నగ్నదేహాలతో నలుడూ, ఓడిసస్…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది. ఓడిసస్ దానిని ఎంచుకున్నాడు. ఈ మార్గాన్ని మనకు తెలిసిన భాషలో ‘ద్వైతమార్గం’ అందాం.

సౌరద్వీపం చేరుకున్నాక ఓడిసస్ నిద్రపోతుండగా అతని సహచరులు మానవ సహజమైన ఆకలితో ఆ ద్వీపంలోని అనేక పశువులను నరికి వండుకు తిన్నారు. ఆ తర్వాత అక్కడినుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. అంతలో ప్రచండమైన పడమటి గాలి వీచి పెనుతుపాను సృష్టించింది. ఓడనూ, ఓడిసస్ సహచరులనూ కూడా ముంచి వేసింది. ఓడ స్తంభానికి వేల్లాడి ఓడిసస్ ఒక్కడే ప్రాణాలు దక్కించుకున్నాడు.

అతని యాత్రలో ఇది పతాకఘట్టం!

ఓడిసస్ నీళ్ళ మీద తేలుతూ సిల్లా, చరిబ్దిస్ ల మధ్యగా తొమ్మిదిరోజులపాటు ప్రయాణించి పదో రోజున ఒగీగియా అనే దీవికి చేరుకున్నాడు. అక్కడ లేత పచ్చిక బయళ్ళు, పూతోటలు, ద్రాక్షతోటలు, పక్షుల కిలకిలారావాల మధ్య ఒక గుహలో కలిప్సో అనే అప్సరస నివసిస్తోంది. ఆమె తియ్యని గొంతుతో పాటలు పాడుతూ తన మగ్గం ముందు అటూ ఇటూ తిరుగుతూ బంగారపు కండెతో వస్త్రం నేస్తోంది.

ఓడిసస్ కు ఆమె ఆతిథ్యమిచ్చి తిరిగి అతను శక్తిని పుంజుకునేలా చేసింది . ఆమెతోనే అతను ఎనిమిదేళ్లు గడిపేశాడు. సిర్సే నేర్పిన పాఠాలను కలిప్సో సాహచర్యంలో మరింత ఒంటబట్టించుకున్నాడు. ఎట్టకేలకు ఆమెను విడిచి వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా అతన్ని తదుపరి యాత్రలోకి ప్రవేశపెట్టమని హెర్మెస్ ద్వారా జియస్ కలిప్సోకు కబురుచేశాడు. ఆమె అయిష్టంగానే అంగీకరించింది. ఓడిసస్ ఒక తెప్పను నిర్మించుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె అతనికి స్నానం చేయించి చక్కటి దుస్తులు కట్టబెట్టింది. అతను వెడుతుంటే ఆమె ఒడ్డున నిలబడి వీడ్కోలు చెప్పింది.

అయితే, తన కొడుకు పోలిఫెమస్ కన్ను పొడిచేసినందుకు ఇప్పటికీ ఓడిసస్ మీద పోసిడిన్ కోపంగానే ఉన్నాడు. ఒక పెను తుపానును ప్రయోగించి ఓడిసస్ ఉన్న తెప్పను ధ్వంసం చేయించాడు. ఓడిసస్ రెండు పగళ్ళు, రెండు రాత్రులు ఈదుకుంటూ వెళ్ళి, ఫేషియన్లు అనే నౌకా నిపుణులు ఉండే ఒక దీవికి చేరుకున్నాడు. అప్పుడతను పూర్తి నగ్నంగా ఉన్నాడు. అదే సమయంలో నౌసికా అనే రాచబాలిక తన నేస్తాలతో కలసి ఆడుకోడానికి సముద్రతీరానికి వచ్చింది. వాళ్ళు ఆడుతున్న బంతి నీళ్ళలో పడిపోయింది. దాంతో అంతా కేకలు పెట్టారు. ఒక గుబురు మాటున ఉన్న ఓడిసస్ ఆ కేకలు విని, చెట్టుకొమ్మతో తన నగ్నత్వాన్ని కప్పుకుంటూ ఇవతలకు వచ్చాడు. అప్పుడా బాలికలు అతనికి కట్టుకోడానికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకెళ్ళారు.

ఆరోజు రాత్రి ఫేషియన్లు అతనికి విందు ఇచ్చారు. ఆ పదేళ్ళలో తను చేసిన సాహసయాత్రల గురించి, పడిన కష్టాల గురించి ఓడిసస్ వాళ్లకు చెప్పాడు. అతనిపై సానుభూతి చూపిన ఫేషియన్లు, అతను స్వస్థలానికి వెళ్ళడానికి ఒక ఓడను, సిబ్బందిని ఏర్పాటుచేశారు. అతను ఒళ్ళు మరచి సుఖంగా నిద్రపోయేవిధంగా ఓడను తీర్చిదిద్దారు. ఓడ కెరటాలపై ఊయలలూగుతూ సాగిపోతుంటే ఓడిసస్ తీయని గాఢనిద్రలోకి జారిపోయాడు. అదెంత గాఢనిద్ర అంటే, చావుతో సమానమైనంత! అంటే, ఓడిసస్ ఇప్పుడు మార్మిక జగత్తు నుంచి బాహ్యప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట. ఈ దశలో అతనికి మార్గదర్శనం చేసే బాధ్యతను ఎథెనే అనే దేవత స్వీకరించింది.

ఇలా ఉండగా, అక్కడ ఓడిసస్ భార్య పెనెలోప్ కు పునస్స్వయంవరం ఏర్పాటైంది. ఎంతోమంది వీరులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పెనెలోప్ ప్రాసాదంలో ఆతిథ్యం పొందుతున్నారు. దాసీలతో వాళ్ళు కామకలాపాలలో మునిగి ఉన్నారు. దాంతో ఆ ప్రాసాదం ఓ వ్యభిచారగృహంగా మారిపోయింది. ఓడిసస్ కొడుకు తెలెమాకస్ వాళ్ళ మధ్య బరువెక్కిన హృదయంతో నిట్టూర్పులు పుచ్చుతూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఎథెనా మారువేషంలో వెళ్ళి తెలెమాకస్ కు కనిపించింది. అతనామెకు స్వాగతం చెప్పాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత, ‘నీ తండ్రి వస్తున్నాడు. అతనికి ఎదురువెళ్ళు’ అని ఎథెనా అతనికి సలహా ఇచ్చి ఫలానా మార్గంలో వెళ్ళమని చెప్పింది. అలా తండ్రీ-కొడుకు కలసుకునే ఏర్పాటు చేసింది.

untitled

 

ఆ తర్వాత ఆమె ఒక అందమైన రాకుమారుని వేషంలో సముద్రపు ఒడ్డున ఓడిసస్ కు కనిపించింది. ఆమె చేతుల్లో ఒక పొడవాటి ఈటె ఉంది. ఆమెను చూడగానే ఓడిసస్ కు ఎంతో సంతోషం కలిగింది. ఎథెనా అతన్ని ఒక బిచ్చగాడి రూపంలోకి మార్చేసింది. తండ్రీ, కొడుకులు ఒక పందుల కాపరి గుడిసెలో కలసుకున్నారు. ఆ తర్వాత ఓడిసస్ స్వగృహంలోకి అడుగుపెట్టాడు. అతన్ని అతని కుక్క, ఒక వృద్ధదాది తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేదు. అతని మీద గూఢచర్యం సాగించిన వృద్ధ దాది అతని మోకాలి మీద ఒక పంది చేసిన గాయాన్ని చూసి గుర్తుపట్టింది. ఓడిసస్ ఆమెను చూపులతోనే వారించి, అక్కడి అతిథులు దాసీలతో నిస్సిగ్గుగా సాగించే కామకలాపాలను కాసేపు గమనిస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత స్వయంవరఘట్టం మొదలైంది. ఓడిసస్ కు చెందిన అత్యంత శక్తిమంతమైన వింటిని ఎత్తి పన్నెండు గొడ్డళ్లను ఎవడైతే ఛేదిస్తాడో అతన్ని పెనెలోప్ వరిస్తుంది… అదీ పరీక్ష! లక్ష్యాన్ని ఛేదించడం కాదు సరికదా, కనీసం వింటికి నారి కూడా బిగించలేక అంతా తెల్ల మొహం వేశారు. అప్పుడు బిచ్చగాడి రూపంలో ఉన్న ఓడిసస్ ముందుకు వచ్చాడు. అవలీలగా వింటిని పైకెత్తి నారి బిగించి పన్నెండు గొడ్డళ్ళనూ ఛేదించాడు. అతనికి దేవతల సహకారం కూడా లభించింది. ఆ తర్వాత అతను స్వయంవరంలో పాల్గొన్న వీరులను కూడా అంతం చేశాడు.

అతనే ఓడిసస్ అన్న సంగతి తెలిసిపోయింది. పెనెలోప్ భర్తను సమీపించి, ’శయ్యాగారం సిద్ధమవుతోం’దని చెప్పింది. ఆపైన, ‘ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మీ యాత్ర గురించీ, మీరు పడ్డ కష్టాల గురించీ అన్నీ నాకు చెప్పాలి’ అంది.

download

ఎథెనా

 

***

జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, నేను గమనించినంతవరకూ, మన పండిత లోకం ఈ పోలికలను గుర్తించి విస్తృతంగా చర్చించిన దాఖలా లేకపోవడం!

కేవలం స్థూలమైన పోలికలకే ఇంత ఆశ్చర్యపోవాలా, అవి యాదృచ్ఛికం కావచ్చు, లేదా మన కథలనే వాళ్ళు తీసుకుని ఉండచ్చని పాఠకులలో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉంటారు. కానీ నాకు అర్థమైనంతవరకూ ఈ పోలికలు అంత ఆషామాషీ వ్యవహారం కావు. వాటి వెనుక కొన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలూ ఉన్నాయి. అంతకన్నా విశేషంగా కొన్ని తాత్విక సామ్యాలు ఉన్నాయి.

ఆ రకంగా చూసినప్పుడు నలదమయంతులు-ఒడిసస్ పెనెలోప్ ల కథలలో ఉన్న పోలికలను మూడు అంచెలలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అవి: 1. స్థూలమైన పోలికలు. 2. సూక్ష్మమైన పోలికలు. 3. సుసూక్ష్మమైన పోలికలు.

స్థూలమైన పోలికలు

రెండు కథల్లోనూ భార్యాభర్తల మధ్య వియోగం సంభవించింది. భర్త ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రెండు కథల్లోనూ దేవతల ప్రమేయం ఉంది. రెండింటిలోనూ భార్య పునస్స్వయంవరం ఉంది. కాకపోతే, దమయంతి పునస్స్వయంవరం భర్తను తన దగ్గరకు రప్పించుకోడానికి అనుసరించిన ఒక చిట్కా మాత్రమే. కానీ పెనెలోప్ స్వయంవరం నిజంగా జరిగింది. అదొక్కటే తేడా. భర్త ఏళ్ల తరబడి దేశాలు పట్టిపోయి భార్యకు దూరమైనప్పుడు భార్య పునర్వివాహం చేసుకోవచ్చునన్న సామాజిక నీతిని రెండు కథలూ ప్రతిబింబిస్తూ ఉండచ్చు కానీ, నలదమయంతుల కథలో కథకుడు దమయంతి పునర్వివాహప్రయత్నాన్ని ఒక చిట్కాగా మార్చేసి దమయంతి పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఓడిసస్-పెనెలోప్ ల కథలో ఇందుకు భిన్నంగా జరిగింది. నిజానికి పెనెలోప్ కూడా పునస్స్వయంవరాన్ని ఒక చిట్కాగానే ప్రయోగించి ఉండచ్చు, ఆమె కూడా దమయంతిలానే పతివ్రత కావచ్చు. అలా అనుకున్నప్పుడు మహాభారత కథకుడు కథనంలో చూపిన ఒడుపును హోమర్ (పెనెలోప్ కు నిజంగా పున్స్స్వయంవరం జరిపించడం ద్వారా) చూపించలేకపోయాడనాలి. మొత్తానికి రెండుకథల్లోనూ భార్యాభర్తలు చివరికి ఒకటయ్యారు. కథ సుఖాంతమైంది. కథాచట్రానికి సంబంధించినంతవరకూ ఇవీ రెండుకథల మధ్య ఉన్న స్థూలమైన పోలికలు.

సూక్ష్మమైన పోలికలు

రెండు కథల వివరాలలోకి వెడితే తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించే మాట నిజమే. కానీ సూక్ష్మంగా చూస్తే పోలికలూ కనిపిస్తాయి. ఉదాహరణకు, నలుడి కష్టాలకు అడవి వేదికైతే, ఓడిసస్ కష్టాలకు సముద్రం వేదికైంది. బహుశా ఉభయుల ప్రాదేశిక నేపథ్యంలో ఉన్న తేడా ఇందుకు కారణం కావచ్చు. విస్తారమైన అడవులు ఉన్న భారతదేశ నేపథ్యం నలుడిది. గ్రీకులకు ఉన్న నౌకాయాన నేపథ్యం ఓడిసస్ ది.

ఇక రెండు కథల్లోనూ నగ్నత్వం, వస్త్రాల ప్రస్తావన ఏదో ఒక రూపంలో రావడం ఒక పోలిక. నలుడు పక్షులను పట్టుకోడానికి తన కట్టుబట్టను తీసి వాటిపై విసురుతాడు. అవి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు నగ్నంగా అయిపోతాడు. దమయంతి చీరలో అర్థభాగాన్ని కట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకుంటాడు. కథ చివరిలో దమయంతిని తిరిగి కలసుకునే సందర్భంలో, తను దావానలం నుంచి కాపాడిన కర్కోటకుని తలచుకోవడం, పోయిన తన వస్త్రం తిరిగి అతని వద్దకు రావడం, దానిని కట్టుకోగానే నలునిగా మారిపోవడం జరుగుతాయి.

K11.11Hermes

హెర్మెస్

ఓడిసస్ కథకు వస్తే, అతడు సిర్సే అనే అప్సరస దగ్గరకు బయలు దేరినప్పుడు హెర్మెస్ అనే దేవుడు ఎదురై, ‘సిర్సేతో నువ్వు నిరభ్యంతరంగా పడకసుఖం అనుభవించు కానీ, ఆమె నిన్ను నగ్నంగా మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోకు’ అని హెచ్చరిస్తాడు. ఓడిసస్ కలిప్సో అనే మరో అప్సరస దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె బంగారు కండెతో వస్త్రం నేస్తూ ఉంటుంది. ఎనిమిదేళ్లపాటు తనతో కాపురం చేసి ఓడిసస్ తిరిగి యాత్ర ప్రారంభించబోయే ముందు కలిప్సో అతనికి స్నానం చేయించి చక్కని వస్త్రం కట్టబెడుతుంది. పోసిడిన్ తను ప్రయాణించే తెప్పను ధ్వంసం చేయించినప్పుడు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిన ఓడిసస్, ఫేషియన్ల దీవికి నగ్నంగానే చేరుకుంటాడు. అక్కడ బాలికల కేకలు విని చెట్టు కొమ్మతో నగ్నత్వాన్ని కప్పుకుంటూ గుబురులోంచి బయటకు వస్తాడు. అప్పుడా బాలికలు అతనికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకువెడతారు.

పేరు మార్పులోనూ నలునికీ, ఓడిసస్ కూ పోలిక ఉంది. కర్కోటకుడు నలుని రూపాన్ని వికృతంగా మార్చివేయడమే కాకుండా అతని పేరు బాహుకుడిగా మార్చివేస్తాడు. ఓడిసస్ ఒంటికన్ను రాక్షసుడైన పోలిఫెమెస్ ను కలసినప్పుడు తన పేరు ‘నోమన్’ అని చెబుతాడు.

కథ చివరిలో దమయంతిని కలవబోయే ముందు నలుడూ, పెనెలోప్ ను కలవబోయే ముందు ఓడిసస్ మారువేషంలోనే ఉండడం ఇంకొక పోలిక. కర్కోటకుడు నలుని వికృతరూపిగా మార్చివేస్తే, ఎథెనా అనే దేవత ఓడిసస్ ను బిచ్చగాడిగా మార్చివేస్తుంది. బాహుకుడే నలుడు కావచ్చుననే అనుమానంతో దమయంతి కొడుకును, కూతురినీ కేశిని అనే పరిచారికతో బాహుకుని దగ్గరకు పంపించినట్టే, ఎథెనా ఓడిసస్ దగ్గరికి అతని కొడుకు తెలెమాకస్ ను పంపిస్తుంది. నలదమయంతుల కథలో కేశిని అనే పరిచారిక నలుని గుర్తించే ప్రక్రియలో భాగస్వామి అవుతుంది. అలాగే ఒక వృద్ధదాది ఓడిసస్ ను గుర్తుపడుతుంది. ఇది వేరొక పోలిక.

సుసూక్ష్మమైన పోలికల గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

Download PDF

4 Comments

  • >నలుడు పక్షులను పట్టుకోడానికి తన కట్టుబట్టను తీసి వాటిపై విసురుతాడు. అవి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు నగ్నంగా అయిపోతాడు.

    కానీ, నాకు గుర్తున్నంతవరకూ, నలుడు విసిరింది తన ఉత్తరీయాన్ని. ఆ పైబట్టనే పక్షులెత్తుకొనిపోయాయి. దమయంతి తన చీరచెరగును చించి భర్తకు ఉత్తరీయంగా ఇచ్చింది. అందుచేత నలుడికి నగ్నత్వం రావటం అన్నది ఏమీ లేదు. పురుషుడు ఉత్తరీయం లేకుండా ఉండరాదన్న సదాచారం ప్రసక్తి మాత్రమే ఉంది. నేను మహాభారతంలో ఏముందో చూసి చెప్పలేదు ఈ విషయాన్ని. అందులో మీరన్నట్లుగా ఉందేమో తెలియదు.

  • కల్లూరి భాస్కరం says:

    ఆంధ్రమహాభారతంలో ఇలా ఉంది:

    “నలుండు విధికృతంబున నెవ్వరివలనను సత్కారంబు గానక జలంబు లాహారంబుగా తత్పుర సమీపంబున దమయంతీ ద్వితీయుండై యుండి బుభుక్షాపీడ సహింపనోపక హిరణ్యపక్షంబులతో దమ ముందట దిరుగుచున్న పక్షులం గని యవి భక్ష్యంబు లగు నని యప్పక్షులం బట్టికొన సమకట్టి తన కట్టిన పుట్టంబు వానిపై వైచిన నవి పుట్టంబుతోన గగనంబున కెగసి నగుచు విగతవస్తృండైన నలున కిట్లనియె.”

    నాదగ్గర అరణ్యపర్వం ఉన్న సంస్కృతభారతం లేకపోవడంతో ప్రతాప్ చంద్ర రాయ్ గారి ఇంగ్లీష్ అనువాదం చూశాను. అందులో కూడా నలుడు తన ఏకవస్త్రాన్ని పక్షులపై వేశాడనీ, దానిని పక్షులు ఎత్తుకుపోయాయనీ, నలుడు నగ్నంగా నిలబడ్డాడనీ ఉంది.

  • ఎప్పటిలాగే ఎంతో మంచి సమాచారం.
    తరువాయి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ!

Leave a Reply to తాడిగడప శ్యామలరావు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)