పెద్రో పారమొ-13

pedro1-1పొద్దు పొడుపుతో రోజు మొదయింది, తక్కుతూ తారుతూ. భూమి తుప్పు పట్టిన గేర్లు దాదాపుగా వినపడుతున్నాయి. చీకటిని తోసేస్తూ ఈ పురాతన భూప్రకంపనలు.
“రాత్రి పాపాలతో నిండిపోయిందా జస్టినా?”
“అవును సుజానా!”
“నిజంగా నిజమేనా?”
“అయి ఉండాలి సుజానా!”
“జీవితం పాపం కాక మరేమిటి జస్టినా? నీకు వినపడుతుందా? వినపడుతుందా భూమి కిరకిరలాడటం?”
“లేదు సుజానా! నాకేమీ వినపడటం లేదు. నా రాత నీరాతంత గొప్పది కాదు.”
“నీకు భయమేస్తుంది. నేను చెపుతున్నాగా, నాకు వినపడేది నీకు వినపడితే భయంతో నీలుక్కుపోతావు.”
జస్టినా గది శుభ్రం చేయడంలో మునిగిపోయింది. మళ్ళీ మళ్ళీ తడి చెక్కనేలని గుడ్డతో తుడిచింది. పగిలిన వేజ్ నుండి కిందపడిన నీటిని శుభ్రం చేసింది. పూలు ఎత్తింది. పగిలిన ముక్కల్ని తొట్టిలో పడేసింది.
“నీ జీవితంలో ఎన్ని పిట్టల్ని చంపి ఉంటావు జస్టినా?”
“చాలా, సుజానా!”
“ఎప్పుడూ బాధ వేయలేదా?”
“వేసింది సుజానా!”
“ఇంకా చనిపోక దేనికోసం ఎదురుచూస్తున్నావు?”
“చావు కోసం సుజానా!”
“అంతే అయితే, అదే వస్తుంది. ఆదుర్దా పడకు.”
సుజానా శాన్ హువాన్ దిండుకి చేరగిలపడి కూచుంది. అస్థిరమైన ఆమె కళ్ళు ప్రతి మూలా వెతుకుతున్నాయి. ఆమె చేతులు పొట్టమీద రక్షించే కొక్కెంలా ముడిపడి ఉన్నాయి. ఆమె తలపై రెక్కలాడినట్టు ఝుం అంటూ వినిపిస్తూంది. కిర్రుమంటూ బావిలో గిలక. జనాలు లేస్తున్న సందడి.
“నరకంలో నీకు నమ్మకముందా జస్టినా?”
“ఉంది సుజానా, స్వర్గంలో కూడా!”
“నాకు నరకంలోనే నమ్మకముంది,” అంది సుజానా. అని కళ్ళు మూసుకుంది.
జస్టినా వెళ్ళిపోయాక సుజానా మళ్ళీ నిద్రలో మునిగిపోయింది. బయట సూర్యుడు తళతళ మెరుస్తున్నాడు. హాల్లో పేద్రో పారమొ కనిపించాడు జస్టినాకు.
“సెన్యోరా ఎట్లా ఉంది?”
“బాలేదు,” తల దించుకుని బదులిచ్చింది.
“ఏమన్నా కంప్లెయిన్ చేస్తుందా?”
“లేదు సెన్యోర్! ఆమె దేని గురించీ కంప్లెయిన్ చేయదు. కానీ చనిపోయినవాళ్ళు ఎప్పుడూ కంప్లెయిన్ చేయరని చెప్తారు. మనకు సెన్యోరా దక్కలేదంతే.”
“ఫాదర్ రెంటెరియా ఆమెను చూడటానికి వచ్చాడా?”
“ఆమె కన్ ఫెషన్ వినడానికి రాత్రి వచ్చాడు. ఇవాళ ఆమె కమ్యూనియన్ తీసుకుని ఉండవలసింది కానీ ఆమె మీద దయ ఉన్నట్టు లేదు. ఫాదర్ పొద్దున్నే వస్తానన్నాడు కానీ చూడు ఎంత పొద్దెక్కిందో ఇంకా రాలేదు. ఆమె మీద దయ ఉన్నట్టు లేదు.”
“ఎవరి దయ?”
“దేవుడి దయ, సెన్యోర్!”
“తెలివి తక్కువగా మాట్లాడకు జస్టినా!”
“సరే, సెన్యోర్!”
పేద్రో పారమొ తలుపు తెరిచి దాని పక్కనే నిలుచున్నాడు, ఒక కాంతి కిరణాన్ని సుజాన శాన్ హువాన మీద పడనిస్తూ. అతనికి కనిపించింది బాధతో గట్టిగా మూసుకున్నట్టున్న కళ్ళూ, సగం తెరిచిన తడి నోరూ, దుప్పట్లను వెనక్కి నెట్టేస్తూన్న చేతులూ, బయటపడుతున్న ఆమె నగ్నత్వమూ, మెలికలు తిరుగుతూ వంకరలు పోతున్న ఆమె దేహమూ.
తనకూ, మంచానికీ మధ్య ఉన్న కొద్ది దూరాన్నీ ఒక్క ఉదుటున దాటి ఏలికపాములా గిజగిజలాడుతూ మరింత విపరీతంగా కొట్టుకుంటూన్న నగ్నదేహాన్ని కప్పాడు. ఆమె చెవిలో పిలిచాడు “సుజానా!”. మళ్ళీ పిలిచాడు “సుజానా!”
తలుపు తెరుచుకుని ఫాదర్ రెంటెరియా చప్పుడు కాకుండా గదిలోకొచ్చాడు. “నీకు కమ్యూనియన్ ఇవ్వడానికి వచ్చాను తల్లీ!” అన్నాడు.
పేద్రో పారమొ ఆమెను లేపి తలగడలు సర్ది వాటికి చేరగిలపడేట్టు కూచోబెట్టిందాకా ఆగాడు. సుజానా సాన్ హువాన్ సగం నిద్రలోనే నాలుక చాపి ప్రసాదాన్ని మింగింది. తర్వాత “దివ్యమైన రోజు గడిపాం ఫ్లోరెన్సియొ!” అంది. మళ్ళీ ఆ దుప్పట్ల సమాధిలోకి జారిపోయింది.

“ఆ కిటికీ చూడు దోన ఫౌస్టా, ఆ మెదియా లూనాలో ఎప్పుడూ లైట్ వెలుగుతూ ఉండేది!”
“లేదు ఏంజెలెస్! నాకేదీ కనపడలేదు”
“ఎందుకంటే ఇప్పుడది చీకటిగా ఉంది. అంటే ఏదయినా చెడు జరిగిఉంటుందంటావా? మూడేళ్ళ పైగా ఆ కిటికీలో లైట్ రాత్రి తర్వాత రాత్రి వెలుగుతూనే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ గది పేద్రో పారమొ గది అని చెప్తారు. పాపమా పిచ్చావిడకి చీకటంటే భయమట. చూడు ఇప్పుడు లైట్ ఆరిపోయి ఉంది. దుశ్శకునం కాదా?”
“చచ్చిపోయిందేమో! బాగా జబ్బు పడి ఉంది. ఎవరినీ గుర్తు పట్టడంలేదంటున్నారు. తనలో తాను మాట్లాడుకుంటుందట. ఆమెని పెళ్ళి చేసుకోవడం మూలాన పేద్రో పారమొకి తగిన శాస్తే జరిగింది.”
“పాపం పేద్రో పారమొ!”
“లేదు ఫౌస్టా. అతనికి అంతే కావాలి. ఇంకా ఎక్కువే కావాలి”
“చూడు గది ఇంకా చీకటిగా ఉంది.”
“ఆ కిటికీని అట్లా వదిలేసి ఇంటికి పోయి పడుకుందాం పద! మనలాంటి ఇద్దరు ముసలాళ్ళకి ఇట్లా రోడ్ల మీద పడి తిరగడానికి వేళ మీరి పోయింది. ”
చర్చి నుంచి పదకొండింటికి బయటపడ్డ ఆ ముసలి ఆడవాళ్ళు అర్కేడ్ ఆర్చీల కింద మాయమయారు. ప్లాజాని దాటుతూ మెదియాలూనా వైపు వెళుతున్న మనిషి జాడ కనపడింది.
“చూడు దోనా ఫౌస్టా! ఆ వెళుతున్న మనిషి డాక్టర్ వలెన్సియా అంటావా?”
“అతను నాఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేనంత చత్వారం వచ్చింది నాకు. కానీ అట్లాగే ఉన్నాడు.”
“నీకు గుర్తు లేదా, ఆయన ఎప్పుడూ తెల్ల పాంటూ, నల్లకోటూ వేసుకుంటాడు కదా! మెదియాలూనాలో ఏదో చెడు జరుగుతుందని పందెం. చూడు ఏదో అవసరం పడ్డట్టు ఎట్లా వేగంగా నడుస్తున్నాడో!”
“చూస్తుంటే ఏదో ఘోరం జరిగే ఉంటుందనిపిస్తుంది. తొందరగా వెళ్ళి ఫాదర్ రెంటెరియాకి చెప్పాలనిపిస్తుంది. పాపం ఆమె కన్ ఫెషన్ చేయకుండా చచ్చిపోతుందేమో!”
“దేవుడే కాపాడాలి ఏంజెలెస్! ఎంత దుర్భరమైన ఆలోచన! ఈలోకంలో పడ్డ కష్టాలు ఎటూ పడింది. ఇప్పుడు చివరి కర్మలు జరక్కుండా పోయి మళ్ళీ వచ్చే జన్మలోకూడా ఇంకా కష్టాలు పడాలని ఎవరూ కోరుకోరు. పిచ్చివాళ్ళు కన్ ఫెస్ చేయనవసరం లేదనీ, వాళ్ల ఆత్మల్ని పాపం చుట్టుకున్నా వాళ్ళు అమాయకులేననీ చెప్తారనుకో. దేవుడికే తెలియాలి… చూడు కిటికీలో లైట్ వెలుగుతుందిప్పుడు. అంతా బాగానే అయిపోయి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఉంటే మనం క్రిస్మస్ కోసం చర్చిని అలంకరించడానికి పడ్డ శ్రమంతా ఏమయ్యేదో ఊహించుకో. డాన్ పేద్రో అంత పెద్దమనిషి కాబట్టి మన వేడుకలన్నీ సర్వనాశనమయ్యేవి.”
“నువ్వెప్పుడూ అతిగా ఆలోచిస్తావు ఫౌస్టా. నువు నేను చేసినట్టు చేయి- అంతా ఆ దేవుడికే వదిలేయి. కన్య మేరీకి అవ మారియా చెప్పు. ఇప్పట్నుంచి తెల్లారిందాకా ఏమీ జరగదనే నా నమ్మకం. అప్పుడు దేవుడి ఆనే జరగనివ్వు. ఎటు తిరిగీ ఆమె ఈ జీవితంలో ఆనందంగా ఉండలేదు.”
“నిజం చెబుతున్నా ఏంజెలెస్! నీ మాటలు నాకుఎప్పుడూ సాంత్వన కలిగిస్తాయి. ఆ మంచి మాటలే మనసులో పెట్టుకుని నిద్రపోగలను. మన నిద్రలో ఆలోచనలు సరాసరి స్వర్గానికే చేరతాయంటారు. నాది కూడా అంత దూరం పోతుందనే నా ఆశ. రేప్పొద్దున కలుద్దాం.”
“సరే రేపు కలుద్దాం ఫౌస్టా.”
ఆ ముసలి ఆడవాళ్ళిద్దరూ వాళ్ళ సగం తెరిసిన తలుపుల్లోంచి ఇళ్ళల్లోకి వెళ్ళారు. రాత్రి నిశ్శబ్దం పల్లె మీద మళ్ళీ పరుచుకుంది.

“నా నోరు మట్టితో నిండి ఉన్నది!”
“అవును ఫాదర్!”
“‘అవును ఫాదర్ ‘ అనకు. నేను చెప్పేదంతా మళ్ళీ చెప్పు.”
“మీరేం చెప్తారు? నన్ను మళ్ళీ కన్ ఫెస్ చేయమంటారా? మళ్ళీ ఎందుకు?”
“ఇది కన్ ఫెషన్ కాదు సుజానా. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నిన్ను మృత్యువుకు సిద్ధపర్చడానికి.”
“నేను చనిపోబోతున్నానా?”
“అవును తల్లీ!”
“మరి నా మానానికి నన్ను ప్రశాంతంగా వదిలేయవచ్చుకదా? నాకు విశ్రాంతి కావాలి. నన్ను మెలకువగా ఉంచమని మిమ్మల్నెవరో పంపి ఉండాలి. నిద్ర పూర్తిగా పారిపోయిందాకా నాతో ఉండడానికి. అతన్ని కనుక్కోవడానికి నేనేం చేయగలను? ఏమీ లేదు ఫాదర్! నన్నొంటరిగా వదిలేసి వెళ్ళిపోరాదా?”
“నిన్నొదిలేస్తాను సుజానా. నేను చెప్తున్న మాటలు తిరిగి చెప్తుంటే నెమ్మదిగా నీకు నువ్వే జోలపాడుకున్నట్టు నిద్రలోకి జారిపోతావు. ఒకసారి నిద్రపోయాక నిన్నెవరూ లేపరు. ..నువ్వెప్పటికీ లేవవు.”
“సరే ఫాదర్. మీరు చెప్పినట్లే చేస్తాను.”
తన చేతులు ఆమె భుజాల మీద ఉంచి మంచం అంచున కూచున్న ఫాదర్ రెంటీరియా ఎవరికీ వినపడకుండా ఉండేందుకు ఆమె చెవి దాదాపు తన నోరు తాకుతుండగా ఒక్కోమాటా రహస్యంగా గుసగుసలాడుతూ చెప్పాడు. “నా నోరు మట్టితో నిండి ఉన్నది.” అని ఆగాడు. ఆమె పెదవులు కదులుతున్నాయో లేదోనని చూశాడు. మాట్లాడుతున్నట్టు పెదాలు కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావడం లేదు:
“నా నోరు నీతో, నీ పెదవులతో నిండి ఉన్నది. గట్టిగా మూసుకుని ఉన్న నీ పెదవులు, నా పెదవులను గట్టిగా అదుముతూ, కొరుకుతూ..”
ఆమె కూడా ఆగింది. తన కంటి చివరి నుంచి ఫాదర్ రెంటెరియా వంక చూసింది. అతనెక్కడో దూరంగా ఉన్నట్టూ, మంచు పేరుకున్న గాజుపలక వెనక ఉన్నట్టూ కనిపించాడు.
మళ్ళీ అతని గొంతు ఆమె చెవిలో వెచ్చగా వినపడింది.
“నురగల ఉమ్మిని మింగితిని. నా గొంతుకడ్డంగా ముడి పడి, నా అంగిటిలో వొరుసుకునునట్లు పురుగులతో లుకలుకలాడుతున్న మట్టి పెళ్ళలని నమిలితిని. నములుతూ కబళించుచున్న నా పళ్ళ వలన చీల్చబడి వంకరలు పోయి నా నోరు విరిగిపడినది. నా ముక్కు మెత్తబడినది. నా కనుగుడ్లు నీరై పోయినవి. నా శిరోజములు ఒక అగ్ని కీలయై మండినవి..”
సుజానా శాన్ హువాన్ అంత నిమ్మళంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఆమె ఆలోచనలనూ, తను ఆమెలో ప్రతిక్షేపిస్తున్న దృశ్యాలను నిరాకరించడానికి పెనుగులాడుతున్న ఆమె హృదయాన్నీ తెలుసుకోవాలనిపిస్తూంది. అతను ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె కూడా అట్లాగే చూసింది. ఆమె మెలి తిరుగుతున్న పెదవుల చివర ఒక చిన్న నవ్వు మొలకెత్తుతున్నట్టు ఉంది.
“ఇంకా ఉంది. దేవుడు సాక్షాత్కరించిన దృశ్యం. ఆయన అనంత స్వర్గధామపు మెత్తటి కాంతి. సెరాఫిం పాటా, చెరూబిం ఉల్లాసం. శాశ్వత బాధలకు శపించబడ్డ వారికి చివరిసారిగా కనపడి మాయమయ్యే దేవుని నయనాలలో ఆనందం. శాశ్వత బాధకు తోడయ్యే ఈ లోకపు వేదన. ఎముకలోని మజ్జ మండుతున్న బొగ్గయి, మన నరములలో ప్రవహించు రక్తము అగ్ని కీలలై నమ్మజాలని యాతన కలుగజేయును. దేవుని ఆగ్రహము దానిని ఆరనివ్వక విసురుచుండుటవలన ఆ అగ్ని ఎన్నటికీ చల్లారదు.”
“అతడు నాకు తన చేతులలో రక్షణనొసగెను. నాకు ప్రేమనొసంగెను.”
ఆమె చివరి క్షణం కోసం ఎదురు చూస్తూ తన చుట్టూ మూగిన ఆకారాల వంక చూశాడు ఫాదర్ రెంటీరియా. పేద్రో పారమొ చేతులు కట్టుకుని వాకిలి వద్ద ఎదురు చూస్తున్నాడు. అతని పక్కనే డాక్టర్ వాలెన్సియా, ఇంకా కొంతమంది నిలుచుని ఉన్నారు. ఇంకా దూరంగా నీడల్లో ఆడవాళ్ళ చిన్న గుంపు మరణించిన వాళ్ళ కోసం ప్రార్థనలు చేయడానికి ఆత్రంగా నిలబడి ఉంది.
అతను లేద్దామనుకున్నాడు. మరణిస్తున్న స్త్రీకి పవిత్ర తైలం అంటి “నా పని ముగిసింది,” అని చెప్పటానికి. కానీ లేదు, అతని పని ఇంకా ముగియలేదు. ఆమె ఎంతవరకూ పశ్చాత్తాపపడుతూ ఉందో తెలియకుండా ఆ మరణ సంస్కారాన్ని కొనసాగించలేడు.
అతను ఒక క్షణం సందేహించాడు. బహుశా ఆమెకు పశ్చాత్తాపపడవలసిందేమీ ఉండి ఉండక పోవచ్చు. బహుశా తను క్షమించవలసిందీ ఏమీ లేకపోవచ్చు. మళ్లీ ఆమె మీదికి వంగి, ఆమె భుజాలు కుదుపుతూ లోగొంతుకతో చెప్పాడు.
“నువ్వు దేవుని సన్నిధానానికి వెళుతున్నావు. ఆయన పాపులపై తీర్పు చెప్పడంలో క్రూరుడు.”
ఆమె చెవిలో ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ ఆమె తల అడ్డంగా ఊపింది. “వెళ్ళి పో ఫాదర్. నాగురించి హైరానా పడకండి. నాకు ప్రశాంతంగా ఉంది. బాగా నిద్రవస్తున్నట్టుంది.”
నీడలో దాగున్న స్త్రీలలో ఒకరి వెక్కు బయటికి వినవచ్చింది.
సుజానా శాన్ హువాన్ కి ఒక్క క్షణం ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. మంచం మీద నిటారుగా కూర్చుని అంది:
“జస్టినా, నీకు ఏడవాలనుంటే ఎక్కడికయినా పో!”
అప్పుడు ఆమెకు తల పొట్టమీదికి వాలినట్లనిపించింది. తల పైకెత్తడానికీ, ఊపిరాడకుండా చేస్తున్న పొట్టను పక్కకు నెట్టడానికీ ప్రయత్నించింది కానీ ప్రతి ప్రయత్నంతో ఆమె ఆ రాత్రి లోకి ఇంకా లోతుగా కూరుకుపోసాగింది.

“నేను.. నేను దోనా సుజానితా చనిపోవడం చూశాను.”
“ఏమంటున్నావు డొరోతియా?”
“నీకిప్పుడు చెప్పిందే!”

తొలి సంజ. గణ గణా మోగుతున్న గంటలు జనాల్ని మేలుకొలుపుతున్నాయి. అది డిసెంబర్ ఎనిమిది ఉదయం. మబ్బుగా ఉన్న ఉదయం. చల్లగా లేదు కానీ మబ్బుగా. ఆ మోగడం పెద్ద గంటతో మొదలయ్యింది. మిగతావీ దానికి జత కలిసాయి. ఫెద్ద ప్రార్థన కోసం గంటలు మోగుతున్నాయనుకున్నారంతా. తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయి. అన్నీ కాదు; కొన్ని ఇంకా మూసుకునే ఉన్నాయి. బద్ధకస్తులు ఇంకా మంచాల మీదే పడుకుని తెల్లారిందని గంటలు చెప్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ మోగడం మామూలు కన్నా ఎక్కువసేపు సాగింది. పెద్ద చర్చిలో గంటలే కాదు, సాంగ్రె డీ క్రిస్టో, క్రజ్ వర్డె, శాంచువారియో గంటలు కూడా. మధ్యాహ్నమయింది కానీ ఇంకా గంటలు మోగుతూనే ఉన్నాయి. రాత్రి అయింది. పగలూ, రాత్రీ గంటలు మోగుతూనే ఉన్నాయి. అన్నీ, బలంగా, పెద్దగా ఆ మోతలన్నీ గాఢశోకంలో కలిసిపోయేలా. చెప్పేది వినపడక జనాలు పెద్దగా అరవవలసి వస్తూంది. “ఏమయుంటుంది?” వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడుగుకుంటున్నారు.
మూడు రోజులయ్యేసరికి అందరికీ చెవుడు వచ్చింది. అంతటా నిండిన ఆ ధ్వనులకి మాట్లాడడం అసాధ్యమవుతూంది. కానీ గంటలు మోగుతూనే ఉన్నాయి. కొన్ని పగిలిపోయి ఓటి కుండల్లా డొల్ల మోతలు మోగుతున్నాయి.
“దోనా సుజానా చనిపోయింది.”
“చనిపోయిందా? ఎవరు?”
“సెన్యోర.”
“ఎవరు మీ సెన్యోరానా?”
“పేద్రో పారమొ సెన్యోర.”
ఆ నిరంతర ధ్వనులు విని జనాలు వేరే ఊళ్ల నుంచి రాసాగారు. కోంట్లా నుంచి తీర్థానికొచ్చినట్టు వచ్చారు. ఇంకా దూరాన్నుంచి కూడా. ఎక్కడ్నుంచో ఎవరికి తెలుసు, ఒక సర్కస్ కూడా వచ్చింది ఎగిరే కుర్చీలూ అవీ వేసుకుని. వాయిద్యాల వాళ్ళూ. ముందు ఊరికే అందరిలా చూడ్డానికే వచ్చారు కానీ నెమ్మదిగా అక్కడే స్థిరపడిపోయారు. ప్రదర్శనలూ ఇవ్వడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా అంతా ఒక జాతరలాగా అయిపోయింది. కోమలా నిండా జనాలే, సందడి సందడిగా గొడవ చేస్తూ. పండగలప్పట్లా ఇసకస్తే రాలనట్టున్నారు జనం.
గంటలు మోగడం ఆగింది కానీ జాతర అట్లాగే కొనసాగింది. ఇది విచారించదగ్గ సందర్భం అని ఎవ్వరినీ వొప్పించ వీలుగాకుంది. వాళ్లని పొమ్మనే దారీ లేదు. ఒక వైపు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు.
మెదియా లూనా ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్లు చెప్పులు లేకుండా నడుస్తూ, లోగొంతులతో మాట్లాడుతూ ఉన్నారు. సుజానా సాన్ హువాన్ ని పూడ్చిపెట్టడం అయింది కానీ కోమలాలో ఎక్కువమందికి ఆసంగతే తేలీదు. వాళ్లంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. కోడిపందేలూ, లాటరీలూ, సంగీతమూ, తాగుబోతుల కేకలూ. ఊళ్ళోని దీపాల కాంతి మెదియాలూనా దాకా కనిపిస్తూంది బూడిదరంగు ఆకాశంలో తేజోవలయంలా. అవి మెదియాలూనాలో విషాదభరితమయిన రోజులు. డాన్ పేద్రో ఎవరోతోనూ మాట్లాడడం లేదు. తన గదే విడిచి రాలేదు. కోమల మీద పగ తీర్చుకుంటానని వొట్టు పెట్టుకున్నాడు.
“నా చేతిలోంచి గింజ జార్చను. కోమలా ఆకలితో మాడి చస్తుంది.”
అదే జరిగింది.
టిల్కేట్ వార్తలు అందిస్తూనే ఉన్నాడు.
“మేమిప్పుడూ కర్రాంజా తో ఉన్నాం.”
“మంచిది.”
“ఇప్పుడు జనరల్ ఓబ్రెగాన్ తో కలిశాం.”
“మంచిది.”
“శాంతి ప్రకటించారు. మమ్మల్ని పంపించేశారు.”
“ఆగు. నీ మనుషుల్ని పంపేయకు. ఇదెన్నాళ్ళో ఉండదు.”
“ఫాదర్ రెంటీరియా కూడా పోరాటంలోకి దిగాడు. మనం అతనికి వ్యతిరేకమా కాదా?”
“ప్రశ్నే లేదు. నువు ప్రభుత్వం తరఫునే!”
“కానీ మేం మామూలు వాళ్లం కాదుగా. వాళ్ళు మమ్మల్ని తిరుగుబాటుదారులుగా లెక్క వేస్తారు.”
“అయితే విశ్రాంతి తీసుకో!”
“మేం ఇప్పుడు ఇంత ఊపు మీద ఉన్నాము కదా!”
“సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయి.”
“నేను వెనక్కి ఆ ముసలి ప్రీస్ట్ దగ్గరికే పోతున్నా. వాళ్ల కేకలు నచ్చాయి. అదీ కాక ఆయనతో వెళితే ముక్తికి ఢోకా లేదు.”
“నువ్వేం చేస్తావో నాకనవసరం.”

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)