ముడి

MythiliScaled

చాలా కాలం కిందట ఫ్రాన్స్ , బెల్జియం సరిహద్దులో ఒక పట్టణం . అది బర్చర్డ్ అనే జమీందారు అధీనం లో ఉండేది. అతను చాలా క్రూరుడు, ప్రజలు చాటుగా అతన్ని ‘ తోడేలు జమీందారు ‘ అనేవారు. అతని భార్య మాత్రం చాలా మంచిది. భర్త వల్ల కలిగే కష్టాలనీ నష్టాలనీ తగ్గించేందుకు రహస్యంగా తన ప్రయత్నం తను చేస్తూ ఉండేది. అతనూ భార్య అంటే ఏ కాస్తో గౌరవం ఉన్నట్లుగా చూసీ చూడనట్లు ఊరుకునేవాడు – జనాన్ని హింసించటం మాత్రం కట్టిపెట్టేవాడు కాదు.

dyck-self-portrait

ఒక రోజు వేటకి వెళ్ళి వస్తుండగా అడవి అంచున ఒక చిన్న ఇంటి ముంగిట్లో చక్కని అమ్మాయి నార వడుకుతూ కనిపించింది.

” నీ పేరేమిటి ? ” అడిగాడు

” రెనెల్డ్, అయ్యా ! ”

” ఇక్కడ ఏ సందడీ లేదులా ఉందే- అస్తమానమూ ఇక్కడే ఉంటే విసుగు పుట్టదూ నీకు ?”

” లేదయ్యా , అలవాటైపోయింది ”

” అలా కాదులే. నాతోబాటు కోటకి రాకూడదూ ? అమ్మగారికి చెలికత్తెగా ఉండిపోవచ్చు ”

” కుదరదదయ్యా. మా అమ్మమ్మ పెద్దదైపోయింది.ఆమెని నేనే చూసుకోవాలి ”

” ఆ వంకలేం చెప్పకు. సాయంత్రానికల్లా అక్కడికి వచ్చేయి ”

కాని రెనెల్డ్ వెళ్ళలేదు. ఆమెకి గిల్బర్ట్ అనే కట్టెలుకొట్టే యువకుడితో పెళ్ళి కుదిరిఉంది కూడా.

మూడురోజులయాక జమీందారు మళ్ళీ ఆ వైపు వచ్చాడు.

” ఏం అమ్మాయ్ , రాలేదేం ? ”

” చెప్పాను కదయ్యా, వీలుకాదని ”

ఇలా రెండు మూడు సార్లు ఆమెని కోటకి చెలికత్తెగా రమ్మని అడిగి, ఆమె రాకపోయేసరికి ఒకరోజు ” నువ్వు వస్తే అమ్మగారిని వదిలేసి నిన్నే పెళ్ళాడతాను ” అనేశాడు జమీందారు.

రెనెల్డ్ కి అతని దుర్బుద్ధికి అసహ్యం వేసింది. రెండేళ్ళ కిందట ఆమె తల్లి పోయినప్పుడు జమీందారిణి వాళ్ళని ఎంతగానో ఆదుకుంది. ఆవిడకి హాని చేసేపనిని రెనెల్డ్ కలలో కూడా తలపెట్టలేదు.

John Faed The Spinningwheel

అలా కొన్ని వారాలు గడిచాయి. అతని పీడ వదిలిందని రెనెల్డ్ అనుకుంది. కాని ఆ రోజు చేతిలో తుపాకీ పట్టుకుని అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి రెనెల్డ్ నార బదులు నూలు వడుకుతోంది.

” ఏమిటి చేస్తున్నావు ? ”

” నా పెళ్ళి గౌన్ కోసం అయ్యా ”

” నీకు పెళ్ళా ఏమిటి, అయితే ? ”

” అవునయ్యా. మీరు అనుమతి ఇస్తే ”

ఆ రోజులలో ప్రజల్లో ఎవరు పెళ్ళి చేసుకోవాలన్నా జమీందారు ఒప్పుకోవలసి ఉండేది. సామాన్యంగా ఒప్పుకోకపోవటమేమీ ఉండేది కాదు.

అయితే ఈ దుర్మార్గుడు ఇలా అన్నాడు ” ఆ. ఒప్పుకుంటాలే. అదిగో, ఆ దురదగొండి పొదలు లేవూ ? వాటిపీచులోంచి బట్ట నేసి ఉంచు. నీ పెళ్ళి గౌన్ కీ, నేను చచ్చిపోయినప్పుడు కప్పే గుడ్డకీ- రెంటికీ సరిపోవాలి అది . ఎందుకంటే నన్ను పాతిపెట్టే రోజునే నీకు పెళ్ళి ! ” చెప్పేసి వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు జమీందారు.

రెనెల్డ్ వణికిపోయింది. దురదగొండి పీచునుంచి దారం తీయటం కనీ వినీ ఎరగని సంగతి. ఇక బట్టని నేయటమా ? అసలు చేతులకి తగిలితేనే దురదా మంటా పెడతాయి కదా.

పైగా జమీందారుకి నడివయసు దాటలేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. అతను పోయాక తన పెళ్ళి ఏమిటి- ఆమె ఇంక ఆలోచించలేక పోయింది.

ప్రతిసాయంత్రమూ గిల్బర్ట్ వాళ్ళింటికి వస్తుండేవాడు. ఆరోజు అతనికి జరిగినదంతా రెనెల్డ్ చెప్పింది. అతనికి చాలా కోపం వచ్చింది – ” ఈ గొడ్డలి తో వాడి బుర్ర బద్దలు కొడితే శని  వదిలిపోతుంది ” అన్నాడు.

రెనెల్డ్ వద్దంది. శుభమా అని పెళ్ళి చేసుకోబోయేముందు- ఎవర్నైనా సరే, చంపటం మంచిది కాదంది. జమీందారిణి తమ పట్ల చాలా దయగా ఉండటాన్ని గుర్తు చేసి ఆమె భర్తని చంపటం ధర్మం కాదని చెప్పింది.

ప్రయత్నించి చూద్దామనుకుని మర్నాడు ఆ పొదల నుంచి పీచుని లాగి వడికింది. ఆశ్చర్యకరంగా ఏ దురదా పెట్టకపోగా మెత్తగా తేలికగా బలంగా ఉన్న దారం తీయటం వీలయింది. త్వరలోనే తన పెళ్ళి గౌన్ కోసం బట్టని నేసి కుట్టేయగలిగింది. అయితే జమీందారు తన శవం మీద కప్పే బట్ట అన్నాడు కదా, దాన్ని మాత్రం నేయటం మొదలుపెట్టలేదు. అందుకు ఆమెకి మనసు రాలేదు. ఎలాగో తన గౌన్ ని తయారుచేయగలిగింది కనుక జమీందారు ఆ రెండో బట్ట సంగతి ఎత్తడులే అని ఆశ పడింది.

జమీందారు వచ్చాడు. తెల్లగా మృదువుగా ఉన్న పెళ్ళి గౌన్ ని చూపించింది.

అతనువెలవెలబోయాడు . ” సరేలే. రెండోది కూడా కానీ మరి ” కరుగ్గా అని వెళ్ళిపోయాడు. ఆమె నేయటం మొదలు పెట్టింది. జమీందారు కోటకి వెళ్ళేలోపే అతనికి నలతగా అనిపించింది. కాసేపటికి జ్వరం తగిలింది. అన్నం తినలేకపోయాడు, నిద్రపట్టలేదు. మరుసటిరోజు పక్కమీదినుంచి లేవలేకపోయాడు. ఆ జబ్బు తగ్గేటట్లుగా అనిపించలేదు. ఇదంతా రెనెల్డ్ నేస్తున్న బట్ట వల్లనేనని అతనికి అర్థమైంది. దాన్ని వాడాలంటే చనిపోవాలి కదా.

వెంటనే ఆ నేయటాన్ని మానేయమని ఆమెకి కబురు చేశాడు. రెనెల్డ్ మానేసింది, ఆ పని ఆమెకే ఇష్టం లేదు.

ఆ సాయంత్రం గిల్బర్ట్ వచ్చాడు. ” జమీందారు మన పెళ్ళికి అనుమతి ఇచ్చాడా మరి ? ” అడిగాడు. ” లేదు ” రెనెల్డ్ చెప్పింది. ” అయితే నేయటం మానేయకు. ఇంక వేరే ఎలాగూ అతను ఒప్పుకునేటట్లు లేడు ” గిల్బర్ట్ అన్నాడు.

సరే, ఆ తర్వాతి రోజు మళ్ళీ ఆమె మగ్గం ముందు కూర్చుంది. రెండు గంటలు గడిచేలోపు జమీందారు సైనికులు వచ్చి ఆమె చేతులూ కాళ్ళూ కట్టేసి నది లోకి విసిరేసి ఆమె మునిగిపోవటం చూసి వెళ్ళిపోయారు. వర్షాలు పడి నది పొంగిపొర్లుతూ ఉంది. రెనెల్డ్ కి ఈత రాదు. కాని ఆమె నీళ్ళ మీద తేలింది, ఒడ్డుకీ చేరింది.

ఆ వెంటనె ఆమె ఇంటికి వెళ్ళి నేయటం మొదలుపెట్టింది. ఈసారి సైనికులు ఆమె మెడకొక బండరాయికట్టి మరీ నదిలోకి విసిరారు. వాళ్ళు అటు తిరగగానే ఆ రాయి ఊడిపోయింది, మళ్ళీ ఆమె తప్పించుకుంది. నేస్తూనే ఉంది. జమీందారు జబ్బు ఎక్కువైంది. తుపాకీ తో కాల్చాడు, ఆమెకి గుండు తగల్లేదు. మగ్గాన్ని విరగగొట్టారు, దానంతట అదే బాగయింది. చెరలో పెట్టారు, ఆమె ముందు మగ్గమూ దారమూ ప్రత్యక్షమయాయి. చేతులు కట్టేస్తే వెంటనే విడిపోతున్నాయి. ఆమెని చంపేసే ప్రతి ప్రయత్నమూ విఫలమైంది. ఇంక చేసేది లేక జమీందారు చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

wassilij-maximowitsch-maximow-kranker-mann-06299

 

భర్త పరిస్థితి చూసి జమీందారిణి దిగులుపడింది. జబ్బుకి కారణం తెలుసుకుని అతనికి మంచిమాటలు చెప్పింది. అప్పటికి కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవాలని అతనికి అనిపించలేదు. అంత అహంకారం. అప్పుడు అతనికి తెలియకుండా ఆమె రెనెల్డ్ దగ్గరికి వెళ్ళి ఇంక ఆ బట్టని నేయవద్దని వేడుకుంది. అంత పెద్దావిడ వచ్చి అడిగేసరికి రెనెల్డ్ కాదనలేకపోయింది, అలాగేనని మాట ఇచ్చింది.

ఆమె నేయకపోవటం గిల్బర్ట్ గమనించాడు – ” అయితే మన పెళ్ళికి అనుమతి వచ్చిందా ? ” అడిగాడు. ” లేదు ”

” మరి ? ”

” అమ్మగారికి మాట ఇచ్చాను, మానేస్తానని ”

‘’ అతను చచ్చిపోతే మనకేమిటి ? ”

” అయ్యో, అమ్మగారు ఏమనుకుంటారు ! కొన్ని రోజులు వేచి ఉందాం. అతని మనసు కరుగుతుందేమో ” రెనెల్డ్ అంది.

వాళ్ళు రోజులూ వారాలూ నెలలూ ఎదురు చూశారు. జమీందారు రెనెల్డ్ ని వేధించటం మానుకున్నాడు గానీ పెళ్ళికి అనుమతి ఇవ్వనేలేదు. రెనెల్డ్ మళ్ళీ నేయటం మొదలుపెట్టలేదు. గిల్బర్ట్ కి చిరాకు, కోపం వచ్చాయి. ” ఇంక చాలు ” అన్నాడు. ” ఇంకొద్ది రోజులు చూద్దాం ” అంది ఆమె. గిల్బర్ట్ కి విసుగు పుట్టింది, రావటం మానేశాడు. రెనెల్డ్ చాలా ఏడ్చింది, కాని మళ్ళీ ఆ బట్టని నేయలేదు.

ఒకరోజు జమీందారు ఆమెకి ఎదురు పడ్డాడు. ఇప్పుడతని ఆరోగ్యం బావుంది.

ఆమె చేతులు జోడించి అడిగింది- ” అయ్యా, దయ చూపండి ” అని. అతను తల తిప్పేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికీ ఆమె ఇచ్చినమాట నిలబెట్టుకోవాలనే అనుకుంది. గిల్బర్ట్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పనైనాలేదు. ఆమె కుమిలిపోయింది.

ఇంకొక ఏడాది గడిచింది. జమీందారు మళ్ళీ జబ్బు పడ్డాడు. జమీందారిణి రెనెల్డ్ ఇంటికి వెళ్ళి చూసింది, కాని ఆమె నేయటం లేదు. ఈసారి జబ్బుకి కారణం ఆమె కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ జబ్బు ఇక కుదిరేది కాదని వైద్యులు చెప్పేశారు. విపరీతమైన బాధగా ఉండేది. మృత్యువు వస్తే బావుండునని జమీందారు అనుకున్నాడు. కాని అతను చనిపోలేదు. ఎంతకాలం గడిచినా అతని స్థితిలో మార్పు రాలేదు. బతకనూ లేడు, చావనూ లేడు.

అప్పటికి తెలిసివచ్చింది అతనికి. తన మీద కప్పబోయే బట్టని రెనెల్డ్ నేసి ఇస్తేనేగాని తను చనిపోలేడు. ఇదీ ఆమె చేతిలోనే ఉంది. పిలిపించాడు. ఆమె వచ్చి మంచం పక్కన నిలుచుంది. మళ్ళీ నేత మొదలుపెట్టమని అజ్ఞాపించాడు. ఆమె జమీందారిణి వైపు చూసి తలదించుకుంది. జమీందారిణి భర్తతో అంది – ” అంతకన్న వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుని చూడకూడదా ? ” అతనికి మొదట నచ్చలేదు. చావనైనా చావాలిగానీ తన నోటితో తను ఆమె పెళ్ళికి ఒప్పుకోకూడదని అతని పట్టుదల. భార్య పదే పదే బ్రతిమాలింది. ఆమెని తను ఏనాడూ సంతోషంగా ఉంచలేదు కదా అని అతనికి స్ఫురించింది. చేతిసైగ తో సరేనన్నాడు . రోజు రోజుకీ అతని శరీరం తేలికవుతూ వచ్చింది. రాయిలాంటి మనసు మారింది. పశ్చాత్తాపం వచ్చింది. ఆమెని క్షమించమని అడిగాడు. రెనెల్డ్ గడిచినదేదీ మనసులో పెట్టుకోకుండా అతన్ని క్షమించింది. ఆ ఊర్లో వాళ్ళంతా రెనెల్డ్ కి చాలా మహిమ ఉందని అనుకున్నారు. రెనెల్డ్ మాత్రం ఆకాశం వైపు తిరిగి దణ్ణం పెట్టింది. దేవుడిచ్చిన అవకాశాన్ని అందుకుని జమీందారు ఉత్తముడుగా మారాడు.

గిల్బర్ట్ ఆమెని మరిచిపోలేదు. ఆమె మీద అతనికి ప్రేమ పోలేదు. జమీందారు   తమ పెళ్ళికి ఒప్పుకున్న సంగతి తెలియకుండానే , వారం గడిచేసరికి తిరిగి వచ్చాడు. మొదటినుంచీ , మొత్తం రెండేళ్ళు పూర్తయాక అప్పుడు వాళ్ళకి పెళ్ళి జరిగింది. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా బ్రతికారు .

Flemish_Wedding_17th_century

  • ఫ్లెమిష్ జానపద కథ
  • సేకరణ- Charles Deulin, Andrew Lang

 

 

Download PDF

2 Comments

  • Rekha jyothi says:

    మొండి వారిని జయించేది సహనమూ , క్షమా గుణమే అని ‘ రెనెల్డ్ ‘ పాత్ర ద్వారా చాలా బాగా చెప్పారు mam ! గిల్బర్ట్ కోపాన్ని , ఆవేశాన్ని కూడా . Thank u mam!

  • Mythili Abbaraju says:

    ఇదీ అసలు ముగింపు- ” ఆమె ఆ బట్టని నేయటం మొదలుపెడుతూనే అతని బాధ తగ్గటం మొదలైంది. పూర్తయేవేళకి సుఖంగా ప్రాణం వదిలాడు ”

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)