ప్రేమతో…

MythiliScaled
చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది. అమ్మాయి విచ్చుకునే రోజా మొగ్గ అంత ముద్దుగా ఉండేది. అడవిలో జలజలమనే వాగు గుసగుసల అంత తియ్యగా ఉండేది ఆమె గొంతుక.

ఆ గుడిసె పెద్దపెద్ద చెట్టుకొమ్మలతో అల్లిన తేనెతుట్టెలాగా ఉండేది. అందులో ఎప్పుడూ ఆరిపోని నెగడు ఉండేది. దాన్ని ఎవరూ వెలిగించకుండానే, పుల్లలు వేయకుండానే అది అలాగ మండుతూ ఉండేది. చలికాలం లో వెచ్చగా వేసవిలో చల్లగా ఉండేది దాని వెలుతురు. నెగడు కీ గోడకీ మధ్యని రెండు మంచాలు. ఒకటి సాదా కొయ్యతో చేసినది, దాని మీద ముసలమ్మ పడుకునేది. రెండోది మాత్రం మంచి ఓక్ కొయ్యతో చేసినది. మొహం కనిపించేంత నున్నగా చిత్రిక పట్టారు దాన్ని. దాని మీద లతలూ పూవులూ పక్షులూ చెక్కారు కూడా. ఒక రాజకుమారి మంచం లాగా ఉండేది, దాని మీద అమ్మాయి పడుకునేది. తన పేరు ఫినోలా- నిజానికి తనొక రాజకుమారే, ఆ సంగతి ఆమెకే గుర్తు లేదు.
గుడిసె బయట ఎటు చూసినా చెట్టూ చేమా లేని బీడు . మరొక మనిషి పొడైనా- చివరికి ఒక పిట్టైనా పురుగైనా, లేదు – ఏ అలికిడీ వినబడేది కాదు. తూర్పు వైపున పెద్ద కొండ. పగటిపూట నీలంగానూ , పొద్దు కుంకేవేళ వంద వింత రంగులతోనూ కనబడేది. దాన్ని చూస్తుండటం తప్పించి ఫినోలా కి ఏ ఉల్లాసమూ లేదు. కొండ అవతలినుంచి వీచే తుఫాను గాలి కూడా ఈ మైదానం లోకి వచ్చేసరికి నిశ్శబ్దంగా అయిపోయేది. తనతో తనే మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఫినోలా కాలం గడిపేది.
నెలకి ఒక్కసారి మాత్రం ఒక మరుగుజ్జు మనిషి కుంటి గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు. ముసలమ్మకీ ఫినోలాకీ నెలకి సరిపడా గోధుమలు బస్తాలో తెచ్చి ఇచ్చేవాడు. అదేమిటోకానీ అతనికీ మాటలు రావు. కాని ఫినోలా అంటే అతనికి ఎంతో ఇష్టంగా ఉండేది, ఆమె కోసం ఏమైనా చేయగలననీ చేయాలనీ అతనికి అనిపించేది. ఫినోలాకీ అతను రాగానే ప్రాణం లేచొచ్చినట్లుండేది. తనే ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ని అతని కోసం దాచి ఉంచేది.
ఒకరోజు అతను వచ్చినప్పుడు ఫినోలా ఎప్పటిలాగా ఎదురు రాలేదు. ముసలమ్మని సైగ లతో అడిగాడు ఏమైందని. ఉత్తిపుణ్యానికే ముసలమ్మకి కోపం వచ్చి కర్ర పుచ్చుకు కొట్టబోయింది. ఆమెని తప్పించుకుని గుర్రం ఎక్కుతున్న అతనికి గుడిసె వెనకవైపున కూర్చుని ఏడుస్తున్న ఫినోలా కనబడింది. ఎందుకో తనకి ఆవేళ పెద్ద దిగులు వచ్చేసింది. అది చూసి మరుగుజ్జుకి చాలా బాధేసింది. ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా కొండ అవతలి అడవిలోంచి వెళుతున్నాడు. అంతలో ఎక్కడినుంచో మాటలు వినిపించాయి
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” అని.
మరుగుజ్జు ఎదురుగా కొండవాలులో అతనిలో సగం ఎత్తున్న మనిషి కనిపించాడు. ఇత్తడి గుండీలు ఉన్న ఆకుపచ్చని అంగరఖా తొడుక్కుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతనొక గంధర్వుడు.
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” గంధర్వుడు మళ్ళీ అన్నాడు. ” నీకు స్వాగతం. గుర్రం దిగి నాతో రా. నీ పెదవులకి మంత్రదండం తాకించి నీకు మాటలు రప్పిస్తాను. మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది ”
అలాగే మరుగుజ్జు అతని వెంట వెళ్ళాడు. కొండ అడుగున చిన్న బిలం లోంచి ఇద్దరూ లోపలికి దిగారు. ఆ దారి మరుగుజ్జుకే చాలా ఇరుకుగా అనిపించింది. కొన్ని మెట్లు దిగి పెద్ద చావడిలోకి ప్రవేశించారు. అక్కడ బంగారు స్తంభాల మీద వెండి రేకుల కప్పుతో ఒక మంటపం. కప్పు మీదా స్తంభాలమీదా మిలమిల మెరిసే వజ్రాలు పొదిగి ఉన్నాయి. వేరే దీపాలు అక్కర్లేనంత కాంతి వాటిలోంచే వస్తోంది. చావడి మధ్యగా ఒక బల్ల వేసిఉంది. దాని పైన మళ్ళీ బంగారు పళ్ళాలూ వెండి చెం చాలు. అటూ ఇటూ రెండు చిన్న కుర్చీలు, వాటిలో నీలిరంగు పట్టుదిండ్లు. ఆ పక్కనే పెద్ద కంచుగంట.

 

story1
” ఇలా కూర్చో ” అని తనొక కుర్చీలో కూర్చుని మరొక కుర్చీ చూపాడు గంధర్వుడు- ” ముందు నీకు మాటలు రావాలి కదూ ” – కంచుగంట ని మోగించాడు. ఇంకొక మనిషి, మరుగుజ్జు చూపుడువేలంత అంత ఉన్నవాడు , వచ్చాడు.
” మాటలొచ్చే మంత్రదండం తీసుకురా ” అజ్ఞాపించాడు . వేలెడంత వాడు వినయం

గా వంగి వెనక్కి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చాడు. అదొక నల్లటి కర్ర. దాని చివరన ఎర్రగా మెరిసే కెంపు ఉంది. మరుగుజ్జు మొహం ముందు మూడుసార్లు దాన్ని ఆడించి, ఆ భుజమూ ఈ భుజమూ తట్టి- కెంపుని అతని పెదవులకి తాకించాడు గంధర్వుడు.
తర్వాత
” మాట్లాడు ” అన్నాడు. మరుగుజ్జుకి గొంతు పెగలింది. తన గొంతు ని తాను విని ఆనందం తో గంతులు వేశాడు.
” నువ్వు ఎవరో చెప్పు ?” అడిగాడు గంధర్వుడు.
” నువ్వెవరో చెప్పు ముందు ” మరుగుజ్జు అన్నాడు – ” మాటలు తర్వాత, బాగా ఆకలేస్తోంది ”

story2

సరే, ఇద్దరూ పళ్ళాల ముందు కూర్చున్నారు. గంధర్వుడు మళ్ళీ కంచుగంట మోగించాడు. వేలెడంతవాడు వచ్చి మూడు నాలుగు సార్లుగా రుచి గల రొట్టెలూ కూరలూ తీపి పదార్ధాలూ తెచ్చిపెట్టాడు. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. తర్వాత పళ్ళరసాలు తాగారు.
అప్పుడు మరుగుజ్జు చెప్పాడు ” మంచి విందు చేశావు, చాలా సంతోషం. నన్ను అడిగావు కదా నేనెవరని- ఇంతకీ నేనెవరో నాకు తెలియదు ! ”
” అసలు నీ గురించి నీకేమి తెలుసో చెప్పు ” అడిగాడు గంధర్వుడు.
” ఒక రోజున లిఫే నగరం లో రాజు గారి భవనం ముందు ఉన్నాను. అక్కడెవరో గారడీ చేస్తుంటే చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఆట అయాక రాజు నన్ను పిలిచి నా పేరేమిటో ఎక్కడనుంచి వచ్చానో అడిగాడు. జవాబు చెప్పటానికి నాకు మాటలు రాలేదు సరిగదా, అంతకుముందరి సంగతులన్నీ మర్చిపోయాను. రాజు నన్ను కొలువులో చేర్చుకుని పని అప్పగించాడు. నెలకొకసారి మైదానం మధ్యని గుడిసెకి గోధుమలు తీసుకుపోవటం , అంతే ” అని మరుగుజ్జు సమాధానం చెప్పాడు.
” అయితే అక్కడి అమ్మాయితో ప్రేమలో పడ్డావు కదూ ? ” గంధర్వుడు అడిగాడు.
మరుగుజ్జు ఒప్పుకుందుకు మొహమాటపడ్డాడు.
” మరేం పర్వాలేదు, నాకు తెలుసులే . ఆ అమ్మాయి ఒక రాజకుమారి. తనకొక శాపం ఉంది. దాన్ని పోగొట్టేందుకు ఏమైనా చేయగలవా మరి ? ”
” నా ప్రాణమైనా ఇస్తాను ”
” సరే అయితే, విను. ఈ రాజ్యం వాళ్ళదే అసలు. నువ్వు పనిచేస్తున్నావే ఒక రాజు కింద, అతను ఈ అమ్మాయి తండ్రిని ఓడించి చపేశాడు. రాజకుమారిని మాత్రం చంపకూడదనీ అలా చేస్తే తనూ చచ్చిపోతాడనీ జ్యోతిష్కులు చెప్పారట. రాజుకి ఒక మంత్రగత్తె తెలుసు. ఆమె నిద్రపోయే రాజకుమారిని మంచం తో సహా అక్కడికి చేర్చింది. ఒక మూగ ముసలమ్మని కాపలా పెట్టింది, మైదానాన్నంతా మంత్రించి నిశ్శబ్దం చేసింది. ఆమె ఉనికి ఎవరికీ తెలియకూడదని ఆ జాగ్రత్త అంతా. రాజకుమారి గతం మర్చిపోయేటట్లు, మైదానం దాటి వెళ్ళలేనట్లు కూడా చేసింది మంత్రగత్తె. ఇంక వాళ్ళకి ఆహారం ఇచ్చేందుకు రాజకుమారి విషయమే తెలియనివారు కావాలి, చూసినది ఎవరికీ చెప్పలేకుండా ఉండాలి. నిన్ను మూగవాడిని చేసి అందుకోసం నియమించారు ” – వివరించాడు గంధర్వుడు.
మరుగుజ్జు అడిగాడు – ” నీకింత తెలుసు కదా, నేనెవరో ఏమిటో చెప్పలేవా ?”
” నెమ్మదిమీద నీకే తెలుస్తుంది. నీకు మాటలైతే రప్పించగలిగాను, తర్వాతి సంగతి నువే చూసుకోగలవు. ఇంతకూ రాజకుమారి శాపం విడిపించే పని మొదలుపెడతావా ? ”
” ఓ ! తప్పకుండా !!! ”
” అందుకోసం దేన్నైనా సరే వదులుకోగలవా ?”
” చెప్పాను కదా, ప్రాణమైనా ఇస్తానని , అసలేం చేయాలో చెప్పు ”
” నువ్వు సరైన ఆయుధాలు సంపాదించుకోవాలి ”
” ఏమిటవి ? ఎక్కడ దొరుకుతాయి ?”

story3 (2)
” ఒక కంచు డాలు , రాగి కత్తి, ఇనప బల్లెం- ఈ మూడూ కావాలి. ఏవి పడితే అవి పనిచేయవు. పశ్చిమసముద్రం లో ఒక దీవి ఉంది. అందులో రహస్య సరస్సు ఉంటుంది. దాని అవతలి ఒడ్డున మాత్రమే ఇవి దొరుకుతాయి. సాహసం గలవారు మటుకే వాటిని సంపాదించగలరు. మైదానం లోకి తెచ్చి ఆ డాలు మీద కత్తితో మూడుసార్లూ బల్లెంతో మూడుసార్లూ కొట్టావా, అక్కడి నిశ్శబ్దం విచ్చిపోతుంది. శాపం తీరి రాజకుమారికి స్వేచ్ఛ వస్తుంది ”
” ఇప్పుడే బయల్దేరుతాను ” దిగ్గున లేచాడు మరుగుజ్జు.
” మళ్ళీ అడుగుతున్నాను, దేన్నైనా సరే త్యాగం చేయగలవు కదా ?”
” నిస్సందేహంగా ! ”
”ఇదిగో, నీ గుర్రం చెవిలో దారి చెబుతున్నాను . అది ఎలా తీసుకువెళితే అలా వెళ్ళు. సరాసరి పశ్చిమసముద్రపు తీరానికి చేరతావు. గుర్రం మీదే నువ్వు సముద్రం దాటి దీవికి చేరుకోవాలి. ఆ సముద్రం లో భయంకరమైన నీటి గుర్రాలు ఉంటాయి. అవి నిన్ను ఆపుతాయి. అవి అడిగినది ఇస్తేగానీ నిన్ను వెళ్ళనివ్వవు. పొరబాటున వాటిని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవాలనుకోకు, నిన్ను చీల్చి చెండాడతాయి. దీవి లో కాలుపెట్టిన తర్వాత రహస్య సరస్సు లో నీళ్ళు ఎర్రగా మారేదాకా వేచిఉండాలి. ఇక్కడ క్రూరమైన నీటి పక్షులు ఉంటాయి. అవి అడిగినది ఇచ్చాకే అవతలి ఒడ్డుకి వెళ్ళనిస్తాయి. వాటిని తప్పించుకు పోవాలని చూసినా చాలా ప్రమాదం. అంతా సవ్యంగా చేయగలిగితే ఆ ఒడ్డున ఉన్న డాలూ కత్తీ బల్లెం – నీకు దొరుకుతాయి ”

గంధర్వుడికి కి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని మరుగుజ్జు బయల్దేరాడు. కోనలు దాటీ లోయలు దాటీ కనుమలలోంచి వెళ్ళీ వెళ్ళీ పశ్చిమసముద్రతీరం చేరేసరికి పొద్దు వాలుతోంది. చూస్తుండగానే కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి అలముకుంది. అలసటగా గుర్రమూ తనూ అక్కడే నిద్రపోయారు.
తెల్లారి లేచి చూస్తే సముద్రం లో ఎక్కడా నీటిగుర్రాలు లేవు. వేరే ఇంకొక చోటి కి వచ్చానా అని మరుగుజ్జు ఆదుర్దా పడ్డాడు. అంతలో సముద్రపు అలలు విసురుగా విరిగి పడటం మొదలైంది. భీబత్సంగా సకిలిస్తూ చాలా నీటిగుర్రాలు అక్కడికి ఈదుకుంటూ వచ్చాయి. వాటి ముఖాలు భీకరంగా ఉన్నాయి. మింగేస్తాయా అనిపించి మరుగుజ్జు వణికిపోయాడు. తిరిగివెళ్ళిపోదామనుకున్నాడు. అప్పుడు ఎక్కడినుంచో శ్రావ్యమైన హార్ప్ ధ్వని వినిపించింది. కొండ దిగువన గంధర్వుడు అక్కడ ప్రత్యక్షమ యా డు. అతని చేతిలోనే హార్ప్ ఉంది. వింటూనే మరుగుజ్జుకి ధైర్యం వచ్చింది.
” త్యాగం చేస్తావా ? ” మూడుసార్లు అడిగాడు అతను.
అన్నిసార్లూ సరేనన్నాడు మరుగుజ్జు.
” వెనక్కి మరలండి ” నీటిగుర్రాలకి ఆజ్ఞ ఇచ్చాడు గంధర్వుడు. అవి అలాగే చేశాయి.
” ఏమి వదలాలి ?”
” నీ కుడి కంటిని ”
మరుగుజ్జుకి భయం వేసింది. కాని ఫినోలాని తలచుకుని ఆమె కోసం ఒప్పుకున్నాడు. వెంటనే కుడి కంటిలో భరించలేనంత నొప్పి పెట్టింది. చూపు పోయింది. గంధర్వుడు కొత్త పాట హార్ప్ మీద వాయించాడు. వినగా వినగా మరుగుజ్జుకి నొప్పి తగ్గింది. నీటిగుర్రాలు మాయమైనాయి.
” ఇప్పుడు దాటు ” చెప్పాడు గంధర్వుడు.
గుర్రం తో సహా సముద్రం దాటి దీవిలోకి వెళ్ళాడు మరుగుజ్జు. పచ్చటి చెట్లతో సువాసనలు చిమ్మే పూలతో దీవి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మెలికలు తిరిగే సన్నటి బాటలవెంట దౌడు తీసి , గుర్రం ఒక సరస్సు ఒడ్డుకి చేరి ఆగిపోయింది. అదే రహస్య సరస్సు. ఏ కదలికా లేకుండా , సూర్యకాంతిలో అద్దంలాగా ప్రకాశిస్తోంది సరస్సు. మరుగుజ్జు గుండె ఎందుకనో వేగంగా కొట్టుకుంది. చాలాసేపటి తర్వాత గుర్రం దిగి ఒడ్డు న ఉన్న పచ్చికలో నడుము వాల్చాడు . ఎంత సేపు చూసినా నీళ్ళు ఎర్రబడనే లేదు.

మధ్యాహ్నం అవుతుండగా ఆకాశం లో పెద్ద నల్లటి మేఘం సరస్సు మీదికి వాలుతున్నట్లు కనిపించింది. పరీక్షగా చూస్తే అది బ్రహ్మాండమైన పక్షుల గుంపు. ఒక్కొక్క పక్షీ గుర్రానికి రెండు రెట్లు పెద్దగా ఉంది. పక్షుల న్నీ ముక్కు ల తో గుమ్మడికాయలంత పళ్ళు తెచ్చాయి. వాటిని తిని గింజలను సరస్సులోకి వదిలాయి. ఒక్కొక్క గింజా పడుతూనే నీళ్ళు ఎర్రగా మారటం మొదలైంది. కాసేపటికి అంతా ఎర్రటి నీళ్ళే. తర్వాత అన్ని పక్షులూ వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. మరుగుజ్జు సరస్సు దాటాలని అడుగు ముందుకువేశాడు. మూడు పక్షులు ఎక్కడినుంచో వికృతంగా అరుస్తూ అడ్డు పడ్డాయి. అవి అడిగినది ఇవ్వకుండా సరస్సుని దాటటం కుదరదని గంధర్వుడు చెప్పినమాట గుర్తొచ్చి ఆగాడు. ఏం అడుగుతాయోనని భయం వేసి , వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు. మళ్ళీ హార్ప్ ధ్వని చెవుల్లో అమృతం పోస్తూ వినిపించింది.
గంధర్వుడు ప్రత్యక్షమై ఫినోలా పేరు పలికాడు. ఎలాగైనా ఆమె శాపాన్ని పోగొట్టాలని మరుగుజ్జుకి బలంగా అనిపించింది. ముందుకి కదిలాడు.
” ఏమి ఇవ్వాలి ? ”
” నీ ఎడమ కంటిని ”
గుండె చిక్కబట్టుకుని ఒప్పుకున్నాడు. చూపు మొత్తమూ పోయి నొప్పితో మూర్చపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చింది.
గంధర్వుడు చెప్పాడు ” గుర్రం మెడ గట్టిగా పట్టుకో. దాన్ని నేను నీటిలోకి నడిపిస్తాను. ఏమీ భయపడకుండా సరస్సులో మునుగు. నన్ను నమ్ము, నీకు మంచి జరుగుతుంది ”
తెగించి మరుగుజ్జు గుర్రం తో సహా మునిగాడు. కాళ్ళు తేలిపోతున్నాయి. ఊపిరి ఆడలేదు. మెల్లిగా నీటి అడుగున వెలుతురు. పైకి తేలి వస్తూనే చూపు తిరిగివచ్చిందని తెలుసుకున్నాడు. విపరీతమైన సంతోషం వేసింది. అవతలి ఒడ్డుకి వెళ్ళాక గుర్రంలో మార్పు వచ్చింది. కుంటితనం పోయి గొప్ప జాతిదానిలాగా బలంగా అందంగా అయింది. తన చేతులూ కాళ్ళలో ఏదో కదలిక తెలిసింది అతనికి. ఊహించని శక్తి వచ్చింది. తనని తాను చూసుకున్నాడు- ఇప్పుడు మరుగుజ్జుగా లేడు, పొడుగ్గా దృఢంగా తయారయాడు. కంచుడాలూ బల్లెమూ కత్తీ కనిపించాయి. గబగబా వెళ్ళి మెరుస్తున్న డాలులో మొహం చూసుకున్నాడు. చాలా చక్కగా ఉన్నానని అర్థమైంది. మెల్లిగా అంతా జ్ఞాపకం వచ్చింది.

తనొక పెద్ద రాజ్యానికి యువరాజు. దేశాటన చేస్తూ వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజు మాయలో పడ్డాడు. ఫినోలా మీద ప్రేమతో ఈ సాహసం చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడో ఏమో. మూడు వస్తువులూ తీసుకుని తేలికైన మనసుతో వెనక్కి బయల్దేరాడు. ఈ తిరుగు ప్రయాణం లో ఏ అడ్డంకీ రాలేదు. క్రూరమైన పక్షులూ నీటి గుర్రాలకి బదులు సొగసైన హం సలు శాంతంగా ఈదుతున్నాయి.
త్వరలోనే మైదానం మధ్యని గుడిసెకి చేరాడు. కంచుడాలు ని మూడుసార్లు రాగికత్తితో, మూడుసార్లు ఇనపబల్లెం తో కొట్టాడు. గుడిసె మాయమైంది. ఫినోలా నవ్వుతూ అతని ఎదురుగా నిలుచుంది. బీడులో పచ్చిక మొలిచింది, చెట్లు పెరిగాయి, పూవులు పూశాయి, పిట్టలు పాడాయి. ఫినోలాని గుర్రం మీద ఎక్కించుకుని అతను ఉత్తరంగా ఉన్న తన రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు.

ఐరిష్ జానపద కథ , సేకరణ – Edmund Leamy .

Download PDF

8 Comments

  • వనం వేంకట వరప్రసాదరావు says:

    బాగంది మైథిలి గారూ! కోయీ తో లౌటాదే .. .. బచ్ పన్ మేరా’ పాట గుర్తుకొచ్చింది! కనుమరుగైపోయినా సరే, బాల్యాన్ని మరిచిపోనంతకాలం గుర్తుకు తెచ్చుకుంటున్నంత కాలమూ.. సున్నితమైన భావాలు సన్నటి పరదాల్లా కదులుతూనే ఉంటాయి! ధన్యవాదాలు!

    • Mythili abbaraju says:

      ధన్యవాదాలు వరప్రసాద రావు గారూ. సన్నటి పరదాలు…కదా…

  • బావుంది. ఈ కథలన్నీ ఒక అద్భుతమైన మాయలోకం లోకి తీసుకుపోతున్నాయి వారం వారం.

  • padmaja.y says:

    నువ్వు రావటానికి తరుణం వచ్చింది,నీ గుర్రం చెవిలో దారి చెబుతున్నాను . అది ఎలా తీసుకువెళితే అలా వెళ్ళు.గుర్రం మెడ గట్టిగా పట్టుకో. దాన్ని నేను నీటిలోకి నడిపిస్తాను. ఏమీ భయపడకుండా సరస్సులో మునుగు. నన్ను నమ్ము, నీకు మంచి జరుగుతుంది.తనొక పెద్ద రాజ్యానికి యువరాజు. దేశాటన చేస్తూ వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజు మాయలో పడ్డాడు. ఫినోలా మీద ప్రేమతో ఈ సాహసం చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడో ఏమో. మూడు వస్తువులూ తీసుకుని తేలికైన మనసుతో వెనక్కి బయల్దేరాడు…….. ఎట్టకేలకు గంధర్వుడి దయతో మరుగుజ్జు పూర్వపు వైభవాన్నిపొందడమే కాకుండా రాకుమారినీ రక్షించగలిగేడు. fairy టేల్స్ కథలన్నీ అద్భుతం గానే వుంటాయి. చక్కని అనువాదం .బావుంది

    • Mythili abbaraju says:

      ధన్యవాదాలు పద్మజ గారూ. మీరు ప్రతి కథనూ చదువుతున్నందుకు ఆనందంగా ఉంది

  • Rekha Jyothi says:

    ప్రతీ వాక్యం , ప్రతీ దృశ్యం సాహసాన్ని ప్రతిఫలించింది మామ్ ! ‘ ఏమైనా ఇవ్వగలవా ? ‘ అనే ప్రశ్న కు సమాధానం ఇవ్వగలిగిన వారు, ప్రేమనూ ప్రపంచాన్ని ఇట్టే జయించగలరేమో కదా ! Thank u for giving this story Mam

Leave a Reply to వనం వేంకట వరప్రసాదరావు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)