మనిషే కవిత్వం – ఒక చేత కన్నీరు, మరొక చేత ఎర్రజెండా

Rehearsal cover
కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో...

కచ్చితంగా ఏడాది కిందట సృజన డీవిడి ఆవిష్కరణలో…

హృదయానికి అత్యంత సన్నిహితమైన వాళ్ల గురించి రాయడం కష్టం. మన గురించి మనం రాసుకున్నట్టు. ఏ ఒకటి రెండు సంవత్సరాలు ఆయనను కోదండరాములన్నయ్య అని పూర్తి పేరుతో పిలిచానో గాని, ఆ తర్వాత సొంత అన్నయ్య ఉన్నప్పటికీ, అన్నయ్య అంటే ఆయనే అన్నంతగా మా ఇంట్లో మనిషి, నా హృదయంలో మనిషి, నా విశ్వాసాల మీదా విలువల మీదా ప్రభావం వేసిన మనిషి ఎన్ కె. ఆయన గురించి రాయడం, ఆయనను ఒకింత దూరంగా చూసి, పెట్టి, ఊహించి రాయడం కష్టం. కాని ముప్పై సంవత్సరాల కింద సాహిత్య సాంస్కృతిక రంగాలలో అత్యంత ప్రభావశీలంగా, సమ్మోహకంగా ఉండి, ఎందరినో ఉత్తేజపరచి, కాలక్రమంలో మరుసటి తరానికి దాదాపు తెలియకుండా పోయి, ఆయన ఎవరు అని అడిగే స్థితి వచ్చినందువల్ల ఆయన గురించి చెప్పాలి. ఆయన లేని, ఆయన పాట పాడని, ఆయన మాట్లాడని సభా సమావేశమూ లేని స్థితి నుంచి ఆయన పేరయినా విననివాళ్లు నిండుతున్న సభల రోజుల్లో ఆయన గురించి చెప్పాలి.

చాల శక్తిమంతుడైన కవి, శ్రోతల కంట తడి పెట్టించగల, ఆ కన్నీటిని నిప్పులుగా మార్చగల, నవరసాలనూ తన స్వరపేటికలోంచి పలికించడం మాత్రమే కాదు, శ్రోతల హృదయాల్లో మీటగల గాయకుడు, కార్యకర్త, స్నేహశీలి, ప్రేమాస్పదుడు, మనుషులను ప్రగాఢంగా, బహుశా ఆయన ప్రేమకు లక్ష్యమైనవాళ్లు ఇబ్బంది పడేటంతగా ప్రేమించినవాడు, కనీసం ఇరవై సంవత్సరాలు ఎందరినో ఆకర్షించిన ఉత్తేజకరమైన ప్రజాజీవితం గడిపి, అనేక వ్యక్తిగత, కౌటుంబిక, మానసిక, రాజకీయ కారణాలవల్ల మౌనంలోకి వెళ్లిపోయినవాడు, అక్కడినుంచి అనారోగ్యంలోకీ, చివరికి అకాలంగా మృత్యువులోకీ జారిపోయినవాడూ నెల్లుట్ల కోదండరామారావు (మార్చ్ 6, 1948 – డిసెంబర్ 27, 2014). ఎన్ కె గా సుప్రసిద్ధుడు.

NK Telangana song

ఆయన తండ్రి నెల్లుట్ల రామకృష్ణారావు వరంగల్ జిల్లా కూనూరులో భూస్వామ్య కుటుంబంలో పుట్టి, రామకృష్ణామాత్య పేరుతో 1940ల్లో మెత్తని కవిత్వం రాసినవాడు. తిరుపతి వెంకటకవులను ఎదిరించి కవిత్వం చెప్పినవాడు. “రొమ్ము విరిచి వచింతు విశ్వమ్మునందు ఆంధ్రభారతి మా ఇంటి ఆడపడుచు, ఎవడురా మా యమాత్యుల నీసడించి కలము నడిపెడి మొనగాడు తెలుగునేల” అని సవాలు చేసినవాడు. జాషువాను ఆహ్వానించి, స్వయంగా కాలికి గండపెండేరం తొడిగి, కుల సమాజం నుంచి ‘వెలి’కి గురయినవాడు. ఏ బలవత్తర కారణాలు తోసుకువచ్చాయో తెలియదు గాని, భార్య కేసమ్మనూ, పది పన్నెండు సంవత్సరాల పెద్ద కొడుకు జగన్మోహన రావునూ, రెండు సంవత్సరాలయినా నిండని చిన్న కొడుకు కోదండ రామారావునూ వదిలి ఎటో వెళ్లిపోయాడు. తండ్రి అట్లా ఎప్పటికీ కనిపించని శూన్యంలోకి మాయమయ్యాడనే దుఃఖం బహుశా ఎన్ కె జీవితమంతా వెంటాడింది. ఒకవేళ ఆ తండ్రి ఎక్కడన్నా ఎదురుపడినా ఎట్లా గుర్తుపడతాడు, ఊహతెలియని వయసులో తననుంచి దూరమైన కన్నతండ్రిని? అందుకే యవ్వనంలో రాసిన ఒక పద్యంలో “ఎప్పుడో నీవు అనుకోక ఎదురుపడిన నీటితెర నాకు అడ్డమ్ము నిలుచుననుచు కనుల కొలకుల కన్నీరు కదలనీను కోతపడకుండునా అంత గుండెతీపి కదలి రావయ్య రావయ్య కన్నతండ్రి” అని పద్యాలు రాసుకున్నాడు.

Amma Sparsha

అలా తండ్రి వెళిపోతే తల్లినీ అన్ననూ తననూ చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించినవారు పెద్దమేనమామ దేవులపల్లి రామానుజరావు. ఆయన తెలంగాణ సాహిత్య వైతాళికులలో ఒకరు. ఆయన మాత్రమే కాదు, ఎన్ కె మేనమామలు అయిదుగురూ సాహిత్య జీవులే. అన్న జగన్ ప్రభుత్వోద్యోగి అయి, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులలో ఒకరయి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథులలో ఒకరుగా నిలిచారు. ఆయన పదునైన కలానికి పెట్టింది పేరు. 1969 ఉద్యమ కాలంలో వరంగల్ నుంచి వెలువడిన కరపత్రాలలో అత్యధిక భాగం ఆయన రాసినవే. ఆయన ప్రభావంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రెండు వారాలు జైలు జీవితం కూడ గడిపిన ఎన్ కె ఆయన ప్రోద్బలంతోనే తెలంగాణ పతాక గీతం రాశాడు. ఎన్నో చోట్ల పాడాడు.

ఇలా తండ్రి, మేనమామలు, అన్న అందరికందరూ సామాజిక, సాహిత్య ప్రపంచంలోనే ఉన్నప్పుడు, ఒక పద్య శకలంలో తానే చెప్పుకున్నట్టు “తరతరాలుగ మా యింట నరనరాన కవిత ప్రవహించుచుండె రక్తమ్ము బోలి”.

ఈ సాధనకు, ప్రతిభకు తోడైనది 1969-70 వరంగల్ వాతావరణం. నక్సల్బరీ ప్రభావం శ్రీకాకుళ గిరిజనోద్యమం మీదుగా వరంగల్ గోదావరీతీర అరణ్యాలలోకి ప్రవేశించింది. కాకతీయ మెడికల్ కాలేజి, రీజినల్ ఇంజనీరింగ్ కాలేజిలు విప్లవ రాజకీయాలకూ, విద్యార్థి ఉద్యమాలకూ కేంద్రాలవుతున్నాయి. కాజీపేట క్రైస్తవ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి నుంచి వరంగల్ లో హోటల్ సర్వర్ గా ఉన్న జగదీశ్ వరకు విప్లవోద్యమ నిర్మాణానికి అజ్ఞాతవాసంలోకి వెళుతున్నారు. ఆజంజాహి మిల్స్, ఆర్టీసీ, రైల్వేలలో కార్మికోద్యమ సంచలనం మొదలవుతున్నది. అప్పుడు ఏర్పడిన చందా కాంతయ్య స్మారక కళాశాలలో అధ్యాపకుడిగా వరవరరావు వరంగల్ తిరిగివచ్చారు. ఆయనతో పాటు అధునిక సాహిత్యవేదిక సృజన వరంగల్ కు వచ్చింది.

Lal Bano cover

బంధుత్వం ఉండినప్పటికీ పరిచయంలేని వరవరరావును, ‘భళ్లున తెల్లవారునింక భయము లేదు’ అనే కవిత చదివినప్పటినుంచీ ఐదారేళ్లుగా అభిమానిస్తున్న వరవరరావును కలుసుకోవడానికి ఆయన ఇంటి ముందు నెలరోజులు పడిగాపులు పడ్డానని ఎన్ కె స్వయంగా రాసుకున్నాడు. మొత్తానికి అలా వరవరరావు సాన్నిహిత్యంలోకీ, సృజన లోకీ, విప్లవ రచయితల సంఘంలోకీ ప్రవేశించి రెండు దశాబ్దాల పాటు “చినబాపు చేతి చిటికెనవేలు పట్టుకుని ఎక్కడికంటే అక్కడికి నడిచినవాడి”గా మిత్రులు హాస్యాలాడేంత అవినాభావ మైత్రి ఆ ఇద్దరి మధ్య సాగింది. ఎన్ కె నే ఒకచోట చెప్పుకున్నట్టు “నాకు మా అమ్మ జన్మనిచ్చింది. మా పెద్దమామయ్య రామానుజరావు ఉద్యోగం యిప్పించి ఉపాధి కల్పించాడు. వరవరరావు సారు నాకు జ్ఞానం యిచ్చాడు. ఆయన నా సారథి, నా సఖుడు, నా బంధువు, నా బాంధవుడు, నా గురువు. ఆయనిచ్చిన జ్ఞానమే లేకుంటే నేను ఏనాడో భ్రష్టుపట్టి పోయేవాడ్ని”.

ఎన్ కె వరవరరావును కలిసేటప్పటికే ‘తిరుగబడు’ కవితాసంకలనం ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, అప్పటికింకా పద్య రచనలో, కృష్ణశాస్త్రి, చలం వంటి ప్రభావాలలో ఉండడం వల్ల కావచ్చు, ఎన్ కె ‘తిరుగబడు’లో భాగం కాలేదు. కాని ఆ కాలం ఎంత వేగంగా చలనశీలంగా ఉండిందంటే, 1970 ఫిబ్రవరి శ్రీశ్రీ షష్టిపూర్తి నాటికి ‘తిరుగబడు’ కవుల్లో చేరని ఎన్ కె, ఆ తర్వాత మూడు నెలలకే సృజన మే 1970 ముఖపత్రం మీద అచ్చయిన ‘మేడే’ కవితతో ‘తిరుగబడు’ కవులకన్న తీవ్రతతో కవితాలోకంలోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత జూలై 3 న ‘అభ్యుదయ సాహిత్య సదస్సును బహిష్కరించండి’ అని కరపత్రాలు పంచి, పోలీసు లాఠీ దెబ్బలు తిన్న యువకులలో ఉన్నాడు. విప్లవ రచయితల సంఘ స్థాపనలో భాగమయ్యాడు. ఆ చరిత్రాత్మక జూలై 4కు విడుదలైన ‘మార్చ్’ కవితాసంకలనంలో తన కవితలు మూడు ఉన్నాయి.

ఖమ్మంలో 1970 అక్టోబర్ లో జరిగిన విరసం మొదటి మహాసభల్లో ‘తూర్పు పవనం వీచెనోయ్’ పాడానని తానే రాసుకున్నాడు. అప్పటినుంచీ వేరు వేరు పేర్లతో శివసాగర్ రాస్తున్న పాటలన్నిటికీ ఏదో ఒక ట్యూన్ కట్టడం, పాడడం ఎన్ కె పనిగా మారిపోయింది. చెల్లీ చంద్రమ్మా, విప్పపూల చెట్ల సిగను, శత్రు చేజిక్కితినని, తోటారాముని తొడకు, మేరిమి కొండల్లో మెరిసింది మేఘమూ వంటి శివసాగర్ పాటలన్నీ లోకానికి తెలిసినది ఎన్ కె ట్యూన్లతోనే, చాలవరకు ఎన్ కె స్వరంలోనే. 1972 కు ముందు జననాట్యమండలి ఏర్పడకపోవడం, పూర్తి స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండకపోవడం, ఈ పాటలన్నీ సత్యమూర్తి రాసినవనే గౌరవం ఉండడం ఎంత కీలకమైనవో ఎన్ కె స్వరం, గాన శైలి, గానంలో నిమగ్నత అంత కీలకమైనవి. ముఖ్యంగా ఆయా పాటల ద్వారా శివసాగర్ ప్రకటించదలచిన, ప్రసారం చేయదలచిన భావోద్వేగాలను ఎన్ కె చాల శక్తిమంతంగా ప్రసారం చేసేవాడు. కరుణ, వీర రసాలు రెండూ ఎన్ కె గొంతులో అద్భుతంగా పలికేవి.

విరసం ఏర్పాటుకు ముందు నుంచే విప్లవకవిత్వం రాస్తున్న ఎన్ కె కవిత్వం ఆ తర్వాత మరింత పదునెక్కింది. మార్చ్, ఝంఝలను ప్రభుత్వం నిషేధించినప్పుడు “సత్యాన్ని చాటే పుస్తకాల్ని నిషేధించగలరు గాని సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తారు” అనే నాలుగు పాదాల కవితా ఖండికతో తన కవిత్వ శక్తిని ప్రకటించుకున్నాడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో స్వేచ్ఛ కోరుకుంటున్న బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, యాహ్యాఖాన్ సైనిక దుర్మార్గాలనూ, ఇందిరాగాంధీ విస్తరణ వాదాన్నీ విమర్శిస్తూ వెలువడిన ‘బంగ్లాదేశ్’ తెలుగు కవితా సంకలనానికి సంకనకర్త ఎన్ కె నే.

lal bano engఆ రోజుల్లోనే సొంత పాటలు కూడ రాయడం ప్రారంభించాడు. ‘కలలు మోసే అయ్య కదలి రావాల’ అంటూ అక్టోబర్ 1971లో రాసిన మొదటి పాటలో “ఏయె ఏయె సెల్లె వలయేయె సెల్లె వలయేయె సెల్లె/ వలలొ సేపల మాట వదిలేయె సెల్లె వదిలేయె సెల్లె/ బతుకు సుట్టూరుత బారి సంద్రమ్ము/ సల్లనీ నీళ్లతో సాగు సంద్రమ్ము/ నీటి కడుపులోన నీలాల నిప్పు/ నిప్పుతో మన కళ్లు యిప్పుకుందాము…” అని రాశాడు. విప్లవంలో స్త్రీల పాత్ర గురించి శివసాగర్ రాసిన ‘ఆకాశంలో సగం’ సృజన జనవరి 1975 సంచికలో వస్తే, ఆ ప్రభావంతో ఎన్ కె రాసిన ‘పోదాం కలిసీ’ పాట ఫిబ్రవరి సంచికలో వచ్చింది. “కళ్లు కళ్లు కలుసుకొని / చేసే బాసలు ఏముంటయి/ మనసూ మనసూ పరచుకొని/ చెప్పే ఊసులు ఏముంటయి/ ఉంటే ప్రాణం పోతే ప్రాణం/ కమ్యూనిస్టులకు ప్రజలే ప్రాణం” అని రాశాడు. ఈలోగా, సికిందరాబాదు కుట్రకేసులో నిందితుడిగా వరవరరావు 1974 మేలో అరెస్టయినప్పటి నుంచి ఎమర్జెన్సీ మొదలై సృజన ప్రచురణ ఆగిపోయేదాకా సమష్టిగా సంపాదక బాధ్యత నిర్వహించిన సాహితీమిత్రులు లో ప్రధాన బాధ్యత ఎన్ కె దే. అలా దాదాపు ఐదు సంవత్సరాలు వరంగల్ విప్లవోద్యమంలో, విప్లవ సాహిత్యోద్యమంలో ప్రధానంగా కనబడ్డాడు గనుకనే ఎమర్జెన్సీ విధించగానే అరెస్టు చేసిన మొదటి బృందంలో ఉన్నాడు.

ఎమర్జెన్సీలో జైలులో ఉండగా రాసిన ‘కామ్రేడ్ నాగరాజుకు’ అటు ఎన్ కె, ఇటు మరెందరో ఔత్సాహిక గాయకులు వేలాది సార్లు పాడి ఉంటారు. ఎమర్జెన్సీ ఎత్తివేసి, ప్రజాస్వామ్య వెల్లువ ప్రారంభమైన 1977 ఏప్రిల్ నుంచి 1985లో ఎన్ టి రామారావు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆట, పాట, మాట బంద్ అని అప్రకటిత నిషేధం విధించేదాకా ఆ పాట ప్రతి సభలోనూ మార్మోగేది. ”ఒకచేత్తో కన్నీరు తుడుచుకొనీ/ వేరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొనీ/ అంటాము మేము నాగరాజు/ గుండెలో మండేవు రాజుకొని రోజురోజు” అనే చరణంతో ప్రారంభమయ్యే ఈ పాట, “నిప్పురవ్వె దావానలమగును/ పల్లె పల్లె పట్టణాలు చుట్టుముట్టి తీరును/ విజయానికి మైలురాయి త్యాగం/ చిందిన మన నెత్తురులో చివురు తొడుగు జనరాజ్యం”, “దూరాన తెరచాప అంచు/ క్రమించి నావతీరమాక్రమించు/ ఉదయించే తొలివెలుగుల తూర్పు/ ఆర్పలేదు విప్లవాన్ని ఏ పడమటి గాడ్పు” అనే చిరస్మరణీయ చరణాలతో చివరికి “తెరచాపలు గాలిలోన ఆడుదాక/ ఆకాశం ఎర్రకాంతులీనుదాక/ ఉంటావు నువ్వు నాగరాజు/ నువు అమరుడివి అమరుడివి ఈ రోజు ఏ రోజూ” అని ముగుస్తుంది.

Lal Bano Kannada cover

‘పరిటాలా రాములూ’, ‘కంఠమ్ము ఎత్తవే’, ‘సరిదారి నీదైతే’, ఎర్రాటెన్నెల దేరో’, ‘ఎర్రజండాకె అయితివా’ వంటి పాటలు కూడ అంతగా జనాదరణ పొందినవే. వీటిలో ప్రత్యేకంగా ‘ఎర్రజెండాకె అయితివా’ గురించి చెప్పుకోవాలి. జన్ను చిన్నాలు వరంగల్ అంచులలోని పైడిపల్లి గ్రామానికి చెందిన పేద దళితుడు. కాకతీయ మెడికల్ కాలేజి లో మెస్ బాయ్ గా జీవితం ప్రారంభించి, విప్లవోద్యమ ప్రభావంలోకి వచ్చి, వరంగల్ జిల్లా విప్లవోద్యమ నాయకుడిగా ఎదిగి 1979 నవంబర్ లో గూండాల చేత హత్యకు గురయ్యాడు. చిన్నాలుకు నాగరాజు పాట, అందులో “పడగ విప్పి ఉన్నాము పగను తీర్చుకుంటాము/ నీ నెత్తుటి అప్పును ఇక మానెత్తుట చెల్లిస్తం” అనే పాదాలు చాల ఇష్టం. ఎన్ కె కలిసినప్పుడల్లా పాడమని అడుగుతుండేవాడు. కొన్ని సార్లు ఏదో ఒక కారణంతో ఎన్ కె పాడేవాడు కాదు. చిన్నాలు హత్య తర్వాత రాసిన పాటలో ఎన్ కె “కండ్లల్లొ కండ్లను పెట్టి ఓ చిన్నాలన్నా/ కడుపుతీర సల్లగ నవ్వి/ చేతిలోకి చెయ్యి తీసుక/ చేతివేళ్లు ప్రేమగ దువ్వి/ పదము నువ్వు పాడమంటెను/ ఏదో ఓ వంకను జెప్పి/ అపుడు గాదు యిపుడంటెను/ ఇపుడు గాదు అపుడంటెను/అలిగలిగి నువ్వు పోతెను/ ఆపై నువ్వె వస్తవంటిని/ అయ్యో యిపుడెక్కడుంటివి/ నాగరాజు పాట పాడుతా/ పరిటాలా పదము పాడుతా/ ఏటికి ఎదురీత పాడుతా/ విలుకాని విల్లు ఎత్తుతా/ చెంద్రక్కా కథను సెప్పుతా/ అ అంటే అడవి గీతము/ ఆ అంటే ఆయుధమంటూ/ చారుబాబు సంగతి చెబుతా/ ఎత్తలేక గొంతు చచ్చినా/ నోటిపూత నెత్తురొచ్చినా/ పేగులన్ని పొర్లుకొచ్చినా/ ఏదడిగితే అదే పాడుతా/ ఒక్కసారి వచ్చి యినుమురా/ గద్దరన్న పాట పాడనా/ సికాకులం సీమ కొండనీ/ ప్రసాదన్న పాట పాడనా/ పదం గట్టి పాడాలంటూ/ నువ్వే ఓ పదమైతివా/ నువ్వే నా పాటైతివా/ నువ్వే నా బాటైతివా/ పోరాటం దరువైతివా/ ఇంకిపోని ఎరుపైతివా/ ఎర్ర్రజెండాకె అయితివా/ ఎర్రెర్రని జెండైతివా…” అని రాశాడు.

ఆ సమయంలో సృజన సాహితీమిత్రులు వారానికి ఒకసారి రెండుసార్లు కూడ సమావేశమై రచనల మీద చర్చించేవారు. కవిత్వం విషయంలోనూ, ఇతర రచనల విషయంలోనూ ప్రమాణాల మెరుగుదలకు ఎన్ కె చేసే దోహదం చాల ఉండేది.

వచనకవిత, పాట, వ్యాసం వంటి ప్రక్రియలన్నిటిలోనూ ప్రవేశించినా ఎన్ కె రచనలన్నిటిలోకీ శిఖరాయమానమైనది ‘లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం’. ఆ దీర్ఘ కవిత గురించి ఇప్పటికే చాల చర్చ జరిగింది గనుక మళ్లీ ఇక్కడ అవసరం లేదు గాని, తెలుగులో అంత లోతైన, అంత విశాలమైన చారిత్రక, సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని అంత గొప్పగా కవితాత్మకంగా ఆవిష్కరించిన కవితలు అతి తక్కువ అని మాత్రం చెప్పాలి. అది సుదీర్ఘమైనదైనా, వచన కవిత అయినా, ఇద్దరు ముగ్గురు కూచుని చదువుకున్నప్పుడైనా, పది, ఇరవై వేల మంది ఉన్న సభలోనైనా ఎక్కడ చదివినా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నది. సంఘపరివార వాదనలకు తిరుగులేని జవాబులు చెప్పింది. ఒకసారి సృజనలో అచ్చు కావడం, రెండు సార్లు పుస్తకంగా పునర్ముద్రణ పొందడంతో పాటు, కవితా ఓ కవితా సంకలనంలో కూడ చేరింది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషానువాదాలు పుస్తకాలుగా వచ్చాయి. మోడీ పాలనలో పెరిగిపోతున్న సంఘపరివార్ దుర్మార్గాల నేపథ్యంలో ఇవాళ చదువుకుంటే తాజాగా, వర్తమానానికి అన్వయించేలా, అత్యవసరమైనదిగా ఉంటుంది.

Rehearsal coverరిహార్సల్, లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరం తర్వాత సృజనలోనూ, అరుణతారలోనూ మరిన్ని కవితలు రాశాడు గాని అవి ఇంకా పుస్తక రూపం ధరించకముందే, ముందు చెప్పినట్టుగా వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఎన్ కె ను ఈ ప్రవాహం నుంచి తప్పించాయి. ఒడ్డు పట్టించాయి. అయినా ఆ మనిషిలో తడి ఆరలేదు. దేవులపల్లి అమర్, అజయ్ లు ప్రజాతంత్ర వారపత్రిక ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు కవితావ్యాఖ్యలు రాశాడు. తన జీవిత కథను కొంత విమర్శనాత్మకంగా, కొంత స్వీయ సానుభూతితో చూసుకుంటూ, అప్పటికీ తనకు వచన రచన రాదని చెప్పుకుంటూనే ‘అమ్మస్పర్శ’ అనే ఆత్మకథాత్మకమైన అనుభవాల గుచ్ఛం 2009లో ప్రచురించాడు.

దాదాపు మూడు సంవత్సరాలుగా పార్కిన్సన్ వంటి భౌతిక అనారోగ్యంతోనూ, సంచలనశీల క్రియాత్మక ప్రజా జీవితాన్ని గడిపి ఒంటరి అయిపోయిన మానసిక వేదనతోనూ తనలో తనే కుంగిపోయాడు. అది గుండెజబ్బుకు కూడ దారితీసింది. అయినా తేరుకుంటున్నాడు, మళ్లీ మనుషుల్లో పడతాడు అనుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 27 రాత్రి ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచాడు.

డిసెంబర్ 29 మధ్యాహ్నం మా అందరికీ ప్రాణసమానమైన ఆ కుమార్ పల్లి వీథిలో నేలమీద ఏడుకట్ల సవారీ మీద చివరినిద్రకు పడుకున్న అన్నయ్య శీతలదేహం తలమీద చివరిసారి నిమురుతున్నప్పుడు నాలుగు దశాబ్దాల అనుబంధం లోని వేలాది దృశ్యాలతో పాటు, ఆయన తండ్రి రామకృష్ణామాత్య రాసిన పద్యం గుర్తుకొచ్చింది.

“ఏ పొలాల్ వరి పోచలీనుచునున్నవో/పుడమియందలి నాదు పడక గాగ/ ఎవ్వారి బాహువుల్ ఎగయుచు నున్నవో/ నా యొడల్ కాటికి మోయు కొరకు/ ఏ వృక్షమున శాఖ లెదుగుచు నున్నవో/ క్షణమున నన్ను భస్మమ్ము జేయ/ ఏ స్థలం బీ భూమి యీక్షించుచున్నదో/ తనలోన నా బూది దాచుకొనగ/ ఎందరెందరు నా ముందు ఏగినారొ/ ఇంక ఎందరు నా వెన్క ఏగుదెంత్రొ/ ఎందుకో యింతకీ సృష్టి ఎంతవరకొ/ ఎరుక తెలియగా సాధ్యమె యేరికేని?”

 -ఎన్ వేణుగోపాల్   

Download PDF

9 Comments

 • raghava says:

  ఈ పాటలు మేమిప్పుడు ఎక్కడ వినగలం?..

 • చక్కని పరిచయం, వేణు.

 • Thirupalu says:

  ఆయన ఏ విధంగాను పరిచయం లేనప్పటికీ, మీరు రాసిన తీరు కన్నీరు తెప్పించాయి.!

 • నిశీధి says:

  ఇంక ఎందరు నా వెన్క ఏగుదెంత్రొ/ ఎందుకో యింతకీ సృష్టి ఎంతవరకొ/ ఎరుక తెలియగా సాధ్యమె యేరికేని?” ఎంత నిజం కదా . చాల మంచి ఆర్టికల్

 • కోడూరి విజయకుమార్ says:

  వేణు … ఎన్ కె గారి గురించి తెలియని తరానికి ఒక మంచి వ్యాసం అందించారు -

 • ఎ.కె.ప్రభాకర్ says:

  పాట గద్దర్ భుజమ్మీద చద్దరై ఎగురుతోన్న రోజుల్లో లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం లాంటి కవిత ఫ్రీవర్స్ కూడా గొంతెత్తి చదివితే జనాన్ని ఉర్రూతలూగించగలదని నిరూపించింది. ఆ కవితలో వేగానికి ఉక్కిరిబిక్కిరి కావడం అప్పట్లో మంచి అనుభవం. ఎన్ కె గురించి ఆత్మీయంగాఉద్వేగంతో రాసిన వేణు కి ధన్యవాదాలు.
  “ఏ పొలాల్ వరి పోచలీనుచునున్నవో/పుడమియందలి నాదు పడక గాగ/ ఎవ్వారి బాహువుల్ ఎగయుచు నున్నవో/ నా యొడల్ కాటికి మోయు కొరకు/ ఏ వృక్షమున శాఖ లెదుగుచు నున్నవో/ క్షణమున నన్ను భస్మమ్ము జేయ/ ఏ స్థలం బీ భూమి యీక్షించుచున్నదో/ తనలోన నా బూది దాచుకొనగ/ ఎందరెందరు నా ముందు ఏగినారొ/ ఇంక ఎందరు నా వెన్క ఏగుదెంత్రొ/ ఎందుకో యింతకీ సృష్టి ఎంతవరకొ/ ఎరుక తెలియగా సాధ్యమె యేరికేని?”
  గొప్ప ముగింపు.

 • రవిశంకర్ says:

  ఎనభయ్యో దశకంలో ఎక్కువభాగం నేను వరంగల్లులోనే గడిపినా, అక్కడి కవిమిత్రులనేకమందితో పరిచయం ఉన్నా, ఎందువల్లనో ఎన్.కె గారి పేరు అప్పట్లో నాకు పరిచయం కాలేదు.( అక్కడ నేను కలుసుకున్న మాజీ విప్లవకవి ‘లోచన్ సారు’ ఒక్కరే.) ఆర్యీసీలో జరిగే టెక్నికల్ సెమినారులైనా సరే, విప్లవగీతాలు ఆలపించకుండా ప్రారంభం కావటానికి వీల్లేదని పట్టుబట్టే విద్యార్థి నాయకులు కూడా ఈ పాటలు పాడినట్టు గుర్తు లేదు. అలా జరిగినా బహుశా అప్పట్లోనే ఈ పాటలు వినే అవకాశం కలిగేది. మీ వ్యాసం నన్ను కదిలించింది. మీరు ఉటంకించిన కవితా వాక్యాలు, చివర పేర్కొన్న సీస పద్యంతో సహా, ఎంతో బలమైనవి. ఎన్.కె. గారికి నా శ్రద్ధాంజలి.

 • buchireddy gangula says:

  విప్లవ రచయితల సంఘం నా మాతృ సంస్థ —అందులో మాతృస్పర్శ అనుభవించాను

  Warangal విరసం యూనిట్ రాజలోచన్ రాసిన రాసిన రత్నమాల సంతకం తో

  ఉన్న కరపత్రం లాంటి లెటర్ ను గుంజి గుంజి వన్ ఇయర్ పయినా చర్చ వేశారు

  విరసం ఎంక్వయిరీ మొదల అయింది

  యింత రబస ఎందుకు ??ఏమి ఆశిస్తున్నారు — యిప్పుడు యిన్ని ఏళ్ళకు బజారు కు
  యి డి సతారా ???

  నాకు చాల మనస్తాపం అయింది

  నన్ను విరసం excutive. member.. గా తొలిగించారు

  ఎత్తిన విరసం జెండా తరుముకోస్తున్నది

  n. k.. గారి **** అమ్మస్పర్శ లో వారు రాసిన మాటలు
  ****************************************************************

  విరసం నుండి తొలిగించడం — స్వంత విషయం లో — విరసం యొక్క

  జోక్యం తో మనిషి చాల హర్ట్ అయ్యాడు —-కలిసినప్పుడల్లా అదే గుర్తు చేసే వాడు —
  అంటూ —–రాత్రి వరంగల్ మిత్రుడు తెలిపాడు ???

  మిత్రమండలి తో నాకు పరిచయం —– మంచి కవి

  మిస్ హిం ———- సాల్యుట్స్ n. k… ji…

  ——————————————————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 • Satyanarayana Rapolu says:

  అనంతర కాలంలో ఆయన ఉధృతి తగ్గించుకొన్నా, అంతేవాసులతో, దూర సార్వత్రిక విద్యార్థులతో భావజాల వ్యాప్తి కొనసాగిస్తనే వచ్చిండ్రు. జర్నలిజం శాఖ కోర్స్ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు అమర్, నేను విస్తరణోపన్యాసం చేసే అవకాశం కలిగింది. వారికి నా శ్రద్ధాంజలి! ఇంగ్లిష్ పదం హాస్పిటల్ కు అనుకరణ ఆసుపత్రి. హాస్పిటల్, దవాఖాన, వైద్యశాల సరియైన పదాలు.

Leave a Reply to Satyanarayana Rapolu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)