మీరే చెప్పండి

  bhuvanachandra (5)ఆ రోజుల్లో ‘పాండీబజార్’ ఎంత ఫేమస్సంటే అక్కడ నడుస్తుంటే చాలు.. బోలెడు మంది ‘ఆర్టిస్టులు’ కనపడే వాళ్ళు. టి.నగర్ సరేసరి. హార్ట్ అఫ్‌ ద సిటీ. ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ టి.నగర్. ఎన్ని జ్యుయెలరీ షాపులో లెక్కలేదు. ఇక వస్త్ర వ్యాపారానికి టి.నగర్ పెట్టింది పేరు. పట్టు చీరలు, సిల్కు చీరలు ఇలా ఎన్ని రకాలో అన్ని దొరుకుతాయి.

ఆంధ్రా నుండి పట్టుచీరల కొనుగోలుకి వచ్చే వారి సంఖ్యకి లెక్కలేదు. ఇప్పటికీ ఆ రష్ పెరిగిందే గానీ తగ్గలేదు. వ్యాపారానికి సినీ గ్లామర్ తోడవటంతో టి నగర్ ఎప్పుడూ కిట కిట లాడుతూ వుంటుంది.

‘పానగల్’ పార్క్ కూడ చాలా ఫేమస్. తెలుగు వారందరూ అక్కడికి చేరేవారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు. అక్కడ ఘంటసాల బెంచీ, మల్లాది (రామకృష్ణ శాస్త్రి) బెంచీ, పింగళి గారి బెంచీ ఇలా చాలా బెంచీలు వుండేవి. ఎందుకంటే వాళ్ళు పార్కుకి వచ్చినప్పుడు అక్కడే కూర్చునేవారట. సత్సంగాలూ, కవితాగోష్టులూ ఇవన్నీ అక్కడే సాగేవి. ఇక జరుక్ శాస్త్రి, (జల సూత్రం రుక్మిణీ శాస్త్రి)గారి పేరడీలు అక్కడే పురుడు పోసుకునేవి అంటారు.

అక్కడే ‘మనసత్యం’ (జై హింద్ స్టూడియో) చాలా శ్రమించి జనాన్ని కూడగట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి.. సినీ ప్రముఖులతో కలిసి ప్రతిష్టించిన నిలువెత్తు చిత్తూరు నాగయ్యగారి విగ్రహం యీనాటికి మనని పలకరిస్తూ, తెలుగువారి ఒకప్పటి ప్రాభవాన్ని చాటుతూ వుంటుంది. అప్పట్లో కూచిపూడి డాన్స్ అకాడమీ వెంపటి చిన సత్యం గారిది పానగల్ పార్కు పక్కనే వుండేది. స్టాండర్డ్ ఎలెక్ట్రికల్సు.. దాని ముందర ప్లాట్‌ఫాం మీద నాలుగు కుర్చీలు వేసి, బోలెడు పత్రికల్నీ, న్యూస్ పేపర్లనీ (తాజావి) ఓ గోనెపట్టామీద పడేసి, (జనాలు చదువు కోవడం కోసం) మరో కుర్చీలో డాక్టర్ గోపాలకృష్ణగారు కూర్చుని వుండేవారు.

35 సంవత్సరాలకి పైగా కొన్ని లక్షలమందికి ఉచితంగా హోమియో మందులు ఇచ్చిన మహానుబావుడు డా!!గోపాలకృష్ణగారు. సాయంకాలంలో పెద్దపెద్ద వాళ్ళంతా, అంటే, అల్లురామలింగయ్యగారూ, జగ్గయ్యగారూ, శారదగారూ, జలంధరగారూ ఇలా ఎంతమందో అక్కడి వచ్చి, కాసేపు కూర్చుని డాక్టరు గారితో ముచ్చటించి వెళ్ళేవారు. నేనూ, గౌతం కశ్యప్, డైరెక్టర్ బి.జయ అందరం అక్కడే కలిసే వాళ్ళం.

వరద వచ్చినా, ఉప్పెన వచ్చినా వన్‌ఫార్టీఫోర్ సెక్షన్ అమలు చేసినా ‘చెట్టు కింద క్లినిక్’ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేది. బీద సాదలకి ఆరోగ్యదానం చేస్తూనే ఉండేది. మండే ఎండైనా సరే, కుంభవృష్టి అయినా సరే, డాక్టరుగారు మాత్రం ఉదయం ఏడున్నర నుండి రాత్రి పదింటి దాకా అక్కడే వుండేవారు. ప్రపంచపు తలుపులు మూసుకుపొయినా డాక్టర్‌గారి హృదయ కవాటాలు మాత్రం తెరిచే వుండేవి.

ఆయన గురించి చెప్పాలంటే ఓ మహా గ్రంధమే అవుతుంది. కలెక్టర్‌కి పి.ఎ.గా, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో గొప్ప హోదాగల అధికారిగా, ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్ పోస్ట్‌గ్రాట్యుయేట్‌గా, కొంతకాలం సినిమా నటుడిగా (చాల short period) నాటకాలలో నటుడిగా, ఆ తరవాత హోమియో వైద్యాన్ని డా!! గాలిబాల సుందర రావుగారి నుంచి నేర్చుకుని హోమియో వైద్యులై. చివరివరకూ ప్రజలకు సేవ చేస్తూనే లోకం నుంచి నిష్క్రమించారు. ఆయనో మహా తత్త్వవేత్త, మహా మానవతావాది, అధ్యాత్మక వేత్త. ఆత్మ దర్శనం పొందిన మహయోగి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సినీజనాలందరూ సాయంత్రమైతే చాలు గీతాకేఫ్ దగ్గర్లో, రాణీ బుక్ సెంటర్ దగ్గరో (త్రిపురనేని రామాస్వామి కుమార్తె), డాక్టరుగారి దగ్గరో చేరేవాళ్ళు. కాసేపు కబుర్లేగాక సంగీత సాహిత్య చర్చలు జరుగుతువుండేవి. తెలుగు పుస్తకం కావాలంటే రాణీబుక్ సెంటర్‌కి వెళితే చాలు పుస్తకం లేకపోతే తెప్పించి మరీ ఇచ్చేవారు. వారి అబ్బాయి అనిల్ అట్లూరి ఇప్పటికీ సాహిత్య సేవ చేస్తునే వున్నారు. నాకు మంచి మిత్రుడు శ్రేయోభిలాషి.

నా కేరాఫ్ అడ్రస్ డాక్టరుగారే. అక్కడే వుండేవాడ్ని. పని ఉంటే స్టూడియోల్లో – లేకపోతే డాక్టరుగారి దగ్గర.

హోమియో మందులేకాదు… డాక్టరుగారు ఎంతో మందికి సహాయం చేసేవారు. ‘మీటర్’ తిరగని అసిస్టెంటు డైరెక్టర్లు, సినీ కళాకారులూ డాక్టరుగారి సహాయం పొందేవారు. అదో గాధ. అప్పట్లో నెల్లూరి నించి ఓ రెడ్డిగారు మద్రాసులో ఓ చిట్‌ఫండ్ కంపెనీలో గుమాస్తాగా చేరి, సాయంత్రం ఏడు దాటాక మా దగ్గరికి వచ్చేవారు. శివవిష్ణు టెంపుల్ దగ్గరి మేడ మీది రేకుషెడ్డులో వుండేవాడు. పెళ్ళి కాలేదు గనక వచ్చే డబ్బు సరిపోయేది ఆయనకి.

దొరైస్వామి బ్రిడ్జి దాటాక ఆచారిగారి నగల కొట్టు ఒకటుండేది. మంగళసూత్రాలు, ఉంగరాలూ లాంటివి ఆయన చాలా బాగా తయారుచేసేవారు. ఆ రోజులో వ్యాపారం ‘బ్రాండ్’ మీద కంటే ‘నమ్మకం’ మీద ఎక్కువ సాగేది. అయితే ఆ కాలంలో ‘బ్రాండ్’ పిచ్చివాళ్ళు లేరా అంటే ఉన్నారని చెప్పక తప్పదు. ‘స్పెన్సర్’లో కొనడం గొప్ప.. అలాగే పట్టుచీరలకి నల్లిస్ వారూ, బంగారానికి ఉమ్మిడియార్స్… టిఫిన్లకి ఉడ్‌లాండ్స్ ఇలా చాలా ఉండేవి.

ఒకరోజున ఆచారిగారో ఖబురు తెచ్చారు. అప్పుడు నేనూ, రెడ్డిగారూ, సూరి శ్రీ విలాస్ గారూ అక్కడే వున్నాం- ఏమంటే, వెస్ట్ మాంబళం xxx వ నంబరు ఇంట్లోంచి రాత్రిళ్ళు ఏడుపులు వినిపిస్తున్నాయనీ, ఆ ఏడుపుల్ని బట్టి ఏడ్చేది ఒక తెలుగు పిల్ల అనీ!

“వెళ్ళి కనుక్కుందామంటారా?” అన్నారు డాక్టరుగారు.

R19

“ఏంక్వయిరీ చేశా. ఆ ఇంటి ఓనర్లు ఇక్కడ అంటే మద్రాస్‌లో లేరుట. ఇంటిని ఓ టాక్సిడ్రైవర్‌కి అద్దెకిచ్చారుట. అదీ పెద్ద ఇల్లేంకాదు. ఓ రెండుగదులూ, చిన్న వరండా, వంటిల్లూ, బాత్రూమూ. అంతే.. ఆ యింటి పక్కనే మా షాపులో పని చేసే రంగారావు వాళ్ళ అన్న అద్దెకుంటున్నాడు. ఆ పిల్లని లోపల ఏదన్నా హింసిస్తూ వుండి వుండొచ్చు అని అతను నాతో చెప్పాడు.. అన్నారు ఆచారిగారు.

“పోలీస్ రిపోర్టు ఇస్తే?” ఆ టాక్సీ డ్రైవర్ ఓ చిన్న పాటి రౌడీ మాత్రమే కాకుండా అక్కడి లోకల్ పొలిటికల్ లీడర్స్‌కి తొత్తుట. అందుకే కంప్లైంటు ఇచ్చినా లాభం వుండదనీ, అలా కంప్లైంటు ఇచ్చింది ‘ఫలానా’ వాళ్ళు అని తెలిస్తే ఆ టాక్సీవాడు నానా తలనెప్పులు తెస్తాడనీ రంగారావు అన్న భయపడుతూనే చెప్పాడు. అన్నారు ఆచారి.

అయితే ఒక్కపని చేద్దాం.. వాడు లేనప్పుడు మన ఆనందీ యీశ్వరన్‌ని వాళ్ళింటికి సేల్స్ ప్రమోషన్‌కి పంపిద్దాం (ఆవిడ ఆల్‌రెడీ ఉష మెషిన్లకి సేల్స్ ప్రమోటర్) ఆవిడకి బాగా తెలుగు వచ్చు కనక లోపల వున్న అమ్మాయి తెలుగులో మాట్లాడితే అర్త్ధం అవుతుంది. కనీసం లోపలి పొజిషన్ ఏమిటో తెలుస్తుంది. అన్నారు డాక్టరుగారు.

“అది చాలా మంచిపని. తమిళం ఆనందిగారి మాతృభాష గనక టాక్సీ వాడు మధ్యలో వచ్చినా అనుమానం రాదు. అదీగాక కంపెనీ IDకార్డు వుంటుందిగా…” మెచ్చుకున్నారు శ్రీ విలాస్ గారు.

“వర్కవుట్ కాలేదు సార్. ఆ పిల్లని బాత్‌రూంలో నోటికి గుడ్డకట్టి తాళం వేశారు. అలాంటి ములుగు వినిపించింది గానీ… నేను అడగలేను గదా…!” అన్నది ఆనందీయీశ్వర్ డాక్టర్ జీతో. “ఓ పని చేస్తా సర్.. నేను ఎవరో ఎవరికీ తెలీదు గదా. వాడు బయటికి వెళ్ళినప్పుడు నేను బలవంతంగా లోపలికి దూరి ఆ అమ్మాయిని పిడిపించి తీసుకొస్తాను…” కాన్‌ఫిడెంట్‌గా అన్నాడు రెడ్డిగారు.

“ఏ మాత్రం అటు ఇటూ అయినా దౌర్జన్యం కేసు కిందో, గూండా చట్టం కిందో నిన్ను మూసేస్తారు. పిచ్చి వేషాలు వద్దు.” సీరియస్‌గా వార్నింగిచ్చారు డాక్టరుగారు.

“మరి ఏలాగు ?”

“ఇంట్లోనే మూసి పెట్టి ఎన్నాళ్ళుంటారు? ఆ చుట్టు పక్కల ఎక్కడైనా కాపుగాయటానికి వీలుందా?” అడిగారు డాక్టర్.

“రంగారావు అన్నయ్య వాళ్ళు ఇల్లు ఆ యింటి పక్కనేగా..” చెప్పారు ఆచారిగారు.

“సరే.. ఓ రెండ్రోజుల పాటు పగలూ రాత్రి రెడ్డిని అక్కడ వుంచే ఏర్పాటు చేయండి. తరవాత సంగతి చూద్దాం!” అన్నారు డాక్టర్.

“వద్దు సార్.. మా రంగారావునే వాళ్ళన్నయ్య ఇంట్లో వుండి అబ్జర్వు చెయ్యమని చెబుతాను. ఎందుకంటే, కొత్త వాళ్ళు ఎవరొచ్చినా డౌట్స్ వస్తాయి.. రంగారావైతే సందేహంరాదు… అన్నారు ఆచారిగారు. “సరే.. అలా అయితే ఇంకేం కావాలీ!. అన్నారు డాక్టర్ గారు.

ఎంత ప్రయత్నించినా ఆ మరుసటి రోజున కూడ కధ ముందుకు సాగలేదు. ఏడుపులు వినిపిస్తున్నాయిట గానీ బాగా నీరసంగా వినిపిస్తున్నాయట. బయటి వాళ్ళెవరూ ఆ ఇంట్లోకి రాలేదనీ, లోపలి వాళ్ళు బయటికీ రాలేదనీ (టాక్సీవాడు తప్ప) ఇన్‌ఫర్‌మేషన్ మాత్రం ఖచ్చితంగా తెలిసింది రంగారావు ద్వారా.

ఆ మరుసటి రోజున ఆచారిగారు ఉరుకులు పరుగుల మీద పొద్దున్నే ఏడింటికే చెట్టు కిందకి వచ్చారు. బాగా కంగారుగా ఉన్నారు. నేను అప్పటికి కుర్చీలు వేసి పుస్తకాలు, పేపర్లూ పడెయ్యడానికి గోనె పట్టాలు, స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్‌కి ఇవతలి పక్కగా, అంతా, ఎవరికీ అడ్డులేకుండా వేస్తున్నాను.

“ఏమయింది ఆచారిగారూ?” అడిగాను.

“ముందు నన్ను కూర్చోనివ్వండి…!” అంటూ కూర్చుని ఆయాసంగా రొపుతున్నారు. నేను ఆ పక్కనే వున్న టీస్టాల్‌నించి ఓ గ్లాసెడు మంచినీళ్ళు ఆయన చేతికిచ్చి నా పని నేను చేసుకుంటున్నాను.

చిత్రంగా 7.20 కల్లా డాక్టరుగారు వచ్చారు. ఆయన్ని చూడగానే ఆచారిగారు ఏదో చెప్పబోతుండగా, “రాజావారూ, మీరూ రండి” అని డాక్టర్‌గారు నన్ను పిలిచారు. (ఆయన అలాగే పిచేవారు నన్ను). నేనూ కుర్చీలో కూర్చున్నాను.

“ఇప్పుడు చెప్పండి..” అన్నారు డాక్టరు గారు.

“మన రెడ్డి చాలా ఘోరమైన పని చేశాడండీ… పిల్లాపాప వున్నవాడ్నిగదా.. ఇలా నన్ను ఇరికించవొచ్చా…” అని ఏడుపు మొరపెట్టారు ఆచారిగారు.

“అసలు ఏమయిందీ?”

“నిన్న రాత్రి రంగారావుతో రెడ్డిగారు కూడా రంగారావు అన్నయ్య వాళ్ళింటికి కెళ్ళాడుట. రాత్రి పదింటికి ఆ టాక్సీ వాడు బయటికి ఎందుకో పోగానే యీ రెడ్డిగారు ఆ టాక్సీ వాడింట్లోకి చొరబడి, టాక్సీవాడి భార్యని బెదిరించి గది తాళం తీయించి ఆ పిల్లని బయటికి తీసుకొచ్చాడు. ఇంతకీ ఆ పిల్ల ఒంటి మీద బట్టలు వూడదీసి తాళం పెట్టి వుంచాడుట ఆ వెధవ టాక్సీ వాడు. యీయనేమో అర్జంటుగా ఓ దుప్పటి కప్పి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి గదికి వేసిన తాళమే ఆ యింటికి వేసి రంగారావు వాళ్ళ అన్నగారి టీవీయస్ బండి మీద ఆ పిల్లని మా యింటికి తీసుకొచ్చాడు.” ఆయాసంతో ఆగాడు ఆచారిగారు.

“ఓర్నీ.. అంత ధైర్యం చేశాడా నెల్లూరి రెడ్డి. సరే.. మరి ఆ టాక్సీవాడి పెళ్ళాం అరవలేదా? అన్నారు డాక్టరుగారు.

“నేను ఆంధ్రా పొలీస్ ఇన్‌స్పెక్టర్ని అరిచావంటే చంపేస్తాను అని ‘లియో’ పిస్తల్‌తో బెదిరించాడుట. (లియో పిస్టల్స్ అంటే బొమ్మ పిస్టల్స్.. అవి చూడటానికి నిజం పిస్టల్స్ లాగే వుంటాయి. ఖరీదు కాస్త ఎక్కువ) అయినా ఆ తరవాత ఏం జరిగిందో రెడ్డికి ఎలా తెలుస్తుందీ. ఆ పిల్లని మా యింటికి దగ్గర దింపేసి పొయాడు.” అన్నాడు ఆచారి. (ఇంతకీ ఆ బొమ్మ పిస్టల్ రంగారావు అన్న కూతురిది)

“ఆ అమ్మాయి ఎమన్నదీ?”

“ఏదీ.. చచ్చేంత నీరసంగా వుంది. మూడ్రోజులైందిట అన్నం తిని. రాత్రిళ్ళు ఎముంటై.. ఏదో కాస్త మజ్జిగ మాత్రం మా ఆవిడ ఇచ్చింది. డాక్టరుగారూ, నన్ను అనవసరంగా ఇరికించాడండీ ఆ రెడ్డి. ఇప్పుడా టాక్సీవాడికీ విషయం తెలిస్తే నా బతుకు బుగ్గిపాలు అవుతుంది. అసలే వాడికి పొలిటికల్ సపోర్టుంది…” మళ్ళి భోరుమన్నాడు ఆచారిగారు.

“మీరేమీ వర్రీ కాకండి. మీరు ఇక్కడే వుండండి. నేను ఇద్దరు ఆడపిలల్ల్ని మీ ఇంటికి పంపుతాను. వాళ్ళు పూర్తిగా సమాచారం సేకరించి వస్తారు. ఆ తరవాత ఆలోచిద్దాం ఏం చెయ్యాలో.. మీకు మాత్రం ఏ అపకారము జరగదు.” అని అభయం ఇచ్చారు డాక్టరు గారు.

“మీరు అంత మాట ఇచ్చాక సరేనండీ.. కానీ నా భయము నా పెళ్ళాం పిల్లల గురించే!” నిట్టూర్చాడు. ఆచారిగారు.

డాక్టర్‌గారు విజయకి ఫోన్ చెయ్యమని నాతో చెప్పారు. విజయ హైకోర్టు లాయరు. మాతృభాష తమిళం అయినా తెలుగు భాగా వొచ్చును. పదింటికల్ల ఆవిడ వచ్చింది. ఇంకొకరెవరంటే తెలుగు సినిమాల్లో కోరస్ పాడే సరోజ. పెద్దావిడ.. పెద్ద మనిషి తరవోగా వుంటుంది.

ఇన్‌ఫర్ మేషన్ మధ్యాహ్నాం మూడింటికికల్లా వచ్చింది. ఆ పిల్లది రాజమండ్రి దగ్గర వుండే ఓ పల్లెటూరు. పెద్ద చదువు లేదు గానీ సినిమాపిచ్చి. తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. వాళ్ళది బాగా కలిగిన కుటుంబమే.

రాజమండ్రిలోనూ, పరిసర ప్రాతంల్లోనూ షూటింగ్ జరుగుతోందని తెలిసి ఫ్రెండ్స్‌తో కలిసి చూడ్డానికి వెళ్ళిందట. అక్కడో కెమేరా అసిస్టెంటుతో పరిచయం అయిందిట. ఇంతకీ చూస్తే అతను కెమేరాకి సంబంధించిన వాడుకాదు.. లైట్ బోయ్. వాడు యీ పిల్లకి వచ్చీరాని తెలుగులో చుక్కలు చూపించాడుట. ఇంకేంవుందీ. స్టారై పోదామని తల్లికీ తండ్రికీ చెప్పకుండా నగలూ డబ్బు కొంత మూటగట్టి వాడితో పాటు మెయిల్ఎక్కిందిట.

తీరా మెయిల్ మద్రాసొచ్చాక చూస్తే వాడూ లేడు యీ పిల్ల నగలూ డబ్బు కూడా లేవు.

ఏడుస్తుంటే యీ టాక్సివాడు చూసి అయ్యో.. మా ఆవిడదీ రాజమండ్రీ. ఇవ్వాల మా ఇంట్లో వుంటే, రేపు మా ఆవిడ్నిచ్చి నిన్ను రాజమండ్రి పంపుతాను. టిక్కెట్టు డబ్బులూ అవీ మీ అమ్మానాన్నని అడిగి ఇద్దుగాని’ అని బుజ్జగించి ఇంటికి తీసుకుపోయాడంట.

ఆ తరవాత కధ ఏముటుందీ? బహుశా రెడ్డిగారు గనక యీ పిల్లని దౌర్జన్యంగా బయటికి తీసుకు రాక పొయి ఉంటే వాడు ఆ పిల్లని పడుపు వృత్తిలో దింపేవాడు.. లేకపొతే ఏ కంపెనీకో అమ్మేసి వుండేవాడు. ఇదీ కధ. ఈ విషయం వివరించి, “డాక్టరుగారూ పిల్ల మాత్రం చాలా అందంగా ఉందండీ అందం కంటే అ పిల్ల అమాయకత్వం చూసి జాలేసింది.” అన్నది లాయరు విజయ.

ఓ చీర, లంగా ఆ పిల్లకి సరిపోయే రెడీమేడ్ జాకెట్టు కొనిచ్చింది సరోజగారు (డబ్బు డాక్టరు గారే ఇచ్చారు). ఇక ఆ అమ్మాయిని పంపాలంటే ఎలాగా అని డిస్కషన్ మొదలైంది. బస్సుల్లోనూ, ట్రైన్‌లోనూ వొద్దనుకున్నాం. కారులో పంపాలంటే బొలేడంత అవుతుంది. అప్పుడే నేను పరిశ్రమకి కొత్తగ వచ్చిన రోజులు గనక నాకూ కాస్త ఇబ్బందిగానే ఉండేది. (అయితే మిలటరి పెన్షన్ వస్తుంది కనక అవసరాల వరకూ హాయిగా తీరేవి నో లగ్జరీస్).

డాక్టర్ గారితో ప్రసిద్ధ రచయిత్రి జలంధర, నేనూ

డాక్టర్ గారితో ప్రసిద్ధ రచయిత్రి జలంధర, నేనూ

దానికి ఓ సోల్యూషన్ దొరికింది. ఉమామహేశ్వరావని ఓ నటుడు శివుడి వేషాలు వేసేవాడు. వాళ్ళ అబ్బాయికి పెళ్ళి సంబంధం చూడటం కోసం గూడూరు వరకూ కార్లో వెడుతున్నారని తెలిసింది. డాక్టరు గారు అతన్ని రప్పించి మరొకర్ని కూడా కార్లో ఎక్కించుకుని గూడూర్లో దింపడానికి వీలవుతుందా అని అడిగారు. ఆయన ఓకే అన్నాక ఆసలు విషయం చెప్పారు.

“తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదుగానీ, ఆమెని గూడూర్లో ఎవరైనా ఇలాగే చీట్ చేస్తే ఎలాగ?” అని ఆయన ధర్మ సందేహం బయట పెట్టాడు.

అప్పుడు శ్రీనివాస్ గారన్నారు. “బయటకి తెచ్చింది రెడ్డిగారు గనకా, అతనిది గూడూరు దగ్గరుండే నెల్లూరే గనకా ఆ పిల్లని అతనితోనే రాజమండ్రిదాకా పంపి పిల్లని వాళ్ళ ఇంటి దగ్గర దింపితే మంచిదేమో!” అని డాక్టరుగారు నవ్వి, “నేనేమో విజయని ఆ పిల్లకి తోడుగా పంపుదామనుకున్నాను. కానీ, మీరన్నట్టు రెడ్డీ రైట్” అన్నారు.

ఇహనేం.. వాళ్ళిద్దరూ గూడూరు నించి రాజమండ్రికి బస్సులు మారుతూ పోయేటట్టూ, మళ్ళీ రెడ్డి ట్రైన్‌లో వెనక్కి వచ్చేటట్టూ నిర్ణయం జరిగింది. గబగబా డబ్బులు కూడా పొగయ్యాయి.. కావల్సిన దానికంటే తక్కువే.

స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్ దగ్గరే, ఎప్పుడూ డాక్టర్ గారికి విధేయుడిగా వుండే ‘కదిరివన్’ ఆటోలో రజని (ఓ సినీ నటికి P.A.) సరోజ వెళ్ళి బాగా చీకటి పడ్డాక ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. గభాల్న మేము ఆ పిల్లను నాయుడి సినీ టైలర్స్’ షాపులో కూర్చోపెట్టాం. నిజంగా చాలా అందగత్తె కానీ బెదిరిపొయి వుంది.

ఎనిమిదిన్నరకు ఉమగారి కారు వచ్చింది. డ్రైవరూ, ఉమామహేశ్వర్రావు, ఆయన భార్య, యీ పిల్ల, రెడ్డిగారూ మొత్తానికి ఆ ఎంబాసిడర్ కార్లో అడ్జస్టయ్యారు.

దిగ్విజయంగా ఆ పిల్లని వాళ్ళింటి వద్ద దించి మధ్యలో వాళ్ళ ఊళ్ళో దిగి ఓ పూట వుండి నాలుగో రోజున వచ్చాడు రెడ్డిగారు.

“వాళ్ళు వాళ్ళు’ చాలా ఉన్నొళ్ళండి. బోలెడంత మర్యాద చేశారండీ.. అంటూ చాలా విషయాలు వర్ణించాడు రెడ్డిగారు.

మద్రాసు వచ్చేసిందని కాకుండా రాజమండ్రి చుట్టాల ఇంట్లో వుండి వచ్చిందని చెప్పమని చెప్పానని కూడా చెప్పాడు రెడ్డిగారు.

మొతానికి ఆ పిల్ల తెచ్చిన నగలూ డబ్బు పోయినా కనీసం పిల్ల, శీలం నిలిచినందుకు అందరం సంతో షించాం.

ఆ తరవాత బాబు అనే ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిచయమై మాకు చెప్పాడు. ఇలాంటి టాక్సీ డ్రైవర్ గాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారట. వాళ్ళ పని అమ్మాయిల్ని ఎట్లాగొట్లా మాయ చేసి పడుపు వృత్తిలోకి దించడం అని. మరో విషయం విని షాక్ తిన్నాం. ఏమంటే రోజుకి కనీసం ఓ వంద మంది ఆంద్రా ఆడపిల్లలు సినీ మోజులో మద్రాసుకి వస్తుంటారనీ అందులో అధికభావం పడుపువృత్తిలోకి దింపబడతారనీ. చాలా చాలా బాధపడ్డాము. అర్జంటుగా పేరూ డబ్బు వచ్చేస్తాయనే మోజులో ఆడపిల్లలే కాదు, వందలాది మంచి యువకులు కూడ పరిశ్రమని ఓ వూపు ఊపేద్దాం అని వస్తుంటారు. ఫాల్స్ ప్రిస్టేజితో వెనక్కి వెళ్ళలేక, నికృష్టమైన బతుకులు బతుకుతూ వుంటారు. తెలిసి తెలియని తనం.. ఫీల్డు గురించి అవగాహన లేకపోవడం, ఫాల్స్‌ప్రిస్టేజ్ వీటితో బతుకు నరకమై పోతుంది. “సార్ నేను చిరంజీవి గారికి సరిపడే కధ రాశాననో, సార్ నలభై పాటలు రాశాను సార్. ఏ హీరో కయినా సరిపొతై..” అనో..సినిమా వాళ్ళకి ఫోన్లు వస్తూనే వుంటై. బోలెడు మంది గంపెడు ఆశలతో ఆఫీసుల ముందర కధల కట్టలు, పాటల కట్టలూ పట్టుకుని అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూనే వుంటారు. కొందరికి అవకాశాలు దక్కితే 90% అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వెడితే తలెత్తుకో లేమని భావిస్తూ ఎలగోలా బండి లాగిస్తూ వుంటారు.

ఇదో అంతులేని కధ. ఇంతకీ చెప్పొచ్చిందేమంటే, మూడేళ్ళ క్రితం అదే అమాయిని హైద్రాబాద్ కృష్ణానగర్లో చూశాను. బాగా లావయింది కానీ మొహం మారలేదు. అప్పటికీ ఇప్పటికీ మధ్య 20 సంవత్సరాలు గడిచాయి.

“సార్ మీరు ఫలానా కదూ!” అని సంభ్రమంగా అడిగింది. అవును అన్నాను “మీ లిటిల్ చాంప్స్ ప్రొగ్రామ్ తప్పనిసరిగా చూసేదాన్ని సార్… మీ పాటలంటే చాలా ఇష్టం..” చెప్పుకుపోయింది. దాన్ని బట్టి నాకు అర్ధమైంది ఏమంటే, ఆనాడు నన్ను సరిగ్గా యీమే చూసి వుండదని.

“మీరేం చేస్తున్నారూ? మీదే వూరు?” అని అడిగాను. మద్రాసులో జరిగిన విషయం ఆమెకి గుర్తు చేయ్యడం నాకు ఇష్టంలేదు బాధ కలిగించే గతాన్ని తవ్వకుండా ఉండటమే మంచిది.

“మేమాండీ? మాది రాజమండ్రి దగ్గరి వూరండీ.. నాకేమో సినీనటి కావాలని వుండేదండి. నా కల కలగానే వుండి పోయిందండి. ఇప్పుడు మా పాపని ‘స్టార్’ని చేసి నా కల నిజం చేసుకునే వుద్దేశంతో హైద్రాబాద్ వచ్చానండి. సార్.. మా అమ్మాయి బ్రహ్మాండంగా డాన్సు చేస్తాదండి. పాటలు కూడా బ్రహ్మాండంగా పాడతాదండి. దయచేసి మీరెవరికన్నా రికమెండ్ చేస్తే… ” అంటుండంగానే ఆవిడ కూతురొచ్చింది. పదిహేడో పద్దేనిమిదో వుండొచ్చు. అచ్చు అప్పటి ‘ఆమె’ లానే వుంది. అమాయకంగా.. అందంగా…..

 

***

మనం కన్నకలలు కలల్లానే మిగిలిపొవచ్చు. కానీ ఆ కలల్ని మన పిల్లల ద్వారా తీర్చుకొవాలనుకోవడం న్యాయమా? పోనీ ఆ ప్రయత్నం చేసే ముందు పిల్లల ఇష్టాలు ఏమిటో కనీసం తెలుసుకోవద్దా?

ఆవిడ జీవితం ఏమయిందో, ప్రస్తుత పరిస్థితి ఏమిటి తరవాత ఏమవుతుందో నాకు తెలీదు.

కానీ పాము నోట్లోనించి బయట పడ్డ మనిషి, తన బిడ్డని, తన కలని సాకారం చేసుకోవడానికి ‘పనిముట్టు’గా వుపయోగించుకోవడం ఎంతవరకూ న్యాయం?

 

నమస్సులతో

భువనచంద్ర

 

 

 

Download PDF

11 Comments

  • kv ramana says:

    బాగుంది భువనచంద్ర గారూ…అభినందనలు. ఆ అమ్మాయిని రక్షించిన డాక్టర్ గారికి, మిగిలినవారికి కూడా. మంచి inspiring ఆర్టికల్.

    • BHUVANACHANDRA says:

      kv రమణ గారూ ధన్యవాదాలండీ ….నమస్సులతో భువనచంద్ర

  • డాక్టర్ గారికి మరో పేరుండేది.
    “ఆదివారం ..డాక్టర్” అని. మొదట్లో ఆదివారం సాయంత్రాలు మాత్రేమే చేస్తు వుండేవారు ఆయన.
    A gentleman to the core.
    హమీదియా స్థంబాలకి కాళ్ళు జాపీ పాటలు పాడేవాడు అర్థరాత్రిపూట. అప్పట్ళొ తెల్లవారు ఝాముదాకా తెరిచి ఉండేది.
    ఇక వెస్ట్ మాంబళం, రంగరాజపురం కథలు గురించి చెప్పఖ్లర్లేదు.
    *
    డబ్బూ, శీలం, మానం, మర్యాదా, గౌరవం, అవమానాలు, మనిషిలోని బలహీనతలు, నిజాయితీలు.
    ఆదర్శనీయులు, అనామక మహామహులు, ప్రేమలు, పెళ్ళీల్లు, లేచిపోవడాలు…
    ఎన్ని కథలో..ఇలాంటివి!
    *
    ఒకటా రెండా..మూడు దశాబ్దాలు..Asia’s largest market..the most heavist footfalls ఉన్న రోడ్డు మీద అనుభవాలు.
    మందు చేదుగా ఉన్నా ఆరోగ్యం కోసమేగా వేసుకునేది.
    థాంక్యూ భయ్యా గుర్తు చేసినందుకు.

    • BHUVANACHANDRA says:

      అనిల్ భయ్యా …ఒక గొప్ప చరిత్రకీ …ఒక గొప్ప తరానికీ మనం సాక్షులం …..మన అదృష్టం …అంతే ……………………………………………………………………………………………………………………………………………………………………………………………మన కళ్ళతో మనం చూశాం…………నేను ”’రికార్డు”చేస్తున్నవి నాటి నిజాలనే ………మీ కామెంట్ చదివాక మనసు పాండీ బజార్ కీ హమీదియా కీ వెళ్ళిపోయింది …….ప్రేమతో …..భువనచంద్ర

  • రమణ గారు,
    ఇది ఆర్తికల్ కాదండి.
    జీవితం.
    బహుశ భయ్యా కొన్ని పేర్లు మారిస్తే మార్చి ఉండచ్చు గాక..కాని ఇక్కడ అక్షరీకించింది జీవితంలోని ఒక శకలం.

  • మీ జ్ఞాపకాలు అందులో నడయాడిన మానవీయ విలువలు అన్నీ చాలా నచ్చాయి. నిజమైన కథలో చావుతప్పి కన్ను లొట్టపోయి నట్లు భయంకర అనుభవం ఎదుర్కొన్న ఆమెకి అసలైన సృహ కల్గనందుకు జాలిగా ఉంది. పాపం ఇలాంటి వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలెంత దురదృష్టవంతులో ! మీరు హెచ్చరించాల్సింది సర్! అనుభవాలు జ్ఞాపకాలు చాలా బావున్నాయి. ధన్యవాదములు

  • Mythili Abbaraju says:

    అసలైన కొసమెరుపు కథ…ఏ ఉపశమనమూ శాశ్వతం కాకుండా మనమే చేసుకుంటున్నామేమో- ధన్యవాదాలు సర్

  • కథ లాంటి నిజం.. అంతా ఉద్వేగంగా సాగింది. మీ పానగల్ పార్క్ బృందం కొందరి నైనా రక్షించ గలగడం ముదావహం భువన్ జీ!
    అన్ని కష్టాలూ పడి.. ఆ సంగతి మరచి పోయి.. కూతుర్ని అటువంటి స్థితికి తీసుకెళ్ళాలనుకోవడం ఆ మాయా ప్రపంచంలో వింటూనే ఉంటాం.
    అన్ టోల్డ్ స్టోరీస్ మనసుని కలచి వేస్తున్నాయి. మానవుడికి విజ్ఞానం పెరిగినా జంతు ప్రవృత్తి పోలేదనడానికి ఈ కథలే నిదర్శనం. కాదు కాదు.. జంతువులతో పోలుస్తే అవి నొచ్చుకుంటాయి పాపం! ఎందుకు లెండి.

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు …..B . M జీ …వీటిని రాసే టప్పుడు నా మనసు కూడా వికల మౌతోంది ..అయినా , కొంతమందికైనా ఇవి చేరితే బాగుంటుందని నాకు అనిపించి రాస్తున్నాను . ఇక్కడ నీరూ వుంది …బురదా వుంది ….పద్మాలూ వున్నాయి …..భయంకరమైన ””ఊబీ”” వుంది …..ఆ ఊబి లో చిక్కితే బయట పడటం దాదాపు అసంభవం . ఈ కధలు హెచ్చరికల్లాంటివి …..అంతే !

      • nmraobandi says:

        ” కొంతమందికైనా ఇవి చేరితే బాగుంటుందని నాకు అనిపించి రాస్తున్నాను ” …

        బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలా దారి తప్పుతున్న వారంతా ఇంచుమించుగా యుక్త వయసులో ఉన్నవాళ్ళే. ఆ వయసులో వాళ్లకు భ్రమలు తప్ప ప్రపంచపు దుర్మార్గ పోకడలు, పర్యవసానాలు బోధపడటం లేదు. మీరు ” taken ” సినిమా చూసే వుంటారు. ఆ సినిమా చూశాక మనసంతా వికలమై పోయింది. సినిమాలో గనుక పిల్ల తండ్రి నమ్మశక్యం కాని అద్భుత కార్యాలు చేసి కూతురును రక్షించుకోగలిగాడు. లోకం యెంత భయంకరంగా ఉందో, నిజ జీవితంలో వార్తల్లో వస్తున్న, చూస్తున్న సామాజిక పోకడలను గమనిస్తుంటే దేవుడా ఏమిటీ ఈ పరిస్థితి అని కలత పడాల్సి వస్తోంది.

        ఈ ఉదాహరణలో ఒక బాధిత తల్లి, గతం నుంచి నేర్చుకోకుండా తన బిడ్డను కూడా ఆశల అందలమెక్కిస్తూ
        ఊబి వైపు నడిపించబూనడం క్షమార్హం కాని నేరం. ఆమెకు చెప్పగలిగిందెవరు?

  • BHUVANACHANDRA says:

    nmraobandi నిజమే రావు గారూ ,,చిప్పినా వినరు …ఒక కుర్రాడు ఇంటర్ చదువుతూ పాటలు రాస్తాననీ గీతరచన చెయ్యడం తన జీవిత లక్ష్య మణీ చెప్పాడు …వారం రోజుల పాటు అతనికి నచ్చ చెప్పి ముందు డిగ్రీ పూర్తి చెయ్యమని పంపించా …..చిత్రం ఏమంటే చెన్ని నించి నేను పంపినా ఆటను హైదరాబాద్ వెళ్లి ఏ అవకాశమూ దొరక్క అక్కడే ఒక చిన్న హోటల్ లో సర్వర్ గా ఉన్నాడని తెలిసింది …….ఏమి చేస్తాం ? కష్ట నష్టాలు చెప్పడం వరకే మనం చెయ్యగలిగింది ….మరోసారి ధన్యవాదాలతో …………………………..భువన్

Leave a Reply to BHUVANACHANDRA Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)