అసహజమవుతున్న సహజాతాలే ‘ఆర్తి’!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

“మనుషుల్లో ఉన్నన్ని రకాలు కధల్లోనూ ఉన్నాయి. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్టు కధల్లో గొప్ప కధలు వేరు …
… కానీ, ఎవరూ చూడకుండా జరిగిన పనికి అంతరాత్మ సాక్షి అన్నట్టుగా, ఏది గొప్ప కధ అన్నదానికి కధలు చదవడంలో సమర్ధులే సాక్షి. కధలు అందరూ రాయలేనట్టే అందరూ చదవలేరు. ఏ కధనైనా చదవలసిన విధంగా చదివేవారు బహు తక్కువ. అందులోని సారం ఆఖరి బొట్టు దాకా గ్రహించేవారు ఇంకా తక్కువ …”
ఈ మాటలు మా గురువుగారి కధల్ని ఉద్దేశించి వాళ్ళ గురువు గారు అన్నవి. ‘కాళీ పట్నం రామారావు కధలు’కు ఉపోద్ఘాతం రాస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ మాటలు చెపుతూనే – “… కధా పరిణామం గురించి నాకున్న పరిజ్ఞానం సరి అయినదయితే ‘యజ్ఞం’, ‘ఆర్తి’ లాంటి కధలు ప్రపంచ యుద్ధానికి పూర్వం వచ్చివుండడం సాధ్యం కాదు. ఈ కధలలో విశేషమేమంటే, అట్టడుగు జీవితాల్లోని అంతస్సంఘర్షణ కూడా, దాని భౌతిక కారణాలతో సహా స్పష్టంగా కనిపిస్తుంది. ‘యజ్ఞం’ శ్రీకాకుళం పోరాటాలకు ముందు నడిచిన కధ అనాలి. ‘ఆర్తి’ వాటికి యింకా కొంచెం ముందుదేమో, అందుచేతనే అందులో అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా ఉన్నది. అంతస్సంఘర్షణలు జరిగిపోయినాక విప్లవం తల ఎత్తాలి. ఈ రెండు కధలకూ ఈ నాటి విప్లవోద్యమాలతో రక్తసంబంధం ఉన్నది-’’ అంటారు (1971)
సాహిత్య లోకం యజ్ఞాన్ని పట్టించుకొన్నంతగా ‘ఆర్తి’ని (పట్టించుకోవలసినంతగా) పట్టించుకోలేదు. ‘ఆర్తి’ కధని పట్టించుకోవలసినంతగా పట్టించుకొని వుంటే – అర్ధం చేసుకోవలసినంతగా అర్ధం చేసుకొనివుండి ఉంటే – ఆ చర్చల సారాంశాల ప్రభావం ‘తెలుగు కధ’ మీద పడి మనిషికి సంబంధించిన మరిన్ని చీకటి కోణాలకు ఇంకెన్నో వెలుతురు దారులు చూపించి వుండేది.

కొ.కు. గారే అన్నట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ లోనే అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా వుంది. మరి ఆ అంతస్సంఘర్షణ మూలమేమిటో కధ ద్వారా కనిపెట్టగలిగితే యిప్పటికైనా ‘ఆర్తి’ తీరుతుంది. అయితే కొ.కు. గారు ప్రస్తావించినట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ రచనాపరంగా ముందుది కాదు. యజ్ఞం 1964లో రాసింది. 1966లో అచ్చులోకి వచ్చింది. ఆర్తి 1969 అచ్చులోకి వచ్చింది. ఆర్తి ముందుదేమో అనడంలో ‘యజ్ఞం’ జరగడానికి ముందు ‘ఆర్తి’ అలముకున్న విస్తరిస్తున్న వొక దశ అని. కధా సందర్భాల రీత్యా ‘ఆర్తి’కి ఒక విధంగా కొనసాగింపే ‘యజ్ఞం’ అని కొ.కు. భావన అయి వుండొచ్చు. యజ్ఞమూ – ఆ కధ మీద జరిగిన చర్చోపచర్చలూ – అది మన ముందు పెట్టిన ప్రశ్నలూ – వ్యవస్థలో వచ్చిన మార్పులూ – దాని మూలాలూ – యివన్నీ చూపిన మీదట ‘ఆర్తి’ రాశారంటే – ఒకడుగు ముందుకేసి మనిషి మూలాల మనుగడ మీద అంటే సహజాతాల మీద కా.రా. దృష్టి పెట్టారని భావించవలసి వుంటుంది. అందుకు ఆర్తి కధ ఆసరానిస్తోంది.

శబ్దార్ధ రత్నాకరములో ఆర్తి అంటే పీడ, దుఃఖం, మనోవ్యధ, రోగము, వింటికొన అనే అర్ధాలు ఉన్నాయి. సామాన్యంగా ఒక కధా శీర్షికకున్న ఒక అర్ధానికి ఏ కధ అయినా ఒదుగుతుంది. కానీ అన్ని అర్ధాలకూ అన్ని విధాలా సరిగా సరిపోయేలా అర్ధం పడుతుంది ఆర్తి కధ.
కధా లక్షణాల్లో ముఖ్యమైన వాటిల్లో ‘క్లుప్తత’ వొకటి. క్లుప్తతని సాధించాలనుకొనే రచయితలు కారా కధల్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడం అవసరం. అవకాశం కూడా. క్లుప్తతకు గాఢత జోడించి పదం పదం తూసి అక్షరం అక్షరం రాసినట్టుంటుంది రామారావు గారి రచన. ఒక అక్షరం ఎక్కువ కాకుండా ఒక అక్షరం తక్కువ కాకుండా తూకం వేసినట్టుగా వుంటుంది. అక్షరం దగ్గర పొదుపరితనం పాటిస్తారాయన. ఎంత అవసరమో అంతే. అంతకు ఒక్క రవ్వ రాల్చరు. పాఠకుడి సమయం అంత విలువైనదిగా భావిస్తారు. గుర్తించి గౌరవిస్తారు. అంత పొదుపుగా రాసినా ఆర్తి కధ నిడివి చిన్నదేమి కా(లే)దు. అరవై పేజీలు (‘కాళీపట్నం రామారావు కధలు’ – తొలి ముద్రణ 1986 – పేజీ 467 నుండి 526 వరకు) వుంది.

ఊళ్ళోనే … కాదు కాదు – వాడలోనే బంగారి కొడుకు పైడయ్యకి తన కూతురు సన్నెమ్మనిచ్చింది ఎర్రెమ్మ. ఆవేటికి సంకురాత్రి ఆర్నెల్లు గదా, ఆర్నెల్ల కోపాలి కూతుర్ని తీసికెళ్తానంటుంది. వియ్యపురాలైన బంగారీ కాదనలేదు, పండగ రేపనగా వచ్చి తీసికెళ్ళు. పండగెళ్ళేక కాప్పోతే రెణ్ణెల్లుంచుకో నానడ్డనంటుంది. ఈ తగువు తాటాకుల మంటలా యెత్తురు కుంటుంది. నిట్ట పట్టిలా నిలిచీ కాలుతుంది. మొత్తానికి తగువు ముదిరి ముసిరి యెలాగ ముగిసిందన్నదే కధ. పైకి కనిపించే కధ. దిగితే గాని పాతర గుమ్మి లోతూ పల్లమూ తెలీదన్నట్టు కధలోకి దిగితే గాని అసలు లోతు అందదు. ఆ లోతులు పొరలు పొరలుగా అందటానికి కారా మాష్టారై బోధ చేసి కాదనడానికి లేదనటానికి వీలు లేని విధంగా పాత్రల్ని నప్పి మనల్ని ఒప్పిస్తారు. తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత. ఎంత తెండితే అంత. మనుగడని గడగడలాడించిన మూలాలేవో అవి ఊట బావిలా ఉబికొచ్చి మన ముఖాల్ని, మస్తిష్కాలని ఫెడీల్మని తాకుతాయి. ఎటొచ్చీ చేదుకొనే శక్తి చదువరికి వుండాలి –

‘వెనుకటి రాజ్జాలు కాదు, రాజ్జాలు మారిపోయాయన్నారు. ఈ సారి రావ రాజ్జం వస్తందన్నారు. కొందరు – కాదు! మాలల రాజ్యం వొస్తోందన్నారు. మాలలకి ఉద్యోగాలు; మాలలకి ఇళ్ళు; మాలలకే బంజర్లన్నీ; మీ వాడే ఒకడు శాస్ త్రాలు రాస్తున్నాడ్రా!- అన్నారు కావందులు. అనడం, ఇనడవే తప్ప – యే బంజరు కాడికెళ్తే, ఆ బంజరు కాడే కర్రల్తో నిలబడేవారు కాపు నాయాళ్ళు …’
ఇంక భూమ్మీద … బూమేది? బువ్వేది?
బతుక్కి తోవేది?
‘ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులల్లా, రెండే రెండు.
ఒకటి యిల్లు, రెండు వొళ్ళు.
మాల పేటలో యిల్లు అగ్రవర్ణులు కొనరు. అవర్ణులకు కొనే తాహతూ లేదు. అలానే ఒళ్ళు కొంచం కొంచెం అప్పుడప్పుడు అద్దెకివ్వడాన్ని శాస్త్రమూ శాసనాలూ అంగీకరిస్తాయి కాని దాన విక్రయ సర్వాధికారాలతో పూరా అమ్మడానికి అంగీకరించవు. కాబట్టి వాళ్ళలో చాలామంది కడుపేదలుగానే వుండి పోతున్నారు. లేకపోతే యేనాడో నిరుపేదలవ్వలసింది.’
ఊరుకాని ఊరు … కాలం కానీ కాలం … అవే స్థల కాలాలు! మరి పాత్రలకొస్తే- బంగారికి పెనిమిటి పోనూ వరుసగా నారాయుడూ కోటయ్యా పైడయ్యా ముగ్గురు కొడుకులు – అంటే బంగారింట నలుగురు మగ కూలీలు. ఇద్దరు ఆడకూలీలు –
మరి ఎర్రెమ్మ మొగుడా అవిటోడు. పెళ్ళి చేసి పంపిన సన్ని తోడ ఆరుగురు చెల్లెళ్ళు – అంటే సన్నితో కలుపుకున్నా ఎర్రెమ్మ యింట ఇద్దరే ఆడకూలీలు – అని అసలు లెక్క చెపుతారు లెక్కల మాష్టారు. బంగారి కోడల్ని ఎందుకు వదులుకోలేదో కూడా చెపుతారు. ఆవీటికి ముందు గొప్పులూ, వేరుశనగల వేతా … నెల్లాళ్ళు కూల్లుంటాయి. పండగ ముందు నెల్లాళ్ళు ముమ్మరంగా వరికోతలు. అందుకే పండగ ముందు తీసికెళ్తానంటుంది ఎర్రెమ్మ. పండగెళ్ళాక తీసికెళ్ళమంటుంది బంగారి.
అసలు కధ కంటికి కనిపించదు. అందుకే చూసినవాళ్ళు కూతురిని పుట్టింటికి ఎప్పుడు తీసికెల్తే ఏటని అనుకుంటారు. పంపడానికి ఒప్పుకొన్నాక ముందైతేనేం వెనకైతేనేం అని కూడా అంటారు. ఇలాటి తగువు గుద్దులేసుకుంటే మాత్రం తెగుతాదా? ఆ గుద్దులాట ఒక చోటగాని ఆగుతాదా? ఒళ్ళు కొవ్వెక్కి తెగబలిసి కన్ను మిన్నూ కానక కొట్టుకు చస్తున్నట్టు కనిపిస్తారు. ‘ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో … ఆ విస్తళ్ళలో భోజనం చేసినవారికి అర్ధం కాకపోవచ్చు. ఏడాదిపాటు పేగులు మాడితే యెవరికైనా అందులో నీతి కనబడుతుంది’ అని కధ చూపించే అలవాటున్న మాష్టారు ఇలా ఒక మాట అనకుండా వుండలేక పోతారు.

కాదా… వీరకత్తెలిద్దరూ జుట్లూ జుట్లూ పట్టుకొని, రక్కుకొని, కొరుక్కొని, రాళ్ళతో యుద్ధాలాడి .. దెబ్బలు కాసిన ఎర్రెమ్మ చుట్టూ దాని పిల్లలు మూగి మొర్రోమంటే సన్ని తల్లితో వెళ్లింది. ‘ఇదిగో, యిప్పుడు దానెంట యెల్లినావో, మరీ గడపల అడుగెట్టవ్’ తెగేసి అత్త చెప్పినా అమ్మ వెంట వెల్లింది సన్ని.
ఆ విధంగా పెనిమిటి పెళ్ళాలయిన సన్నెమ్మా పైడయ్యా ఒకరికొకరు పరాయోలయినారు.
ఎందుకూ?
ఆకలి!
ఔను గదా … కూలాడితేగాని కుండాడదు కదా?!

మనిషికున్న సహజాతాల్లో మొదటిది ఆకలి. మొదాట కధ అక్కడే మొదలయ్యింది. ఈ ఆకలే బతుకుని సుట్టబెట్టీసింది. ఎవరాకలి వాళ్ళదే. మాష్టారే చెప్పినట్టు ‘వర్షావసాన వాగులు పుట్టి వరదలై పొంగినట్టు, వ్యక్తులలో పుట్టిన భయం, వెల్లువలై పొంగింది. గడ్డి మొక్కలు ముందు మునిగితే, గాలివానకి వృక్షాలూ, ఆముదపు చెట్లూ ఆ తర్వాత విలవిల్లాడుతున్నాయి అని – నిజమే, మనుషులూ గడ్డిపోచలే. ఉక్కిరి బిక్కిరి కాక తప్పుతారా?

ఒకరికొకరు కావలసిన సన్నెమ్మ పైడయ్య ఒకరికొకరు పరయోళ్ళగా వుండీ, వుండలేక – పైడయ్య మగాడు గనుక దొంగచాటుగా కలిసే చొరవ తీసుకున్నా – ఎవరో చూస్తారన్న భయం ఒక్కటేనా –ముందెల్తే గొయ్యా యనక్కెల్తే నూయ్యా … యిద్దరిదీ అదే పరిస్థితి. మనసులో యిష్టమున్నా పౌరుషాలూ పరాధీనతలదే పై చేయిగా మిగులుతుంది. ఏమీ మిగలకపోయినా ఇద్దరూ కలుసుకున్న కబురు వాడలో తెలిసిపోతుంది.

అమ్మలా అన్నీ అర్ధం చేసుకున్న నరసమ్మ నీ మొగుడు చెప్పినట్టు నడిచి కాపురాన్ని నిలబెట్టుకోమంటుంది. సన్ని ఎద పొయ్యలేక ఏడుస్తుంది. ఆడు రేతిరికి ఎక్కడికి రమ్మన్నాడో చెపుతుంది. తొంగోడానికి చోటు లేదు. వున్న చోట వీలు కాదు. బరితెగించి వెళ్ళి ఒళ్ళెరపెట్టి మొగిడ్ని దారిలోకి తెచ్చుకోవడం చేత కాదు. అందు మార్గం వల్ల అత్త కాదు కదా దాన్ని పుట్టించిన జేజేమ్మని ఎదిరించడం చేత కాదు.
మరి మొగుడు ఎవుల్నయినా మరిగితే, కాపురంలో నీళ్ళు కాదు, నిప్పులు కురుస్తాయన్న భయం.

మనిషి కున్న సహజాతాల్లో భయం కన్నా ముందున్నది కామం. కామం కూడా ఆకలే. దప్పికే. ఆకలిని అర్ధం చేసుకున్నట్టు కామాన్ని ఎవరూ అర్ధం చేసుకోరు. ఆకలికి దేబిరించి నీరసించిన ప్రాణం … ఎన్ని లజ్జుగుజ్జులయినా పడి కొట్లాడి పోట్లాడి ఆకలి తీర్చుకుంటుంది. కామమయినా అంతే. దేబిరించో దౌర్జన్యం చేసో సిగ్గొదిలి .. సెరమొదిలి ఆరాటపడి దప్పిక తీర్చుకుంటుంది.
ఆర్నెల్లయి ఆడమనిషి కోసం ఉపాసం వున్నాడు కాబట్టే పైడయ్యకు పెళ్ళాం సన్నెమ్మ మీద మోజున్నా – రావయ్య కోడలు .. యేపుగా కాసిన కాయాలా, నిండా విడ్డ పువ్వులా వుండి ఆశనిపించింది. ఆశ తీరక ఆ దప్పికతోటే ఊరికీ వాడకీ దూరంగా ఎక్కడో వున్న గంగమ్మని ఎతుక్కుంటూ వెళ్ళాడు. నీ కాడ యేదుంటే అదే యిమ్మన్నాడు. అక్కడితో ఆగక “నానార్నెల్లయి, ఆడమనిషి కోసం ఉపాసవున్నాను. ఇయ్యాల ఇంటికొస్తే మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్న రాత్తిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికి నా బాధ అర్ధవైనట్టు నేదు. సెప్పకేం – కత్తెట్టి ఒక్కొక్కల్నో పోటు పొడిచేసి, ఆ యెంట నానూ సత్తునా అనుకున్నాను. కాని నాకాపాటి తెగువనేదు –’’ పైడయ్య తన అవస్థలను చెప్పాడు.

గంగమ్మ అర్ధం చేసుకుంది. ఒక దప్పికన్నా తీర్చాలన్న ఉద్దేశంతోనే “– ‘నీకు నాటు సారా పడతాదా?’ అంది తల్లిలా –“ అని మాష్టారు అక్కడ అమ్మని చేశారు గంగమ్మని.
పెళ్ళప్పుడో, సన్నీ కాపురానికి రాకముందో – ఇంకోసారి అడగానంటే, అలాగే కానిమ్మంది గంగమ్మ. మళ్ళీ ఇన్నాల్టికి వచ్చిన పైడయ్యను కాదంది. ‘నానిప్పుడు నీకొదెన్నవుతాను’ అని చెప్పింది. అంతకు ముందే గంగమ్మ చెప్పకముందే ఆమె భర్త మంచానుండి ‘నారాయుడూ’ అని పిలవడం సూక్ష్మ దృష్టి గల పాఠకుడు ముందే గ్రహిస్తాడు.
పైడయ్య మాటా మనోగతం మనిషి కప్పుకున్న మరిన్ని లోపలి పొరల్ని చీలుస్తుంది. సహజమైన సహజాతాల్ని బయట పెడుతుంది.
“మాయన్న అందరు పిల్లల మీద, పెళ్ళాడనంటే, మంచోడు – మంచి పనే చేసేడనుకున్నాను. అయితే ఆడు యెలాగా బరిస్తన్నాడా అని దిగులుగుండేది. ఇదిగిలాగన్న మాట: అని – నన్నడిగితే యిదీ మంచి పనేననాల. అత్తలాడూ సుకపడతన్నాడు. ఇత్తల నువ్వూ సుకపడతన్నావు. మనలాటి కస్టపాటు జాతికే వుంది, కడుపు సుకం లేనే లేదు. ఎయ్యి జనమలెత్తినా వస్తాదని నమ్మకవూ లేదు –

సుకాలన్నిట్లోకి సుకం ఆడ మగా ఒక్కాడ అనుబగించిందే – సుకం! ఇప్పుడిదీ (సారా) సుకవే. కానీ దీనికి కరుసున్నాది. ఇదయ్యాక రేపు కొంత దండుగున్నాది. ఆ సుకానికైతే కానీ కరుసునేదు – రేపు దండుగనేదు. పేదోడికి బగమంతుడు మిగిలించిన సుకవది.-“ అని పైడయ్య తన పరిస్థితికి వాపోతాడు.
పైడయ్యకు వేరే దారి లేదా? ఉంది. అది దారి కాదు. ‘ఇరుగమ్మకో పొరుగమ్మకో పాటుపడితే యిళ్ళిరగతీయాల: కన్నె పిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోర మనుసులున్నారు – ఆలా జోలీ కెళ్తే, ఆసుపత్రికి పోవడం సరే సరి – పన్లోకెళ్ళకండ పది రోజులుంటే కూల్డబ్బుల మాటేటి?’ పైడయ్యకు తోవ లేదు!
‘కడుపుకుండి, మనిషి దొంగతనం సెయ్యరాదు. కట్టుకున్న పెనివిటో, పెల్లవో వుండి కాని పని సెయ్యడం తప్పు. నీకింటి కాడ పెల్లం నేకపోతే సెప్పు. దానికొంట్లో సుకం నేదన్నా నానొప్పుకుంటాను. కానీ తీరి కూకొని కాపరాలు సెడగొట్టకు. అందరు మొగోళ్ళు ఒకటైనట్టే అందరాడోళ్ళం ఒకటే’ అంది రావయ్యకోడలు, పైడయ్య స్నేహితుడు కన్నయ్య తోటి.

వదిన్నవుతానన్న గంగమ్మ – అలా అన్నందుకు ఒగ్గేసిన పైడయ్యలను జాతి తక్కువగా లోకం చూసినా నీతికి తక్కువ కాదు. ఏ తోవా లేక దొంగతోవకొచ్చినా ఎవలతోవ ఆలకి వుండాలి గదా?!
అలాగ లేనపుడు దొంగ తోవయినా వొక తోవుండాలి. నారాయుడూ గంగమ్మ ఆ తోవనే నడుస్తున్నారు. గంగమ్మ మొగుడు అది దొంగ తోవనుకోడు. ఏ తోవా లేనపుడు ఏదో ఒక తోవుండాలని తెలుసుకొని అర్ధం చేసుకున్నాడు గనుకనే ‘నారాయుడూ’ అని కదలిక పసిగట్టి పిలవగలిగేడు.
మానవ సహజాతాల్లోని ఆకలి, కామం గురించే కాదు .. నిద్ర, భయం గురించి కూడా ‘ఆర్తి’ కధ మనకు ఎరుకలోకి తెస్తుంది.
ఆకలి రుచెరగదు. నిద్ర సుఖమెరగదు. నిజమే, కాని శాశ్వత నిద్రకే కాదు, ఒక రాత్రి తెల్లవారాలన్నా ఆరడుగుల నేల కావాలి. ఒక సారికి కాదు, రెప్పలు పడిన ప్రతిసారీ కావాలి. ఒళ్ళు వాల్చడానికి ఆసరా కావాలి. వెన్ను ఆన్చడానికి నేల ఆదరువు కావాలి. మరి ఎర్రెమ్మ యిల్లయితే నరసమ్మ అన్నట్టు పందుల గుడిసే.
‘…తొడుక్కోడానికి చింకి గుడ్డలేనా లేని పిల్లలు – ఈలీకలూ వాలికాలైన కోక ముక్కలు కప్పుకొని, యెముకలు కోరికే చలిలో ఆరు బయట పడుకోలేరు. ఒకళ్ళ మీదోకళ్ళు పడి పెద్దప్ప చుట్టూనో, తల్లి చుట్టో, ఆ గదిలోనే పడుకోవాలి. అంచేత పగలల్లా అత్తవారింట గడిపినా రాత్రికి తాను ఇంటికి తీసుకుపోతాడు పైడయ్య సన్నిని …’ అని పరిస్థితిని వివరిస్తారు మాష్టారు.

రాత్రి నిద్ర పోతూనే, మళ్ళీ తెల్లవారి లేస్తూనే సన్ని కన్నోరింటికి పెనిమిటితో రావడంలో నిద్ర సుఖమేమో గాని, మెలకువ కష్టం మాత్రం మామూలుది కాదు.
పోనీ నరసమ్మ యింట్లో తొంగుంటారంటే – ఏదో మాట కాడ మాటొచ్చి ఏదో అన్నదని సన్ని ఆల అత్తకి గుర్రు.
పైడయ్య పట్నంలో కలాసీ, పడుకోడానికి ‘గది లేదు, కూరల మార్కెట్ లోనే ఓ అరుగు మీద పడుకుంటాడు. చూరునున్న గోనె గుడ్డలూ, చాప ముక్కలూ పీకి వాటినోసారి గట్టిగా దులిపి పక్కలు పరిస్తే – పెద్దమ్మ పేరు చెప్పి చుట్టంగా వచ్చిన రావయ్య.. ముసలాడు నిద్ర పోలేదు. అక్కడ ఊరంతా అంత ఎలుగేటి? – యిక్కడీ సీకటేటి ?- అంటాడు. ఈ అరుగులు యింత గలీజుగా వున్నాయి, ఎప్పుడూ కడగరా – అంటాడు. దోవల్నీ, చీవల్నీ, నల్లుల్ని నలుపుకొంటూ – యిటూ అటూ పరిగెత్తే ఎలుకలూ, పందికొక్కులు యెక్కడ కరుస్తాయో అని భయపడుతూ, యెంతో రాత్రి దాకా నిద్ర పోలేదు.’ ఇవన్నీ చుట్టపు చూపుగా వచ్చిన రావయ్య గుర్తించాడు. పైడయ్య ఏనాడూ గుర్తించలేదు. కాబట్టే బతికేశాడు. అడక్కుండానే రావయ్య ‘నన్నడిగితే, తిండినేక ఏ గడ్డో కరిసి చావడం మెరుగు; పేనాలు ఒకపాలి పోతాయి.’ – అని చెప్పిందాకా పైడయ్య తనేలాంటి చోట వున్నాడో గమనించలేదు. ఆ ఊరి జనంలో అయిదో వంతు అలాగే బతుకుతున్నారని కధకుడు చెప్పి ‘పదిరాళ్ళు జేబులో వున్నప్పుడు పరవాలేదనిపించినా, డబ్బులు తక్కువైనపుడల్లా పైడయ్యకు ఆ మాటలు గుర్తొచ్చేవి.’ అని చెపుతారు. నిత్య రణగొణ ధ్వనుల నడుమ ప్రశాంత మహా నిద్ర అసహజమై పోయిన వొక సహజాతం!

మరో సహజాతం భయం! యిది అంతటా ఆవరించి వుంది. లేని దాని కోసం భయం. ఉన్నది కోల్పోతామేమోనని భయం. బతుకెలా గడుస్తుందో భయం. ఇవాల్టి గురించి భయం. రేపటి గురించి భయం. భయం … భయం .. ప్రతి క్షణం భయం!
కూతురు కాపురం ఏమయిపోతుందోనన్న భయంతో ఎర్రెమ్మ వియ్యపు రాలైన బంగారి యింటి మీద కొచ్చింది. తనకి వెన్నూ దన్నూ లేకపోయినా తెగించింది. తిట్లూ తన్నులూ తిన్న అనుభవం వుండనే వుంది. అల్లుడు సారా బడ్డీ దగ్గర తాగకుండా గంగమ్మ .. లంజ దగ్గరకేల ఎల్లినాడని – భయంతో లేని సంబంధాన్ని ఊహించి ఊరంతా వాడంతా గోల గోల చేసింది. పైడయ్య భయంతో పట్నం బయల్దేరేశాడు. అన్న భయంతో ఆగిపోయాడు.

ఈ తగవు ఎక్కడ తేలుతుందోనన్న భయంతోనే పైడయ్య చిన్నన్న కోటయ్య ఎర్రెమ్మని గత్తురు గత్తిరింది కాక గుఫీ దబీ దుబీమని మూడు గుద్దులు గుద్దేడు. కింద పడ్డ మనిషిని ఎడాపెడా నాలుగు తాపులు తన్నేడు. వెళ్ళవసిన దారి చూపించాడు. వెళ్ళి ఆగి తిట్టి పోసి నోటితో భయపెడదామనుకుంది ఎర్రి. ఎగిరెగిరి పడింది. తిట్టి పోసిందే గాని కోటయ్య సన్నిని తుండగుడ్డ నడుంకేసి లాక్కుపోయాడు.
ఎవరూ ఆపలేక పోయారు భయంతోనే. కోటయ్య ముందు కాకుండా వెనుకన పదిమందీ పది రకాల మాటలన్నారు. అదీ భయంతోనే.
ఊరికి తీర్పులు చెప్పే నాయ్డు పెద్దమనిషి, పెద్దరికం పోకుండా ‘పిలా తొత్తి కొడుకుని, రాకపోతే జుట్టట్టుకు ఈడ్చుకురా’ బారిక పాపయ్యకి ఆజ్ఞ నిచ్చాడు. ‘సిత్తం’ అని బారిక పాపయ్య అన్నాడేగాని కదల్లేదు. నాయ్డుకి అనుమానం వేసి ‘ఏం ఆడు తాగుతాడేట్రా?’ ఈసడించినా భయంతోనే. ‘ఉడుకు తగ్గేక, ఇంకో గంటకి ఆలె తవ పాదాల కాడ కొస్తారు గదా?’ ఉచిత సలహా యివ్వడంలోనూ, తిట్టుకుంటూ నాయ్డు ఆమోదించడంలోనూ భయం ఉంది!

తేలని తగువుని తన బలంతో భయం చూపెట్టి క్షణంలో పరిష్కరించేశాడు కోటయ్య.
ఆ భయం తీరకే ఊరి నాయ్డుని ఆశ్రయించింది ఎర్రెమ్మ. ఆమె వెంట పది పదిహేను మందిని వెంట తీసుకెల్లింది తనకు న్యాయం జరగదేమోనన్న భయంతోనే. బారిక పాపయ్య సలహాననుసరించి కోటయ్యను వాడి అత్తోరి ఊరికి పంపేసినా, పైడయ్యని యింట్లోనే వుంచి పెద్దోడు నారాయుడు నాయ్డు దగ్గరికి బయల్దేరినా ఆ భయంతోనే. నాయ్డు తిట్టినా, ‘చేతిలో కర్ర లేకపోయిందిగాని వుంటే తొత్తికొడుకును ఏకీలుకా కీలిరిసేసి ఆసుపత్రిలో పారేద్దును’ అని అన్నదీ భయంతోనే. నారాయుడు తప్పును అంగీకరించిందీ ఆ భయంతోనే . ఎర్రెమ్మ యెంత రేపెట్టినా, యింటిమీద కొచ్చినా దానింటి మీద పడకూడదని తనతో చెప్పాలని – దురితం కూడదని – దౌర్జన్యం పనికి రాదని – తగువులొస్తే తమలో తాము తన్నుకోడం కాదు, పెద్దల ముందు పెట్టి పరిష్కారం చేయించుకోవాలనడంలో – భయం వలన మాత్రమే అదుపులో వుంటారని నాయ్డుకి తెలుసు. భయపెట్టింనంత కాలమే నాయ్డు అధికారం, పెద్దరికం వుంటుందని మనకి తెలుసు. నాయ్డు మంచి చేసినా చెడు చేసినా.
ముందయితే సన్నెమ్మని దానమ్మ ఎర్రెమ్మకి అప్పగించు అని నాయ్డు తొలి తీర్పు యివ్వడంతో కధ మొదటికొచ్చింది. సమస్య ఉన్న కాడికే వచ్చింది. అయినా ఎర్రెమ్మ పక్షాన వున్న నరసమ్మకూ భయం పోలేదు కాబట్టే ‘బాబో అసలు మనిసినోగ్గేసినావ్..’ అని గుర్తు చేసింది. ‘అన్నట్టు మీయమ్మను కూడా తీసుకురా’ నాయ్డు నారాయుడితో అనడంలో వెలిగిన మొహాల్లో భయం పోలేదు. తమకున్న భయమే ఆలకీ వుండాలన్నదే వాంఛ. నిజానికి అక్కుర్లు బుక్కుర్లేడ్చిఅలసిపోయిన సన్నెమ్మ మొహం కడిగి, కొత్త కోక కట్టుకోమని అత్త బంగారి నయాన బయానా చెప్పడంలో తల్లి ఎర్రెమ్మకు ఏ మాత్రం తీసిపోలేదు.
మొత్తానికి సన్నెమ్మ తిరిగి తల్లి దగ్గరికే చేరింది. యధాతధ స్థితే మిగిలింది.

నాయ్డు లేపోతే, నాయ్డు కాపోతే, కాలం మారిపోతే, పద్దతులు మారిపోతే కూడా నాయ్డు స్థానంలోకి పోలీసులొస్తారు. కేసులవుతాయి. లాయర్లొస్తారు. వాదనలవుతాయి. తీర్పులిస్తారు. ఒకరికి న్యాయం జరిగిందనిపిస్తుంది. మరొకరికి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. వ్యవస్థల తప్పొప్పుల ఫలితంగా వ్యక్తులు తప్పొప్పులు చేస్తారు. నేరస్తులవుతారు. శిక్షలనుభవిస్తారు.
అయితే కధలో అసిర్నాయుడు ఒకప్పుడు గాంధీ గారి శిష్యుడు కావడం వల్ల – యిప్పటి రాజకీయాలు కిట్టక పోవడం వల్ల – ‘బతుకు యీ వేళుండి రేప్పోయేది. ధర్మం కలకాలం నిలిచేది. దాన్ని తప్పితే లోకం తలకిందులు కాదా?’ అని నమ్మడం వల్ల – న్యాయాన్యాయాలు పక్కన పెట్టి మేలు చెయ్యడానికే పూనుకున్నాడని అర్ధమవుతుంది. అయితే కోటయ్య దోతరపుగా తిరగబడి చేసిన పరిష్కారమయినా, నాయ్డు నిదానంగా నిర్ణయాలు చేసిన పరిష్కారమయినా – రెండూ ఏక పక్షమే! రెండూ ఒకటే! రెండూ భయంతో అదుపులో పెట్టేవే!
కోటయ్యకు కులమే కాదు చదువూ లేదు. ఆలోచన లేదు. ఆపద ఎటునుంచి ఎటుపోయి వస్తుందో తెలీదు. రక్తం ఉడుకులెత్తితే ఉరుకులెత్తడం తప్పితే మంచేదో చెడేదో తెలీదు.

మంచీ చెడూ అన్నీ తెలిసిన నాయ్డుకి కులముంది. బలముంది. బలగముంది. ఆలోచన ఉంది. ఆపద ఎటు నుంచి ఎటు పోయి వస్తుందో తెలుసు. ఇహమూ పరమూ మీద నమ్మకమూ ఉంది. అందువల్ల తిండికి లేపోతే అడుక్కు తినండి అంటాడు. బిచ్చం దొరక్క పోతే, చావడమైనా మేలు అంటాడు. అంతే తప్ప ఉన్నవాడికెందుకుందో లేనివాడికి ఎందుకు లేదో – లేనివాడికి ఎప్పటికుంటుందో చెప్పడు. చెప్పలేడు. అందుకే దొంగతనమో దౌర్జన్యమో చేసి లేనిది సాధించుకుందామన్న వాళ్ళని ‘పట్టుదలగా అణుస్తాడు.’ యధాతధస్థితిని కొనసాగిస్తాడు.

‘ … మీ మాల పేట్లో రోజూ యేవారో ఓ వార, యెందుకో ఒకందుకు తిట్టుకుంటూనే వుంటారు గదా! ఎందుకోసవలా తన్నుకు చస్తారు? ఏం మీకు పంచుకుందికి ఆస్తులున్నాయని తన్నుకుంటారా? కలుపుకుందికి బూవులున్నాయని తన్నుకుంటారా? లేపొతే ఒక నీటి కాడ తగువా? ఒక దరికాడ తగువా? దేనికి మీ తగువులు?’ అని నాయ్డు అక్కడితో ఆగలేదు –
‘ఏదో భవంతుడు మీకింత రెక్కలిచ్చేడు. పదిమందీ పస్లోలలు ఒక్క నాడు తెచ్చినా, పది రోజులు గెంజి తాగి గడిపేసుకోగల్రు. అలాటప్పుడు నలుగురూ కలిసి మెలిసుంటే అదెంత హాయి, యిలా తెల్లారి లేస్తే తగవులు పడ్డం – యిదేం సుఖవు? మీకు మతులుండవా? లేకపోతే, అందులో ఏదో పురుగుండి అలా దొలుస్తుంటుందా?!’
ఏం చెప్తారా జనం ? యేం చెపితే నాయుడికి బోధపడుతుంది.!’ కధకుడు ప్రశ్నించడంలో దొరకబుచ్చుకోవలసిన జవాబు ఏదయితే వుందో – అది ఆర్తి కధ ద్వారా అందాల్సిందేదయితే వుందో – అదేనని మనకు అర్ధమవుతుంది.
స్థిరపరిచిన విలువలే చిరాయువుగా ఎందుకు నిలుస్తున్నాయో – కొత్త విలువలు ఎందుకు తలెత్తడం లేదో – తలొంచుకున్న జనం తలెత్తినపుడల్లా అవి నేరాలుగా ఘోరాలుగా ఎందుకు కనిపిస్తున్నాయో – జనం తమకి తామే శత్రువులుగా ఎందుకు నిలుస్తున్నారో – ఒకే కుటుంబమయిన వాళ్ళు వైరి పక్షాలుగా ఎందుకు మిగులుతున్నారో – నెయ్యాలు మాని కయ్యాలాడి కాట్ల కుక్కలెందుకవుతున్నారో ఏలుబడి చేసిన వాళ్ళకు ఏలిన వాళ్ళకి ఎరిక లేదనా?
అదెంత గాంధీ రాజ్యమయినా .. అది ‘రాజ్యమే’ కదా?!

సరే, మరి రెండో విడత పంచాయితీలో తగువుకి మూల కారణమేమిటో నాయ్డు అడిగినా ఎర్రెమ్మ గాని, తరుపున వచ్చిన వాళ్ళు గాని చెప్పలేకపోయారు. నారాయుడే రెండు పక్కల వున్నదేటో చెప్పాడు. అది కూడా చేతనైనంత నిష్పక్షపాతంగా వివరించాడు. నిజానికి నారాయుడు తన తల్లి తమ్ముళ్ళ కుటుంబం పక్క కదా మాట్లాడాలి. మరెందుకు మాట్లాడలేదలగ? భయం! కాదనేస్తారని భయం! తమ్ముడు కోటయ్య చేసిందానికి తప్పని ఒప్పుకోవడం వల్లే కాదు, ఎర్రెప్ప ఒంటరిదని దారీ తెన్నూ లేనిదని అవతల పక్షము వహించి మాట్లాడడంలో నిజమూ వుంది, తగవరితనంలో అంతకు మించిన బతుకు భయమూ వుంది.
అది సరే, చివరాఖరికి ‘ఎళ్ళి నీ అల్లుణ్ని బతిమాలి తీసుకుపో ‘ అని తీర్పిచ్చి నాయ్డు ‘.. ఉసూరు తగలడం జయం కాదు’ అని బంగారిని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

కధ ముగిసి పోయిందా? సమస్య తీరి పోయిందా? అప్పటికి తీరినట్టుగున్నా మళ్ళీ తలెత్తదా? బతుకు భయంతో ఆసరా కోసం ఆదరువు కోసం కూతురు సన్నెమ్మని ఎర్రెమ్మ ఎనక్కి లాగదా? నా బతుకూ నా కోడలూ నా హక్కూ అని బంగారి ముందుకు లాగదా? అటులాగ యిటులాగా – ఎక్కడున్నది అక్కడే వుండదా? చెప్పినట్టుగా నడిచిపోతే, నాయ్డు ఇంతకాలంగా యిస్తున్నతీర్పులకి మాల పేట నిసంకుడయి పోవాల కదా?! అవుద్దా? అవదు! కుక్కల్లా కాట్లాడుకుంటూనే వుంటారు … యిక ముందూ – మనముందూ-
ఎర్రెమ్మకు బుద్ధుంతే బువ్వ తింటాదని నాయ్డు లోపాయికారాన చెప్పినట్టుగే – రాజీ పడి, తగువులు మాని నిగ్రహించుకొని మంచి చేసుకొని మసలుకోగలదా? బంగారో మాటంటే వాగే నోరు మూగయిపోగలదా? ఎన్నాళ్ళు నోరు కుట్టుకుంటాది? అదువు బతుకు కాదా? ఒక్కడే బతకలేక సతమతమై పోయిన పైడయ్యతో కూతుర్నంపి పట్నంలో కాపరమెత్తించగలదా? కడుపు నింపగలదా? కాలం దాటగలదా? ఏమో –

అదొక ఆశ .. ముందటికున్న దారి .. దారి కానీ దారి ..
కోడిగుడ్డు వారిస్తే సట్టిడు! నిజమే గాని, గుడ్డు దానికదే పిల్లయి పోదు కదా. అటుకెక్కించి పొదిగించాలా? అందల కరిగినవెన్నో .. పొదిగినవెన్నో .. ఎన్నో కొన్ని .. అవయినా కాకులకీ గద్దలకీ పిల్లులకీ పీడలకీ దొరక్కండా వుండాల. అంత వార్సాలంటే భూదేవికున్నంత ఓపికా సహనమూ వుండాల… రేపటి మీద నమ్మకముండాల ..
ఆశ కనబడితే శ్వాస ఆడుతుంది…
అవన్నీ కడుపు నిండిన మాటలు … నాయుడే అన్నట్టు ‘కడుపెప్పుడు నిండదో కానీ బుద్దులప్పుడు తప్పవు.’ మరి కడుపు నిండని ఎర్రెమ్మ యివన్నీ కానుకో గలదా? కాసుకో గలదా? ఇయాల దినం తీరడం గురించి తప్పితే, రేపటి దినం గురించి ఆగగలదా? ఆలోచించగలదా?
నాయ్డు మాట మీద నాయురాలు – పులుసొక్కటే కాదు! అన్నం, ఆకులో కూర పెట్టి ఏవేవీ మిగిలితే అవన్నీ యిచ్చినా – ఆ పూటకే. నాయుడి మాట మీద నడవడం ఆ రోజుకే. నెలా పది తిరిగీ సరికి దెబ్బలు మానిపోయినట్టుగే సుద్దులు మరిచిపోయి మళ్ళీ మొదటికే రాదా? ‘ఆర్తి’ .. పీడ, దుఃఖము, మనోవ్యధ, రోగము పోదా? వింటికొన మీద బతుకు కాదా?
అందుకు సాక్ష్యంగా పైడయ్యకు అన్నం తినక పోతే ఆకలి. తినబోతే వెలపరం. నిజమే, ‘మోచేతి కూడు’ అని ఎంచితే – ఎంచడానికి లేనిదేవుందా గుడిసలో?, పెళ్ళాంతో కలిపి. పెళ్ళామే కాదు, తన బతుకులోనయినా ఎంచలేనిదేదయినా వుందా పైడయ్యకి? పైడయ్యకే కాదు, మొత్తం మాల పేటోళ్ళకి? పైడయ్య పని చేసే పట్నంలో అయిదో వంతు జనాభాకి?
ఆకలైనా అప్పటికి పైడయ్య చెయ్యి కడిగేసుకోవచ్చు. కానీ తర్వాతయినా కతక్కా తప్పదు. కక్కకా తప్పదు! కక్కిన కూడు తినకా తప్పదు!! అందుకేనేమో ‘కక్కిన కూడు తినే కూడదు, తింటే కడుపు నిండా తినాల’నీ అంటారు.

సరి సరే .. కడదాకా కధ మారదా అంటే మారాల్సినవేవో మారనంత కాలం మార్సనంత కాలం యింతే. కవుకుల పడిపోడమే.
ఈ కవుకుల్లో అల్లకల్లోలమయి పోయిన బతుకు బతికినోలకి – సహజాతాలైన ఆకలి, కామం, నిద్ర, భయం… ఒకటేవిటి అన్నీ అసహజమయిపోతాయి. అందనివై పోతాయి. తప్పించుకోలేనివయి పోతాయి. ఈ మూలాలు దెబ్బ తినీసినాక మనుషులు మనుషులుగా మనలేరు.

‘ఆర్తి’ కధ ద్వారా కాళీపట్నం రామారావుగారు చెప్పిందీ చూపిందీ యిదే!

 -బమ్మిడి జగదీశ్వర రావు

 

bammidi ఎలాంటి సాహిత్య వారసత్వం లేని కుటుంబం నుండి వచ్చిన బమ్మిడి జగదీశ్వరరావు తన పదమూడో ఏట నుండే కధలు రాయటం మొదలు పెట్టారు. అమ్మ చెప్పే కధలతో ప్రారంభం అయిన ఆయన కధాభిరుచి ఇప్పటికి ఐదు కధా సంపుటిలు, అనేక చిన్నపిల్లల కధల సంపుటిలు, జానపద కధలు వేయటానికి దారులు వేసింది. రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టి తీగలు, హింసపాదు వీరి కధా సంపుటిలు. తధాగత ప్రచురణల క్రింద ‘అమ్మ చెప్పిన కధలు’ ఆరు సార్లు రీ ప్రింట్ అయ్యి ఇప్పుడు ప్రతులు దొరకటం లేదు. ఇవి కాక అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, ఊ కొడదాం, అనగా వినగా చెప్పగా, అల్లిబిల్లి కధలు ఇంకా చాలా జానపద కధలు పుస్తకాలుగా వచ్చాయి. అవార్డ్స్ కి దూరంగా ఉండే బజరా నేటి తరం రచయితలు ‘రాయకుండా ఉండలేక పోవటం’ కాకుండా ‘ప్రచారం లేకుండా ఉండలేక పోవటం’ గురించి అసంతృప్తి వెలిబుచ్చారు. బజరాకు చాలా మంది రచయితలతో పాటు కారా మాష్టారు, పతంజలి అంటే ఇష్టం.       

 వచ్చే వారం ‘మహదాశీర్వచనం’ కధా పరిచయం కాత్యాయని విద్మహే 

 

 ఆర్తి కథ ఇక్కడ:

 

Download PDF

11 Comments

  • raghava says:

    అవును.మారాల్సినవేవో మారనంత కాలం, మార్సనంత కాలం ఇంతే – చాలా బాగా చెప్పారు బజరా గారూ!

  • amarendra says:

    ఇది జగదీశ్వర రావు మాత్రమే చేయగల సమర్ధ వంతమైన విశ్లేషణ

  • Manjari Lakshmi says:

    గజ ఈతరాలు రాసినది ఈ బజరా గారేనా?

  • vijji says:

    బమ్మిడిగారు వేరు. గొరుసుగారు వేరు. గొరుసుగారు చాలా మంచి రచయిత. గొరుసు జగదీశ్వర రెడ్డి గారు గజ ఈతరాలు, చీడ, జలగల వార్డు, వాల్తేరత్త లాంటి మంచి మంచి కథలు రాశారు. వాదాలు మూర్కత్వాలు లేని కథలు ఆయనవి. వుత్తరాంధ్ర మాండలీకాన్ని కూడా ఎంత వరకు ఎలా వాడాలో గొరుసు గారికి తెలుసు.

    • Thirupalu says:

      వాదాలు సరే! మూర్ఖత్వాలేమిటమ్డి ? వాదాలుండటమ్ మూర్ఖత్వమా లేక మూర్ఖమైనా వాదాలా? గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి ఏ వాదాలు లేవా ? బమ్మిడి జగదీశ్వర రావు గారి రచనళ్ళో వాదాలు ఉండటం వల్ల మూర్ఖత్వమా? ఏమిటి ,మీరనేది?

  • E sambukudu says:

    విజ్జిగారూ
    మీరు రాసిన వాక్యాన్ని ఒకసారి చూసుకోండి.’బమ్మిడిగారు వేరు. గొరుసుగారు వేరు. గొరుసుగారు చాలా మంచి రచయిత’అన్నారు. క్రిందటి కెవరో అన్నారుట “రాజుగారి పెద్దభార్య పతివ్రత”అని అలా వుంది మీ కామెంటు.మీరుకొత్తవారేమోలె అని అనుకున్దామన్నా గొరుసు గారి కధలపేర్లన్ని చెప్తున్నారాయే….ఒకసారి చూసుకోవాలి కన్ఫర్మ్ చేసేముందు.

  • రాఘవ says:

    “వాదాలు, మూర్ఖత్వాలు లేని కధలు ఆయనవి” -ఈ వాక్యం ఇంకా ఘోరం గా ఉందండీ విజ్జీ గారూ… – బజరా కధల్లో ఇవుంటాయని మీ ఉద్దేశం లాగా ఉంది..ఒకవేళ అదే మీ ఉద్దేశ్యమైనా దాన్ని వెలిబుచ్చేందుకు ఇది వేదిక కానే కాదు

  • kurmanath says:

    తిరుపాల్ గారు, రాఘవ గారు,
    ఈ విజ్జి గారెవరో స్పష్టంగానే చెప్పేరు. గొరుసు నిస్సందేహంగా గొప్ప కథకుడు. కానీ, ఆయనకు వాదాలు లేవనడం ఒక అబద్ధం. మూర్ఖత్వం. ఆయన ప్రజల పక్షపాతి. ప్రజా వ్యతిరేకంగా ఆయనేదీ ఎప్పుడూ రాయలేదు. ఆయనకు లేనిదేమిటంటే, తెలీనిదేమిటంటే నంగిరితనం. తనని తాను ప్రోమోట్ చేసుకోవడం, ఎలాగో ఒకలా ప్రచారంలో వుండడం లాటి విద్యలు తెలీవు. (ఓ పత్రికలో పనిచేస్తున్నా కూడా! కొందరికి తెలుసు పత్రికల్లో పనిచేస్తూ స్పేస్ ని తెలివిగా వాదేసుకుంటూ).
    ఆయనకో (లేదా ఆమెకో) బజరా కధలు నచ్చి ఉండకపోవచ్చు. నాకు కొందరివి నచ్చవు. సాహిత్యం highly subjective. నాకు బజరా కధలూ, గొరుసు కథలూ నచ్చుతాయి. నంగిరితనం ఉట్టిపడే రచనలూ, ఒకే కధని 36 సార్లు మార్చి మార్చి రాసేవారి కధలూ, తమ కథలు మాత్రమె కథలనీ మిగతావి కాదని ఊహల్లో ఊగే వారి కథలూ నచ్చవు.
    వాదాలు వుండడం మూర్ఖత్వం అన్న మూర్ఖత్వానికి హద్దులే వుండవు.

  • వ్యాఖ్యానాలు ఆర్తి పరిచయ వ్యాసం గురించో, ఆర్తి కధ గురించి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

    • E sambukudu says:

      రామాసుందరిగారు,
      “వ్యాఖ్యానాలు ఆర్తి పరిచయ వ్యాసం గురించో, ఆర్తి కధ గురించి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది”.అన్నారు,మంచిదే.అవసరం కూడాను.కానీ అదేసందర్భంలో తెలియనితనం వల్లగానీ,అహంకారముచేత గానీ ప్రభావితులైనవారు రాసిన అసందర్బపు వ్యాఖ్యలు ఖండించటము అవసరమే.అలాటివాటిని ఉపేక్షించటమ్ వాళ్ళకిగానీ పాఠకులకు గానీ మంచిది కాదుని నా భావన.

Leave a Reply to P.Jayaprakasa Raju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)