దేవుడే కీలుబొమ్మ?!

gopala

గోపాల…గోపాల ….. హిందీ సినిమా “ఓ మై గాడ్ “ కి రీమేక్ గా తెలుగు లో రూపొందిన చిత్రం, హిందీ సినిమాలో మామూలు సినిమా గా విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం అయితే తెలుగు కు వచ్చే సరికి ఒక మల్టీ స్టారర్ చిత్రం గా మారింది . మల్టీ స్టారర్ అందులోనూ పవన్ కళ్యాణ్, అందులోనూ దేవుడు గా నటించటంతో  ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్రేక్షకులు బారులు తీరారు . దాదాపు సంవత్సర కాలంగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ మాత్రం హడావుడి, ఉత్సాహం సహజం .

ఇక కథాంశం కి వస్తే , రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక వినూత్నమైన పాయింట్ ని బేస్ చేసుకున్న కథ. దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నించే కథ. సంస్కృతి , సాంప్రదాయాలు, భక్తి విపరీతంగా ఉన్న మన దేశంలో ఇలాంటి ఒక కథ ను సినిమాగా మలచాలి అనుకోవటం ఒక పెద్ద సాహసమే.  ఒక వైపు” పీకే” సినిమా పై వివాదం కొనసాగుతుండగా , ఇలాంటి సినిమా ఇక్కడ విడుదల కావటం ఒక విశేషం.  ఈ సినిమా మీద కూడా అప్పుడే వివాదాల నీడ పడింది . దేవుడున్నాడా ! లేదా !! అనే  వాదన తో ప్రారంభం అయి, దేవుడి అస్తిత్వం ద్వారా, అసలు దైవత్వం అంటే ఏంటో తెలియచేసే ప్రయత్నం ఈ సినిమా .

నిజానికి ఇప్పుడు భక్తి అనేది ఒక వ్యాపారం . ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భక్తి అనేది భయం గా మారి, దెయ్యానికి దేవుడికి ఇద్దరికీ భయపడే పరిస్థితి. ఇద్దరికీ భయపడితే దెయ్యానికి, దేవుడికి తేడా ఏముంటుంది ??. దేవుడిని గౌరవించాలి, అతను చూపించిన  మార్గాన్ని అనుసరిస్తూ జీవనం సాగించాలి , కానీ మనం చేస్తున్నదేమిటి ?? దేవుడిని ఒక వ్యాపార వస్తువు చేసి, మన లోని బలహీనతలను, మన తప్పులను మన్నించమని , మనం చేసిన తప్పులకు బదులుగా దేవుడికి కానుకలు సమర్పిస్తూ , ఆ కానుకల వల్ల మన ఖాతాలో  పాపాలు తగ్గాయి, పుణ్యాలు పెరిగాయి , కాబట్టి మనం పుణ్యాత్ములం అనే ఒక భ్రమ లో బ్రతుకుతున్నాం.

అందుకే దేవాలయాలకు,చర్చిలకు, మసీదులకు  అంత గిరాకీ పెరిగింది,  వీధికొక్క దేవుడు పుట్టకొస్తున్నాడు, ఇంతకు ముందు పురాణాలలోనో, బైబిల్ లోనో, ఖురాన్ లో ఉదహరించిన  దేవుళ్లే కాకుండా , ఆ దేవుళ్ళకు రిప్రజంటేటివ్ గా బాబాలు, ముల్లాలు, ఫకీర్లు , బిషప్ లు …పేరు ఏదైతేనేం ఆ దేవుడి పేరు మీద వ్యాపారం చేసే వాళ్ళతో నిండిపోయింది, దేవుడుని గదిలో బందీని చేసి ఆ దేవుడిని ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మ కి ఒక క్రేజ్ వచ్చేలా చేసి , ఆ బొమ్మను ఊరూరా తిప్పి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనే వ్యాపారం, నిజంగా దేవుడున్నాడో లేదో తెలియదు కానీ, ఆ దేవుడి పేరు మీద వ్యాపారం మాత్రం నూటికి నూరు శాతం నిజం . ఇలాంటి వ్యాపారం మీద వ్యంగ్యాస్త్రం ఈ సినిమా . దేవుడు గుళ్ళో లేడు, చర్చిలోనో, మసీదులోనో లేడు , మనిషిలో ఉన్నాడు , మనిషి చేసే మంచిపనే దైవత్వం అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా. కథాంశం పరంగా ఈ సినిమా ఒక మంచి సినిమా అనటంలో ఎలాంటి సందేహం లేదు .

దేవుడి బొమ్మలతో వ్యాపారం చేసే గోపాల రావు దుకాణం భూకంపం లో కూలిపోతుంది. దాని కోసం ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం ప్రయత్నం చేస్తాడు, కాకపోతే ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్ ‘మామూలు భాషలో చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ని తిరస్కరిస్తుంది . ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో గోపాలరావు ఆ దేవుడి వల్ల దుకాణం కూలిపోయింది కాబట్టి దేవుడే నష్ట పరిహారం చెల్లించాలి అనే వాదనతో కోర్ట్ ని ఆశ్రయిస్తాడు . ఇక్కడే అసలు దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్న ఎదురు అవుతుంది . ప్రత్యేకంగా దేవుడు అంటే ఎవరు అని చెప్పలేనప్పుడు దేవుడి ప్రతినిధులుగా చెప్పుకుంటూ ఆశ్రమాలు నిర్వహిస్తున్న, వాటికోసం దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించాలి అని వాదిస్తాడు, ఇది దేవుడినే ప్రశ్నించటం అని ఆశ్రమ నిర్వాహకులు వాదిస్తారు, కొంతమంది గోపాల రావు పై భౌతిక దాడులకు కూడా ప్రయత్నిస్తారు.

సరిగ్గా అప్పుడే దేవుడే స్వయంగా గోపాలరావును రక్షిస్తాడు. తనని రక్షించింది దేవుడు అని తెలియని గోపాల్రావు అతడిని తనలాగే మామూలు మనిషి అనుకుంటాడు . అప్పటినుండి దేవుడు గోపాలరావుకు తోడుగా ఉంటూ తన అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్న గోపాలరావు ద్వారా తన అస్తిత్వాన్నే తానే స్వయంగా ప్రశ్నించుకోవటం విచిత్రం .  తన అస్తిత్వం ఎక్కడో లేదు . ప్రతి మనిషి లో ఉంది. ఎదుటి మనిషిలోని మానవత్వాన్ని గుర్తించటమే దైవత్వం అని మనకు తెలియ చెప్పటమే స్టూలంగా కథాంశం . కానీ ఆ తెలియచెప్పే పద్దతే ఒక మెసేజ్ లానో, ఉపదేశం లానో కాకుండా ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు ఎక్కడా డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పటమే ఈ సినిమాలో ఆకట్టుకొనే అంశం . అసలు దేవుడు బొమ్మలు అమ్ముకొనే గోపాలరావుతో దేవుడినే బొమ్మను చేసి ఆడుకొనే వ్యవస్థను ప్రశ్నించటం అనే ఎత్తుగడలోనే కథకుడి గొప్పతనం కనిపిస్తుంది .

ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన ఉమేష్ శుక్లా ,భావేష్ మండాలియా నిజంగా అభినందనీయులు . ఈ సినిమాలో మరో గొప్ప విషయం అసలు  దేవుడిని వ్యాపారం చేసే ఏ వ్యవస్థకు  వ్యతిరేకంగా, గోపాలరావు తన పోరాటం చేశాడో ఆ గోపాల రావునే ఆ వ్యవస్థ దేవుడిని చెయ్యటానికి ప్రయత్నించటం ( నిజానికి సహజంగా ఇదే జరుగుతుంది),  కాకపోతే ఇది సినిమా కాబట్టి ఒక సినిమాటిక్ ఎండ్ తో ఆ ప్రయత్నాన్ని హీరో వమ్ము చేస్తాడు. దైవత్వాన్ని కాక, దేవుడిని నమ్మే సమాజం మీద సంధించిన వ్యంగాస్త్రం ఈ సినిమా ,

ఇక సాంకేతికాంశాల  విషయానికి వస్తే  ఇది కథా బలమున్న సినిమా గా కన్నా, మల్టీ స్టారర్ సినిమాగానే ప్రాచుర్యం పొందింది, ప్రేక్షకులు కూడా దీన్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు .  పవన్ కళ్యాణ్ తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మేన్స్ తో దేవుడిగా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు అనటం లో సందేహం లేదు  వెంకటేష్ తన పరిధి మేరకు బాగానే నటించాడు కానీ, పరేష్ రావల్ తో పోల్చి చూస్తే కొంచెం నిరాశ తప్పదు . పోల్చక పోతే ఏ బాధా లేదు . శ్రియ కు నటించటానికి పెద్ద ఆస్కారం లేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే హిందీ సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగులో సెట్ చేయటంలో సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి . చివరకు ఉత్తరాది వారు వాడే డ్రస్సులే తెలుగులో కూడా వాడారు అంటే ఆ సినిమాని తెలుగులోకి అనువదించటానికి  ఎంత ప్రయత్నించారో  తెలుసుకోవచ్చు . అనూప్ రూబెన్స్ సంగీతం , జయన్ విన్సెంట్ ఫోటోగ్రపీ సినిమా స్థాయి కి తగ్గట్లే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, వెంకటేష్ ఫ్యాన్స్ ని తృప్తి పరుస్తుంది అనటంలో సందేహం లేదు, రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోవటంతో ఈ సినిమా మిగతా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.

-మోహన్ రావిపాటి

mohan 

Download PDF

15 Comments

 • Usha says:

  “మనిషిలో ఉన్నాడు , మనిషి చేసే మంచిపనే దైవత్వం అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా. కథాంశం పరంగా ఈ సినిమా ఒక మంచి సినిమా” (Y ) గుడ్ review

 • sumanth says:

  Nuvu review cheppava cinema story cheppava

  lol

  • mohan.ravipati says:

   సినిమా కథ చెప్పకుండా రివ్యూ రాయగలిగే శక్తి నాకు లేదు సార్ ! :)

 • prasuna says:

  నైస్ రివ్యూ సర్…

 • buchireddy gangula says:

  excellent..రివ్యూ sir….
  review… అంటే ఇలాగా ఉండాలి అన్నట్లు రాశారు
  why…doubts..???
  ——————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 • knvmvarma says:

  పరిణితి నిండిన విశ్లెఅశణ బాగుంది మోహన్ గారూ

 • venkatrao says:

  అసలు దేవుడు బొమ్మలు అమ్ముకొనే గోపాలరావుతో దేవుడినే బొమ్మను చేసి ఆడుకొనే వ్యవస్థను ప్రశ్నించటం అనే ఎత్తుగడలోనే కథకుడి గొప్పతనం కనిపిస్తుంది .మంచి విషయం చెప్పారు

 • gbsastry says:

  మనిషి మనసుకుండే కొన్ని అవసరాలు తీరడానికి మనిషే సృష్టించుకున్న భావన పేరే దేముడు తన భావనని బలపరుచుకోండానికి దానితోపాటి సమాజం సక్రమంగా నడవడానికి కొన్ని రీతులు పెట్టుకొని వాటికి బలం చేకూర్చడానికి దేమునికి మతం జతగూర్చి ఒక బహుళార్ధ సార్ధక నిర్మాణం మొదలుపెట్టాడు మనిషి అది ఈనాడు మాట చాన్దసవాదం,మూఢ భక్తీ రూపు దాల్చి విశృఖలమై వికృతరుపాన్ని ధరించి మనిషి మనుగడకే చేటు తెచ్చే స్థితికి చేరింది
  ఆలోచనలు రేకెత్తించే ఇలాంటి సినిమాలైనా కాసింత జ్ఞానం మనకిస్తే బాగుంటుంది

  • mohan.ravipati says:

   మీరు చెప్పింది నిజమే శాస్త్రి గారు , అలాంటి జ్ఞానం ప్రజలందరికీ ఉంటే సమాజం ప్రశాంత్ంగా ఉంటుంది

 • Vimal says:

  mothaniki idi manchi cinemane oka dubbing cinema ani alochichaka mamooluga velli chooste manchi cinema choosamanna trupti kalugutundi. Ika cinema lo brahmanandam gari comedy miss ayyindi, manchi figts levu kani unnantho cinema chala clean ga undi. Mee review kooda bagundi. Hope best for Pawan and Venki…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)