పెద్రో పారమొ చివరి భాగం

pedro1-1

పేద్రో పారమొ మెదియా లూనా పెద్ద తలుపు దగ్గర పాత కుర్చీలో కూచున్నాడు. రాత్రి ఆఖరి నీడలు తప్పుకుంటున్నాయి. అతనట్లాగే ఒంటరిగా మూడు గంటలనుండీ ఉన్నాడు. అతను నిద్ర పోవడం లేదు. నిద్ర అంటే ఏమిటో, సమయమంటే ఏమిటో అతను మరిచిపోయాడు. “మేం ముసలివాళ్లం అంతగా నిద్ర పోం. దాదాపుగా ఎప్పుడూ. కునికిపాట్లు పడ్డా మెదడు పని చేస్తూనే ఉంటుంది. నాకు చేయడానికి అదే మిగిలింది.” ఆగి పెద్దగా అన్నాడు. “ఎంతో కాలం పట్టదు. ఇంక ఎంతో కాలం పట్టదు.”
ఇంకా కొనసాగించాడు. “నువ్వెళ్ళి చాలా కాలమయింది సుజానా. ఇప్పటి వెలుతురు అప్పటిలాగానే ఉంది, అంత ఎర్రగా కాదు కానీ అంతే పేలవంగా. మంచు ముసుగు వెనక ఉన్నట్టు. ఇప్పటిలాగే. ఇదే సమయం. నేనిక్కడే వాకిలి పక్కనే కూచుని సంజెని చూస్తూ ఉన్నాను. ఈ దారి వెంటే స్వర్గానికి, ఆకాశం వెలిగే చోటికి నన్నొదిలి వెళ్లడం చూస్తూ ఉన్నాను. ఈ నేల చీకట్లలో మరింత అస్పష్టంగా మారిపోతూంది.
“నిన్ను చూడడం అదే ఆఖరి సారి. నువు వెళుతూ దారి పక్క పారడైజ్ చెట్టు కొమ్మల్ని రాసుకుంటూ పోయావు వాటి చివరి ఆకుల్నీ రాల్చేస్తూ. ఆపై మాయమయిపోయావు. నేను నీవెనకే నిన్ను పిలిచాను. ‘తిరిగి రా సుజానా!’
పేద్రో పారమొ పెదాలు కదులుతూ ఉన్నాయి, అవే మాటల్ని గుసగుసలాడుతున్నట్టు. పెదాలు బిగబట్టి కళ్ళు తెరిచి చూశాడు. పాలిపోయిన సంజె ఆ కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉంది.
రోజు మొదలయింది.

దోన ఇనెస్ అదే సమయంలో తన కొడుకు గలాంలియెల్ వియాపండో షాపు ముందు ఊడుస్తూంది. అబుందియో మార్టినెజ్ సగం తెరిచిన తలుపు తీసుకుని లోపలికి వెళ్లడం చూసింది. ఈగలు వాలకుండా మొహమ్మీద సొంబ్రేరో (మెక్సికన్ టొపీ) పెట్టుకుని కౌంటర్ మీద నిద్రపోతూ కనిపించాడు గలాంలియెల్ అతనికి. అబుండదియో అతను లేస్తాడని కాసేపు చూశాడు. దోనా ఇనెస్ బయట ఊడ్చే పని అయ్యాక లోపలికి వచ్చి తన కొడుకు డొక్కల్లో చీపురుతో పొడిచిందాకా ఆగాడు.
“నీ కోసం కస్టమర్ వచ్చారు లే!”
గలాంలియెల్ చిరచిరలాడుతూ, గుర్రు మంటూ లేచి కూచున్నాడు. రాత్రి తాగుబోతులకు సర్వ్ చేస్తూ, నిజానికి వాళ్లతో తాగుతూ బాగా పొద్దుపోయి పడుకోవడం వలన కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. ఇప్పుడు కౌంటర్ మీద కూచుని తన తల్లిని తిట్టాడు, తననూ తిట్టుకున్నాడు, అంతటితో ఆగకుండా బతుకునూ తిట్టాడు పెంటకి కూడా కొరగానిదని. చేతులు కాళ్ళ మధ్య పెట్టుకుని అట్లాగే వెనక్కి వొరిగి పడుకుని పోయాడు. తిట్లు గొణుక్కుంటూనే నిద్రలోకి జారిపోయాడు.
“ఈ వేళప్పుడూ ఈ తాగుబోతులు వస్తే నా తప్పు కాదు.”
“పాపం వాణ్ణి క్షమించు అబుందియో. పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా ఎవరో ప్రయాణికులు వస్తే వాళ్లకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. తాగిన కొద్దీ గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంత పొద్దున్నే వచ్చావేమిటి?”
అబుందియోకి సరిగా వినపడదు కనుక ఆమె పెద్దగా అరుస్తూ చెపుతూంది.
‘ఏం లేదు, ఒక లిక్కర్ సీసా కావాలి.”
“రెఫ్యూజియో మళ్ళీ మూర్ఛ పోయిందా?”
“లేదు, చచ్చిపోయింది విల్యా అమ్మా! రాత్రే, పదకొండయిందో యేమో. నేను పోయి నా కంచర గాడిదల్ని అమ్మాక. దానికి వైద్యం కోసమని ఖర్చులకోసం వాటిని కూడా అమ్మాను.”
“నువు చెప్పేదేమిటో నాకు వినపడటం లేదు. ఏమంటున్నావు? ఏం చెప్తున్నావు నాకు?”
“రాత్రంతా నా భార్య రెఫ్యూజియో శవ జాగరణ చేశాను. ఆమె ప్రాణం రాత్రే పోయింది.”
“చావు వాసన వస్తూందని నాకు తెలిసింది. గలాంలియెల్ కి అదే చెప్పాను ‘ఎవరో చనిపోయారని నాకనిపిస్తుంది. నాకు ఆ వాసన వస్తుంది,’ వాడు నా మాట పట్టించుకోలేదు. ఆ కస్టమర్లతో స్నేహంగా కలిసిపోవాలని తనూ తాగాడు పిచ్చి వెధవ. నీకు తెలుసుగా అటువంటప్పుడు వాడు ఎట్లా మారిపోతాడో! అన్నీ తమాషాగా ఉంటాయి వాడికి. దేన్నీ పట్టించుకోడు. సర్లే, దినానికి ఎవరినయినా పిలిచావా?”
“లేదు విల్యా అమ్మా. అందుకే నాకు లిక్కర్ కావాలి, నా బాధ మర్చిపోవడానికి.”
“స్ట్రెయిటా?”
“అవును విల్యా అమ్మా. తొందరగా నిషా ఎక్కాలి. ఇప్పుడే ఇవ్వు. నాకిప్పుడే కావాలి.”
“నువ్వు కాబట్టి ఒక పైంట్ ధరకే రెండు పైంట్లు ఇస్తున్నా. తన గురించి ఎప్పుడూ మంచిగా తల్చుకునేదాన్నని చనిపోయిన మీ ఆవిడకి చెప్పు. పైకి వెళ్ళాక నన్ను గుర్తుంచుకోమని చెప్పు.”
“చెప్తా విల్యా అమ్మా!”
“ఆమె చల్లబడేలోగా చెప్పు.”
“చెప్తాను. తనకోసం నువు ప్రార్థిస్తావని ఆమెకి నమ్మకం. చివరి కర్మలు చేసేవారెవరూ లేరని ఏడుస్తూనే పోయింది. ”
“అదేమిటి? ఫాదర్ రెంటెరియా దగ్గరికి పోలేదా?”
“వెళ్లా. కొండల్లోకి పోయాడని చెప్పారు.”
“ఏం కొండలు?”
“ఏమో అక్కడ ఎక్కడివో. తిరుగుబాటు జరుగుతూందని నీకు తెలుసుగా!”
“అయితే ఆయన కూడా చేరాడా? దేవుడే మనమీద దయ చూపాలి అబుందియో!”
“దాంతో మనకేం పని విల్యా అమ్మా? అది మనల్ని తాకదు. ఇంకోటి పోయి. ఊరికే అట్లా. గలాంలియెల్ ఎటూ నిద్ర పోతున్నాడుగా!”
“అయితే నువ్వు మర్చిపోకుండా రెఫ్యూజియోకి చెప్పు నాకోసం దేవుడిని ప్రార్థించమని. ఎంత సాయం దొరికితే అంతా కావాలి నాకు.”
“నువ్వేం ఆదుర్దా పడకు. ఇంటికి వెళ్ళిన క్షణమే చెప్తాను. ప్రమాణం చేయించుకుంటాను. ఆమె చేయక తప్పదనీ లేకపోతే నువు దాని గురించి బుర్ర చెడగొట్టుకుంటావనీ చెప్తాను.”
“నువ్వు ఆ పని చేయి. నీకు తెలుసుగా ఆడవాళ్ల సంగతి! ప్రమాణం చేసి చెప్పింది చేసేట్లుగా చూడాలి.”
అబుందియో ఇంకో ఇరవయి సెంటావోలు కౌంటర్ మీద పెట్టాడు.
“ఇప్పుడు ఇంకోటి పోయి సెన్యోరా. ఆపైన నీ చేయి ఇంకొంచెం జారిస్తే అది నీ దయ. వొట్టేసి చెబుతున్నా, ఇది నేను ఇంటికెళ్ళి నా కూక పక్కనే కూచుని తాగుతా.”
“సరే పో, మా అబ్బాయి లేస్తాడు మళ్ళీ. తాగి పడుకున్నాక లేస్తే వాడికి తెగ చిరాగ్గా ఉంటుంది. ఇంటికి పో. మీ ఆవిడకి చెప్పమన్నది మర్చిపోకు.”
అబుందియో తుమ్ముకుంటూ షాప్ బయటికొచ్చాడు. లిక్కర్ మండుతూంది కానీ ఎంత తొందరగా తాగితే అంత తొందరగా తలకెక్కుతుందని ఎవరో చెప్పారని మండుతున్న నోటిని చొక్కా కొసళ్లతో విసురుకుంటూ గుక్క మీద గుక్క తాగాడు. సరాసరి ఇంటికే వెళదామనుకున్నాడు. అక్కడ రెఫ్యూజియో తన కోసం ఎదురుచూస్తూంది కూడా. కానీ తప్పు మలుపు తిరిగి వీధికి అటు వేపు, ఊరి బయటికి వెళ్ళే దారంట పడి పోయాడు.
“డమియానా!” పేద్రో పారమొ పిలిచాడు. ” వెళ్ళి చూడు ఆ రోడ్డమ్మట పడి వస్తున్నదెవరో?”
అబుందియో తల వేలాడేసుకుని తూలుకుంటూ, ఒక్కోసారి చేతులు కూడా నేలకానించి దోగాడుతూ వస్తున్నాడు. అతనికి ఈ భూమి ఒరిగిపోతున్నట్టూ, గుండ్రంగా తిరుగుతున్నట్టూ, తనని ఎక్కడికో విసిరేస్తున్నట్టూ ఉంది. పట్టు దొరకబుచ్చుకోబోతాడు, దొరికిందనుకునేలోగా మళ్ళీ తిరగడం మొదలుబెడుతుంది…. తన వాకిట్లో కుర్చీలో కూచున్న మనిషికి ఎదురు పడిందాకా.
“నా భార్యని పూడ్చిపెట్టడానికి డబ్బు కావాలి. నువు సాయం చేయగలవా?”
డమియానా సిస్నెరోస్ ప్రార్థించింది. “సైతాను బంధనాలనుండి మమ్మల్ని కాపాడు దేవుడా!” చేతుల్ని శిలువ ఆకారంలో పెట్టి అబుందియో వైపు సాచింది.
అబుందియో మార్టినెజ్ కి ఎదురుగా భయపడ్డ ఒక స్త్రీ శిలువ ఆకారంలో చేతుల్ని ఊపడం కనిపించి వణికిపోయాడు. సైతాన్ తనను ఇక్కడిదాకా వెంబడించిందేమోనన్న భయం కలిగింది. భయంకరమైన వేషంలో సైతాన్ కనిపిస్తుందేమోనని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనపడకపోయేసరికి మళ్ళీ అన్నాడు.
“నా భార్యను పూడ్చి పెట్టడానికి ఏమన్నా ధర్మం దొరుకుతుందేమోనని వచ్చాను.”
సూర్యుడు అతని భుజాల దాకా వచ్చాడు. చల్లటి తొలి పొద్దు సూర్యుడు పైకి లేస్తున్న దుమ్ములో మసగ్గా.
సూర్యకాంతినుంచి దాక్కుంటున్నట్టు తన భుజాల్ని కప్పుతున్న శాలువాలోకి పేద్రో పారమొ మొహం అదృశ్యమయింది. డమియానా కేకలు మరింత పెద్దవవుతున్నాయి పొలాల మీదుగా “డాన్ పేద్రోని చంపేస్తున్నాడు!”
అబుందియో మార్టినెజ్ కి ఎవరో స్త్రీ అరవడం వినిపిస్తూంది. అయితే ఆమెనెట్లా ఆపాలో తెలియలేదు. తన ఆలోచనల సూత్రమూ అతనికందలేదు. ఆ ముసలామె కేకలు కచ్చితంగా చాలా దూరం వినపడతాయని తెలుసు. తన భార్యకే వినవస్తాయేమో కూడా. ఆ మాటలు అర్థం కావడం లేదు కానీ అతని కర్ణభేరులు పగిలిపోతున్నాయి. తన మంచం మీద ఒంటరిగా బయటి వరండాలో పడి ఉన్న భార్య తలపుకొచ్చింది. శవం తొందరగా పాడుకాకూడదని అతనే బయటికి చలిగాలిలోకి మోసుకొచ్చి పడుకోబెట్టి వచ్చాడు. నిన్ననే తనతో పడుకుని, జీవితం కంటే సజీవంగా, చిట్టి గుర్రంలా గెంతుతూ, మునిపళ్లతో కరుస్తూ, వొదిగిపోతూ ఉన్న తన కూకా. తనకు కొడుకునిచ్చిన ఆడది. పుట్టగానే వాడు చనిపోయాడు. ఆమెకి ఆరోగ్యం బాలేనందువల్లనని అన్నారు. కంటి కురుపూ, చలిజ్వరమూ, పాడయిన కడుపూ ఇంకా ఏమున్నాయో ఎవరికి తెలుసు అన్నాడు కంచర గాడిదల్ని అమ్మి డబ్బు కట్టాక చివరి నిముషంలో చూడ్డాని కొచ్చిన డాక్టర్. ఇప్పుడదంతా చేసిన ఉపకారమేమీ లేదు. తన కూకా కళ్ళు మూతపడి రాత్రి మంచులో పడి ఉంది. ఈ ఉదయాన్ని చూడ లేదు, ఈ సూర్యుణ్ణీ.. ఇంక ఏ సూర్యుణ్ణీ.
“సాయం చేయండి.” అన్నాతను “నాక్కొంచెం డబ్బు కావాలి.”
కానీ అతని మాటలు అతనికే వినిపించలేదు. ఆ ముసలామె కేకలు అతన్ని చెవిటిని చేశాయి.
కోమలా నుంచి వచ్చే దారిలో చిన్న చిన్న నల్ల చుక్కలు కదులుతున్నాయి. క్రమంగా ఆ చుక్కలు కొందరు మగవాళ్ళుగా మారాయి. ఆ తర్వాత వాళ్లు అతని పక్కనే నిలుచున్నారు. డమియానా సిస్నెరోస్ ఇప్పుడు అరవడం మానేసింది. శిలువ ఆకారంలో పెట్టిన చేతుల్ని జారవిడిచింది. నేలమీదికి పడిపోయింది. ఆమె నోరు ఆవులిస్తున్నట్టు తెరుచుకుని ఉండిపోయింది.
ఆ మనుషులు ఆమెని నేలమీంచి లేపి ఇంటి లోపలికి తీసుకుపోయారు.
“మీరు బాగానే ఉన్నారా అయ్యా?” వాళ్ళు అడిగారు.
పేద్రో పారమొ తల ప్రత్యక్షమయింది. అతను తలూపాడు.
చేతిలో ఇంకా నెత్తుటి కత్తిని పట్టుకున్న అబుందియో ని నిరాయుధుణ్ణి చేశారు.
“మాతో రా!” వాళ్ళు అన్నారు. “ఎంత పని చేశావు!”
అతను వాళ్ళననుసరించాడు.
వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళేలోపల తనను క్షమించమని వాళ్ళను ప్రాధేయపడ్డాడు. రోడ్డు పక్కకు వెళ్ళి పసుప్పచ్చగా కక్కుకున్నాడు. కాలువలు కాలువలుగా పది లీటర్ల నీళ్ళు తాగినట్టు. అతని తల మండిపోతుంది. నాలుక మందమయినట్టుంది.
“నాకు బాగా మత్తెక్కింది.” అన్నాడు.
తన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తన చేతులు వాళ్ళ భుజాల మీద వేశాడు, వాళ్ళు అతన్ని ఈడ్చుకు పోతుంటే దుమ్ములో అతని పాదాలు చాళ్లు గీస్తూ ఉన్నాయి.

పేద్రో పారమొ వాళ్ళ వెనక ఇంకా కుర్చీలోకూచుని ఊళ్ళోకి వెళుతున్న ఆ ఊరేగింపుని చూస్తున్నాడు. ఎడమ చేతిని ఎత్తబోతే అది సీసంలా అతని మోకాళ్ళ మీదికి జారిపోయింది. అతను దాన్ని పట్టించుకోలేదు. తన దేహంలో ఏదో భాగం రోజూ మరణించడం అతనికి అలవాటయిపోయింది. పారడైజ్ చెట్టు నుంఛి ఆకులు రాలడం చూశాడు. “వాళ్ళంతా అదే దారి పడతారు. అందరూ వెళ్ళిపోతారు.” మళ్ళీ తన ఆలోచనలు ఎక్కడ ఆగాయో అక్కడికే వచ్చాడు.
“సుజానా,” అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు.. “నిన్ను తిరిగిరమ్మని బ్రతిమలాడాను..
“బ్రహ్మాండమయిన చంద్రుడు లోకం మీద మెరిసిపోతున్నాడు. గుడ్డివాడినయ్యిందాకా నిన్నే తదేకంగా చూశాను. నీ మొహం మీదికి జాలువారుతున్న వెన్నెలనీ. నిన్ను చూడడం ఎన్నటికీ విసుగనిపించదు. మెత్తగా, వెన్నెల నిమురుతూన్న నీ లావైన తడి పెదవులు నక్షత్రాల కాంతితో వెలుగుతూ. రాత్రి మంచుతో పారదర్శకమవుతూన్న నీ దేహమూ. సుజానా. సుజానా శాన్ హువాన్.”
బొమ్మ స్పష్టంగా కనపడేందుకు తుడవడానికి చేయెత్తడానికి ప్రయత్నించాడు. అది అయస్కాంతంలా కాళ్లను వదిలి రాలేదు. ఇంకో చేయి లేపడానికి ప్రయత్నించాడు కానీ అది నెమ్మదిగా అతని పక్కకి నేలను తాకేలా జారిపోయింది ఎముకల్లేని భుజానికి ఆధారంలా.
“ఇది చావు,” అనుకున్నాడు.
సూర్యుడు అన్నిటి మీదా దొర్లుతూ ఉన్నాడు వాటికి మళ్ళీ ఆకారాలు కల్పిస్తూ. ధ్వంసమయిన బంజరు భూమి అతని ఎదురుగా పరుచుకుని ఉంది. ఎండ అతని శరీరాన్ని కాలుస్తూంది. అతని కళ్ళు కదలడం లేదు. అవి జ్ఞాపకం నుండి జ్ఞాపకానికి దూకుతూ ఉన్నాయి ప్రస్తుతాన్ని చెరిపేస్తూ. అకస్మాత్తుగా అతని గుండె ఆగిపోయింది. కాలమూ, జీవన శ్వాసా దానితోటే ఆగిపోయినట్లనిపించింది.
“అయితే ఇంకో రాత్రి ఉండదన్నమాట!” అనుకున్నాడు.
ఎందుకంటే అతనికి చీకటితో, భ్రాంతులతో నిండిన రాత్రులంటే భయం. అతని దయ్యాలతో పాటు అతన్ని బంధిస్తాయవి. అదీ అతని భయం.
“నాకు తెలుసు, కొన్ని గంటల్లో నేను నిరాకరించిన సాయం అడగడానికి అబుందియో నెత్తుటి చేతులతో వస్తాడు. కానీ నా కళ్ళు మూసుకోవడానికీ, అతన్ని చూడకుండా ఉంచడానికీ నా చేతులు లేవు. అతని మాటలు వినక తప్పదు. రోజుతో పాటు అతని గొంతు సన్నగిల్లిందాకా, గొంతు పూర్తిగా రూపు మాసిందాకా.”
తన భుజం మీద ఒక చేయి తాకినట్లనిపించింది. నిటారుగా కూర్చున్నాడు తనను తను దృఢంగా చేసుకుంటూ.
“నేనే డాన్ పేద్రో!” డమియానా చెప్పింది. “నీకు డిన్నర్ తీసుకు రమ్మంటావా?”
పేద్రో పారమొ బదులిచ్చాడు:
“నేను వస్తున్నా. వస్తున్నా.”
డమియానా అందించిన చేయి సాయంతో లేచి నిలబడి నడవడానికి ప్రయత్నించాడు. కొన్ని అడుగులు వేశాక అతను పడి పోయాడు. లోలోపల సాయం కోసం అభ్యర్థిస్తున్నాడు కానీ మాటలేవీ బయటకు రావడం లేదు. ఒక రాళ్ల కుప్ప కూలబడినట్టు ధడేల్మని నేలమీద పడి అలాగే ఉండిపోయాడు.
=======================

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)