తాడిగిరి పోతరాజు: అగ్నిసరస్సున వికసించిన వజ్రం

10922018_1044900048857391_1205721763_n

( తాడిగిరి పోతరాజు : 1937-2015 )

 తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన కారణంగా విజయకుమార్ , యం.వి. తిరుపతయ్యల సారథ్యంలో కరీంనగర్   సాహితీ మిత్రులు నిర్వహించిన ఉద్యమ మాసపత్రిక ‘విద్యుల్లత’ నిషేధానికి గురైంది. ఆ తర్వాత 1971 లో ‘మెజార్టీ ప్రజలకి మనదేశంలో జరుగుతున్న అన్యాయాలతో , సాహిత్యరంగంలో , రాజీలేని పోరాటం సాగించటం , నిజాయితీని నిర్మాణ మార్గంలో మళ్ళించడం’ లక్ష్యంగా యేర్పడ్డ న్యూవేవ్ సంస్థ ప్రచురించిన ‘హోరు’ సంకలనం ద్వారా ‘ఎర్రబుట్ట’ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని యెలక్షన్ల సాక్షిగా యెండగట్టిన ఆ కథ అప్పట్లో గొప్ప సంచలనం. నిషేధించడానికి పాలకులకి కావాల్సిన వనరులన్నీదిట్టంగా దట్టించిన కథ అది. దేశంలో జరిగే యెలక్షన్లకి ‘పిచ్చగుంట్ల’ విశేషణం తగిలించి , అవి వొట్టి బోగస్ అనీ ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే జాతర్ల లాంటివనీ – జాతర్లకు మేకలు , గొర్రె పోతులు బలయితే యెలక్షన్ల జాతర్లకి మనుషుల పుర్రెలు యెగిరి పోతుంటాయనీ అపహసించిన పోలీస్ కానిస్టేబుల్ సత్తెయ్య చెప్పిన కథ అది. ఆ తర్వాత చానాళ్ళకి నిద్ర లేచిన పతంజలి ‘ఖాకీ వనం’కీ , స్పార్టకస్ ‘ఖాకీ బతుకులు’ కీ నిప్పు అందించాడు. నిప్పు రవ్వగా వున్నప్పుడే నిషేధించాలని గద్దెలెక్కిన ప్రభువుల ఆరాటం. అది ఉక్రోషంగానో భయంగానో మారి ఎమర్జెన్సీ నాటికి రచయితని నిర్బంధించే వరకు వెళ్ళింది. విప్లవోద్యమలో ఎన్నికల బహిష్కరణ పిలుపుకి సైద్ధాంతికంగా వత్తాసు పల్కిన ఆ కథ ఇప్పటికీ బూటకపు ప్రజాస్వామ్యం అరికాళ్ళ కింద మంటలు పెట్టేదిగానే కనిపిస్తుంది.

‘రచయితలారా మీరెటువైపు?’ అన్న విశాఖ విద్యార్థుల ప్రశ్న సున్నిత మనస్కులైన కవుల్నీ రచయితల్నీ బుద్ధిజీవుల్నీ కుదురుగా కూర్చోనివ్వలేదు. అది కేవలం శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం మాత్రమే కాదు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం క్రూరమైన అణచివేతకి గురైన సందర్భం. పసి పిల్లల్ని కూడా వదలకుండా కాల్చి చంపి ప్రజా ఉద్యమాన్ని నెత్తుటి మడుగుల్లో ముంచిన సందర్భం. ప్రజల పక్షంలో అక్షరాన్ని సాయుధం చేసిన పాణిగ్రాహి శ్రీకాకుళ పోరాట వారసత్వం ఉత్తర తెలంగాణాకి వ్యాపించడానికి రాజకీయంగా రంగం సిద్ధమైన కాలం. ఉద్దానం మహాదేవపూర్ లో రెక్కలు విప్పుకొంటున్న రోజులు. శ్రీకాకుళం ‘కాక’ శ్రీశ్రీ , కొకు , రావిశాస్త్రి , కారా లాంటి ఆ ప్రాంతపు రచయితల్తో పాటు కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ తాలూకాలో మారుమూలన ‘కోతులనడుమ’ ( వల్లభాపూర్ శివారు గ్రామం) లాంటి పల్లెటూరి వ్యవసాయ కుటుంబం ( తల్లి సారమ్మ – తండ్రి రాయపరాజు) నుంచి వచ్చిన పోతరాజు ని సైతం తాకింది. 1970 నుంచీ విరసంతో కలసి నడుస్తూ – పీడితుల విషాదాశ్రువుల్ని కాదు ; విలాపాగ్నుల్ని అక్షరీకరించాలని అతను నిశ్చయించుకొన్నాడు.

‘1969 తరువాత దేశంలోని రాజకీయ సంక్షోభాల కారణంగా నాలో మానసికమైన మార్పు వచ్చింది. కన్నీటి సాహిత్యం చదువుతూ , కన్నీటి సాహిత్యం సృష్టిస్తూ అన్ని వర్గాల ప్రజలను కదిలించలేమని అభిప్రాయపడ్డాను. కన్నీటికి కారకులైన దోపిడదారులను శిక్షించాలని , ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా మార్చివెయ్యాలన్న సంకల్పంతో కరీంనగర్ జిల్లాలోని ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. తత్ఫలితంగా ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులుపడ్డాను.’( పాతికేళ్ళ క్రితం – 1981 నవంబర్ స్వాతి సచిత్ర మాసపత్రిక కథల పోటీ లో ‘ఆరోహక గీతం’ కథకి బహుమతి వచ్చినప్పుడు చెప్పిన మాటలు).

ఎర్రబుట్ట రాయడానికి పది పన్నెండేళ్లకి ముందునుంచే ఆయన రాసిన కథలు ( తొలి కథ ‘గృహోన్ముఖుడు’ కథ 1958లో భారతి లో వచ్చింది) యెన్నోప్రసిద్ధికెక్కాయి. గాజుకిటికీ (1963) , ‘చివరి అంచున’ (1964) కథలు ఆంధ్ర ప్రభ కథలపోటీల్లో అవార్డులు పొందాయి. ‘మట్టి బొమ్మలు’ నవల ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక (1966) పురస్కారాన్ని గెలుచుకొంది( సరిగ్గా కారా యజ్ఞం కథ రాసింది యీ రోజుల్లోనే ). ఎర్రబుట్ట కారణంగా విద్యుల్లత మీద విధించిన నిషేధమే ఆన్నిటికన్నా ‘నాకు పెద్ద అవార్డ’ని ఆయన పేర్కొన్నాడు. నిషేధ – నిర్బంధాలని అవార్డు రివార్డులుగా భావించిన నిబద్ధరచయిత తాడిగిరి పోతరాజు.

అందువల్ల తాడిగిరి రచనాప్రస్థానాన్ని ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాతగా విడదీసి చూడాలి. తాడిగిరి రచనా ప్రస్థానాన్నే కాదు; మొత్తం తెలంగాణా కథనే ‘ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాత’ అని అంచనా వేయాల్సి వుంటుంది. కవిత్వంలో ఝంఝా – మార్చ్- తిరగబడు ల్లాగా తెలుగు కథకి అందునా తెలంగాణా కథకి ఎర్రబుట్ట కూడా ఒక మైలురాయి. ఆ తర్వాతే కరీంనగర్ ఉద్యమ సాహితి నుంచి ‘బద్ లా’ కథా సంకలనం (1973) వెలువడింది. అందులోని ‘బ్లాక్ అండ్ వైట్’ కథ ఎర్రబుట్టకి కొనసాగింపులా కనపడుతుంది. ‘బద్ లా’ కోసం అల్లం రాజయ్య రాసిన ‘ఎదురు తిరిగితే…’ ఎమర్జెన్సీ తర్వాత సృజనలో అచ్చయింది. ఉత్తర తెలంగాణా రైతాంగ పోరాటాన్నీ , చరిత్రనీ , చైతన్యాన్నీ సాహిత్యంలోకి సాధికారంగా తీసుకొచ్చిన రాజయ్య లాంటి వాళ్ళు రాసిన కథలకి స్ఫూర్తి ఎర్రబుట్ట ద్వారానే లభించింది. ‘బద్ లా’ కథా సంకలనంలోని రచయితలంతా – ఒక్క పోతరాజు తప్ప – కొత్తవాళ్ళే.

పోతరాజు లాగానే ఎమర్జెన్సీ ‘చీకటి రోజుల్లో’ జైలుకెళ్ళిన  యం.వి. తిరుపతయ్య రాసిన ‘న్యాయం’ కథ కూడా ఈ సంకలనంలోనే వుండడం యాదృచ్ఛికమేమీ కాదు. ఎన్నో కలలతో ఈ నేల ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆశగా దృష్టి సారించింది అనడానికీ , ఆ కలల్ని రాజ్యం పాశవికంగా చిదిమివేయడానికి పూనుకొంది అనడానికీ వుదాహరణ మాత్రమే. ఆ తర్వాత రాజయ్య , సాహూ , రఘోత్తం , రాములు , పి చంద్ … వీళ్ళంతా విప్లవోద్యమ సాహిత్యంలో పోతరాజుకి కొనసాగింపే. సాహిత్య రచనని సామాజిక బాధ్యతగానే కాదు విప్లవాచరణలో భాగంగానూ స్వీకరించిన పోతరాజుకి సాహూ (శనిగరం వెంకటేశ్వర్లు / వెంకన్న) అన్నివిధాలా శిష్యుడే. ముందస్తు జాగ్రత్తల ( పి డి ఆక్ట్ కింద ) కోసమో – భవిష్యత్తుల భద్రత కోసమో (ఎమర్జెన్సీలో) ఇద్దరూ అరెస్టయి జైలుని తరగతి గదిగా మార్చుకొన్నారు.

రెండు రెళ్ళు నాలుగంటే జైళ్ళు నోరు తెరిచిన రోజులవి. దేశమే జైలయిన ఆ కాలంలో ప్రగతి శీలమైన ఆలోచనలుండటమే నేరం. అధ్యాపకులూ న్యాయవాదులూ డాక్టర్లూ పౌరహక్కుల గురించి మాట్లాడే బుద్ధి జీవులూ కవులూ రచయితలూ కార్మికులూ విద్యార్థులూ … ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నించిన ప్రతి వొక్కర్నీ రాజ్యం శత్రువుగానే పరిగణించింది. తల మీద ఎర్రబుట్ట పెట్టుకొన్న పోలిస్ కానిస్టేబుల్ పాత్రముఖత: తీవ్రవాదులుగా పరిగణించే పీడితుల భాషని పలికించిన పోతరాజు పొలిటికల్ డెటిన్యూ కావడంలో వింతేమీ లేదు. జైలు జీవితం పోతరాజుని రచయితగా మరింత నిబద్ధుడయ్యేలా చేసింది. ఆయన ఎంతగానో అభిమానించే శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రమ’య్యాడతను.

వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపిన స్వీయ అనుభవాలనూ , తోటి డెటిన్యూల ఖైదీల ఆవేదనలనూ, నిండా రెండు పదుల వయస్సులేని బిడ్డలు జైలు పాలైనప్పుడు వారిని చూడటానికి వచ్చే తల్లుల తండ్రుల మనోవ్యధనూ , భర్తలతో మిలాఖత్ కోసం నెలల తరబడి ఎదురుచూసే భార్యల దైన్యాన్నీ , డబ్బుతో పెరోల్ కొనుక్కొనే బూర్జువా రాజకీయ ఖైదీల డ్రామాలనూ, క్షమాభిక్ష అడిగితే కేసు మాఫీ చేస్తామన్నా తిరస్కరించిన యువకుల ధీరోదాత్తతనూ (ఆరోహక గీతం లో విద్యార్థి ఖైదీ అంభయ్య పాత్ర – సాహూనే కావొచ్చు) , మార్సిస్ట్ లెనినిస్టు రాజకీయ భావజాలాన్ని విశ్వసించిన వాళ్ళని జైలునుంచి మాయం చేసి అడవుల్లో ఎన్ కౌంటర్ పేర్న చంపేసే పోలీసు దురాగతాలనూ వొక రచయితగా , పౌర హక్కుల కార్యకర్తగా తర్వాతి కాలంలో ( 1980ల్లో) పోతరాజు కథలుగా మలిచారు. వట్టికోట ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథల్లా కాల్పనికతకి చోటులేకుండా యథార్థ జీవిత గాథల్లాంటి వాటిని ‘కెటిల్(ఎమర్జెన్సీ కథలు)’ పేరుతో హుజూరాబాద్ జనసాహితి సంపుటిగా వేసినప్పుడు (2009) సాహూకి అంకితం యివ్వడం గమనిస్తే విప్లవసాహిత్యోద్యమంతో పోతరాజుకి ఆజీవితం వున్న అనుబంధం , ఉద్యమ సహచరుడై తనతో నడిచిన విద్యార్థికి నివాళి ఘటించడంలో ఆయన వుదాత్త వ్యక్తిత్వం వ్యక్తమయ్యాయి. పాలకుల ఫాసిస్టు స్వభావాన్నీ , రాజ్య హింస వికృత రూపాన్నీ యెంతో బలంగా చెప్పిన యీ కథలు పోతరాజు ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తాయి.

విద్యార్థి దశలో శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతాల స్ఫూర్తితో మార్క్సిజం చదవకుండానే మార్క్సిస్టునయ్యానని చెప్పుకొనే తాడిగిరి పోతరాజు తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించారు. నాజర్ బుర్రకథలూ , సుంకర ‘మాభూమి’ , వల్లం సాంస్కృతిక ప్రదర్శనలూ విని చూసి తాను కూడా రంగస్థల నటుడు కావాలని ఆశించారు. నటుడికి కావాల్సిన అన్ని హంగులూ ఆయనకున్నాయి. చెయ్యెత్తు మనిషి. స్ఫురద్రూపం. దృఢకాయం. ఉరుము లాంటి కంఠస్వరం. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షన్ , తెలుగులో అనర్గళంగా వుపన్యసించగల వాగ్ధోరణి ( మధ్యలో శ్రీశ్రీ కవితా పంక్తుల్ని వుటంకిస్తూ) యివన్నీ ఆయన్ని మంచి నటుణ్ణి చేసేవి. ఏ కారణంగానో నటుడు కాలేక రచనా రంగానికి పరిమితమై పోయారు.

అయితే నాటక శైలి ఆయన కథలకి అదనపు మెరుగులు తెచ్చింది. దారికి అడ్డొచ్చిన వాణ్ని ఎవర్నయినా ‘నగ్జలైటని కాల్చి పారేస్తే మాత్రం మనని అడిగేవాడెవడు’ అని బహిరంగంగా ప్రకటించే ‘బ్లాక్ అండ్ వైట్’ కథలో పోలీస్ హెడ్ నరసింహం సుదీర్ఘ సంభాషణలు రావిశాస్త్రి తర్వాతి కాలంలో అనితర సాధ్యం అనిపించేలా సృష్టించిన గవర్రాజెడ్డు( రత్తాలూ-రాంబాబు) , సూర్రావెడ్డు (మూడుకథల బంగారం) లకి సైతం పాఠం చెప్పే స్థాయిలో వుంటాయి. పోలీసు రాజ్యం లోతు పాతుల్ని , ధాష్టీకాన్నీ దగ్గరగా చూసి స్వయంగా చవి చూసిన యిద్దరు రచయితల మధ్య యీ పోలికలు సహజమే. 2008లో రాచకొండ రచనా పురస్కారం తీసుకొంటూ రావిశాస్త్రి రచనా శైలి పట్ల తన అభిమానాన్ని పోతరాజు చాలా స్పష్టంగానే పేర్కొన్నారు.

1963లో వొక లంపెన్ పాత్ర సుదీర్ఘ స్వగతంగా గుంటూరుజిల్లా మాండలికంలో రాసిన ‘గాజు కిటికీ’ పోతరాజు రచనా శిల్పానికి నిలువెత్తు నిదర్శనం. మాగోఖలే తర్వాత గుంటూరు భాషని కథల్లో యింత అద్భుతంగా పట్టుకొన్నది పోతరాజేనేమో. ఆ భాషా సౌందర్యానికి ముచ్చటపడే పాపినేని శివశంకర్ తమజిల్లా రచయితగా ఆయన్ని own చేసుకొన్నాడు (దక్షిణ తీరాంధ్ర కథ – నిశాంత , పే.105). ఎర్రబుట్ట రాసేదాకా ఆయన్ని ‘గాజుకిటికీ పోతరాజ’ని పిల్చేవారంటే ఆ కథ వస్తు శిల్పాలు యెలాంటివో అర్థమౌతుంది.

నిజానికి తెలంగాణలో ‘కోతుల నడుమ’ లాంటి కుగ్రామం తన సొంతూరు అని చెప్పుకొన్నప్పటికీ పోతరాజు జీవితం కోస్తా ప్రాంతంతో యేదో వొక మేరకి ముడివడి వుంది ( బాల్యం తణుకు లో గడిచిందనీ , గుంటూరులో చదువులు నడిచాయనీ ఆయనే యెక్కడో పేర్కొన్నట్టు గుర్తు). అందుకే కథల్లో అవసరానుగుణంగా పాత్రోచితమైన కోస్తా భాషని గొప్ప మెలకువతో వుపయోగించడం చూస్తాం.

పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. కథల్లో యిటువంటి ముగింపుల్ని తాడిగిరి మార్కు ముగింపులని పేర్కోవడం కూడా వుంది. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమోతుంది. అయితే దృక్పథాన్ని ఆవిష్కరించే పనిలో ఆయన కళాత్మక విలువలతో యెక్కడా రాజీ పడలేదు. ఏ ముగింపూ స్లోగన్ లానో అవాస్తవికంగానో వుండడమో చూడం.

నికార్సైన రాజకీయ దృక్పథంతో ప్రజాస్వామ్య హక్కులకోసం పిడికిలి బిగించే గొంతులు బలపడాల్సిన యివాల్టి సందర్భంలో మత ఫాసిస్టు శక్తులు సామ్రాజ్య వాద గూండాలూ కొత్త పొత్తుల కోసం దారులు వేస్తున్న దశలో వొక పూనికతో పీడిత జన పక్షం వహించి నూతన మానవ ఆవిష్కరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసిన తాడిగిరి పోతరాజుని స్మరించుకోవడం అంటే ఆయన నమ్మిన రాజకీయ భావజాలానికి పునరంకితం కావడమే.

రెండు తరాల విప్లవ రచయితకి ఎర్రెర్రని పూల నివాళి.

  • -ఎ.కె.ప్రభాకర్

 

 

Download PDF

9 Comments

  • buchireddy gangula says:

    ప్రభాకర్ గారు

    మీ నివాళి భాగా చెప్పారు

    మంచి రచయిత — మంచి మిత్రుడు —-మిస్ హిం

    రాజు అన్న — లాల్ సలాం
    ——————————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  • గొప్ప సాహిత్యాన్ని చూసిన కాలం మీది. మాలాంటివారికి ఈ సాహిత్యాన్ని అందించే పుణ్యాన్ని కట్టుకోండి.

  • N Venugopal says:

    ఎ కె ప్రభాకర్ గారూ,

    అమరుడు తాడిగిరి పోతరాజు గారి పరిచయం బాగుంది. ఆయన సాహిత్యాన్నీ, జీవితాన్నీ, నేపథ్యాన్నీ చాల బాగా వివరించారు.

    రెండు చిన్న వివరణలు అవసరం ఉన్నాయి:

    1. పోతరాజు గారి పూర్వీకులది గుంటూరు జిల్లా తాడికొండ అని విన్నాను. ఆయన తల్లిదండ్రుల కాలంలో మరికొన్ని క్రైస్తవ కుటుంబాలతో పాటు కోతులనడుమ వచ్చారు. కోతులనడుమ మారుమూల కుగ్రామం కాదు. అది హనుమకొండ – కరీంనగర్ రహదారి మీది గ్రామమే. పోతరాజు గారి కాలంలో ఈ క్రైస్తవ కుటుంబాలన్నీ కోతులనడుమకు ఒకటి రెండు కి.మీ. దూరంలో శాంతి నగర్ రూపొందించాయి. (ఆ కోతులనడుమ మాదిగ కుటుంబం నుంచి ఎర్రోళ్ల వీరస్వామి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 1995-97ల్లో ఎంఎ పొలిటికల్ సైన్స్ చేసి, ఆ తర్వాత పి ఎచ్ డి లో కూడ చేరి, విప్లవోద్యమ నిర్మాణంలో అజ్ఞాతవాసానికి వెళ్లాడు. అప్పటికే నిషేధానికి గురైన రాడికల్ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడయ్యాడు. 1998లో వీరస్వామిని భుజంగరెడ్డి అనే మరొక విద్యార్థి కార్యకర్తతో కలిపి మంత్రాలయంలో పట్టుకుని పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేశారు.) అయితే పోతరాజు గారి భాషలో కొంత గుంటూరు మాండలిక మూలాలు కనిపించేవి గాని, ఆయన పూర్తిగా తెలంగాణతో మమేకమయ్యారు.

    2, కెటిల్ కథల్లో అంభయ్య అని పేరు ఉన్న పాత్ర సాహు కాదు, ఆ కథల్లో సాహు ప్రస్తావన వెంకన్న అని వస్తుంది. అంభయ్య పాత్రకు మూలం శంభయ్య అనే మొదటి తరం రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు. నల్లగొండ జిల్లాకు చెందిన శంభయ్య ఎమర్జెన్సీలో జైల్లో పోతరాజు గారికి సహచరుడు. ఎమర్జెన్సీ తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డాడని గుర్తు. నల్లగొండలో రాఘవరంగారావు గారి ఆఫీసులో కూడ ఉన్నాడని గుర్తు.

  • DrPBDVPrasad says:

    ప్రభాకర్ గారూ. పోతురాజుగారిది తాడికొండే రాయప్ప మాస్టారు శౌరమ్మల బిడ్డ.ఎంకే సుగమ్ బాబుకి ఆయన మిత్రుడైతే,దేవీప్రియ లాంటి కవులకు గాబ్రియల్ అన్న. ఆయన గొప్ప కథకుడు-ఉద్యమక్షేత్రం తెలంగాణం ఆయనను ఆకర్షించింది-సహజాతమైన గుంటూరు మాండలికం అలానే రచనల్లోనే పర్చుకొంది.
    ఎర్రబుట్ట ముందు రాసిన కథల్ని ఈ కథని చదువుకొంటే క మిట్మెంట్ ఉన్న రచయితల పరిణామ క్రమం ఉద్యమాల సాక్షిగా తెలుస్తుంది-
    తా పోరాని మళ్ళీ గుర్తు చేస్తూ మరుగున పడిన వజ్రానికి అగ్నిసాన పట్టినందులకు ధన్యవాదాలు
    డా।ప్రసాద్

  • ఎ.కె.ప్రభాకర్ says:

    పోతరాజు గారి గుంటూరి నేపథ్యాన్ని తెలియజేసినందుకు వేణూ ప్రసాద్ లకు థాంక్స్. ఆయన కుటుంబం తెలంగాణాకి ఎప్పుడు వలస పోయారో ఇదమిత్థంగా తెలియక పోవడంవల్ల నేను సందిగ్ధంగా రాశా.

    ఆరోహక గీతం లోని అంభయ్యని సాహూగా పొరపడ్డాను.దిద్దుకొంటాను.

    పోతరాజు గారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం వున్నసుగమ్ బాబు,దేవీప్రియ లాంటివాళ్ళు ఆయన జీవిత విశేషాలను మరింత లోతుగా తెలియజేస్తారని ఎదురు చూద్దాం.
    ప్రభాకర్.

  • రాఘవ says:

    ఇప్పుడు ఆయన కధలు ఎక్కడ దొరుకుతాయి..?

    • ఎ.కె.ప్రభాకర్ says:

      గాజు కిటికీ కథల సంపుటి , మట్టి బొమ్మలు నవల 60 ల్లోనే విశాలాంధ్ర వాళ్ళు వేశారు. కెటిల్ – ఎమర్జెన్సీ కథలు 2009లోవచ్చాయి ( మార్కెట్ లో లభిస్తాయి) . ఆయన రాసినవి దాదాపు 25 కథలున్నాయి( కొన్ని ఇంకా సంకలనం కాలేదు).పావురాలు అనేది మరో నవలిక. వారి కుటుంబ సభ్యులు గానీ ఇంకెవరైనా గానీ ఆర్థికంగా ముందుకు వస్తే పోతరాజు సమగ్ర రచనల్ని అందుబాటులోకి తేవొచ్చు. రచనల్ని నేను సేకరించి సమకూరుస్తాను.

  • కెక్యూబ్ వర్మ says:

    గాజు కిటికీ, ఎర్రబుట్ట కథలతో సుప్రసిద్ధులైన పోతరాజు గారి కథల గొప్పతనం వారి శైలి, నిబద్ధత వీటి గురించి వారి మరణం తరువాత మాత్రమే తెలిసింది. కథల వర్క్ షాపులు నిర్వహించే సమయంలో కూడా ఎవ్వరూ ప్రస్తావించిన దాఖలా చూడలేదు. ఈ కథలు గురించి నావరకూ తెలీదు. ఇక్కడ ఇలా ప్రస్తావించడం బాగోదు కానీ మరణం తరువాతే ఇలా గుర్తు చేసుకోవడమే వారికి మనమిచ్చిన గౌరవమా? కొంతమంది ప్రస్థానం ఇలా నిశ్శబ్దంగా ముగియడం విషాదమే కదా? సారీ.

    ప్రభాకర్ గారు అభినందనీయులు. పోతురాజు గారికి వినమ్రంగా జోహార్లు.

    • ఎ.కె.ప్రభాకర్ says:

      వర్మ గారూ ,
      మీరన్నది నిజం. మరణించాకే గుర్తు చేసుకోవడం విషాదంలో విషాదం. పోతరాజు గారిని ఇంటర్వ్యూ చేద్దామని రెండేళ్ళ క్రితం దివికుమార్ గారు నాతో ప్రస్తావించారు. ఈ తరానికి ఆయన్ని తెలియ జేయడమే దాని ఉద్దేశ్యం. కానీ ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతల ఒత్తిడిలో తీరలేదు. ఆ తర్వాత ఆయనకి అనారోగ్యం. నాకూ అనారోగ్యం. వెరసి ఇవ్వాళ ఒక అపరాధ భావన. ఈ నివాళి వ్యాసం కూడా అఫ్సర్ బలవంతం మీద హడావిడిగా రాశాను. పోతరాజు గారి సాహిత్యాన్ని సమగ్రంగా విశ్లేషించాల్సిన బాధ్యత ఇంకా మిగిలే వుంది.
      ప్రభాకర్.

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)