అక్క – తమ్ముడు

teyaku6

అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఐదుగురు అన్నలు, ఒక తమ్ముడు ఉండేవారు. ఒకరోజు అన్నలందరూ పనికిపోతూ అమ్మాయిని పిలిచి ‘‘చెల్లీ… చెల్లీ! మేం పనికిపోతున్నాం తిరిగి వచ్చేసరికి మాకు రుచికరమైన వంట వండిపెట్టు’’ అని చెప్పి వెళ్ళిపోయారు.
అన్నలు వెళ్ళిపోయాక ఏం వండాలా అని ఆలోచించింది చెల్లి. ఇంట్లో వండడానికి ఏమీ లేవు. ఇలా ఆలోచించి ఆలోచించి ఆఖరికి పెరడులోకి వెళ్ళి కొంచెం ఆకుకూర తెంపుకొచ్చింది. తెంపుకొచ్చిన ఆకుకూరని తరుగుతుంటేనూ ఆ అమ్మాయి వేలు తెగింది. తెగిన వేలు నుండి రక్తం బొట బొటా కారటం మొదలు పెట్టింది. అది చూసి ఆ అమ్మాయి రక్తాన్ని చీరకి అద్దుదామని అనుకున్నది. కానీ మళ్ళీ, అయ్యో అన్నలు చూస్తే ఏమనుకుంటారో అని భయపడి పక్కనే వున్న గోడకి అద్దుదామని అనుకుంది. మళ్ళీ అన్నలు వేరే రకంగా అనుకుంటారేమో అనుకుని కారుతున్న రక్తాన్ని కూరలోనే వంచేసింది.
అన్నలు పని నుండి వచ్చారు. చెల్లి అన్నలకి,  తమ్ముడికి వేడి వేడి అన్నంలో ఆకుకూర వేసి  వడ్డించింది. అన్నలు ఆ కూర రుచి చూసి ఆశ్చర్య పడ్డారు. ‘‘ఇంత రుచికరమైన కూర మా జీవితంలో ఎప్పుడూ తినలేదు. ఎలా చేశావు చెప్పు’’  అని చెల్లెల్ని అడుగడం మొదలు పెట్టారు. అది చూసి చెల్లి ఏం చెప్పాలో తోచక ‘‘కూర చేసేటప్పుడు నా వేలు తెగి అందులో రక్తం పడింది’’ అని చెప్పింది. అన్నలు అది విని చాటుకి వెళ్ళి చెల్లి చిటికెడు రక్తమే ఇంత రుచిగా వుంటే ఆమె మాంసం ఇంకెంత రుచిగా వుంటుందో కదా! అనుకుని ఎలాగైన ఆమెని తినేద్దామని ఆలోచన చేశారు.
అనుకున్న ప్రకారం ఒక రోజు పెద్దన్న వచ్చి ‘‘చెల్లీ…చెల్లీ… పక్క ఊర్లో తిరనాళ్ళు జరుగుతున్నాయి. వెళదాం తయారవ్వు అన్నాడు. ఆ మాట విని చెల్లి చాలా సంతోషపడిరది. తిరనాళ్ళలో ఏమేం కొనుక్కోవాలో  ఆలోచించుకుంటూ తయారయ్యింది. అన్నలు, తమ్ముడు, చెల్లి అందరూ తిరునాళ్ళకి బయల్దేరారు. అడవి దారిలో నడవటం మొదలు పెట్టారు. ఎంత నడిచినా అన్నలు చెప్పిన ఆ  పక్క ఊరు రానే లేదు. చెల్లికి ఇక కాళ్ళు నెప్పులు పుట్టడం మొదలు పెట్టాయి. అప్పుడిక వెళ్ళి పెద్దన్నతో చెప్పింది ‘‘అన్నా… అన్నా…! నేనింక నడవలేను నాకు కాళ్ళు నొప్పి’’ అని, పెద్దన్న ‘‘అదిగో ఇంకొంచెం దూరమే’’ అన్నాడు. మరి కాసేపటి చిన్నన్నతో చెప్పింది ‘‘అన్న.. అన్న! నేనింక నడవలేను నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి’’ అని, చిన్నన్న దూరంగా తెల్లగా మెరిసిపోతున్న రెల్లుపూలను చూపించి ‘‘అదిగో అదే ఊరు చూడు ఇళ్ళలోంచి వంట చేసుకుంటున్న పొగ బయటికి వస్తుంది’’ అన్నాడు. మరికాసేపటికి చెల్లి నడిపన్న దగ్గరికి వెళ్ళి ‘‘అన్న.. అన్న! నేనింక నడవలేను కాళ్ళు నెప్పి పుడుతున్నాయి’’ అన్నది. నడిపన్న సరే అని మిగిలిన అన్నలతో మంతనాలు జరిపి అక్కడే ఒక మంచె కట్టి చెల్లిని దానిపైకి ఎక్కించాడు.
చెల్లి మంచెపైకి ఎక్కి చుట్టూ కనిపిస్తున్న అడవిలో ఎక్కడైనా ఊరు వుందా అని వెతుకుతూ ఉంది. అంతలో పెద్దన్న తన విల్లు, బాణాలు తీసుకుని చెల్లికి గురిపెట్టాడు. మిగిలిన నలుగురు సంతోషంతో
‘‘మార్‌ మార్‌ దాదా చాతీ తైక్‌ తైక్‌ దాదా చాతీ తైక్‌ తైక్‌’’
(గురి చూసి కొట్టు అన్నా గుండెకి గురి చూసి కొట్టు)
అని అరుస్తూ అతన్ని ఉత్సాహపరచడం మొదలు పెట్టారు.
కానీ పెద్దన్న గురి తప్పిపోయింది. రెండవ వాడు వచ్చాడు. వాడు గురి పెట్టాడు. మిగిలిన వాళ్ళు
‘‘తోర్‌ తీర్‌ దాదా దాయా బాయా జాయెల్‌ దాదా దాయా బాయా జాయెల్‌’’
(అన్నా నీ బాణం కుడికీ ఎడమకి వెళ్తుంది అన్న కుడికీ ఎడమకీ వెళ్తుంది)
అని విసుక్కోవడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఇంకో అన్న ప్రయత్నించాడు. అలా వరుసగా ఐదుగురు అన్నలూ ప్రయత్నించి విఫలమై తమలో కడగొట్టు వాడైన తమ్ముడ్ని పిలిచి రేయ్‌ నువ్వు చంపురా మీ అక్కని’’ అన్నారు. వాడు ససేమిరా అన్నాడు. అక్క అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఏడ్చాడు. అయినా అన్నలు వినలేదు భయపెట్టారు.
‘‘మార్‌ మార్‌ భయ్యా కోయ్‌లో పాయెర్‌లుగా చాతి చామర్‌కేస్‌
భయ్యా చాతీ చామర్‌ కేస్‌’’
(గులాబిరంగు అంచు చీర కట్టుకున్న పొడవాటి జుట్టు పిల్లని గురి చూసి కొట్టు తమ్ముడూ, గురి చూసికొట్టు)
అని, ప్రోత్సహించడం మొదలు పెట్టారు. వాడికి అక్క అంటే చాలా ఇష్టం. అక్క వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అటువంటి అక్కని ఎలా చంపగలడు. అందుకే కళ్ళు మూసుకొని బాణం వదిలాడు. దురదృష్టం వాడి బాణం ఆ పిల్ల గుండెల్లో దిగింది. నిలబడి వున్న పిల్ల కుప్పకూలింది. మంచెపై నుండి ఆ పిల్ల అందమైన జుట్టూ త్రాచుపాములా రల్లున జాలు వారింది.
అన్నలు మరణించిన పిల్లని కిందికి దించారు. ఏడుస్తున్న తమ్ముడిని పిలిచి ‘‘రేయ్‌ అడివి లోపలికి వెళ్ళి తాడు లేకుండా కట్టెలమోపు తీసుకురా’’ అన్నారు. తాడు లేకుండా కట్టెల మోపు ఎలా తీసుకురావాలో వాడికి అర్ధం కాలేదు. కట్టెలన్నీ ఏరి ఏడుస్తూ కూర్చున్నాడు. అంతలో అటే వెళ్తున్న ఒక పెద్ద పాము ఆ అబ్బాయిని చూసి ‘‘ఏం తమ్ముడూ ఎందుకు ఏడుస్తున్నావ్‌’’ అంది. అందుకు ఆ అబ్బాయి మా అన్నలు నాకు తాడు ఇవ్వకుండా కట్టెలమోపు తెమ్మన్నారు. ఎలా తీసుకు పోగలను చెప్పు’’ అని మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. పాము వాడి ఏడుపు చూసి జాలిపడి ‘‘సరే నన్ను తాడుగా కట్టుకో కానీ మోపుని దించేటప్పుడు దడాలుమని కింద వేసెయ్యకు నెమ్మదిగా దించు’’ అన్నది. అబ్బాయి సరేనని కట్టెల మోపుకి పాముని కట్టి తీసుకువెళ్ళాడు. మోపు దించగానే పాము తన దారిన తాను చక్కా పోయింది.
తమ్ముడు తెచ్చిన కట్టెలు చూసి అన్నలు తమలో తాము మాట్లాడుకొని తమ్ముడిని పిలిచి ఏడు చిల్లుల కుండని వాడి చేతిలో పెట్టి ‘‘దీని నిండా నీళ్ళు తీసుకురా’’ అని పంపించారు. అబ్బాయి కుండని పట్టుకొని చెరువు ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు  చెరువులో నుంచి చేపలు, కప్పలు తలలు బయట పెట్టి ‘‘ఓయ్‌ పిల్లవాడా! ఎందుకేడుస్తున్నావ్‌’’ అన్నాయి. అబ్బాయి మరేం చెయ్యను ‘‘ఏడు చిల్లుల కుండని ఇచ్చి మా అన్నలు కుండ నిండా నీళ్ళు తెమ్మన్నారు చిల్లుల కుండలో నీళ్ళు నిలుస్తాయా’’ అని చెప్పి మళ్ళీఏడుపు మొదలు పెట్టాడు. అప్పుడు ఏడు చిన్ని చిన్ని కప్ప పిల్లలు బయటకి వచ్చి ‘‘ఏడవకు నీ కుండలోని చిల్లులకి అడ్డంగా మేం నిలబడతాం నువ్వు నీళ్ళు నింపుకో’’ అన్నాయి. అబ్బాయి అలాగే నింపుకుని ఒక చేపని, ఒక ఎండ్రకాయని కూడా తనతో పట్టుకెళ్ళాడు.
వాడు వెళ్ళేసరికి అన్నలు చెల్లిని వండేసి, వడ్డించుకుని తమ్ముడికి కూడా పెట్టారు. తమ్ముడు తను కూర్చున్న చోట ఓ గొయ్యి తవ్వి అక్క  శరీరపు ఖండాలని ఆ గొయ్యిలో వేసి పూడ్చేసి మాసం తిన్నట్లు చేపని, ఎముకలు కొరికినట్లు ఎండ్రకాయని తినడం మొదలు పెట్టాడు. కాసేపటికి అందరూ తినడం ముగించి ఇంటికి వెళ్ళిపోయారు. కాలం గడిచిపోయింది. అన్నలూ తమ్ముడు ఎవరి దారిన వారు విడివడి ఎవరికి వారు సొంత ఇళ్ళు కట్టుకుని స్ధిరపడ్డారు.
ఇది ఇలా ఉండగా ఒక సాధువు అక్కడా ఇక్కడ భిక్షమెత్తుకుని అడవిదారి గుండా ఇంకో ఊరికి వెళుతున్నాడు. ఒక వెదురు పొద దగ్గరికి రాగానే అతనికి కడుపులో నొప్పిగా అనిపించి దొడ్లోకి వెళ్ళాలనిపించింది. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించి ఆ వెదురు పొదలోకి వెళ్ళాడు. అతను అలా కూర్చున్నాడో లేదో
‘‘పారె పారె హాగ్‌ బె జోగి బాసాతె
పారె పారె పాని చూబె జోగి బాసాతె’’
(ఓ యోగి దూరంగా వెళ్ళి మల విసర్జన చెయ్‌ వాసనొస్తుంది ఓ యోగి నీళ్ళని దూరంగా తీసుకెళ్ళి             శుభ్రం చేసుకో వాసనొస్తుంది)
అని వినిపించింది. అది విని యోగి ఆశ్చర్యపడి ‘‘ఎవరా మనిషి’’ అని అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపడి సరే తన పని తాను చేసుకుందామని మళ్ళీ కూర్చున్నాడో లేదో మళ్ళీ అదే వినిపించింది. ఈసారి ఆ శబ్దం వెదురులో నుండే వస్తుందని యోగి కనిపెట్టాడు. ఇదేదో భలే ఉందేనని ఆశ్చర్యపడి ఆ వెదురుతో వేణువుని చేసుకుందామని ఆలోచించి ఒక వెదురు గడని నరకడం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ వెదురులోనుండి
‘‘తాని తాని కాట్‌బె జోగి బాధాతే జోగి బాధాతె
తాని తాని చిల్‌ బె  జోగి బాధాతే జోగి బాధాతె’’
(‘‘చిన్న చిన్నగా కత్తిరించు ఓ యోగి నొప్పేస్తుంది. ఓ యోగి బాధేస్తుంది
చిన్న చిన్నగా చెలుగు ఓ యోగి బాధేస్తుంది. ఓ యోగి నొప్పేస్తుంది!)
అని వినిపించింది. యోగి ఆ వెదురు చెప్పినట్లే నెమ్మదిగా నొప్పి కలగకుండా కత్తిరించి, చెలిగి వేణువు చేసుకుని బిక్షకి బయల్దేరాడు. వేణువుని ఊదుకుంటూ ఊరంతా తిరిగి తిరిగి ఒక ఇంటికి రాగానే అంతవరకూ బాగానే పాడిన వేణువు ఉన్నట్టుండి
‘‘బాజ్‌ రె బాజ్‌ రె కేంద్ర నా బాజ్‌రె కేంద్ర ఏ తొమార్‌ దుష్మన్‌ దాదాకా ఘర్‌’’
(పాడు పాడు ఓ వేణువు పాడొద్దు పాడొద్దు ఓ వేణువు ఇది దుష్టుడైన మా అన్నఇళ్ళు)
అని పాడటం మొదలు పెట్టింది. యోగి అది విని ఆ ఇంటి దగ్గర బిక్ష మెత్తకుండా త్వర త్వరగా ఆ ఇంటి నుండి బయటపడి మరో ఇంటికి వెళ్ళాడు. వేణువు అక్కడికి రాగానే మళ్ళీ
‘‘బాజ్‌రె బాజ్‌రె కేంద్ర నాబాజ్‌రె కేంద్ర ఏ తొమార్‌ దుష్మన్‌ దాదాకె ఘర్‌’’
అని పాడటం మొదలు పెట్టింది. యోగి ఆ ఇంటి నుండి కూడా బయటకొచ్చి మరో ఇంటికెళ్ళాడు. అలా వరుసగా ఐదిళ్ళ వరకూ అలాగే పాడిన వేణువు ఆరవ ఇంటికి రాగానే గట్టిగా
‘‘బాజ్‌రె బాజ్‌రె కేంద్ర బాజ్‌రె బాజ్‌ రె కేంద్ర ఏ తొమార్‌ లొర్‌ పొచా బాయ్‌ కే ఘర్‌’’
(పాడు పాడు వేణువు ఇంకా పాడు వేణువు ఇది నా దు:ఖం తీర్చిన తమ్ముడి ఇళ్ళు)
అని పాడిరది. ఇంట్లో నుండి ఆ పాట విన్న తమ్ముడు ఆశ్చర్యపడి బయటకి వచ్చి, యోగిని ఇంట్లోకి తీసుకెళ్ళి కడుపునిండా అన్నం పెట్టి ఆ వేణువు గురించి అడిగాడు. యోగి జరిగినదంతా చెప్పాడు. యోగి రాత్రి నిదురపోగానే ఆ అబ్బాయి వేణువుని తీసి దాచేశాడు. యోగి నిద్రలేచి బయల్దేరడానికి సిద్ధపడి చూస్తే వేణువు లేదు. యోగి అబ్బాయిని పిలిచి ‘‘అబ్బాయి నువ్వేమైనా నా వేణువుని చూశావా’’ అని అడిగాడు అబ్బాయి ఏమీ ఎరగని వాడికిమల్లే లేదు స్వామి నేను చూడలేదు అని అబద్ధం చెప్పేశాడు. అసలే అది మాయలమారి వేణువు కదా, ఏదో జరిగే వుంటుందని భావించి యోగి వెళ్ళిపోయాడు. యోగి వెళ్ళిపోగానే ఆ అబ్బాయి ఆ వేణువుని పదిలంగా దాచుకుని పనికి వెళ్ళిపోయాడు.
ఆ అబ్బాయి అటు వెళ్ళగానే ఆ వేణువులో నుండి గులాబిరంగు అంచున్న చీర కట్టుకుని పెద్ద జుత్తు వున్న అందమైన అమ్మాయి బయటకొచ్చి ఇళ్ళంతా కలయతిరిగి ‘‘అయ్యో నా తమ్ముడు వంట చేసుకోకుండా బయటకెళ్ళాడే, వస్తే ఏం తింటాడు’’ అనుకుని కమ్మగా వంట వండి మళ్ళీ వేణువులోకి వెళ్ళిపోయింది. సాయంత్రం తమ్ముడు ఇంటికొచ్చాడు. వంట చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత రోజు కూడా ఆ అమ్మాయి వేణువు నుండి అలాగే బయటకి వచ్చి వంట చేసిపెట్టి వేణువులోకి వెళ్ళిపోయింది. మరునాడు కూడా వంట చేసివుండటం చూసి అబ్బాయి ఆశ్చర్యపడి దీంట్లో ఏదో మతలబు వుంది రేపు ఎలాగైనా సరే తెలుసుకోవాల్సిందే అనుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లారగానే అబ్బాయి పనికివెళ్ళినట్లు వెళ్ళి కిటికీ నుండి ఇంట్లోకి చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడు వెళ్ళిపోయాడనుకుని అక్క యథావిధిగా వేణువులో నుండి బయటకి వచ్చి వంట చేయడానికి కూర్చున్నది. అంతే తమ్ముడు లోపలికి వచ్చి అక్కా అని ఆనందంతో అక్కని కావలించుకున్నాడు. అక్క కూడా తమ్ముడ్ని దగ్గరకు తీసుకుని సంతోషంతో ఏడ్చింది. అప్పటి నుండి ఆ అక్క, తమ్ముడు ఆనందంగా జీవించారు.

Samanya2014సామాన్య

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)