సంతానోత్పత్తిలో స్త్రీది అట్టడుగు స్థానమే!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఎనిమిది వ్యాసాల క్రితం విడిచిపెట్టిన ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంలోకి తిరిగి వెడదాం…

అభినయంతో కూడిన మాంత్రిక వాస్తవికతకు మహాభారతంలోని సర్పయాగం, ధృష్టద్యుమ్న ద్రౌపదుల జన్మ వృత్తాంతం అద్దం పడుతున్నాయని చెప్పుకున్నాం. సంస్కృత భారతంలో కనిపించే ఆ చిత్రణ నన్నయ అనువాదంలో లోపించిందని కూడా చెప్పుకున్నాం. అయితే, సర్పయాగ ఉదంతంలో కొంత పరోక్షంగానూ, ధృష్టద్యుమ్న, ద్రౌపదుల వృత్తాంతంలో ప్రత్యక్షంగానూ ఇంకో విశేషం కూడా ఉంది. అది, మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ‘మహాభారతతత్త్వ కథనము’లో చెప్పిన ప్రకారం సంస్కృత భారత కథనం ఇలా ఉంటుంది…

ద్రోణుని సంహరించగల కొడుకుకోసం ద్రుపదుడు హోమ సన్నాహాలు అన్నీ చేసుకున్నాడు. యాజుడు ఋత్విక్కుగా,అతని తమ్ముడైన ఉపయాజుడు సహాయకుడిగా హోమం మొదలైంది. క్రమంగా పూర్తి కావచ్చింది. అప్పుడు యాజుడు,

“త్వరగా నీ భార్యను యజ్ఞవేదిక దగ్గరికి రప్పించు. ఆమె హవిస్సును స్వీకరించాలి. ఆమెకు కొడుకు, కూతురూ కూడా కలగబోతున్నారు” అంటూ ద్రుపదుని తొందరపెట్టాడు. యాజుడికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉంది.

ద్రుపదుని భార్యకు కబురు వెళ్లింది. కానీ ఆమె రాలేదు.

“నేను రజస్వలనయ్యాను. ఇలాంటి అస్పృశ్యస్థితిలో వెంటనే యజ్ఞస్థలికి రాలేను. స్నానం చేసి వస్తాను. అంతవరకూ ఆగండి” అని కబురు చేసింది.

అప్పుడు యాజుడు-

“ఇది యాజుడు(అంతటివాడు) సిద్ధం చేయగా, ఉపయాజుడు(అంతటివాడు) అభిమంత్రించిన హవిస్సు. నువ్వు ఎలా ఉన్నాసరే, ఈ ప్రయోగంలో ఆలస్యం జరగడానికి వీల్లేదు. (నువ్వు రా, రాకపో) మేము శుక్లశోణిత సంబంధం లేకుండానే స్త్రీపురుషుల జంటను పుట్టించగలం” అన్నాడు.

వెంటనే హవిస్సును హోమం చేశాడు. అప్పుడు కిరీట, కవచాలతో; ఖడ్గ, ధనుర్బాణాలతో జ్వాలావర్ణంలో ఉన్న ఒక పురుషుడు గర్జిస్తూ అగ్నిగుండం నుంచి అవతరించాడు. అదే సమయంలో ఒక అసమాన సుందరి యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమయింది. ఆమె శరీర సుగంధం దూరదూరాలకు వ్యాపిస్తోంది. స్వర్గలక్ష్మే మనిషి రూపం ధరించిందా అన్నట్టుగా ఉంది.

“ఈమె క్షత్రియ వినాశనం అనే ఒక దేవకార్యాన్ని నిర్వహిస్తుంది. ఈమె వల్ల కౌరవుల్లో భయోత్పాతం పుడుతుంది” అని ఆకాశం నుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది.

వారే ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది.

***

హవిస్సును స్వీకరించడానికి ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం…నేను వెంటనే రాలేననీ, కొంతసేపు ఆగమనీ ఆమె కబురు చేయడం…ఆమె వచ్చినా రాకపోయినా శుక్ల, శోణిత సంబంధం లేకుండానే మేము స్త్రీ, పురుష జంటను సృష్టించగలమంటూ యాజుడు హవిస్సును అగ్నికి అర్పించడం…తక్షణమే అగ్నిగుండం నుంచి ధృష్టద్యుమ్నుడూ, యజ్ఞవేదిక మీద ద్రౌపదీ ప్రత్యక్షమవడం…ఈ సన్నివేశాల క్రమాన్ని ఒకసారి ఊహించుకోండి.

ఇందులో ఒక తొందర, ఒక టెన్షన్; సంభాషణ, అభినయంతో కూడిన ఒక నాటకీయత; అవన్నీ కలసి ఒక పతాకసన్నివేశానికి దారితీస్తుండడం స్పష్టంగా కనిపిస్తాయి. అంతిమంగా ఆ పతాకఘట్టం అప్పటికప్పుడు ఇరువురు స్త్రీ, పురుషుల అవతరణ అనే అద్భుతాన్ని ఆవిష్కరించింది!

ఇందులో అనుసరించిన నమూనా మనం ఇంతకుముందు చెప్పుకున్నదే. అది, సామూహిక నృత్యం, గీతం, అభినయం; లేదా మరో సామూహిక చర్య రూపంలో ఆదిమసమాజాలు అన్నీ అనుసరిస్తూ వచ్చిన మాంత్రిక ప్రక్రియే. భౌతిక వాస్తవికతపై భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా కోరుకున్న భౌతిక ఫలితాలను సాధించగలమన్న ఊహే దీనికి ప్రాతిపదిక. న్యూజీలాండ్ లోని మావోరీ తెగకు చెందిన యువతులు పొలానికి వెళ్ళి ఆలుగడ్డల పంట వృద్ధిని నృత్య, గీతాల ద్వారా ఎలా అభినయిస్తారో గతంలో చెప్పుకున్నాం.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టంలోనూ, సర్పయాగ ఘట్టంలోనూ కూడా యాగమే ఈ మాంత్రిక అభినయానికి సందర్భం అవుతోంది. నిజానికి ధృష్టద్యుమ్న, ద్రౌపదుల ఉదంతంలో రెండు అద్భుతాలు జరిగాయి. మొదటిది, వారు ప్రత్యక్షమైన తీరు అయితే, రెండవది శుక్ల, శోణిత సంబంధం లేకుండానే; అంటే పురుషుడు-స్త్రీ కలయిక లేకుండానే వారు జన్మించడం. యోని సంబంధం లేదు కనుక వారు ‘అయోనిజు’లు. ‘అయోనిజ’గా మనకు పరిచయమైన మరో పాత్ర, సీత. ప్రస్తుత సందర్భంలో ధృష్టద్యుమ్న ద్రౌపదులే కాక; స్వయంగా ద్రుపదుడు, ద్రోణుడు మొదలైనవారు కూడా యోని సంబంధం నుంచి పుట్టినవారు కాదు కనుక ‘అయోనిజు’ల కిందికే వస్తారని ఇంతకు ముందు చెప్పుకున్నాం. కానీ సీత, ద్రౌపదుల విషయంలో చెప్పినట్టుగా మిగిలినవారి విషయంలో అయోనిజ కోణాన్ని సంప్రదాయం నొక్కి చెప్పడం లేదని కూడా అనుకున్నాం.

అలాగే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల అవతరణ వెనుక ద్రుపదుని అసలు లక్ష్యం రాజకీయ సంబంధి. తనను అవమానించిన ద్రోణుడిపై పగ తీర్చుకునే కొడుకును పొందడమే అతని ప్రధాన లక్ష్యం. కిరీట, కవచాలతో, ఖడ్గ, ధనుర్బాణాలతో గర్జిస్తూ ధృష్టద్యుమ్నుడు జన్మించడం ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉంది. అది శత్రువుకు ఇవ్వవలసిన సందేశమూ ఇస్తూనే ఉంది. లౌకికంగా చెబితే, తనను ఓడించగల ఒక వీరుని ద్రుపదుడు సిద్ధం చేశాడన్న కబురు ద్రోణుడికి అందుతుంది. ఆ వీరుని ద్రుపదుడు దత్తు చేసుకుని ఉండవచ్చు. యాజ, ఉపయాజుల సాయంతో జరిపిన తంతు దత్తతకు సంబంధించిన తంతే కావచ్చు. అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాంత్రిక రూపాన్ని ఒక రాజకీయ అవసరానికి వాడుకుని ఉండచ్చు.

ద్రుపదుడి యజ్ఞానికి పూర్వరంగంలో జరిగింది గుర్తుచేసుకున్నా రాజకీయ అవసరానికే మాంత్రిక రూపాన్ని వాడుకున్నారన్న సంగతి అర్థమవుతుంది. అన్న యాజుడికంటే తపశ్శాలి అయిన ఉపయాజుడు స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి ఒప్పుకోలేదు. ఏడాదిపాటు ద్రుపదుని తన చుట్టూ తిప్పుకున్న తర్వాత, ధనం అవసరమైన తన అన్నను అడగమని చెప్పాడు. అన్నకు సహాయకుడిగా మాత్రమే తను యజ్ఞంలో పాల్గొన్నాడు. ఈ వివరాలు ఈ యజ్ఞం వెనుక ఏదో మాయ ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. విచిత్రం ఏమిటంటే, సర్పయాగం కూడా అటువంటి అనుమానాలనే కలిగిస్తుంది.

ఇంకొకటి కూడా చూడండి. ద్రుపదుడు కొడుకునే కోరుకున్నాడు తప్ప యజ్ఞవేదిక మీద కూతురు కూడా ప్రత్యక్షమవుతుందని మొదట అనుకోలేదని పై వివరాలు సూచిస్తున్నాయి. యాజుడు హోమం పూర్తి కావస్తున్న దశలోనే కొడుకూ, కూతురూ కూడా కలగబోతున్నారని చెబుతాడు. అతనికి భవిష్యత్తును చెప్పగల శక్తి ఉందని ఆ సందర్భంలో కథకుడు అంటున్నాడు. పైగా ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అవతరించిన తీరు ఒక్కలానే లేదు. ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండంలోంచి ఉద్భవిస్తే, ద్రౌపది యజ్ఞవేదిక మీద ప్రత్యక్షమైంది. అనంతర కథాక్రమాన్ని చూసినప్పుడు, సాక్షాత్తు అగ్నిగుండం నుంచి అవతరించిన ధృష్టద్యుమ్నుని కంటే యజ్ఞవేదిక మీద అవతరించిన ద్రౌపదే మహాభారతంలో కీలకపాత్ర అయింది.

ఇంకా విచిత్రం ఏమిటంటే, ద్రోణుని వధించడమే లక్ష్యంగా ద్రుపదుడు పొందిన కొడుకు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయాడు. ద్రోణుడు అస్త్రసన్యాసం చేసిన తర్వాతే, అంతా వద్దు వద్దంటున్నా వినకుండా ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శిరస్సును ఛేదించాడు. ఒక లక్ష్యంతో అగ్నిగుండం నుంచి పుట్టించినవాడు అలా చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ద్రౌపది అవతరించినప్పుడు అదృశ్యవాణి ఆమె గురించి చెప్పినట్టుగా ధృష్టద్యుమ్నుని గురించి చెప్పలేదు. కనుక అదృశ్యవాణి అనేది, జరిగిపోయిన కథను జరుగుతున్నట్టు చెప్పడంలో కథకుడు చేసిన ఆపాదనగా అర్థమవుతూనే ఉంది. అలా చూసినప్పుడు అసలు యజ్ఞమే ఒక ఆపాదన కావచ్చు. ద్రౌపదే అగ్నిగుండం నుంచి ఉద్భవించిందనీ, ధృష్టద్యుమ్నుడే యజ్ఞవేదిక మీద ప్రత్యేక్షమయ్యాడనీ చెప్పి ఉంటే అది భవిష్యత్తులో వారు నిర్వహించబోయే పాత్రలకు తగినట్టు ఉండేది. అయితే, ద్రుపదుడి కోణం నుంచి చూసినప్పుడు, కూతుర్ని పొందడం కన్నా కొడుకును పొందడమే అతని తక్షణావసరం కనుక, కొడుకు అగ్నిగుండం నుంచి పుట్టడమే అర్థవంతం కావచ్చు.

ద్రుపదుని భార్య సరళి ఇందులో మరో ఆశ్చర్యం. దత్తత స్వీకారమైనా, యజ్ఞమైనా ధర్మపత్నీ సమేతంగా చేయవలసిందే. సంప్రదాయం ప్రకారం, ధర్మపత్ని పక్కన లేనిదే భర్త ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదు. కానీ ఇక్కడ ద్రుపదుని భార్య దగ్గరలేకుండానే యజ్ఞం జరిగిపోతోంది. అందులోనూ అది పుత్రునికోసం జరుగుతున్న యజ్ఞం. కబురు పంపినప్పుడు, నేను రజస్వలస్థితిలో అస్పృశ్యంగా ఉన్నాననీ, స్నానం చేసి వచ్చేవరకూ ఆగండనీ ఆమె చెప్పి పంపింది. ఈ వివరాల రీత్యా చూసినా అది ఎలాంటి యజ్ఞం అన్న అనుమానం కలుగుతుంది.

లేక, దత్తత స్వీకారం లేదా యజ్ఞం అనే తంతు కన్నా ముఖ్యమని భావించిన ఒక అంశాన్ని నొక్కి చెప్పడానికి కథకుడు ఈ చిత్రణను ఉపయోగించుకుంటూ ఉండచ్చు. అది మాతృస్వామ్య-పితృస్వామ్య కోణం!

పైన చెప్పిన మొత్తం ఉదంతాన్ని ఓసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి…ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదుని భార్యను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రుపదుడు, ద్రోణుడు పుట్టిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, సంతానోత్పత్తికి స్త్రీ సంబంధం అవసరం లేదని మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు ఈ ఘట్టాన్ని వాడుకున్నాడా అనిపిస్తుంది. ద్రుపదుని భార్య యజ్ఞవేదిక దగ్గరకు రానీ, రాకపోనీ; తను సిద్ధం చేసి, ఉపయాజుడు అభిమంత్రించిన హవిస్సే స్త్రీ, పురుషులను పుట్టిస్తుందని యాజుడు చెబుతున్నాడు. ఆవిధంగా సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను నిరాకరిస్తున్నాడు. నిజానికి ఇక్కడ ధృష్టద్యుమ్న, ద్రౌపదులను పుట్టించడంలో ద్రుపదునికీ, ద్రుపదుని భార్యకూ కూడా భౌతికంగా ఎలాంటి పాత్రా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, ఇద్దరూ ఉద్భవించేనాటికి యవ్వన, లేదా కౌమారదశలో ఉన్నట్టు వారిని వర్ణించిన తీరు చెబుతోంది. కనుక, హవిస్సును స్వీకరించడానికి వెంటనే ద్రుపదుని భార్యను రప్పించమని యాజుడు తొందర పెట్టడం, నేను అశుచిగా ఉన్నానని ఆమె వర్తమానం పంపడం, ఆమె రాకపోయినా సరే, శుక్ల, శోణిత సంబంధం లేకుండా మా మంత్రశక్తే పని జరిపిస్తుందని యాజుడు అనడంలో అర్థం లేదు. అయినా సరే, ద్రుపదుని భార్యను ముగ్గులోకి లాగి మరీ ఆమె అవసరాన్ని తోసిపుచ్చడం; సంతానోత్పత్తికి స్త్రీ అవసరం లేదని ఇంకోసారి నొక్కి చెప్పడానికే అనిపిస్తుంది. ఈ విధంగా ఇది మాతృస్వామ్య-పితృస్వామ్యాల ఘర్షణలో ఒక పార్శ్వాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***

ravi_varma-draupadi_carrying_milk_honey1

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మవృత్తాంతంపై పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగార్ల మధ్య జరిగిన వాదోపవాదాల గురించి తెలుసుకోవడం ఈ సందర్భంలో ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా పెండ్యాలవారి వాదం ఎలా ఉందో చూద్దాం:

ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది దత్తులు కావచ్చునని నిరూపించడానికి పెండ్యాలవారు ప్రయత్నించారు. ఆయన ఇలా అంటారు:

“ఇతడు(ధృష్టద్యుమ్నుడు) అగ్నిగుండమున జన్మించెనని మహాభారతములో నున్నది. కానీ ద్రోణ సంహారమే ప్రయోజనముగా నగ్నియం దయోనిజుడై జన్మించిన ధృష్టద్యుమ్నుడు యుద్ధములో ద్రోణుని జయించి వధించి యుండవలెను. అట్లు గా కితడు అస్త్రసన్యాసము గావించి యోగశక్తిచే ప్రాణములు విడిచిన ద్రోణశవకంఠమును మాత్రమే ఖండించియున్నాడు. ద్రోణవధ కితడు నిమిత్తమాత్రుడై యున్నాడు గాని, యితనివలన నైన దేమియు లేదు. ఇంతమాత్రమున నిత డగ్ని యంద యోనిజుడై యేల జన్మించెనో తెలియకున్నది.”

“కావున నితడు ద్రోణవధార్థము దత్తతగా స్వీకరింపబడినవాడనియు, నితని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను.”

“ద్రౌపది ద్రుపదునకు ధృష్టద్యుమ్నునితోబాటు దత్తపుత్రిక యని నా యభిప్రాయము. పుత్రేష్టిని బట్టియు, పంచేంద్రోపాఖ్యానమును బట్టియు విచారించి చూడగా ఋషికన్యయైన యామెను ద్రుపదుడు దత్తపుత్రికగా స్వీకరించె ననియే తోచుచున్నది.”

ఇక్కడ పెండ్యాలవారు “ఇతని యుత్పత్తికి సంబంధించిన దివ్యగాథ యాధిదైవిక తత్వానుకూలముగా వ్రాయబడు గ్రంథస్వభావమనియు తలంచుచున్నాను” అని అనడం ప్రత్యేకించి ఆకర్షించే అంశం. ‘గ్రంథస్వభావం’ అనడం ద్వారా ఆయన ఎనభై, తొంభై యేళ్ళ క్రితమే సాహిత్యచర్చలోకి రూపా (form) న్ని తీసుకొస్తున్నారు. సంప్రదాయసాహిత్యంలో దివ్యత్వ లేదా అద్భుతత్వ ఆరోపాల కింద దృశ్యాదృశ్యంగా ఉన్న వాస్తవికతను, చరిత్రను గుర్తించడానికి ఈ రూప సంబంధమైన అవగాహన కీలకమైన తాళంచెవి.

అదలా ఉంచితే, వారణాసివారు సంప్రదాయ పాఠాన్ని ఉన్నది ఉన్నట్టు సమర్థిస్తూ పెండ్యాలవారి వాదాన్ని ఖండిస్తారు. సంప్రదాయపాఠం గురించి ఆయన అభిప్రాయం ఇదీ:

“ఈ ద్రౌపదీధృష్టద్యుమ్నాద్యుత్పత్తులు దివ్యకృత్యములు. ఆ దివ్యకృత్యములను బోధించుచున్న భాష దివ్యభాష. అట్టి మహాభారతమును తలక్రిందు చేసినవారు విమర్శకులు.”

“ఇంతమాత్రమున కిత డగ్ని యందేల జన్మించెనో?” అన్న పెండ్యాలవారి వ్యాఖ్యకు వారణాసివారి సమాధానం ఇలా ఉంటుంది:

“ఇదేమి శంక? ఇంత పని చేయగలవాడైనపుడే అగ్నియందు జన్మించునని యున్నదా యేమి? మంత్రసంస్కృతమైన హవిస్సునందు ద్రోణాంతకుడగు పుత్రుని జన్మింపజేయు అమోఘశక్తి యేర్పడినది. అట్టి హవిస్సు అగ్ని యందుంచబడినది. అందుచే నగ్ని నుండియే జన్మించెను. దీనికి శంక యేమున్నది?”

అయితే, ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శవ కంఠాన్ని మాత్రమే ఖండించాడన్న పెండ్యాలవారి వాదాన్ని తోసిపుచ్చుతూ, ద్రోణుడు ప్రాణాలతో ఉండగానే ధృష్టద్యుమ్నుడు అతని కంఠాన్ని నరికాడని వారణాసివారు నిరూపించిన తీరు సమంజసంగా అనిపిస్తుంది.

ఇంతకు మించి ఆసక్తి గొలిపేది శుక్ర(శుక్ల), శోణితాలపై ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చ. పెండ్యాలవారు ఇలా అంటారు:

“స్త్రీపురుషుల శుక్రశోణిత సమ్మేళనము లేకుండగ జన్మ మొక్క శుక్లముచేతనే కలుగునని పూర్వపాశ్చాత్యశాస్త్రము లేవియు నంగీకరింపవు. ద్రోణజన్మకథ జూడగ ఘృతాచి యను నప్సరస భరద్వాజునకు ద్రోణుని గని యా బాలుని ద్రోణ కలశములో బెట్టగ భరద్వాజుడే పెంచి పెద్దవానిని జేసి యాతనికి ద్రోణుడని పేరు బెట్టి యుండె నని తోచును.”

శుక్ర, శోణిత సంబంధం లేకుండానే మనుషులతో సహా ప్రాణులు అనేకం పుట్టడం సాధ్యమే నని వారణాసి వారు అంటూ ఇందుకు సమర్థనగా వైశేషిక, వేదాంత దర్శనాల నుంచి; ఛాందోగ్యోపనిషత్తు నుంచి కొన్ని వాక్యాలను ఉదహరిస్తారు. ఛాందోగ్యోపనిషత్తు ప్రకారం, సంతానోత్పత్తిలో పురుషుడిది నాలుగవ స్థానమైతే, స్త్రీది అయిదవ స్థానం మాత్రమే. వారి వాదం ఇలా ఉంటుంది:

“(వైశేషిక దర్శనంలో) యోనిజము, అయోనిజము అని శరీరము ద్వివిధమనియు, శుక్రశోణిత సంబంధము లేకయే ధర్మవిశేషముచే కలుగునట్టి దయోనిజమనియు, నట్టిది దేవతల యొక్కయు, ఋషుల యొక్కయు శరీరమనియు, నట్టి అయోనిజు లుండిరనియు చెప్పబడినది.”

శుక్ర, శోణిత సంబంధంలేకుండానే క్రిమి కీటకాలు, చెట్లు మొదలైనవి పుట్టడం లేదా అని ఆయన ప్రశ్నిస్తూ, మనుషుల్లోనూ అది ఎలా సాధ్యమో ఛాందోగ్యోపనిషత్తును ఉటంకిస్తారు. దాని ప్రకారం, ఈ లోకంలో జన్మించడానికి అయిదు మార్గాలు ఉన్నాయి. 1. ద్యులోకం, అంటే ఆకాశం 2. పర్జన్యం, అంటే మేఘం. 3. భూమి. 4. పురుషుడు. 5. స్త్రీ. వారి వారి అర్హతలను బట్టి అవరోహణ క్రమంలో ఈ మార్గాలలో జన్మిస్తారు. 4(పురుషుడు), 5(స్త్రీ) స్థానాల కలయిక వల్ల సంతానం కలుగుతుందని చెప్పారే కానీ, మిగిలిన స్థానాలలో కలగదని చెప్పలేదు. కనుక ద్రోణుడు మొదలైనవారు అయిదవ స్థానమైన స్త్రీతో నిమిత్తం లేకుండానే, నాలుగవ స్థానమైన పురుషునిద్వారానే పుట్టారు. ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది మొదలైనవారు 4,5 స్థానాలతో; అంటే పురుష-స్త్రీ సంబంధంతో నిమిత్తం లేకుండానే పుట్టారు.

ఇదీ వారణాసి వారు వినిపించిన వాదం.

సంతానోత్పత్తిలో స్త్రీ స్థానం అట్టడుగుకి జారిపోవడం, పురుషుడిని స్త్రీ కంటే పైన ఉంచడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు. మాతృస్వామ్యంపై విజయం సాధించే ప్రయత్నంలో పురుషుడు సృష్టినే తలకించులు చేస్తున్నాడన్నమాట!

కొత్త అంశంతో వచ్చే వారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

Download PDF

3 Comments

  • పురాణాల్ని – నమ్మితే మొత్తంగా అంగీకరించి నమ్మాలి. లేదంటే మొత్తంగా త్రోసిపుచ్చాలి. అటూ కాక, ఇటూ కాక, కొంత నమ్మీ మరికొంత నమ్మకా, మళ్ళీ అందులో మన ఊహల్ని ప్రక్షేపించి నిర్ణయాలు చేయడం సరికాదేమో. ఇహపోతే ఒక పురాణకథ, అందులో వర్ణించబడ్డ మాయామంత్ర ఘటన ఆధారంగా పురుషుడు, పితృస్వామ్యం అని వ్రాయడం సంబద్ధమని తోచదు. మంత్రశక్తులు ఏ సృష్టినియమాల్నీ, వ్యవస్థల్నీ గౌరవించవు. అందుకే వాటిని మంత్రాలన్నారు. ఇక నమ్మడం, నమ్మకపోవడం వారివారి వ్యక్తిగతం.

    • Manohar says:

      బాగా చెప్పారు. మీ రన్నదానితో అ0గీకరిస్తున్నాను.

  • కల్లూరి భాస్కరం says:

    “పురాణాల్ని – నమ్మితే మొత్తంగా అంగీకరించి నమ్మాలి. లేదంటే మొత్తంగా త్రోసిపుచ్చాలి.”

    మహోజస్ గారూ…మీరు పై అభిప్రాయానికి పూర్తిగా ఫిక్స్ అయిపోకపోతే ఇలా కూడా అనుకోవచ్చు. పురాణాలను నమ్మడం, నమ్మకపోవడం కాదు ఇక్కడ సమస్య. పురాణాలు కూడా మనలాంటి మనిషి చెప్పినవే. కనుక మనిషిని నమ్మక తప్పదు. అతనికి ఒక కాలమూ, ఒక సామాజిక నేపథ్యమూ ఉన్నాయని నమ్మకతప్పదు. పురాణాలు చెప్పడంలో అతనికి ఏవో ఉద్దేశాలున్నాయి. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నమే మనం చేయగలిగింది. అప్పుడు పురాణాలను నమ్మడం, నమ్మకపోవడం అనే ప్రసక్తి రాదు.

    మంత్రతంత్రాలకు కూడా ఇదే వర్తిస్తుంది. మంత్రతంత్రాలను మనం నమ్మకపోవచ్చు. కానీ వాటి పుట్టుకకు సంబంధించిన నేపథ్యాన్ని నమ్మక తప్పదు. ఆదిమ సమాజాలలో మంత్రతంత్రాలు మనిషి భౌతికజీవితంలో విడదీయలేని భాగాలు.

    మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లడం అనే ప్రక్రియ ఒక దశలో ప్రపంచమంతటా జరిగినట్టు పౌరాణిక ఆధారాలు సూచిస్తున్నాయి. కనుక ఆ క్రమం ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ వృత్తాంతంలోనూ ప్రతిఫలిస్తూ ఉండడంలో ఆశ్చర్యంలేదు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)