అవును! పుస్తకం కూడా ప్రేమిస్తుంది!

అవును ! పుస్తకం కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నేను ఎరుగుదును. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు గుడ్డి దీపమై దారి చూపింది పుస్తకమే. ఆశయాలలో ఆవేదనలో తోడై నిలిచి, పెను బాధ శరద్రాత్రి చలి లాగ హృదయాన్ని గడ్డ కట్టిస్తుంటే నులి వెచ్చని నిప్పు కణికల్లాంటి భావాలు మనసులో రాజేసింది పుస్తకమే. ఎదురు దెబ్బలు తిని అలిసి ఉన్న మనసుకు “సాంత్వన” అనే పదం యొక్క నిజ జీవిత అర్థం చెప్పింది పుస్తకమే.

పుస్తకాలకి నా జీవితం లో ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను చదివిన పుస్తకాలు లేకపోతే నేను లేను. నా వ్యక్తిత్వానికీ, నా భావాలకీ, నా అలోచనలకీ, అన్నిటికీ పుస్తకాలే ప్రేరణ. నా జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి సంఘటన నేను చదివిన ఏదో ఒక పుస్తకంలోని ఏదో ఒక సన్నివేశం తో రిలేట్ అవుతూ ఉంటుంది.

image1 నాకు చిన్నప్పటి నుంచి చదవడం ఒక వ్యసనం. అదీ ఇదీ అని లేదు, ఏది దొరికితే అది చదివేసేవాడిని. వారపత్రికలు మొదలు మా స్కూలు లైబ్రరీ, తిరువూరు లైబ్రరీ లో ఉన్న పుస్తకాలన్నీ దాదాపు చదివేసాను. కోలాహలం లక్ష్మణరావు, ధనికొండ హనుమంతరావు లాంటి వాళ్ళు అప్పట్లో బాగా రాసేవారు. ఇప్పటివాళ్ళకి వీళ్ళ పేర్లు కూడా తెలియవు అనుకోండి, అది వేరే సంగతి. 9th క్లాసు కి వచ్చే సరికే నేను చాలా ఫాస్ట్ రీడర్ ని (Fast Reader). పుస్తకం లో ఉన్నదంతా యధాతథంగా చదవడం టైం వేస్ట్ అనుకునేవాడిని. వర్ణనలు ఉపోద్ఘాతాలు పక్కన పడేసి సూటిగా కథ చదవడం అలవాటు అయ్యింది. డిటెక్టివ్ నవలలు రీడింగ్ హ్యాబిట్ పెంచడం లో బాగా ఉపయోగపడతాయి. మధుబాబు, గిరిజశ్రీ భగవాన్, జై భగవాన్ వంటి వాళ్లని బఠాణీలు నవిలినట్టు నవిలేశాను. రోజుకి కనీసం పది నవలలు. నేనే సొంతగా ఒక డిటెక్టివ్ నవల కూడా రాయడానికి ట్రై చేశా. నా డిటెక్టివ్ పేరు Turner. (వాడు enter అవ్వడం తోటే స్టోరీ Turn అయిపోతుందని ఆ పేరు పెట్టా).

ఇలా అనర్గళంగా సాగిపోతున్న నా పుస్తక భక్షణ కి మొదటిసారి అడ్డుకట్ట వేసిన వాడు చలం. అప్పట్లో చలం పుస్తకం కనపడగానే అందరూ మొహం చిట్లించుకునేవారు. 8th క్లాసు లో మొదటిసారి చలాన్ని చదివాను. మైదానం – సూటిగా కథ కోసం వెతుకుతూ, సంభాషణలు మాత్రమే చదవడం వల్ల ఆ పుస్తకం నాకు ఏమీ అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకోడానికి నేను తన్నుకుంటున్న సమయంలో మా నాన్న నా లోపాన్ని ఎత్తి చూపించారు. “రచయిత భావాలని చదవాలి రా. ఉత్త కథ మాత్రమే చదవడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు.” అని చెప్పారు. అప్పుడే మొదటిసారిగా ప్రతి రచయితా తన పుస్తకాల ద్వారా కొన్ని భావాలని ప్రతిపాదిస్తాడనీ, ఆ భావాలకి చాలా importance ఉందనీ తెలిసింది నాకు. అప్పటిదాకా నేను చదివింది అంతా కాలక్షేపం సాహిత్యమే అని కూడా అర్థమయిపోయింది. అప్పటినుంచే పుస్తకాన్ని జీవితానికి దగ్గరగా తీసుకోవడం మొదలుపెట్టాను.

నా జీవితం మీద బలమైన ప్రభావం చూపిన మొదటి పుస్తకం సోవియట్ పుస్తకం “తిమూర్ – అతని దళం”. సోవియట్ సాహిత్యం ఆదరణ బాగున్న రోజుల్లో మా ఊరికి విశాలాంధ్ర పుస్తకాల వ్యాన్ వచ్చేది. image2ఆ వ్యాన్ దగ్గర పాటలు పాడినందుకు బహుమతి గా ఇచ్చారా పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడో మిస్ అయ్యింది. ఎన్నో రోజులు వెతికాను. ఈ మధ్యనే అనిల్ బత్తుల గారి పుణ్యమా అని ఇప్పుడు PDF రూపంలో మళ్లి దొరికింది. గ్రామానికి సేవ చెయ్యడం కోసం ఒక దళం తయారు చేసుకుంటాడు తిమూర్. ఆ పుస్తకం ఇచ్చిన స్పూర్తితో “చిల్డ్రన్ జన సేవా దళ్” అనే పేరుతో ఒక సంఘం పెట్టాము. ఊళ్లో వాళ్ళ కి పనులు చేసిపెట్టేవాళ్ళం, కలిసి పుస్తకాలు అధ్యయనం చేసేవాళ్ళం. ఆ తరవాత దాని పేరు లెనిన్ బాల సంఘంగా మార్చాము. అప్పట్లో “భూభాగోతం” నాటకం ఒక సంచలనం. మా పిల్లల దళం రాష్ట్రం మొత్తం తిరిగి 425 పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

నా బాల్యంలో ఎక్కువ భాగం పినపాక లో మా మామయ్య వాళ్లింట్లో గడిచింది. అక్కడ పేరు తెలియని బండ పుస్తకం ఒకటి ఉండేది. ఎప్పటిదో అట్ట చిరిగిపోయిన పాత పుస్తకం అది. అది ఎన్ని సార్లు చదివానో నాకే గుర్తులేదు. image3అందులోని ప్రతి సన్నివేశం ప్రతి వాక్యం నాకు బాగా గుర్తు. పొయ్యిలోకి కట్టెలు మండనప్పుడల్లా మా అత్త అందులోంచి నాలుగు పేజీలు చింపి పొయ్యిలో వేస్తుండేది. 1975లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మళ్లి పినపాక వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత ఆ పుస్తకం నా కంట పడింది. వందల పేజీల పుస్తకం లో 40 పేజీలే మిగిలాయి. దాని పేరు తెలుసుకోవాలని బలమైన కోరిక పుట్టింది. ఆ బతికిపోయిన 40 పేజీలు పట్టుకుని బెజవాడంతా తిరిగా. లైబ్రరీలు, పాత పుస్తకాల కొట్లు దేన్నీ వదిలిపెట్టలేదు. లాభం లేకపోయింది. చాలా నిరాశ చెందాను.

నూజివీడు కాలేజీలో డిగ్రీ లో చేరాను. ఊరు మారినా వ్యసనాలు మారవు. సంవత్సరంలో సగం రోజులు లైబ్రరీలోనే గడిపేవాడిని. ఆనందనిలయం లాంటి 1000 పేజీల పుస్తకాలు అలా చదివినవే. ఆ సమయం లో చదివిన స్పార్టకస్ , ఏడు తరాలు నా భావాల పైన పెను ప్రభావం చూపాయి. మామూలు నవలే అయినా మేనరికాల మీద కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన “ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల నా మీద ఎక్కువ ప్రభావం చూపింది. సోవియట్ లిటరేచర్, 2వ ప్రపంచ యుద్ధం గురించి వచ్చిన ప్రతి పుస్తకం చాలా ఆసక్తి తో చదివాను. image4తిరువూరు విద్యార్థి ఉద్యమంలో చేరాక మంచి ఉపన్యాసకుడిగా గుర్తింపు రావడంలో ఈ పుస్తకాలన్నీ దోహదం చేశాయి.

చదువయిపోయింది. ఆర్ధిక పరిస్థితుల సహకరించకపోవడంతో ఉద్యమం నుంచి పక్కకి వచ్చి విజయవాడ KVR ట్రావెల్స్ లో పనికి చేరాను. 2 సంవత్సరాలు ఉద్యమాలకి, చదవడానికి దూరంగా గడిచిపోయాయి. చాలా వెలితిగా ఉండేది. ఆర్థికంగా ఎంత బాగున్నప్పటికీ అక్కడ ఎక్కువరోజులు ఇమడలేకపోయాను.
దాసరి నాగభూషణం గారి ప్రోద్బలం మేరకు విశాలాంధ్ర బుక్ హౌస్ లో సేల్స్ మాన్ గా చేరాను. తిరుపతిలో పోస్టింగ్. విజయవాడ చంద్రం బిల్డింగ్స్ లో ట్రైనింగ్. అక్కడ ఉన్న అన్ని విభాగాలలో తిరుగుతూ గోడౌన్ దగ్గర ఆగిపోయాను. అదొక పెద్ద పుస్తకాల సముద్రం లాగా ఉంది. ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎన్ని రోజులైందో అన్ని పుస్తకాలు ఒకే సారి చూసి. సంవత్సరాల తరబడి ఎడారిలో తిరుగుతున్న Cow Boy కి నిధి దొరికినట్టు అయ్యింది.

కొత్తవీ పాతవీ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఇక నేను ఆ సముద్రంలో ఈదడం మొదలుపెట్టాను. నాలుగో అలమారలో పై వరస లో ఉన్న పాత పుస్తకాలని కదిలిస్తున్నప్పుడు చెయ్యి జారి రెండు పుస్తకాలు కింద పడ్డాయి. అందులో ఒకటి విచ్చుకుంది. నేను నిచ్చెన దిగుతూ ఆ పుస్తకం కేసి చూస్తున్నాను. దగ్గరవుతున్నా కొద్దీ ఆ పుస్తకంలోని వాక్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందులోని ఒక వాక్యం చదవగానే నా గుండె ఝల్లుమంది. “తనొచ్చిందే గాక తన లంజని కూడా తెచ్చాడు. image5ఏదీ.. ఆ కర్ర ఇలా ఇవ్వు. వీడి బుర్ర బద్దలు గొడతాను” పావెల్, మొట్కా మధ్య సంభాషణ. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాల తెరల కింద శిథిలమైపోయిన ఒక చిరిగిపోయిన పుస్తకం నా కళ్ళ ముందు కదిలింది. అదే.. అదే… పేరు కనుక్కోవడానికి నేను విజయవాడ లో కాళ్ళు అరిగేలా తిరిగిన పుస్తకం ఇదే. ఈ పుస్తకంలో పేజీలు పొయ్యిలో వేసిందనే మా అత్తని నేను రకరకాలుగా తిట్టుకుంది. “కాకలు తీరిన యోధుడు” పుస్తకం పేరు. నికోలాయ్ వొస్త్రోవ్స్కీ రచయిత. పరమానందం కలిగింది. ఎగిరాను, గంతులేసాను, గట్టిగా నవ్వాను. నా ఆనందానికి నాకే ఆశ్చర్యమేసింది. పుస్తకానికీ నాకూ ఉన్న Bonding బలమెంతో అప్పుడే అర్థమయ్యింది నాకు.

విశాలాంధ్రలో పని చాలా తృప్తిగా ఉండేది. ఆర్థికంగా పెద్ద ప్లస్ ఏం కాకపోయినా నాకు నచ్చిన పుస్తకాల మధ్యే నా పని. కాకపొతే షాపులో కూచుని పుస్తకాలు చదువుకోకూడదని రూలు. అదొక్కటే బాధ.

image6పెళ్లి అయిన కొత్తలో ఒక స్లోగన్ పెట్టుకున్నా. “జీతం తప్ప ఏమొచ్చినా పుస్తకాలకే !!” అలోవెన్సులు, బోనస్ లు, O.T లు ఇలా ఏది వచ్చినా సరే. ఇంట్లో గుట్టలు గుట్టలు పుస్తకాలు పేరుకున్నాయి. నాకంటూ సొంత లైబ్రరీ తయారయింది. అన్ని సబ్జెక్టుల్లో క్లాస్సిక్స్ అన్నీ కలెక్ట్ చేశా. రానురాను పుస్తకాలు కొనడం తగ్గించాల్సోచ్చింది. నెలకి 525 రూపాయలతో ఇద్దరం బతకాలి కదా!

1980 ప్రాంతంలో చలాన్ని రెండవ సారి చదవడం మొదలుపెట్టాను. అప్పటికి నా ఆలోచనలలో పరిణితి బాగా వచ్చింది. నాకంటూ కొన్ని భావాలూ రూపుదిద్దుకున్నాయి. చిన్నప్పుడు చదివినవి అన్ని మళ్లి చదివాను. ఈ సారి అధ్యయనం కోసం చదివాను. అప్పుడు అర్థం కాని విషయాలు ఎన్నో ఇప్పుడు అర్థమయ్యాయి. ఈ సారి కొత్తగా రంగనాయకమ్మ, రావి శాస్త్రి, చాసో, బీనాదేవి, తిలక్, శ్రీశ్రీ పరిచయం అయ్యారు. ఏ ఊరు వెళ్ళినా సంచిలో ఒక పుస్తకం పెట్టుకోవడం అలవాటయ్యింది – ప్రయాణం బోర్ కొట్టకుండా.

నా వృత్తి – ప్రవృత్తి ఒకటే కావడంతో నేను నా పని లో ఎంతో చొరవ చూపించగలిగాను. తిరుపతి లో పేరున్న రచయితలతో కలిసి చాలా సంవత్సరాలు “సాహిత్య వేదిక” నిర్వహించాము. రచయితలతో వ్యక్తిగత పరిచయాలు బాగా పెరిగాయి. చాసో, రాంభట్ల, వి.ఆర్.రాసాని, మధురాంతకం నరేంద్ర, ఆంవత్స సోమసుందర్, త్రిపురనేని, పాపినేని .. ఇలా అన్ని రకాల రచయితలతో స్నేహం కుదిరింది. అన్ని రకాల సాహిత్యంతో ప్రేమ కుదిరింది. అభ్యుదయ రచయితల సంఘంతో ప్రయాణం కూడా ఆ క్రమం లోనే మొదలయ్యింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాజానికి ఉపయోగపడే భావాలు ప్రచారం చెయ్యడం కోసం ఈ మధ్యనే “అభ్యుదయ” ని అంతర్జాల పత్రిక రూపంలో తీసుకువచ్చాము. (www.abhyudayaonline.com). దాని బాధ్యతలని కూడా స్వీకరించాను.

ఇన్ని సంవత్సరాల తరవాత ఇవన్నీ నెమరు వేసుకుంటుంటే ఏ మనిషి జీవితం తో అయినా పుస్తకానికి ఉండే అనుబంధం ఇంతే గొప్పగా ఉంటుంది కదా అనిపిస్తుంది. ఒక మంచి పుస్తకం దాన్ని ప్రేమించే పాఠకుడికి చేరకపోతే ఎంత బాధ! ఇప్పుడు మరి నా పిల్లలు తెలుగు పుస్తకాలే దొరకని ప్రదేశాల్లో ఉంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లకి ఈ అనుబంధం రుచి ఎలా చూపించాలి? చదువుకోవడానికి పుస్తకాలే లేకపోవడం ఎంత భయంకరం.!

image7అందుకే మంచి పుస్తకాలకీ పాఠకులకీ మధ్య వారధి నిర్మించాలని అనుకున్నాను. అలా పుట్టినదే www.AnandBooks.com.

ఆధునిక సామాజిక జీవితం గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టంగా, వైవిధ్యాలతో (వైరుధ్యాలతో) నిండి ఉంది. అర్థం చేసుకోవటానికి ఒక ‘వ్యక్తి గత’ జీవిత అనుభవం చాలదు. అందరి జీవితానుభావాల్నీ రంగరించిన పుస్తకాలే, అధ్యయనమే అందుకు మార్గం.

మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లకి మన సాహిత్యం అందాలి. వాళ్ళ మనసుల్లో మంచి భావాలు మొలకెత్తాలి, వ్యక్తులుగా మహావృక్షాలు అవ్వాలి. మార్పు వైపు సాగే పురోగమనంలో భాగస్వాములు కావాలి. మంచిని పంచే మనిషితనంతో ఎదగాలి. ‘ఆస్తి’ తత్వం కంటే, పంచుకునే మనస్తత్వం కావాలి. నాకైతే ఈతరంతో కూడా గౌరవించబడే జీవితం కావాలి…. అంతే.

 

 

(ఈ ఆర్టికిల్ కి బొమ్మలు వేసి పెట్టిన మా అబ్బాయి వినోద్ అనంతోజు కి కృతఙ్ఞతలు)

-ఎ.ఎం.ఆర్.ఆనంద్

Nanna

Download PDF

30 Comments

  • నాకు ఇష్టమైన ‘కాకలు తీరిన యోధుడు’ పుస్తకాన్ని పొద్దున్నే గుర్తు చేశారు. వెదకాలి ఎక్కడ ఉందో? చాలా బాగుంది మీ వ్యాసం.

    • Anand A.M.R. says:

      మానవుడి కష్టసహిష్ణత ఎంత బలమైనదో, నమ్మిన ఆశయాలకోసం సాగే పోరాటం ఎన్ని విలువలను నేర్పుతుందో ఆ పుస్తకం తెలుపుతుంది! స్పందనకు ధన్యవాదాలు…

  • venkat says:

    ఒహో ….ఇదైతే అద్బుతం … బావుంది సర్.. వినోద్ నాకు తెలుసు , తను బాగా రాస్తాడు …కానీ చెట్టు అనే మీరు ఇప్పటికే ఆదర్శం అని తెలీదు , తెలిసింది గా ఇప్పుడు సంతోషం , ఒకే ఇంట్లో రెండు గ్రంధాలు అంటే మాటలా…

    • Anand A.M.R. says:

      చుట్టూ మంచి పుస్తకాలు.. చదివే ఉత్సాహం కలిగించే వాతావరణం కల్పిస్తే ఒక ఇంట్లో ఎన్ని చెట్లైనా ఎదుగుతాయి.. మీ స్పందనకు ధన్యవాదాలు…

  • prasuna ravindran says:

    మీ వ్యాసం చదువుతుంటే చాలా హాయిగా అనిపించిందండి.

  • Mythili Abbaraju says:

    తిరిగి దొరికిన బండ పుస్తకం…భలే ఉందండీ. మీ జ్ఞాపకాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి

  • Mythili Abbaraju says:

    బండ పుస్తకం సంగతి భలే ఉందండీ. మీ జ్ఞాపకాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి .ఇష్టమైన పని చేయగలిగే అదృష్టం దొరికింది మీకు

    • Anand A.M.R. says:

      మైధిలి గారూ.. దొరకని పుస్తకం మనసునితొలిచేస్తుంది! నన్నుపట్టుకోమంటూ సవాల్ విసురుతుంది! అందులోని జ్ఞానం కొసంకోసం దానివెంట పరిగెడుతూనే ఉంటాం!.మరొకపుస్తకం 30 ఏళ్ళుగా నన్ను సతాయిస్తూనేఉంది. మీస్పందనకు వందనం.

  • N Venugopal says:

    ఆనంద్ గారూ,

    చాల బాగుంది. పుస్తకాలతో అటువంటి అనుబంధం, అనుభవం ఉండడం ఒక ఎత్తయితే ఇంత ఆర్ద్రంగా, సాంద్రంగా చెప్పడం మరొక ఎత్తు. కృతజ్ఞతలు.

  • Rama krishna says:

    వినోద్ అదృష్టవంతుడు మాష్టారు. ఆ అదృష్టం విలువెంతో తెలిసిన కొడుకు వుండటం మీ అదృష్టం.

  • Anil Battula says:

    ఆనంద్ గారూ, మీ వ్యాసం చాల బాగుంది. మీరన్నట్లు “అవును ! పుస్తకం కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నేను ఎరుగుదును.” నేను బలంగా నమ్ముతాను….కృతజ్ఞతలు.

    • Anand A.M.R. says:

      అనిల్ గారూ,”తిమూర్…”ను మిస్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో, మీరు అందించినప్పుడు ఎంతసంతోషపడ్డానో మాటల్లొ చెప్పాలేను! మీకు ఎలా క్రుతజ్ఞతలు చెప్పాలో తెలియటంలేదు!

  • sasi kala says:

    చిన్నప్పటి నుండి ఉన్న నా పుస్తకాల పిచ్చి గుర్తుకు వచ్చింది . నైస్ నేరేషన్ .

  • srikanth says:

    Thanks for your experiences with us

  • “రచయిత భావాలని చదవాలి రా. ఉత్త కథ మాత్రమే చదవడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు.” అని చెప్పారు. అప్పుడే మొదటిసారిగా ప్రతి రచయితా తన పుస్తకాల ద్వారా కొన్ని భావాలని ప్రతిపాదిస్తాడనీ, ఆ భావాలకి చాలా importance ఉందనీ తెలిసింది

    wonderful lines andi

    • Anand A.M.R. says:

      రచయితకు(అతనికి స్ప్ష్టంగా తెలిసినా, తెలియకపొయినా) ఒకప్రాపంచిక ద్రుక్పధం ఉంటుంది. దానినిగుర్తించకపోతే అతనిరచనలు, ప్రతిపాదిస్తున్నభావజాలం, అతనుఏపక్షం వహిస్తున్నాడో అర్థంచేసుకోవడం కష్టం! అదే అసలు విషయం..

  • అద్భుతంగా ఉందండీ పుస్తకం తో మీ స్నేహం… ఇంకో మాట లేదు..

  • బండ పుస్తకం కథ భలె ఉంది…మనిషి నిజాయితీగా గాఢంగా కోరుకునేది తప్పక దొరుకుతుంది అన్న నానుడికి సాక్ష్యం లా..

  • kurmanath says:

    nice

  • Potu ranga rao says:

    మంచి అనుభూతిని పంచారు .పుస్తక దాహం మీది.పుస్తకం నెస్తమైతె ఎంతో ఆనందం

  • Thirupalu says:

    పుస్తకాన్ని ప్రేమీంచడమంటె జ్నానామృతాన్ని తాగడం
    చాలా బాగుంది

  • Santwana says:

    చాలా బావుందండీ! బొమ్మలు కూడా భలే ఉన్నాయి..

  • SurEsh Baabu says:

    కదిలించిన వ్యాసం. సార్లో ఇంకొక మనిషి కూడా ఉన్నాడని తెలియజేసిన అక్షర రూపం. రెండు రోజులు సన్నిహితంగా ఉంటూ కూడా ఈ వ్యాసం చదవని కారణంగా ఆనంద్ గారితో పుస్తకాల చర్చ చేయలేకపోయాను …సారీ సర్.

  • Anand A.M.R. says:

    అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్న “కధానికా పాఠశాల” వల్ల 3రొజులు నెట్ లోకి రాలేకపోయాను. స్పందించిన మిత్రులందరికీ పుస్తకాభివందనలు..

  • Ramani says:

    నేను ఇంతవరకు ఎ ఒక్క ఆర్టికల్ పూర్తిగా చదవలేదు (చదవడంలో సోమరిని). మొదటిసారి మీ ఆర్టికల్ చదివాను. చాల బాగుంది. ఒక మనిషి తన జీవితంలో పుస్తకాలతో ఇంట మమేకమవ్వడం ఇప్పుడే చూస్తున్నాను. ధన్యవాదములు

    రమణి

  • akbar pasha says:

    ఆనంద్ గారూ..
    చిక్కని అనుభూతులు పంచారు. మీ వ్యాసం చదివి సంతోషమేసింది. మీరు, అఫ్సర్ గారు అనుమతిస్తే విజయవాడ పుస్తకాల పండుగ సందర్భంగా ఆంధ్రభూమి మెరుపులో పునర్ముద్రిస్తాను. మీ అనుమతి కోసం…

    • editor says:

      పాష్, షుక్రియా. నిరభ్యంతరంగా పునర్ముద్రించవచ్చు. అయితే, కింద సారంగ లింక్ ఇవ్వడం మరచిపోవద్దు మరి!

    • Anand A.M.R. says:

      చాలా సంతోషం పాషా గారు. అభ్యంతరం ఏమి లేదండి.

  • sarada says:

    mee vyasam chaalaa bagundi sir. pustakam leni jeevitam voohinchukovatam kastam. mee exp chaduvutoo vunte naa pustakala pitchi marintagaa mudirindi. prasooti vairaagyam, smasana vairaagyam laagaa intlo tiddinappudu pustaka vairaagyam vastundi. adee konchem sepe. mallee mamoole.

  • Prasad says:

    ఆనంద్ గారు,

    నేను సాధారణంగా చదివిన వెంటనే కామెంట్ రాయాలని ఉన్నాబాగా బద్దకిస్తాను. ఈసారి మాత్రం అలా ఉండలేకపోయాను. చిన్నప్పుడు లైబ్రరీ లో గడిపిన సాయంకాలాలు, లైబ్రరీ నుండి పుస్తకం తీసుకొని ఇంటికి వెళ్తూ గుడ్డి వెలుతురులో కూడా చదువుకుంటూ 3 km నడవడాలు గుర్తుకొచ్చాయి. తిమూర్ అతని బలాదళం నాకు కూడా బాగా నచ్చిన పుస్తకం. ఇన్ని రోజులు పేరు గుర్తురాక కొట్టుకుంటున్నాను. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం చదివిన పుస్తకం. ఒకరకంగా మిమ్మల్ని చుస్తే అసూయా వేస్తోంది. పుస్తకాల మధ్య నే బతకడం! Thanks to websites like Saranga,మళ్లీ తెలుగు సాహిత్యం తో సాన్నిహిత్యం పెరుగుతోంది.

    నమస్కారాలతో
    ప్రసాద్

Leave a Reply to Anand A.M.R. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)