కైలాసం బాలచందర్ తో కాసేపు…!

kb

దాదాపు పదేళ్ల క్రితం…

అప్పటికింకా నేను సినిమా ఇండస్ట్రీ కి రాలేదు. ఆ రోజుల్లో సినిమా అంటే విపరీతమైన అభిమానం తప్పితే మరే ఆలోచన లేదు. అప్పట్లో బెంగుళూరు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఆ రోజుల్లో హైదరాబాద్ లో అంటే సినిమా పారడైజో అనే డీవిడి లు దొరికే షాప్ ఉండేది; అక్కడ్నుంచే నాకు ప్రపంచ సినిమా పరిచయం. అలాగే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఉండేది. కొద్దో గొప్పో అక్కడ కూడా సినీ అక్షరాభ్యాసం చేశాను. బెంగుళూరు లో అంతా కొత్త. కొన్నాళ్ళకు అక్కడ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ పరిచయం అయింది. కన్నడంలో సినిమాలు మన కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నా అక్కడొక గొప్ప సౌలభ్యం ఉంది – అక్కడ కమర్షియల్ సినిమాతో బాటు ప్యారలల్ సినిమా ఏదో ఒక విధంగా సజీవంగానే ఉంటుంది. అందుకు కారణం కొంతమంది కన్నడ చిత్ర దర్శకులు చేసిన అవిరామ శ్రమ అని చెప్పుకోక తప్పదు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు పుట్టన కనగల్.

అయితే ఈ విషయం నాకు బెంగుళూరు కి వెళ్లి సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో చేరే వరకూ తెలియదు. అయితే మనం వయసులో ఉన్నప్పుడు మనకన్నీ తెలుసనే భ్రమలోనే ఉంటాము. అది తప్పు కాదు. అయితే ఒక రోజు పుట్టన కనగల్ దర్శకత్వం లో వచ్చిన “గజ్జ పూజ” అనే సినిమా స్క్రీనింగ్ అవుతోందని తెలిసి వెళ్లాను. సినిమా బాగానే ఉంది. ఆ సినిమా అయ్యాక ఎవరెవరో పెద్ద వాళ్ళు పుట్టన్న గురించి మాట్లాడుతూ, వయసులో తనకంటే చిన్నవాడైనా బాలచందర్ గారు ఆయన్ని గురువుగా భావించేవాడని అన్నారు. అప్పటి వరకూ బాలచందర్ అంటే మనకంతా తెలుసనే భావన. తెలుగులో ఆతన చేసిన సినిమాలన్నీ చూసేయ్యడమే కాకుండా, మళ్లీ మళ్ళీ చూసే అలవాటు కూడా! అయితే బాలచందర్ గారి గురించి కొత్తగా తెలిసిన విషయం అది. దాంతో కేబి అనబడే కైలాసం బాలచందర్ గురించి సరికొత్త అసక్తి మొదలైంది.

10881662_755155524574112_1367463442407730471_nబాలచందర్ అంటే మనకి తెలిసిన “ఇది కథ కాదు”, “అంతు లేని కథ” లాంటి సినిమాలే కాదు, తమిళంలో మన తెలుగు వాళ్లకి పరిచయం లేని చాలా సినిమాలే చేశారని అప్పటిదాకా తెలియదు. ఆ క్రమంలో ఒక రోజు బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ చేస్తుంటే వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు, ఆ రోజు అయన తో గడిపిన కొంత సమయం – ఆ తర్వాతే వాకు తెలుగులో కూడా ఎవరైనా బయోగ్రఫీ, ట్రివియా కి మించి ఏదైనా రాస్తే బావుండనిపించింది . ఒక విధంగా అయనతో మాట్లాడిన తర్వాతే నాకు నవతరంగం ఐడియా పుట్టింది. బాలచందర్ గారితో ఆ రోజు మాట్లాడిన ప్రతి క్షణమూ నాకు ఇంకా గుర్తుంది.

బాలచందర్ గారిని నేను కలిసేటప్పటికి దక్షిణ భారత సినిమా మొత్తం అట్టడుగు స్థాయిలో ఉందని ఆ రోజు అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరి అభిప్రాయం. నేను కూడా వారందరి అభిప్రాయంతో ఏకీభవించాను కూడా! కానీ బాలచందర్ ఒక్కరే ఆ రోజు మా అందరి అభిప్రాయంతో విబేధించారు. సినిమా అనే కళ అభివృద్ధి చెందడంలో సినిమా నిర్మాత, దర్శకుల భాధ్యత ఎంత ఉందో, ప్రేక్షకుల పాత్ర కూడా అంతే ఉందని ఆయన అన్నారు. మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టే, అలాంటి సినిమాలను నిర్మించే నిర్మాతలు తనకు దొరికారని, లేదంటే “తన్నీర్ తన్నీర్” లాంటి సినిమా ప్రస్తుత పరిస్థుతుల్లో తను చేయలేకపోయుండే వాడినని అన్నారు ఆ రోజు.

ఒక విధంగా బాలచందర్ గారి మాటల ద్వారా “నవతరంగం” మొదలైతే, ఆయన నన్ను మరో విషయంలో కూడా ఆసక్తిని ప్రేరేపించారు. ఆ విషయం గురించే నేను ప్రస్తుతం కొన్ని బహుళజాతీయ సంస్థలతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాను . అది – ఫిల్మ్ ఆర్కైవల్ గురించి.

ఆ రోజు నేను బాలచందర్ గారితో మాట్లాడుతూ తెలుసుకున్న ఒక బాధాకరమైన విషయమేమిటంటే , ఆయన తీసిన చాలా సినిమాల నెగిటివ్ లు ఇప్పుడు లేకపోవడం. ఆ విషయం గురించే మేము మాట్లాడుకున్నాం ఆ రోజు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాల్లో చాలా ముఖ్యమైన “తన్నీర్ తన్నీర్” లాంటి సినిమా కాపీలు కేవలం సిడి కో లేదా విహెచెస్ టేప్ కి మాత్రమే పరిమితమయ్యాయి . సినిమాని ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ ఒక కళ గా గుర్తించనంతవరకూ మనకీ దౌర్భాగ్యం తప్పదని ఆ రోజు ఆయన అన్నారు. అయితే ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే…మొన్నీ మధ్య ఒక ఫిల్మ్ స్కూల్ లో క్లాసులు చెప్తూ బాలచందర్ గారు ఎంతమందికి తెలుసని అడిగితే…సగం మందికంటే తక్కువ మంది చేతులెత్తగా…అందులో ఇద్దరో ముగ్గురికి మాత్రమే ఆయన సినిమాలు చూసిన గుర్తుంది.

ఒక గొప్ప కళాకారుడు, రచయిత, దర్శకుడు… ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళని ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతరించి పోయిన జీవుల్లా, బాలచందర్ లాంటి వాళ్ళు కూడా అంతరించినపోయిన గొప్పదర్శకుల జాతికి చెందుతారేమో!

ఎందుకంటున్నానంటే …నాకిప్పటికీ బాగా గుర్తు. రంజని తో పెళ్ళాయ్యాక మొదటి సారి మద్రాస్ వెళ్లి ఏదో పని మీద లజ్ ఏరియా లో నడూస్తుండగా ఒక ఇల్లు చూపించి ఇది బాలచందర్ గారి ఇల్లు అని చెప్పింది రంజని. ఇక భవిష్యత్ లో ఇలాంటి అనుభవాలు మనకి ఉండవేమో! ఒకటి అంతా అపార్టెమెంట్ల మయమైన ఈ చోట ఎవరి ఇళ్లు ఎక్కడో గుర్తుపెట్టుకోవాల్సిన గొప్పతనం లేకపోవడం ఒక కారణమైతే, అంత గొప్పగా ఫలానా దర్శకుడి ఇళ్లు, ఫలానా దర్శకుడు ఇక్కడే కూర్చుని కాఫీ తాగుతూ కథలు రాసుకునే వారనో చెప్పుకోగలిగినంత గొప్ప వాళ్ళు ఇక లేరనే నా నమ్మకం. అలాంటి వారిలో చివరి తరానికి చెందిన కైలాసం బాలచందర్ ఈ రోజు మనతో లేరంటే…తలుచుకుంటేనే మనసంతా ఒకరకమైన శూన్యంతో నిండిపోతోంది.

బాలచందర్ గారి గురించి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయన గురించి తలుచుకుంటే…ఒక విషయం గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు తీయలేదు… కానీ ఆయన చూసిన మంచి సినిమాల గురించి మెచ్చుకుంటూ లేఖలు రాశారు. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే మరొకరి కళ ను అభినందించగలడు.

ఆయన గురించి రాయాలంటే ఇంకా చాలా రాయొచ్చు. ఆయన సినిమాల గురించి, ఆయన గురించీ…ఇలా ఎంతో రాయొచ్చు. కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళకి మనం ఎంత రాసినా వృధా ప్రయాసే! వందకి పైగా సినిమాలు చేసిన ఆయన గురించి ఈ రెండు పేజీలు ఏం సరిపోతాయి? ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా అంతే! ఈ రెండు పేజీల్లో సంక్షిప్తం చేయగలిగింది కాదు ఆయన చరిత్ర.

మనం అప్పుడప్పుడూ అంటుంటాం, “ఆ రోజుల్లో…రాజులుండే వాళ్ళు, వాళ్ళు గుర్రాలెక్కి, కత్తి పట్టి యుద్ధాలు చేసేవారు,” అని…ఇప్పుడూ అంతే…ఆ రోజుల్లో “బాలచందర్ అని గొప్ప దర్శకుడు ఉండేవాడు. ఆయన మార్కెట్, బాక్సాఫీస్, ప్రేక్షకులు అని ఆలోచన లేకుండా, కాలం కంటే ముందుండే కథల్ని ఎన్నుకుని సినిమాలు తీసేవాడు,” అని చెప్పుకోవాల్సి వస్తుంది.

ఎంతైనా పేరులోనే కైలాసం ఉన్నవారాయన. ఇంత గొప్ప సినిమాలు తీసినందుకైనా ఆయనకి కైలాసంలోనో లేదా మరింకెక్కడో ఆయన ఆత్మకి శాంతి కలిగే అవకాశం దక్కే ఉంటుందనో లేదా, ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారనో మాయమాటలతో , బూటకపు పదజాలంతో ఆయన్ని వర్ణించవచ్చు. కానీ అలా రాయడం ఆయనకి ఎంత నచ్చి ఉండేదో నాకు తెలియదు.

కానీ ఒకటి మాత్రం నిజం. ఇవాళ బాలచందర్ గారు లేకపోవడం సినీ ప్రేమికులందరికీ తీరని లోటు.

-వెంకట్ సిధారెడ్డి

Download PDF

8 Comments

  • పాతికేళ్ళక్రితం పాండిచేరీలో చదువుకొనేటపుడు ఒకసారి శ్రీ బాలచందర్ రేడియో ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఈ చెవుల్లో వినిపిస్తున్నాయి …. అవి
    1. ఏదైనా విషయం చెప్పేటప్పుడు “తలలోకి మేకు కొట్టినట్టు ప్పాలి”
    2. నేనేదైనా ఒక ఆలోచన చేస్తే ఆ విషయం అంతవరకూ ఎవరూ చెయ్యలేదు కదా అని చూసుకొంటాను
    ౩. ఏక్ దూజేకేలియే సినిమా చూసి బోంబే లో ఒక యువ జంట ఆత్మహత్య చేసుకొన్న విషయం చాన్నాళ్ళు నాలో అపరాధభావన కలిగించేది. పరిహారంగా “వానమె ఎల్లం” (ఆకాశమే హద్దు) అనే సినిమా తీసాను (జీవితంలో ఓడిపోయిన వ్యక్తులు మరలా జీవితంలో నిలదొక్కుకొంటారు అనే కథాంశంతో)

    పై అంశాలు ఏ కళాకారుడికైనా ముఖ్యమైన కమాండ్ మెంట్స్ లాంటివి.

    ఆయన తీసిన సినిమాల్లో నాకెప్పటికీ గుర్తుండిపోయే సీన్లలో

    1.ఓ సినిమాలో ఒక పింప్ తన సంపాదనను లెక్కపెట్టుకొంటూ ఉంటాడు, కెమేరా పైకి జరుగుతుంది అక్కడ ప్రభుత్వం జారీచేసిన బోర్డ్ ఉంటుంది దానిపై “pay your taxes” అని ఉంటుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి కంగారు పడి జారుకొంటాడు.

    2.వెన్నిరాడై (?) సినిమాలో హీరోయిన్ prostitution ద్వారా డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. తల్లికి అనుమానం వచ్చి భర్తతో చెప్పినప్పుడు “నాకూతురు అలాంటిది కాదు కాదు” అంటూ హీరోయిన్ తండ్రి పూజగదిలో గంట వాయిస్తూ, చేతిలో కర్పూరం వెలిగించుకొని దేవుడిని పూజిస్తాడు. (భిన్న అర్ధాలు ధ్వనించే ఈ సీన్ ని అసలు కన్సీవ్ చెయ్యటానికి ఎంత ధైర్యం కావాలి)

    ౩. సింధుభైరవి చిత్రంలో సుహాసిని హీరోని, నీ భార్యకు సంగీతం గురించి తెలుసా అని ప్రశ్నించాకా సీన్ కట్ అయ్యి “కిలో వంకాయిలు ఎంత” అంటూ హీరో బార్య కూరగాయలు బేరం ఆడటం సీన్ వస్తుంది. (సినిమా మొత్తానికి ఆయివు పట్టయిన ఈ పాయింటును మరెక్కడా చెప్పడు దర్శకుడు)

    4. ఆకలిరాజ్యం సినిమాని తెలుగులో తీయటానికి భారతీయార్ కవితల లాంటివి తెలుగులో లేవని చాన్నాళ్ళు నిరాకరించారట. (తమిళ్ మాతృకలో బారతీయార్ కవితలను వాడుకోవటం జరిగింది) గణేష్ పాత్రో శ్రీశ్రీ కవితలను వినిపించాకా వెంటనే తెలుగు వెర్షన్ ని బాలచందర్ దర్శకత్వం వహించడానికి ఒప్పుకొన్నాడంటారు. శ్రీశ్రీ కవితలు (సినిమాకు ముప్పై నలభై ఏళ్ల ముందు వ్రాసిన కవితలు) ఆ సినిమాలో సందర్భోచితంగా ఒదిగిపోవటం ఇప్పటికీ ఒక విస్మయమే నాకు. ముఖ్యంగా చివరలో వచ్చే “కూటికోసం, కూలికోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం….” అనే పాట. ఇది దర్శకుని నిబద్దతకు, డెసిషన్ మేకింగ్ కు గొప్ప ఉదాహరణగా మిగిలిపోతుంది.

    బాలచందర్ ఆత్మకు శాంతి కలగాలి.
    బొల్లోజు బాబా

    • kandukuri ramesh babu says:

      మీ ఉత్తరం ఎంత బాగుంది. బాలచందర్ గారి గురించి మరింత అర్థం అయ్యే విశేషాలు చాల బాగా పంచుకున్నారు. ముక్యంగా 1,2, 3… “వానమె ఎల్లం”… థాంక్స్ ప్లీజ్.

  • Thirupalu says:

    ‘వెన్నిరాడై’ కాదండీ అరగేట్రం ఆ సినిమా పేరు. అరంగేట్రం, అవల్‌ వరు తొదర్‌ కదై( అంతులేని కధ) లాంటి సినిమాలు తీసి “వీడు బ్రాహ్మణుడై పుట్టి బ్రహ్మణ బతుకుని బజారు కీడుస్తాడు అని అయన్ని తిట్టిన లాళ్లు వున్నారు. బాలచందర్‌ తీసిన సర్వర్‌ సుందరం, దగ్గర నుండి ప్రతి సినిమా మానవతా విలువలకు పెద్ద పీఠ వేయడ మే ఆయనలోని కళాతృష్ణ . తన్నీర్‌ తన్నీర్‌ ( దాహం, దాహం) రాజ్యాంగం ఏర్పరిచిన ప్రజా స్వామిక విలువలుకు పట్టం కట్టాడు. దాన్ని ప్రజలకు భాగస్వామ్యం చేయకపోతే ఏ మాత్రం నిలవబోదని సందేశమిచ్చాడు. మధ్యతరగతి జీవితాల్లో హక్కులు కోల్పోతున్న స్త్రీలగురించి ఆయన చాలా సినిమాళ్లో ఎత్తి చూపేడు.
    కళా పిపాసులకు అయన మరణ వార్త అశనీ పాతమే!

    • తిరుపాలు గారు. థాంక్యూ సార్. తొందరలో పోస్ట్ చేసాను. స్పెల్లింగ్ మిస్టేక్ లు చాలానే ఉన్నాయి. చదువరులు మన్నించగలరు.

  • Lalitha P says:

    “ఆయన గురించి తెలిసిన వాళ్లకి మనం ఎంత రాసినా వృధా ప్రయాసే! ఆయన గురించి తెలియని వాళ్లకి కూడా అంతే ! … ఈ రెండు పేజీలు ఏం సరిపోతాయి?” బాగా చెప్పారు. ఓ రెండు తరాలనైనా కదిపి కుదిపేసిన ఆలోచనలూ దర్శకత్వమూ ఆయనవి. సినిమాలు తీయటం మానేసి చాలా కాలమైనా, ఆయన ఇక లేరనుకుంటే … ఎంతో దిగులు.

  • Gundeboina Srinivas says:

    సామాన్యుని వెతలను సామాజిక కోణం నుండి దృశ్యమానం చేసిన అరుదైన దర్శకుడు బాలచందర్. ఆయన గురించి ఎంత రాసినా ఇంకా మిగిలే ఉంటుంది .రచయిత అభినందనీయులు .

  • అయితే ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే…మొన్నీ మధ్య ఒక ఫిల్మ్ స్కూల్ లో క్లాసులు చెప్తూ బాలచందర్ గారు ఎంతమందికి తెలుసని అడిగితే…సగం మందికంటే తక్కువ మంది చేతులెత్తగా…అందులో ఇద్దరో ముగ్గురికి మాత్రమే ఆయన సినిమాలు చూసిన గుర్తుంది.

    వీళ్ళు తీస్తున్నవి సినిమాలే. ప్చ్.. మీ నివాళి బాగుంది సార్

  • నిశీధి says:

    ఆర్ట్ సినిమాల సబ్జెక్ట్స్ ని జనం మెచ్చే మెయిన్ స్త్రీం మూవీస్ గా మలచటం బాల చందర్ గారి మొదటి విజయం . నైస్ ఆర్టికల్ .

Leave a Reply to నిశీధి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)