ముసలాళ్ళు- మూడు రొట్టెలు

Samanya2014అనగనగా ఒక ఊర్లో పిల్లాపీచు లేనిముసలి భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. నిజానికి దేనికీ లోటు లేదు. వాళ్ళకి చక్కటి ఇళ్ళు, ఇంటి చుట్టూ చెట్లు, కొంత పొలమూ పుట్రా వుండేవి. ఎంత ఉంటే లాభమేమి వాళ్ళిద్దరూ పరమ  పిసినారులు.
ముసలమ్మ రోజుకు మూడు రొట్టెలు మాత్రమే చేసేది. ఉన్నది ఇద్దరు కదా మరి  మూడు రొట్టెలు ఎలా భాగం పెట్టుకునే వారు? ఎలా గంటే ముసలమ్మ రెండు  రొట్టెలు తినేసేది, ఒక్క రొట్టె ముసలయ్యకి మిగిల్చేది. అదిగో ఆ విషయంలో  వాళ్ళకి చాలా గొడవలు వచ్చేసేవి. ముసలయ్య ‘‘ఓయ్‌ ముసలీ! నేను బయటకెళ్ళి  పనీబాట చేసి వచ్చే వాడినకదా నాకు ఒక్క రొట్టె పెట్టి నువ్వు రొండు  రొట్టెలు తినడమేమిటి? ఇదేం న్యాయంగా లేదు. నాకు రెండు రొట్టెలిచ్చి  నువ్వు ఒక్కటి తిను’’ అనేవాడు.
ముసలమ్మ తక్కువైందా ఏమిటి ముసలయ్యకు గట్టిగా సమాధాన మిచ్చేది ‘‘ఓయ్‌  ముసలయ్య! ఇక్కడెవరూ ఖాళీగా కూర్చుని లేరు. నువ్వు బయట పని చేస్తుంటే నేను  ఇంట్లో పని చెయ్యడం లేదా? రొట్టెలు చేస్తుంటే నాకు చేతులు  నొప్పెయ్యట్లేదా? రొట్టెలు కాలుస్తుంటే నాకు చేతులు కాలట్లేదా?’’ అని  చెప్పి గట్టిగా వాదన పెట్టేసుకుని చివరికి తనే రెండు రొట్టెలు తినేసేది.
ఒక రోజు ఏమయింది ముసలయ్య బయట పనికెళ్ళాడు. హఠాత్తుగా చాలా వాన  కురిసేసింది. ముసలయ్య వచ్చే దారంతా మోకాటి లోతు బురదై పోయింది. ఆ బురదలో  కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చే సరికి ముసలయ్యకి తలప్రాణం తోకకొచ్చేసింది.
సరే ఎలాగో ఒకలా ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుని  ఇంట్లోకివచ్చేసరికి ముసలమ్మ వేడి వేడిగా రొట్టెలు తీస్తుంది. అది  చూసేసరికి ముసలయ్యకి ప్రాణం లేచొచ్చింది వెచ్చగా పొయ్యి గడ్డ దగ్గరగా  కూర్చుని ‘‘ఏయ్‌ ముసలీ ఈ రోజు నాకు రెండు రొట్టెలియ్యాలి’’ అన్నాడు ఆమాట  వినగానే ముసలావిడకి చిర్రెత్తు కొచ్చింది. వత్తిన రొట్టె పెనం మీద వేస్తూ  ‘‘అలాఏం కుదరదు నీకు ఒక రొట్టె నాకు రొండు రొట్టెలు ఎప్పట్లాగే’’ అంది  మొహం చిటపటా పెట్టుకుని అది వినగానే ముసలాయనకి చాలా కొపమొచ్చేసింది. అలా  అలా ఇద్దరికీ పెద్ద గొడవయింది. పోట్లాడి…పోట్లాడి ఇక పోట్లాడలేక ఈ  విషయం పై ఒక నిర్ణయం తీసేసుకోవాల్సిందే అనుకున్నారు. అనుకున్నాక ములావిడ  రెండు రొట్టెలు, మాసలాయన ఒక రొట్టె తినేసి ఆలోచించేందుకు కూర్చున్నారు.
ముసలాయన చెప్పింది ముసలామె కాదనీ ముసలామె చెప్పింది ముసలాయన కుదరదనీ  కీచులాడి కీచులాడి చివరకి పొద్దుగూకాక ‘‘సరే రేపుపొద్దున ఎవరైతే మొదట  నిద్రలేసి కళ్ళు తెరిచి మాట్లాడతారో వాళ్ళకు ఒక రొట్టె, తరువాత  లేసేవారికి రెండు రొట్టెలు’’ అని తీర్మానించుకున్నారు.
మరుసటి రోజు తెల్లారింది. కోళ్ళు కొక్కోకోకో మని తెగ కూసాయి, కాకులు  కావు కావు మన్నాయి. ముసలాళ్ళిద్దరకీ మెలకువ వచ్చేసింది. కానీ లేవడం ఎలా?
పొరపాటున మొదట కళ్ళు తెరిస్తే ఇంకేమైనా ఉందా ఒక్క రొట్టే తినాల్సి  వస్తుంది. ఇలా ఆలోచించి ఇద్దరూ పక్కమీద నుండి లేవనేలేదు. బార  పొద్దెక్కింది అయినాసరే వీళ్ళిద్దరూ లేవ లేదు అటు వెళ్తు ఇటు వెళ్తూ  ఊరివాళ్ళు ఏమిటిదీ ఇంకా తలుపు తెరవలేదే ముసలాళ్ళు అనుకున్నారు. సూర్యుడు  నడినెత్తి మీదకి వచ్చేశాడు. ముసలాళ్ళు మాత్రం కళ్ళు తెరవనేలేదు. ఊరి  వాళ్ళకి చాలా అనుమానం వచ్చేసింది ఏదో జరిగే ఉంటుంది అని సరే అదేదో  చూద్దాం అని చెప్పి అందరూ కలిసి ఇంటి తలుపులు పగల కొట్టి లోపలికి  వెళ్ళారు. చూస్తే ముసలమ్మ మూసలాయన పడుకుని వున్నారు. ఊరివాళ్ళు తట్టి  లేపబోయూరు.అంతే వీళ్ళిద్దరు నేనెందుకు లేస్తాను అంటే నేనెందుకు లేస్తాను  అని బిర్ర బిగుసుకు పోయారు. ఊరి ఊళ్ళు పాపం ముసలాళ్ళిద్దరికీ ఒకేసారి
ఊపిరి ఆగిపోయింది అని చెప్పి, మిగిలిన కర్మకాండలు ఎలాగ అని అడగడానికి  రాజుగారి దగ్గరకు వెళ్ళారు. రాజుగారు అంతా విని సరే వాళ్ళకి పిల్ల పీచు  లేరు కదా జరగాల్సినవన్నీ మీరే జరిపించండి అని ఊరి వాళ్ళకి చెప్పాడు.
గ్రామస్తు రాజాజ్ఞ మేరకి గ్రామానికి తిరిగి వచ్చి అందరు కూడపలుక్కుని  పాడె సిద్దం చేశారు.  అంతా వినపడుతున్నా సరే ముసలి వాళ్ళు మాత్రం  పంతానికి పోయి పలక లేదు ఉలక లేదు, ఊపిరి బిగబట్టి పాడె మీదకి చేరారు కానీ  కళ్ళు తెరవలేదు. గ్రామస్తులు అప్పటికే తీసివున్న బొందలో వాళ్ళని  పడుకోబెట్టి మట్టి చల్లుతుండగా ఇహ ముసలాయన భయపడి పోయి కళ్ళు తెరచి లేచి నేను బ్రతికే వున్నాను అన్నాడు.
అది విని ముసలమ్మ సరే ముసలాడు ఎలాగో  లేచాడు లెమ్మని చెప్పి తనూ లేచింది. వీళ్ళిద్దరినీ చూసి జనాలు అమ్మొ  ముసలాళ్ళిద్దరు దయ్యాల య్యారని చెప్పి కకావికలమై ఎటుబడితే అటు పరుగులు  తీసి ఇంటి కొచ్చి నిదానంగా జరిగిందతా గ్రామస్తులకి తెలియజేశారు. వాళ్ళు  చెప్పిందంతా విని గ్రామస్తులు ఔరా అని వారి పిసినారితనానికి ఆశ్చర్యపడి  ముక్కున వేలేసుకుని, ‘‘వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించారుకదా,  పిల్లాపీచు ఎవరూ లేరు కదా ఉన్నదానితో కడుపు నిండా తిని సుఖపడండి  వెళ్ళేెప్పుడు ఎవరమూ మనతోపాటు ఏమీ తీసికెళ్ళలేం కదా’’ అని చెప్పి  ముసలాళ్ళిద్దరికీ బాగా గడ్డి పెట్టారు.
అప్పటి నిండి ముసలాళ్ళిద్దరూ బాగా  వండుకుని కడుపు నిండా తింటూ తోచినంత దానం కూడా చేస్తూ సుఖంగా జీవించారు.

 -సామాన్య
Download PDF

1 Comment

  • tahiro says:

    అబ్బ … చదిన తర్వాత ప్రాణానికి హాయిగా ఉంది. నాకు మాయలు మంత్రాలు వస్తే నేటి రచయితలు అందరూ ఇలాంటి కథలు మాత్రమే రాయు గాక అని శపిస్తాను :)

Leave a Reply to tahiro Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)