“మాటల్లేని చిత్రాల” లోకంలో కాసేపు…

WP_20141202_001

 

ఏ విషయానికి చెందిన పుస్తకానికైనా “చరిత్ర” అనే పేరుంటే ఆ విషయంపట్ల చాలా ఇష్టం ఉన్నవాళ్ళు తప్ప సాధారణంగా అందరూ దాన్ని పక్కన పెడతారు. 675 పేజీలున్న “ప్రపంచ సినిమా చరిత్ర మొదటిభాగం – సైలెంట్ సినిమా 1895-1930” పుస్తకం పేరు చూసి భయపడక్కర్లేదు. గంభీరమైన సిద్ధాంత వ్యాసాల మాదిరిగా ఉండదీ పుస్తకం. మొదలెట్టాక పూర్తయేవరకూ చదవటం ఆపలేకపోయాన్నేను. జవనాశ్వంలా పరుగెత్తే శైలి. సీరియస్ సినిమా విద్యార్ధులు, ఛాయాగ్రాహకులు, ఎడిటర్లు, ఔత్సాహిక దర్శకులు ఈ పుస్తకంలోకి కాస్త తొంగిచూస్తే అమూల్యమైన విషయాలు తెలుస్తాయి.

తెలుగులో సినిమా పుస్తకాల గురించి చెప్పుకుంటే, ఇంతవరకూ సరైన “విమర్శ” రానేలేదు. ఈ మధ్య వస్తున్న పుస్తకాల్లో పాత తెలుగు సినిమాల గురించి సమాచారం, ఆ సినిమాలు తీయడానికి దర్శకులు నిజాయితీగా పడిన శ్రమ, నటీనటుల అనుభవాలు… వీటికి సంబంధించిన చరిత్ర వరకూ బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని మించిన పని చాలా మిగిలేవుంది. ఈ పరిస్థితిలో “ప్రపంచ సినిమా చరిత్ర రాయ తలపెట్టటమే ఓ సాహస చర్య. పైగా ఆ చరిత్రని స్థూలంగా రాయకుండా, సమగ్రంగా, సంక్లిష్టంగా విశ్లేషణాత్మకంగా రాయదలచడం మరింత సాహసంతో కూడుకున్నపని” అంటూనే ఈ పనిలో మొదటి భాగాన్ని పూర్తిచేసి మనముందు పెట్టారు పసుపులేటి పూర్ణచంద్రరావు.

పీటర్ కోవీ “Seventy Years Of Cinema” తన రచనకు స్ఫూర్తి అని చెప్తున్నారు పూర్ణచంద్రరావు. సంవత్సరాలవారీగా వచ్చిన సినిమాల గురించి రాస్తూనే ఫిల్మ్ గ్రామర్ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో వివరించే పీటర్ కోవీ పద్ధతినే తానూ అనుసరించినట్టు చెప్పుకున్నారు. 1895లో పుట్టిన సినిమా విదేశాల్లో ఎలా పెరిగిందీ, మనదేశంలో దాని వృద్ధి సమాంతరంగా ఎలా వున్నదీ చెప్తూ ఆసక్తికరమైన తులనాత్మక పరిశీలన కూడా చేశారు ఈ పుస్తకంలో. దేన్నీ దాచే శ్రద్ధ, అలవాటు లేని కారణంగా ఫిల్మ్ లు దొరక్క, మనదేశంలో తయారైన చాలా సినిమాల గురించి మనకు తెలియదు. (ఒక్క దాదా ఫాల్కే మాత్రం తను సినిమా తీస్తున్న పద్ధతినంతా మరో కామెరాతో తీయించడం వల్ల ఆయన తీసిన ఫిల్మ్ ముక్కలతో పాటు చేసిన కృషి కూడా అందరికీ అర్ధమైంది).

భారతీయ సైలెంట్ సినిమా గురించి ఉన్నంతలోనే వివరించారు ఈ పుస్తకంలో. మనదేశంలో తయారై, తరువాత ఆచూకీ తెలియకుండా పోయిన కొన్ని మూకీల గురించి రాయటానికి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆర్కైవ్స్ లో ఉన్న సినిమా ప్రకటనలు బాగా ఉపయోగపడ్డాయట. ఫిల్మ్ సొసైటీలకు సంబంధించిన మొదటితరంవాళ్ళూ, సినిమా వాళ్ళూ ఆనాటి పత్రికల్లో చదివిన సారం ఏమైనా ఉంటే, వారి మెదళ్లలోనే ఉండి ఉండాలి. అలాటివారి సంఖ్య కూడా ఇప్పుడు తక్కువగానే ఉంది. సి. పుల్లయ్య కాకినాడలో ‘భక్త మార్కండేయ’ సైలెంట్ సినిమాను 1925 ప్రాంతాల్లో తీశాడనీ, అదే తెలుగువాడు తెలుగునాట తీసిన మొదటి కథా చిత్రమనీ ఎప్పుడో ‘విజయచిత్ర’లో చదివిన గుర్తు. ఆ సినిమా ప్రస్తావన ఈ పుస్తకంలో లేదు. వి.ఏ.కే. రంగారావు వంటి పెద్దలు ఇలాంటి విషయాలు వివరించగలరు.

నాటక, సాహిత్య, సంగీత, చిత్రకళాకృతులే సినిమా శిల్పాన్ని తీర్చిదిద్దాయి. ఈ రంగాలన్నిటిమీదా కొంత పట్టు ఉన్నవాళ్ళు సినిమా గురించి రాస్తే దానికో దమ్ము ఉంటుంది. వీటిగురించి తెలిసి ఉండటం, వీధినాటక ప్రయోక్త కావటం, ఆంధ్రాలో ఫిల్మ్ సొసైటీ ఉద్యమానికి సేవ చేసిన మొదటి తరం వారిలో ఒకరవటం, దేశాలు తిరిగి రకరకాల సంస్కృతుల గురించి తెలుసుకుని మరీ మాట్లాడగలగటంతో పూర్ణచంద్రరావు సినిమా రాతలు సాధికారంగా సూటిగా ఉంటాయి. అరకొర జ్ఞానం పట్లా, అన్నిరకాల అణచివేతల పట్లా ఈయనకున్న విపరీతమైన అసహనం నిర్మొహమాటంగా బైటపడుతుంది ఈ పుస్తకంలో.

సినిమాశిల్పాన్ని మూకీ సినిమాల బంగారుకాలంలోనే సంపూర్ణంగా చెక్కి పెట్టేశారు జార్జ్ మెలీ, గ్రిఫిత్, ఐసెన్ స్టీన్ మొదలైనవాళ్ళు. వీళ్ళ పనితనం గురించి రచయిత మాటల్లో చదవటం బాగుంటుంది. గ్రిఫిత్ ఎంత గొప్ప సినిమా శిల్పకారుడో అంత అధముడైన జాత్యహంకారి కూడాననీ, చార్లీ చాప్లిన్ ఎంత గొప్ప మానవతావాద హాస్యాన్ని పండించినా, వాన్ స్టెర్న్ బర్గ్ చేత తానే తీయించిన సినిమాని విడుదల చేయకుండా స్వయంగా తగలబెట్టించిన అసూయాపరుడు కూడాననీ నిర్మొహమాటంగా వివరించారు. చాప్లిన్ సినిమాల గురించి ఈయన ఆప్యాయంగా వివరించిన తీరులో చాప్లిన్ అంటే ఉన్న ప్రత్యేకాభిమానం కనిపిస్తూనే ఉన్నా, నిష్పక్షపాతమైన పరిశీలనతో దర్శకత్వం విషయంలో చాప్లిన్ కున్న పరిమితులను గుర్తిస్తారు. చాప్లిన్ తో బస్టర్ కీటన్ ను పోల్చేటప్పుడు, బస్టర్ కీటన్ సినిమాటిక్ నైపుణ్యంతో పాటు అతని హాస్యంలోని మేధావితనాన్ని కూడా గుర్తించటం ఉంది.

సైలెంట్ సినిమాలకోసం థియేటర్లో మ్యూజిక్ బ్యాండ్ లు సంగీతాన్ని వినిపించటం, అక్కడే ప్రేక్షకులకు పల్లీలు అమ్మేవాళ్ళు తిరిగేస్తుండటం, సినిమా షోల ద్వారా వచ్చిన డబ్బుని ఎడ్లబండ్లలో వేసి బ్యాంకుకి తీసుకెళ్లారంటూ జనం చెప్పుకోవటం వంటి తమాషా విషయాలూ ప్రస్తావనకు వచ్చాయి. మొదటిసారి గ్రిఫిత్ వాడిన క్లోజ్ అప్ షాట్ చూసి             “Half Man !!!” అంటూ ఆశ్చర్యపోయారట ఆనాటి జనం. ఈ పుస్తకంలో కదిలేబొమ్మల వింతలు చూస్తున్న అప్పటి ప్రేక్షకులనుంచి వచ్చిన స్పందనలు చదువుతుంటే వేడి పకోడీల్లా మజాగా ఉంటాయి.

‘వెస్టర్న్’ సినిమా తీరుతెన్నుల్ని చెప్తూ కాస్త అమెరికా చరిత్రనూ, వెస్టర్న్ సినిమాల్లో వచ్చే పదజాలాన్నీ వివరించారు. ఇది ఆ సంస్కృతి తెలియనివారికి బాగా పనికొస్తుంది. ‘జర్మన్ ఎక్స్ ప్రెషనిజం’, ‘కామెడీ’, ‘మెలోడ్రామా కళ’ గురించి చేసిన స్థూల పరిచయం కూడా ఉపయోగపడేదే. సినిమా విద్యార్థుల కోసం “Battleship Potemkin” లో ప్రఖ్యాతమైన ‘ఒడెస్సా స్టెప్స్’ దృశ్యపు స్క్రిప్ట్ భాగాన్నీ, గ్రిఫిత్ ‘కటింగ్’ గురించి తెలుసుకోవటం కోసం “Intolerance” సినిమా నుంచీ కొంత స్క్రిప్ట్ భాగాన్నీ ఓపిగ్గా వివరంగా ఈ పుస్తకంలో అందించారు.

చాప్లిన్ సినిమాల రివ్యూలు, ఇంకా “ఫాంటమ్ చారియట్”, “గ్రీడ్”, “ద పాషన్ అఫ్ జోన్ ఆఫ్ ఆర్క్”, “ద జనరల్”, , “బ్లాక్ మెయిల్”, “ద మాన్ విత్ ఎ మూవీ కామెరా”, “పండోరాస్ బాక్స్” “నోస్ఫెరాటు”, ద లాస్ట్ లాఫ్”, “ద కవర్డ్ వేగన్”, “ద క్రౌడ్”, “ద జనరల్ లైన్”, “Un Chien Andalou”, “లిటిల్ సీజర్” సినిమాల రివ్యూలు పూర్ణచంద్రరావు నిశిత పరిశీలనతో పాటు ఆయనలోని కథకుడిని కూడా చూపిస్తాయి.

ఫాల్కే తీసిన ‘రాజా హరిశ్చంద్ర’ కంటే ముందే ‘పుండలీక్’ తీసినంత మాత్రాన దాదా తోర్నీని భారతీయ చలన చిత్ర పితామహుడు అనలేం. అలాగే 1916కే కొన్ని సినిమాలు తీసిన నటరాజ మొదలియార్ ను కాకుండా, శాస్త్రీయంగా పద్ధతిగా సినిమా రంగంలోకి దిగి 1921 లో పూర్తి స్థాయి సినిమా ‘భీష్మ ప్రతిజ్ఞ’ తీసిన రఘుపతి ప్రకాశ్ నే దక్షిణ భారత కథా చిత్రానికి మొదటి దర్శకుడిగా గుర్తించాలని అంటున్నారు రచయిత. ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.

అలాగే తొలి తెలుగు తార పైడి జైరాజ్ గురించి, “శారీరక సౌష్టవంలోనూ, డైలాగ్ డెలివరీ లోనూ పృథ్వీరాజ్ కపూర్, సొహరాబ్ మోడీలతో పోటీపడి జైరాజ్ హిస్టారికల్ చిత్రాల్లో నటించేవాడు… చరిత్రకందిన మేరకు 1929 నుంచీ నటించిన పైడి జైరాజే తెలుగు వాళ్ళలో మొట్టమొదటి సినిమా నటుడిగా- మొదటి హీరోగా – మనం గుర్తించి తీరాలి”.  

‘Pollyanna’ (ఒక రకమైన మానవతావాదం) ను నెత్తికెత్తుకునే అమెరికన్ ఉదారవాదపు సినిమాల గురించి పూర్ణచంద్రరావు చేసిన పరిశీలన:   “ఇది ప్రధానంగా ప్రారంభ రోజుల్లో అమెరికాకు తరలి వొచ్చిన పేద తెల్లజాతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆనాటి అమెరికాకి అన్వయించుకున్న క్రిస్టియన్ తత్వం. అంతేగానీ, పేదల పక్షం వహించినంత మాత్రాన దీన్ని అన్ని వర్గాలనీ, అన్ని జాతుల్నీ కలుపుకున్న మానవతావాదంగా భావించాల్సిన పని లేదు…   ఈ సినిమాల గురించి నేనిక్కడ ఊరికినే చెప్పడంలేదు! మన భారతీయ ప్రారంభ చిత్రాల్లో కూడా ఇలాంటి false poverty ని చూపించే చిత్రాలు కోకొల్లలుగా వచ్చాయి! వీటినే మానవతావాద చిత్రాలుగా, చివరికి కమ్యూనిస్టు చిత్రాలుగా కూడా భారతీయ ప్రేక్షకులు భ్రమించారు! అక్కడి ఆ “తెల్ల మానవతా వాదం” తెలిసి చేసిన సంకుచిత వర్గతత్వం! ఇక్కడ గుడ్డిగా మనవాళ్ళు చేసిన కాపీ చిత్రాలన్నీ ఆత్మ వంచనలు!”

మనదేశంలో సినిమాలు మొదలైన దగ్గరనుండీ ఇప్పటికిదాకా కూడా హాలీవుడ్ ప్రభావమే ఎక్కువ. అక్కడి బోలుతనాన్ని, పై పై మెరుగుల్నీ చూసి మురిసి, వాళ్ళ ‘సి’ గ్రేడ్ సినిమాని అనుకరిస్తూ తీసినదాన్ని ఇంకా దిగజార్చి ‘ఎఫ్’ గ్రేడ్ కి చేర్చే ఘనులు మనదగ్గర ఉన్నారు. ఈ సందర్భంలో ‘సెసిల్ బి డిమిల్’ సినిమాల గురించి పూర్ణచంద్రరావు చేసిన వ్యాఖ్యానం చెప్పుకోదగ్గది; “అసలు డిమిల్ తీసిన సినిమాలన్నీ అమెరికన్ లోవర్-మిడిల్ క్లాస్ ప్రజలకు హైక్లాస్ వర్గాల ఫాషన్లు – పోకడలని కాపీ చేయడాన్ని నేర్పించడానికే తీశాడా అన్నట్లుంటాయి… ఇలాంటి సినిమాల్లో బీజ రూపంలో ప్ర్రారంభం అయిన ఈ పోసుకోలుతనం భవిష్యత్తులో కూడా చాలా కాలం కొనసాగింది, అంతే కాకుండా సినిమాకు ఈ పోసుకోలుతనమే ఓ నిర్వచనంగా కూడా మారిపోసాగింది! ఈ కృత్రిమ వేషాల హాలీవుడ్ పోసుకోలుతనం క్రమంగా ప్రపంచం అంతా ఎగుమతయ్యింది… ఇండియాతో సహా! అంతా డిమిల్ పుణ్యమే…!”   నిజమే, ‘జిందగీ నా మిలే దుబారా’, ‘యే జవానీ హై దివానీ’ లాంటి consumerist పోసుకోలు సినిమాలు రెచ్చిపోతున్న ఈ రోజుల్లో డిమిల్ ఆదిపాపాన్ని ఎలా మర్చిపోగలం?

వివరణకు లొంగని సర్రియలిస్ట్ సినిమాలను “అతి” వ్యాఖ్యానానికి పోకుండా, అలాగని మొత్తంగా కొట్టి పారేయకుండా (చాలామంది విమర్శకులు ఈ పనే చేస్తుంటారు) నేర్పుగానే మాటల్లోకి లొంగదీశారు పూర్ణచంద్రరావు. ముఖ్యంగా Bunuel తీసిన “Un Chien Andalou”, ‘ద గోల్డెన్ ఏజ్’ వంటి సినిమాలను.   ‘ద గోల్డెన్ ఏజ్’ సినిమా గురించి … “పెయింటింగ్ సంప్రదాయాన్ని సినిమాకు తర్జుమా చేస్తున్న ఓ ప్రక్రియ ఇది. దీన్ని ఆ terms లోనే అర్థం చేసుకొని వొదిలేయడం మంచిది. అంతకన్నా ఎక్కువగా అర్థం కోసం లాగకూడదు. ఇలాంటి చిత్రాల్ని appreciate చేయడానికి ప్రేక్షకులకు తొందరపాటుతనం కూడదు. చాలా ఓపికతో కూడిన receptive తత్వం కావాలి. … సినిమా కళ కన్నా ముందే బాగా అభివృద్ధి చెందిన “avant-garde” visual arts పట్ల కొద్దిగానన్నా అవగాహన వుండాలి – ఇలాంటి సినిమాల్ని చూడాలంటే!”  

1919 లోనే లెనిన్ రష్యాలో సినిమాని జాతీయం చేశాడు. స్టాలిన్ వచ్చాక సోవియట్ చిత్ర దర్శకులు పడిన పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఈ బాధ సోవియట్ దర్శకులే కాదు టాకీల కాలంలో ఇరానీ దర్శకులూ పడ్డారు. జైళ్లకు కూడా వెళ్ళారు. సోవియట్ దర్శకుల ప్రతిభ ఎంతటిదో వాళ్లకు ప్రభుత్వాధికారులు పెట్టిన ఆంక్షలూ అంతటివే. రష్యన్ అధికారుల బుర్రలేనితనం మీద రచయిత వేసే వ్యంగ్యపు వేటు మహా ఘాటుగా ఉంది.

“సోవియట్ అధికారులకు నచ్చని ఫిల్మ్ మేకర్స్ ని “FEKS” అని నిక్ నేమ్ పెట్టి విమర్శించేవారు. “FEKS” అంటే “The Factory of the Eccentric Actors” అట.”        

“ఎంత స్టాలినిస్ట్ రోజుల్లోనైనా రష్యన్ ఆర్టిస్టులు “అటుబెట్టీ – ఇటుబెట్టీ” అధికారులు చెప్పిన విషయాన్నే తీస్తున్నాం అని మభ్యపెట్టి – ఎలాగోలా తమకి నచ్చిందే తాము చేశారని Meyerhold, Eisenstein, Vertov, Mayakovsky ల్లాంటి వాళ్ళ కళాఖండాల్ని చూస్తే తెలుస్తుంది.”  

“ అఫీషియల్ గా తియ్యమని ఇచ్చిన ప్రాపగండా విషయాన్ని కూడా ఎలా ఆర్టిస్టిగ్గా తీయాలా? అన్న తాపత్రయంతోనే, సోవియట్ దర్శకులందరూ అటూ ఇటూ కాని సినిమాల్ని తీశారు”.  

“ఎందుకిలా ఒకరిని మించి మరొకరు సోవియట్ దర్శకులు formalists (శిల్పానికి ప్రాధాన్యతనిచ్చే దర్శకులు)గా మారిపోతున్నారు? గొప్ప టెక్నికల్ అతిశయం మధ్య, శిల్ప విన్యాసం మధ్య విషయాన్ని ఎందుకు అస్పష్టం చేస్తున్నారు? విషయాన్ని ప్రాపగండా స్థాయికి దిగజార్చే డిమాండ్ ప్రభుత్వం చేస్తున్నంత కాలం, కళాకారులిలా శిల్ప విన్యాసాల వెనుక, విషయంలోని డొల్లతనాన్ని దాచిపెడుతూనే వుంటారు కాబోలు! “

‘విప్లవం, దాని విజయాలు’ అనే ఒకే ఒక్క విషయంతో నలుగురు మేధావులను పదేపదే సినిమాలు తియ్యమంటే వాళ్ళు పడే పాట్లు ఊహించుకోవలసిందే.  వాళ్లకేమో ఓ కొత్త కళారూపంగా సినిమాను దిద్దటంలోనే ఎక్కువ ఆసక్తి. మరోపక్క కళ అంటే తెలియని అధికారులను మెప్పించాలి. ఒక్క కమ్యూనిజమే అని ఏముంది, ఎటువంటి అధికార చట్రాల్లోనైనా కళాకారుడికి ఊపిరాడదు.

మన సినిమాల్లో ప్రతీ కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ మెప్పించటం కోసం అన్నీకలేసి రుబ్బటం మూకీల కాలంనుంచీ ఉంది. దీని ముచ్చట ఇది; “పౌరాణిక చిత్రాల్ని తీస్తున్నప్పుడు వాటికి ఎలాంటి శిల్పం కావాలో దాన్ని అన్వేషించకుండా, ప్రతి పౌరాణిక కథలోనూ, ప్రతి చరిత్రాత్మక కథలోనూ చిటికెడంత బ్రిటిష్ వ్యతిరేక – రాజకీయాంశాన్ని జొప్పించి, ‘కిచిడీ’ చేయడాన్ని ‘దేశభక్తి’గా భావించే రోజులవి. ఏ genre కి ఆ genre cinematic form and its purity ని భారతీయ దర్శక-నిర్మాతలు గౌరవించలేదు; ప్రతి genre లోనూ కొద్దిగా ‘దీన్ని’, కొద్దిగా ‘దాన్నీ’ పడేసి, కలేసి రుబ్బారు!”

మన తెలుగు పౌరాణిక చిత్రాల కళాత్మక విజయాన్ని గురించి కూడా కీలకమైన మౌలికాంశాన్ని పాఠకుల దృష్టికి ఇలా తీసుకొచ్చారు; “ఏ జాతి కథాసంపదైనా కూడా ఆ జాతి సంప్రదాయ గాథల్లోనే ప్రాథమికంగా నిక్షిప్తమై వుంటుంది…. ప్రజా – పౌరాణిక గాథల్ని తమ జాతీయ సంపదగా గుర్తించి జపనీస్, చైనీస్ …. సినిమా దర్శకులు, యూరోపియన్ దేశాల్లో స్కాండినేవియన్లు కూడా తమ తమ ప్రజా – పౌరాణిక గాథల్ని గొప్ప కళాఖండాలుగా తెరకెక్కించారు.  భారతదేశపు ఖర్మ ఏమిటోగానీ – సినిమా ప్రారంభ చరిత్రలో ప్రతి నిర్మాతకీ, దర్శకుడికీ తిండి పెట్టింది ఈ ప్రజా-పౌరాణిక గాథలే అయినా కూడా, వాటికి తగిన ఆధునిక సినిమా శిల్పాన్ని జోడించి ఉన్నత స్థాయి కళాఖండాలుగా రూపొందించే ప్రయత్నం చేయలేదు మనవాళ్ళు! … ఇందుకు ఎక్సెప్షన్ గా భారతదేశం మొత్తంలో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే కొన్ని మంచి, ప్రజా, పౌరాణిక చిత్రాల్ని తీస్తే గీస్తే అవి కేవలం తెలుగువాళ్ళే తీయగలిగారు! కానీ తెలుగుజాతి ఖర్మేమిటోగానీ, ఆ “exceptionally better”పౌరాణిక చిత్రాల్ని వాటి విలువల్ని తెలుగు ఎల్లల్ని దాటి మనం project చేయలేకపోయాం”.

సైలెంట్ సినిమా యుగంలో పెద్దగా ఏమీ సాధించలేకపోయిన భారతీయ సినిమా గురించి ఈ ముగింపు చూడండి… “మన నిశ్శబ్ద చిత్రాలకి ఓ శిల్ప పరిణతి రానేలేదు. గొప్ప భారతీయ సైలెంట్ సినిమాల డిస్కవరీ మాట – దేవుడెరుగు…! ముందు 1930 ల నాటి సైలెంట్ నిర్మాతల ఆలోచనలెలా వున్నాయో చూడండి – 1930 నాటికి ఒక్కో భారతీయ నిశ్శబ్ద సినిమాని 20 వేల రూపాయిల్లో, పది రోజుల్ని మించకుండా లుంగ జుట్టేయొచ్చు! రెండు వారాలాడితే చాలు, పెట్టుబడి పోనూ, కొద్దో గొప్పో లాభం కూడా గారంటీయే! “మరి సౌండ్ సినిమాలొస్తే పూర్తిగా ఎక్విప్మెంట్ ని మార్చేయాల్సి వస్తుందేమో! ఖర్చు ఎలా వుంటుందో! టెక్నికల్ కంట్రోలంతా మన చేతుల్లోనే వుంటుందో – ఇతర్ల చేతిలోకి వెళుతుందో…! అన్నది నిర్మాతల ఆందోళన. సైలెంట్ సినిమాలంటే ఒక భాష అంటూ పరిమితి లేదు. టైటిల్ కార్డ్స్ ఏ భాషలోనైనా కొట్టి, అతికించవచ్చు. అదే టాకీలైతే ఒక భాషకే పరిమితం కావాలి; అంటే ఒక మార్కెట్ కే పరిమితం కావాలి…! “

సినిమా కళ, వ్యాపారం, ఎడిటింగ్, స్క్రిప్ట్, కామెరా, చరిత్ర, సమాజం … దేన్నీ విడిచిపెట్టకుండా లూమియర్ బ్రదర్స్ చూపించిన ‘రైలు స్టేషన్ లోకి రావటం’ అనే మొట్ట మొదటి కదిలే బొమ్మ నుండీ మన దేశంలో టాకీలు వచ్చేంతవరకూ, అంటే 1930 వరకూ వచ్చిన ప్రపంచ సినిమాను తెలుగులో వివరంగా తీసుకురావటానికి ప్రయత్నించిన పూర్ణచంద్రరావు కృషి అభినందనీయం.

Expressionism” అన్న పదాన్ని తొందరపడి తెలుగు చేయకపోవడం మంచిది. మక్కీ కి మక్కీగా కేవలం అర్థాన్ని అనువాదం చేసినంత మాత్రాన ఈ యూరోపియన్ సాంకేతిక పదాల క్లిష్టత మనకు అర్థం కాదు. పైగా అనువాదం చేస్తే తప్పుదారి పట్టే ప్రమాదం కూడా వుంది” అనటం వరకూ రచయిత మాట నిజమే కానీ సులువుగా తెలుగులో రాయగల్గిన చాలా పదాలు కూడా ఆంగ్లంలో దొర్లటం అనవసరం అనిపించింది. అది శైలీవేగాన్ని పెంచినా సరే! ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ భాష పుస్తకం విలువను ఎంతమాత్రం తగ్గించదు. పైగా హింగ్లిష్, తెంగ్లిష్ భాషలకు బాగానే అలవాటు పడిన మనకు చదవటం సులభంగా కూడా ఉంటుంది.

పండు వొలిచి చేతిలో పెట్టినట్టుగా సినిమా జ్ఞానాన్ని అందించిన ఈ పుస్తకంలో చివర్న ఇచ్చిన పది నిశ్శబ్ద కళాఖండాల పట్టిక, చెప్పిన విషయానికి సరితూగి, చాలామంది ఏకీభవించేటట్టు ఉంది. సినిమా ప్రేమికులతో సహా సినిమా రంగంలో ఉన్నవాళ్ళందరూ తప్పనిసరిగా అందుకోదగ్గ ఈ పుస్తకం “ఎమెస్కో” ప్రచురణ.

                                                                                        lalitha parnandi      ల.లి.త.

Download PDF

4 Comments

  • kalluri bhaskaram says:

    మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు లలిత గారూ…అభినందనలు. పైడి జైరాజ్ అనగానే ఒకాయన గుర్తొచ్చారు, “తెలుగు సినిమా తెర మీద తొలి కృష్ణుడిని నేనే’ నంటూ ఆయన ఎనభై దశకంలో నేను పనిచేసే పత్రిక కార్యాలయానికి వచ్చారు. ఆయన మీద సినిమా పేజీలో కాబోలు రాశారు. ఆయనను హైదరాబాద్, దోమల్ గూడా లో చాలాసార్లు చూశాను. ఆయన పేరు కూడా జై తోనే మొదలవుతుందనుకుంటాను. ఆయనా, పైడి జై రాజ్ ఒకరేనా అనే సందేహం కలిగింది మీ పరిచయం చూశాక.

    “ఎందుకిలా ఒకరిని మించి మరొకరు సోవియట్ దర్శకులు formalists (శిల్పానికి ప్రాధాన్యతనిచ్చే దర్శకులు)గా మారిపోతున్నారు? గొప్ప టెక్నికల్ అతిశయం మధ్య, శిల్ప విన్యాసం మధ్య విషయాన్ని ఎందుకు అస్పష్టం చేస్తున్నారు? విషయాన్ని ప్రాపగండా స్థాయికి దిగజార్చే డిమాండ్ ప్రభుత్వం చేస్తున్నంత కాలం, కళాకారులిలా శిల్ప విన్యాసాల వెనుక, విషయంలోని డొల్లతనాన్ని దాచిపెడుతూనే వుంటారు కాబోలు! “

    మీరు కోట్ చేసిన ఈ వ్యాఖ్య కూడా నాకు ఆసక్తిని కలిగించింది. మన ప్రాచీన కావ్యాలలో శిల్ప, రస, అలంకారాల బరువు ఎక్కువైపోయి; వస్తు వైవిధ్యం, వస్తు ప్రాధాన్యం పలచబడిపోవడానికి వస్తువు విషయంలో ఉన్న పరిమితులు, ఆంక్షలు, నిషేధాలు కారణమా అన్న భావన నాలో చాలా కాలంగా ఉంది. సోవియెట్ సినిమా దర్శకుల గురించి పై కోట్ నా భావనను బలపరుస్తోంది. కవిత్వం మార్మికంగా, ధ్వని పూర్వకంగా, శిల్పప్రధానంగా మారి క్రమంగా ఒకానొక నిర్దిష్ట రూపం ధరించడం వెనుక కూడా ఇలాంటి కారణాలు ఉన్నాయా అన్న సందేహం కూడా నాలో చాలా కాలంగా ఉంది.

    • Lalitha P says:

      ధన్యవాదాలు భాస్కరం గారూ,

      కరీంనగర్ కు చెందిన జైరాజ్, భాషతో సంబంధం లేని సైలెంట్ సినిమాల్లో నటించిన మొదటి తెలుగు నటుడే కానీ తెలుగు టాకీ సినిమాల్లో నటించినట్టుగా ఎక్కడా లేదు.

      స్టాలిన్ కాలం కాబట్టి ఉక్కు తెరల మధ్య వాళ్ళు సినిమా తీశారు. అదీ కాక సినిమాకు శిల్పాన్ని సమకూర్చుకునే దశ అది. ఆ భారం ఆ తెలివైన దర్శకుల మీద ఉంది. మొదట రూపం ఏర్పడితే కదా వస్తువు సంగతి. మన ప్రాచీన సాహిత్యానికి ఇటువంటి భారం లేదనిపిస్తుంది. ప్రజల్లో తిరిగిన కవులు ఎవరూ ప్రజల కథల్ని విస్మరించలేదు. రాజాస్థానాలలో ఉండేవారు రాజుల కోసమే అలంకార, రసవిన్యాసాలు చేసేవారు. అందుకే వారి వస్తుపరిధి అంతవరకే ఉండి పోయేదేమో! కడుపు నిండిన బేరమే గానీ రాజుల ఆంక్షల వల్లే రాయలేకపోయారని పూర్తిగా అనుకోలేము. మనకు తిట్టు కవిత్వానికీ తక్కువేం లేదు. అలాగే మన అలంకార శాస్త్రాలు సామాన్యమైనవి కాదుకదా. సాహిత్యపు పరిపూర్ణత ముందు సైలెంట్ సినిమా పసిబిడ్డ. అయినా ఆ మహా దర్శకుల కృషి వల్ల ఒక్కసారిగా ఎదిగిపోయింది.

      ‘భారత్ ఏక్ ఖోజ్’ మార్క్సిస్ట్ పరిశీలన కాపాలిక, బౌద్ధ జైనాల హీనదశను పరిహసించే ఆరో శతాబ్దపు ‘మత్త విలాస’ ప్రహసనాన్ని మనకు పరిచయం చేస్తే, మార్క్సిస్ట్ లు తీసిపారేసిన ప్రబంధాల విలువను వెల్చేరు, షుల్మన్ లు వెలికి తీస్తున్నారు. వీరి పరిశ్రమలో మీరు అనుకుంటున్న పాయింట్ ఏమైనా దొరుకుతుందేమో. సరైన మార్క్సిస్ట్ పరిశీలనకు మంచి అనువైన కాలమిది.

  • naresh says:

    Looks like the book is an erudite & exhaustive study of the films, directors and trends in the era of silent cinema and going by this equally insightful review ,it could be that one-of-a-kind ,definitive books to have come in Telugu .

    Among international films,most readers would relate to Charlie Chaplin and his films and a few to Cecil B. DeMille who is famous for “The Ten Commandments”.

    The author seems to be quite critical of Indian films , perhaps justifiably so! But V.Shantaram may be the one great director who made few silent films…….

    • Lalitha P says:

      శాంతారాం కంటే బాబూరావు పెయింటర్ (సావ్ కారి పాష్) సైలెంట్ ఫిల్మ్స్ లో ఎక్కువ సృజనాత్మకత ఉన్న వ్యక్తిగా పేరు పొందాడు. సాధారణంగా మూకీల నాటికి ఎవరు తీసినా మన సినిమాలకి గొప్ప క్రెడిట్స్ లేవు. కెమెరా ఉపయోగించి స్టేజి నాటకాలు తీస్తున్నట్టే! అలాగే మనకు మిగిలిన ఫిల్మ్ ముక్కలూ తక్కువే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)