నీలాలు కారితే నే చూడలేను!

Neelaalu kaaritee_Naresh Poem_illustration (2)

మోళీవాడి కనికట్టులా
మొదల్లేని ఏడుపు పాయై
ధారగడ్తావు

జంట కంటి కంగారు నలుసై కారిపోతాను

నెత్తిమీద నీళ్లకుండ
జులపాల్లేని నీ జుట్టుక్కూడా
లెక్కతేలని చిక్కులేస్తుంది.

గంగవెర్రుల గంగాభవానిలో సత్తు కాసై మునిగిపోతాను

ముందే జరిగిన కప్పల పెళ్లికి బొంతకాకి కబురు
మూరెడు లేని సొరబూరలో ఎండనే ఎండని ఏరు

**           **           **

ఆదమర్చిన ఆల్చిప్పలో ఆవలింతల ఆకాశం
ఉట్టి మీద సట్టిలో తొణికిన ఉప్పుసంద్రం

కట్ట తెగే నీ కంటి దొరువులో
మూతి చాలని బుంగనై
మునకలేస్తాను
లొడలొడ బుడగల ఊటబావిని
చేంతాడు బొక్కెనై
చేదబోతాను
వైనాల వెక్కిళ్ల
వొంపు కాల్వలో
ఉగ్గిన్నెల యాతమేస్తాను

మంచు బూచోడికి భూగోళం కొసన కొరివి
విరిగిన వంతెన్ల మీద పగటికలల సవారి

దుఃఖనదివై కలకబారితే
దిగులు ద్వీపాన్నై
నొగిలిపోతాను
ఉవ్వెత్తు ఉప్పెన్లకి
నావ విరిగిన నోవానై
బిక్కబోతాను

పిందె గాయాల నీటికి నాలుకే లేపనం
గుట్టు చెప్పని చేప నాల్కకి ఖండనే దండనం

**           **           **

వెదురుబద్ద వెన్నెముక
మబ్బుదుబ్బుల మాటు
ఏడురంగుల్లో ఒంగిపోతుంది

చెట్టు మెటికలో నీటి సడికి ఊసరవెల్లై ఉలికిపడతాను

దుర్గమ్మ ముక్కెరని
పోటు కిట్టమ్మై
ముంచెత్తుతావు

చీదేసిన శ్లేష్మాన్నై జిగురు చాలక జారిపోతాను

మరిక మర్రాకు మీద నువ్ తెప్పతేలితే
బోసినోట్లో ఆ బొటనవేలేంటని
గద్గదంగా గదమాయిస్తాను

**           **           **

ఏడున్నర శ్రుతుల ఏడుపులో నాన్నని ఎడంచేసే నా చిన్నతల్లి ప్రహర్షకి-

నరేష్ నున్నా

Download PDF

9 Comments

 • సాయి కిరణ్ says:

  కొత్త కొత్తగా గమ్మత్తుగా భలే ఉంది సర్

 • S.Narayanaswamy says:

  చాలా బావుంది. కవితాత్మ సంగతి అలా ఉంచితే, దుర్గమ్మ ముక్కెర, బుంగ, సత్తుకాసు, చేంతాడు .. ఇలాంటి వాటి గురించి రాస్తున్న ఆఖరు కవి మీరేనేమో!

 • “మరిక మర్రాకు మీద నువ్ తెప్పతేలితే
  బోసినోట్లో ఆ బొటనవేలేంటని
  గద్గదంగా గదమాయిస్తాను”

  నాకయితే యశోదమ్మా చిన్ని కృష్ణుడే గుర్తుకొచ్చారు! :)

  మీ రాతల్లో పదాలెప్పుడూ నేల తాకినట్లనిపించని బాలే డాన్సర్‌లా పైకీ కిందకీ లయబద్దంగా తేలుతూ భలే నాట్యం చేస్తుంటాయండీ!

 • తిలక్ బొమ్మరాజు says:

  చాలా బాగా రాసారు పోయెమ్ నవీన్ గారు,ఆలోచన బాగుంది ఇలా.అభినందనలు.

  • తిలక్ బొమ్మరాజు says:

   క్షమించాలి నరేష్ గారు,పేరు తప్పుగా పడింది.

 • బ్యూటిఫుల్ పోయెమ్ . చాలా బాగుంది

 • కర్లపాలెం హనుమంత రావు says:

  ఇప్పుడే చూసాను ఈ కవితను. అమ్మాయి బాత్రూంలో జారిబడ్డదని మీరైతే రాత్రంతా కూర్చొని అలవోకగా పద్యంలో దుఃఖించారు గానీ.. మామూలు మనుషులం ఇంత కవిత్వం చదివి హరాయించుకుని ఆనక ఒక ముక్క ‘ఆహా’ఓహో’ అనో స్పందించడానికైనా నాలుగు క్షణాలు కావాలి నరేష్ నున్నాగారూ!! ;

 • Naresh says:

  సాయి కిరణ్, అవినేని భాస్కర్, నారాయణ స్వామి, తిలక్ బొమ్మరాజు, బొల్లోజు బాబా, కర్లపాలెం హనుమంత రావు గార్లకి ధన్యవాదాలు. నేనేమి రాసినా బాగుంటుందనే ప్రిజుడిస్ లోంచి మెచ్చుకొనే నిషిగంధకి కూడా థ్యాంక్స్ :-)

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)