Balachander – A Eulogy

చిత్రరచన: బంగారు బ్రహ్మం
 చిత్రరచన: బంగారు బ్రహ్మం

 

ismail“జీవితం సినిమా కాదు”

-ఇది ప్రతి ఒక్కరూ విన్న డైలాగే, కానీ కొన్ని జీవితాలు సినిమాలను చూసి నడక సాగిస్తాయి, కొన్ని జీవితాలు సినిమా కథలుగా మారతాయి. నా విషయంలో మొదటిదే నిజమయ్యింది. ‘మరోచరిత్ర’ అనే సినిమా, నా జీవితంలోని కీలక మలుపులకు-అప్పుడు నేను తీసుకొన్న నిర్ణయాలకు కారణభూతమయ్యింది. ఆ సినిమా కథ పుట్టింది ఓ మేధావి మస్తిష్కంలో. ఇప్పుడు ఆ వ్యక్తి కానరాని తీరాలకు సాగిపోయారు.

బాలచందర్ ఇక లేరు!

ఏ మనిషయినా భౌతికంగా ఇక మనకు కనబడరు అంటే ఆ భావనే మనకు బాధ కలిగిస్తుంది. అంతే కదా… కానీ జీవితంలో ఒక్కసారైనా చూడని మనిషి పోతే దు:ఖం ఎందుకు కలుగుతుంది? ఆ మనిషి ఏదో ఒక రూపంలో మనల్ని ప్రభావితం చేసి ఉంటారు కాబట్టి . నా వరకు అలా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో బాలచందర్ ఒక్కరు.

తెలుగు, కన్నడ, తమిళ సినీరంగాల్లో వందకు పైగా సినిమాలకు రచయితగా పనిచేసి, ఎనభై పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ‘మరోచరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘అంతులేని కథ’, ‘ఇది కథ కాదు’, ‘రుద్రవీణ’ వంటి కళాఖండాలను అందించిన దిగ్దర్శకుడాయన. అలాగే చలనచిత్ర పరిశ్రమకు ఒక ‘కమల హాసన్’ ను, ఒక ‘రజనీ కాంత్’ను అందించిన కళాస్ప్రష్ట. ఆ మధ్య ఓసారి నా మార్కెట్ విలువ కొన్ని వందల కోట్లు అన్నారాయన…ఈ ఇద్దరినీ గుర్తుపెట్టుకొని.
తన కథలలో నాయకులకు కాకుండా కథకే పెద్ద పీట వేసిన వ్యక్తి. సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ ప్రజ్ఞను గుర్తించి, దాన్ని సానబెట్టి ప్రకాశింపచేసిన మార్గదర్శి. ఇందుకు మరో ఉదాహరణ ‘మరోచరిత్ర’    కోసం ఆయన ఎంపిక చేసిన ‘అభిలాష’. పెద్ద పెద్ద కళ్లున్న ఈ పదో తరగతి చదివే అమ్మాయిని ‘సరిత’ గా పరిచయం చేసారు. అద్భుతమైన నటనే కాకుండా మరెంతో అందమైన వాచకం కలిగిన ఈమె, ఆ తర్వాత  ఎందరో హీరోయిన్లకు తన గాత్రాన్ని అరువిచ్చింది.
  ‘కన్నెపిల్లవని కన్నులున్నవని’ , ‘సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్’ , ‘అరె ఏమిటి లోకం’, ‘తాళి కట్టు శుభవేళా’ , ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ , ‘ ఏ తీగ పువ్వునో..’, ‘జూనియర్ …జూనియర్… అటు ఇటు కాని హృదయము తోటి’… వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రాసే అవకాశం తన కథల ద్వారా “ఆచార్య ఆత్రేయ” గారికి కల్పించారు.

తన కథల్లో తొంగిచూసే నిజాయితీ, ఆ కథ ఎలాంటిదయినా ప్రతి సినిమాను ఓ ‘cult classic’గా నిలబెట్టే సత్తా ఉన్న దర్శకుడు బాలచందర్ గారు. సమస్యల వలయంలో చిక్కుకున్నా, చెరగని మధ్యతరగతి మందహాసాన్ని తెరకెక్కించిన ఘనుడు. ఇప్పుడు ఆ విలువలు మనం గుర్తించకపోయినా వాటిని వెండితెరపై అజరామరం చేసిన సృజనాత్మక ఋషి.

 

పుట్టిన ప్రతి వారు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకోక తప్పదు. కానీ తనకంటూ ఓ స్థానమేర్పరచుకొని, తన ఆలోచనల ద్వారా పది మందిని ప్రభావితం చేయడం కొద్ది మందికే దక్కే అదృష్టం. కళకు పరమావధి అదే. మామూలు ‘సినిమా’ను  గొప్ప కావ్యాల సరసన, సాహిత్యం సరసన నిలబెట్టగలిగే దమ్మున్న దర్శకుడు ఇక లేడు.

Sir, we are going to miss you, but I celebrate your life today. adios!

-ఇస్మాయిల్ పెనుకొండ

చిత్రం: బంగారు బ్రహ్మం

Download PDF

2 Comments

  • నిజమే, బాలచందర్ అందరికంటే భిన్న మార్గం – తనదైన మార్గం లో పయనించిన దర్శకుడు. అంతులేని కథ, ఆకలిరాజ్యం, మరో చరిత్ర, అందమైన అనుభవం,రుద్రవీణ, ఇది కథ కాదు…ఇలా అన్నీ ఒకదానికొకటి విభిన్నమైన కథలు. అందులోని పాత్రలు సమాజంలో మనకు నిత్యం కనిపించే మనుషులే! మధ్యతరగతి మందహాసాన్ని అంత మధురం గానూ, చేదు గానూ చూపిన గొప్ప వ్యక్తి. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన గొప్ప సంపద రజనీకాంత్, కమలహాసన్ లు.
    ఆయన ఇంకా లేరు అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • రమణమూర్తి says:

    బాగుంది ఇస్మాయిల్ గారూ! కాకపోతే, ఆత్రేయ ఈ సినిమాల ద్వారా అందించిన చాలా పాటల క్రెడిట్ కణ్ణదాసన్ గారికి దక్కుతుంది. (ఎవరి పొరపాటో తెలీదుగానీ, ‘వయసు పిలిచింది’ దర్శకుడు బాలచందర్ కాదు, శ్రీధర్)

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)