కిటికీ బయటి ఆకాశం – వెన్నెలలోని వికాసం

veeralakshmi (2)వాడ్రేవు వీరలక్ష్మి గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రతిభాశాలి. ప్రకృతిని, సంగీతాన్నీ ప్రేమించే భావుకురాలు. అంతేకాదు లలిత గీతాల్ని మధురంగా పాడతారు. ఒక అధ్యాపకురాలిగా రెండు తరాల విద్యార్ధుల్ని ప్రభావితం చేసిన చక్కటి ఉపన్యాసకురాలు.

ఇప్పటికే వీరలక్ష్మిగారి కధలు ఉత్సవ సౌరభం, కొండ ఫలం అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. వెల్లువ అనే నవల రాసారు. పత్రికల్లో ఆవిడ రాసిన కాలమ్స్‌ ఆకులో ఆకునై, మా ఊర్లో కురిసిన వాన గా వెలువడ్డాయి. ఆవిడ రాసిన సాహిత్యానుభవం వ్యాస సంకలనం, సత్యాన్వేషి చలం పరిశోధనా గ్రంథం అనేక ప్రశంసలనీ, పురస్కారాలని అందుకున్నాయి. భారతీయ నవలల్లోని ఉత్తమ నవలల్ని వరుసగా పరిచయం చేస్తూ ఒక కాలమ్‌ని ఆవిడ నిర్వహించారు.

ఇటీవల ఆవిష్కరించిన ‘‘ కిటికీ బయటి వెన్నెల’’ ఆవిడ మూడో కధా సంకలనం. వీరలక్ష్మి గారు ఈ కధా సంకలనం గురించి సభలో మాట్లాడ మన్నప్పుడు ఇష్టంగా ఒప్పుకున్నాను. ఆవిడ రచనల్లోని భావుకత, మెరుపు మెరిసినట్టు తటాలున చమక్కుమనే జీవిత సత్యాలు బావుంటాయి నాకు. నదీ మూలాలు ఎప్పుడూ ఒక సన్నటి జలధారగా ప్రారంభమయి క్రమంగా విస్తరించి, అనంత జలరాశి అయి నిత్యం ప్రవహిస్తాయి. చాలా కాలం క్రితం ఒక సారి ప్రళయకావేరి నది నుండి మొదలై, దాని మూలాల్ని వెతుక్కుంటూ వెళ్ళి చూసినప్పుడు, నా కెందుకో విచిత్ర భావన కలిగింది. మనిషి జీవితం కూడా అట్లాంటిదే కదా! మూలాల్ని గుర్తుంచుకుని, నడిచి వచ్చిన దారుల్ని, నిలబడ్డ నేలనీ మరిచిపోకుండా విస్తరించటం తెలియాలి. వీరలక్ష్మి గారి రచనల్ని చదివినప్పుడు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా అలాంటి వారేనేమో అనిపించింది. తన బాల్యం గడిచిన ఆదివాసీ పల్లెల పచ్చదనాన్నీ, ప్రేమల్నీ, సంఘర్షణలను, జీవన కాంక్షల్నీ, తనలో నింపుకుంటూ, రకరకాల అస్ధిత్వ వేదనల్నీ, మారుతున్న ప్రపంచం పోకడల్నీ, విలువల్నీ, మానవ సంబంధాల్నీ అర్ధం చేసుకుంటూ, తన సాహితీ ప్రస్ధానాన్ని కొనసాగిస్తున్న ప్రవహిస్తున్న, నిత్య నూతన నదిలాంటి వారు ఆమె.

వీరలక్ష్మి గారి కధల గురించి మాట్లాడు కోవడమంటే, మన రోజువారీ జీవితాల్లో, నిత్యం తారసపడే అనేకానేక మంది మనుష్యుల గురించి మాట్లాడుకోవడమే. మానవత్వం, దయ, మనుష్యుల పట్ల అపారమైన ప్రేమ వున్న, సరళంగా, సూటిగా, గుండె నిబ్బరంతో బతికే మనుష్యుల గురించి మాట్లాడు కోవడమే. మనలో వుండే ఉక్రోషాలు, కోపాలు, నిస్సహాయతలు, నిర్భీతులు, లెక్కలేని తెంపరితనాలు, ఈర్ష్య, అసూయలు, ఆనందాల గురించి మాట్లాడు కోవడమే. ఎదురు దెబ్బలు తగిలినా, పడితేచే కెరటాల్లా, జీవితంపైన గొప్ప ఆశతో, కాంక్షతో ఎలా బతకొచ్చో తెలుసుకోవడమే. ఇవి సహజ కధలు.

kitike-196x300

మంచికో చెడుకో రచనలకి ప్రేరణ మనిషి జీవితం. మనిషి లోపల, బయటా జరిగే విధ్వంసం, అందుకుగల కారణాలను అన్వేషించేపని సాహిత్యం చేస్తుంది. జీవితాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు అతి సాధారణమైన మనుష్యులు పడే పెనుగులాటలు, ప్రయత్నాలు, సమాజపు అంచులకు నెట్టి వేయబడ్డ వివిధ సమూహాలు ఎదుర్కొంటున్న వివక్షత, హింస, అణిచివేతలు, జీవితంలోని అస్థవ్యస్థలు, ఆశ నిరాశలు, కలలు ఈ నేపధ్యమంతా, కధలుగా, కవిత్వంగా రూపుదిద్దుకుంటాయి. వీరలక్ష్మి గారి కొత్త కధల సంకలనం కిటికీ బయటి వెన్నెలలోనూ, మనిషి తాలూకు వేదనలు, కలలు, ఆశలు వున్నాయి. ఆవిడ కధలన్నీ స్త్రీలను కేంద్రంగా చేసుకొని, బహుముఖ రూపాల్లో పితృస్వామ్యం ఎలా ఆపరేట్‌ అవుతుందో చెబుతాయి. జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా జీవించగలిగితే మనిషి జీవితం మరింత సరళంగా, మానవీయంగా వుంటుందో చెబుతాయి. ఈ కధల్లోని పాత్రలు గొప్ప జీవకాంక్షతో, భవిష్యత్తు పట్ల చెదరని విశ్వాసంతో మనల్ని పలకరిస్తాయి.

పునరుద్ధానం కధలో ఆదిలక్ష్మి, ఈ విషాదానికి ఈ తేనె చాలులో వింధ్య, అనురాధ, తన్మయిలో సంగీతాన్ని ప్రేమించే తాయారు, భువన, తన్మయి, బరువు భారాల్లో రాజ్యం, ఆరాత్రిలో విశాల, రజని .. ఇటాంటి వాళ్ళంతా, తమ జీవితాల్లో ఎదురైన సవాళ్ళను ఎంతో నిబ్బరంగా, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు. ఏ హంగులు, ఆర్భాటాలు, తీర్పులు, బోధలు లేకుండా తాము నిజమని, మంచి అని నమ్మిన పద్దతుల్లో జీవించిన, జీవితాల్ని తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నించిన స్త్రీలు వీళ్ళు.

పునరుద్ధానం కధలో వ్యసనపరుడై ఆస్తులన్నింటినీ పోగొట్టడమే కాకుండా, నిత్యం హింసించే భర్తని, తన ముగ్గురు పిల్లల్ని , పేదరికాన్ని భరిస్తూ కూడా తన ఇంటి చుట్టూ, పచ్చటి మొక్కల్ని పెంచుకుటుంది ఆదిలక్ష్మి. ఇంటి అరుగులపై ముగ్న్గులేస్తుంది. తనలోని చిరునవ్వుని, ఉత్సాహాన్ని ఎన్నడూ కోల్పోకుండా, జీవితంలో తనకెదురైన ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. పిల్లల్ని పెంపకానికిచ్చి, పొట్టచేత బట్టుకుని వలస పోయిన ఆదిలక్ష్మి తిరిగి తన ఊరికి తిరిగి వచ్చి, గొప్ప ఆశతో జీవితాన్ని ప్రారంభిస్తుంది.

‘‘ బతుకు బరువైనప్పుడల్లా, ఎవరో ఒక ఆదిలక్ష్మి శిధిలాలలోనుంచి, కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ, దారిచూపుతూనే వుంటుందన్న’’ ఆశావాహ దృక్పధంతో ఈ కధని ముగిస్తారు వీరలక్ష్మి.

బరువు భారాలు కధలో రాజ్యంలా కాలాన్ని అదుపు చేయగల విద్యని ఎవరైనా మనకి నేర్పితే బావుండనిపిస్తుంది. వారసత్వంగా తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ ఆస్తుల్నే కాదు,జ్నాపకాల్ని కూడా మిగిల్చి వెడతారు. అలా పెద్దవాళ్ళు వదిలి వెళ్ళిన ఆ పాత వస్తువుల చుట్టూ అనేక జ్నాపకాలున్నా, మళ్ళీ ఎవరికి వారు కొత్త వస్తువుల్ని పోగుచేసుకుంటూ, వాటి చుట్టూ తమవైన జ్నాపకాల్ని అల్లుకుంటూ వుంటారు. ఈ పరంపర అలా కొనపాగుతూనే వుంటుంది. ఒక తరం నుండి మరో తరానికి వచ్చే సరికి ఆ ఆస్తులు, వస్తువులతో వున్న అనుబంధం సహజంగా తగ్గిపోతూ వుంటుంది. ఉతికి మడత పెట్టడానికి ఎదురు చూస్తున్న చీరెల్ని, ఇంట్లో ఎక్కడి వస్తువుల్ని ఎక్కడిక్కడే అర్ధాంతరంగా వదిలేసి సీతమ్మ జీవితం నుండి శాశ్వితంగా నిష్క్రమిస్తుంది. అట్లా వదిలేసిన ఆ ఇంటిని వీరలక్ష్మి వర్ణించిన తీరు మనల్ని చాలా కలవర పరుస్తుంది. ‘‘ రాజ్యం అంటే ఎవరు, ఒక వ్యక్తని ఎందు కనుకుంటున్నావ్‌. పోగు చేయటం నుండి పంచి పెట్టడం దాకా చేసే ప్రయాణానికి తను ఒక రోల్‌ మోడల్‌’’ అన్న గొప్ప తాత్విక సత్యాన్ని చెబుతారు రచయిత్రి. నిజానికి మనుష్యులకి పోగేసుకోవడం అలవాటైనంతగా పంచి పెట్టడం అలవాటు కాలేదు. అది అలవాటైతే పోగేసుకునే కాంక్ష మెల్లిగా కనుమరుగవుతుందన్న ఆశ కలుగుతుంది.

కిటికీ బయటి వెన్నెల కధలో మనం వుండే ఇరుకు గదుల అపార్ట్‌మెంట్‌లలోనూ, ఆకాశాన్ని, పచ్చటి చెట్లనీ, పక్షుల్నీ, కనపడటమే తప్పా వినపడని మనుష్యుల్నీ గమనిస్తూ, మనలో ఒక భాగం చేసుకుంటూ ఎలా ఉత్సాహంగా జీవించవచ్చో రాసారు. ఈ కధలోని నేను పక్కింటి వాళ్ళని ఆమె చూస్తూ వుంటుందన్న విషయాన్ని గమనించారని పనిమనిషి చెప్పాక కూడా ఆమె తన పడక గది కిటికీని మూసేయాలనుకోదు. చుట్టూ వున్న ప్రకృతిలానే ఆ తెలియని మనుష్యులు ఆమె రోజువారీ జీవితంలో భాగమైపోయారు.

‘‘ ఈ మనుష్యుల గురించి నాకు ఎంత తక్కువ తెలిస్తే, అంత మంచిది. ఎందుకంటే, వాళ్ళు నాకు కావాలి గనుక.’’ అనుకుంటుందామె. ఈ తూర్పు వేపు నిమ్మచెట్టులాగే, ఉత్తర దిక్కునున్న వేపచెట్టు గలగలలోంచి కదిలే ఆకాశపు నీలిమల్లాగే వాళ్లూనూ అని ఆ అపరిచిత మనుష్యుల గురించి అనుకుంటుంది. వాళ్ళని వాళ్ళలాగే ఇప్టపడగల సంస్కారం ఆమెది.

తన్మయి కధలో పాట తనకు తెలియకుండానే తన ఊపిరిలోకి వచ్చేసిన, కడుపు నిండా పాటల్ని దాచుకున్న తాయారు బడిలో, వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాటల్ని పాడేది. అలాంటి తాయారుకి బావతో పెళ్ళయ్యాక ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ బరువు బాధ్యతలు, పెద్దవాళ్ళ ధాష్టికాల మధ్య గొంతు దాటి వచ్చేందుకే భయపడిన పాట అమె అంతరంగం లోని పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. పాడమని అడిగే వాళ్ళు లేక, అవకాశంలేక మూగవోయిన ఆమె గొంతు అనేక ఏళ్ళు గడిచాక, చివరికి మేనకోడలు భువన పాడమని అడిగినప్పుడు పలుకుతుంది. విశాఖ సముద్రం ఎదుట నిలబడి ఆమె పాటపాడినప్పుడు, ‘‘ చిన్నప్పుడు పిల్లల కోసం పాలు చేపుకు వచ్చిన అనుభవం లాంటి అనుభవం ’’ కలుగుతుంది తాయారుకు. అమెకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు, కంఠం లోంచి పాట కూడా బయటకు ప్రవహిస్తాయి. తాయారు తరువాతి తరానికి చెందిన భువన తన కెంతో ఇష్టమైన సంగీతాన్ని తనలో నిలుపుకున క్రమంలో, భర్త నుండి సహాయనిరాకరణను, కుటుంబంలో అశాంతిని భరించాల్సి వస్తుంది. తాయారు, భువన పొందలేని, స్వేచ్ఛని, గాయినిగా పేరు ప్రఖ్యాత్తులను ఆ తదుపరి తరానికి చెందిన తాయారు మనవరాలు తన్మయి తన జీవితపు తొలి యవ్వన కాలంలోనే సాధిస్తుంది. స్త్రీల స్వరాలను, స్వప్నాలను బంధించే పురుషాధిపత్యం, కుటుంబంలో కనబడని హింస ఎలా వుంటాయో ఎంతో ఆర్ధ్రంగా చెబుతుంది తన్మయి కధ.

ధైర్యంగా, ఆదర్శవంతంగా జీవించే ఆడవాళ్ళు కూడా ఒక్కో సారి జీవితంలో ఆకస్మికంగా ఎదురయ్యే కష్టాలకి కుంగి పోయి, బాబాలు, స్వాములవార్ల మూఢత్వంలోకి ఎలా పడతారో, చెబుతుంది ఈ విషానికి ఈ తేనె చాలు కధ. భర్తను కోల్పోయి, ఆ దు:ఖం నుండి బయట పడేందుకు, స్వాంతనను పొందేందుకు వింధ్య చేసిన ప్రయత్నంలో అది దొరక్క పోగా, అక్కడా హిందుత్వ మనుధర్మం ఆమె స్థితిని అవమాన పరచటంతో చివరికి మేల్కొని బయట పడుతుంది వింధ్య.

నీడ కధలో   కష్టాల్లో వున్న స్త్రీలని ఆదుకునేందుకు చేసే ప్రయత్నాలు చిత్తశుద్దితో ఉండాలని, ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఎమోషనల్‌గా, హృదయంతో చేయాలి తప్పా, అన్నింటికీ లాజిక్‌ను అప్లయ్‌ చేయాలనుకుంటే సాధ్యం కాదని, నలుగురు కలిస్తేనే అది సాధ్యమవుతుందని చెపుతుంది.

ఆ రాత్రి కధలో ఒక మారు రాత్రి దాడికి గురైన విశాలని ఆమె తల్లి ‘‘ లోకపు ముళ్ళు గుచ్చుకున్నా, గాయాల పాలవకుండా ’’ కాపాడుకో గలిగింది. భర్త ప్రవర్తన వల్ల కలిగిన గాయాలు విశాల తల్లికి లోకజ్నానాన్నిచ్చాయి. పెద్దగా చదువుకోని ఆ తల్లి, కాస్త చదువుకున్న విశాల సామాజిక దౌష్ట్యం కిందపడి నలిగి పోకుండా తమని తాము కాపాడుకోగలిగారు. నగరాల్లో, ఆధునికంగా జీవిస్తున్నామనుకునే ఆడపిల్లలూ మగ్నవాళ్ళ అసభ్యప్రవర్తననీ, దౌర్జన్యాన్నీ ఎదుర్కోక తప్పటంలేదు. వ్యవస్థ విఫలమైన చోట ఎవరి రక్షణని వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది అంటూనే స్వేచ్ఛతో పాటూ విచక్షణ లేక పోవడం పట్ల ఆందోళన పడుతుంది రజని. గీతల్ని చెరుపుకోవచ్చు కధ ప్రాంతాల మధ్య, మనుష్యుల మధ్య వుండే సంబంధాల గురించి చెబుతుంది. తెలియనప్పుడు, అర్ధం కానప్పుడు అపార్ధాలు మిగులుతాయి. కానీ ఒక సమయమొస్తే అందరూ మనుష్యులుగా మారతారు. అపార్దాలు కరుగుతాయి. విభజన రేఖలు, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడూ వాటిని చెరిపేసి మనుష్యుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది. వ్యక్తులకీ, ప్రాంతాలకి కూడా వర్తించే మంచి కధ ఇది.

మెత్తంమీద ఈ సంకలనంలోని కధలు క్లుప్తంగా, సరళంగా, సూటిగా వున్నాయి. వీరలక్ష్మిగారు భావుకురాలు కాబట్టి కధనానికి అడ్డుపడని కవిత్వపు జల్లులు చాలా చోట్ల కనిపిస్తాయి.

‘‘ఇల్లంటే మనకి స్థిమితాన్నీ, శాంతిని, ఇవ్వవలసిన చోటు. అది దొరక్కపోతే, ఆ ఇంటి గురించి ఆలోచించటం అనవసరం. అదసలు ఇల్లేకాదు’’ ‘‘ సౌకర్యాలు, సుఖాల ముందు జ్నాపకాలేపాటివి’’

(పునరుద్ధానం). ‘‘ నీ గురించి మితంగానూ, ప్రపంచ క్షేమం గురించి అతిగానూ ఆలోచించక పోతే, ఎందుకిలాంటి గేదరింగ్స్‌’’ (నీడ) వంటి జీవిత సత్యాలను ఈ కధల్లో చాలా అలవోకగా చెబుతుంది ఆవిడ.

కుటుంబరావు రచనల గురించి కాళీపట్న రామారావు మాష్టారు చెప్పిన మాటలు వీరక్ష్మిగారి కధలకు కూడా వర్తిస్తాయనిపించింది నాకు.

‘‘ భాషేకాక, ఆ కధ కట్టే తీరు కూడా చాలా సరళంగా, వుండేది. వాటిలోని పాత్రలు, ఆ పాత్రల తాలూకు సమస్యలు, వాటిని వారు ఎదుర్కొనే తీరు, అన్నీ నేనెరిగిన మనుష్యులకూ, జీవితాలకూ, చాలా దగ్గరగా కనిపించేవి. కధ మధ్య వారు చేసే వ్యాఖ్యలు నా అవగాహనకు చాలా అవసరంగా వుండేవి. చివరికి కధ ముగించే సరికి, నా అనుభవమో, జ్నానమో, లేక రెండూనో, ఎంతో కొంత మేరకి పెరిగినట్లుండేవి’’

వీరలక్ష్మిగారి కధల్ని చదువుతున్నప్పుడు మనకి సరిగ్గా అలానే అనిపిస్తుంది. అంచేత ఈ కధలు కాలానికి నిలుస్తాయి. ఆవిడ జీవితపు దృక్పధం మనుష్యులు సుఖంగా, మంచిగా, ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా, ఆత్మ గౌరవంతో జీవించాలని. మానవ సంబంధాల్లో వున్న సకల అమానవీయతలూ పోవాలనీ, మంచి సమాజం రావాలనీ. ఏ సమాజంలోనైనా జరగాల్సింది ఇదే. వీరలక్ష్మి గారి కిటికీ బయటి వెన్నెల కధల పుస్తకం అందరూ చదవాల్సిన పుస్తకం. ఆవిడ మరిన్ని మంచి కధలు రాయాలనీ, ఆమె మాత్రమే చేయాల్సిన, అసంపూర్ణం గా మిగిలిపోయిన రచనలను ఆమె పూర్తిచేసేందుకు పూనుకోవాలనే చిన వీరభద్రుడు ఆకాంక్ష , అవిడని అభిమానించే పాఠకులందరిదీనని ఆవిడ గుర్తిస్తారని ఆశిద్దాం.

-ఎం. విమల

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

1 Comment

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)