దమయంతి ఆడిన ‘మైండ్ గేమ్’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతుల కథ ఇదీ…

దమయంతి గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక హంసల గుంపు ఎగురుతూ వచ్చి అతని ముందు వాలింది. వాటిలో ఒక హంసను అతను పట్టుకున్నాడు. ‘నన్ను విడిచిపెడితే నీ గుణగణాలను దమయంతికి చెప్పి నీ మీదే ఆమెకు ప్రేమ కలిగేలా చేస్తా’నని హంస అంది. నలుడు దానిని విడిచి పెట్టాడు.

గుంపుతో కలసి హంస విదర్భపురానికి వెళ్ళి ఉద్యానవనంలో చెలికత్తెలతోపాటు విహరిస్తున్న దమయంతి ముందు వాలి, కావాలని ఆమె చేతికి చిక్కింది. ‘నీ ప్రియతముడైన నలుడి దగ్గరనుంచి వచ్చాను. నేను ఎంతోమంది రాజుల్ని చూశాను. సకలగుణసౌందర్యంలో నలుడికి ఎవరూ సాటి రారు. నువ్వు నారీరత్నం, అతను పురుషరత్నం. మీ కలయిక ఇద్దరికీ మరింత శోభనిస్తుంది’ అంది.

దమయంతి సంతోషించింది. ‘నలుడి గురించి నాకు చెప్పినట్టే, నా గురించి కూడా నలుడికి చెప్పవా’ అని ప్రార్థించింది. హంస మళ్ళీ నలుడి దగ్గరకు వెళ్ళి దమయంతి గుణ రూపాలను వర్ణించి చెప్పింది. అప్పటినుంచీ ఇద్దరిలోనూ పరస్పర అనురక్తి పెరిగిపోయింది. ఎంతసేపూ నలుడి తలపులతోనే గడుపుతూ దమయంతి నిద్రాహారాలకు దూరమై శుష్కించింది. చెలికత్తెలు భయపడి ఆమె తండ్రి భీముడికి ఈ విషయం చెప్పారు. నలుని ఎలా రప్పించాలా అని ఆలోచించి అతను కూతురికి స్వయంవరం చాటించాడు.

రాజులందరూ ఆ స్వయంవరానికి బయలుదేరి వెళ్లారు. అలాగే నలుడూ బయలుదేరాడు. ‘యుద్ధంలో వీరమరణం చెంది స్వర్గానికి వచ్చి సకల సుఖాలూ అనుభవించడం రాజులకు పరిపాటి కదా, ఇప్పుడు ఎందుకు రావడం లే’దని ఇంద్రుడికి అనుమానం వచ్చింది. నారదుని కారణం అడిగాడు.  ‘అతిలోక సుందరి అయిన దమయంతికి స్వయంవరం జరుగుతోంది, రాజులందరూ పరస్పర కలహాలు విడిచిపెట్టి, స్వయంవరానికి వెడుతున్నారు. అందుకే స్వర్గానికి రావడం లే’దని నారదుడు చెప్పాడు.

దాంతో ఆ స్వయంవరాన్ని చూడాలని ఇంద్రుడు కూడా వేడుక పడ్డాడు. అగ్ని, యమ, వరుణులతో కలసి భూలోకానికి వచ్చాడు. వారికి నలుడు కనిపించాడు. ‘మా తరపున దూతగా వెళ్ళి, మేము చెప్పినట్టు చేస్తావా?’ అని ఇంద్రుడు అతన్ని అడిగాడు. ‘తప్పకుండా! ఏం చేయమంటారో చెప్పండి’ అని నలుడు అన్నాడు. ‘దమయంతి దగ్గరకు వెళ్ళి మాలో ఒకరిని వరించమని చెప్పా’ లని ఇంద్రుడు అన్నాడు. నలుడు విస్తుపోయాడు. ‘నేను కూడా అందుకే వెడుతున్నాను. మీకు ఆ సంగతి తెలిసీ ఇలా కోరడం న్యాయమా?’అన్నాడు. ‘నువ్వు ఇచ్చిన మాట తప్పవని తెలిసి ఈ కోరిక కోరాం. ఇది దేవతలకు ఇష్టమైన కార్యం, కాదనకుండా చేసిపెట్టు. నేరుగా రాజగృహంలోకి ఎలా వెడతాననే సందేహం పెట్టుకోకు. నిన్ను ఎవరూ అడ్డుకోరు’ అన్నాడు ఇంద్రుడు.

చేసేది లేక నలుడు దమయంతి మందిరానికి చేరుకున్నాడు. అతణ్ణి చూసి చెలికత్తెలు అదిరిపడి, ఇతడెవరా అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. నలుడు తనను దమయంతికి పరిచయం చేసుకుని,’ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవులు నన్ను నీ దగ్గరకు దూతగా పంపించారు. తమలో ఒకరిని పెళ్ళాడి, తమ అందరికీ సంతోషం కలిగించమని చెప్పమన్నారు’ అన్నాడు.

ఆ మాట వినగానే దమయంతి దుఃఖంతో కుప్పకూలింది. ‘నేనెక్కడ…ఇంద్రాది దేవతలెక్కడ? నేనెప్పుడూ వాళ్ళకు మొక్కుతూ ఉంటాను. నేను నీ ధనాన్ని. నీ కోసమే స్వయంవరం పేరుతో రాజులందరినీ ఇక్కడికి రప్పించాను. నువ్వే నా భర్తవు. నువ్వు ఒప్పుకోకపోతే ఉరేసుకునో, విషం తాగో, అగ్నిలో దూకో ఆత్మహత్య చేసుకుంటాను’ అంది.

‘మహాశక్తిమంతులు, లోకపాలకులు, సంపన్నులు, తేజస్వులు అయిన దేవతలను కాదని; వారి పాదధూళిపాటి కూడా చేయని నా లాంటి మనుష్యుని కోరుకుంటావా? దేవతల ఇష్టం తీర్చకపోతే మనుషులు అధోగతి చెందుతారు. కనుక వారికి ఇష్టం కలిగించి నన్ను కాపాడు’ అని నలుడు అన్నాడు.

దమయంతి చెక్కిళ్లపై కన్నీరు ధారలు కట్టింది. చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయి, ఆ తర్వాత, ‘నీకు ఆడి తప్పిన దోషం కలగని ఒక ఉపాయం తట్టింది. ఇంద్రాదులు స్వయంవరానికి వస్తే, వాళ్ళ ఎదుటే నిన్ను వరిస్తాను’అంది. నలుడు ఇంద్రాదుల దగ్గరకు వెళ్ళి దమయంతి అన్న మాటలు చెప్పాడు.

‘నలుని తప్ప ఇంకొకరిని వరించదట! ఎలా వరించదో చూద్దాం’ అని ఇంద్రాదులు నలుగురూ అనుకుని నలుని రూపంలోనే స్వయంవరానికి వెళ్లారు. ఎదురుగా అయిదుగురు నలులు ఉండడంతో, అసలు నలుని ఎలా గుర్తించాలో తోచని దమయంతి, మీరే మీ నిజరూపాలను ధరించి నలుని గుర్తించేలా చేయండని దేవతలను ప్రార్థించింది. దాంతో, రెప్పపాటులేని కళ్ళతో, చెమట లేని దేహాలతో, భూమిని అంటని పాదాలతో నలుగురూ ఆమెకు కనిపించారు. ఆమె అసలు నలుని మెడలో దండ వేసింది.

ఇద్దరికీ వివాహం జరిగిపోయింది.

***

ఇంద్రాదులు తిరిగి దేవలోకానికి బయలుదేరారు. దారిలో వారికి కలి ఎదురయ్యాడు. ఎక్కడికి వెడుతున్నావని ఇంద్రాదులు అడిగారు. ‘దమయంతి స్వయంవరానికి’ అని కలి చెప్పాడు. ‘ఇంకెక్కడి స్వయంవరం? అది అయిపోయింది. దమయంతి నలుడనే వాడిని వరించిం’దని వారు చెప్పారు. దాంతో కలికి నలుడి మీద కోపం వచ్చింది. అతన్ని రాజ్యభ్రష్టుని చేయడానికీ, ఆ దంపతులకు వియోగం కల్పించడానికీ నిర్ణయించుకున్నాడు. నలుడు ద్యూతప్రియుడనే సంగతి తెలిసి అతని పాచికలలోకి ప్రవేశించమని ద్వాపరం అనే తన బంటును నియోగించాడు. తను నలునిలో ప్రవేశించాలని చూశాడు కానీ, నలుడు యాగాలు మొదలైన పుణ్యకర్మలు చేసినవాడు కావడంతో అది సాధ్యం కాలేదు. అదను కోసం కలి నిరీక్షిస్తుండగా, ఒక రోజున నలుడు మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మరచిపోయి సంధ్యావందనానికి ఉపక్రమించడంతో ఇదే అదను అనుకుని కలి అతనిలో ప్రవేశించాడు. ఆ తర్వాత పుష్కరుడు అనే వాడి దగ్గరకు వెళ్ళి, ‘నువ్వు నలుడితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలుచుకో’ అని చెప్పాడు. అతనికి సహాయకుడిగా వృషుడు అనే వాడిని ఇచ్చి, పాచికలు తీసుకుని తను కూడా పుష్కరునితో కలసి నలుడు దగ్గరికి వెళ్ళి తమతో జూదమాడమని ఆహ్వానించాడు.

కొన్నేళ్లపాటు నలుడు జూదానికి బానిసై చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ లోపల అతనికి ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనే కూతురు కలిగారు. దమయంతి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపేసి తను నలుడితో ఉండిపోయింది. ఇద్దరూ కట్టుబట్టలతో మిగిలి రాజధానిని విడిచిపెట్టారు. మంచినీళ్ళతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఒక రోజు తన ఎదురుగా బంగారు రెక్కలతో తిరుగుతున్న కొన్ని పక్షులను చూసి, వాటిని పట్టి ఆకలి తీర్చుకోవచ్చు ననుకుని తన కట్టుబట్టను నలుడు వాటిపై విసిరాడు. అవి బట్టతో సహా ఎగిరిపోయి, ‘నీ రాజ్యాన్ని, ధనాన్ని హరించిన పాచికలమే మేము. నీ వస్త్రాన్ని కూడా అపహరించడానికి ఇలా పక్షి రూపంలో వచ్చా’మని చెప్పాయి.

నలుడు దమయంతి చీరచెరగును తనకు చుట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. ఇద్దరూ ఒకే వస్త్రంతో అడవి దారి పట్టారు. ఆకలి, దాహాలకు తోడు; నడిచి నడిచి అలసిపోయిన దమయంతి ఒకచోట ఆదమరచి నిద్రపోతున్న సమయంలో నలుడు తను కట్టుకున్న చీర భాగాన్ని తెంచుకుని ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నిద్రలేచి భర్తను వెతుక్కుంటూ వెడుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఒక కిరాతుడు కొండచిలువను చంపి ఆమెను కాపాడాడు. ఆ తర్వాత అతను తన పొందు కోరేసరికి ఆగ్రహించిన దమయంతి అతన్ని చావమని శపించగా అతను చచ్చి పడిపోయాడు. ఆమె భర్తను వెతుక్కుంటూ ఒక మునిపల్లె చేరుకుంది. అక్కడి మునులు, ‘నీ భర్త కనిపిస్తాడు. కష్టాల నుంచి గట్టెక్కుతారు’ అని ఆమెకు భవిష్యత్తు చెప్పి అదృశ్యమయ్యారు. దమయంతి ముందుకు వెడుతుండగా ఒక వ్యాపారుల బృందం కనిపించింది. వారు సుబాహు అనే రాజు నగరానికి వెడుతున్నామని చెప్పగా ఆమె వారి వెంట వెళ్లింది. వ్యాపారులు దారిలో ఒక చోట నిద్రపోతుండగా ఒక మదపు టేనుగు వారిలో కొందరిని తొక్కి చంపేసింది. మిగిలినవారితో కలసి దమయంతి చివరికి సుబాహు నగరానికి చేరుకుంది. రాజమాత ఆమెను చూసి, దాదిని పంపి తన దగ్గరకు పిలిపించుకుని వివరాలు అడిగింది. దమయంతి భర్తకు దూరమయ్యానని మాత్రం చెప్పి సైరంధ్రీ వ్రతంలో ఉన్నా నంది. ‘బ్రాహ్మణులను పంపి నీ భర్తను వెతికిస్తాను. నువ్వు నా దగ్గర ఉండు’ అని రాజమాత అంది. దమయంతి ఒప్పుకుంది.

untitled

***

నలుడు దారుణ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక రోజున అడవి అంటుకుని ఆకాశానికి అంటేలా మంటలు లేచాయి. ఒక నాగకుమారుడు ఆ మంటల్లో చిక్కుకుని చేస్తున్న ఆర్తనాదాలు నలునికి వినిపించాయి. అతను వెంటనే మంటల మధ్యలోకి వెళ్ళి నాగకుమారుణ్ణి రక్షించాడు. తన పేరు కర్కోటకుడనీ, ఒక ఋషి శాపం వల్ల కదలలేననీ, తనను ఎత్తుకుని ఒక సరోవరం తీరంలో విడిచిపెట్టవలసిందని అతను కోరాడు. నలుడు అలాగే చేశాడు. అప్పుడు కర్కోటకుడు అతన్ని కాటేశాడు. దాంతో నలుడు పాత రూపం కోల్పోయి వికృతరూపిగా మారిపోయాడు. ‘నీ మంచి కోసమే నేను ఇలా చేశాను. నీ శరీరంలో నా విషం ఉన్నంతకాలం నీకు ఎవరి వల్లా ప్రాణహాని ఉండదు. నీకు యుద్ధాలలో విజయమూ, భార్యతో కలయికా, రాజ్యవైభవమూ కలుగుతాయి. నీ నిజరూపాన్ని ఎప్పుడు పొందాలనుకుంటే అప్పుడు నన్ను తలచుకో. నువ్వు పోగొట్టుకున్న వస్త్రం నీ దగ్గరకు వస్తుంది, దానిని ధరించగానే నీ నిజరూపం వస్తుంది. అయోధ్యా నగరంలో ఇక్ష్వాకువంశస్థుడైన ఋతుపర్ణుడనే రాజు ఉన్నాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి అతనికి నీకు తెలిసిన అశ్వహృదయ మనే విద్యను ఇచ్చి అతని దగ్గరనుంచి అక్షహృదయ మనే విద్య తీసుకో. బాహుకుడు అనే పేరుతో అతని దగ్గర వంటవాడిగా ఉండు’ అని కర్కోటకుడు చెప్పి అదృశ్యమయ్యాడు.

నలుడు ఋతుపర్ణుని కలసుకుని, తను అశ్వశిక్షలోనూ, వంటలోనూ నేర్పరిననీ, నీ కొలువులో చేర్చుకోవలసిందనీ కోరాడు. ఋతుపర్ణుడు అంగీకరించి అతన్ని అశ్వాధ్యక్షుడిగా నియమించి, వార్ష్ణేయుడు, జీవలుడు అనే ఇద్దరిని అతనికి సహాయకులుగా ఇచ్చాడు.

***

నలుడు రాజ్యం కోల్పోయిన సంగతి విదర్భరాజు భీముడికి తెలిసింది. కూతురు, అల్లుడు ఏమైపోయారో నని అతను దుఃఖిస్తూ వారిని వెతకడానికి అన్ని చోట్లకూ బ్రాహ్మణులను పంపించాడు. నలదమయంతుల ఆచూకీ చెప్పినవారికి వేయి గద్యాణాలు, వారిని వెంటబెట్టుకుని వచ్చినవారికి వేయి గోవులు, అగ్రహారాలు ఇస్తానని ప్రకటించాడు.

భీముడు పంపిన బ్రాహ్మణులలో ఒకడైన సుదేవుడు సుబాహుపురం చేరుకుని రాజగృహాన్ని సందర్శించి అక్కడున్న దమయంతిని చూశాడు. ఆమెను ఏకాంతంగా కలసుకుని తను వచ్చిన పని చెప్పాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన రాజమాతకు దమయంతి విదర్భరాజు కూతురన్న సంగతి తెలిసింది. ఆమె సంతోషంతో దమయంతిని కౌగలించుకుని ‘నీ తల్లి, నేను అక్కచెల్లెళ్లమే’ నని చెప్పింది. ఆమె దగ్గర సెలవు తీసుకుని సుదేవునితో కలసి దమయంతి పుట్టింటికి వెళ్లింది.

ఈసారి భీముడు నలుని వెతకడానికి బ్రాహ్మణులను నియోగించాడు. ‘నలుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా అజ్ఞాతంగా ఉంటాడు కనుక, భార్యను ఏమాత్రం కనికరం లేకుండా విడిచిపెట్టి వెళ్ళడం న్యాయమా అని మీరు వెళ్ళిన ప్రతి చోటా సభలలో ప్రశ్నించండి. దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చు’ నని దమయంతి బ్రాహ్మణులకు చెప్పింది.

ఋతుపర్ణుని సభకు వెళ్ళి వచ్చిన పర్ణాదు డనే బ్రాహ్మణుడు, అతని కొలువులో నూరు గద్యాణాలకు పనిచేస్తున్న బాహుకుడు అనే ఒక వికృతరూపుడు తన ప్రశ్నకు సమాధానం చెప్పాడని దమయంతికి చెప్పాడు. అతడే నలుడు అయుంటాడని భావించిన దమయంతి ఈసారి సుదేవుని పిలిపించి, తనకు రేపో, ఎల్లుండో పునస్స్వయంవరం జరగబోతున్నట్టు ఋతుపర్ణునికి చెప్పమని పంపించింది.

***

ఋతుపర్ణుడు ఆ స్వయంవరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డాడు. వార్ష్ణేయుని వెంటబెట్టుకుని బాహుకుడు రథచోదకుడుగా విదర్భపురానికి బయలుదేరాడు. వాయువేగంతో రథం తోలుతున్న బాహుకుని నేర్పుకు ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతుండగా అతని ఉత్తరీయం జారిపడిపోయింది. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తెస్తాడనీ, వేగం తగ్గించమనీ బాహుకునితో అన్నాడు. ‘ఇంకెక్కడి ఉత్తరీయం? అది పడిన చోటునుంచి వందమైళ్ళ దూరం వచ్చేశా’మని బాహుకుడు చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు, ‘అందరికీ అన్ని విద్యలూ తెలియకపోయినా ప్రతివారికీ ఏదో ఒక విద్యలో నేర్పు ఉంటుంది. నేను వస్తువుల గుంపును ఒకసారి చూస్తే చాలు వాటి సంఖ్య చెప్పేస్తాను. కావాలంటే ఆ చెట్టు చూడు. దానికి ఆకులు, పండ్లు ఎన్నున్నాయో చెబుతాను. రెండు కొమ్మలకు పదివేల ఒకటి ఉంటే, మిగిలిన కొమ్మలకు రెండువేల తొంభయ్యే ఉన్నాయి’ అన్నాడు. ‘అయితే లెక్కపెట్టవలసిందే’ నంటూ బాహుకుడు రథం ఆపి దిగి, ఆ చెట్టును కూలదోసి లెక్కపెట్టాడు. సరిగ్గా ఋతుపర్ణుడు చెప్పినన్నే ఉన్నాయి. ఆశ్చర్యపోయిన బాహుకుడు ఆ విద్యను తనకు ఉపదేశించమని కోరాడు. దీనిని అక్షహృదయం అంటారని చెప్పి ఋతుపర్ణుడు అతనికి ఉపదేశించాడు. సంతోషించిన బాహుకుడు, ‘నీకు అశ్వహృదయం అనే నా విద్యను ఉపదేశిస్తాను, స్వీకరించు’ అన్నాడు. ‘ప్రస్తుతానికి నీ దగ్గరే ఉంచుకో. నేను కావలసినప్పుడు స్వీకరిస్తాను.’ అని ఋతుపర్ణుడు అన్నాడు.

అక్షహృదయం పొందగానే కలి అతన్ని విడిచిపెట్టేశాడు. వికృతరూపం తప్ప మిగిలిన దోషాలు అన్నీ తొలగిపోయాయి. రథం విదర్భపురంలోకి ప్రవేశించింది. రథం చప్పుడు వినగానే దమయంతికి అది నలుని రథధ్వనిలా అనిపించింది. తీరాచూస్తే నలుడు కనిపించలేదు. దాంతో నిరాశ చెందింది. భీముడు ఋతుపర్ణునికి తగిన విడిది ఏర్పాటుచేశాడు. పురంలో ఎక్కడా స్వయంవరం మాటే వినిపించకపోవడం, మిగతా రాజులెవరూ కనిపించకపోవడం చూసి ఋతుపర్ణుడు అనుమానపడ్డాడు. ‘దమయంతి ఇంకొకరిని పెళ్లాడే అధర్మానికి పాల్పడుతుందని తను ఎలా అనుకున్నాడు, స్వయంవరం అనగానే తగుదునమ్మా అనుకుంటూ ఎలావచ్చాడు’ అనుకుంటూ సిగ్గుపడ్డాడు.

ఋతుపర్ణుడు అయోధ్యరాజనీ, వార్ష్ణేయుడు సూతపుత్రుడనీ తెలిసింది కనుక మూడో వ్యక్తి అయిన బాహుకుడు ఎవరో తెలుసుకుని రమ్మని కేశిని అనే పరిచారికను దమయంతి పంపించింది. రథశాల దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న బాహుకుని దగ్గరకు కేశిని వెళ్ళి, ‘ఇక్కడికి ఏ పని మీద వచ్చావు, మీతో ఉన్న మూడో వ్యక్తి ఎవరు?’ అని అడిగింది. బాహుకుడు వచ్చిన కారణం చెప్పి, మూడో వ్యక్తి వార్ష్ణేయుడనీ, నలునికి రథచోదకుడిగా ఉండేవాడనీ చెప్పాడు.

దమయంతిని కలిసి బాహుకుని మాటలూ, ఆకారం గురించి కేశిని చెప్పింది. అతడే నలుడని దమయంతికి అనుమానం కలిగింది. ‘అతను ఋతుపర్ణుని వంటలవాడట కదా…అతని వంట గురించి తెలుసుకుని రా’ అని దమయంతి మళ్ళీ కేశినిని అతని దగ్గరికి పంపింది. కేశిని వెళ్ళి వచ్చి ‘అతని గురించి ఏం చెప్పను? అతను మామూలు మనిషి కాదు. అలాంటివాడిని ఇంతవరకు చూడలేదు, వినలేదు. నిజంగా అతన్ని దేవుడు అనచ్చు’ అంటూ అతను వంట చేయడంలో ఎన్ని మహిమలు ప్రదర్శిస్తాడో వర్ణించి చెప్పింది. దాంతో అతని వంటకాలు కొన్ని తీసుకురమ్మని దమయంతి మళ్ళీ కేశినిని పంపింది. కేశిని తెచ్చి ఇవ్వగానే వాటిని రుచి చూసిన దమయంతికి అతడు నలుడే నని మరింత గట్టిగా అనిపించింది. ఈసారి కొడుకునీ, కూతురునీ ఇచ్చి కేశినిని బాహుకుడి దగ్గరికి పంపించింది. వాళ్ళను చూడగానే కంట తడిపెట్టుకుంటూ బాహుకుడు తన ఒళ్ళో కూర్చొబెట్టుకున్నాడు. అంతలోనే జాగ్రత్తపడుతూ ‘వీళ్ళను చూడగానే నా పిల్లలు గుర్తొచ్చారు’ అని కేశినికి చెప్పి, ‘నువ్విలా మాటి మాటికీ రావడం బాగుండదు, ఇక రావద్దు’ అన్నాడు. ఇది తెలిసి, అతడు నలుడే నని పూర్తిగా నిర్ధారణకు వచ్చిన దమయంతి తండ్రికి చెప్పి అతన్ని తనవద్దకు రప్పించింది.

బాహుకుడు దమయంతిని కలిశాడు. తనకు పునస్స్వయంవరం అన్న సంగతిని ఋతుపర్ణుడు ఒక్కడికే తెలియబరిచారనీ, అది నలుని విదర్భకు రప్పించడానికి మాత్రమె నని దమయంతి మాటల ద్వారా అతనికి తెలిసింది. దాంతో అతను కర్కోటకుడిని తలచుకోవడం, పక్షులు అపహరించిన అతని వస్త్రం తిరిగి అతని దగ్గరికి రావడం, అతను దానిని ధరించాగానే నలుని రూపంలోకి మారిపోవడం వెంటనే జరిగిపోయాయి.

దంపతులు ఇద్దరూ తిరిగి ఒక్కటయ్యారు.

నలుడు అక్కడినుంచి నిషధపురానికి వెళ్లి పుష్కరుని కలిశాడు. ‘నా రాజ్యాన్ని గెలుచుకోడానికి వచ్చాను. నాతొ యుద్ధమైనా చెయ్యి. జూదమైనా ఆడు’ అని అతణ్ణి ఆహ్వానించాడు. పుష్కరుడు జూదానికే మొగ్గు చూపించాడు. అందులో అతడు నలుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నలుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

***

ఈ కథను ఇంకా క్లుప్తం చేసి చెప్పచ్చు కానీ, కొన్ని కారణాల వల్ల ఈమాత్రం వివరంగా చెప్పవలసివచ్చింది. నలుని గుర్తించి, రప్పించడానికి దమయంతి చేసిన ప్రయత్నాలు; బాహుకుడే నలుడా అన్నది నిర్ధారించుకోడానికి అతనితో ఆడిన ‘మైండ్ గేమ్’ —ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథనరీతిని పట్టి చూపి, పురాణ కథలకు భిన్నంగా తోపిస్తాయి. అంతకంటే విశేషం, ఒక గ్రీకుపురాణకథతో ఈ కథకు పోలికలు ఉండడం!

దాని గురించి తర్వాత….

 -కల్లూరి భాస్కరం

Download PDF

3 Comments

 • buchireddy gangula says:

  చందమామ — కథలా ?????????????

  ఎంతకాలం రాజుల కథలు —- దొరల కథలు ???

  ————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 • siva nageswararao says:

  చాల బాగుంది ఎప్పుడో చిన్నప్పుడు చందమామ లో అనుకుంటాను చదివాను మళ్ళి ఇప్పుడు

 • Deepak says:

  కథ చాల బాగుంది భాస్కర్ గారు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)