ఏకలవ్యుడి బొటనవేలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది…

అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఆ సమయంలోనే కరటూరి సత్యనారాయణగారు వాణిజ్యపన్నుల అధికారిగా ఉండేవారు. సత్యనారాయణగారు కవి కూడా. ఆయన అప్పటికే కొన్ని పద్యకావ్యాలు రాశారు. కొత్తగా ‘కరుణాసౌగతము’ అనే ఖండకావ్యం రచించారు. అది బుద్ధుడికి సంబంధించిన కొన్ని కథలను దండగుచ్చిన కావ్యం. ఆ కావ్య ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు.

వాణిజ్యపన్నుల అధికారికి సంబంధించిన కార్యక్రమం కదా… పట్టణంలోని వర్తకప్రముఖులందరూ రంగంలోకి దిగారు. ఉభయగోదావరి జిల్లాలలోని పలువురు సాహితీ ప్రముఖులను వక్తలుగా ఆహ్వానించారు. అందులో సంప్రదాయ, ఆధునిక అన్న తేడా చూపించలేదు. అలా ఆ సభ, ఓ అరుదైన ఉభయసాహితీ సమ్మేళనం. ఆధునికులలో నాకు బాగా గుర్తున్న పేరు ఆవంత్స సోమసుందర్ గారు. సంప్రదాయపండితులలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు కూడా ఉన్నట్టు జ్ఞాపకం. స్థానిక సాహితీ ప్రముఖులు దిగుమర్తి సీతారామస్వామిగారు సభాధ్యక్షులు. మా నాన్నగారు వక్తలలో ఒకరు.

ఇంటికి వాహనం పంపించారు. మా నాన్నగారితో నేనూ వెళ్ళాను.

సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో. మేము వెళ్ళేటప్పటికే కుర్చీలు చాలావరకు నిండిపోయాయి. ఎక్కువమంది వర్తకులే. వారి మెడల్లో ఒంటిపేట బంగారపు గొలుసులు, చేతికి బంగారపు చెయిన్ తో రిస్టువాచీలు, వేళ్ళకు రవ్వల ఉంగరాలు జిగేలుమంటున్నాయి. సాహితీ ప్రముఖుల ఎదురుకోలు సన్నాహాలు, పన్నీటి చిలకరింపులు, స్వాగతాలు వగైరాలు ముగిసిన తర్వాత సభ ప్రారంభమయింది. కనీసం పదిమంది వేదికను అలంకరించినట్టు జ్ఞాపకం.

bhasaram garu

ఆవిష్కరణ ముగిసి ప్రసంగాలు జరుగుతున్నాయి. వివరాలు నాకు గుర్తులేవు కానీ, ‘ఎవరో రసమా. భావమా?” అనే చర్చ లేవదీశారు. చూస్తుండగానే ఆ చర్చ సంప్రదాయ, ఆధునికుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. సభాస్థలి వేడెక్కింది. అసలే కిక్కిరిసిన సభ. ఆపైన వేసవి కాలం. పైన పంకాలు తిరుగుతున్నా ఆ గాలి సరిపోవడం లేదు. వేసవి తాపానికి తోడు సభా తాపం. వర్తకశ్రేష్టులకు వేదిక మీద ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. బిక్కమొహాలు వేసి బెదురుచూపులు చూస్తున్నారు. వారి స్థూలకాయాలు కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతున్నాయి.

వక్తలను నియంత్రించడానికి అధ్యక్షులవారికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఎలాగో ఆవేశ కావేషాలు సద్దుమణిగి ఊపిరి పీల్చుకున్నాక సోమసుందర్ గారిని మాట్లాడమన్నారు. ఆయన ‘కరుణా సౌగతము’ అనే ఆ కావ్యంలోని అంగుళిమాలుని కథను ఎత్తుకుని, దానికి మహాభారతంలోని ఏకలవ్యుని కథ కూడా మేళవించి, ‘గురువులందరూ శిష్యద్రోహులే’ నంటూ కొత్త మంట రాజేశారు. దాంతో మళ్ళీ సంప్రదాయసాహితీవేత్తలనుంచి నిరసన…ఉభయుల మధ్య వాగ్యుద్ధం…

కాసేపటికి మా నాన్నగారి వంతు వచ్చింది… ఆయన ఒక స్వీయపద్యంతో ప్రసంగం ప్రారంభించారు. ఆ పద్యం ఇదీ!

నలువకు నాల్గు నాల్క లట నర్తనమాడెడు నీ తనుప్రభల్

తలకొక దారి వింత గతులన్ మెరయించిన మోసపోయి వా

దులు గొని మచ్చరింతురు బుధుల్ తదుదగ్రరుషాతమమ్ముపై

వెలిగెడు నీదు చిర్నగవు వెన్నెల పండువు మాకు భారతీ!

ఓ సరస్వతీదేవీ! బ్రహ్మదేవుడికి నాలుగు నాల్కలు కదా. ఆ నాలుకల మీద నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు. అప్పుడు నీ శరీర కాంతులు పండితులకు ఒక్కొక్క విధంగా వింత గతుల్లో మెరిసిపోతూ కనిపిస్తాయి. దాంతో వారు మోసపోయి వాదులాటకు దిగి మత్సరం పెంచుకుంటారు. ఉగ్రమైన ఆ చీకటి నాలుకలపై వెలిగే నీ చిరునవ్వే మాకు వెన్నెల పండుగ- అని ఈ పద్యానికి అర్థం.

ఆశ్చర్యం! పద్యం ముగిసిందో లేదో, సభ అంతా చప్పట్లు… నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం హఠాత్తుగా మలయమారుతం వీచినట్టుగా వర్తక సభాసదుల ముఖాల్లో ఏదో తెలియని ఉల్లాసం. వారికి ఆ పద్యంలోని భావం అర్థమై కాదు. మా నాన్నగారని అనడం కాదు కానీ, పద్యం బాగా చదువుతారని ఆయనకు పేరు. శ్రావ్యమైన పద్యగానంతో సభ మీద ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు.

సరే, ఆయన సందర్భోచితంగా పద్యాన్ని ఎత్తుకున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆ వెంటనే పండిత సత్కారం నిర్వహించిన వర్తకముఖ్యుని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య ఈసారి సభలో నవ్వులు పూయించింది…

‘ఈయనెవరో మహానుభావుడు. ఈయనకు సంప్రదాయం తెలుసు. జంట వస్త్రాలతో సత్కరించాడు. నేను చాలా సభల్లో చూస్తూ ఉంటాను. శాలువా కప్పుతూ ఉంటారు. అలా ఏకవస్త్రం ఎవరికీ ఇవ్వకూడదు. పైన శాలువా కప్పుకుని కింద అలా వదిలేయాలనో ఏమిటో వాళ్ళ ఉద్దేశం’ అన్నారాయన. పండితచర్చ ఏమీ అర్థం కాక అంతసేపూ బిక్కచచ్చి ఉన్న వర్తకశ్రోతలకు అర్థమయ్యే మాటలివి. ఆ రిలీఫ్ వాళ్ళలో కనిపించింది.

కావ్యం మీద ఆయన ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. కానీ గురువులందరూ శిష్యద్రోహులే నన్న సోమసుందర్ గారి వ్యాఖ్యను ప్రస్తావించి, ‘అది ద్రోహం కాదు, శిష్యులపై గురువు చూపిన విశేష అనుగ్రహం’ అనడం మాత్రం గుర్తుంది. ఎంత మా నాన్నగారు అయినా, ఆయన మాట నన్ను ఒప్పించలేకపోయింది.

***

నేను ఒక ప్రత్యేక అవసరం కోసం కరటూరి సత్యనారాయణగారిని బ్రాహ్మణేతరకవిగా చెప్పాల్సివస్తోంది. ఆయన బుద్ధుడి కథలు ఇతివృత్తంగా ఆ కావ్యం రాయడమే చూడండి…బుద్ధుడి కథలతో బ్రాహ్మణకవులు రాసిన కావ్యాలు అంత ఎక్కువగా కనబడవు. తిరుపతి వెంకటకవుల ‘బుద్ధచరిత్రము’, పింగళి-కాటూరి కవుల ‘సౌందరనందము’ వంటివి కొన్ని మినహాయింపులు. బుద్ధుడి పట్ల బ్రాహ్మణేతరకవులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నట్టు కనిపిస్తుంది. కవులనే ఏమిటి, బ్రాహ్మణేతర మేధావులకు కూడా. తెలుగువాళ్లలో బుద్ధుడిపై, బుద్ధుడి తాత్వికతపై ఆసక్తితో ప్రత్యేక అధ్యయనాలు చేస్తూవచ్చిన వారిలో బ్రాహ్మణేతర మేధావులే ఎక్కువగా కనిపిస్తారు. చరిత్రలోకి వెడితే బుద్ధుడి కాలంలో, బహుశా ఇంకా అంతకుముందే వైదిక/సనాతన ధోరణులకు సమాంతరంగా భిన్న తాత్విక ధోరణి ఒక్కోసారి జ్ఞాతంగా, ఒక్కోసారి అజ్ఞాతంగా ప్రవహిస్తూనే ఉందని అర్థమవుతుంది. వెనకటి రాజుల కాలంలో భర్త వైదికమతాన్ని అభిమానిస్తే, భార్య బౌద్ధాన్నో, జైనాన్నో ఆదరించడం, వాటికి చెందిన వ్యవస్థలకు దానాలు చేయడం కనిపిస్తుంది. ఈ విషయంలో స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఒక సామ్యం కనిపిస్తుంది. బి.ఎస్.ఎల్. హనుమంతరావుగారు రాసిన ఆంధ్రుల చరిత్రలో ఇందుకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.

ఆశ్చర్యమేమిటంటే, ఏనాడో బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచీ ప్రారంభమైన సమాంతర తాత్వికత అనే పాయ ఒక అంతర్వాహినిగా మారి, కాలం కల్పించిన హద్దులను దాటుకుంటూ తెలుగునేల మీద నేటికీ ప్రవహిస్తూ ఉండడం!

***

సోమసుందర్ గారు ప్రస్తావించిన అంగుళిమాలుడి కథ ఇలా ఉంటుంది…

అంగుళిమాలుడు తక్షశిలలో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. మంచి చురుకు, ప్రతిభ ఉన్నవాడు. దాంతో తోటి విద్యార్థులకు అతనిపై అసూయ కలిగింది. గురువుగారికి అతనిపై ఉన్నవీ, లేనివీ నూరిపోశారు. ఆయన అంగుళిమాలుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. విద్యాభ్యాసం ముగిసి గురుదక్షిణ చెల్లించే సందర్భం వచ్చింది. ‘వెయ్యిమంది చిటికెన వేలు ఖండించి వాటిని నాకు గురుదక్షిణగా చెల్లించు’ అని అంగుళిమాలుని గురువు ఆదేశించాడు.

గురుదక్షిణ చెల్లించితీరవలసిందే. లేకపోతే గురుద్రోహం అవుతుంది. నేర్చుకున్న విద్య ఒంటబట్టకపోగా శాశ్వతంగా అపకీర్తిని మోయవలసివస్తుంది. కనుక గురువు కోరిన దక్షిణ చెల్లించడానికే అంగుళిమాలుడు సిద్ధపడ్డాడు. ఒక అరణ్యంలో ఉంటూ దారినపోయేవారిని అటకాయించి, చంపి వారి చిటికెన వేలును ఖండించి తీసుకునేవాడు. వాటన్నింటినీ మాలగా గుచ్చి తన మెడలో వేసుకునేవాడు. అందువల్ల అతనికి ‘అంగుళిమాలుడు’ అనే పేరు వచ్చింది. అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్ళు అయ్యాయి. ఇంకొక్క వేలు దొరికితే వెయ్యీ పూర్తవుతాయి.

బుద్ధుడు అంగుళిమాలుడు ఉన్న అడవిమీదుగా ఒంటరిగా సంచారానికి బయలుదేరాడు. అనుయాయులు అంగుళిమాలుడి గురించి చెప్పి, వద్దని వారించారు. బుద్ధుడు వినలేదు. అంగుళిమాలుడు బుద్ధుణ్ణి చూశాడు. ఈరోజుతో వెయ్యి చిటికెన వేళ్లూ పూర్తవుతాయనుకుని సంతోషిస్తూ బుద్ధుణ్ణి అడ్డగించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అందకుండా బుద్ధుడు ముందుకు వెళ్లిపోయాడు. అంగుళిమాలుడు ఆయన వెంటపడ్డాడు. కానీ ఆయనను అందుకోలేకపోయాడు. అలసిపోయి చెమటలు కక్కుతున్న స్థితిలో ‘ఆగు’ అని ఒక్క కేక పెట్టాడు. బుద్ధుడు ఆగాడు. అంగుళిమాలుడు బుద్ధుని సమీపించాడు. అతని చేతిలో కత్తి ఉంది. అయినా బుద్ధుడు ఏమాత్రం తొణక కుండా అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అలాగే నిలబడిపోయాడు. అంగుళిమాలునికి ఆశ్చర్యం కలిగింది. చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. బుద్ధుని పాదాల మీద పడ్డాడు. ఆ క్షణంలోనే బుద్ధుని అనుయాయిగా అతను పునర్జన్మ ఎత్తాడు.

***

ఇప్పుడు ఏకలవ్యుని కథకు వద్దాం.

మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసంలో ఇతని కథ ఉంది. దాని ప్రకారం ఏకలవ్యుడు హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుని ప్రసిద్ధిని విని ఆయన దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. వెళ్ళి ద్రోణుని కలిశాడు. అతను నిషాదుడు(బోయ)కనుక అతణ్ణి శిష్యుడిగా చేసుకోడానికి ద్రోణుడు ఒప్పుకోలేదు. దాంతో ఏకలవ్యుడు ఆయన అనుమతి తీసుకుని, మట్టితో ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకుని భక్తితో దానికి మొక్కుతూ విలువిద్యను సాధన చేసి ప్రావీణ్యం సంపాదించాడు.

అలా ఉండగా పాండవులు, కౌరవులు కలసి గురువు ద్రోణాచార్యుని అనుమతి తీసుకుని ఏకలవ్యుడు ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. వేట కుక్కలను తీసుకుని వారి వెంట భటులు కూడా వెళ్లారు. ఆ కుక్కల్లో ఒకటి మిగిలిన కుక్కలనుంచి వేరుపడి ఏకలవ్యుడున్న చోటికి వెళ్ళి అతణ్ణి చూసి మొరగడం ప్రారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో లాఘవంగా ఏడు బాణాలను దాని నోట్లోకి ప్రయోగించి నోరు మూశాడు. అది ఆ బాణాలు అలా ఉండగానే కురుపాండవుల దగ్గరకు పరుగెత్తింది. వారు దానిని చూడగానే ఆశ్చర్యపోయారు. అంత లాఘవంగా బాణాలు ప్రయోగించింది ఎవరా అనుకుంటూ వెతుకుతూ ఏకలవ్యుడున్న చోటికి వచ్చారు. దుమ్ము కొట్టుకున్న బలిష్టమైన దేహంతో, జడలు కట్టిన జుట్టుతో, జింక చర్మం ధరించి, ధనుర్బాణాలు పట్టుకుని ఉన్న ఏకలవ్యుడు వారికి కనిపించాడు. అతనిపై వారికి అసూయ కలిగింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘నువ్వెవరు, ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నా’వని అడిగారు. తను హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణుని శిష్యుడినని అతను చెప్పాడు.

untitled1

హస్తినాపురానికి తిరిగి వచ్చిన కురుపాండవులు ఇదంతా ద్రోణుడికి చెప్పారు. ఆ తర్వాత అర్జునుడు ఒక్కడే ఏకాంతంగా ద్రోణుని కలుసుకున్నాడు. ‘విలువిద్యలో నాకు ఎవరూ సాటిరాని విధంగా విద్య నేర్పుతానని మీరు మాట ఇచ్చారు. విలువిద్యలో నేనే కాదు, ముల్లోకాలలోనూ ఎవరూ ఆ బోయవాడికి సాటి రారు. నాకంటే, మీకంటే, లోకంలో అందరి కంటే ధనుర్విద్యలో అతడు నేర్పరి. పైగా మీ ప్రియశిష్యుడే నట’ అంటూ ఎత్తిపొదుపు మాటలు మాట్లాడాడు.

ద్రోణుడు అదిరిపడ్డాడు. ‘పద, అతణ్ణి చూద్దాం’ అంటూ అప్పటికప్పుడు అర్జునుని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నదగ్గరకు వెళ్ళాడు. ఏకలవ్యుడు ఆయనకు ఎదురేగి పాదాభివందనం చేసి, ‘నేను మీ శిష్యుడిని, మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ విలువిద్య నేర్చుకున్నాను’ అన్నాడు. ‘అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. ‘ఇది నా దేహం, ఇది నా సంపద, వీళ్ళు నా పరిజనం. వీటిలో మీకు ఏది ఇష్టమో చెప్పండి, సంతోషంగా ఇస్తాను’ అని ఏకలవ్యుడు అన్నాడు. ‘నీ కుడి చేతి బొటనవేలును ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. వెంటనే ఏకలవ్యుడు బొటనవేలును ఖండించి ద్రోణుడి చేతుల్లో పెట్టాడు. ఆ బొటనవేలుతోనే అతని విలువిద్యా లాఘవమూ పోయింది. అర్జునుడి మనసు చల్లబడింది.

***

సరే, ఏకలవ్యుడిపై అర్జునుడి అసూయ, ద్రోణుడు అతనికి చేసిన అన్యాయం ఈ కథలో ఒక కోణం. చాలా కాలంగా చర్చలో ఉన్న కోణం. సౌదా తన ‘అపూర్వ పురాణకథలు’లో చిత్రించిన బర్బరీకుని పాత్ర కూడా ఇలాంటిదే. ఒక ఆటవిక స్త్రీకి భీముని వల్ల జన్మించిన బర్బరీకుడు కూడా మంచి విలుకాడు. అతను మహాభారత యుద్ధంలో పాల్గొనాలని ఉత్సాహపడతాడు. కానీ కృష్ణుడు అది జరగనివ్వడు. పైగా యుద్ధానికి ముందు అతణ్ణి ‘వీరబలి’ ఇస్తారు. దానికి ఉపశమనంగా అతని శిరస్సుకు యుద్ధాన్ని తిలకించే అవకాశం ఇస్తారు.

నేను ముందుకు తెచ్చే ప్రశ్నలు భిన్నమైనవి. అసలు విలువిద్యలో ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అన్నది వాటిలో మొదటిది. ఏకలవ్యుడు అనే బోయకు ద్రోణుని గురువుగా చేసుకుని ఆయన దగ్గర ఉన్న అస్త్రవిద్య అంతా నేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నది రెండవది.

మొదటి ప్రశ్నకు వస్తే, అసలు విలువిద్య ప్రప్రథమంగా ఆటవికులది, అంటే ప్రస్తుత సందర్భంలో ఏకలవ్యుడిది. కనుక విలువిద్యలో ఆటవికులే అసలు గురువులు. ఈ దృష్ట్యా ద్రోణుడి లాంటి మైదానప్రాంతవాసులు ఆటవికులకు శిష్యులు కావడమే న్యాయం. కానీ ఇక్కడ తలకిందులవుతోంది. ఆటవికుడైన ఏకలవ్యుడు శిష్యుడు, మైదానవాసి అయిన ద్రోణుడు గురువు అవుతున్నారు. విషాదం ఏమిటంటే, తనదైన విద్యను పరుల నుంచి ఏకలవ్యుడు నేర్చుకోవాలని అనుకోవడం.

ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. విలువిద్య ఆటవికులలో లేదా ఆదిమ జాతులలో ప్రధానంగా అన్నసంపాదనలో భాగంగా పుట్టిందే తప్ప మనుషుల్ని చంపే మారణాయుధంగా కాదు. విల్లు, బాణాలే కాక; ఇతర ఆయుధాలు కూడా అన్న సాధనాలుగా పుట్టినవే. రాంభట్ల కృష్ణమూర్తిగారి ‘వేదభూమి’ నుంచి ఉటంకించుకుంటే; శావేజీ ద్వితీయదశకు వచ్చేసరికి (మోర్గాన్ ప్రాక్చరిత్రను శావేజీ, బర్బరదశలుగా విభజించాడు. మళ్ళీ ఒక్కొక్క దశనూ మూడు అంతర్దశలుగా విభజించాడు) మనిషి నిప్పులో చేపల్ని కాల్చుకుని తినగలిగే స్థితికి వచ్చాడు. రాతి పనిముట్లతో ముడిగల చెట్టుకొమ్మను గదగా మలచుకున్నాడు. గట్టి కొయ్యతో త్రిశూలాన్ని చేసుకున్నాడు. త్రిశూలం అంటే మూడు కొనలూ పైకి ఉండే ఆయుధం కాదు. ఒక కొన వెనక్కీ, రెండు కొనలు ముందుకీ ఉండేది. అలాంటి అమరికే చేపల్ని పట్టుకోడానికి అనువుగా ఉంటుంది. పాశం కూడా చేపల్ని పట్టుకోడానికి ఉద్దేశించినదే. ఇక మూలమట్టంగా ఉండే కొయ్యను చక్రంగా మలచుకుని జంతువుల మీద ప్రయోగించేవాడు. అది జంతువును పడగొట్టనైనా పడగొడుతుంది, గురి తప్పితే విసిరిన వాడి చేతికే తిరిగి వస్తుంది. దీనిని తెలుగులో ‘వలరి’ అన్నారు. అరవంలో ’వలయత్తడి’ అన్నారు. ఆస్ట్రేలియా ఆదివాసులు ‘బూమరాంగ్’ అన్నారు. గద, త్రిశూలం, పాశం, చక్రం అనే ఆయుధాల పుట్టుక నేపథ్యం ఇదీ.

ధనుర్బాణాల విషయానికి వస్తే, అవి శావేజీ తృతీయదశ ప్రారంభంలో పుట్టాయి. ధనుర్బాణాలు చాలా సంక్లిష్టమైన యంత్రం. వేల సంవత్సరాల అనుభవం రాసిపడిన తర్వాతే ఈ గుణాత్మక నైపుణ్యం అలవడిందని రాంభట్ల అంటారు. అదివరకటి ఆయుధాలు ముఖాముఖీ ప్రయోగించడానికి మాత్రమే వీలైనవి. బాణాలను చాటునుంచి కూడా ప్రయోగించవచ్చు. అందుకే ఈ ఆయుధానికి మహత్యాలు పుట్టాయని ఆయన అంటారు.

ఇక్కడ జరిగింది ఏమిటంటే, అన్న సంపాదనలో భాగంగా ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఆటవికేతరుల చేతికి వచ్చేసరికి మారణాయుధంగా మారిపోయాయి. అంటే, వాటి ప్రయోజనమే మారిపోయింది. ద్రోణుడు విలువిద్యను సాధనచేసి, ప్రావీణ్యం గడించింది, ఒక మారణాయుధంగా మాత్రమే! క్షత్రియులకు మారణాయుధంగానే విలువిద్యతో అవసరం కనుక ద్రోణుడు క్షత్రియ కూటమికి దగ్గరగా ఉన్నాడు. అది ఉభయులకూ లాభదాయకమైన సంబంధం. కనుక తన విద్యను అతను ఇంకొకరికి ఇచ్చే ప్రశ్న లేదు.

విలువిద్యతో ఏకలవ్యుడి అవసరం వేరు. అతనింకా అన్న సంపాదనకోసం విల్లమ్ములపై ఆధారపడే ఆటవిక దశలోనే ఉన్నాడు. అందుకు సరిపోయే విలువిద్య అతనికి అడవిలోనే లభిస్తుంది. ద్రోణుడి దాకా వెళ్ళనవసరమే లేదు. ఏకలవ్యుడు అడవికి కాబోయే రాజు కావచ్చు కానీ, అతనికి రాజ్య విస్తరణ దాహం ఉండే అవకాశం లేదు. శత్రుభయం ఉండే అవకాశమూ తక్కువే. ఒక వేళ ఉందనే అనుకున్నా; కురు-పాండవుల యుద్ధంలో మాదిరిగా భారీ సైనిక, ఆయుధసంపద, సంక్లిష్టమైన వ్యూహప్రతివ్యూహ చాతుర్యం అవసరంలేదు.

ఒక పోలిక చెప్పాలంటే, కత్తులు, కటార్లతో రెండు గుంపుల మధ్య జరిగే ఘర్షణకూ; శతఘ్నులు, ట్యాంకులు, యుద్ధవిమానాలతో రెండుదేశాల మధ్య జరిగే యుద్ధానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో; విలువిద్య అవసరంలో ఏకలవ్యుడికీ, అర్జునుడి లాంటి క్షత్రియుడికీ అంత తేడా ఉంటుంది.

అయినా సరే, ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు.

తెగిన ఏకలవ్యుడి బొటనవేలు చెబుతున్న కథ కంటె, చెప్పకుండా దాచిన కథ వేరే ఉందా?! మనకు తెలియదు.

మరో అంశంతో వచ్చేవారం…

 

 

Download PDF

15 Comments

 • V.V.Satyanarayana Setty says:

  బ ర్బ రీ కు డి తం డ్రి ఘ టో త్క చు దు అ ను కుం టా ను .

  • కల్లూరి భాస్కరం says:

   సౌదా రాసిన ‘అపూర్వ పురాణకథలు’ ప్రకారం బర్బరీకుడు భీమునికీ, జగ్ని అనే ఆదివాసీకీ పుట్టినవాడు. మహాభారతంలో ఈ వివరం ఉందా అన్నది నేను ఇంకా పరిశీలించలేదు. సౌదా ఏ సోర్సునుంచి తీసుకున్నారో చెప్పలేదు.

   • పురాణ వ్యక్తుల గురించి వ్రాసేవేళ పురాణేలే ఆధారాలు కావాలి. సౌదా గారు ఆధారం కాకూడదు గదా. భీముని కుమారుడు ఘటోత్కచుడు. అతని కుమారుడు బర్బరీకుడు. ఇతనినే శ్యాంబాబా అనే పేరుతో అర్చిస్తుంటారు. హైదరాబాదులోని కాచీగూడాలో ఈ శ్యాంబాబాకి ఆలయం ఉంది.

 • కల్లూరి భాస్కరం says:

  “పురాణ వ్యక్తుల గురించి వ్రాసేవేళ పురాణేలే ఆధారాలు కావాలి.” నిజమేనండీ. కానీ పురాణాల్లో కూడా చాలా వెర్షన్లు ఉన్నాయి. దాంతో దేనిని ఆధారం చేసుకోవాలన్న ప్రశ్న కూడా వస్తుంటుంది. ఆరుద్ర పేర్కొన్న ఒక వెర్షన్, ఏకలవ్యుడు కుంతి చెల్లెలి కొడుకని చెప్పినట్టు గుర్తు. ఈ వ్యాస సందర్భంలో నాకు ఆ వివరం అవసరంలేదు కనుక అందులోకి వెళ్లలేదు. ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా అడగడం, మహాభారత యుద్ధంలో పాల్గొనాలని ఉత్సాహపడిన బర్బరీకుడికి అందుకు అవకాశం ఇవ్వకపోవడం, అతనిని వీరబలి ఇవ్వడం మధ్య సామ్యం ఉంది కనుకే బర్బరీకుడి ప్రస్తావన చేశాను. అతను భీముడి కొడుకా, ఘటోత్కచుని కొడుకా అన్నది ఇక్కడ సెకండరీయే.
  బర్బరీకుడు ఘటోత్కచుని కొడుకే అనడానికి మీ దగ్గర ఉన్న పురాణ ఆధారం తెలపగలరు.

 • వురుపుటూరి శ్రీనివాస్ says:

  సౌదా అపూర్వ పురాణ కథలు చదివినప్పటినుంచీ ఈ బర్బరీకుడి కోసం వెదుకుతున్నాను. అంతకు మునుపెప్పుడో ముప్పయ్యేళ్ళ కన్నా ముందు మా ఊరి గ్రంథాలయంలో “బాలయోధులు” అనే పుస్తకం చదివినప్పుడు రెండు, మూడు పేజీల్లో పరిచయమయ్యాఈ బర్బరీకుడు.

  రెండు విషయాలు:

  1. ఈ కథ స్కంద పురాణంలోనిదట (http://www.dvaipayana.net/purana/barbarika/barbarika-skanda-summary.html).

  మరో లింకు: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=10683

  2. ఏ పురాణాలలో కనిపించని కథలూ, విడ్డూరాలూ “జనశ్రుతి” రామాయణ మహాభారతాల్లో ఉంటాయి కదా (సౌదా అపూర్వ పురాణకథల్లో అలాంటివి కొన్ని ప్రస్తావనకి తెచ్చారు). భాస్కరం గారూ, మీ భవిష్యత్ వ్యాసాల్లో మరికొన్నికథలు ప్రస్తావనలోకి వస్తాయని ఆశిస్తున్నాను. వస్తాయా?

  శ్రీనివాస్

  • కల్లూరి భాస్కరం says:

   శ్రీనివాస్ గారూ… మీ 2 వ పాయింట్ లో మీరు చెప్పదలచుకున్నది నాకు సరిగా అర్థం కాలేదు. పురాణాలు వేరు, జనశ్రుతులు వేరు అని; పురాణాలలో కనిపించని విడ్డూరాలు జనశ్రుతులలో ఉంటాయని మీరు భావిస్తున్నట్టు నాకు అనిపించింది. అంటే పురాణాలు, లేదా రామాయణ భారతాలకు ఉన్న ప్రామాణికత జనశ్రుతులకు ఉండదని మీ ఉద్దేశం అనుకుంటున్నాను. కాని నా అవగాహన ప్రకారం జనశ్రుతులను ఒక మేరకు సంస్కరించి, అంటే edit చేసి లిఖిత రూపమిచ్చి న ఫలితమే పురాణాలు. లిఖిత రూపం పొందినవాటిని ప్రామాణికంగానూ, మౌఖిక రూపంలో ఉన్న వాటిని అప్రామాణికంగాను భావించడానికి మనం అలవాటుపడ్డాం. లిఖిత రూపం పొందిన పాఠం స్థిరంగా ఉండిపోవడం కూడా అలా భావించడానికి అవకాశమిస్తుంది. మౌఖికరూపంలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకునే సౌలభ్యం ఉంది కనుక ఒకే కథకు అనేక వెర్షన్లు తయారవుతాయి. లిఖిత రూపం వచ్చాక కూడా మౌఖిక సంప్రదాయం కొనసాగింది కనుక లిఖిత రూపం లోనూ అనేక వెర్షన్లు వచ్చాయి. పురాణాలు-ఉప పురాణాలు-ఉప ఉప పురాణాలు…ఇలా సంఖ్య పెరిగిపోయింది. కనుక ఇది ప్రామాణికం, ఇది కాదు; ఇది పురాణం, ఇది జనశ్రుతి అని గీత గీయడం సాధ్యం కాదు. వెర్షన్లు ఎన్ని ఉన్నా అవి ఉమ్మడిగా ఏం చెబుతున్నాయనేదే మనం పరిశీలించగలిగింది.
   ఇక “మీ భవిష్యత్ వ్యాసాల్లో మరికొన్నికథలు ప్రస్తావనలోకి వస్తాయని ఆశిస్తున్నాను. వస్తాయా?” అన్న మీ ప్రశ్నకు వస్తే, ఎప్పుడు ఏ ప్రస్తావన తెస్తానో చాలాసార్లు ఆ వ్యాసం మొదలెట్టే ముందు నాకే తెలియదు. బర్బరీకుడి ప్రస్తావన కూడా ముందు అనుకోకుండా చేసినదే.

   • వురుపుటూరి శ్రీనివాస్ says:

    జనశ్రుతులు పురాణాలుగా మారే క్రమం గురించి మీరన్నదానితో ఏకీభవిస్తాను.

    “పురాణాలకున్న ప్రాముఖ్యం జనశ్రుతులకుండదు”అనటంలేదు నేను. లిఖిత రూపాన్ని సంతరించుకోకపోయినా వాటికీ “ప్రామాణిక” కథలకున్నంత విలువ ఉంటుందనీ వాటినీ మీరు విశ్లేషిస్తే చదవాలని ఉందని చెప్పబోయాను.

 • నాకింత వరకూ ఈ బర్బరీకుని గురించి తెలియదు. చూస్తుంటే ఇది మీ మరో వ్యాసానికి సరిపోయేంత శక్తినిచ్చేలా వుంది. దయచేసి దీనిమీద మరింత వివరంగా రాయగలరు.

  • కల్లూరి భాస్కరం says:

   ప్రసాద్ గారూ…సౌదా ‘అపూర్వ పురాణ కథలు’లో రాసిన మేరకే నాకు కూడా బర్బరీకుడి గురించి తెలుసు. ఆయన ఒక కోణంలోంచి ఈ పాత్రను తీసుకుని రాశారు. అది తెలిసిన కోణం కనుక నేను అందులోకి వెళ్ళకుండా ప్రస్తావించి వదిలేసాను. నాకుగా నేను ముందుకు తేవాలనుకున్న ప్రశ్నలకే ప్రాధాన్యం ఇచ్చాను. మీరన్నట్టు మరో వ్యాసానికి పుష్టి నిచ్చే విషయమే కానీ, అది చాలావరకు ఏకలవ్యుడి థీమ్ నే రిపీట్ చేయడం అవుతుంది.

 • Saikiran says:

  “ఇక్కడ జరిగింది ఏమిటంటే, అన్న సంపాదనలో భాగంగా ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఆటవికేతరుల చేతికి వచ్చేసరికి మారణాయుధంగా మారిపోయాయి. అంటే, వాటి ప్రయోజనమే మారిపోయింది.”
  = = =
  ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఉట్టి కొట్టుకోటానికో, చెట్టుపైని పండ్లను కొట్టుకోటానికే కాదుగా వాడింది. జంతువులను వేటాడటానికి కూడా కదా! అటువంటప్పుడు వారి ధనుర్బాణాలు మారణాయుధాలు కావని చెప్పటం సహేతుకంగా అనిపించటంలేదు. బాణాలతో జంతువులనే కాదు మనుషులను కూడా చంపవచ్చనే ఆలోచన కూడా ఆటవిక తెగలకు లేదని ఎలా చెప్పగలం? పరిణామక్రమంలో ఇది కూడా భాగమే అని అనుకోవచ్చుగా?
  = = =
  మొదటి ప్రశ్నకు వస్తే, అసలు విలువిద్య ప్రప్రథమంగా ఆటవికులది, అంటే ప్రస్తుత సందర్భంలో ఏకలవ్యుడిది. కనుక విలువిద్యలో ఆటవికులే అసలు గురువులు. ఈ దృష్ట్యా ద్రోణుడి లాంటి మైదానప్రాంతవాసులు ఆటవికులకు శిష్యులు కావడమే న్యాయం.
  = = =
  మైదానప్రాంతవాసులందరూ విలువిద్య ఆటవికుల దగ్గరే నేర్చుకోవాలని ఏముంది. ఈ సందర్భంలో విలువిద్య నేర్చుకున్న ద్రోణాచార్యులవారి మూలాలేమిటి? ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారంటారు. ఆయనకు నేర్పిన గురువు ఎవరిదగ్గర నేర్చుకున్నారంటారు? ఇది కూడా ఒకానొక పరిణామక్రమంలో భాగం అయ్యిఉండవచ్చుకదా? ఒక ఆటవికుడై ఉండి, మైదానప్రాంతవాసిగా ఉన్న ద్రోణాచార్యుల దగ్గర విలువిద్య నేర్చుకుందామని ఏకలవ్యుడు ఎందుకు అనుకున్నాడు? బహుశా తరువాతి వ్యాసంలో ఇవి ప్రస్తావిస్తారేమో… వేచి చూస్తా.

  • కల్లూరి భాస్కరం says:

   సాయికిరణ్ గారూ,,,

   ఇలా కూడా ఆలోచించవచ్చేమో చూడండి.

   లిటరల్ గా చెప్పుకుంటే ఒక జంతువును లేదా మనిషిని చంపేది ఏదైనా మారణాయుధమే. కానీ దానిని వినియోగించే సందర్భాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి మారణాయుధం అనుకున్నదే ఒక సాధనంగా మారుతుంది. ఉదాహరణకు ఒక కత్తితో మనిషిని చంపితే అది మారణాయుధం అవుతుంది. అదే కూరగాయాలు మొదలైన వాటిని తరగడానికి ఉపయోగిస్తే సాధనం అవుతుంది. చంపడం అన్నదానినే తీసుకుంటే, అది కూడా సందర్భాన్ని బట్టి నేరం లేదా తప్పు కావడం, కాకపోవడం ఉంటుంది. ఆత్మరక్షణలో భాగంగా మనిషిని చంపితే దానిని హత్య అనీ నేరమనీ అనం.

   జంతువును చంపితే దాని వెనుక ఉద్దేశం అన్న సంపాదన అయితే అప్పుడు చంపడానికి ఉపయోగించినది సాధనం అవుతుంది. అప్పుడు కూడా లిటరల్ గా చెబితే దానిని మారణాయుధం అనవచ్చేమో కానీ, స్పిరిట్ దృష్ట్యా చెబితే సాధనం అనడమే ఉచితంగా అనిపిస్తుంది. అలాగే చంపడం వెనుక పగ, ప్రతీకారం, రక్తదాహం, రాజ్యదాహం మొదలైనవి ఉంటే అప్పుడు అది మారణాయుధం అవుతుంది. అన్న సంపాదన కోసం జంతువును చంపేటప్పుడు ఇలాంటివి ఉండవు. లేకపోగా, కడుపు నింపుకోవడం కోసం నిన్ను చంపుతున్నాను తప్ప నీ మీద నాకు పగ, కోపం మొదలైనవి లేవని జంతువును ఉద్దేశించి చెప్పడం ఆది కాలం నుంచి ఉంది.

   మీరన్నట్టు మనుషులను చంపే ఆలోచన ఆటవికులకు కూడా ఉంటుంది. నేనన్నది విల్లమ్ముల సృష్టి ప్రధానంగా అన్న సంపాదనకే నని. అది వారి విషయంలో ద్వంద్వ వినియోగ స్వభావం ఉన్నది. కానీ ఆటవీకేతరుల విషయంలో అది అంత ద్వంద్వ వినియోగ సాధనం అని చెప్పలేం. పోనీ ప్రాధాన్యం రీత్యా చెప్పుకున్నా వారికి మొదటగా అది మారణాయుధమే.

   ఇక మీ రెండవ పాయింటుకు వస్తే…ద్రోణాచార్యుడి మూలాలు కూడా ఆటవికదశకు చెందినవే కావచ్చు. ఇప్పుడు పట్టణాలలోనూ నగరాలలోనూ అనేక తరాలుగా స్థిరపడిన వారి మూలాలు గ్రామాలలోనే ఉన్నట్టుగా! అయినా సరే, ఆటవికులు, ఆటవికేతరులు; గ్రామీణులు, నగరవాసులు అన్న విభజన వచ్చింది. దానిని మనం సాంకేతికంగా కూడా గుర్తిస్తున్నాం. ఒక పక్క ఆటవికులు ఆటవికేతరులుగా; గ్రామీణులు నగరవాసులుగా మారే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో వర్తమానంలో ఆ విభజన కూడా కొనసాగుతూనే ఉంటుంది. ద్రోణుడు భూతకాలంలో ఒక ఆటవికుడు కావచ్చు. కానీ వర్తమానంలో ఆటవీకేతరుడు. ఏకలవ్యుడు భవిష్యత్తులో ఆటవీకేతరుడు కాబోతూ ఉండచ్చు. కానీ వర్తమానంలో ఆటవికుడు. కనుక ఒక ఆటవికుడు ఆటవీకేతరుని దగ్గర విలువిద్య నేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నది నేను ముందుకు తెచ్చిన ప్రశ్న.

 • Basith says:

  బర్బరీకుని ప్రస్తావన ఇవ్వాళ కార్పోరేట్ ప్రయోజనాల కోసం ”పోలవరం ప్రాజెక్ట్” కింద మునిగి పోతున్న ఆదివాసిని గుర్తుకు తెచ్చింది. కల్లూరి భాస్కరం గారి కథా కాలక్షేపం గొప్ప చారిత్రక అనుసంధానం వలే సాగి పోతోంది. అభినందనలు, కృతజ్ఞతలు.

  బాసిత్.

 • P Mohan says:

  భాస్కరం గారికి,
  మీ వ్యాసాలు బుర్రకు పదను పెడుతున్నై. చాలా కొత్త కోణాలు చూపుతున్నారు. బర్బరీకునికిని barbarian పదానికి
  సంబంధం ఏమైనా ఉందేమో తెలుసుకోవాని ఉంది. అలాగే తలంబ్రాలు పాక్షాత్య దేశాల్లోనూ (throwing rice)
  ఉన్నాయి, అవి కూడా విశ్వజనీన సంస్కృతివా? వీలయితే తెలపగలరు.

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు మోహన్ గారూ…

   ‘బర్బర’ శబ్దం సంస్కృతం, గ్రీకు, లాటిన్ సహా వివిధ ఇండో-యూరోపియన్ భాషల్లో కనిపిస్తుంది. ఆటవికుడు, అనాగరికుడు, విదేశీయుడు, శత్రువు ఇలా వివిధ context లలో ఈ మాట వాడతారు. కనుక బర్బరీకునికి, బార్బేరియన్ పదానికి సంబంధం ఉంది.

   వధూవరుల తల మీద అక్షింతలు వేయడం పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఉంది. కనుక తలంబ్రాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఆచారాలు అన్నీ ప్రపంచమంతా విస్తరించిన వ్యవసాయ సంస్కృతిలో భాగాలు. నిస్సందేహంగా విశ్వజనీన సంస్కృతిని ప్రతిబింబించేవే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)