అక్కడితో బాల్యం అంతమైంది!

 ismayil painting rainbow

[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా ఆయన నాకు ఆత్మబంధువు. కాని,అంత కంటే ఎక్కువగా ఆయన బంధువు కూడా. ఆయన చివరి రోజుల జీవితాన్ని దగ్గిరగా చూసిన వాణ్ని కావడం వల్ల ఈ వ్యాసం పైపైన రాసినట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ- కాని, ఆయన మరణానికి తక్షణ నివాళి ఇది. నా దగ్గిర లేని ఈ వ్యాసం ప్రతిని పంపిన మిత్రుడు విన్నకోట రవిశంకర్ కి ధన్యవాదాలు]

 

1

ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.

ఆయన ఇంక అసలే మాట్లాడరు. మనకు ఈ నిశ్శబ్దం అలవాటై, అయిదేళ్ళ పైనే అయింది. మనం ఏదైనా అన్నప్పుడు అయితే చిరునవ్వుతో, కాదంటే వొక పెద్ద నవ్వుతో సమాధానం చెప్తున్నారు కొంత కాలంగా ఆయన- లేదూ, మనం చెప్పింది నచ్చనప్పుడు చిన్న నవ్వుతో చెయ్యి జెండాలా వూపుతున్నారు తప్ప మాట లేదు. ఆయన మాటలన్నీ మనం చూస్తూండగానే ఆయన వుండగానే నిన్నటి జ్ఞాపకాలయ్యాయి. ఆయన మల్లెపూవులాంటి నవ్వునీ, చిరుగాలిలాంటి అందమైన కదలికల్నీ వొక తెల్లవస్త్రం దాచెయ్యడం ఏమిటి?! ఆయనకి చివరిసారి భుజాన్ని అందించలేని దూరంలో నేను వుండడం ఏమిటి?

మాటల్లో ఏమైనా చెప్పడం కష్టం. అందుకే ఆయన మొదటినించీ నాకూ మనకీ నిశ్శబ్దాన్ని అలవాటు చేస్తూ వచ్చారు. ఇంత దూరంలోంచి నిశ్సబ్దంగా నిశ్శరీరంగా భుజాన్నివడంలో ఎన్ని దిగుళ్ళున్నాయి?! ఎన్ని జ్ఞాపకాలున్నాయి?గొంతు దాటని ఎన్ని మాటలున్నాయి? పోయిన నెల ఆయనకి చివరిసారి భుజాన్నిచ్చిన స్నేహితులందరి భుజాల మీదా వొక చిన్ని ముద్దు!

నమ్మలేకపోతున్నాను!

వొక నాటి రోజుల్లో ఎర్రసిరా తారీఖూ ఆకుపచ్చ అక్షరాలూ కనిపించగానే ఎంత ఆనందం! చిన్న చిన్న వాక్యాల మధ్య స్వచ్చమైన కలకల నవ్వు వొక్కోసారీ, పదునైన వ్యంగ్య బాణాల విసురు మరోసారీ – ఇప్పుడేమీ కనిపించవూ వినిపించవు కదా!

ఇస్మాయిల్ గారిని తలచుకోగానే నా మటుకు నాకు తక్షణం గుర్తొచ్చేవి – అవును, ఆ ఆకుపచ్చ అక్షరాలే! అలాంటి ఆకుపచ్చా పచ్చని వుత్తరం మొదటి సారి ఇరవయ్యేళ్ళ కిందట అందుకున్నాను.

2

అప్పటికింకా “రక్త స్పర్శ” అచ్చు కాలేదు. “శిధిల నేత్రాలు” అనే నా కవిత ఆంద్ర ప్రభలో అచ్చులో చూసి వెంటనే ఆయన వుత్తరం రాశారు, “ఇది తెలుగు పద్యంలా లేదు!” అని! ఆయనేమంటున్నారో నాకు అర్థం కాక, వెంటనే నేను మళ్ళీ వుత్తరం రాస్తే, వారం పది రోజుల తరవాత (ఈమెయిల్ లేని కాలంలో ఆ ఎదురుచూపు ఎంత నరకమో!) ఆయన సమాధానం. “తెలుగు పద్యం అంటే ఇప్పుడు మనకి ఒక స్థిరమైన చట్రం వుంది. ఈ చట్రం శబ్దంలోనూ, అర్థంలోనూ గట్టిగా బిగుసుకొని వుంది. మీరు చట్రాన్ని తప్పించుకుంటున్నారు లేదా దాన్ని ముక్కలు చేస్తున్నారు. మీ గొంతు ఈ కాకిగోలలో మునిగిపోవచ్చు. లేదా, మీకు శక్తి వుంటే కాకుల్ని మీరే తరిమేయచ్చు.” అసలు వాక్యం రాయడానికే సిగ్గుతో చితికిపోతున్న కుర్రకవికి ఆ మాటలు కొన్ని రోజుల పాటు నిద్రాభంగమయ్యే పెద్ద సత్కారం.

బహుశా, ఈ బందాల్నీ, చట్రాల్నీ నిరాకరించడమే ఆయన తన కవిత్వంలోనూ, వచనంలోనూ, చివరికి వొక్క క్షణమూ శాంతినివ్వలేని జీవితంలోనూ చేశారేమో! ఇప్పుడనిపిస్తుంది, వొక్క వాక్యంలో ఇస్మాయిల్ గారి గురించి చెప్పాలంటే – అలాంటి చట్రరహితమైన జీవనస్వేచ్చకి ఆయన ప్రతీక. నలభయ్యేళ్ళ పైబడి తెలుగు కవిత్వంలో ఆ ప్రతీకని వొక చెట్టు రూపానికి పరిమితం చేసి మనం మాట్లాడుతూ వచ్చాం. ఆ ప్రతీక మనలోని సాంప్రదాయపు వేళ్ళని పెళ్లగించింది. ఆలోచనల్ని బిగించి పెడుతున్న మూసల్ని చెదరగొట్టింది. పదాల మారుమూలల్ని శుభ్రం చేసింది. మామూలు పదాలకు అమామూలు శక్తినిచ్చింది. జీవితంలోని ముచ్చట ఎక్కడో లేదనీ, మనలోనే మన చుట్టే వుందని మనల్ని మన పరిసరాల్లోకి మళ్ళీ ప్రతిష్టించింది.

ఈ పరిసరాల స్పృహలోంచి ఇస్మాయిల్ రెండు ముఖ్యమైన పనులు చేశారనుకుంటాను. వొకటి: జీవితం చుట్టూ, సాహిత్యం చుట్టూరా పేరుకుపోయిన కాలుష్యాల్ని తుడిచిపెట్టడం; రెండు: సిద్ధాంతం అనేది వొక బ్రహ్మ పదార్ధం లాంటి metanarrative కాదనీ, అది మన కళ్ళ ముందే పరచుకొని వుందనీ అసిద్ధాంతీకరించడం (ఇప్పుడు దీన్ని మనం deconstruction / de-schooling అనుకుందామా?) ఈ రెండూ ఆయన పుస్తక జ్ఞానంలోంచి కాకుండా తన ఆనుభవిక చైతన్యంలోంచి చెప్పడం ఆయనలోని overarching phenomenon.

కవిత్వానికి గొప్ప వస్తువు అంటూ అక్కర్లేదు. నిజమే, కాని, అలా అనుకున్న తరవాత నిజంగా కవిత్వం రాయబోయేసరికి ఆ గొప్పది కాని విషయాన్ని అర్థం చేసుకొని రాయడం అన్నది అంత తేలిక కాదు. అసలు తేలికగా కవిత్వం చెప్పడం అంత తేలిక కాదు. తేలిక మాటల్ని అనుభవాల బరువుతో తూకం వేయడం చిన్న సంగతీ కాదు. పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి. ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని దాని మీద గాడిద బరువు మోపుతున్నాం. ఇస్మాయిల్ గారి కవిత్వంలో గాడిదల ప్రస్తావన చాల చోట్ల వస్తుంది. బహుశా, గాడిదలకి అంత సాహిత్య పాపులారిటీ ఇచ్చిన రచయిత కిషన్ చందర్ తరవాత ఇస్మాయిల్ గారే కావచ్చు. కవులు గాడిదలు కాకూడదన్న సందేశం ఇస్మాయిల్ కవిత్వంలో వుందని వేరే చెప్పక్కర్లేదు కదా!

ఆ గాడిద బరువు లేకుండా కవిత్వం నిరలంకారంగా వుండాలన్న టాగోర్ ని సదా బాలకుడని వో పద్యంలో వర్ణించారు ఇస్మాయిల్. నిజానికి సదాబాల్యం ఇస్మాయిల్ కవిత్వానికి అంతర్వస్తువు (Internalized theme). ఆయన బాల్యం గురించి రాసిన పద్యాల్లో కేవలం బాల్యం గురించే ఆయన చెప్పలేదు. ఆ మాటకొస్తే, బాల్యం ఆయనకొక గతానుభవం కాదు. ఆ నిన్నటి బాల్యంలోంచి ఆయన గుర్తుచేసే/ గుర్తించే వర్తమానం ముఖ్యమైంది. జీవితంలోని స్వచ్చతని పదిలంగా కాపాడే శక్తి బాల్యానికి మాత్రమే సొంతం. ఆ స్వచ్చతని చెప్పడానికే ఆయన పసితనం గురించీ, పసివాళ్ళ గురించీ రాస్తారు.

గుర్రప్పిల్ల కాళ్ళతో

పరిగెత్తుకుంటూ వచ్చాడు

బడి వదిలినట్టున్నారు.

బుర్రనీ, కాళ్ళనీ

బంధించిన సంకెళ్ళు విప్పేయగానే

మధ్యాహ్నపు ఎండ బయళ్ళు

మహోత్సాహంతో ఆహ్వానించాయి

ఎంత స్వేచ్చ! ఎంత హాయి!

అన్న పద్యపాదాల్లోంచి కనిపించేది ఆయన మనవడా? ఇస్మాయిల్ గారా? మనమా? నన్నడిగితే అది వొకే సమయంలో ఒకే దృశ్యంలో ముగ్గుర్ని బంధించే కవిత. ఆ తరవాత ఆ మనవడు చేసే పనుల జాబితాలోని పనుల్ని యింకో కోణంలోంచి చూస్తే, అవి ఇంకో రూపంలో మనకీ స్వేచ్చనిస్తాయి. రోజువారీ బతుకులో పోగొట్టుకుంటూ వస్తున్న మన స్వేచ్చని గుర్తు చేస్తూ- చివరికొచ్చేసరికి మనం పోగొట్టుకున్న ఆ స్వేచ్చని అందంగా అప్పగించడం ఈ కవిత చేసే పని. అలా అందుకోడానికి మనకి కాసింత వెసులుబాటు దొరకాలి అంతే! ఆ కాస్త వెసులుబాటే దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. అలాంటి అర్థాన్ని వెతుక్కునే దారినే ఆయన “ఉత్సవం”గా వర్ణించారు వొక సందర్భంలో-

“చెట్టు నా ఆదర్శం” నించి ఇటీవలి “కప్పల సముద్రం” దాకా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన పోనుపోనూ బాలకుడైపోతున్నాడని అనిపిస్తుంది. అది ఆయన తీసుకునే ఆయన వస్తువులోనూ కనిపిస్తుంది. ఆయన రాసుకునే భాషలోనూ అనిపిస్తుంది. లేకపోతే-

తరుచాపము వీడిపోయి

గురిమరచిన బాణంలా

తిరుగాడును పిట్ట

అంటూ అత్యంత గంభీరంగా రాసిన కవి, పదచిత్రాల మీదా, కొండొకచో అంత్యప్రాసల మీదా ఆధారపడిన కవి నెమ్మదిగా ఆ ఆధారాల్నీ, ఆ అలంకారాల్నీ వొదిలేసి-

నా కోసం పూర్తిగా

నగ్నవైనపుడు మాత్రమే

నా దానివి

అని తనే వొక కవితలో అన్నట్టు తన ‘self’ ని ఆవరిస్తున్న ఆచ్చాదన గుర్తెరిగి రాయడం ఆయన కవిత్వంలోని ఇంకో రహస్యం అనుకుంటాను. ఆ ఆచ్చాదనల్ని చింపేసిన ఉత్సవ సమయంలోనే ఆయన “గోళీకాయలు” “బెల్లంకాయ” లాంటి కవితలు రాశారనుకుంటాను. ఆ సమయంలో చుట్టూ వున్న లోకంలోంచి వొక సంతోషాన్ని, వొక ఆశ్చర్యాన్ని తోడుకునే విషయాలన్నీ ఆయనకు కవిత్వమవుతాయి. ధనియాలతిప్ప అనే స్పష్టమైన స్థలం చూస్తే ఎంత ఆనందమో, అస్పష్టమైన వొక వాన్ గొ చిత్రం చూసినా అదే ఆనందం. పాముల వాణ్ని చూస్తె ఎంత సంభ్రమమో, పికాసో బొమ్మని చూస్తే అంతే సంభ్రమం. చుట్టూ పరచుకొని వున్న చెట్లనీ, నదుల్నీ, మనుషుల్నీ చూస్తే ఎంత సంతోషమో, ఎక్కడో వున్న పారిస్ మహానగరాన్ని చూసినా అంతే సంతోషం. ముఖ్యంగా, వ్యక్తులూ, స్థలాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత సున్నితంగా ప్రేమగా రాసిన ఇంకో కవి ఎవరైనా వున్నారా అంటే లేరనే అనిపిస్తుంది నాకు. చాలా మంది ఆయన కేవలం ప్రకృతి గురించే రాశారని పొరబడతారు కాని, నిజానికి ఆ ప్రకృతిలో లీనమయ్యే కల కంటున్న మనుషుల్ని గురించే ఆయన రాస్తున్నారని నేను అనుకుంటాను.

పిల్లల్ని గురించి, అంత కంటే ఎక్కువగా తన స్నేహితుల్ని గురించి రాయన రాసిన కవితలు నన్ను ఎప్పుడూ విస్మయంలో పడేస్తాయి. సూఫీలు కలకంటున్న వొక ప్రాపంచిక జీవిని ఈ మూడింటి కలయికలోంచి చూపిస్తున్నారా అనుకుంటాను. మా ఇద్దరి సంభాషణల్లో సూఫీ మహాకవి హఫీజ్ ని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించే వారో లెక్కలేదు. మొదట్లో నేను హఫీజ్ ని చదవడానికి బద్దకిస్తున్నప్పుడు “అయ్యో…హఫీజ్ ని చదవకుండా, ఎట్లా రాస్తారు మీరు అసలు?” అని వొక సారి గట్టిగా మందలించే వారు కూడా- ఈ కాలంలో అలా మనల్ని ఫలానా చదవలేదే అని మందలించే వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది కొన్ని సార్లు! అలాంటి క్షణాల్లో ఆయన మాటలు గుర్తొచ్చి మొదట ఆయన మాటనీ, తరవాత ఆయన్నీ పోగొట్టుకున్నాను కదా మరణం అనే ఈ తెర అడ్డుపడి అనుకుంటూ వుంటాను.

4

కవిత్వం విషయంలో నాకూ మా నాన్నగారికి మొదటి నించీ చుక్కెదురు. మా నాన్నగారు కమ్యూనిస్టు సాహిత్య జీవి. నాకు కవిత్వ ఊహలు అప్పుడప్పుడే అందుతూ వస్తున్న నా డిగ్రీ రోజుల్లో “లేచిపోదామా?” అని చిలిపి హుషారుగా అనే అమ్మాయిలా ఇస్మాయిల్ గారు అనిపించారు నాకు. కవిత్వ పరంగా నేను ఆయనతో లేచిపోయాను, మా నాన్నగారి కమ్యూనిస్టు పంజరం విడిచి-

అయితే, నా మొండితనం మీద గాఢమైన నమ్మకం వుండడం వల్ల నాన్నగారు నన్ను ఇస్మాయిల్ గారి మైదానంలో హాయిగా వదిలేశారు. నాన్నగారు మంచి సాహిత్య వక్త. ఖలీల్ జిబ్రాన్ గురించీ, కొంత మంది పర్షియన్ కవుల గురించి నాన్నగారి రేడియో ప్రసంగాలు విని, ఇస్మాయిల్ గారు “కౌముదీ, మీలోని నిజమైన వ్యక్తీ ఇదిగో ఇక్కడున్నాడు! మీరు ఎందుకలా తప్పించుకు తిరుగుతారు అతన్నించి!” అని వొక సారి కార్డు ముక్క రాశారు. అదే వుత్తరం కింద నా కోసం “అఫ్సర్, నాన్నగారి మార్క్సిస్టు మాటలు మినహాయించుకొని, ఇదిగో హాయిగా ఈ పర్షియన్ కవుల్ని చదువుకో నువ్వు! ఆయన మార్క్సిస్టు కాని వేళల్లో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడతారు.” అని రాశారు.

ఇక నించి అలాంటి ఆకుపచ్చ ఉత్తరాలూ, అందమైన వాక్యాలూ రావు కదా!

ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి!

(లోగో: సాయి కిరణ్)

 వచ్చే గురువారం: విన్నకోట రవిశంకర్ వ్యాసం “ఆ ఇద్దరూ సదాబాలకులే!”

 

Download PDF

23 Comments

 • Mercy Margaret says:

  బాల్యం సదా ఇస్మాయిల్ కవిత్వానికి అంతర్వస్తువు (Internalized theme)… నిజమే ఆయన కవిత్వం చదువుతున్నంత సేపు ఆ బాల్యపు చెమ్మ ఎక్కడో ఒక చోట స్పృశిస్తుంది. ఎంతో ఆర్ద్రతతో , ప్రేమతో మీరీ వ్యాసం వ్రాసినట్టు తెలుస్తుంది . thank you for sharing sir .

  • ఈ వ్యాసం పైన స్పందించిన మిత్రులందరికీ షుక్రియా.
   @మెర్సీ, అవును- అవకాశం వుంటే, టాగోర్ ని కూడా ఇంకో సారి చదవండి. ఈ ఇద్దరి మధ్యా పోలికలు చాలా కనిపిస్తాయి.

 • తిలక్ బొమ్మరాజు says:

  ఇస్మాయిల్ గారి కవిత్వాన్ని చదువుతున్నంతసేపు ఆయనలోకి మనల్ని చెయిపట్టి లాక్కెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది.రోజూ చూసే చెట్టే,ఇస్మాయిల్ గారి అక్షరాల్లో అదో అందమైన ప్రతీక,సముద్రం గురించి రాయాలన్నా,సూర్యుడి గురించి రాయాలన్నా ఇస్మాయిల్ గారి తరువాతే.వాన వచ్చిన మధ్యాహ్నం వచ్చిన లోని ఈ పదాలలా..
  వాన వచ్చిన మధ్యాహ్నం
  _________________
  బరువెక్కిన సూర్యుడు
  బతకనీడు భూమిని
  ఉదయమ్మొదలు
  ఊపిరాడనీడు
  సర్వాన్ని అదిమిపట్టి
  వీర్యాన్ని విరజిమ్మాడు.

  ఆకల్లాడదు.
  ఏ కాకీ ఎరగని
  ఏకాకి ఆకాశం.

  ఇంతలో హటాత్తుగా
  ఇలకు కలిగింది మబ్బుకడుపు.
  వేవిళ్ళ గాలులు
  వృక్షాగ్రాల్ని వూపాయి.
  ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.
  తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.

  అవాళ మధ్యాహ్నం
  అకస్మాత్తుగా దిగిన వానపొర
  ఊరంతటినీ ఆవలుంచి
  ఒంటరిగా నన్ను మూసింది.

  ప్రపంచంతో తెగిపోయాయి
  పంచతంత్రులూ,
  ఆకులపై రంగులు
  అంతరించాయి ముందుగా,

  స్వరాలూ సువాసనలూ
  విరమించాయి తరువాత.
  ఆశలూ ఆశయాలూ
  ద్వేషాలూ రాగాలూ
  రెచ్చకొట్టే స్మృతులూ
  రెక్కలు ముడిచాయి పిదప

  విప్పుకున్న బతుకంతా వెనక్కి చుట్టుకుపోయి
  ఇప్పుడు నేనేమీ కాను తతత
  వర్షాగర్భంలో
  వర్ధిల్లే శిశుపిండాన్ని.

  • తిలక్, రోజూ చూసే జీవితమే ఇంకో కన్నుతో చూస్తాడు కాబట్టి కవిని కవి అంటాం కదా!

 • తిలక్ బొమ్మరాజు says:

  ఇంత గొప్ప అనుభూతులను మాకు పంచిన అఫ్సర్ గారికి ధన్యవాదములు.మంచి లోగో చేసిన సాయికిరణ్ గారికి స్పెషల్ థాంక్స్.

 • ఇస్మాయిల్ గారినీ, ఆయన కవిత్వాన్నీ మళ్ళీ ఇలా మీ మాటల్లోంచి తలుచుకోవడం సంతోషాన్నిచ్చింది.

  • బీవీవీ, ఇలా మిత్రులందరూ ఇస్మాయిల్ గారిని తలచుకునే సందర్భం ఇది, మీరూ రాయండి.

 • సాయి కిరణ్ says:

  అఫ్సర్ సర్ , మీరు రాసే వచనాన్ని నేను పాఠాల్లా చదువుతాను . అంతిష్టం నాకు . అందులోనూ మీకు అత్యంత ఆప్తులైన వ్యక్తి , మీకు స్పూర్తినిచ్చి సాహిత్య లోకంలోకి మిమ్మల్ని వేలు పట్టి నడిపించిన మహా మనిషి , ఆరాధ్యనీయమైన ఓ గొప్ప కవి అయిన ఇస్మాయిల్ గారి గురించి రాసినప్పుడు ఇంకా ఇంకా అద్భుతంగా మనసు లోతుల్ని తాకేలా వచ్చింది. అంతటి గొప్ప కవిని తెలుసుకోనైనా తెలుసుకోకుండా వెళ్లిపోయారన్న భావం,మీ పదాలతో కలిసి హృదయాన్ని మరింత బరువెక్కించింది. .
  ఇక ఇస్మాయిల్ గారి కవిత్వం నేను పెద్దగా చదవలేదని చెప్పడానికి సిగ్గు పడాలేమో . ఇన్ని రోజులూ తెలీనందుకు బాధ పడాలో . అయన కవితల్లో నేను చదివిన మొదటి కవిత పికాసో . ఎంత నచ్చిందో నాకు . అలా మొదలు పెట్టి ఇంకా చదువుతూనే ఉన్నాను. పికాసో కవిత చదవగానే ఏదో ఒకటి రాయాలనిపించి నేను రాసుకున్నది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .

  అదో చిన్న కవిత . ఓ సారి చదివెయ్యగానే మరోసారి ఖచ్చితంగా చదువుతాం . మెలికేమిటో అర్థమయ్యాక చిరునవ్వోటి మన పెదాల మీద తారట్లాడుతుంది. మనమేదో పెద్ద పజిల్ కష్టపడి సాధించిన అనుభూతి, వింతైన ఓ గర్వం క్షణం పాటు మనసు మీద పారాడతాయి . ప్రతీ పదం ఓ అమూల్యమైన వజ్రమే . ఒక్కటి తగ్గినా హారం తెగిపోవాల్సిందే అన్నంత ఖచ్చితమైన క్రమం, తూచి తూచి రాసారా అన్నట్టుగా ఎన్ని అవసరమో అన్నే పదాలు. కానీ భావం మాత్రం కొన్ని తలుపుల్ని తెరుచుకుంటూ మన లోపలికి చేరిపోతుంది.
  పికాసో మీద ఆరాధన అవసరం లేదు . చిత్ర కళలో నైపుణ్యం ఉండాల్సిన పనీ లేదు . అసలు ఆ పదాలే చిత్రించేస్తాయి మన మనసు మీద ఆ చిత్రకారుడ్ని. నాలుగే నాలుగు వాక్యాల్లో ఒక వ్యక్తి మీద బోలెడంత ఇష్టాన్ని కలిగించవచ్చని తెలుస్తుంది . ‘అ’చిత్ర కారుడట పికాసో. చెరిపేసాడట మన కళ్ళని ఖైదు చేస్తూ తుప్పు పట్టి పోయిన కొన్ని పనికిరాని నమ్మకాల, ఆలోచనల ,ఊహల కటకటాల్ని. అదీ తన మృదువైన అతి మెత్తనైన కుంచెతో . అప్పుడు మన కళ్ళు స్వేచ్ఛని తమ బందీ గా చేసుకున్నాయి . అవిప్పుడు ఎటైనా ఎగరగలవు. ఎక్కడెక్కడో ఏ చిత్రం మూలనో దాగిన ప్రతీ గీతనీ పట్టుకోగలవు . ప్రతీ రంగు చెప్పే కథనీ చక చకా చదివెయ్యగలవు. కొత్త అర్థాలతో తమ డిక్షనరీ నింపేసుకుంటూ, అమితమైన ఆనందంతో ఆదీ అంతం లేని అనంతమైన కాన్వాస్ మొత్తం నిర్భయంగా విహరిస్తాయ్ అవి ఇప్పుడు. ఎంత గొప్పగా చెప్పారో కదా . పికాసో రంగుల్లో కుంచెని ముంచి గీసారు . మన ఇస్మాయిల్ గారు మనసులోంచి అక్షరాల్ని దులిపి రాసారు . అందుకే ఇద్దరూ ఒకటే ఇష్టమైన విషయాన్ని మన హృదయాల మీద అందంగా చిత్రించడంలో . పది కాలాల పాటు తరగని చెరగని గొప్ప సంపదని మనకి అందించడంలో .అందుకే అనాలనిపిస్తుంది ఈ కవీ ఓ చిత్రకారుడే అని . థోడా హట్కే . చేసే ప్రతీ ఆలోచనా థోడా హట్ కే అంటూ ఓ అంతర్లీనమైన రహస్యాన్ని మన చెవిలో చెబుతున్నట్టుగా ఉంటాయి ఆయన కవితలు . అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత ఆనందం. మరెందుకాలస్యం! పదండి చూపుల మధ్య లోంచి మరోసారి జారిపోనిద్దాం ఆయన కవిత్వ ప్రవాహాన్ని, మనసు లోపల మరిన్ని జాడల్ని పరిచి పెడుతూ .

  పికాసో

  పికాసో చిత్రమైన
  అచిత్ర కారుడు,

  అతడు గీసింది కన్నా
  చెరిపింది ఎక్కువ:

  మన కళ్ళ మీది కటకటాల్ని
  కుంచెతో చెరిపేశాడు.

  అప్పట్నించీ మన కళ్ళు
  ఎగరటం నేర్చుకున్నాయి

  • సాయికిరణ్: మీ మంచి మాటలకు ఇవాళ వొక రోజు హాయిగా గడిచిపోతుంది. ఆ కవిత గురించి ప్రసూన గారు కూడా రాశారు. ఆ వ్యాసం కూడా ఈ వరసలో వస్తుంది.

   • సాయి కిరణ్ says:

    అన్ని రకాల పనుల ఒత్తిడుల మధ్య ఎంత ఓపికగా అందరి కామెంట్స్ చూసి రిప్లై ఇచ్చారో !గ్రేట్ సర్ , థాంక్ యు

 • renuka ayola says:

  అఫ్సర్ సర్ , మీరు రాసే వచనాన్ని నేను పాఠాల్లా చదువుతాను . అంతిష్టం నాకు
  ఇ మాటలు సాయి కిరణ్ వి నావి కూడా … మళ్ళి ఇస్మాయిల్ గారిని మీ మాటల్లో వినడం చాలా సంతోషంగా వుంది

  • రేణుక గారూ, మీరు పాఠాలంటున్నారు కాని, ప్రతి వచనరచనా వొక కొత్త పాఠమే ఎవరికైనా!

 • ఇస్మాయిల్ గురించి మాట్లాడేపుడు కవులు ఒక రకమైన తాదాత్మ్యతకు లోనవుతారు. అఫ్సరైనా, శిఖామణైనా, విన్నకోట రవిశంకరైనా, ఆకెళ్ళ రవిప్రకాషైనా….. దీనికి కారణం ఎక్కడుందా అని ఆలోచిస్తే కవిత్వం మూడువంతులైతే ఇస్మాయిల్ వ్యక్తిత్వం ఒకవంతు అని అనిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వం ఈ వ్యాసంలో అనేక చోట్ల ప్రకాశవంతంగా ప్రతిబింబించింది.

  ఇస్మాయిల్ పై వ్యాసాలు వ్ర్రాసిన కవులందరూ ఆయనతో ప్రత్యక్ష లేదా పరోక్ష (ఉత్తరాలద్వారా) పరిచయం ఉన్నవారే. సాహిత్యంలోను, స్నేహితంలోను ఇస్మాయిల్ సదాబాలకుడే కదా.

  ఈ వ్యాసంలో నచ్చిన రెండు చక్కని కోట్స్

  * పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి.

  ** ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని దాని మీద గాడిద బరువు మోపుతున్నాం.

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  • బాబాజీ, అందుకే కవులతో ప్రత్యక్ష స్నేహం బాగుంటుంది, కవి కంటే ఎక్కువ అప్పుడు ఆ మనిషి తెలిసివస్తారు కదా!

 • నిశీధి says:

  నాకు ఇస్మాయిల్ గారు తెలియరు , నాకు మీరు తెలుసు , మీలో ఇపుడు తను తెలుసు

  • నిశీధి గారూ, చాలా మందిని కలుస్తాం ఈ మొత్తం ప్రయాణంలో- కలిసిన వాళ్ళలో కొంత మంది మనలో కలిసిపోతారు ఎదో వొక విధంగా- అలా కలిసిపోవడంలో అప్పుడప్పుడూ సంతోషమూ, అప్పుడప్పుడూ కొంత దిగులూ వుంటాయి. ఇస్మాయిల్ గారి కలయికల్లో దిగులు విషయాలు కొన్ని వున్నాయి. అవి ఇక్కడ నేను చెప్పలేదు. మరో సందర్భంలో చెప్తాను.

 • sasi kala says:

  ఆకు పచ్చని అక్షరాలు మనసు భారంగా చేసి రాలిపోయాయి . కొందరుంటారు అంతే ఆకు పచ్చని
  జ్ఞాపకంగా …. అంతే మాట్లాడేందుకు ఏమి లేదు . మౌనమే అన్నీ చెపుతుంది .

 • “ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.”

  ఎందుకో ఈ వాక్యంతోనే మనసు ఒక్కసారిగా స్తబ్దమైపోయింది, అఫ్సర్ జీ! ఏదో ఇప్పుడే ఇస్మాయిల్ మనల్ని వదిలెళ్ళిన స్తబ్దత!
  నిశ్శబ్ద కవిత్వం, పద చిత్రాలు, హైకూలు, క్లుప్తత… ఇలా ఏవేవో అర్ధం అయ్యీ అవ్వని పదాలతో చాన్నాళ్ళ క్రితం ఇస్మాయిల్ పరిచయం అయ్యారు, మూలా సుబ్రమణ్యం మాటల్లో! అప్పట్నించీ ఒక నిఘంటువు అయిపోయింది ఆయన కవిత్వం…
  ఇప్పుడు మీ మాటల్లో ఆయన గురించి చదువుతుంటే ఆ నిశ్శబ్దాన్ని దగ్గరుండీ అనుభవించిన భావన…

  • నిషి, మీరు చదివే పధ్ధతి నాకు నచ్చుతుంది. తీరిక లేని పనుల్లో కూడా చదవడానికి కొంత సమయం అట్టి పెట్టుకోవడం మీలో నాకు బాగా నచ్చే సుగుణం! మీ చదువులోంచి ఇస్మాయిల్ గారు ఎలా కనపడతారా అని వినాలని వుంది.

 • ఇస్మాయిల్ గారి రచన అది కవిత్వమైనా ,వ్యాసమైనా సరే గుండెకుపట్టే గుణం దండిగా ఉంటుంది. ఆ మౌలిక గుణాన్ని చెప్పిన అఫ్సర్ కు థాంక్స్.

  • మనోహర బాబు గారు, మీరు నా రచన చదవడమే నాకు సగం బలాన్నిచ్చింది. ఇస్మాయిల్ గారి గురించి మీరన్నది నిజం.

 • Prasuna says:

  “ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి! ”

  ఎంత బాగా చెప్పారు అఫ్సర్ జీ.

  ఇస్మాయిల్ గారి కవిత్వం అప్పటి దాకా ఉదాసీనంగా ఉన్న జీవితాన్ని కెరటంలా కొట్టి తట్టిలేపింది. ఆ కవిత్వం నా ఆలోచనా విధానాన్నీ, జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో మాటల్లో పెట్టలేను. అటువంటి అతి ముఖ్యమైన వ్యక్తి గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆయన చివరి రోజుల గురించి తెలుసుకుంటే గుండె బరువెక్కుతోంది.

Leave a Reply to అఫ్సర్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)