణించాడు. ఫిలిస్తీన్లు అతని మృతదేహానికి మేకులు కొట్టి ఒక గోడకు వేలాడదీశారు.

సౌల్ కొడుకే డేవిడ్! ‘డేవిడ్ అండ్ గోలియెత్’ కథలో హీరో. యూదుల చరిత్రలో ఎంతోకొంత స్వర్ణయుగంగా చెప్పుకోదగింది అతని కాలమే. అందుకు కారణం, ఫొనీషియన్ల నగరమైన టైర్ తో వారికి ఏర్పడిన స్నేహసంబంధాలు.

untitled

ఆ నగరాన్ని హీరామ్ అనే రాజు పాలించేవాడు. అతను మంచి మేధావి, ఉత్సాహవంతుడు. ఫొనీషియన్లు నౌకావర్తకంలో ఆరితేరినవారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. సాధారణంగా వారి వర్తక నౌకలు ఈజిప్టు మీదుగా ఎర్ర సముద్రానికి చేరుకునేవి. అయితే, ఈజిప్టు అప్పుడు అల్లకల్లోలంగా ఉంది. ఆ మార్గంలో మరికొన్ని ఇతర ఆటంకాలూ ఎదురయ్యాయి. దాంతో హీరామ్ ఎర్రసముద్రం చేరుకోడానికి వేరే మార్గాన్ని వెతుక్కోవలసివచ్చింది. యూదుల కొండ ప్రాంతం నుంచి వెళ్ళే మార్గం అనుకూలంగా కనిపించింది. హీరామ్ డేవిడ్ తోనూ, ఆ తర్వాత అతని కొడుకు సోల్మన్ తోనూ స్నేహం చేశాడు. అతని సాయంతోనే జెరూసలెంలోని ఆలయం, గోడలు, రాజప్రాసాదం నిర్మాణమయ్యాయి. దానికి ప్రత్యుపకారంగా తమ ప్రాంతం మీదుగా ఎర్ర సముద్రానికి వెళ్ళే మార్గాన్ని హీరామ్ ఉపయోగించుకోడానికి, తమ భూభాగం మీద నౌకలను నిర్మించుకోడానికి యూదులు అనుమతించారు. అప్పటినుంచి జెరూసలెం మీదుగా ఫొనీషియన్లు అటు ఉత్తరంవైపు, ఇటు దక్షిణంవైపు పెద్ద ఎత్తున వర్తకం సాగిస్తూవచ్చారు. ఈ క్రమంలో యూదుల రాజు సోల్మన్ కూడా అంతకుముందు ఎన్నడూ ఎరగని సంపదను, వైభవాన్ని గడించాడు. చివరికి ఈజిప్టు ఫారో కూడా తన కూతురిని అతనికిచ్చి పెళ్లి చేశాడు.

అయితే యూదుల వైభవం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సోల్మన్ మరణించిన తర్వాత ఈజిప్టు ఫారో షిషాక్(శశాంక్?) జెరూసలెంపై దాడి చేసి మూలమట్టంగా దోచుకున్నాడు. యూదుల రాజ్యంలోని ఉత్తరప్రాంతం జెరూసలెం నుంచి వేరుపడి, ఇజ్రాయిల్ పేరుతొ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. జెరూసలెం, జుడా రాజధానిగా ఉండిపోయింది.

పులి మీద పుట్రలా హీరామ్ కూడా మరణించాడు. దాంతో టైర్ నగరం నుంచి యూదులకు అందే సాయం ఆగిపోయింది. ఈజిప్టు మరోసారి బలం పుంజుకుంది. ఇజ్రాయిల్, జుడా రాజ్యాలు రెండూ అటు ఉత్తరరాన సిరియా, అసీరియా, బాబిలన్; ఇటు దక్షిణాన ఈజిప్టుల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోవడం ప్రారంభించాయి. క్రి. పూ. 721లో ఆసీరియా ఇజ్రాయిల్ ను కబళించి అక్కడి యూదులను బందీలను చేసింది. దాంతో ఇజ్రాయిల్ చరిత్రలోనే అదృశ్యమైపోయింది. క్రీ.పూ. 608 వరకు ఎలాగో అస్తిత్వాన్ని కాపాడుకున్న జుడాకూ చివరికి ఇజ్రాయిల్ కు పట్టిన గతే పట్టింది. మీదులు, పర్షియన్లు, చాల్దియన్లతో యుద్ధాలలో అసీరియా తలమునక లవుతున్న సమయంలో ఈజిప్టు ఫారో నెకో-2 అసీరియాపై దాడి చేసి జుడా మీద పడ్డాడు. అతనితో జరిగిన యుద్ధంలో జుడా రాజు జోసయ్య ఓడిపోయి, హతుడయ్యాడు. జుడా ఈజిప్టుకు సామంత రాజ్యం అయింది. అసీరియన్లతో జరిగిన యుద్ధంలో గెలిచి, బాబిలోన్ ను ఆక్రమించుకున్న చాల్దియన్ రాజు నెబుచాద్ నెజ్జర్ ఈజిప్టు ఫారో నెకో-2ను వెళ్ళగొట్టి జుడాను ఆక్రమించుకున్నాడు. జెరూసలెంలో తన కీలుబొమ్మను రాజుగా ఉంచి బాబిలోన్ నుంచే దానిని పాలించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. జనం తిరుగుబాటు చేసి బాబిలోన్ అధికారులను ఊచకొత కోశారు. దాంతో నెబుచాద్ నెజ్జర్ జుడా రాజ్యం మొత్తాన్నే తుడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. జెరూసలెం మీదపడి దోచుకుని నగరాన్ని తగలబెట్టాడు. జనాన్ని బందీలుగా బాబిలోన్ కు పట్టుకుపోయాడు.

క్రీ.పూ. 538లో పర్షియన్ రాజు సైరస్ బాబిలోన్ ను ఆక్రమించుకునేవరకు వారు అక్కడే ఉన్నారు., ఆర్యుడైన సైరస్ వాళ్ళందరినీ ఒకచోట చేర్చి తిరిగి స్వదేశానికి పంపేశాడు. జెరూసలెంలోని ఆలయాన్ని, గోడలను పునర్నిర్మింపజేశాడు.

పాలకోసం రాయి మోసినట్టుగా, రెండు వివరాల కోసం ఈ చరిత్ర అంతా తడమాల్సి వచ్చింది. మొదటిది, ఋగ్వేదం ‘పణు’లుగా పేర్కొన్న ఫొనీషియన్లతో యూదుల మైత్రి గురించి చెప్పుకోవడం. రెండవది, బాబిలోన్ జీవితం వారిలో తెచ్చిన మార్పు.

బాబిలోన్ వారిని నాగరికులుగా మార్చడమే కాదు, సంఘటితం చేసింది. అంతకంటె ముఖ్యంగా వారిని రాజకీయ ప్రజగా మార్చింది. హిబ్రూ బైబిల్ ను, తమవైన సంప్రదాయాలను వారు రూపొందించుకున్నది బాబిలోన్ లో ఉండగానే. బందీలుగా బాబిలోన్ కు వెళ్ళిన వారికి, స్వేచ్చ పొంది తిరిగి స్వదేశానికి చేరుకున్న వారికి మధ్య ఎలాంటి పోలికా లేదు. ప్రపంచంలో అప్పటికి ఎవరికీ లేని ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని వారు సంతరించుకున్నారు. అందులో ప్రముఖ పాత్ర వహించింది, సరికొత్త రకానికి చెందిన వ్యక్తులు. వారే, ప్రవక్తలు!

ఈ ప్రవక్తలు రక రకాల మూలాల నుంచి వచ్చినవారు. ఉదాహరణకు ఎజేకిల్ అనే ప్రవక్త పూజారుల కులానికి చెందినవాడు. అమోస్ అనే ప్రవక్త గొర్రెల కాపరులలా గొర్రె చర్మం ధరించేవాడు. వీరికి ఒకరి అనుమతి కానీ, పదవిలో ఒకరు ప్రతిష్టించడం కానీ ఉండవు. వీరు ఒక్క ధర్మదేవతకు తప్ప మరెవరికీ విధేయత ప్రకటించరు. వారు నేరుగా జనంతో మాట్లాడతారు. ‘దేవుడు నాతొ ఇలా పలికిస్తున్నా’ డని చెబుతారు. వీరు అణువణువునా రాజకీయాన్ని రంగరించుకుని ఉండేవారు. ఈజిప్టు, అసీరియా, బాబిలోన్ ల మీద తిరగబడమని జనాన్ని ఉద్బోధించేవారు. సోమరితనం నిండిన పూజారి వ్యవస్థను, రాజుల దుర్మార్గాలను ఖండించేవారు. వీరిలో కొందరు సంఘ సంస్కరణకు కూడా పూనుకున్నారు.

ఈ ప్రవక్తల ఉద్బోధలకు అక్షర రూపమిచ్చి భద్రపరిచేవారు. యూదులు ఎక్కడికి వెళ్ళినా వాటిని తమ వెంట తీసుకువెళ్ళారు. ఈ సరికొత్త మత స్ఫూర్తిని వెళ్ళిన ప్రతిచోటా వెదజల్లారు. సామాన్య ప్రజానీకాన్ని పూజారుల నుంచి, ఆలయాల నుంచి, రాజుల నుంచి తప్పించి ధర్మదేవతకు అభిముఖంగా నిలబెట్టారు. మానవాళి చరిత్రలో ఇదే వారికి అత్యంత ప్రాముఖ్యాన్ని కల్పించింది. వ్యక్తిగత నైతికతను నొక్కి చెప్పడం రూపంలో యూదులు ప్రపంచానికి ఒక కొత్త శక్తిని అందించారు.

వెనకటి నగర రాజ్యాలలోని దేవుణ్ణి మనుషులు తమ చేతులతో తయారుచేసి దేవాలయంలో ప్రతిష్టించేవారు. ఆ దేవాలయాన్ని శత్రువులు కూలగొడితే దానితోపాటు దేవుడు కూడా కుప్పకూలేవాడు. కానీ యూదుల దేవుడు ఒక కొత్త ఆలోచన. ఆయన అదృశ్యంగా ఉంటాడు. ఏదో ఒక నగరానికి, ప్రాంతానికీ పరిమితం కాడు. పూజారులకు, బలులకు అతీతంగా అయన స్వర్గంలో ఉంటాడు. దేవాలయం కేంద్రంగా ఉన్న నాటి నగర రాజ్యాలు, వాటిపై జరిగే దాడులు, బలులు మొదలైనవి యూదుల దేవుడి అవతరణకు చారిత్రక నేపథ్యం అన్న సంగతి అర్థమవుతూనే ఉంది.

ముందే చెప్పినట్టు యూదులది పుస్తక మతం. బైబిల్ వాళ్ళకు సర్వస్వం. అదే వారిని సంఘటితంగా ఉంచింది. అంతే కాదు, జెరూసలెం వారికి నామమాత్రపు రాజధాని మాత్రమే; వారి నిజమైన రాజధాని బైబిలే. ‘యూదులు పూర్తిగా ఒక సరికొత్త ప్రజారూపం. వారికి ఒక రాజు లేడు, ఒక ఆలయం లేదు, కేవలం లిఖిత అక్షరమే వారిని కలిపి ఉంచింది’ అంటారు వెల్స్.

***

ఇక ఇప్పుడు బయలుదేరిన చోటికి మళ్ళీ వెడదాం. ఋగ్వేదంలో పేర్కొన్న పణులు ఫొనీషియన్లే నన్న కోశాంబీ ఊహ సరైనదే ననుకుంటే, దానికి సంబంధించిన చారిత్రక మూలాలు పై వివరాలలో దొరుకుతాయి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే, హీరామ్ అనే ఫొనీషియన్ రాజుకు, యూదుల రాజులు డేవిడ్, సోల్మన్ లతో ఏర్పడిన స్నేహ సంబంధాలలో దొరుకుతాయి. అప్పటికి ప్రపంచ వర్తకం అంతా సెమిటిక్కులైన ఫొనీషియన్ల చేతుల్లోనే ఉండేదని, వారి వర్తక నౌకలు బ్రిటన్, అట్లాంటిక్ ల వరకు; ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు, బహుశా భారత దేశానికీ వెళ్ళేవని వెల్స్ అంటారు. అలా వెళ్ళిన సందర్భంలోనే పణులు లేదా ఫొనీషియన్లు ఋగ్వేదంలోకి ప్రవేశించి ఉంటారు. తాము వర్తకం జరిపే దేశాలలో వారు కాలనీలు ఏర్పాటుచేసుకునే వారు. మిగతా చోట్లలో సెమెటిక్కులకు, ఆర్యులకు ఘర్షణలు జరుగుతున్నట్టే ఇక్కడా జరగడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఘర్షణలే ఋగ్వేదానికి ఎక్కి ఉండవచ్చు.

మన దగ్గర చరిత్ర స్పృహ ఉండి ఉంటే, ఫొనీషియన్లు, యూదుల గురించిన ఎంతో కొంత చరిత్ర మనం కూడా నమోదు చేసి ఉండేవారమేమో! యూదుల పుస్తకమతం గురించిన ప్రస్తావన మన పురాణ, ఇతిహాసాలలో కూడా కనిపించేదేమో! మనకూ, పురాతన నాగరికతలకూ మధ్య ఒక చారిత్రక వారధి రూపుకట్టి ఉండేది. మనకు మనం ఆపాదించుకునే విశిష్టతలు, ప్రత్యేకతల గురించిన ఊహలకు అంతగా అవకాశం ఉండేది కాదు.

అదలా ఉంచితే, ఆర్యుల రాకతో ఫొనీషియన్లతో సహా సెమెటిక్కుల ప్రాభవం ప్రతిచోటా ఎలా అదృశ్యమైపోయిందో వెల్స్ రాస్తారు. క్రీ.పూ. 17వ శతాబ్ది నాటికి మొత్తం నాగరిక ప్రపంచాన్ని సెమెటిక్కులే ఏలుతూ ఉండేవారు. అయితే, క్రీ.పూ. 3వ శతాబ్ది నాటికి ప్రపంచమంతటా సెమెటిక్ ప్రాబల్యాన్ని ఆర్యులు తుడిచిపెడతారనీ, సెమిటిక్కులు ఆర్యుల కింద అణగిమణగి జీవించవలసి వస్తుందనీ, తలోవైపుకీ చెదిరిపోవలసివస్తుందనీ ఎవరూ ఊహించి ఉండరు. ఒక్క అరేబియాలోని సంచార జాతులైన బెడోవిన్లు ఆర్యుల దాడినుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకోగలిగారు. మరోవైపు యూదులు అనే చిన్న సమూహం ఇంత సంక్షోభంలో కూడా జెరూసలెంలో తమ పురాతన సంప్రదాయాలను అంటిపెట్టుకుని సంఘటితంగా ఉండిపోయారు. వారిని అలా సంఘటితంగా ఉంచినది, వారి బైబిలు!

చరిత్రలో ఇంకో అద్భుతం కూడా జరిగింది. ఆర్యుల కత్తికి తలవంచి గతవైభవాన్ని కోల్పోయిన బాబిలోనియన్లు, సిరియన్లు, ఫొనీషియన్లతో సహా అనేకులు క్రమంగా యూదు మతంలోకి ఆకర్షితులై బైబిల్ భాషే మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు, టైర్, సిడాన్, కార్తేజ్, స్పెయిన్ లోని ఇతర ఫొనీషియన్ నగరాలతోపాటు ఫొనీషియన్లూ హఠాత్తుగా చరిత్రనుంచి అదృశ్యమైపోయారు. ఒక్క జెరూసలెం లోనే కాక, అంతకుముందు ఫొనీషియన్లు అడుగుపెట్టిన స్పెయిన్, ఈజిప్టు, అరేబియా, తూర్పు దేశాలతో సహా ప్రతిచోటా అంతే హఠాత్తుగా యూదులు ప్రత్యక్షమయ్యారు.

మిగతా విశేషాలు తర్వాత…

Download PDF

9 Comments

  • GN Murari says:

    మీ వ్యాసం చాలా బావుంది, కాని రెండో చోట్ల పొరబాట్లు దొర్లినట్లు గమనించ గలరు. మోసెస్ అబ్రహం పుత్రుడు కాదు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు ఒక ఇశ్రాయేలీయుల స్త్రీకి జన్మించినప్పటికీ ఈజిప్టు రాజు సోదరి పెంపుడు కుమారుడు. మరో పొరబాటు, డేవిడ్ సౌల్ కుమారుడు కానేకాదు. సౌల్ డేవిడ్ ను శత్రువుగా భావించేవాడు. సౌల్ తరువాత డేవిడ్ లేదా దావీదు యూదుల రాజ్యాన్నిపరిపాలించడం జరిగింది. ఈ వివరాలు మీరు “పాత నిబంధన” లో చూడగలరు.

    • కల్లూరి భాస్కరం says:

      పొరపాట్లు సూచించినందుకు ధన్యవాదాలు మురారిగారూ…అబ్రహాం కొడుకు ఇసాక్. మోజెస్ గా కన్ప్యూస్ అయ్యాను. హెచ్, జీ, వెల్స్ His successor David …అనేసరికి కొడుకుగా పొరబడ్డాను.successor కొడుకే కావలసిన అవసరం లేదని తట్టలేదు.

  • వురుపుటూరి శ్రీనివాస్ says:

    భాస్కరం గారికి

    “పురాతన మతాలకు భిన్నంగా యూదుల జుడాయిజం, క్రైస్తవం అనే రెండు పుస్తక మతాలు వ్యక్తుల బుద్ధికి పదును పెట్టే ప్రయత్నం చేస్తే; వ్యక్తులలోని ఇంగితజ్ఞానాన్ని చిన్నబుచ్చి, బుద్ధిని మొద్దుబారేలా చేసే ప్రయత్నం నేటికీ మనదేశంలో జరుగుతూనే ఉందన్న మాట!”

    చాలా ఆశ్చర్యపోయానా మాటను చూసి. ఇంత సైన్సూ (పడమటి దేశాల్లోని) మతాన్ని ఎదిరించిన మనస్సుల్లోనుంచి పుట్టినదే అనుకునేవాణ్ణి నేను. పొరబడ్డానా?

    పాత నిబంధన గురించి కొంత చదివినప్పుడు, ఇటీవల ఫత్వాల సాహిత్యం గురించి చదువుతున్నప్పుడు – మతాలన్నింటిలోనూ ఎంతో కొంత తిరస్కరించదగ్గది ఉంటుందని అనుకున్నాను. స్వీకరించదగ్గది కూడానూ అందుకు మనదేశంలోని మతాలు మినహాయింపు కాదు కదా. మీరు చేసిన “ఆత్మవిమర్శ” కాస్త unfair గా అనిపించింది. బహుశా ముందు ముందు ఇంకాస్త బాగా అర్థం అవుతుందేమో.

    శ్రీనివాస్

    • కల్లూరి భాస్కరం says:

      “మతాలన్నింటిలోనూ ఎంతో కొంత తిరస్కరించదగ్గది ఉంటుందని అనుకున్నాను. స్వీకరించదగ్గది కూడానూ. అందుకు మనదేశంలోని మతాలు మినహాయింపు కాదు కదా.”

      ఈ అభిప్రాయంతో నాకు ఎలాంటి వ్యతిరేకతా లేదు శ్రీనివాస్ గారూ…యూదు, క్రైస్తవ మతాలు మంచివీ, మన మతాలు చెడ్డవీ అని అనడం నా ఉద్దేశం కాదు. నా వాక్యాలు అలాంటి భావన ఎవరికైనా కలిగిస్తే అది నా వ్యక్తీకరణ లోపమే అయుంటుంది. తటస్థ దృష్టితో చెబితే, బుద్ధిని, అంటే తర్కాన్ని, హేతుత్వాన్నీ పూర్తిగా నిరాకరించి విశ్వాసాన్నే నొక్కి చెప్పే ఆస్తికత్వం; విశ్వాసాన్ని పూర్తిగా నిరాకరించి తర్కాన్ని, హేతుత్వాన్ని నొక్కి చెప్పే నాస్తికత్వం అనే రెండు extremes మధ్యలో మానవనైజం ఉంటుందని నా ఉద్దేశం. చారిత్రకంగా చూస్తే భారతీయేతర మతాలు బుద్ధి, విశ్వాసాల మధ్య సమతూకం తేవడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. అందుకు కూడా ఎంతో పోరాటం జరిగింది. చర్చి ఆధిపత్యం నుంచి బుద్ధి శక్తులను విడిపించిన తర్వాతే, పాశ్చాత్యదేశాలలో సైన్సు అభివృద్ధి చెందింది. అంతకు ముందు నుంచీ చూసినా చరిత్రను, విజ్ఞానాన్ని అక్షరబద్ధం చేసి భద్రపరచడం మన దగ్గర కంటే భారతీయేతర నాగరికతలలోనే ఎక్కువ జరిగినట్టు కనిపిస్తుంది. విశ్వాస కబంధ హస్తాలనుంచి బుద్ధిని విడిపించడానికి పాశ్చాత్యసమాజాలలో జరిగినంత ఘర్షణ మన దగ్గర జరగలేదు. విశ్వాసాన్ని కాదనకుండానే, దానికి కొన్ని హద్దులు గీసి బుద్ధికి పని చెప్పడం అక్కడ జరిగింది. సామాజిక జీవిగా మనిషి తను జీవించే లౌకిక ప్రపంచాన్ని తీర్చి దిద్దుకోడానికి బుద్ధి శక్తులు అవసరమవుతాయి. వ్యక్తిగత సంతృప్తికి విశ్వాసం సాయపడవచ్చు. సమూహం-వ్యక్తి అవసరాల మధ్య ఉన్న ఈ తేడా దృష్ట్యానే మతాన్ని వ్యక్తిగతం చేయాలన్న దృష్టి బలపడింది. బుద్ధిని మొద్దు బార్చే ప్రయత్నం మన దేశంలో నేటికీ జరుగుతూనే ఉందని నేను అనడానికి ఇదీ నేపథ్యం. ఈ విధంగా చూసినా మన దేశం ఇంకా క్రీస్తు పూర్వ దశలో ఉందని చెప్పడంలోనే నాకు ఇక్కడ ప్రధానంగా ఆసక్తి. మతాల మధ్య తేడాలను చర్చించడం కాదు.

  • Sivakumara Sarma says:

    భాస్కరంగారూ,
    చరిత్రకి సంబంధించినంతమటుకూ వివరాలని అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే, దీన్ని మీ ఉపోద్ఘాతంలో పక్కదారి మళ్లించారు. మీరు చరిత్రాత్మకంగా వివరణలను అందించదలచుకుంటే ఈ పక్కదారి అనవసరం. అలాకాక వ్యాసకర్తగా అందిస్తుంటే అది వేరే సంగతి – ఈ దారిలో వెళ్లేటప్పుడు వ్యాసకర్త అభిప్రాయాలని పరిశీలించడం పాఠకునికి తప్పనిసరి. మీరు వ్యాసకర్త మాత్రమే అన్న అభిప్రాయం స్థిరమయితే, మీరు ఏ రంగు కళ్లద్దాలను వాడతారో అర్థమయిన తరువాత మీ వ్యాసాలని చదవాలో, లేదో పాఠకులు ముందరే నిర్ణయించుకోవచ్చు. మీరు ఉపోద్ఘాతంలో చివర్లో దీన్ని విమర్శగా కాక ఆత్మవిమర్శగా తీసుకోవాలన్నారు. ఎవరి ఆత్మవిమర్శగా తీసుకోవాలో చెప్పాలి. మతానికి ఆత్మవిమర్శ చేతకాదు. అది మనిషికి మాత్రమే సాధ్యం. పోనీ, ఆ పౌరాణికుణ్ణి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా దీన్ని తీసుకుందామంటే, మీరాయన పేరు చెప్పలేదు. ఇది మీ ఆత్మవిమర్శగూర్చి కాదని మాత్రం నిర్ధారణమయింది.
    ఉపోద్ఘాతంలోని అంశాలని ఇప్పుడు పరిశీలిద్దాం.
    1) “క్రైస్తవం విద్యావ్యాప్తికి కృషి చేసిందనీ హెచ్. జి. వెల్స్ అన్న మాటే చూడండి. ఈ మాట వెలుగులో మనల్ని పరిశీలించుకుంటే ఏమనిపిస్తుంది?!” అంటూ వెల్స్ అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అలా తీసుకోవలసిన అవసరాన్ని వివరించలేదు. (మీరు వెల్స్ ఇలా అన్నాడంటారు. ఇంకొకళ్ళు యాజ్ఞవల్క్యుడు ఇలా అన్నాడంటారు!) 2) ” … భారతదేశం మొత్తమే ఒక దేవాలయం అని తేల్చారు. విచిత్రం ఏమిటంటే, ఆయన సరిగ్గా ఆ మాటలు అంటున్నప్పుడే కింద వార్తలు స్క్రోల్ అవుతున్నాయి. వాటిలో ఒక టీచర్ అయిదేళ్ళ పసిపిల్లపై అత్యాచారం జరిపిన వార్త కూడా ఉంది!” ఈ రెండు వాక్యాలతో మీరు చెప్పదల్చుకున్నదేమిటో అర్థం కాలేదు. ఈ దురాగతాలు మతానికి సంబంధించినవి కాదు. మనిషిలోని పైశాచికత్వానికి సంబంధించినవి. మతానికి ఈ పైశాచికత్వాన్ని అణచడం అనేది ఒక objective అయ్యుంటే మాత్రం, అది ఇప్పటికీ నెరవేరలేదు. మీరు చెప్పిన విధంగా ఇండియాలోనే కాదు, దురదృష్టవశాత్తు అన్ని దేశాల్లోనూ ఇలాంటి అత్యాచారాల వార్తలని వింటూనే వుంటాం. వాషింగ్టన్లో కాథొలిక్ చర్చ్ లోని కొంతమంది పిల్లలమీద జరిపిన దురాగతంమీద జరిగిన ఒక ప్రొటెస్ట్ గూర్చిన వార్తలని పేపర్లో చదివిన తరువాత నా కొలీగ్ ఒకతను అతని చిన్నప్పుడు (అంటే, కొన్ని దశాబ్దాల క్రితం) ఒక ప్రీస్ట్ జరిపిన అత్యాచారానికి గురయ్యాడని తెలిసింది. అలాగని క్రైస్తవ మతాన్ని నేనేగాక అతను కూడా నిందించలేదు. కొన్ని టీవీ చానెల్స్ లో వచ్చే క్రైస్తవ మత ప్రచారకుల ప్రసంగాలని వింటే ఆ మతం ప్రజల బుద్ధికి పదును పెటుతోందని కొంచెం ఆలోచించగలిగినవాళ్లు ఏ మాత్రం అంగీకరించరు. వెల్స్ అభిప్రాయాన్నిబట్టీ ఒక మతాన్ని గద్దెనెక్కించడంలోనూ ఒక పౌరాణికుని ప్రవచనాన్నిబట్టీ ఇంకొక సమాజాన్ని చిన్నబుచ్చడంలోనూ నాకు సమతుల్యత కనిపించలేదు. 3) “… క్రైస్తవం అనే రెండు పుస్తక మతాలు వ్యక్తుల బుద్ధికి పదును పెట్టే ప్రయత్నం చేస్తే; వ్యక్తులలోని ఇంగితజ్ఞానాన్ని చిన్నబుచ్చి, బుద్ధిని మొద్దుబారేలా చేసే ప్రయత్నం నేటికీ మనదేశంలో జరుగుతూనే ఉందన్న మాట!” గెలీలియోని అడగండి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని చెప్పినందుకు మరణించేదాకా జైలు పాలయిన అతను క్రైస్తవం వ్యక్తుల బుద్ధికి ఎంత పదునుబెట్టే ప్రయత్నం చేసిందో చెబుతాడు. 18వ శతాబ్దంలో వాటికన్లో ఒక పోప్ ఇచ్చిన ప్రసంగంలో (నేను క్రితంసారి చూసినప్పుడు అది ఇంకా వాళ్ల వెబ్ సైట్ లోనే వుంది. వెదికి, దొరికితే, లింకుని పంపిస్తాను) క్రైస్తవ మత ప్రచారంలో వాళ్లు ఒక దేశంలో విషయంలో చేసిన తప్పేమిటో, ఆ తప్పుఇండియాలో జరగకుండా జాగ్రత్తపడాలో వున్నది. క్లుప్తంగా, ముందటి దేశంలో ఈ ప్రచారకులు అంతా విదేశీయులుగా స్పష్టంగా కనిపించడం వాళ్ల గెంటివేతకి కారణమయింది. అందుకని, ఇండియాలో, ఈ విదేశీ ప్రచారకులు కొంతమంది భారతీయులకి ట్రైనింగ్ నిచ్చి వాళ్లని ప్రచారకులుగా తీరిచిదిద్దాలనేది ఆయన ప్రతిపాదన. అలా అయితే, ఒకవేళ ఈ విదేశీయులు మళ్లీ గెంటివేతకి గురయితే, మిగిలిన క్రైస్తవులు భారతీయులలో కలిసిపోతారు కాబట్టి ఆ మతం ఇండియాలో పాతుకునే వుంటుంది. ఈ పదునైన బుద్ది ఎలా వుందంటారు?

    మీ చివరి పేరాలో, “చరిత్రలో ఇంకో అద్భుతం కూడా జరిగింది. ఆర్యుల కత్తికి తలవంచి గతవైభవాన్ని కోల్పోయిన బాబిలోనియన్లు, సిరియన్లు, ఫొనీషియన్లతో సహా అనేకులు క్రమంగా యూదు మతంలోకి ఆకర్షితులై బైబిల్ భాషే మాట్లాడడం ప్రారంభించారు. ” అన్నారు. ఆనాడేకాక ఈనాడుకూడా మతమార్పిడికి అనేక కారణాలుంటాయి. “Be a Roman in Rome.” అనేది ఒకటి. పొట్టపోసుకోవడంకోసం ఇంకొకటి. వాళ్లు ఆకర్షితులై మాత్రమే మతం మార్చుకొన్నారు అన్నది ఆధారపూర్వక అభిప్రాయంగా కనిపించలేదు. దీన్ని మీరు “అద్భుతం” అంటే ఆశ్చర్యమేసింది.

    • Rathnam says:

      మత మార్పిడి జరిగింది అంటే ….అయ్యో మా జాతిని తప్పు దారి పట్టిస్తున్నారు అని తమ తమ జాతి వారు గుండెలు పగిలే లా రోదిస్తున్నారు ఈ…రోజుల్లో . ఈ..మధ్య మరీను ..బీ.జే.పీ అధికారం లోకి వచ్చినాక మరి ఎక్కువ ఐపోఐనవి అని నా అబిప్రాయం ..ఎందుకంతే కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ఇలాంటి వార్త లు చాలా అరుదుగా వినపడేవి .ఇప్పుడు మాత్రం రోజుకోక సారి ఐనా వినాల్సిందే….
      .
      ఒక వ్యక్తి మతం మార్చుకున్నాడు అంటే అది తనకు ఇష్ట పూర్వకంగా జరిగిందా లేదా………??
      అని ఈ…రోజుల్లో మనం ఆలోచించటం లేదు అని అనుకుంటున్నాను .
      చాల వరుకు …నేను విన్నది ఏంటి అంటే ……పలనా వ్యక్తి ఎందుకు మతం మార్చుకున్నాడు అని అరా తీస్తే..
      తమ ఇష్ట పూర్వకం గా తీసుకున్నాం అని చాల మంది చెప్పారు ….బెదిరించి మత మార్పిడి చేసారు అని ఎవరైనా ఒక్కళ్ళు అయినా ముందుకు వచ్చి complient చేసారా అంటే లేదు అని మాత్రమే చెప్పాలి .
      మన భరత దేశం లో ఒక వ్యక్తి తన ఇష్ట పూర్వకం గా మతం మార్చుకోవటం తప్పు కాదు అని అనుకుంటున్నాను .
      ఎందుకంటే అంబేద్కర్ కూడా బౌద్ద మతాన్ని స్వీకరించడాన్ని గొప్పగా చెప్పుకుంటారు.
      క్రిస్టియన్ మతం వాళ్ళు తిరుపతి లో హిందువులని మారుస్తున్నారు అని అంటున్నారు
      హిందువు లు అగ్ర లో ముస్లిం వాళ్ళని హిందువు మతం లోకి మార్చారు అంటూ ఈ…రోజు పార్లమెంట్ లో వివాదం రేగింది. ఈ…మూడు మతాల మధ్య మాత్రమే మత మార్పిడి అనే వివాదాలు జరుగుతున్నాయి .
      .
      నేను మీకన్నా వయుసు లో అంత అనుబవం లేని వ్యక్తి ని …ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే పెద్దలు క్షమించాలి .
      ఒక వ్యక్తి ఇష్ట పూర్వకం గా మతం మార్చుకోవడం లో తప్పు ఏముంది అని అడుగుతున్నాను ..ఇది ఏమైనా రాజ్యంగ విరుద్ధుమా ….ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఫారెన్ లో ఉన్న క్రిస్టియన్ చాల మంది మారి హిందు మతం లోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయ్ ….బాల సాయి బాబా కూడా తన ఆశ్రమం లో చాల మంది ని ఫారెన్ క్రిస్టియన్ ప్రజలని హిందు మతం లోకి మార్చారు …అలాగే క్రిస్టియన్ మతాలు ….. ముస్లిం మతాలు కూడా సాధ్యమైనంత వరుకు తమ తమ బోధనలు తో జనాలని మార్చుకుంటున్నారు …..ఇందులో కొట్టుకొని చావటం కంటే నిజాన్ని ఎదుటి వ్యక్తి కి తెలియ చేయటానికి ఆ..మతం వాళ్ళు సక్సస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు ///మిగిలిన మతం వాళ్ళలో ఆ…శక్తి లేదు అని అంటారా …….ఎందుకు యి.మత చిచ్చు రేపుకుంటారు ఎవరికీ నచ్చిన మతం ఎవరికీ నమ్మకం విశ్వాసం ఉన్న మతం లోకి వాళ్ళు వెళ్ళిపోతారు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎందుకు ఈ..మతాలు …ఎందుకు …గొడవలు
      .
      .
      .అన్ని మతాలు ఒకటే అందరికి దేవుడు ఒక్కడే అని చెప్పే మతాలు ..ఇప్పుడు మాత్రం తమ ఆధిపత్యాన్ని పెంచుకోవటం కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నాయో అర్ధం కావటం లేదు ………

      • Sivakumara Sarma says:

        మీరు నా వ్యాఖ్యని అపార్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యలో ఈనాటి ఇండియాలోని రాజకీయ పార్టీల ప్రసక్తిలేదు. ఈనాడు వేళ్లమీద లెక్కించదగినన్ని దేశాల్లో మతమార్పిడికి స్వతంత్రం వుండొచ్చుగానీ, చరిత్రలో ఆ మాత్రంకూడా లేదు. క్రీస్తుకి శిలువ వెయ్యడమేగాక ఆయన అనుయాయులనికూడా తిన్నగా బతకనివ్వలేదు ఆనాటి రాజరికమూ, సమాజమూను. వ్యక్తిగతంగా మతం మారుచుకోవడంగూర్చి కాదు నేను చేసిన వ్యాఖ్య. ప్రతీ వ్యక్తికీ స్వయంగా ఆలోచించగల శక్తి వుంటుంది అని నేను నమ్మడం వల్లనే సామూహికంగా అలా జరగడమనేది నాకు నమ్మదగ్గదిగా అనిపించలేదని చెప్పాను.

  • కల్లూరి భాస్కరం says:

    శివకుమారశర్మ గారూ…

    మీ స్పందనకు ధన్యవాదాలు. నేను వేరే వ్యాసం రాయడంలో బిజీగా ఉండడంతో వెంటనే ప్రతిస్పందించలేకపోయాను.
    హెచ్.జి. వెల్స్ ఒక చరిత్రకారుడిగా నిష్పాక్షితను, తటస్థను పాటించాడని నాకు అనిపించింది. అలాగని అతన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, మానాలా అన్న చర్చలోకి నేను వెళ్ళను. అది ఆయనను చదివి ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. నేను హెచ్.జి. వెల్స్ గురించే రాస్తే ఆ చర్చలోకి వెడతానేమో తెలియదు.
    నన్ను ఆకర్షించిన హెచ్.జి. వాక్యాలు ఇవీ:
    These ‘book religions’, Christianity and Judaism, were religions that educated. Their continued existence depended very largely on people being able to read and understand their doctrinal ideas. The older religions had made no such appeal to the personal intelligence. In the ages of barbaric confusion that were now at hand in western Europe it was the Christian Church that was mainly instrumental in preserving the tradition of learning,
    హెచ్.జి. వెల్స్ యూదు కాదు. అయినా ఒక చరిత్రకారుడిగా ఈ రెండు మతాల గురించి రాశాడు. .ఒక మతాన్ని కించపరచి ఇంకో మతాన్ని గొప్పదనలేదు. ఒక చరిత్రకారుడిగానే పురాతన మతాలకు, ఈ రెండు మతాలకు ఉన్న తేడా చెప్పాడు. మతాల పరిణామ క్రమాన్ని ఒక తటస్థ దృష్టితో ఆయన చెబుతున్నాడు. చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాణ్ణిగా పైన ఆయన చేసిన వ్యాఖ్య నన్ను ఆకర్షించింది. యాజ్ఞవల్క్యుడు ఈ వ్యాఖ్య చేసినా నన్ను ఆకర్షిస్తుంది. నాకిందులో దేశీ, విదేశీ తేడాలు ఏమీ లేవు.
    పురాతన మతచ్చాయలు భారతదేశంలోనే కొనసాగుతున్నాయని, భారతదేశం ఇంకా క్రీస్తుపూర్వ దశలోనే ఉందనే థీమ్ ను నేను ఈ శీర్షిక కింద రాసిన అనేక వ్యాసాలలో చూడవచ్చు. కనుక పురాతన మతాల గురించి వెల్స్ చేసిన వ్యాఖ్య నన్ను ప్రత్యేకించి ఆకర్షించడం సహజం. పురాతన మతచ్చాయలలోనే ఇప్పటికీ మనదేశం ఉందన్న థీమ్ కు మరో ధృవీకరణగానే నేను పౌరాణికుల వారి మాటల్ని ప్రస్తావించాను. విశ్వాసం పక్కన కాస్త బుద్ధికి కూడా చోటివ్వాలనే ఒక పరిమిత ఉద్దేశమే తప్ప అందులో మతనింద చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. మతాల చరిత్ర మీదే తప్ప నాకు మతాలు, వాటి తేడాలలోకి లోతుగా వెళ్లాలన్న ఆసక్తి కూడా లేదు. మీరన్నట్టు క్రైస్తవం చేసిన కొన్ని పనులు బుద్ధికి పదును పెట్టేవి కాని మాట నిజమే కావచ్చు. అలా చూసినప్పుడు మన దగ్గరా బుద్ధికి పదును పెట్టిన ఉదాహరణాలు కనిపిస్తాయి. ఇక్కడ వెల్స్ ఆ వ్యాఖ్యను పరిమాణ దృష్టితో కాక గుణదృష్టితో చేసినట్టు నేను అనుకుంటున్నాను. నేను అలాగే తీసుకున్నాను.
    పురాతన మతచ్చాయలు కొనసాగుతున్న దేశంగా మన దగ్గర మత సహనం ఎక్కువ. భారతీయేతర వ్యవస్థీకృత మతాలలో అది తక్కువ. ఆవిధంగా చెప్పుకుంటే మన ప్లస్ పాయింట్లు మనకూ ఉన్నాయి.
    ఇక ఆత్మవిమర్శ అనడం దగ్గరికి వస్తే, ఇతరులు చేసేది విమర్శ అయితే, తనను తాను విమర్శించుకునేది ఆత్మ విమర్శ అన్న అర్థంలోనే ఆ మాట వాడాను.
    చివరగా…చరిత్రలో ఒక అద్భుతం జరిగిందని నేను అన్నప్పుడు అది మతమార్పిడులన్న ఊహ నాలో లేదు. నేను ప్రస్తావించిన పరిణామం మత మార్పిడుల ఫలితమని కూడా నేను అనుకోవడం లేదు. ఆ నాటి యూదులకు మత మార్పిడులు జరిపించే శక్తి కూడా లేదు. అది స్వచ్ఛందంగా జరిగిన మత మార్పిడి. క్రీస్తుపూర్వ కాలంలో మత పరివర్తనలు స్వచ్ఛందంగానే జరిగాయి. మనదేశంలో కూడా ఎందరో గ్రీకులు, శకులు, ఇతర విదేశీయులు స్వచ్ఛందంగా భారతీయ మతాలలోకి మారిన ఉదాహరణలు ఉన్నాయి.

    • కల్లూరి భాస్కరం says:

      మరచిపోయాను…నిజంగా నాకు అద్భుతం అనిపించినది ఫొనీషియన్లు, వారి నగరాలు అదృశ్యమైపోవడం. వాక్యాలు అటూ ఇటూ అయ్యాయి.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)