నలుడు-నరుడు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)
అందరికీ ప్రత్యక్షంగా కనిపించేదాన్ని, లేదా అనుభవంలో ఉన్నదాన్ని నిజమని అంటాం. నిజాన్ని నిరూపించడానికి ఆధారాలు ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. నిజం అనే మాటకు భిన్నమైనది భావన. Perception అనే ఆంగ్లపదాన్ని భావనగా అనువదించుకోవచ్చు ననుకుంటాను. భావన అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండచ్చు. భావనను నిరూపించడం ఒక్కొక్కసారి కష్టం కావచ్చు. అందుకు తగినన్ని ఆధారాలు ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది నిజం కాదని కొట్టి పారేయడమూ కష్టమే.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, నలదమయంతుల కథ పరిశీలనలో నేను ఈ నిజమూ-భావనల మధ్య సతమతమవుతుండడమే!

పురాణ, ఇతిహాసాలలో నరుడు అనే వాడిని సిద్ధసాధ్యయక్షకిన్నర కింపురుష గంధర్వదేవతాదులతో కలిపి చెప్పడం చూస్తుంటాం. అంటే, నరుడు వేరు, పైన చెప్పిన మిగిలిన వారంతా వేరు అనే అర్థం అందులో ధ్వనిస్తూ ఉంటుంది. కానీ నేటి సాధారణ హేతుబుద్ధితో ఆలోచిస్తే పైన చెప్పిన పేర్లు అన్నీ నరుడికి ఉపయోగించిన జాతి, తెగ, లేదా వృత్తి వాచకాలే ననీ; కనుక వారు కూడా నరులే ననీ అనిపిస్తుంది. అలాంటప్పుడు, నరుడు వేరు, పైన చెప్పినవాళ్లు వేరు అన్నట్టుగా ఎందుకు చెప్పినట్టు?
చాలా వ్యాసాల క్రితం, ఒక వ్యాసంలో ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చాను. నలదమయంతుల కథను పరిశీలించేటప్పుడు ఇంకొకసారి తెచ్చి, మరింత విపులంగా చర్చించవలసిన అవసరం కనిపించింది.

ఒకరకంగా ఇది ఎలాంటిదంటే, ఒక ఇంద్రజాలికుడు తను చేసిన గారడీని, లేదా సృష్టించిన భ్రమా ప్రపంచాన్ని తనే నిజమని నమ్మడం లాంటిది. పురాణ, ఇతిహాసాలకు ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది. నిర్దిష్టమైన భాష, శైలి ఉంటాయి. అది– దేవతలు, పక్షులు, పాములు, పర్వతాలు, నదులు, మానవులతో సహా చరాచరప్రపంచం మొత్తం ఒక అలౌకిక స్థాయిలో కలగలిసిపోయి ఉండే అద్భుతప్రపంచం. అందులో మామూలు మనిషి కూడా అతిమానుష స్వభావంతో ఉంటాడు. అందుకే మనం పురాణ ఇతిహాస పాత్రలను మామూలు మనుషులుగా కాక; అతిమానుషులుగా, అసాధారణులుగా చూడడానికే అలవాటు పడిపోతాం. కానీ మామూలు మనిషిని కూడా గుర్తించకతప్పదు కనుక, అతనిని నరుడు అనే పేరుతో అతిమానుషులతో కలిపి పౌరాణికుడు చెబుతున్నాడన్నమాట.

ఉదాహరణకు, మహాభారత పాత్రలను కొన్నింటిని తీసుకుందాం. పాండవులను కానీ, ద్రౌపదిని కానీ మనం మామూలు మనుషులుగా చూడం. వారి పుట్టుక నుంచి పెరిగి పెద్దైన తర్వాత చేసిన పనులు, వ్యవహరించిన తీరు వరకు, దాదాపు అన్నింటి చుట్టూ ఒక అతిమానుషత్వం, అద్భుతత్వం ఆవరించి ఉంటాయి. పాండవులు దేవతల అంశతో పుట్టినవాళ్లు. ద్రౌపది యజ్ఞగుండం వద్ద అయోనిజగా ప్రత్యక్షమైంది. అర్జునుడు అసామాన్య వీరుడు. తపస్సు చేసి అనేక దివ్యాస్త్రాలను సంపాదించినవాడు. ఇంద్రుని ఆహ్వానం మీద దేవలోకం వెళ్ళి అర్థసింహాసన గౌరవం అందుకున్నవాడు. పాండవులు, ద్రౌపదే ఏమిటి; దుర్యోధనుడితో సహా మహాభారతంలోని ప్రధానపాత్రలన్నీ దేవతాంశతోనో, రాక్షసాంశతోనో పుట్టినవే. ఆ విషయాన్ని కథకుడు ప్రారంభంలోనే చెబుతాడు.

అయితే, ఈ అతిమానుష, అద్భుత ప్రపంచంలో ముందుకు వెడుతున్నకొద్దీ; సిద్ధసాధ్యకిన్నర కిన్నర కింపురుష యక్షరాక్షసగంధర్వదేవతల మధ్య చిక్కుకున్న నరుడనే మామూలు మనిషిని బయటికి లాగి ముందుకు తేవలసిన అవసరం కథకుడికి కలిగింది. ఆ అవసరం ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగిందనే ప్రశ్నలోకి పూర్తిస్థాయిలో వెళ్లడానికి పూర్వరంగంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నరుడు అనే మామూలు మనిషిని ముందుకు తేవడం కథకుడు తప్పనిసరై చేసిందే తప్ప అంత ఇష్టంతో చేసిన పనిగా అనిపించదు. అర్జునుడికే నరుడు అనే పేరు ఉండడమే చూడండి. మహాభారతంలో నరుడు అనే పేరు అర్జునుడికి తప్ప మరొకరికి లేదు. మిగిలిన పాండవులు, ఇతరులు నరులు కాదా అన్న ప్రశ్నను కాసేపు ఇక్కడ మరచిపోదాం. ఒక కోణంలో చూస్తే మహాభారతంలో నాయకుడు లేదా హీరో అర్జునుడే. అతను నరుడు కూడా, అంటే మామూలు మనిషి కూడా నన్నమాట. ఆవిధంగా చూస్తే కథకుడు పరోక్షంగా మామూలు మనిషిని కథానాయకుడిగా చేసి మహాభారతకథ చెబుతున్నాడన్న మాట.

అదే సమయంలో, మామూలు మనిషిని కథానాయకుని చేసి; పురాణ, ఇతిహాసాలకు ఉన్న ప్రత్యేక రూప, స్వభావాలను చెరపడం కథకుడికి ఇష్టం లేదు. లేదా శ్రోతలు కూడా అలాంటి కథను ఇష్టంగా వినకపోవచ్చు కూడా. కనుక అర్జునుడు నరుడు మాత్రమే కాదు, మరోవైపునుంచి చెప్పుకుంటే, ఇంద్ర వరప్రసాదంతో, అంటే దేవతాంశతో జన్మించినవాడు. ఇంకా ఎన్నెన్నో విశేషణాలు ఉన్నవాడు. అతను నరుడే అయినా మామూలు నరుడు కాదు; నరుడనే ఒక ఆదిముని అవతారం. ఆపైన నారాయణుడనే దేవుడితో(నరనారాయణులు) కలిపి చెప్పవలసినవాడు. అంటే మామూలు మనిషిని ముందుకు తెస్తూనే కథకుడు మళ్ళీ అతనికి దివ్యత్వాన్ని ఆపాదిస్తూ అతని చుట్టూ ఒక కాంతివలయాన్ని సృష్టిస్తున్నాడన్న మాట.

అర్జునుని నరునిగా పదే పదే నొక్కి చెప్పడం అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో కనిపిస్తుంది. అందులో కథకుడు అర్జునుని నరునిగా పరిచయం చేయడం మామూలుగా కాక, చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కిరాత వేషంలో వెళ్ళి అర్జునుడు వేటాడిన ఒక వరాహాన్ని తను కూడా బాణంతో కొట్టి పడగొట్టి అది తనదే నంటాడు. అప్పుడు వారిద్దరి మధ్యా యుద్ధం జరుగుతుంది. అర్జునుని శౌర్యధైర్యాలను మెచ్చుకున్న శివుడు వరం కోరుకోమంటాడు. పాశుపతాస్త్రం ఇమ్మని అర్జునుడు అడుగుతాడు. ఆ సందర్భంలో శివుడు, “పూర్వజన్మలో నువ్వు నరుడనే దేవరుషివి, నారాయణుడికి సఖుడివి” అంటాడు.
arjuna

అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన సంగతి తెలిసి ఇంద్రుడు, ఇతర దిక్పాలకులతో కలసి అతని దగ్గరకు వస్తాడు. “నువ్వు నరుడనే పూర్వఋషివి. బ్రహ్మ నియోగంతో మనుష్యుడవై ఉత్తమ క్షత్రియకులంలో పుట్టావు” అంటాడు. అర్జునుడికి అతను ఒక దండాన్ని, మిగిలినవారు తమ తమ అస్త్రాలను ఇస్తారు. ఆ తర్వాత, దేవలోకానికి వస్తే, మరికొన్ని దివ్యాస్త్రాలు ఇస్తానని ఇంద్రుడు అతనికి చెప్పి రథం పంపిస్తాడు. అర్జునుడు రథమెక్కి దేవతల రాజధాని అమరావతికి వెడతాడు. “నరుడనే ఆదిమునే ఇతని రూపంలో జన్మించా” డనుకుంటూ దేవతలందరూ అతనిని చూడడానికి వెడతారు. అప్పుడే దేవవేశ్య అయిన ఊర్వశికి, అర్జునుడికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది.
అర్జునుడు తన విడిదిలో గంధర్వుల సంగీతగోష్ట్టిని ఆనందిస్తుండగా; వెన్నెల రాత్రి తెల్లని చీరకట్టుకుని, సుగంధద్రవ్యాలను అలదుకుని, రకరకాల సువాసనలను విరజిమ్మే పూలు ముడుచుకుని, ఇంద్రుని మందిరం నుంచి బయలుదేరి అందెల రవళితో ఊర్వశి అర్జునుడి మందిరానికి వచ్చింది. ఆమెను చూస్తూనే అర్జునుడు భయభక్తులతో లేచి నిలబడి నమస్కరించాడు. ‘అమ్మా’ అని సంబోధిస్తూ, “నా మీద పుత్రప్రేమతో, నాకు శుభం కలిగించడానికి వచ్చి నన్ను కృతార్థుని చేశావు” అన్నాడు. అంటే, ఆమె రాకకు కారణం పసిగట్టాడా అన్నట్టుగా ముందరి కాళ్ళకు బంధం వేసాడన్నమాట.

తన కళ్ళనే తుమ్మెదలతో అర్జునుడి అందమనే మధువును తాగుతున్న ఊర్వశి అతని మాటలకు ఉలికిపడింది. “నీ గుణగణాల గురించి మునుల ద్వారా విని నీ పొందు కోరి వస్తే, నన్ను అమ్మా అని పిలుస్తావేమిటి? నేను నీకు తల్లిని ఎప్పుడయ్యాను? దేవలోకవేశ్యలమైన మా దగ్గర ఇలాంటి వావివరసలు నడవవు. ఈ లోకంలో స్త్రీ, పురుషులు విచ్చలవిడిగా క్రీడిస్తారు. అదిక్కడ తప్పు కాదు. ఈ లోకానికి వచ్చావు కనుక నువ్వు కూడా దివ్యపురుషుడివే. కనుక నా కోరిక తీర్చు.” అంది.

“ధర్మానికి ద్రోహం చేసే ఇలాంటి మాటలు నువ్వు నాతో మాట్లాడడం న్యాయమా? లోకాలను పుట్టించేది, గిట్టించేది దేవతలే కనుక వాళ్ళు ఎలా నడచుకున్నా తప్పులేదు. కానీ నేను కర్మభూమిపై జన్మించినవాణ్ణి. కర్మిష్టిని. ఇక్కడి ఆచారం నాకు పనికిరాదు. మా వంశకర్త అయిన పురూరవుడికి భార్యవు కనుక, ఇంద్రుని సేవించుకునేదానివి కనుక నువ్వు నాకు తల్లివి అవుతావు. నన్ను పుత్రవాత్సల్యంతో చూడు” అన్నాడు అర్జునుడు నిర్వికారంగా.

దాంతో ఊర్వశి కోపించడం, నపుంసకుడివి కమ్మని అర్జునుని శపించడం, అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారడానికి అతడు ఆ శాపాన్ని ఉపయోగించుకోవడం…అనంతర పరిణామాలు.

అర్జునుని మాటల్ని జాగ్రత్తగా గమనించండి…అతనొక సాధారణ మానవుడిలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవతలు ఎలాగైనా ఉండచ్చు, మేము మనుషులమని అతను ఒత్తి చెబుతున్నాడు. దేవతలకు, మనుషులకు మధ్య ఒక విభజనరేఖ గీస్తున్నాడు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వారి నుంచి నరుని, అంటే మామూలు మనిషిని తప్పించి; అతనికి తనదైన ఒక ప్రత్యేకత ఉన్నట్టు ధ్వనింపజేసిన అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. బహుశా ఇదే మొదటిదేమో కూడా. ఎవరి గురించి అయినా గొప్ప చేసి చెబుతున్నప్పుడు, ఇతడు మామూలు మనిషి కాదంటూ, మనిషిని చిన్నబుచ్చి చెప్పడం మహాభారత కథకుడు సాధారణంగా అనుసరిస్తూ వచ్చిన వైఖరి. ‘ఇతడు కేవల మర్త్యుడు కాడు’ అనీ, ‘ప్రకృతిజనుడు కాడు’ అనీ అనడం చాలాచోట్ల కనిపిస్తుంది.

అది అలా ఉంచితే, అర్జునుడు ఉర్వశిని తిరస్కరించడానికే కాక; ఊర్వశి-పురూరవుల సంబంధానికి కూడా ఆసక్తికరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

ప్రస్తుతానికి వస్తే, రోమశుడనే ముని ఇంద్రుని సందర్శించడానికి వెళ్లి, అతని పక్కన అర్థసింహాసనాన్ని అధిష్టించిన అర్జునుని చూసి ఇతడెవరని అడుగుతాడు. “ఇతడు నరు డనే మహర్షి. నరలోకంలో పుట్టాడు” అని ఇంద్రుడు చెబుతాడు. చివరిగా, అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించాడన్న సంగతి వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రునికి తెలుస్తుంది. అతడు, “దేవతలు అర్జునుడికి పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు ఇచ్చారటగా! అలాంటి నరుడు యోధుడై ఉన్నప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవడి తరం?” అని సంజయుడితో అంటాడు.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. అర్జునుడు నరుడన్న సంగతిని పదే పదే నొక్కి చెప్పడమూ, పాండవుల యుద్ధప్రయత్నాలూ ఏక కాలంలో జరుగుతున్నాయి. అర్జునుడు దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదించుకునే క్రమంలోనే అతణ్ణి నరుడిగా కథకుడు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి నరుడు యోధుడిగా యుద్ధం చేసేటప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవరికి సాధ్యమని ధృతరాష్ట్రుడితో అనిపిస్తున్నాడు. యుద్ధం సమీపిస్తున్న కొద్దీ, యుద్ధమధ్యంలో కూడా నర నారాయణుల గురించి భీష్ముడు మొదలైన పాత్రల చేత చెప్పించబోతున్నాడు. అర్జునుని నరునిగా పరిచయం చేస్తున్న పై ఘట్టానికి సరిగ్గా ముందే; యుద్ధానికి అనుకూలంగా భీముడు, ద్రౌపది ధర్మరాజుతో చాలా వాడిగా, వేడిగా చర్చిస్తారు.

ఈ విధంగా చూసినప్పుడు అర్జునుని నరునిగా చెప్పడానికీ, యుద్ధానికీ ఏదో ముడి ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎలాంటిదో ముందు ముందు వెల్లడవుతుందేమో చూద్దాం.

***
ప్రస్తుత సందర్భంలో మనం గుర్తించవలసిన మరో విశేషం ఏమిటంటే, అర్జునుని నరునిగా పరిచయం చేసిన ఘట్టం వెనువెంటనే, నల దమయంతుల కథ ప్రారంభమవుతుంది. ఇంకా విచిత్రంగా, మా మాదిరిగా ఇన్ని కష్టాలు పడిన నరులు ఎవరైనా ఉన్నారా అని బృహదశ్వు డనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడా ముని నల దమయంతుల కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

వారి పరిచయం సాదా సీదాగా, ఇంకా చెప్పాలంటే ఓ చందమామ కథలానూ, జానపద కథలానూ ప్రారంభమవుతుంది. నలుడు నిషధదేశపు రాజు వీరసేనుడి కొడుకు; దమయంతి విదర్భరాజు భీముని కూతురు, అంతే! వారు దైవాంశ సంభూతులు కారు. వారి పుట్టుక వెనుక ఎలాంటి దైవ కారణాలూ లేవు. వారి చుట్టూ ఎలాంటి కాంతి వలయాలూ లేవు. వారు గొప్ప గొప్ప పనులు ఏవీ చేయలేదు. మొదట వారు ఓ మామూలు ప్రేమికులు, ఆ తర్వాత మామూలు దంపతులు. అనేక కష్ట నష్టాలకు గురై, ఒకరికి ఒకరు దూరమై, ఆ తర్వాత కష్టాల నుంచి బయటపడి తిరిగి ఒకటైన మానవమాత్రులు వారు.

నలదమయంతుల కథానిర్మాణం చాలా చిక్కగా, మంచి నేర్పరి అయిన కథకుడు అల్లినట్టుగా ఉంటుంది. అందులో ఎత్తులు, పై ఎత్తులు, ఉపాయాలు, వ్యూహాలు, విస్మయం గొలిపే మలుపులు ఉంటాయి. భారతీయ సాహిత్యంలో కథ, నవలా లక్షణాలు ఉన్న తొలి కథ ఇదే ననిపిస్తుంది. ఈ మాట ఇంతవరకు ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు.

కథ, ఇతర విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)