కవిత్వమై కట్టలు తెంచుకున్న కోపం!

ఆ సాయంత్రం త్యాగరాయ గానసభకి వెళ్ళాను.

వంగూరి ఫౌండేషన్ వారి   నెల నెలా తెలుగు వెలుగు అనే సాహితీ సదస్సులో శ్రీ ద్వానా శాస్త్రి గారు – ’ తన కవిత్వాన్ని తానే విశ్లేషించుకునే’ సాహితీ ప్రసంగాన్ని వింటం కోసం.

ద్వానా గారి  కవితా సంపుటాన్ని  నేనింతకు మునుపొకసారి చదివాను. విభిన్నాంశాలతో కూడిన   కవితల్లోంచి  నాకు నచ్చిన కొన్ని మంచి మంచి వాక్యాలను తీసుకుని, మన ‘సాహిత్యం’ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అందువల్ల, వీరి కవిత్వంతో నాకు పరిచయం తో బాటు, నాకు వీరి కవిత్వం పట్ల సదభిప్రాయమూ వుంది. ఈ సభ కు రావడానికి అదొక ముఖ్య కారణమని చెప్పాలి. అదీ గాక, కవి – తన కవిత్వం మీద తానే  విశ్లేషణ జరుపుకోవడం ఒక వినూత్నమైన ప్రక్రియగా తోచింది. ఎంతో ఆసక్తి కరం గా అనిపించింది. అందుకే, వారి ప్రసంగం వింటం  కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

ముఖ్య అతిధి – జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు  గారు! చాలా దూరం నించి వస్తున్నారనీ, అందుకే సభారంభం ఓ అడుగు అటూ ఇటూ అవ్వొచ్చని  చెప్పారు సుధ గారు.

అప్పటి దాకా ఔత్సాహిక గాయకులు పాడే పాటలు వింటూ గడిపాం.

అంతలో, ఆయన విచ్చేసారు.

అనంతరం, సభ – ఆరంభమైంది.

సాహితీ కిరణం సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బరావు గారు సభకు అధ్యక్షత వహించారు.

వేదికనలంకరించిన వారిలో – సమీక్షకులు శ్రీ రమణ ఎలమకన్ని గారూ వున్నారు.

అందరి పరిచయాలు, కొందరి ముందు మాటలు అన్నీ సాంప్రదాయక రీతిలో చక చకా జరిగిపోయాక, ద్వానా శాస్త్రి గారు – ప్రసంగించడం కోసం మైకు ముందుకొచ్చారు.

తాను రాసేది కవిత్వమే కాదనే విమర్శకులకు తాను సదా కృతజ్ఞుణ్ని అన్నారు. అలాటి విమర్శలలకు   తనకెలాటి అభ్యంతరం లేదనీ, పైగా, వాటిని ఆనందంగా అహ్వానిస్తానని చమత్కరించారు. మనసులోని భావాలను ఒక అరుదైన పధ్ధతి లో వ్యక్తపరిచేందుకు కవిత్వం సరైన ప్రక్రియ అని తాను భావిస్తున్నట్టు తన అభిప్రాయాన్ని వివరించారు. అసలు తనకు కవిత్వం రాయాలని ఎందుకనిపించిందో చెప్పారు. మొట్ట మొదట గా – క్లాస్ లొ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాట వినని విద్యార్ధులను తన వైపు తిప్పుకోడానికి కవిత్వాన్ని ఒక పనిముట్టుగా వాడుకున్నట్టు సోదాహరణలతో వివరిస్తూ సభికుల్ని నవ్వించారు.

‘నువ్వు కవిత్వం రాయడానికి వీల్లేదన్న’ ఒక విమర్శకుని ఘాటైన మాటలకు కవిత్వం జోలికి పోకుండా  ఊరకుండిపోయారట.

ఆ తార్వాత చాలా కాలానికి జ్యోతి సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం గారి సలహా  మేర తిరిగి కవిత్వాన్ని రాయడానికి పూనుకున్నారట.

అయితే కవిత్వానికి బలమైన ప్రేరణ గా నిలిచింది మాత్రం – ‘’కొండేపూడి నిర్మల గారు రాసిన లేబర్ రూం అనే కవిత..’’ అంటూ ఆగారు.

ఆ మాటలకి నేను,ఒక్క సారిగా అలెర్ట్ అవుతూ, నిఠారై కూర్చున్నా. ఏవిటీ, ద్వానా శాస్త్రి గారు కవిత్వానికి నిర్మల గారి కవిత స్ఫూర్తి గా నిలిచిందా? భలె. భలే. క్వయిట్ ఇంట్రెస్టింగ్!..అని అనుకుంటూ..వారి మాటలను ఎంతో శ్రధ్ధతో ఆలకించ సాగాను.

ద్వానా శాస్త్రి గారు – నిర్మల గారి కవిత ‘లేబర్ రూం’ ను పరిచయం చేసారు. పేపర్ మీద రాసుకున్న కవితా పంక్తుల్ని చదివి వినిపించారు. నిజంగానే మెచ్చుకున్నారు. కవయిత్రి కవిత్వీకరించిన ఆ వైనాన్ని చిన్నగా కొనియాడారు కూడా.

ఆ తర్వాత చిరు విమర్శలాడి నవ్వించారు.

ఆ పైన, కాస్త ఘాటు గానే స్పందించారు.

లేబర్ రూం అనే కవిత చివరి పంక్తుల్లో- స్త్రీ ప్రసవ వేదనకు పురుషుణ్ని కారణం గా చేయడాన్ని, దోషి గా చేసి చూపడాన్ని ..   వ్యతిరేకిస్తూ, ఆయన  తన విమర్శలని గుప్పించారు.

‘ఏం? నేరమంతా మగాడి మీద తోసేయడమేం ఎంతైనా చోద్యమన్నారు. స్త్రీ మాత్రం కారకు రాలు కాదా? ఆమె కోరుకోలేదా? ఆమె మాత్రం (ఎడిట్) లేదా?” అంటూ ఒక ఉద్వేగం లో ప్రసంగిస్తుంటే..వెంటనే స్ఫురించింది. ఆ మాటలు హద్దు మీరుతున్నట్టు! నేను వెంటనే అడ్డంగా  తలూపుతూ నా అభ్యంతరాన్ని తెలియచేసాను . అది సభా కార్యక్రమం. కాబట్టి, ప్రేక్షకుని సంస్కారం అంతవరకే అనుమతిస్తుందనే సంగతి మీకూ అర్ధమయ్యే వుంటుందని తలుస్తాను.

నేను అప్పటి దాకా శాస్త్రి గారి హాస్య ధోరణి కీ, వ్యంగ్యపూరితమైన మాటల విసుర్లకి నవ్వినదాన్నే.

ఎందుకంటే – నేను ఏ ‘ఇస్ట్’ కి చెందిన దాన్ని కాదు కాబట్టి.

ఆయన తన ముందు ప్రసంగంలో ఫెమినిస్ట్ ల మీద హాస్య వ్యంగ్య బాణాలు బాగానే సంధించి వొదిలారు.

భర్త – భార్యని ‘ఏమే’ అని పిలిస్తే  విప్లవం లేవదీయాలా? పెళ్ళాన్ని  అలా పిలిచే  హక్కు, అధికారమూ భర్త కు వుండదా? వుండకూడదా? అని నిలదీసారు ఫెమినిస్టుల్ని.

అంతే కాదు తన పెళ్ళాన్ని చనువుగా ఎలా పిలుచుకున్నా ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఆ మాట కొస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు కట్టుకున్న వాణ్ని  ఏరా అని పిలుస్తున్నారు తప్పేముందీ? అని పాయింట్ లాగారు. ఆమె మొగుడు, ఆమె ఇష్టం. ఎలా ఐనా పిలుచుకోవచ్చు మధ్యన అడ్డుపడటానికి, అర్ధం లేని రాధ్ధాంతాలు చేయడానికి మనమెవరం? అని సూటిగా  ప్రశ్నించారు.

వింటున్న పృక్షకులకు వారి  మాటలు సబబు గానే తోచాయి.

కానీ, ఒకానొకఆవేశపు వాక్ప్రవాహం లో (..) అన్న మాటలకే నా కు అభ్యంతరమేసింది.

లేబర్ రూం అనే కవిత్వం లో కవయిత్రి – ప్రసవ వేదన అనే అంశాన్ని   స్త్రీ దృక్కోణం నుంచి  పరిశీలించి, ఆ వ్యధను   అక్షరాలలో పొంగించారు. ఆ నరకపు యాతన అలాటిది మరి.

అలానే, చివరి పంక్తుల్లో, పురుషుణ్ణి మెన్షన్ చేసీ వుండొచ్చు. దీనంతటకీ అతనే కారకుడనీ, అతను మాత్రం సుఖం గా వున్నాడని కూడా అనివుండొచ్చు. సరిగ్గా ఈ అంశం మీద ఎంత చర్చైనా కొనసాగించవచ్చు. తప్పు లేదు.

అంతే కానీ, … ‘ఏం, ఆమె మాత్రం పడుకోలేదా? కావాలనుకోలేదా? సుఖం పొందలేదా ?’ అనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సబబు గా తోచదు. అదీ, ఒక సభా వేదిక మీద.. ఉహు. మనస్కరించడం లేదు ఇలాటి బహిరంగ వాదాన్ని అంగీకరించేందుకు. అందులో, ఒక గొప్ప వక్తగా, ఒక విజ్ఞాన వేత్త గా నేనెంతో అభిమానించే ద్వానా శాస్త్రి గారు మాట తూలడం..జీర్ణించుకోలేకపోయాననే చెప్పాలి.

అంత వరకెందుకు? ప్రసవ వేదనలో భరించలేని నొప్పులతో భూమి దద్దరిల్లేలా కేకలేస్తూ..ఎందరో స్త్రీలు  కట్టుకున్న వాణ్ణి  తిట్టడం నేను విన్నాను. చూశాను. అలాంటి అసహాయ  స్థితిలో ఆమె కొట్టుమిట్లాడుతుంటే..ఆసుపత్రి స్టాఫ్ – నీచమైన చౌకబారు మాటలనడమూ విన్నాను.   ఆ ఆపద్కాలంలో ఆ తల్లుల పట్ల ఎంతో దయా హృదయం కలిగి వుండాల్సింది పోయి, అంత అసభ్యకరం గా మాట్లాడటం ఎంతైనా శొచనీయం. క్షమిచరాని నేరం.

అలానే, అంతే ఆవేదనతో ఈ సభలో ద్వానా శాస్త్రి గారు మాట్లాడిన  ఆ ఒక్క పదాన్ని కూడా నిరసిస్తున్నాను.

సరే, అసలు విషయానికొస్తాను.

అలా, నిర్మల గారి కవిత్వం – ఆయన లో ఆవేశాన్ని రేపిందనీ,   ఆ కవితకు ధీటుగా తనూ మగాళ్ళను సపోర్ట్ చేస్తూ..  కవిత రాసి గట్టి జవాబివ్వాలని  నిర్ణయించుకున్నారట. ఆ నిశ్చయమే – తన కవితా సాహిత్య పునఃప్రారంభానికి నాంది గా మారిందని తెలిపారు.

 

పిల్లల్ని కననంత మాత్రాన మగాడికి హృదయమే వుండదన్న అపోహ కూడదన్నారు. ఇల్లాలి ప్రసవం ప్రమాదకరం గా మారినప్పుడు, బిడ్డ దక్కకున్నా ఫర్వాలేదు తన భార్య – ప్రాణాలతో దక్కితే చాలని ఆ భర్త డాక్టర్ని వేడుకుంటాడనే సంగతిని గుర్తు చేసారు. మగాళ్లంతా చెడ్డవాళ్ళు, రాక్షసులు అనే అపోహల్ని బలపరిచే రీతిలో రచనలు చేస్తున్న పురుష ద్వేషులైన రచయిత్రుల పట్ల ఆయన తన ఆవేదనని వ్యక్తపరిచారు. మగాళ్ళు పైకి భోరుమని ఏడ్వనంత మాత్రాన కఠినాత్ములని అతని గుండె పాషాణమని ముద్ర వేయడం తగదనే హితాన్ని పలికారు. మగాళ్ళు లోలోనే కుమిలిపోవడం వల్ల వాళ్ళకే గుండె జబ్బులెక్కువొస్తున్నాయనీ, హార్ట్ ప్రాబ్లంస్ తో మరణించే మగాళ్ళ సంఖ్య నానాటికీ పెరిగిపోతోందనీ..మగాడికి హృదయం లేదంటే ఎలా నమ్మడం అంటూ తన ప్రసంగం లో హాస్యాన్ని జోడిస్తూ..సైన్స్ సమాచారాన్ని కూడా అందచేసారు.

అనంతరం తన కవిత ద్వారా చెప్పదలచుకున్న సమాధానాన్ని చదివి వినిపించారు.

dwana

ఆ తర్వాత..శాస్త్రి గారు తన సహజ సిధ్ధమైన సంభాషణా శైలిలోకొచ్చేసారు.

‘నా కవిత్వం – నా  విశ్లేషణ’ అనే  ప్రసంగం లో భాగంగా ‘బాల్యం’ అనే మరో కవితాంశాన్ని తీసుకున్నారు.

కవులందరూ తమ తమ బాల్యాన్ని అద్భుతం, అమోఘం అంటూ పొగుడుకుంటుంటే ఆయనకి ఆశ్చర్యం గానూ, అపనమ్మకంగానూ వుండేదిట. ఎందుకంటే అలాటి తీపి అనుభవాలు కానీ, మధురమైన అనుభూతులు కానీ.. ఏవీ తనకు తెలియనందుకు! పైగా, ఒక కవి కి మించి మరో కవి పోటీ గా ఆ ఆనంద బాల్య దశని వర్ణించడం చూసి మరింత ఆలోచనలో మునిగిపోయేవారట. ఏ కవి ని చూసినా ‘అహా.. ఓహో’ అంటున్నారు, మరి ఇలాటి పరిస్థితుల్లో తను- తన బాల్యం దుర్భరమని రాస్తే   ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోననీ, చిన్న చూపు చూస్తారేమోనని సందేహించారట. ఆ తర్వాత, వున్నదున్నట్టు రాయడానికే నిశ్చయించుకుని, అలానే ఆ కవితని వెలుగులోకి తీసుకురావడం జరిగిందని ఒక చిన్న కథ లా వర్ణించి చెప్పారు.

అన్న దమ్ముల్లో అందర్లోకెల్లా శాస్త్రి గారి నే చిన్న చూపు చూసేవారట వారి తండ్రి గారు.

చదువు దగ్గర్నించీ, దుస్తులు వరకు తనపై చూపిన వివక్షతని, నిర్లక్ష్య ధోరణిని జరిగిన సంఘటనల ద్వారా వివరించి చెబుతుంటే  నేను తలొంచుకుని శ్రధ్ధగా విన్నాను.  నిజమే, ఏ పసివానికైనా ఆ దశలో ఇలాటి అవమానాలు భరింపశక్యం కాని చేదుఅనుభవాలు. పైకి కనిపించని ఈ హృదయ గాయాలు. మనిషి మరణించే దాకా మాయని మచ్చలు.

అసలేమనిషికైనా ఆనందకరమైన బాల్యమే తరగని ధనం.

ఇలాటి  తండ్రుల గురించి    ఎందరో చెప్ప గా విన్నాను. కొందర్ని చూసాను కూడా.

అలాటప్పుడు ఎవరికైనా బాల్యం బంగారం లా ఎలా అనిపిస్తుంది మరి? అనిపించదు. ఆ వ్యధని  యధాతధంగా   కవిత్వీకరించినట్టు ఎంతో ధైర్యంగా చెప్పారు కవి.

అటు పిదప మరో కవితాంశం – కలం!

తాను కంప్యూటర్ జోలికి వెళ్ళనని చెబుతూ, కలం మీద   గల ప్రేమనీ, కలంతో రాసే అక్షరాల పట్ల తనకు గల      అనుబంధాన్నీ, ఆప్యాయతానురాగాలని  వ్యక్తపరిచారు.   ఈ సందర్భం గా కవి శివారెడ్డి గారిని ఉదహరిస్తూ, ఆయన కంప్యూటర్ కాదు కదా, కనీసం సెల్ ఫోన్ కూడా వాడరని తెలియచేసారు.

ఆ ఉపోద్ఘాతానంతరం, తను రాసిన రమ్యమైన ‘కలం ‘కవితని చదివి వినిపించారు. నవ్యలో ప్రచురితమైన ఈ కవితను చూసి తనకు సినారె కితాబిచ్చినట్టు గా కూడా పేర్కొన్నారు.

సభ కొనసాగుతూనే వుంది.

టైం చూసాను. అప్పటికే నాకు ఆలస్యమైంది..నేను ఇల్లు చేరడానికి పట్టే సమయాన్ని దృష్టిలో వుంచుకుని, మెల్లగా నా సీట్లోంచి  లేచి, సభకి మౌనంగా అభివాదం చేసి, వెలుపలికి దారి తీశాను. వస్తూ వస్తూ, శ్రీమతి సుధ గారికి, వంశీ రామరాజు గారికి వీడ్కోలు తెలియచేసుకుంటూ..సడి కాకుండా బయటపడ్డాను.

నాలో నేను తర్కించుకుంటూ..నాతో నేను వాదించుకుంటూ నిశ్శబ్దం గా ఇల్లు చేరాను.

సాహితీ సభలకెళ్లొస్తే, ఒక కావ్యం వెనక దాగిన రహస్యాన్ని     ఛేదించిన ఆనందమేయాలి కదూ!

– ఆర్.దమయంతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

4 Comments

  • వనజ తాతినేని says:

    మహిళలు వ్రాసిన కవిత్వాన్ని కవిత్వమే కాదన్న,కాదంటున్న వారిని చాలా మందిని చూసాము, చూస్తున్నాం.
    ప్రసవ వైరాగ్యం అనేది ఒకటి ఉంటుంది లేబర్ రూమ్ లోకి భర్తకి ప్రవేశం ఇచ్చి ఆ బాధని చూపిస్తే అతనికి వైరాగ్యం వస్తుంది కూడా ! అలా అని లైంగికబంధాలు లేకుండా మానవ జాతి ఉండనే ఉండదు
    సృష్టికార్యాన్ని ఇష్టంగా ఇద్దరూ చేస్తే ఎవరిని తప్పు పట్టాల్సిన పనీ లేదు కానీ అయిష్టంగా సాగిన సందర్భాలలో తర్వాత వచ్చే పరిణామాల ఫలితాలలో బాధ ఎక్కువ అనుభవించేది స్త్రీ అన్న ఎరుక కల్గి ఉండకపోవడం విచారకరం
    ఎవరి కవిత్వం గురించి వారు గొప్పగానో, తక్కువగానో, ఎందుకు, ఎలా రాసారన్నదానికి సమర్ధింపు ఇచ్చుకోవడం అందుకు వేదిక ఉండటం, కల్పించుకోవడం హర్షణీయం. కానీ ఇలా తెగనాడటం మాత్రం శోచనీయం
    దమయంతి గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను

    • ఆర్.దమయంతి. says:

      కవి కూడా ఆమె కవితా విధానాన్ని మెచ్చుకున్నారు.
      కాని చివరి రెండు పంక్తుల వల్లే వారికి కోపమొచ్చిందని చెప్పారు.
      దాంతో తిరిగి కవిత్వానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
      దానికి కాదు కానీ..
      ఏం?.. అంటూ ఆ పరంపరలో దొర్లిన ఒక్క మాటకే మనసు చివుక్కుమంది అంతే..

  • kondreddy says:

    ఇంకా ఆలు మగాళ్ళు ఆడ మగ తేడాల లోంచి సాహిత్యం ఈప్పటికీ బయట పడకపూవడము బాదకారము కాలాన్ని కవులు వీనక్కు నడపదనికే ప్రయత్నం చేస్త్తున్నారు బాదకారము

    • ఆర్.దమయంతి. says:

      తేడా లు వుంటే వుండొచ్చు..కానీ, విమర్శ బావుండాలి. వ్యక్తీ ని కానీ, లేదా జాతిని కానీ నొప్పించకుండా వుంటే చాలను కుంటాను.
      అయితే, ద్వానా గారు ఇంకా చెప్పారు, తన కవిత్వం కవిత్వమే కాదని విమర్శను కూడా స్వీకరించి తన పుస్తకం లో ప్రచురించినట్టు..
      మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు కొండ్రెడ్డి గారు!

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)