నిత్యవిచారిణి!

saaranga 1

1

“సంతూ! నువ్వు అదృష్టవంతురాలివే! పెళ్ళాన్ని క్రిటిసైజ్ చెయ్యడంలో ముందుండే మొగుళ్ళే తప్ప ప్రైజూ, సర్‌ప్రైజూ చేసే మొగుళ్ళు ఎక్కడో కానీ ఉండరే! సర్‌ప్రైజ్‌గా పట్టమహిషికి పట్టుచీర కొనిచ్చే మొగుడు దొరికినందుకు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోవాలి కానీ ఇంకా ఈ వంకలు పెట్టడం దేనికే?”

“చాల్లేవే వల్లీ! నువ్వు మరీ చెప్తావ్! ఇంత పెద్ద బోర్డర్ ఉన్న చీరలు నాకు నచ్చవని నీకు తెలీదూ? పెళ్ళాన్ని ప్రేమించే మొగుడు పెళ్ళాం ప్రేమించేవి తెలుసుకోలేడూ? మల్లెపూలు తెచ్చిచ్చేస్తే మంచి మొగుడు అయిపోడే వల్లీ, మనసుని పరిమళింపజెయ్యాలి!”

నేను సంతూని సముదాయించడానికి ఏదో చెప్పబోతూ ఉంటే ఓ పెద్ద మెరుపు మెరిసినట్ట్లైంది! చూస్తే సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రత్యక్షమై కనిపించాడు! ఇది కలా నిజమా! విష్ణుమూర్తి వైకుంఠం నుంచి సరాసరి మా వాకిట్లోకి దిగొచ్చెయ్యడం ఏమిటి? ఇంతకీ ప్రత్యక్షమైంది నాకా లేక సంతూకా? అదయితే అసలు భక్తురాలే కాదు. నేను కనీసం “లక్ష్మీకటాక్షం” కోసం చాలాసార్లు ప్రార్థించాను. ఆవిడ మొగుణ్ణి పంపించి ఉండొచ్చు అనుకుని విష్ణుమూర్తి కాళ్ళపై పడబోయాను. అంత విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి –

“కాళ్ళపై పడితేనే భక్తి కాదు తల్లీ! కష్టపడకు! అయినా నేను వచ్చింది నీ ప్రాణస్నేహితురాలు నిత్యసంతోషిణి కోసం!”

ఇప్పుడే దాన్ని అదృష్టవంతురాలివి అని పొగిడాను, అప్పుడే ఇంత మహాదృష్టమా? అయినా సంతూ అంత పుణ్యం ఏమి చేసుకుందో  అని ఆశ్చర్యంగా చూడసాగాను. విష్ణుమూర్తి సంతూ కేసి చూసి –

“అమ్మా నిత్యసంతోషిణీ! ప్రతివారూ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. రోజూ తెలుగు టీవీ సీరియల్సు చూసే వాడి జీవితంలో ఆనందం కరువౌతుంది. అలాగే తెలుగు సినిమాలు ఎక్కువ చూసేవాడికి తెలివితేటలు నశించడం అనివార్యం! ఇలా ప్రతి పనికీ దానికి తగ్గ ఫలితం ఉంటుంది”

ఇలాంటి బోధలు వినడానికి భగవానుడు ప్రత్యక్షమవ్వడం ఎందుకు, భక్తి చానల్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు సంతూ అసహనంగా చూస్తోంది! సర్వజ్ఞునికి తెలియనిది ఏముంటుంది, సంతూ మనసులోని భావం గ్రహించి ఇలా కొనసాగించాడు –

“ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన మంచి కర్మలకు గాను ఎన్నో శుభప్రదమైన ఫలితాలను ఇచ్చినా వాటిని శోకంగా మార్చే అపార నైపుణ్యం నీకే అబ్బింది తల్లీ! పాయసం పంచుతున్నా అది నీ చేతుల్లో విషంగా మారిపోతూ ఉంటే తలరాత రాసిన బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక తికమకలో పడ్డాడు. జాతకాలు, కర్మసిద్ధాంతాలూ నీ పుణ్యమా అని ఎన్నడూ లేని తిరకాసులో పడ్డాయి. ఇలా నిన్ను సృష్టించిన తప్పుకి ప్రాయశ్చితంగా బ్రహ్మ తక్షణం మోక్షం ఇచ్చి నిన్ను సృష్టి నుంచి తప్పించమని నన్ను కోరాడు!”

అదన్న మాట సంగతి! “సంతూ, చాన్స్ కొట్టావే!” అనుకున్నాను నేను కుళ్ళుకుంటూ. కానీ, అది ఏ ఫీలింగూ లేని మొహంతో ఇలా బదులిచ్చింది –

“నాకు బెల్లం పాయసం ఇష్టం, పంచదార పాయసం నచ్చదు! రెండూ తీపే కదా అని నాకు నచ్చని పంచదార పాయసమే నాకిస్తూ ఉంటే కాదనడం తప్పా? ఈ లాజిక్కు నా తోటి మనుషులకి అర్థం కాకపోవడాన్ని సరిపెట్టుకోగలను కానీ దేవుడివైన నీకే అర్థం కాకపోతే ఇంకేం చెయ్యాలి స్వామీ? నేను కోరుకోనివి ఎన్నిస్తే నాకెందుకు?”

అమ్మో! బానే అర్గ్యూ చేస్తోందే! విష్ణుమూర్తి ఏమంటాడా అని చూశాను.

“అదేమిటి తల్లీ! మొన్నే కదా నువ్వు కోరుకున్నట్టు బంగారం ప్రసాదించాను, నువ్వు కాసులపేరు కూడా చేయించుకున్నావు కదా!”

“ఆ! ఇచ్చావులే పెద్ద! నేను కొన్న వెంటనే బంగారం ధర పడిపోయింది. కొన్ని రోజులు ఆగుంటే వడ్డాణమే చేయించుకునేదానిని. టైమింగు కుదరనప్పుడు వరాలిచ్చీ ఏం లాభం!”

చిద్విలాసుడు చిరునవ్వి నవ్వి ఇలా అన్నాడు –

“ఇంతకీ మోక్షం కావాలో వద్దో త్వరగా తేల్చు తల్లీ! నేను వెళ్ళాలి. పాలసముద్రం పైన పవళించి, మురిపాల శ్రీలక్ష్మి నా కాళ్ళు ఒత్తుతూ ఉంటే, అన్నమయ్య కీర్తనలు వింటూ సేద దీరాల్సిన వాడిని!

Kadha-Saranga-2-300x268

“నాకు అర్థం కాని మోక్షాన్ని నేనేమి చేసుకునేది స్వామీ! వెళ్ళి మీ అర్థాంగినే ఏలుకోండి!” అంది సంతూ చిరు కోపంతో.

“సరే, నీ చిత్తమే నీ భాగ్యము. ఒక మాట చెప్తాను, అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకో తల్లీ, ఎప్పటికైనా పనికొస్తుంది – తనెంత అదృష్టవంతుడో తెలుసుకోలేనివాడే లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడు.”

ఇలా చెప్పి అంతర్ధానమయ్యాడు స్వామి. సంతూ అజ్ఞానానికి నేను అవాక్కయ్యాను. అది మాత్రం విచారంగా మొహం పెట్టి నాతో అంది –

“చూశావే వల్లీ! నేనెంత దురదృష్టవంతురాలినో! సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే దిగొచ్చినా నేను కోరినది ఇవ్వలేకపోయాడు!”

2

ఆ మాటలకి నా కళ్ళు తెరుచుకున్నాయి! ఓహో, ఇది కలన్న మాట! కానీ ఇది నిజంగా జరిగినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే మా సంతూకి నిరాశ నిండిన లాజిక్కులతో దేవుళ్ళనైనా బెంబేలెత్తించే టాలెంట్ ఉంది. మీకు పాత రోజుల్లో ఈటీవీలో “ఓ కళంకిత, కళలకే అంకిత, కన్నీటికి అద్దం నీ చరిత!” అనే టైటిల్ సాంగుతో వచ్చిన “కళంకిత” సీరియల్ గుర్తుంటే అందులో ఏడుపు కోసమే పుట్టినట్టు ఉండే హీరోయిన్ ఉంది చూశారూ, తను మా సంతూకి సరిగ్గా సరిపోతుంది. తను కళంకిత అయితే సంతూ శోకాంకిత, శోకానికే అంకిత!

సంతూ అసలు పేరు నిత్యసంతోషిణి. ఏవిటో కొందరికి పెట్టిన పేర్లు అచ్చిరావు. పేరు “నిత్యసంతోషిణి” అయినా అది ఎప్పుడూ సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. అది పుడుతూనే బిగ్గరగా ఏడుపులంకించుకుంటే “బాలానాం రోదనం బలం” అని ముందు పెద్దవాళ్ళు ముచ్చటపడ్డారు. అయితే ఎంతకీ ఏడుపు ఆపకపోతే కంగారుపడ్డారు. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉన్నా, ఏడుపు ఏ మాత్రం తరగకపోయేసరికి చిరాకు పడ్డారు. అలా అది ఏడుస్తూ, అందరినీ ఏడిపిస్తూ పెరిగింది. చిత్రంగా సంతూ నాలుగేళ్ళ వయసొచ్చేసరికి సడన్‌గా ఏడవడం మానేసింది. అందరూ “హమ్మయ్యా!” అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కన్నీళ్ళు ఆపుకుంది కానీ ఏడుపు ఆపలేదు! పైకి ఎలా ఉన్నా, మౌనంగా తనలో తాను నిత్యం ఏడుస్తూనే ఉంటుందని నాకు తెలుసు. అందుకే దానికి నేను “నిత్యవిచారిణి” అని పేరు పెట్టుకున్నాను!

ఇంతకీ నేనెవరిని అని మీకు సందేహం వచ్చి ఉండాలి. నా పేరు శ్రీవల్లి. సంతూకి ప్రాణస్నేహితురాలిని. దాని కన్నీళ్ళకి కర్చీఫ్‌ని! దానికి, కాదు కాదు, దాని ఏడుపుకి శిష్యురాలిని! ఎలా అంటారా? కొందరిని చూసి – “ఇలా ఉండాలి” అని ఇన్స్పైర్ అవుతాం, కొందరిని చూసి “చచ్చినా ఇలా ఉండకూడదు” అని డిసైడ్ అవుతాం! ఈ రెండు రకాల వాళ్ళూ మనకి గురువులే. సంతూ (సంతూ ఏడుపు) నాకు రెండో రకంగా జీవితం గురించి ఎంతో నేర్పిన గురువు. అసలు మా మొదటి పరిచయమే ఓ పాఠం…

ఆ రోజు నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము సంతూ వాళ్ళ ఊరుకి కొత్తగా వచ్చాము. అదో చిన్న టౌను. సంతూ వాళ్ళు మా అద్దెంటి ఎదురుగానే ఉండేవారు. వాళ్ళది కలవారి కుటుంబం. పెద్ద ఇల్లూ, వెనుక విశాలమైన పెరడూ, అందులో రకరకాల పూలమొక్కలూ అవీ ఉండేవి. అమ్మ ఒక రోజు “పూలుకోసుకు రా” అంటే వాళ్ళింటికి వెళ్ళాను. హాల్లో సంతూ కనిపించింది. అదే మా మొదటి పరిచయం.

“హాయ్! నా పేరు శ్రీవల్లి! అమ్మ పూలు కోసుకు రమ్మంది…”

సంతూ మాట్లాడకుండా నన్ను పెరట్లోకి తీసుకెళ్ళింది.

“అబ్బా! ఎన్ని రంగు రంగుల పువ్వులున్నాయో! ఈ ఎర్రగులాబీలు ఎంత ముద్దొస్తున్నాయో!” – నేను నా ఉత్సాహాన్ని బయటపెడుతూ అన్నాను.

సంతూ ఏ మాత్రం తొణక్కుండా – “తెల్ల గులాబీలు లేవుగా!” అంది.

“నీకు తెలుపు ఇష్టమా?”

“కాదు. తెల్ల పూలు లేవు కాబట్టి తెలుపు కావాలనిపిస్తుంది!”

“అదేంటి?”

“ఉన్న వాటితోనే సంతృప్తి పడిపోతే కొత్తవి, ఇంకా గొప్పవి జీవితంలో ఎలా దొరుకుతాయి?”

“అవునా! ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?”

“తెలివుంటే, పుస్తకాలు చదివితే తెలుస్తాయి!”

“ఓహో! చాలా పుస్తకాలు చదివితే బాగా బాధపడొచ్చు అన్న మాట!”

ఈ సమాధానానికి సంతూ నాకేసి తీక్షణంగా చూసి- “నువ్వు ఏ క్లాసు చదువుతున్నావు?” అని అడిగింది.

“8th క్లాస్. ఇంకా జాయిన్ అవ్వలేదు, నాన్న మంచి స్కూల్ చూస్తున్నాడు!”

“నేనూ 8th క్లాసే! మా స్కూల్ బాగుంటుంది. అక్కడే జాయిన్ అవ్వు. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. నాతో తిరిగితే నీకు కొంచెం తెలివితేటలైనా వస్తాయి!”

సరే అనక తప్పింది కాదు, అసలే నాకు మొహమాటం ఎక్కువ! ఆ రోజు నేను నేర్చుకున్న మొదటి పాఠం: జీవితం గులాబి పువ్వు లాంటిది. రంగూ రూపూ నచ్చలేదని ముక్కుమూసుకుని కూర్చోకుండా, ముళ్ళున్నాయని వంకలు పెట్టకుండా, పరిమళాన్ని ఆస్వాదించాలి!

3

అలా మొదలైన మా స్నేహం మూడు ఏడుపులూ, ఆరు ఓదార్పులుగా సాగిపోతోంది. సంతూ కన్నీళ్ళతో నేను నా జీవిత కావ్యాన్ని రాసుకుంటున్నాను. మేము తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు గుర్తుండిపోయిన ఇంకో సంఘటన జరిగింది.

స్కూల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కల పరీక్ష. ఎప్పటికైనా సంతూనైనా అర్థం చేసుకోగలుగుతానేమో కానీ లెక్కల అంతు తేల్చడం నా వల్ల కాదు. అందుకే నేను భయం భయంగా హాల్లోకి అడుగు పెట్టాను. సంతూ కాం గా వచ్చింది. దానికేం, ఇంటెలిజెంటు! లక్కీగా పేపరు చాలా ఈజీగా వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్నప్పుడు మా సంభాషణ –

“పేపరు చాలా ఈజీగా ఉంది కదే! నీకు వందకి వంద ఖాయం అనుకుంటా” – నేను

“నేను పరీక్ష రాయడం సగంలో ఆపేశాను” – సంతూ

“ఏం?” అన్నాను ఆశ్చర్యంగా!

“పెన్ రాయలేదు. బ్రహ్మ నా తలరాతలో వంద మార్కులు రాయలేదు!”

“అయ్యో! చెయ్యెత్తి అడిగితే ఎవరైనా ఇంకో పెన్ ఇచ్చేవారు కదా! అయినా స్పేర్ పెన్ తీసుకురాకుండా ఎగ్జాం కి ఎలా వచ్చావ్?”

“నిన్నే కొత్త పెన్ కొన్నాను. ఇప్పుడే ఫ్రెష్‌గా తెల్లారాక వెంటనే చీకటి పడుతుందని ఎవరు ఊహిస్తారు? అయినా విధి నాతో ఆడుకుంటున్నప్పుడు పావుగా మారి తలొగ్గాలి గానీ పాములా బుసకొడతానంటే గేం రూల్స్ ఒప్పుకోవు!”

నాకు అదన్నదేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు! “ఉన్నదానితో సరిపెట్టుకోకూడదు” అని గతంలో లెక్చర్ పీకిన అది, ఇప్పుడు ఆగపోయిన రీఫిల్తో ఎలా సరిపెట్టుకుందో దానికే తెలియాలి! కాని నాకు మాత్రం తెలిసొచ్చిన పాఠం ఇది – జీవితమనే పెన్లో రీఫిల్ అయిపోతే, రాయడం ఆపెయ్యకూడదు, పెన్ పడెయ్యకూడదు. కొత్తగా రీఫిల్ చేసుకుని ముందుకి సాగాలి!

4

సీతాకోకచిలకలని చూసి ముచ్చటపడి ఆడుకునే వయసు నుంచి సీతాకోకచిలకలుగా మారి అబ్బాయిల గుండెల్లో రెపరెపలాడే వయసులోకి వచ్చాము మేమిద్దరం! నాకంటే సంతూ అందంగా, తీర్చిదిద్దిన చందనశిల్పంలా ఉండేది. సీరియస్‌గా ఉండి ఎప్పుడూ నవ్వదు కానీ నవ్వితే వెన్నెల వర్షమే! ఆ టౌనులోని చిన్న కాలేజీలోనే సాగిన మా ఇంటర్మీడియట్ చదువులో, సంతూ ఎప్పుడైనా కాలేజీకి ఓణీ కట్టుకెళితే కుర్రగుండెల్లో కాంభోజీయే! కాబట్టి సహజంగానే దానికి చాలామంది ఆరాధకులు ఉండేవాళ్ళు. అయితే అది మాత్రం అబ్బాయిలని దూరంగా పెట్టేది, కానీ వాళ్ళ గుండెలని గిలిగింతలు పెట్టేది.

బయటపడదు కానీ సంతూ కూడా మా క్లాసులోని ఒక అబ్బాయంటే ఇష్టపడుతోందని నేను గ్రహించకపోలేదు. అది ఆ అబ్బాయి కేసి చూసే దొంగచూపులు నన్ను దాటిపోలేదు. నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ప్రేమలో పడుతోంది అంటే అది నార్మల్ గానే ఉందని నాకు నమ్మకం కలిగింది! కానీ వెంటనే ఆ అబ్బాయిపై జాలి కలిగింది!   మొత్తానికి ఈ కథ ఏమౌతుందో అన్న కుతూహలం పెరిగింది. చదువులో ముందుండే అబ్బాయిలు ప్రేమ విషయాల్లో ఎప్పుడూ వెనకబడే ఉంటారు నేనకునేలోపే కథ వేగం పుంజుకుంది. ఓ రోజు మేమిద్దరం నడిచి ఇంటికి వెళుతుంటే ఆ అబ్బాయి మాకేసి వచ్చాడు –

“హాయ్ సంతూ! నీతో కొంచెం మాట్లాడాలి”

అమ్మో ఫర్వాలేదే! నేను కొంచెం పక్కకి వెళ్ళబోయాను, కానీ సంతూ నన్ను చెయ్యిపట్టుకు ఆపి, ఆ అబ్బాయితో ఇలా అంది –

“ఏమిటో చెప్పు! వల్లీ ఉందని వర్రీ వద్దు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ విషయం దాచుకోము.”

“నేను కూడా దాచుకోలేకే ఓ విషయం చెబుదామని వచ్చాను!” మృదువుగా చెప్పాడు.

“ఏమిటది”? – కటువుగా అడిగింది సంతూ.

“నువ్వూ తెలివైన దానివి, నేనూ తెలివైన వాడిని. మన తెలివి చెలిమిగా మారితే మన స్నేహం నీ అంత అందంగా ఉంటుంది కదా. ఏమంటావ్? కన్ వీ బీ ఫ్రెండ్స్?” అంటూ చెయ్యి చాచాడు.

“ప్రేమకు స్నేహం తొలిమెట్టు” అని పెద్దలు అన్నారు కాబట్టి ఇదేదో బానే ఉందని నేను సంబరపడుతూ ఉండగా, సంతూ నా కలల్లో కారం పోస్తూ –

“సారీ, నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యను”, అని బదులిచ్చి నన్ను చెయ్యిపట్టుకు లాకెళ్ళిపోతూ, మళ్ళీ ఓసారి ఆగి డ్రమాటిక్‌గా తల వెనక్కి తిప్పి ,

“అదీ తమకు తాము చాలా తెలివైన వాళ్ళం అనుకునే అబ్బాయిలతో అస్సలు చెయ్యను” అంటూ ముక్తాయింపిచ్చింది.

ఆ అబ్బాయి నిర్ఘాంతపోయాడు, నేను ఆశ్చర్యపోయాను. మేము  కొంచెం దూరంగా వెళ్ళాక నెమ్మదిగా అడిగాను –

“నిజం చెప్పవే సంతూ! నీకూ ఆ అబ్బాయంటే ఇష్టం కదూ? హాయిగా జట్టు కట్టకుండా ఈ బెట్టెందుకే?”

సంతూ పెద్దగా నిట్టూర్చి – “వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానే! నేను క్లాసులో ఆరాధనగా చూసే చూపులు వలపు తెమ్మెరలై వాణ్ణి తాకితే వాడు వెనక్కి తిరిగి నాకేసి చూసి మౌనమందహాసం చెయ్యాలని, అది చూసి నేను సిగ్గుతో తలదించుకోవాలనీ! నా జడలోంచి రాలిన మందార పువ్వుని వాడు పదిలంగా ఏరుకుని ప్రేమ పరిమళాలని ఆస్వాదించాలనీ. సెలయేటి ప్రవాహంలా, కోయిల గానంలా, వెన్నెల మాసంలా మా ప్రేమ సుతారంగా మొగ్గతొడగాలనీ! ఇలా ఎన్నో! కానీ నా దురదృష్టాన్ని మళ్ళీ నిరూపిస్తూ వాడు నా కలలసౌధాన్ని కుప్పకూల్చాడే! ఈ అబ్బాయిలకి తాపత్రయమే కానీ కళాత్మకత ఎందుకు ఉండదో! ప్చ్!”

దానికి ఫిలాసఫిలో పేటెంట్లే కాక పోయెట్రీలో ప్రవేశం కూడా ఉందని అప్పుడే తెలిసింది. మొత్తానికి రొమాన్సు మొదలవ్వకుండానే దాని ప్రేమకథ క్లైమాక్సుకి చేరింది. నాకు మాత్రం ఓ పాఠం మిగిలింది – ప్రతి ఉదయం జీవితం నీకు రాసే ప్రేమలేఖ! ప్రతి నిమిషం లవ్ ప్రపోజల్. పట్టించుకుంటే బ్రతుకు ప్రణయగీతం. నిట్టూర్చిపోతే నిత్యభారం!”

5

ఇంటర్మీడియట్ తర్వాత సంతూ ఇంజనీరింగ్ చదువుకై సిటీకి వెళ్ళిపోయింది, నేను మాత్రం అదే ఊరులో డిగ్రీ చదువుతో సరిపెట్టుకున్నాను. చదువైన వెంటనే పెళ్ళి కుదరడంతో నేను హైదరబాద్‌లో కాపురం పెట్టాను. సంతూ బెంగళూర్‌లో ఉద్యోగం మొదలెట్టింది. ఇంటర్మీడియట్ తర్వాత మేము కలిసి మాట్లాడుకున్నది తక్కువే అయినా ఫోన్ సంభాషణల ద్వారా మా స్నేహబంధం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సంతూ ఇంజనీరింగ్‌లో, ఉద్యోగంలో ఎదురుకొన్న సవాలక్ష సమస్యలని ఏకరువు పెడుతూనే ఉంది. అన్నిటికంటే పెద్ద సమస్య ఒకటి తయారైంది – దాని పెళ్ళి!

సంతూ అందాన్ని, వాళ్ళ కుటుంబ స్థితిగతులనీ చూసి చాలా మంచి సంబంధాలే వస్తున్నాయి. కాని దానికి ఏదీ ఓ పట్టాన నచ్చి చావట్లేదు. అది పెడుతున్న వంకలకి నెలవంక కూడా నివ్వెరపోతుంది. అబ్బాయి రూపం బాగుంటే హైటు బావులేదంటుంది. హైటూ లుక్కూ బావుంటే బట్టతల వచ్చేటట్టున్నాడంటుంది! బాగా మాట్లాడే వాడు దొరికితే చదువు బాలేదంటుంది, మంచి చదువున్నవాడు వస్తే సంస్కారం లేదంటుంది. అన్నీ బావుంటే కాబోయే అత్తగారి వాలకం అనుమానాస్పదంగా ఉందంటుంది! ఇలా అది తలతిక్కతో కూర్చుంటే ఇంట్లో వాళ్ళు తలపట్టుకుని కూర్చున్నారు. ఈ తతంగం కొన్నేళ్ళు సాగాక దానికి పూర్తిగా నచ్చకపోయినా ఓ అమెరికా సంబంధాన్ని కుదిర్చేశారు.

పెళ్ళి కుదిరాక ఓ సారి అది హైదరాబాద్ వచ్చినప్పుడు మేము కలుసుకున్నాం. అప్పటికే అబ్బాయి ఫొటో నాకు చూపించింది, చక్కగా ఉంటాడతను. కలిసినప్పుడు దానిని నేను టీజ్ చేస్తూ –

“ఏమంటున్నాడే నీ వరుడు, మనోహరుడు? సరసుడేనా?”

“సర్లేవే! పెళ్ళి కాకముందు ప్రేమ కురిపించడంలో పెద్ద గొప్పేముంది? ప్రేయసి పెళ్ళామైపోయాక సరసం నీరసమైపోతుంది!”

“చాల్లేవే! పెళ్ళయ్యాక అమెరికా ఎగిరిపోతావ్, పెద్దల గోల లేదు! ఇక కొన్నేళ్ళు ప్రతిరాత్రీ, వసంతరాత్రీ, బ్రతుకంతా హనీమూనే!”

“నీకేంటే ఎన్నైనా చెప్తావ్! పక్కనే అమ్మానాన్నా, పండుగలూ పబ్బాలూ, పట్టుచీరలూ సందళ్ళూ, ఇంట్లో పనిమనుషులూ! నేను నావాళ్ళకి దూరంగా ఒక్కత్తినే అన్నీ చేసుకుని చావాలి. నాకు H1 వీసా లేదు కాబట్టి ఉద్యోగం కూడా హుష్ కాకీ! గ్రీన్ కార్డ్ లేని మొగుణ్ణి కట్టబెడితే ఇక బ్రతుకులో పచ్చదం ఏముంటుందే! నేను ఫ్లైటెక్కి అమెరికా చేరేలోపే దురదృష్టం నా ఫేట్ ఎక్కి వెళ్ళి వాలిపోయిందే!”

నాకేం చెప్పాలో తెలియలేదు. మొత్తానికి సంతూ పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి NRI అయిపోయింది. కాని అది ఎప్పటికైనా నిజమైన NRI (Non Regretting Indian) గా మారాలనే నా ఆకాంక్ష. వెళ్తూ వెళ్తూ అది నేర్పిన పాఠం మాత్రం నాకు గుర్తుండిపోయింది – “జీవితం నిత్యకళ్యాణం పచ్చతోరణమా లేక ఒక్క కళ్యాణం నిత్య రోదనమా అన్నది మనబట్టే ఉంటుంది!”

6

సంతూ అమెరికాలో పడుతున్న అవస్థలని స్కైప్‌లో రోజూ సినిమాలా వివరిస్తూ ఉంటే ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. మేమిద్దరం పిల్లల తల్లులమైపోయి, సంసారకూపంలో నిలువునా కూరుకుపోయాము. కలుసుకునే ఆరేళ్ళు దాటిపోయింది. అది ఆ మధ్యెప్పుడో ఇండియా వచ్చినప్పుడు మేము తొలిసారి పోట్లాడుకున్నాం, ఆఖరిసారి మాట్లాడుకున్నాం.

ఆ రోజు మేము కలిసి, కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నేను అన్నాను –

“సంతూ, నీ అందం ఏ మాత్రం తగ్గలేదే! ఫిగర్ భలే మైంటైన్ చేస్తున్నావ్! నాకు టిప్స్ చెప్పొచ్చు కదే!”

“హా! జీవితం వగరుగా ఏడిస్తే ఫిగరుతో ఏమి చేసుకుంటాం!”

“మరీ చెప్తావే! మంచి భర్తా, ముత్యాల్లాంటి పిల్లలూ, బోలేడు డబ్బూ! నీకేం బాధలున్నాయే!”

“ఇద్దరు కుర్ర రాక్షసులకి తల్లి ఎక్కడైనా ఆనందంగా ఉండడం చూశావే నువ్వు! వాళ్ళ అల్లరితో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారే! నీకేం అదృష్టవంతురాలివి, బుద్ధిగా ఉండే అబ్బాయి, ముద్దొచ్చే అమ్మాయి. ఐడియల్ కాంబినేషన్! అమ్మాయుంటే ఆ కళే వేరే! ఏం చేస్తాం, దేవుడు నాకా అదృష్టం ఇవ్వలేదు!”

“అదేమిటే, పెళ్ళి కాకముందు అమ్మాయిగా పుట్టడమే పెద్ద దురదృష్టం అనీ, అమ్మాయిలని పెంచడం మహా కష్టం అనీ, అది నీ వల్ల కాదనీ, పిల్లలు పుడితే ఇద్దరూ అబ్బాయిలే కావాలనీ అనేదానివి కదా!”

“అదే చెప్తున్నానే! వరాలని కోరుకోవడం కూడా నాకు సరిగ్గా చేతకాదు! దురదృష్టానికి ఇంతకన్నా దాఖలా కావాలీ? ఇక ఈ జన్మకి ఇంతే. వచ్చే జన్మలోనైనా దేవుడు కొంచెం అదృష్టాన్నీ సుఖాన్నీ ఇస్తే బావుణ్ణు!”

ఇన్నేళ్ళూ దాని డైలాగులకి ఎదురు చెప్పకుండా ఉంటున్నదానిని ఆ రోజు ఉండబట్టలేక దానితో ఓ మాటనేశాను. అదే నేను చేసిన తప్పు.

“విడ్డూరం కాకపోతే నువ్వు దురదృష్టవంతురాలివి ఏమిటే! వింటే దురదృష్టం నవ్వుకుంటుంది. నీకు వచ్చే జన్మంటూ ఉంటే నిజంగా నిన్ను దురదృష్టవంతురాలిగా పుట్టించి ఈ జన్మని జ్ఞాపకం వచ్చేలా చెయ్యమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజమైన బాధ, అసలైన కష్టం అంటూ ఒకసారి అనుభవిస్తే అప్పుడు నీకు తెలిసొస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతురాలివో!”

ఆ మాటలకి అది అగ్గి మీద గుగ్గిలమే అయ్యింది –

“ఇదన్న మాట నీ నిజస్వరూపం. స్నేహితురాలి కన్నీళ్ళు కోరుకునే నువ్వు ప్రాణ స్నేహితురాలివటే? ఇన్నాళ్ళూ నా దురదృష్టం అంతా దేవుడి రాత అని అనవసరంగా ఆయన్ని తిట్టి పాపం మూటకట్టుకున్నాను కదే! ఇప్పుడు తెలిసొచ్చింది నువ్వే నా దురదృష్ట దేవతవని. నన్ను చూసి నువ్వు కుళ్ళుకుంటూ ఉంటే నాకు కన్నీళ్ళు రాకుండా ఉంటాయీ! చాలమ్మా చాలు! ఇక నువ్వూ వద్దూ నీ స్నేహమూ వద్దు! అమెరికాలో అంట్లు తోముకుంటూ నా పాట్లేవో నేను పడతాను కానీ, ఇక నిన్ను మాత్రం జన్మలో అంటను! సెలవ్, వెళ్ళి రా!”

“ప్రియం పలికేవాడంటే ప్యారు, హితం చెప్పేవాడంటే హేటు, ఇదే జనాల తీరు” అని ఎందుకంటారో నాకు తెలిసొచ్చింది. ఎప్పుడైతే నేను సంతూకి నచ్చచెప్పడం మాని, మంచి చెప్పడం మొదలెట్టానో దానికి నేను చెడ్డదాన్నైపోయాను. నా అవసరం దానికి తీరిపోయింది. మా బంధం చాలా గట్టిది అనుకున్నాను కానీ, మనిషిలోని అహం ఇంకా మొండిది!

ఇదండీ మా సంతూ కథ! ఆలోచిస్తే నాలోనూ, మీలోనూ, మనందరిలోనూ సంతూకున్న “ఏడుపుగొట్టు” లక్షణం అంతో ఇంతో ఉండకపోదు. దాని ఏడుపు సిల్లీగా ఉందని మనం నవ్వుకుంటున్నాం, కాని మనం ఏడ్చిన ఏడుపుల్లో ఎన్ని సిల్లీవి ఉండి ఉంటాయో కదా! ఆ సృష్టికర్త మనని చూసి కూడా నవ్వుకుని ఉండి ఉంటాడు, ఏమంటారు?

 -ఫణీంద్ర

ఫణింద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

6 Comments

 • bhavani says:

  bagundandi

 • Sreekanth says:

  హలో ఫణి.. చాల బాగా రాశావు.. కథే అయినా చాలా సహజమైన నిజం .. మన ఈ చిన్న ఎక్స్పీరియన్స్ లోనే ఇలాంటి వాళ్ళని కలిశాము.. అత్యాశ కి సంతృప్తి కి మధ్య ఇలాంటి సంఘర్షణ చాలా మంది లో ఉంటుంది.. స్టోరీ బాగుంది.. కొంచం క్రిస్ప్ గా ఎడిట్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది.. ఎండింగ్ కూడా 100% కరెక్ట్ .. మంచి చెప్తే చెవికెక్కదు .. పంచదార పూతలే కావాలి జనాలకి..

  శ్రీకాంత్

 • Phanindra says:

  శ్రీకాంత్,

  Thanks for the comments! అవును, మననీ, మన చుట్టూ ఉన్నవాళ్ళని చూసే ఇది రాశాను. ఎడిటింగ్ గురించి నీ కామెంటుని దృష్టిలో పెట్టుకుంటాను.

  ఫణి

 • Vanaja Tatineni says:

  :) చాలా నచ్చింది . ఏడుపుగొట్టు వాళ్ళతో జాగ్రత్తండీ ! మంచికథలు వరుసగా వ్రాసేయండి మరి .

 • Subrahmanyam says:

  హాయ్ ఫణి, కథ చాలా సరదాగానూ, మఱియు ఆలోచింప చేసేదిగానూ ఉంది. I enjoyed reading it :-) Thank you.

 • krishna says:

  సూపర్ సూపర్ అంది

  తనెంత అదృష్టవంతుడో తెలుసుకోలేనివాడే ఈ లోకంలో అందరికన్నాదురదృష్టవంతుడు.”
  జీవితం గులాబి పువ్వు లాంటిది. రంగూ రూపూ నచ్చలేదని ముక్కుమూసుకునికూర్చోకుండా, ముళ్ళున్నాయని వంకలు పెట్టకుండా, పరిమళాన్ని ఆస్వాదించాలి!
  జీవితమనే పెన్లో రీఫిల్ అయిపోతే, రాయడం ఆపెయ్యకూడదు,పెన్ పడెయ్యకూడదు. కొత్తగా రీఫిల్ చేసుకుని ముందుకి సాగాలి!
  “ప్రతి ఉదయం జీవితం నీకు రాసే ప్రేమలేఖ! ప్రతి నిమిషం ఓ లవ్ ప్రపోజల్. పట్టించుకుంటే బ్రతుకుప్రణయగీతం. నిట్టూర్చిపోతే నిత్యభారం!”
  “జీవితం నిత్యకళ్యాణంపచ్చతోరణమా లేక ఒక్క కళ్యాణం నిత్య రోదనమా అన్నది మనబట్టే ఉంటుంది!”

  ఎంత
  సూపర్ అంటే ప్రింట్ తీసుకోని గుర్తుగా ఉంచుకోనేతగా

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)