-ఇది ప్రతి ఒక్కరూ విన్న డైలాగే, కానీ కొన్ని జీవితాలు సినిమాలను చూసి నడక సాగిస్తాయి, కొన్ని జీవితాలు సినిమా కథలుగా మారతాయి. నా విషయంలో మొదటిదే నిజమయ్యింది. ‘మరోచరిత్ర’ అనే సినిమా, నా జీవితంలోని కీలక మలుపులకు-అప్పుడు నేను తీసుకొన్న నిర్ణయాలకు కారణభూతమయ్యింది. ఆ సినిమా కథ పుట్టింది ఓ మేధావి మస్తిష్కంలో. ఇప్పుడు ఆ వ్యక్తి కానరాని తీరాలకు సాగిపోయారు.
బాలచందర్ ఇక లేరు!
ఏ మనిషయినా భౌతికంగా ఇక మనకు కనబడరు అంటే ఆ భావనే మనకు బాధ కలిగిస్తుంది. అంతే కదా… కానీ జీవితంలో ఒక్కసారైనా చూడని మనిషి పోతే దు:ఖం ఎందుకు కలుగుతుంది? ఆ మనిషి ఏదో ఒక రూపంలో మనల్ని ప్రభావితం చేసి ఉంటారు కాబట్టి . నా వరకు అలా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో బాలచందర్ ఒక్కరు.
తన కథల్లో తొంగిచూసే నిజాయితీ, ఆ కథ ఎలాంటిదయినా ప్రతి సినిమాను ఓ ‘cult classic’గా నిలబెట్టే సత్తా ఉన్న దర్శకుడు బాలచందర్ గారు. సమస్యల వలయంలో చిక్కుకున్నా, చెరగని మధ్యతరగతి మందహాసాన్ని తెరకెక్కించిన ఘనుడు. ఇప్పుడు ఆ విలువలు మనం గుర్తించకపోయినా వాటిని వెండితెరపై అజరామరం చేసిన సృజనాత్మక ఋషి.
పుట్టిన ప్రతి వారు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకోక తప్పదు. కానీ తనకంటూ ఓ స్థానమేర్పరచుకొని, తన ఆలోచనల ద్వారా పది మందిని ప్రభావితం చేయడం కొద్ది మందికే దక్కే అదృష్టం. కళకు పరమావధి అదే. మామూలు ‘సినిమా’ను గొప్ప కావ్యాల సరసన, సాహిత్యం సరసన నిలబెట్టగలిగే దమ్మున్న దర్శకుడు ఇక లేడు.
Sir, we are going to miss you, but I celebrate your life today. adios!
-ఇస్మాయిల్ పెనుకొండ
చిత్రం: బంగారు బ్రహ్మం
నిజమే, బాలచందర్ అందరికంటే భిన్న మార్గం – తనదైన మార్గం లో పయనించిన దర్శకుడు. అంతులేని కథ, ఆకలిరాజ్యం, మరో చరిత్ర, అందమైన అనుభవం,రుద్రవీణ, ఇది కథ కాదు…ఇలా అన్నీ ఒకదానికొకటి విభిన్నమైన కథలు. అందులోని పాత్రలు సమాజంలో మనకు నిత్యం కనిపించే మనుషులే! మధ్యతరగతి మందహాసాన్ని అంత మధురం గానూ, చేదు గానూ చూపిన గొప్ప వ్యక్తి. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన గొప్ప సంపద రజనీకాంత్, కమలహాసన్ లు.
ఆయన ఇంకా లేరు అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
బాగుంది ఇస్మాయిల్ గారూ! కాకపోతే, ఆత్రేయ ఈ సినిమాల ద్వారా అందించిన చాలా పాటల క్రెడిట్ కణ్ణదాసన్ గారికి దక్కుతుంది. (ఎవరి పొరపాటో తెలీదుగానీ, ‘వయసు పిలిచింది’ దర్శకుడు బాలచందర్ కాదు, శ్రీధర్)