అయ్య యాది-2

ఉయ్యాల లూగింది యాద్లేదు నాకు

భుజాలమీదాడింది మర్శిపోనెన్నట్కి

కన్నదమ్మే గాని కంట్కి రెప్పోలె

కాపాడ్త్వి నువ్వు పుట్టినకాడ్నించి

 

అంగడ్కి బోతప్డు   ఆఠాణ అక్కకిచ్చి

అందర్కి బంచమని శెప్పిపోతుంట్వి

పొద్దూక పండ్లు దెచ్చి తలోటిచ్కుంట

ఏమేం జేశిర్రని ఎర్క దెల్సుకుంద్వు

 

బుర్రిగోనాడ్తనని  బుర్రి శెక్కియ్యమంటె

శిర్రెగోనంటరని ఎక్కిరిస్తుంటె

ఎహ్ పోయె ఏదోటి  శేషియ్యమంటె

యాప బుర్రి నువ్వు ఎమ్మటే ఇచ్చేది

 

మారెమ్మ బోనాలెల్లినంక  శెట్ల కింద్కి బోతె

పొద్దీకి బువ్వ దిన్కముందు కల్లు దాగ్తప్డు

రేక గాంగ మిగిల్న కమ్మతోటి  పీకె జేశిచ్చేది

పీకె ఊద్కుంట బువ్వకు బిల్శేది నిన్ను

 

శిన్నగున్నప్పుడె ఈత నేర్వాల్నన్జెప్పి లొట్టల కట్టనీప్కుగట్టి

పుట్టోన్బాయి మెట్ల మీన మొదల్బెట్టి

తర్వాత తాడ్తోని మోటర్దాకి రమ్మన్న యాది

ఎండకలామెప్డు ఈతక్బోయ్న గాడ్కి

 

గోటీలాటాడ్కుంట ఆకిట్ల అన్ననేన్గొట్కుంటే

శిన్న పెద్ద లేక నోట్కొచ్చింది దిట్కుంటె

అక్కలొద్ధంటుంటె ఐనినకుంట

ఇంటెన్క  ఇద్దర్ని కడ్కి గట్టేశి గొడ్దువు

 

రోజుకొక్కంగడి దిర్గుకుంట నువ్వు

మబ్బుల్నే లేశి మల్లెప్పుడొచ్చేదొ

సప్పుడైతుంటె సాయ్మాన్ల నీది

సప్పుడుగాకుంటొచ్చి పక్కపొంటి  గూసుంటుంటిమి

 

శెర్వు పెద్దది మనూర్ది  శాపలెక్వనుకుంట

పట్టరాదే నాకు పడయయ్యి అంటుంటె

ఉష్కె దొంతులూకెనె బడ్తయని శెప్కుంట

ఎర్రలను అంటించి గాలం శేతికిస్తుంటివి

 

బుడ్డవర్కలొద్దు మేం బువ్వ దిన్మంటె

శాపలయిపొయ్నయని శెర్వు లూటి బొయ్నంక

రవ్వలూ బొచ్చెలూ బొచ్చెడు బట్కొచ్చి

ముండ్లు  దీశి దిన్మని ముంద్ట బెడ్తుంట్వి

 

ఎండకాలమంత సల్లగుండె ఇల్లు

ఆనకాలమొస్తె ఆగమాగమైతుండె

ముసురు ఆనకె మనిల్లు మస్తు గురుస్తుంటె

పెంకలన్నీ సద్రి ఇల్లు మల్ల గప్పేది మేస్త్రివై

 

ఇర్వయేండ్లకె నిన్ను ఎద్రిస్తుంటే మేం

అర్వయేండ్లకొచ్చి ఐద్గురు బిడ్డల దండ్రైనగాని

ఎద్రుజెప్పలె మా అయ్యకేనాడని

తాత నీ ఎమ్మటి వడి  కట్టిశ్రి , కశ్రిచ్చిన ముచ్చట జెప్దువు

 

శేతులెంకకు బెట్టి ఒరం మీన బోతుంటె

ఎన్నడ్సూడ్నొల్లు గూడెర్కబడ్తుండ్రు నీ కొడ్కులని

నడ్సుడు నీతీర్గ, నవ్వుడూ నీలాగ

గడ్సుడే బర్వైంది ఇడ్శినప్పటి సంది

 

ఎప్పుడెద్గినమొ మేమెర్కనేలేదంట్వి

ఎద్గినొళ్ళను ఎక్వొద్ధులు సూస్కోనెపోత్వి

ఏండ్లేండ్లు నడ్సబట్టే  యాడ్కి బోయ్నవే నువ్వు

ఎన్నడేడ్వనొళ్ళనేడ్పిచ్చుకుంట……..

-కూరెళ్ళ స్వామి

Kurella Swamy

Download PDF

10 Comments

 • నిశీధి says:

  ఇంత స్లాంగ్ ఒక చోట కుప్ప పోసి వావ్ , టైం పట్టింది పదాలను అర్ధం చేసుకోవటానికి , అర్ధం తెలిసాక హాయిగా ఉంది ఆ ఫీలింగ్ . కుడోస్ సర్

 • m sathyaraj says:

  అన్న మనసులో మరిచి పోలేని మాటల తూటలు అయౄ యాది ఇది చదివిన తర్వాత ..నా గుండెల్లో తీయని గత ఙాపకం అయా యాది 2 చాలా బాగుంది

 • వెంకట రెడ్డి మూల says:

  రేక గాంగ మిగిల్న కమ్మతోటి పీకె జేశిచ్చేది ; ఉష్కె దొంతులూకెనె బడ్తయని….. అసలు ఏ ప్రాంత యాస అయినా ఆ ప్రాంత పోల్లకు గిట్లనే ఉంటది. అయ్య-యాది లెక్క… నువ్వద్దిగా చెప్తాన సామీ … నీ రాతలు ప్రతీ కొడుకు జ్ఞాపకా(యా
  దు)ల కలబోతలు … కొంచెం అటూ ఇటూ …

  • కూరెళ్ళ స్వామి says:

   థ్యాంక్ యూ వెంకట రెడ్డి గారు

  • prasad says:

   వెంకటరెడ్డి గారు, చాల చక్కగా చెప్పారు.
   కూరెల్ల స్వామి గారు, మీ అయ్యా యది-2 చాల ఎమోషనల్ గా ఉంది.
   పార్ట్-1 ఎక్కడ ఉంది ?

 • raghava says:

  కండ్ల నీళ్ళతో..

 • rajani says:

  ఎవ్వరికైనా బాల్య జ్ఞాపకాలు ఎంత సంతోషాన్ని కలిగిస్తాయో అంతటి దుఖాన్ని కూడా కలిగిస్తాయి.నిజంగా అచ్చ తెలంగాణా మాండలికంలో మీ జీవితాన్ని మీ అయ్యా యాదిని మంచిగా చెప్పారు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)