మహదేవ్ – పార్వతి

teyaku6
 teyaku6
అనగనగా ఒక ఊర్లో అమ్మ నాన్న లేని ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. రోజురోజుకి వాళ్ళకి తిండికి కష్టమవడంతో ఇద్దరూ భిక్షాటనకు బయల్దేరారు . అలా భిక్షమెత్తుతూ ఎత్తుతూ ఇద్దరూ ఒక రాజ్యాన్ని చేరుకున్నారు , చేరుకుని రాజు ఇంటికి కూడా భిక్షానికి వెళ్ళారు . రాజు ఆ కుర్రాళ్ళని చూసి ” ఇద్దరూ ఎంత చక్కగా ఉన్నారు సూర్య చంద్రుల్లా” అనుకుని “అబ్బాయీ మీరెవరు ? మీ తల్లిదండ్రులెవరు ? ఎక్కడి నుండి వచ్చారు ? ” అని అడిగాడు. అందుకు ఆ అబ్బాయిలు “మాకెవరూ లేరు రాజా అనాథలం ” అని బదులిచ్చారు . రాజు అది విని ” సరే అయితే ఇకపై మీరు భిక్షమెత్తుకోవాల్సిన పనిలేదు, నా దగ్గరే ఉండి పోండి ” అన్నాడు. అది విని పెద్దబ్బాయి “సరే రాజా ” అని సంతోషంగా తలూపాడు . కానీ చిన్నబ్బాయి ” రాజా మీ దగ్గర అన్న ఉంటాడు నాకు దేశాటన చేయాలని ఉంది . నన్ను మన్నించండి ” అని చెప్పి వెళ్ళిపోయాడు .
 అలా వెళుతూ వెళుతూ తమ్ముడు కూడా ఒక రాజ్యానికి చేరి రాజు ఇంటికి భిక్షకి వెళ్ళాడు . ఆ రాజు కూడా ఈ అబ్బాయిని చూసి ఎంత చక్కగా చంద్రుడిలా ఉన్నాడు అనుకుని , అనాథ అని తెలుసుకుని “అబ్బాయి మా ఇంట ఉండిపో నాకో చక్కటి కూతురు ఉంది , నీకిచ్చి పెళ్లి జరిపిస్తాను ” అన్నాడు . అది విని అబ్బాయి సరేనని చెప్పి అక్కడే ఉండిపోయి పెళ్లి చేసుకున్నాడు.
రోజులిలా గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నకి తమ్ముడ్ని చూడాలని బుద్దిపుట్టింది. సరే వెళ్లి చూసొద్దాం అనుకుని తమ్ముడి రాజ్యానికి బయల్దేరాడు. తమ్ముడిది రెండంతస్తుల చెక్క ఇల్లు. తమ్ముడి భార్య బావ ఎదుటకి ఒక్కసారి కూడా రాలేదుకానీ ఆయనకి ఏ అసౌకర్యం కలగకుండా మాత్రం చూసుకుంటూ ఉండేది.
ఇలా ఉండగా ఒకసారి పెద్దబ్బాయి మధ్యాహ్నం పూట భోజనం చేసి మంచం మీద అలా పడుకుని ఉన్నాడు. మేడపైన తమ్ముడి భార్య తల దువ్వుకుంటూ ఉంది . అలా దువ్వుకుంటూ ఉండగా ఆమె పొడవాటి వెంట్రుక ఒకటి ఆ చెక్క ఇంటి నేలకి ఉన్న సందుల నుండి క్రింద ఇంట్లో పడుకుని ఉన్న ఆమె బావ పైన పడింది , అంటే ఆ పెద్దబ్బాయి పైన . ఆ అబ్బాయి తన పైన పడిన ఆ వెంట్రుకను చూసి అది తన తమ్ముడి భార్యదే అని కనిపెట్టి , ” అరే నా మరదలి తల వెంట్రుకే ఇంత అందంగా ఉందే , మరి ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో కదా ” అనుకున్నాడు . అలా తలపోస్తుండగా అతనికో దుర్బుద్ధి పుట్టింది , నా తమ్ముడ్ని గనక చంపేసి అడ్డు తొలగిస్తే ఈ అమ్మాయి నాదే అవుతుంది కదా , ఎలాగైనా తమ్ముడ్ని చంపేద్దాం అని అనుకున్నాడు.
అలా అనుకున్నాక ఒకరోజు తమ్ముడ్ని పిలిచి ‘తమ్ముడూ ……… తమ్ముడూ నేను మీ రాజ్యానికి వొచ్చి చాలా రోజులైంది కానీ మనం ఒక్కసారి కూడా వేటకి వెళ్ళలేదు , వేటకి వెళ్దామా ” అన్నాడు . అన్న కోరిక విని తమ్ముడు “సరే అన్నా అట్లాగే ” అని సంతోషంగా ఒప్పుకుని ఏర్పాట్లన్నీ చేసాడు . వేటకి వెళ్ళే రోజు వచ్చింది . బయల్దేరుతూ తమ్ముడు తన భార్యని పిలిచి ఒక లోటాలో పాలు , మరో లోటాలో నీళ్ళు ఇచ్చి “ఈ లోటాలో పాలు ఆ లోటా లోని నీళ్ళలా మారిపోయాయంటే నేను చచ్చిపోయినట్లు అర్ధం చేసుకో. వేటలో ఏ పక్క నుండి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియదు కదా ” అని చెప్పి వెళ్ళిపోయాడు . అన్న ముందే అనుకున్న ప్రకారంగా తమ్ముడ్ని అడవి లోపలికి తీసుకెళ్ళి బాణమేసి చంపేసాడు.
ఇక్కడేమయిందీ చూస్తే రెండు లోటాల్లోనూ నీళ్ళే ఉన్నాయి . పాలు నీళ్ళుగా మారిపోయాయి . అంతే చినబ్బాయి భార్య అర్ధం చేసుకున్నది . తన భర్త చచ్చిపోయాడు అని. ఆమెకు చాలా ఏడుపొచ్చింది . అంత ఏడుపులోనూ ఆమెకొక అనుమానం వచ్చింది. ఇదంతా తన బావే చేసి ఉండవచ్చు అని. అందుకే ఆలోచించి ఇంటి తలుపులన్నీ బంధించుకుని లోపల కూర్చున్నది. ఆమె బావ ఇంటికొచ్చాడు . తలుపులు వేసి ఉండటం చూశాడు . చూసి తన మరదలికి అనుమానం వచ్చినట్లుందని భావించి అచ్చు తన తమ్ముడి లాగా గొంతు మార్చి-
“ఖొలుసె ఖొలు రాణి బజరకెవారెహొ రామ్ రామ్-
హమ్ హైకి ఋకెనా పియాసె రామ్ రామ్ “
(తెరు తెరు రాణి పెద్ద తలుపు తెరు ,నేను నీ ప్రియమైన భర్తను వచ్చాను తెరు )
అన్నాడు .
అదివిని వచ్చింది తన భర్త కాదు బావ అని తెలుసుకున్న ఆ అమ్మాయి
“బసురాకర్ బోలిబచన్ లగతే
భయానే హొ రామ్ రామ్ “
(ఇది బావ గొంతులా అనిపిస్తుంది భయంవేస్తోంది )
అని సమాధానమిచ్చింది . ఇలా కాసేపు ఇద్దరి మధ్యా మాటలు నడిచాక ఆ అమ్మాయి “బావగారు మీరు నన్ను పొందాలనే కోరికతో మీ తమ్ముడ్ని చంపేశారు . సరే జరిగిందేదో జరిగింది , మీ తమ్ముడి శరీరాన్ని తీసుకు వచ్చి జరగవలసిన కర్మకాండలు చూడండి , ఆ తరువాత మీ ఇష్టప్రకారం నన్ను పొందవచ్చు ” అన్నది. అది విని ఆ పెద్దబ్బాయి సంతోషంగా తమ్ముడి శవాన్ని తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు . ఇంతలో చిన్నబ్బాయి భార్య ఇంట్లో ఉన్న ఎండు మిరపకాయలు తీసుకుని బాగా పొడి దంచి చెంగులో పోసి మూట కట్టుకున్నది. అగ్గిపెట్టె ఒకటి తీసి దాచి పెట్టుకున్నది .
తమ్ముడి శవాన్ని తీసుకుని అన్న వచ్చాడు . నది ఒడ్డున చితి పేర్చి , కట్టెల నిండా మంచి తైలం పోసి తమ్ముడి శరీరాన్ని చితి పైకి చేర్చాడు . తీరా చూస్తే వెలిగించడానికి అగ్గిపెట్టె లేదు. అక్కడికి వచ్చిన ఎవరి దగ్గరా అగ్గి లేకపోయేసరికి అగ్గిపెట్టె తీసుకు రావడానికి ఇంటికి బయల్దేరాడు . బావ అటు వెళ్ళగానే చిన్నబ్బాయి భార్య అక్కడ నిలుచున్నవారితో
“దేఖారే దేఖారే మన్ వామనే మోర్ పతికర్ మర్ నా దిక్ హి తెయిర్ గలిక్ జాహి “
(చూడండి చూడండి నా భర్త మరణించిన ఈరోజున పగలే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి )
అన్నది. అది విని అందరు తలలు పైకెత్తి ఆకాశంలోకి చూశారు .
అప్పుడు ఆ అమ్మాయి అందరిపైనా ముందే తెచ్చుకున్న కారంపొడి చల్లి , చితి వెలిగించి , చితిలో దూకేసింది . అగ్గిపెట్టె తో తిరిగి వచ్చిన పెద్దబ్బాయి అదిచూసి గుండె పగిలి పశ్చాత్తాపం కలిగి
“తిరియోకి లోభే మేయితో బాయ్ కే  మార్లో మార్లో
సాయొ తిరియొ సతి చలేగేలో హొ రామ్ రామ్ “
(ఆడదాని మీద లోభం తో నేను నా తమ్ముడిని చంపాను , కానీ ఆ స్త్రీ యేమో సతిగా మారి వెళ్ళిపోయింది )
అని పాడుకుంటూ మళ్ళీ భిక్షగాడిగా మారిపోయాడు.
ఇదంతా జరిగిన రోజు రాత్రి ఆకాశమార్గాన పార్వతి మహాదేవుడు వెళ్తూ ఉండినారు . అక్కడికి రాగానే దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించిన పార్వతి , శివుడితో “మహదేవ్ ….. మహదేవ్ చూడు ఎంత చక్కటి  జంట , ఎంత అందమైన జంట, ఎంత అర్ధాంతరంగా మరణించారు , ఆ ముచ్చటైన జంట బొమ్మల్ని చేసి నాకివ్వవా ” అని అడిగింది . అందుకు శివుడు ” మీ ఆడవాళ్ళంతా పిచ్చి కోరికలు కోరుతారు , తీర్చకపోతే ప్రాణాలు తోడేస్తారు ” అని నవ్వుతూ ఆ అమ్మాయి అబ్బాయి బొమ్మల్ని చేసి పార్వతికి ఇచ్చాదు. ఆ అందమైన బొమ్మల్ని చూసి పార్వతి ముచ్చటపడి ” మహదేవ్  ఈ బొమ్మలకి ప్రాణం పోయ్యవా , ఇంత మంచి మనసున్న వాళ్ళు ఇంత అర్ధాంతరంగా చనిపోవడం న్యాయం కాదు కదా ” అన్నది .
అది విని శివుడు ” పార్వతి అది విధి లిఖితం కదా అన్నీ అలాగే జరుగుతాయి కదా ” అన్నాడు . అయినా పార్వతి పట్టు విడువ లేదు . ఇక తప్పనిసరై  శివుడు ఆ అమ్మాయి , అబ్బాయి బొమ్మలకి ప్రాణం పోశాడు . అది చూసి పార్వతి ” మహదేవ్ ప్రాణం పోశావ్  అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నువ్వే సమకూర్చు ” అన్నది . శివుడు పార్వతి కోరిక మన్నించి , ఆ అమ్మాయి , అబ్బాయికి మిద్దెలు , మేడలు , సర్వసంపదా సమకూర్చాడు. అప్పటి నుండి ఆ భార్యా భర్త సుఖంగా జీవిస్తూ ఉండినారు .
ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఆ పెద్దబ్బాయి భిక్షెత్తుకుంటూ ఊళ్ళన్నీ తిరిగి తిరిగి మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు వచ్చి ఆ రోజు తమ్ముడూ , తమ్ముడి భార్య మరణించిన చోటును చూద్దామని నది ఒడ్డుకు వెళ్ళగా అక్కడొక బ్రహ్మాండమైన ఇల్లు ఉంది . అది చూసి అన్న ఆశ్చర్యపడి , సరే ఈ ఇంట్లో కూడా భిక్ష అడుగుదామని ఆ ఇంటి ముందుకి వెళ్లి
” తిరియొ కి లోభే మెయితో బాయికె మార్లో మార్లో
సాయొ తిరియొ సతి చలేగేలో హొ రామ్ రామ్ “
అని పాడాడు . ఆ భిక్షగాడు పాడుతున్న ఆ పాట విని తమ్ముడి భార్య అతను తన బావే నని కనిపెట్టి , వెళ్లి భర్తతో చెప్పింది . ఆ మాటలు విని ఆ అబ్బాయి లేచి బయటకు వచ్చి అన్నాను చూసి ఇంట్లోకి తీసుకువచ్చి అన్నం పెట్టి ఆదరించాడు . అంత జరిగినా తనని క్షమించిన తమ్ముడు దగ్గర ఉండటానికి మొహం చెల్లక అన్న మరుసటి రోజే భిక్షాటనకి  బయల్దేరి వెళ్ళిపోయాడు .

-సామాన్య 
Samanya2014

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)