మహదాశీర్వచనం: సీదా సాదా కథ చెప్పే అసాధారణ చరిత్ర

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“రామారావుగారి కథలు దాదాపు ఏవీ పైకి తెలిసిపోవనీ, పురాతన చరిత్ర కోసం భూమి పొరలను తవ్వే ఆర్కియాలజిస్ట్ పొర పొరా వేరు వేరుగా విడదీసి చూపే దాకా చరిత్ర సమాచారం ఆవిష్కృతం కానట్టు – ఆయన కథలు కూడా పొర పొరా జాగ్రత్తగా విప్పితే కాని కథలో ఏ మాట ఎందుకు అన్నారో బోధ పడదనీ, ఆ కథ రెండోసారి చదివేటప్పుడు — అంతకు ముందు, మొదటిసారి చదివినప్పుడు తోచని లోతులు, గూఢ అర్ధాలు తెలుస్తాయనీ మరొక సారి చెప్పటం అవసరం -”

1986 అక్టోబర్ లో కాళీపట్నం రామారావు కథలు ఒక పాతిక ఆర్కే పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినప్పుడు ‘ఈ కథలు రెండోసారి చదవటానికి ముందుమాట’ రాస్తూ వెల్చేరు నారాయణరావు చెప్పిన ముక్తాయింపు మాటలివి. నిజమే. కాళీపట్నం రామారావు కథలు రెండోసారి, మూడోసారి, మరొకసారి ఇలా మళ్ళీ మళ్ళీ చదివే క్రమంలోమానవేతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని అసలు కథలు తెలిసివస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే కాళీపట్నం కథలు చదివితే “జీవితం లోని అంతస్సంఘర్షణ కూడా దాని వెనక ఉన్న భౌతిక కారణాలతో సహా స్పష్టంగా -” అర్ధం అవుతుంది. అతిసాదాగా కనిపించే కారా కథల లోని ఆకర్షణ అదే. ఆ ఆకర్షణ లక్షణం వల్లనే కారా గారి ‘మహదాశీర్వచనం’ కథ నాకు చాలా నచ్చింది.

‘మహదాశీర్వచనం’ కథ 1967 ఏప్రిల్ 27 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో మొదట ప్రచురించబడింది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇరవై సంవత్సరాలు, ఆంధ్రరాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి అసమానతలను తగ్గించటం ధ్యేయంగా సాగిన మూడవ పంచవర్ష ప్రణాళిక అప్పుడే ముగిసింది. వ్యవసాయంలో మిగులువిలువను పెంచి నూతన ధనిక వర్గం ఏర్పడటానికి కారణమైన హరిత విప్లవం ఈ కాలపుదే. అసమానతలు తగ్గకపోగా మరింత పెరగటానికి ఇది కారణమైంది. రూపాయి విలువ తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్యతరగతి జీవితం దుర్భరం కాసాగింది. భూ పరిమితి చట్టాల అమలులో వైఫల్యం .. పేద, సన్నకారు రైతుల, రైతు కూలీల బతుకులలోని పీడన, దోపిడీ .. నెహ్రూ వాగ్దానం చేసిన సోషలిస్ట్ సమాజం వాస్తవీకరించబడుతుందన్న ఆశను తుంచేశాయి. అసంతృప్త అశాంత ప్రజాజీవనం నుండి శ్రీకాకుళంలో గిరిజన రైతాంగ పోరాటాలు రూపం తీసుకొంటున్న కాలం ఇది. ఈ రాజకీయార్ధిక నేపధ్యం నుండి అధ్యయనం చేయవలసిన కథ ‘మహదాశీర్వచనం’.

ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కేంద్రంగా ప్రారంభమైన ఈ కథ స్త్రీల కోణం నుండి నడపబడింది. ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలై బాగా చీకటి పడ్డాక ఆరు ఏడూ గంటల ప్రాంతంలో కథ ముగుస్తుంది. మొత్తం మీద అయిదారు గంటల కాల వ్యవధి మీద నడిచిన ఈ కథను ఇంట్లో మొదలుపెట్టి ఊరి అవతల బడిలోని పోలింగ్ ఆఫీసులో ముగించటంలో ఉంది కారా నిర్మాణ శిల్పం. “ఆయన చావటానికి సిద్ధంగా ఉన్నాడు. రెన్నాళ్ళయీ మూన్నాళ్ళయీ కాదు. నాలుగు సంవత్సరాలై ..” అన్న ప్రారంభ వాక్యంతో ఇంటి యజమాని కామేశాన్ని పరిచయం చేసి.. వెనువెంటనే కొంచెం బియ్యం, వాటికెన్నో రెట్లు ముదురు నూకలు, చాలా మట్టిబెడ్డలు కలసి ఉన్న పాత చాట ముందు పెట్టుకొని, వాటిల్లోంచి బియ్యాన్ని ఏరి తీసుకోవటమో, రాళ్ళను ఎంచి పారేయ్యటమో తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో గుమ్మం ఒడ్డున కూర్చున్న కామేశం భార్య సత్యవతమ్మను పరిచయం చేసాడు కారా. వీధి చీడీలో వదులు మఠం వేసుక్కూర్చున్న ‘వాడు’ అని సర్వనామంతో మరొక పాత్ర పరిచయం అవుతుంది అప్పుడే. కుక్కి మంచంలో ఉండుండి ఎగశ్వాసతో బెక్కుతుండే రోగి వైపు మన దృష్టి మరల్చి, రోగి స్థితికి అదిరిపోతూ రోగి శ్వాస చక్కబడితే తాను కుదుటపడే సత్యవతమ్మను కేంద్రంలోకి తెచ్చి, పన్నెండేండ్ల కూతురు కామేశ్వరిని ప్రవేశపెట్టి కధకుడు నాటకంలో సూత్రధారుడి వలె ఇక జీవన నాటకం చూడండంటూ తాను తప్పుకొన్నాడు.

సత్యవతమ్మ ఏడేండ్ల కొడుకు శంకరం తండ్రిని చూడటానికి వైద్యుడు ఆచార్లును వెంట పెట్టుకొని రావటంతో కథలో కదలిక మొదలవుతుంది. ఆచార్లు రోగిని పరీక్షించి మందులిస్తుండగా ఎదురింటి అరవై ఏళ్ళు పైబడ్డ శేషమ్మ అక్కడకు వస్తుంది. చలన చైతన్యాలు లేకుండా మంచంలో పడి ఉన్న కామేశం జీవితం సమస్తం ఆమె అంతరిక ఆలోచనల వల్ల, ఆమె అనుభవాల జ్ఞాపకాల కధనం వల్ల, వ్యాఖ్యానాల వల్ల పొరలు పొరలుగా పాఠకుల ముందు విచ్చుకుంటుంది.

శేషమ్మ సంభాషణ వల్ల కామేశానికి సత్యవతమ్మకు పెళ్లి శారదా బిల్లు హడావుడిలో జరిగిందని తెలుస్తుంది. వివాహ వయో పరిమితిని అమ్మాయిలకు 14 ఏళ్ళుగా, అబ్బాయిలకు 18 ఏళ్లుగా విధిస్తూ 1929 లో వచ్చిన బిల్లు ఇది . బిల్లు వస్తుందని తెలిసి ముందే పెళ్లిళ్లకు తొందరపడటం, ఆ బిల్లు వర్తించని నైజాం ప్రాంతాలకో, యానాం ప్రాంతాలకో వెళ్లి పెళ్లిళ్లు చేసుకురావటం జరిగింది. ఆ హడావుడిలో సత్యవతమ్మ పెళ్లి జరిగింది అంటే 1929లో జరిగిందన్నమాట. అప్పటికి ఆమె వయసు అయిదు ఏళ్ళు. రెండువందల శుల్కానికి కామేశం ఆమెను కొనుక్కొని పెళ్లి చేసుకొన్నాడు. అప్పుడతనికి 28 ఏళ్ళు. స్కూల్ మాష్టారిగా పని చేసి రిటైర్ అయి స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. భర్తను స్వార్ధపరుడని, పెళ్ళాం పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించనివాడని శేషమ్మ ఆరోపణగా మాట్లాడుతుంటే సత్యవతమ్మకు అరవై ఏళ్ళు జీవిత భారం మోసి అలసిపోయిన వ్యక్తి ఆఖరి దినాలు హాయిగా గడపదలచటంలో తప్పేమీ కనిపించలేదు అని ఆమె చిత్తవృత్తిని వ్యాఖ్యానిస్తాడు కధకుడు. దీనిని బట్టి కథ ప్రవర్తిస్తున్న కాలానికి కామేశం అరవై ఏళ్ళు దాటినవాడు. అంటే కధాకాలం 1962-63 కావాలి.

చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం మొదలైన వూళ్ళ ప్రస్తావనను బట్టి వాటికి సమీపంలో ఉత్తరాంధ్రలోని ఏ గ్రామంలోనో ఈ కథ ప్రవర్తించిందని అనుకోవచ్చు. ఆ గ్రామం – స్వాతంత్ర్యానంతర గ్రామం ఎలా ఉంది? ప్రాధమికమైన విద్య ఆరోగ్య వసతులే సమకూడలేదు. కొత్తబడి ఊరవతల పెంకుటింట్లో పెట్టబడింది.1960 కల్లా ప్రాధమిక విద్యను సార్వజనీనం చెయ్యాలని భారత రాజ్యాంగం సంకల్పం చెప్పుకున్నా మగపిల్లల చదువులు ఆడపిల్లల పెళ్ళిళ్ళు సమస్యగా భావించే స్థితి మారలేదు. ఇక ఆరోగ్యం ప్రభుత్వం కల్పించే సౌకర్యంగా అన్ని గ్రామాలకూ అందుబాటులోకి రానే లేదు.1959 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 730 రూరల్ డిస్పెన్సరీలు వచ్చినప్పటికీ కధ నడచిన గ్రామం వరకు ఆ అభివృద్ధి ఇంకా రానేలేదు. ఆచార్లు ఆ ఊరి ఆయుర్వేద వైద్యుడు. లేనివాళ్ళ కోసం హోమియో తెలుసుకొన్నాడని, ఉన్నవాళ్ళ కోసం అల్లోపతి ప్రాక్టీసు చేస్తాడని అతని గురించి కధకుడు చెప్పిన మాటలు గమనించవలసినవి. అవసరాన్ని బట్టికాక ఆర్ధిక అంతరాలను బట్టి అందివచ్చే వైద్యవిధానాలు వేరు వేరుగా రూపొందుతున్న అసమ సామాజిక స్థితి వైపు పాఠకుల దృష్టిని మళ్ళించే మాటలివి.

 

ఆరుగురు తిని కుడిచే పిల్లలతో ఒక్కతే సంసారం ఈదవలసిన స్థితిలో ఉన్న సత్యవతమ్మను చూసి ఆచారి అల్లోపతి వైద్యాన్ని హోమియోకి మార్చటమే కాక ఆమె దగ్గర ఫీజు కూడా తీసుకొనటం మానేసాడు. ప్రస్తుత కథా సన్నివేశంలో ఆచారి రోగికి ఉపశమనం కోసం ఒక ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇస్తాడు. సత్యవతమ్మ రెండు రూపాయలు ఫీజుగా ఇవ్వబోతే వద్దని వారించాడు. అది తాను కొన్నది కాదని తనకు అది ఎలా వచ్చిందో చెప్పాడు. వూళ్ళో నాయుడోళ్ళ పాపమ్మకు ఇదే జబ్బు. పట్నం పెద్ద డాక్టర్ ఆమె కోసం రాసిన ఇంజక్షన్ అది. ఆయన డజన్ రాస్తే వీళ్ళు రెండు డజన్లు తెప్పించారుట.. ఈ విషయం చెప్పి వారికి పైసలకు కొదవేమున్నది? అందులోను పంట ధాన్యాల ధరలు ఇలా మండుతున్నప్పుడు.. ! అని వ్యాఖ్యానిస్తాడు ఆచారి.

 

ఊళ్ళల్లో రైతుల దగ్గర ధాన్యం కొని అమ్మే వ్యాపార వర్గం ఒకటి రైతాంగాన్ని కనపడని దోపిడీకి గురిచేస్తున్న వైనాన్ని కారా అంతకు ముందే అప్రజ్ఞాతం కథలో (1951) చర్చారూపంగా భాగం చేశాడు. ఆ తరువాత 1966లో యజ్ఞం కథ ఇతివృత్తంలో భాగం చేసి మానవజీవన సంబంధాలను అవి ఎంత హింసాత్మకంగా ప్రభావితం చేస్తున్నాయో వాటి పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు. 1967లో రాసిన మహదాశీర్వచనంలో కూడా ఆ ప్రస్తావన చేయలేకుండా ఉండలేక పోయాడు. వస్తూత్పత్తులను సమీకరించటం, నిలవ చేయటం, లాభాలకు అమ్ముకొనటం ఆ వర్గం చేసే పని. ఈ కథలోని నాయుడోళ్ళ చరిత్ర పంట ధాన్యాల అమ్మకాల చరిత్ర. కనుకనే వాళ్లకు పైసలకు కొదవలేదు. పెద్దఎత్తున ధాన్యం కొనటం అమ్మటం అలవాటైన వాళ్ళు కనుక ఇంజక్షన్లు కూడా రెండు డజన్లు తెచ్చి పడేసారు. అవి సాధారణంగా దొరకని మందులు. వాటిని అవసరానికి మించి కొని అట్టే పెట్టుకోనటం అంటే అవసరంలో ఉన్నవాళ్లకు అందకుండా చెయ్యటమే. అది తెలిసినవాడు కనుక ఆచారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆ మందులు కొట్టువాడికైనా ఇచ్చెయ్యమని లేదా తన మోహాన అయినా కొట్టమని అడుగుతూనే ఉన్నాడు. ఎక్స్పైరీ డేటు దగ్గరపడ్డం చూసి తీసుకెళ్ళమని మొన్న ఇచ్చారు అని ఆ ఉదంతం చెప్పాడు. తద్వారా ప్రాణావసరం అయిన వాటిని కూడా పనికి రాకుండా పోయేంత కాలం నిలవ చేసుకొనే వర్గం, ఆ వర్గం విదిలించినవాటితో బతుకుకై పెనుగులాడే వర్గం – రెండింటిని ఎదురెదురుగా నిలిపి చూపినట్లయింది.

ఈ కథలో సన్నివేశం ఒకటే అయినా మూడో మనిషిగా శేషమ్మ, లోపలి మనుషులుగా సత్యవతమ్మ, కామేశ్వరి ఎవరి జీవిత అనుభవాల నుండి, అవగాహన నుండి జ్ఞానచైతన్యాల నుండి వాళ్ళు చేసిన ఆలోచనలు, చేష్టలు, సంభాషణలు కలిస్తేనే ఆ సన్నివేశం ఆకారం తీసుకొన్నది. సజీవ చిత్రమై భాసించింది. వీళ్ళల్లో కామేశాన్ని చాలాకాలంగా తెలిసిన మనిషి శేషమ్మ. పెళ్లి అయి కాపురానికి వచ్చిన కొత్తల్లో కళ్ళనిండా కామంతో అతను చూసే చూపులను ఎదుర్కొన్నది. పెళ్ళిచేసుకొని భార్యను చావకొట్టి హింసపెట్టటం చూసింది. ఆ భార్య చావగానే ఉన్న ఇద్దరు పిల్లల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించటం చూసింది. ఆడపిల్లను చెల్లెలు, మగపిల్లవాడిని బావమరిది తీసుకువెళితే రెండో పెళ్ళికి తొందరపడిన తీరు చూసింది. తన భర్త చనిపోయాక తన కొడుకు మీద మరిదిని, మరిది మీద అతడిని పోటీలు పెట్టి వాళ్ళిద్దరి భూముల మధ్య ఉన్న తన భూమిని తెలివిగా అమ్ముకున్నతీరు చూసింది. మొత్తం మీద కామేశం బుద్ధి మంచిది కాదన్నది ఆమె అభిప్రాయం. తను తన జీవిత సౌఖ్యం తప్ప తన తదనంతరం తనకన్నా 23 ఏళ్ళు చిన్నదైన భార్య, 12 ఏళ్ళలోపు పసిపిల్లలు ఆరుగురితో జీవితం ఎలా వెళ్ళ దీస్తుందా అన్న చింత ఆవంతైనా లేని అతని స్వార్ధబుద్ధిని శేషమ్మఏవగించుకొంటుంది. ఆమె దృష్టిలో అతను ‘పురీషంలో పురుగు’.

శేషమ్మ కామేశం గురించి చేసిన వ్యాఖ్యలు మూడు ఉన్నాయి. ఆచారి ఇంజక్షన్ ఇచ్చి రియాక్షన్ వస్తుందేమోనని కనిపెట్టుక కూర్చున్నాను అన్నప్పుడు ఆమె “ఆ జీవికి అంత అదృష్టం కూడానా” అంటుంది. అతని హీన చరిత్రను, రిటైర్ మెంట్ అప్పుడు పెద్ద భార్య కొడుకు వచ్చి చెప్పిన హితవును అహంకరించి తోసిపారేసి వచ్చి ‘నాదారి నేను చూసుకున్నాను నువ్వూ నీ పిల్లలూ ఏ గంగ లో దూకుతారో దూకండి’ అంటూ మంచమెక్కి పడుకున్న అతని వైఖరి గురించి నిరసనగా మాట్లాడి కొంతసేపు ఊరుకొని ఆ తరువాత ఆమె “మనిషికి స్వర్గం గాని, నరకం గాని ఎక్కడో వుండవు. చేసుకున్నవారికి చేసుకున్నంత – అని ఫలితం ఇక్కడే అనుభవిస్తాం” అంటుంది. ఈ రెండు వ్యాఖ్యానాలూ కూడా ఆమెకు జబ్బుతో ఉన్న అతని పట్ల ఏ సానుభూతి లేకపోవటాన్నే సూచిస్తాయి. స్వార్ధం తప్ప ప్రేమ, బాధ్యత లేని మనుషులు చుట్టుపక్కల వారి జీవితాలలో నింపే విషాద భీభత్సం కళ్లారా చూసిన మనిషి కనుక అనాయాస మరణానికి నోచుకోని కామేశాన్ని అదృష్టహీనుడి గానూ, చేసిన దుర్మార్గాలకు ఈ లోకంలోనే ఫలితం అనుభవిస్తున్నవాడిగాను భావించింది.

కామేశం అలా నాలుగేళ్ళుగా చావటానికి సిద్ధమై మంచంలో పడి వుండటం అతని కర్మఫలం అనుకున్నా అతని వల్ల కష్టాలు, నష్టాలు భరించిన భార్యాపిల్లలకు చావూ బతుకు కాని ఆ స్థితి అది మరొక నరకం. వాళ్ళ కోణం నుండి అతనెంత త్వరగా మరణిస్తే అంత మంచిది. శేషమ్మ ఆ భావాన్ని ప్రకటించే నిష్క్రమించింది. ఏమైనా అవసరమైతే కబురు చేయమని చెప్పి వెళుతూ నువ్వు బెంగ పెట్టుకోకు అని సత్యవతమ్మకు హితవు చెప్తుంది. ‘యేo జరిగినా దేవుడు మన మంచికే చేస్తాడని గుర్తెట్టుకో’ అని చెప్పిన మాటలో అతని మరణం నీ మంచికే అన్న సూచన వుంది. ఆమెను అందుకు సిద్దం చేయటమూ వుంది .

 

శేషమ్మ తరువాత కామేశం గురించి లోపలి నుండి సంపూర్ణంగా తెలిసిన మనిషి అతని భార్య సత్యవతమ్మ. ఐదో ఏట అతని భార్య అయి పదమూడు పద్నాలుగు ఏళ్ళకు కాపురానికి వచ్చింది. తరువాత పదిహేను, పదహారేళ్ళు ఆమె బ్రతుకో మహానరకం అంటాడు కధకుడు. ఆమె బ్రతుకును నరకం చేసిన శక్తుల గురించి కూడా కధకుడే సూచించాడు. భర్త కొట్టటం అందులో ఒకటి. భర్తగా అధికారం నిరూపించుకోవటానికో అహంకారాన్ని సంతృప్తి పరచుకొనటానికో, తనకంటే ఇరవై మూడేళ్ళు చిన్నదైన భార్యపై అనుమానంతోనో నిత్యం అతను కొడతాడు. భర్త వల్ల అవమానాలకు, హింసకు గురయ్యే స్త్రీ అందరికి లోకువే. అయినవాళ్ళ చేత, కాని వాళ్ళ చేత ఆమె చీవాట్లు తినటం అందువల్లనే కావాలి. పరాయి స్త్రీలను కామం నిండిన చూపులతో వేధిస్తూ అశ్లీలంగా మాట్లాడుతూ అవమానించే కామేశం వంటి పురుషులకు కొదువ లేని సమాజంలో శేషమ్మ వలెనే సత్యవతమ్మ కూడా ఒక బాధితురాలే.

 

నోటి రంకు ఆడవాళ్ళ చేత నిందలు పడిందని సత్యవతమ్మ గురించి కధకుడు చెప్పిన మాట గమనించదగినది. ఎవరీ నోటి రoకు ఆడవాళ్ళు? తమ భర్తలు పరాయిస్త్రీల వెంట పడుతుంటే వాళ్ళని మందలించలేక, భరించలేక వదిలివెళ్ళే సామాజిక అవకాశం, సాహసం లేక చేసుకొనే మానసిక సర్దుబాటులో భాగoగా తమ భర్తల తప్పు ఏమీ లేదని తమను తాము ఒక భ్రమావరణంలోకి ప్రవేశపెట్టుకొనేవాళ్ళు. తమ భర్తలను స్త్రీలే చెడుదారులకు ఈడుస్తున్నారని తమను తాము నమ్మించుకొని తోటి స్త్రీలకు అక్రమ సంబంధాలు అంటగట్టటంలో తృప్తిని వెతుక్కొనేవాళ్ళు. సత్యవతమ్మ బ్రతుకు నరకం కావటానికి వాళ్ళు కూడా కారకులయ్యారు. జబ్బులు సంకటాలు, కడుపులు, కడుపులు పోవటాలు, పుట్టీ పెరిగీ పోయే పిల్లలు – ఇవన్నీ ఆమె జీవితాన్ని మరింత దుర్భరం చేసాయి. జబ్బులు సంకటాలు భర్త వల్ల వచ్చినవై ఉండాలి. లేత వయసు కాపురం గర్భస్రావాలకు కారణమై ఉండాలి. పిల్లలు పుట్టి పెరిగి పోవటానికి భర్త పని చేసే జిల్లా గ్రామాలలో తగిన వైద్య సదుపాయాలు లేకనో, భర్త బాధ్యతా రాహిత్యం వల్లనో కావాలి. ఈ నిరంతర హింసాత్మక అనుభావాలు ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

‘ముప్ఫయ్యో పడి సమీపించాక ఆమె జీవితం చక్క బడ్డది’ అంటాడు కధకుడు. చక్కబడటం అంటే ఏమిటి? పూర్తిగా లొంగిపోవటం. పదిహేను పదహారేళ్ళ కాపురంలో భర్త దెబ్బలవల్ల, గర్భస్రావాల వల్ల, పురుళ్ళ వల్ల, జబ్బుల వల్ల శరీరం చివికి పోయి .. అవమానాల వల్ల, పుట్టీ పెరిగిన పిల్లల మరణాలవల్ల, భర్త నిర్లక్ష్యం వల్ల కలిగిన దుఖ్ఖంతో మనసు అవిసిపోయి, మిగిలిన ఆరుగురు పసిపిల్లల కోసం బతక్క తప్పదని గుండె రాయి చేసుకొనటమే చక్కబడటం అంటే. అప్పటి ఆమె స్థితిని కధకుడు “పరరాజుతో పోరాటం సలిపి, సలిపి ఓటమి నంగీకరించిన రాజ్యలక్ష్మి ఆ రాజు పాలన క్రింద చల్లగా వర్ధిల్లినట్టు” అని వ్యాఖ్యానించటం గమనించదగింది. ఏడు పంక్తులలో సత్యవతమ్మ సంసార జీవితాన్ని వర్ణించి రెండు పంక్తులలో చేసిన ఈ వ్యాఖ్యానం ద్వారా కారా స్త్రీల జీవితం లోని హింసను,ఆరాట పోరాటాలను, ఓటములను, లొంగుబాట్లను అర్ధం చేసుకొనటానికి కావలసినంత అవకాశం పాఠకులకు కల్పించాడు.

కామేశం రిటైర్ మెంట్ ముందర సవతికొడుకు వచ్చి రిటైర్ మెంట్ వల్ల వచ్చిన డబ్బుతో తను ఉండే విశాఖపట్నంలోనే స్థలం కొని, పాక వేసుకొని ఒక భాగంలో ఉంటూ మరొక భాగం అద్దెకు ఇచ్చుకోమని ట్యూషన్ లు చెప్పుకొంటూ వచ్చేదానితో పిల్లలకు చదువు చెప్పించమని, తనకు చాతనైన సాయం చేస్తానని సలహా ఇస్తే అందులో మంచి తనకు కొంత అర్ధమైనా భర్తను సమ్మతింప చేయటానికి సత్యవతమ్మ ఏ ప్రయత్నమూ చేయలేదు. ఎందుకు చేయ లేదు? అంతకాలానికి పచ్చనవుతున్నతనబ్రతుకును మళ్ళా పొగలూ సెగలూ మధ్యకు ఈడ్వడం ఇష్టం లేక అంటాడు కథకుడు. కామేశం దృష్టి లో భార్య సలహాలిచ్చే సహచరి కాదు. తానేమి చేసినా చూస్తూ అనుసరిస్తూ జీవించవలసిన కట్టు బానిస. యజమానికి సలహాలిచ్చే సాహసం చేసే బానిస జీవితం నిప్పుల కుంపటే. తెలిసి తెలిసి కామేశాన్ని కదిపే సాహసానికి ఆమె ఒడి కట్టలేదు. అంతేకాదు. భర్త అన్న ఓకే ఒక బంధం వల్ల, దానిపట్ల తరతరాలుగా చూపవలసిన విశ్వాసం గురించిన బోధనలు ఒంటబట్టిన స్త్రీలకు ప్రతినిధిగా సత్యవతమ్మ అతనిలో స్వార్ధాన్ని కూడా అవసరమైనదిగా, అతి సహజమైనదిగా అనుకొనే స్థాయికి చేరుకొంటుంది. శేషమ్మ ఆరోపణలకు సమాధానం చెప్పే విఫలయత్నం ఆ క్రమంలోనే చేసింది.

 

పల్లెటూర్లో నెలకు నూరు రూపాయలుంటే రాజాలా గడిచిపోతుందని, అధమ పక్షం కూర్చొని తిన్నా పదేళ్ళు గడిపెయ్యగలను అని డంబాలు పలికిన భర్త నిర్వ్యాపారం వల్ల, జబ్బు వల్ల ఉన్నదంతా కరిగిపోయి .. తిండి గింజలకు, మందులకు, డాక్టర్ ఫీజులకు చేతిలో డబ్బాడక, ఒంటి మీద పుస్తే పుడకా పోగోట్టుకొన్న స్థితిలోనూ సత్యవతమ్మ భర్తను తప్పు పట్టలేక పోయింది. రూపాయి విలువ పడిపోవటం వంటి ప్రతికూల పరిస్థితులను తప్పు పట్టింది. నాలుగేళ్ళుగా చావటానికి సిద్ధంగా మంచంలో ఉన్న భర్త ఎగశ్వాస పెడుతుంటే మెడలో పసుపుతాడు వెతుక్కొని వణికే చేతులకు దొరికిన పసుపు కొమ్ము కళ్ళకద్దుకొనే విశ్వసనీయతకు రూపం ఆమె. ఆడవాళ్ళ ఈ అజ్ఞానం మీద, పరాధీనత మీద కారాకు ఉన్నఆగ్రహం ఈకథ ముగింపులో కనబడుతుంది. ఆరోజు ఆ వూళ్ళో జరిగిన పోలింగ్ లో చివరగా తన ఓటు వేసి సత్యవతమ్మ పోలయిన ఓట్ల సంఖ్యను వెయ్యికి పెంచింది. ఓట్లు లెక్కించిన ఆఫీసర్ ఆ విషయాన్ని గుర్తించి ‘ఆ అమ్మ ఎవరోగాని వెయ్యేళ్ళు పసుపు కుంకుమలతో వర్ధిల్లుతుంది’ అన్నాడు. ‘ఆ మనిషి హోదాలో చిన్నవాడైనా వయసులో పెద్దవాడు. ఆయన దీవన ఊరికనే పోరాదు’ అన్న వాక్యంతో కారా కథను ముగించాడు. వాస్తవాలతో సంబంధం లేకుండా చిరకాలం పసుపు కుంకుమలతో వర్దిల్లటం అనే దానిని నిరపేక్ష విలువగా నమ్మి ప్రవర్తించే మానవ ప్రవృత్తిని వ్యంగ్యమానం చేసాడు.

ఈ కథ ఇతివృత్తంలో మరొక ముఖం పన్నెండేళ్ళ కామేశ్వరి ద్వారా ఆవిష్కృతం అవుతుంది. బడికి పోయి చదువుకోవలసిన వయసులో ఆ పిల్ల తల్లికి ఇంటి పనిలో తోడయింది. బియ్యంలో రాళ్ళేరటం, బావి నీళ్ళు తోడి గోలెం నింపటం, తల్లి ఇంటలేని సమయంలో జబ్బుపడ్డ తండ్రిని కనిపెట్టుకొని ఉండటం – ఇవి ఆపిల్ల చేసే పనులు. ఇంట్లో వ్యవహారాలు అర్ధం అవుతుంటే వర్తమానం, భవిష్యత్తు కలగాపులగంగా ఆ పిల్ల ఆలోచనలలో సుడులు తిరుగుతుంటాయి. జీవితం పట్ల పిల్లలకు ఉండే సహజ కుతూహలం కామేశ్వరిలో ఉంది. శేషమ్మ తన నాయనమ్మ, మేనత్తల గురించి తండ్రి మొదటి భార్యగురించి, ఆమె పిల్లల గురించి చెప్తున్న విషయాలు విన్నది. తండ్రి మొదటి భార్యను చావకొట్టిన విషయం ఆ పిల్లకు వింతగా, కొత్తగా అనిపించకపోయి ఉండవచ్చు. కానీ తన ఈడులోనే చిన్న మేనత్తకు పెళ్లి అయిందని తెలిసి ‘అంత చిన్నప్పుడే పెళ్ళా’ అని ఆశ్చర్య పడింది. శేషమ్మ తండ్రి ప్రవర్తనను, ప్రవృత్తిని నిరసిస్తూ మాట్లాడుతుంటే తల్లి తల ఎత్తకుండా మధ్య మధ్య కన్నీళ్ళు తుడుచుకుంటున్న సందర్భంలో ఆమె స్థితిని వ్యాఖ్యానించే ‘కామేశ్వరికి అమ్మమ్మగారు శత్రువో మిత్రమో తెలియడం లేదు’ అన్న వాక్యం ఒకటి ఉంది. తల్లికి మాట సాయంగా వచ్చింది కనుక, తండ్రిలోని స్వార్ధ బుద్ధిని, దురహంకారాన్ని ఏకి పారేసింది కనుక మిత్రమనే అనుకొని ఉంటుంది. తల్లి మీద కోపగించి మాట్లాడటం తల్లి కన్నీళ్లు పెట్టటం బహుశ ఆమెను శత్రువు అనుకొనేట్లు చేసి ఉంటాయి.

అంటే కామేశ్వరికి తల్లి పట్ల సానుభూతి, తండ్రి పట్ల వైమనస్యం ఉన్నాయనుకోవాలా? ఉన్నాయనే సూచనలు కథాగమనం లో కనబడతాయి. కథ ప్రారంభంలోనే తండ్రి కనపడగానే కామేశ్వరి చప్ న తల తిప్పేసుకొనటం చూస్తాం. అది చాలు ఆమెకు తండ్రి పట్ల ఉన్న వ్యతిరేక భావం అర్ధం కావటానికి. వెనువెంటనే తల్లి గురించి ఆమె ‘రోజురోజుకూ చిక్కిపోతున్నట్టు కనబడుతున్నది’ అనుకొనటం తల్లిని ఎంత పరిశీలనగా చూస్తుందో తెలుపుతుంది. తల్లి ఓటు వెయ్యడానికి వెళ్తూ తండ్రికి కాపలా పెట్టింది. గుమ్మంలో తల్లి లాగే కూర్చొని ఉన్న కామేశ్వరికి వీధి వాకిట్లో ఆడుకొంటున్న తమ్ముడు శంకరం పక్కింటి అబ్బాయితో తాము విశాఖపట్నం వెళ్లిపోతామని చెప్పటం వినబడింది. ఎప్పుడు అన్న ఎదుటివాడి ప్రశ్నకు శంకరం గొంతు తగ్గించి ఇచ్చిన సమాధానం వినబడక పోయినా ఊహించ గలదు. తండ్రి మరణంతో గానీ అనివార్యం గా తమకు ఆ అవసరం రాదు.

 

తండ్రి మరణం గురించిన ఆలోచనలు లోలోపల కదలుతుంటే తండ్రి గుండె ఆగి పోయిందేమోనని పదే పదే చూస్తూ తన పాపపు ఆలోచనలకు తనను తానే మందలించుకొంటుంది. బతికి ఉన్న మనిషి మరణాన్ని ఊహించటం పాపమని లోకం చెప్పింది. అది వినీవినీ పెరిగిన పిల్ల కనుక పాపపు ఆలోచనలంటే భయపడుతుంది. అటువంటి ఆలోచనలు చెయ్యరాదని అనుకొంటుంది. అయినా ఎంత ప్రయత్నించినా వాటి నుండి తప్పుకోలేక యాతన పడుతుంది. అటువంటి సమయంలో తన తల్లికి కూడా తన ఆలోచనలవంటి ఆలోచనలొస్తాయా అన్న ఆలోచనలో పడుతుంది. రావచ్చు అని అనుమానo ఉన్నా రావనే సమాధాన పడుతుంది. కానీ నమ్మకం మాత్రం కుదరదు. తండ్రి చనిపోయి దిక్కులేని వాళ్లై అన్న దగ్గరకు వెళితే ఎలా ఉంటుందన్నంత వరకు ఆ పిల్ల ఊహలు పరుగెడుతూనే ఉంటాయి. తన నియంత్రణలో లేని ఈ ఆలోచనలతో వేగిపోతూనే తండ్రి కదులుతూ నాలుకతో పెదవులు తడుపుతుంటే గ్లూకోస్ నీళ్ళు తెచ్చి పోసింది. అవి తాగి మగతగా కన్నుమూసిన కామేశాన్ని చూస్తే ‘తండ్రి మరి చావడు’ అనిపిస్తుంది. అది ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిందా, నిస్పృహకు లోను చేసిందా అన్నప్రశ్న వస్తే పరిస్థితులు, ఆ పిల్ల మానసిక ఉద్విగ్నస్థితి రెండవ దానినే సమాధానంగా స్ఫురింప చేస్తాయి. ఎవ్వరి సహాయం లేకుండా తమ బతుకు తాము బతకాలన్న ఆశ, విశ్వాసం కామేశ్వరిలో చూపాడు కారా. సత్యవతమ్మలో లేని గుణం అది. బాధలలో, బానిసత్వంలో క్రుంగిపోయే గతం సత్యవతమ్మ. బాధలలో నుండి పైకెగసి స్వతంత్రులం కావాలన్న భవిష్యత్ ఆశ కామేశ్వరి.

ఈ కథ ఎన్నికల హడావుడి నేపధ్యంలో నడుస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కీలకమైనవి ఎన్నికలు. చైతన్యవంతమైన ప్రజల వివేకవంతమైన ఎంపిక దానికి జీవశక్తి. స్వతంత్రం వచ్చిదశాబ్దం దాటినా దేశ ప్రజాస్వామ్యం ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్య వ్యవస్థగా సారవంతం కాలేదు. సత్యవతమ్మను ఓటు వెయ్యటానికి రమ్మని వెంట పెట్టుకు పోవటానికి నక్షత్రకుడి వలే ఒకడు వచ్చి వాకిటి ముందు కూర్చొనటం దానినే సూచిస్తుంది. సత్యవతమ్మ వలెనే జీవన సమస్యల వలయంలో పడి కొట్టుకొంటున్న చాలామంది జనం అయిదేళ్ళకొకమారు వచ్చిపోయే ఎన్నికల పట్ల నిర్లిప్తులు. వాడూ, వాడూ వచ్చి రారమ్మని ఒత్తిడి పెడితే తప్పనిసరి అయ్యో మొహమోటానికో వెళ్లి ఓటేసి వస్తారు. శేషమ్మ, ఆమె కోడలు పొద్దున్నే వెళ్లి ఓట్లు వేసి వచ్చి ఆతరువాత వంట వార్పూ చేసుకొన్నారు. ఎవరికీ ఓటు వెయ్యాలనిగానీ, ఎవరికి వేస్తే తమకు గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని గానీ వాళ్ళు ఆలోచించినట్లు కనపడదు. జబ్బు పడి మంచం లో ఉన్న భర్తను చూసుకొంటూ సాయంత్రం వరకు ఓటు వెయ్యటానికే వెళ్ళలేకపోయిన సత్యవతమ్మ ఓటు ఎవరికీ ఎందుకు వెయ్యాలని ఆలోచించటం అసలు జరగని పని. కానీ అందరూ వెళ్లి ఓట్లు వేసి వచ్చారు. అంటే ఎవరికీ ఓటు వెయ్యాలో ఎవరో చెప్పి పెడితే దానిని వేసి వచ్చారనుకోవాలి. తమ ఓటుతో అధికారంలోకి వచ్చేవాళ్ళకు తమ జీవన స్థితిగతులను మెరుగుపరిచే బాధ్యత వున్నదనిగానీ, అందుకోసం తాము వాళ్ళను నిలదీయ వచ్చనిగానీ ఊహకే రాని అనేకమందికి వాళ్ళు ప్రతినిధులు. ఈ పరిస్థితులలో ప్రజాస్వామ్యం భ్రమ తప్ప మరేమికాదు.

 

పోలింగ్ బూత్ దృశ్యాన్ని చూపి కథ చివరలో కాళీపట్నం రామారావు చేసిన వ్యాఖ్యానం దానినే సూచిస్తుంది. “టైమయ్యాక తలుపులు వేసుకొన్న పోలింగ్ ఆఫీసర్లు శాస్త్రోక్తంగా ఉత్తర విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే తీరూ, కదలికా అర్దరాత్రి ఇంట్లో పడ్డ దొంగల చందంగా ఉంది”— ఉత్తర విధులు అంటే పోలింగ్ పూర్తయ్యాక చేసే పనులు అన్న ప్రస్తుతార్ధాన్ని చెప్తూనే మరణానంతర కర్మలు అన్న భావాన్ని వ్యంగ్యమానం చేస్తుంది. ఇంట్లోపడ్డ దొంగలచందం అన్నమాట పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు సంతరించుకొన్న దోపిడి స్వభావాన్ని సంకేతిస్తుంది. అంతిమంగా ఈ కథ స్త్రీల భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే కుటుంబ వ్యవస్థను, ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సమాంతరంగా చూపి అవలక్షణాలతో కునారిల్లుతున్న వాటిని దీర్ఘ కాలం వర్ధిల్లాలని వాంఛించటం లోని అసంబద్ధతను గురించి హెచ్చరిస్తుంది.

మహదాశీర్వచనం కథను 1948 లో కొడవటిగంటి కుటుంబ రావు రాసిన ‘నిజమైన అపచారం’ కథతో కలిపి చదువుకోవాలి. జీవితంలో సుఖమన్నది ఎరుగక నానా కష్టాలు పడి చచ్చి స్వర్గానికి వెళ్ళిన కనకమ్మ కేసు విచారణ ఆ కథ. భూలోకంలో ఆమె పట్ల ఇతరులు చేసిన అపచారాల విచారణ అది. ఆ విచారణలో ఆమె క్షయ వ్యాధితో తీసుకొంటూ భర్త వైద్యం కోసం తన ఒంటి మీద నగలు అమ్మిన విషయం చెప్తుంది. అతను తన నగలు అమ్మకపోతే తానూ తనపిల్లలూ అంత త్వరగా ఆకలికి మాడి చచ్చేవాళ్ళం కాదంటుంది. ఆ నగలు అమ్మకముందే భర్త చచ్చిపోయి వుంటే తానూ తన పిల్లలు రెండేళ్ళు ఆలస్యంగా చచ్చేవాళ్ళమని, ఈ లోగా పిల్లలు కాస్త రెక్కలు వచ్చి ఏ మూటలు మోసి అయినా తమ బతుకు తాము బతకగలిగే స్థితికి వచ్చేవాళ్ళని వాపోతుంది. ఆ నాటి కనకమ్మ చచ్చింది కనుక తన ఆంతర్యాన్ని బయట పెట్టగలిగింది. బతికే ఉంది కనుక సత్యవతమ్మకు ఆంతర్యాన్ని బయట పెట్టే అవకాశం లేదు. తండ్రి చావుకు సంబంధించిన ఆలోచనలు తల్లికి రావా అని కామేశ్వరి వితర్కించుకొన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అతని వైద్యానికి పుస్తెని అమ్ముకొన్నా అతను కిందట్టు మీదట్టు అవుతుంటే ప్రత్యామ్నాయంగా కట్టుకొన్నపసుపుకొమ్మును కళ్ళకద్దుకొనే లోకశిక్షణ నుండి తయారయిన పతివ్రత ఆమె. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమని పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన దీవన ఆమె పాలిట వరమా శాపమా ఆలోచించమని పాఠకుల వివేకానికి వదిలేసాడు కారా.

 

అలాగే ఈ కథ స్త్రీల జీవితాలకు సంబంధించిన పాత నిర్వచనాలను, విలువలను ప్రశ్నించిన ధిక్కరించిన, పునర్నిర్మాణానికి పూనుకొన్న స్త్రీల స్త్రీవాద కథతోనూ కలిపి చూడవలసినది. స్త్రీ సమస్య, కుటుంబ సమస్య వేటికవిగా ఉండవు, ఆర్ధిక రాజకీయ సమస్యల సంబంధంలోనే వాటిని అర్ధం చేసుకోవాలి, పరిష్కరించు కోవాలి అన్న కారా మాష్టారి శాస్త్రీయ దృక్పధo దీనిని మంచి కథగా చేసింది. ఇది ఇప్పటికి 47 సంవత్సరాల క్రితం వచ్చిన కథ. ఒక జాతి జీవనంలో దాదాపు అర్ధ శతాబ్ది కాలం అంటే తక్కువ కాదు. సామాజిక మార్పులు అనేకం వచ్చాయి. మధ్యతరగతి చైతన్యంలోనూ పరిణామం చోటు చేసుకొన్నది. ప్రజా ప్రయోజనాల రీత్యా చట్ట సవరణలు జరిగాయి. కొత్త చట్టాలు వచ్చాయి. ప్రజాసంక్షేమ విధానాలు రూపొందాయి. సంక్షేమ పధకాలు అమలులోకి వచ్చాయి. ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన నూతన ఆర్ధిక విధానాలు, ఒప్పందాలు ప్రజా జీవితంపై వేసిన ప్రభావం తక్కువది కాదు. అయితే ఇదంతా ఏ మంచికి దోహద పడుతుందో ఎవరి ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నదో స్పష్టం గా తెలుస్తూనే ఉంది. సంస్కరణలు ఎన్ని వచ్చినా కుటుంబ అధికార వ్యవస్థలో గానీ, రాజ్యాధికార వ్యవస్థలో గానీ మౌలికమైన మార్పులు ఏమీ రాలేదు. మానవ సంబంధాలు ఆశించినంతగా ప్రజస్వామికo కాలేదు. అన్ని రంగాలలో మానవీయ విలువల కోసం యుద్ధం అనివార్యమవుతున్న పరిస్థితులలో ‘మహదాశీర్వచనం’ కథా వస్తు జీవిత సంఘర్షణల నుండి, సందర్భం నుండి ఎంత దూరం ముందుకు రాగలిగామో పరీక్షించుకోవలసే ఉంది.

                                                                                             –కాత్యాయనీ విద్మహే

vidmaheసాహిత్యలోకంలో సగం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకొన్న కాత్యాయనీ విద్మహే సాహితీ లోకానికి సుపరిచితులు. పై అవార్డుతో బాటు ఎన్నో అవార్డులను అందుకొన్న కాత్యాయనీ 26 పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు. 1980లో ‘రాయప్రోలు వంగమయ జీవిత సూచిక’ దగ్గర నుండి 1994 లో ‘మహిళా జనజీవన సమస్యలు మూలాల అన్వేషణ’, 1995లో ‘తెలుగు నవల కథానిక విమర్శా పరిణామము’, 1998 లో ‘సాంప్రదాయ సాహిత్యం – స్త్రీవాద దృక్పధం’, 2013లో ‘ప్రాంతీయ చైతన్యం – తెలంగాణా సాహిత్యం’ వరకూ మొత్తం 20 పుస్తకాలను ఆమె రాశారు. ఇవి కాక 25 పుస్తకాలకు సమీక్షలు, 24 పుస్తకాలకు ముందు మాటలు రాశారు.

మొదట్లో యద్దనపూడి సులోచనా రాణి, రంగనాయకమ్మలను ఇష్టంగా చదివిన కాత్యాయనీ రంగనాయకమ్మ నవలల ప్రభావం కొత్త చూపునూ స్త్రీ పురుష సమన్వయపు ఆలోచనను ఇచ్చాయని అన్నారు. కొడవటిగంటి, రావిశాస్త్రి, కారా, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, పి. సత్యవతి, ఓల్గా – ఇలాంటి వాళ్ళ రచనలు విస్తృత జీవితాన్ని, బహుముఖ జీవిత పార్శాలను పరిచయం చేశాయని అంటున్నారు. వరవరరావు, త్రిపురనేని మధుసూధనరావు ఉపన్యాసాలు, వ్యాసాలు .. సాహిత్యాన్ని, సమాజాన్ని అర్ధం చేసుకొని విమర్శనా దృష్టిని అభివృద్ధి చేశాయని అన్నారు.

జీవితాన్ని ప్రేమించిన మనుషుల సృజన, విమర్శ, సాహిత్యం, ఆచరణ ఇచ్చే జీవశక్తి నుండి ఈ తరం రచయితలు పుష్టివంతం కావాలని కోరుకొంటున్నారు కాత్యాయనీ .

వచ్చే వారం ‘చావు’ కధ గురించి వినోదిని

మహదాశీర్వచనం కథ ఇక్కడ:

Download PDF

6 Comments

  • amarendra dasari says:

    ఇలాంటి విశ్లేషణలు ఎంతో అవసరం..’పొరలను’ సామాన్య paathakulu అందుకోలేనపుడు విడమరచి చెప్పడం గొప్ప సాయం చేస్తుంది ..ఈ శీర్షికలో వచ్చిన వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా రావలసిన అవసరం ఉంది ..

  • ఎ.కె.ప్రభాకర్ says:

    ‘అంతిమంగా ఈ కథ స్త్రీల భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే కుటుంబ వ్యవస్థను, ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సమాంతరంగా చూపి అవలక్షణాలతో కునారిల్లుతున్న వాటిని దీర్ఘ కాలం వర్ధిల్లాలని వాంఛించటం లోని అసంబద్ధతను గురించి హెచ్చరిస్తుంది.’

    వ్యాసం చదువుతున్నంత సేపూ యీ వాక్యం కోసం ఎదురు చూశా.

    కాత్యాయిని గారు మాత్రమే చేయగల విశ్లేషణ యిది. వ్యాసం పొడవునా కాత్యాయిని గారి హేతుబద్ధమైన లోచూపు కనపడుతుంది.

    ఒక కథని ఎలా చదవాలో – చదివి ఎలా విశ్లేషించుకోవాలో – జీవితానికీ సమాజానికీ ఎలా అన్వయించుకోవాలో తెలియజేసే అద్భుతమైన మెథడాలజీ వ్యాసం నిండా పరచుకొని వుంది.

  • Sai Padma says:

    కధ ఎలానూ అద్భుతమే.. వ్యాసం కూడా చాలా అద్భుతంగా ఉంది ..ముఖ్యంగా వర్ణన లని పట్టుకొని, సామాజిక , ఆర్ధిక, సాంఘిక పరిస్థితులు విశ్లేషించిన తీరు ఇప్పుడు రాసేవాళ్ళు చాలా నేర్చుకోవాలి అనేట్టు ఉంది .
    చాలా thanks కాత్యాయని గారూ

  • Thirupalu says:

    // స్త్రీ సమస్య, కుటుంబ సమస్య వేటికవిగా ఉండవు, ఆర్ధిక రాజకీయ సమస్యల సంబంధంలోనే వాటిని అర్ధం చేసుకోవాలి, పరిష్కరించు కోవాలి అన్న కారా మాష్టారి శాస్త్రీయ దృక్పధo దీనిని మంచి కథగా చేసింది.//

    జీవి తాన్నీ, సమాజాన్ని అందులో ఉండే రాజకీయ,ఆర్ధిక సామాజిక సమస్యలను జమిలీగా అర్ధం చేసుకుంటే తప్ప జీవితమ్ అర్ధం కాదు. వేటి కవి విడదీసి చూసుకొంటే ఏమి అర్ధం కాదు! చాలా బాగా చెప్పారు మేడమ్! ఓ గొప్ప జీవిత సత్యాలని నెమరేసుకున్న అనుభూతి కలిగించారు ధన్య వాదాలు.

  • “…రాజకీయార్ధిక నేపధ్యం నుండి అధ్యయనం చేయవలసిన కథ ‘మహదాశీర్వచనం’.
    సాహిత్య ప్రక్రియకి ఒక నేపధ్యం ఉంటుంది.
    ఆ ప్రక్రియ కథ కావచ్చు, కవిత కావచ్చు, నవల కావచ్చు, నాటిక కావచ్చు. ఆ నేపధ్యం తెలిస్తే కాని ఆ ప్రక్రియ పూర్తిగా అర్ధం కాదు. బలమైన పునాదుల మీద నిర్మితమైనదేమైనా పదికాలాలు పాటు మనగలుగుతుంది.
    చక్కగా అధ్యయనం చేసి అంత చక్కగాను పాఠకుడికి అందజేసినందుకు కాత్యాయని గారికి అభినందనలు.

  • DrPBDVPrasad says:

    సిద్థాంతాలను అంతర్లీనంగా సహజాతంగా కా.రా.మాస్టారు మహదాశీర్వచనం కథగా చెబితే వేల్చూరి చెప్పినట్లుగా సున్నితంగా పొరలు పొరలుగా సామాజిక,రాజకీయ,ఆర్థికాంశాలను కుటుంబాంశాలను విడదీసి,పాఠకుడికి సిద్థాంత బోధ ఎలా జరిగిందో కాత్యాయినీ విద్మహే మేడమ్ అద్భుతంగా వివరించారు.
    ఉత్తమ కథకుని కథను ఎలా చదవాలో ఏం తెలుసుకోవాలో వ్యాస పరంపర తెలియజేస్తుంది
    సారంగలో వస్తున్న ఈ వ్యాసాలు సంకలనంగా రావాలి

Leave a Reply to Thirupalu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)