నీలిపూల రహస్యం

MythiliScaled

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి జంతువుల చర్మాలతో దుస్తులు కుట్టేది. అవి అందంగానూ మెత్తగానూ ఉండేవి. అమ్మాయి చిన్నపాపగా ఉన్నప్పుడు పొద్దున్నే పాలుపట్టి వాళ్ళ అమ్మ చెట్టుకొమ్మకి వేసిన ఉయ్యాలలో వెచ్చగా కప్పి పడుకోబెట్టేది. పాప నిద్రపోయేది. లేచేసరికి ఉయ్యాల చుట్టూ చిట్టి చిట్టి ఉడతలు మూగి ఆడుతూ ఉండేవి. ఆకుల్లో పాకే సాలీళ్ళని పాప ఆసక్తిగా గమనించేది.అవి పట్టుదారాలు అల్లి గూళ్ళు కట్టుకోవటం ఎంత సేపు చూసినా బావుండేది. వాళ్ళ నాన్న నిపుణుడైన వేటగాడు. అవసరం కొద్దీ  వేటాడే నేర్పుతోబాటు పట్టుబడిన మూగజీవులని దయగా కాపాడటం కూడా అతను పిల్లలకి అలవరచాడు. అలా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పులిపిల్లలూ తోడేలు పిల్లలూ అడవి పిల్లిపిల్లలూ పెరుగుతుండేవి. వాటి పోషణ అంతా పాప పెద్దదయాక తనే చూసేది, వాటితో ఆడుకునేది. అవి  క్రూరజంతువులు కనుక ఎదిగేకొద్దీ చెల్లెలికి ఏమైనా హాని చేస్తాయేమోనని అన్నలు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే ఆమె కి ఆ భయమే లేకపోయేది- అవీ ఎంతో స్నేహంగా మసలుకునేవి, ఆమె కళ్ళెర్రజేస్తే భయపడిపోయేవి కూడా.

చక్కటి  ముఖం, దృఢమైన శరీరం- వీటికితోడు తల్లి తయారు చేసే సొగసైన గౌన్ లు- ఆమె ఒక రాజకుమారిలాగా కనిపించేది. వేసవికి తేలికగా రంగు రంగుల ఈకలతో ఆ దుస్తులు ఉండేవి. జుట్టులో సువాసన వేసే  అడవిపూలు  పెట్టుకునేది. చలికాలానికి కోట్ లూ, టోపీలూ చేతితొడుగులూ – ఇవన్నీ తెల్లని చర్మాలతోనే తల్లి కుట్టేది. మెరిసే నల్లని కళ్ళూ గులాబిరంగు బుగ్గలూ తప్పించి ఆమె మంచులోం చే  పుట్టినట్లు ఉండేది. ఉత్తరపుదిక్కున ఉల్ రుం భూమిలో ఉండే  మంచు దేవుడి కూతురే అలా వచ్చిందని అనుకునేవారు. ఆమె పేరు డ్రి-ఫా [ అంటే మంచులాగా తెల్లనిది అని ].

1aba3658d6313642da4d32068e1a43a1

ఆ ప్రాంతాలలో ఎవరికీ లేని అందం, సంపద ఉన్నా ఎందుకో ఆమెకి తృప్తిగా ఉండేది కాదు. చాలా మంది యువకులు పెళ్ళి చేసుకుంటామని అడిగినా ఎవరినీ ఒప్పుకోలేదు. కొంతమంది తాము వేటాడి సంపాదించిన ఉన్ని చర్మాలను, చాలా మేలైనవాటిని – బహుమతిగా ఇవ్వబోయేవారు. ఇంకొందరు తమ బలాన్నీ చాకచక్యాన్నీ ప్రదర్శించేవారు. ఫెయిరీ ల తో స్నేహం చే సీ , కబౌటర్ [ డచ్ దేశం లో పొట్టిపిశాచాల వంటివి ] లను మెప్పించీ తెచ్చిన వజ్రాలనూ  విలువగల లోహాలనూ ,మరికొందరు,  డ్రి-ఫా ప్రేమను పొందేందుకు చూపించేవారు. దూరసముద్రతీరాల లో దొరికిన సాంబ్రాణినీ రత్నాలనూ తీసుకొచ్చిన వారూ ఉన్నారు. ఒకరైతే ఏకంగా పెద్ద ముత్యాలహారాన్నే కానుక చేయబోయారు. ఆ శీతల అరణ్యాలలో ముత్యాలు చూడటమే ఒక అద్భుతం. కాని ఏదీ డ్రి-ఫా ని సంతోషపెట్టనేలేదు. వచ్చినవారంతా అదే దారిని తిరిగి వెళ్ళిపోయేవారు.

 

అందరి కంటే చివరన సాలీడులాగా కనిపించే వింతమనిషి వచ్చాడు. తన పేరు స్పిన్ హెడ్ అని చెప్పాడు. మణిమాణిక్యాలకన్న, బంగారం కన్న, ఉన్ని కన్న విలువైన రహస్యం తనదగ్గర ఉందని చెప్పాడు. డ్రి-ఫా తల్లికి అతన్ని చూస్తే చిరాకు వేసి పంపించేసింది.

 

కొన్నేళ్ళు గడిచాయి. ఇక డ్రి- ఫా కి పెళ్ళి కాదేమోనని తల్లిదండ్రులు దిగులుపడేవారు. ఒకరోజు ఆమె అడవిలో తను చిన్నప్పుడు ఉయ్యాల ఊగిన ఓక్ చెట్టుకింద పచార్లు చేస్తోంది . అప్పటికి వాళ్ళ ఇల్లు అక్కడికి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుకొమ్మలలోంచి ఒక సాలీడు వచ్చి  పక్కనే కూర్చుంది. అది మాట్లాడింది కూడా.

ఇలా –   ‘’ డ్రి-ఫా ! నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ సంగతే చెప్పేందుకు వచ్చాను. నువ్వేమీ ఇప్పుడే నన్ను పెళ్ళాడనక్కర్లేదు. నీ గది లో నన్నొక గూడు అల్లుకోనీ. అక్కడే నీ కనుచూపుమేరలో ఉంటాను. నీకు చాలా మంచి జరుగుతుంది, కాదనకు ” ఆశ్చర్యపోయి, తనకొక గది ఎక్కడుందా అని ఆలోచిస్తూ, డ్రి- ఫా సరేనంది.

వెంటనే పెద్ద గాలిదుమారం వచ్చి ఓక్ చెట్టు కూలిపోయింది. అక్కడ పెద్ద భవంతి వెలిసింది. పక్కనే విశాలమైన తోట. డ్రి-ఫా అందులో అడుగు పెడుతూనే  ఆమె పాదాల దగ్గర ఒక నీలి పూల చెట్టు మొలిచింది. సాలీడు అంది ” ఈ ఇంట్లో నీకు బాగా నచ్చిన గదిని ఎంచుకో. నూరు రోజులపాటు  నన్ను బాగా చూసుకుంటే ఈ నీలిపూవు రహస్యం నీకు చెబుతాను ”

బాగా సూర్యకాంతి పడే గదిని డ్రి-ఫా ఎంచుకుంది. ఆ గది కిటికీ పైనుంచి కప్పు వరకూ సాలీడుకి కేటాయించింది.

వెంటనే అది తళతళమనే దారాల అల్లిక మొదలుపెట్టింది. చీకటిపడేదాకా దాకా అల్లుతూనే ఉంది. డ్రి-ఫా తనకి కూడా ఆ నాజూకైన అల్లిక చేతనయితే బావుండుననుకుంది. ఏదో రహస్యం అంది కదా సాలీడు, అది దీనికి సంబధించినదేమోననే అనుమానమూ ఆమెకి వచ్చింది. రాత్రయింది. ఇంటికి వెళ్ళటం కష్టం. కాని అక్కడే తన గదిలో నిద్రపోయేందుకు పరుపులూ దుప్పట్లూ  ఏమీ లేవు.

Bronx_Zoo_Spider_Web

” నీకు మంచి పక్క వేస్తాను చూడు ” అంది సాలీడు. ఆ గొంతు ఒక యువకుడిది లాగా ఉంది ఇప్పుడు. డ్రి-ఫా విస్తుపోయిందికానీ ఏమీ అనలేదు. చూస్తుండగానే అతి మెత్తటి, వెచ్చటి పక్క దానంట అదే వచ్చింది. ఇంట్లో కంటే కూడా సుఖంగా , సౌకర్యంగా  ఆమె నిద్రపోయింది.

ఆమెకొక కల వచ్చింది. అప్పటివరకూ ఎవరూ చూసిఉండని తెల్లని వింత  వస్త్రాన్ని ధరించి ఉంది ఆ కలలో. జంతువు చర్మం లాగా దట్టంగా లేదు అది, చాలా పల్చగా, తేలికగా ఉంది . పొద్దుటి వెలుతురులో పచ్చిక మీద సాలెగూడు మెరిసినట్లు మెరుస్తోంది, గడ్డిపరకల మీది మంచుబిందువులలాగా కూడా.

 

నూరు రోజులు గడిచాయి. డ్రి-ఫా ఆ ఇంట్లో ఉదయం నుంచి రాత్రివరకూ ఉండేది. . ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. సాలీడు దారాలు అల్లుతూనే ఉండేది. డ్రి-ఫా ఆ రహస్యం ఎప్పుడు తెలుస్తుందా అని ఎదురు చూసేది. ఏమైనా సరే, తొందరపడి అడిగేయకూడదని , సాలీడు చెప్పెదాకా ఆగాలని ఆమె నిశ్చయించుకుంది.

 

నూరు రోజులు పూర్తవబోతున్నాయి. శిశిరఋతువు వచ్చింది. డ్రి-ఫా తోటలో తిరుగుతోంది. చలిగాలులు వీస్తున్నాయి, పండిపోయిన ఆకులు రాలుతున్నాయి. ఆ నీలిపూవు కూడా ఎప్పుడో రాలిపోయింది. నల్లటి గట్టి కాడ మాత్రమే మిగిలింది. ” ఏముంటుంది ఇక  ఇందులో అద్భుతం ?” అనిపించింది డ్రి-ఫా కి. ఉన్నట్లుండి చాలా బెంగ వచ్చింది . ఉన్నట్లుండి హోరుమని ఈదురుగా లి – అన్ని ఆకులూ రాలి నేలని పసుపచ్చగా కప్పేశాయి. కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. అంతలోనే అంతా నిశ్శబ్దంగా అయింది. డ్రి- ఫా పక్కన ఒక యువకుడు ఉన్నాడు. తన అన్నలకంటే, తనను పెళ్ళాడమని అడిగినవారందరి కంటే- తను చూసిన ఎవరికంటే కూడా అందంగా ఉన్నాడు. సొగసైన తెల్లని దుస్తులు వేసుకున్నాడు. ఆ బట్ట మెత్తగా తను కలలో చూసినదానిలాగే ఉంది. అతని చేతిలో ఆ నీలిపూవు కాడ ఉంది.

” నేనే స్పిన్ హెడ్ ని. నూరు రోజులూ అయిపోయాయి, నా శాపం తీరింది. ఇదిగో నా కానుక నీకు ” అని ఆ పూవుకాడని చూపించాడు. సాలీడు అతనుగా మారినందుకు ఎంతో ఆనందించింది డ్రి-ఫా. అయితే ఆ ఎండిపోయిన కాడ , గొప్ప కానుక ఎలా అవుతుందో ఆమెకి తెలియలేదు. ‘ దాన్ని చీల్చి చూడు ” యువకుడు చెప్పాడు. అలాగే చేసింది ఆమె. లోపల సన్నటి పొడుగాటి నాజూకైన పోగులు, సా లెపురుగు గూటివి లాగా. ఉత్సాహంగా బయటికి లాగింది.

” ఈ విత్తనం నాటితే లక్షల పూలు పూస్తాయి. ఆ కాడల్లోంచి తీసినదారాలతో- ఇదిగో, దీన్ని తయారు చేయచ్చు ” అని చక చకా తెల్లటి బట్టని నేశాడు .అదే లినెన్.

డ్రి-ఫా సంతోషంగా చప్పట్లు కొట్టింది.

1251810-bigthumbnail

” నీ పెళ్ళి గౌన్ కోసం ఇది- పెళ్ళి చేసుకుంటావా నన్ను ? ”

ఆమె సిగ్గుపడింది, అయినా ” ఓ, అలాగే ” అంది.

” నీకు మేలిముసుగుని తయారు చేస్తాను ఉండు ”

మళ్ళీ అతని వేళ్ళు అద్భుతంగా కదిలాయి. ఇంకా సున్నితమైన వస్త్రాన్ని , గజాల కొద్దీ నేశాడు. దాన్ని గాలిలో ఎగరేశాడు, పక్షిలాగా తేలింది అది. అప్పుడు ఆమె మీదికి జార్చాడు. ఆమె ముఖాన్ని కప్పి వీపు మీదినుంచి జీరాడింది. అది  లేస్.

వాళ్ళు పెళ్ళి చేసుకుని  నీలిపూవులు పూయించారు. అవి ఆ నేలకి కొత్త ఆకాశంగా మారాయి. మనుషులు కష్టపడి పని చేశారు.   నగరాలు కళకళలాడాయి. లినెన్ నుంచి బెల్జిక్ ప్రాంతాలకి [ ఇప్పటి నెదర్ లాండ్స్, బెల్జియం, లక్సెం బర్గ్ ] ఐశ్వర్యం వచ్చింది.

linen_history_img_1_blue_flowering_flax

  • డచ్ జానపదకథ
  • అనువాదం: మైథిలి అబ్బరాజు
  • mythili

 

 

 

Download PDF

10 Comments

  • Rekha Jyothi says:

    సుకుమారమైన వర్ణన తోనే కధంతా పరిమళించింది . మొదటి పారా అద్భుతంగా ఉంది Mam, ఎంతోమంది అమ్మాయిల కల కూడాను అలా అన్నయ్యల మధ్య ఒక జాగ్రత్త లో పెరగడం. Really so sensitive expression in each line. Thank u so much Mam .

  • laxmi says:

    మంచి కథ అనువాదం చేశారు చాల థాంక్స్ …

  • NS Murty says:

    మైథిలి అబ్బరాజు గారూ,

    చాలా రోజులనుండీ మీ అనువాదాలు గమనిస్తున్నాను. మీ అనువాద శైలి చాలా బాగుంటుంది. మీరు కథని చెపుతున్నప్పుడు పాఠకుడి కుతూహలం ఏమాత్రం తగ్గకుండా చివరిదాకా నడిపించ గలుగుతున్నారు. స్వతంత్రకథలలో ఉన్న సౌలభ్యం అనువాదాలలో అటువంటి అవకాశం తక్కువ. అయినా మీరు చాలా నేర్పుగానే చెయ్యగలుగుతున్నారు. మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు. మీ ప్రయత్నానికి హృదయ పూర్వక అభినందనలు.

  • a.m.r.anand says:

    చక్కని జానపద కథ. పేర్లు మార్చితే ఏదెశానికైనా వర్తిస్తుంది. చక్కని అనువాదం. అభివందనలు.

  • Harikrisna Mamidi says:

    నైస్ స్టొరీ … కుతూహలాన్ని రేపిన కథనం .. మాలోని child ని ఎప్పటికప్పుడు తట్టి లేపుతున్న సాహిత్యం.. Thanks Maithili Garu

    • Mythili abbaraju says:

      ధన్యవాదాలు హరికృష్ణ గారూ. నేనూ రోజూ చందమామ చదువుకుంటాను

Leave a Reply to Rekha Jyothi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)