రహస్యప్రపంచ రారాణి… స్త్రీ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పిల్లలు Fairy Tales ఎంతో ఇష్టపడతారు. ఒకటి, రెండు తరాల వెనకటి తెలుగు బాలలు చందమామకథలతోనూ, విఠలాచార్య మార్కు సినిమాలతోనూ పెరిగినట్టే; ప్రతి దేశంలోనూ బాలలు వాళ్ళ వాళ్ళ వెర్షన్లకు చెందిన Fairy Tales మధ్య పెరుగుతారు. Fairy Tales అంటే ‘పిల్లల కథలు’ అనే నిఘంటువు నిర్వచిస్తోంది. ఈ మాటకు తెలుగులో కచ్చితమైన సమానార్థకం నాకు వెంటనే స్ఫురించడం లేదు. ‘అద్భుత కథలు’ అనుకుందాం. ఈ అద్భుత కథల గురించి నేనిప్పుడు మీతో ఒక అద్భుతాన్ని పంచుకోబోతున్నాను.

నిజానికి ‘అద్భుత కథలు’, మనం అనుకునేంత అమాయకమైన కథలు కావు. అవి కేవలం పిల్లల కథలూ కావు. ఆ కథల వెనుక ఒక చరిత్ర ఉంది. అంతకంటే ముఖ్యంగా పెద్దల మర్మమూ, పెద్ద తత్వమూ ఉన్నాయి. ఇలా అని పిల్లలకు ఉన్న కథలు కూడా లేకుండా చేస్తున్నానని మీకు అనిపిస్తే మన్నించాలి.

ఇంతకు ముందు మనం ఓడిసస్ అనే వీరుడి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఒక సినిమాలోని వీరుడి కథ చూద్దాం. ఆ సినిమా పేరులోనే వీరుడు ఉన్నాడు. దాని పేరు ‘జగదేకవీరుని కథ’. విజయావారు తీసిన ఈ సినిమా అరవై దశకం ప్రారంభంలో వచ్చింది. అప్పుడప్పుడే ఊహ వస్తున్న రోజుల్లో విజయవాడ, దుర్గాకళామందిరంలో కాబోలు చూశాను. ఆ తర్వాత కూడా టీవీలో అప్పుడప్పుడు చూశాను. కానీ ఆ చూడడం వేరు, ఇప్పుడు చూస్తున్న తీరు వేరు. జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి థాంప్సన్ లను చదివేవరకూ, ఈ సినిమా, ఇంకా ఇలాంటి సినిమాల అసలు మర్మం నాకు బోధపడలేదు.

జగదేకవీరునికథకు ఒక తమిళ మాతృక ఉందని, అది కూడా గొప్ప హిట్ సినిమా అని ఇది రాస్తున్నప్పుడే తెలిసింది. దాని పేరు ‘జగదల ప్రతాపన్’. 1944లో వచ్చిన సినిమా అది. మీకు తెలిసిన, లేదా తెలుసుకునే అవకాశం ఉన్న కథే అయినా ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు జగదేకవీరుని కథ క్లుప్తంగా చెబుతాను.

అనగనగా ఒక రాజుగారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రతాప్. అతనొక రోజు తండ్రితో మాట్లాడుతూ తనకు దేవకన్యలను పెళ్ళాడాలని ఉందంటాడు. దాంతో తండ్రికి కోపం వస్తుంది. అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ప్రతాప్ ఒక మిత్రునితో కలసి దేవకన్యలను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అడవిలో ఒకచోట ఇంద్రకుమారి, అగ్నికుమారి, వరుణకుమారి, నాగకుమారి జలకాలాడుతూ కనిపిస్తారు. ఇంద్రకుమారి ప్రతాప్ ను చూసి శపిస్తుంది. అతను శిలగా మారిపోతాడు. అతని తల్లి అమ్మవారి భక్తురాలు. కొడుకు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మవారు అవ్వ రూపంలో వచ్చి ప్రతాప్ కు శాపవిమోచనం కలిగిస్తుంది. అతనికి, అతని మిత్రునికి ఆశ్రయం ఇస్తుంది. ఇంద్రకుమారి జలకాలాడుతున్నప్పుడు ఆమె చీర ఎత్తుకు వస్తే ఆమె నీదవుతుందని ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ అలాగే చేస్తాడు.

ఈలోపల ఇంద్రకుమారి చేసిన ఒక తప్పుకు కోపించిన ఓ ముని, మానవమాత్రుడితో నీకు వివాహం అవుగాక అని శపిస్తాడు. అతను దొంగిలించిన నీ వస్త్రం నీకు లభించగానే శాపవిమోచనం అవుతుందంటాడు. ఇంద్రకుమారి ప్రతాప్ ను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలసుకుంటుంది. ఇద్దరికీ వివాహం అవుతుంది. వాళ్ళు ఒక రాజ్యానికి చేరుకుంటారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఇంద్రకుమారి పొందు కోరుకుని, తన రోగానికి మందు తీసుకువచ్చే వంకతో ప్రతాప్ ను నాగలోకానికి, వరుణ లోకానికీ పంపిస్తాడు. అతను ఆ లోకాలకు వెళ్ళి నాగకుమారిని, వరుణకుమారినే కాక, అగ్నికుమారిని కూడా వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఈ లోపల తమ్ముడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ప్రతాప్ లేనప్పుడు నలుగురు దేవతాస్త్రీలూ కలసి అతని తల్లిని మోసగించి ఆమె దగ్గర ప్రతాప్ దాచిన ఇంద్రకుమారి వస్త్రాన్ని అపహరిస్తారు. ఇంద్రకుమారి దానిని ధరించగానే శాపవిమోచనం కలుగుతుంది. నలుగురు దేవతాస్త్రీలూ దేవలోకానికి వెళ్లిపోతారు. అయినా ప్రతాప్ ను మరచిపోలేక పోతారు. ప్రతాప్ దేవలోకానికి కూడా వెళ్ళి ఇంద్రుని మెప్పించి నలుగురు భార్యలనూ వెంటబెట్టుకుని మానవలోకానికి వస్తాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

ఓడిసస్ కథకు, ఈ కథకు ఉన్న పోలికలు చూడండి. ఓడిసస్ లానే ప్రతాప్ కూడా మానవమాత్రుడు, వీరుడు. అతని లానే సాహసయాత్ర చేస్తాడు. ఓడిసస్ కు ఎదురైనట్టే ప్రతాప్ కూ అనేక పరీక్షలు, కష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి గట్టెక్కడానికి ఓడిసస్ కు లానే దేవత(అమ్మవారు) సాయం లభిస్తుంది. ఓడిసస్ కు సిర్సే, కలిప్సో అనే అప్సరసలతో సంబంధం కలిగినట్టే ప్రతాప్ కు దేవకన్యలతో సంబంధం కలుగుతుంది. ఓడిసస్ ఒక దేవుడి సలహాతో సిర్సేను లొంగదీసుకుని ఆమెతో పడకసుఖాన్ని పొందుతాడు. అలాగే ప్రతాప్ అమ్మవారి సలహాతో ఇంద్రకుమారిని లొంగదీసుకుని పెళ్లిచేసుకుంటాడు. చివరగా ఓడిసస్ మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి పెనెలోప్ పునస్స్వయంవరంలో వీరత్వం చాటుకుని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు. అలాగే ప్రతాప్ కూడా మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

రెండు కథలూ పురుషప్రయత్నాన్నీ, పురుషుడిలోనీ వీరత్వాన్నీ, అతను ప్రతికూల స్త్రీని సైతం అనుకూలంగా మార్చుకోవడాన్నీ చెబుతూనే; ఆ పురుష ప్రయత్నానికి దైవసహాయం కూడా అవసరమని చెబుతున్నాయి. జగదేకవీరుని కథలో ప్రతాప్ పురుషప్రయత్నానికి ప్రతీక అయితే, అతని తల్లి దైవసహాయానికి ప్రతీక. ఆపైన రెండు కథలూ దైవసహాయం, పురుషప్రయత్నాల మధ్య సమతూకాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒకవిధంగా మానవుడి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే.

వివరాలలో తేడా ఉండచ్చు, స్థూలంగా ఫార్ములా ఒకటే. ఒకటి గ్రీకు కథ, ఇంకొకటి భారతీయ కథ అనే సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అద్భుత కథల ఖజానాలోకి తొంగి చూస్తే ఇలాంటి ఫార్ములా కథలు ఇంకా మరెన్నో కనిపిస్తాయి. ఆయా దేశాలకు చెందిన ఇలాంటి అనేక కథలలోని వస్తువును, నిర్మాణ రీతులను ఎవరైనా లోతుగా పరిశీలించి, ఉమ్మడి అంశాలను గుర్తించారా అన్నది నాకు తెలియదు. నేను అందులోకి వెళ్లలేదు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ పోలికలను చూసినప్పుడు Fairy Tales అనేవి ప్రపంచంలో ఒకచోటినుంచి ఇంకోచోటికి వ్యాపిస్తూ వచ్చాయని కూడా అర్థమవుతుంది. Fairy Tales ప్రపంచవ్యాప్తం అవడమంటే, వాటి వెనుక ఉన్న ఒకే తత్వం కూడా ప్రపంచవ్యాప్తం అయిందన్నమాట.

The garden of immortality

The garden of immortality: ఈ సుమేరియన్ చిత్రంలో ముగ్గురు స్త్రీలు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు కనిపిస్తాయి

 

అందులోకి వెళ్లబోయేముందు ఇంకొక సూక్ష్మమైన పోలికను చెప్పుకోవాలి. ఓడిసస్, నలదమయంతుల కథలో ఉన్నట్టే జగదేకవీరునికథాగమనంలో కూడా వస్త్రం(వస్త్రం అన్నప్పుడు నగ్నత్వ సూచన కూడా అందులో గర్భితంగా ఉంటుంది)ఒక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి ఈ కథలో వస్త్రానిది మరింత స్పష్టంగా కనిపించే కీలకపాత్ర కూడా. ఇంద్రకుమారి నీకు లొంగాలంటే ఆమె వస్త్రం అపహరించుకురావాలని అవ్వ వేషంలో ఉన్న అమ్మవారు ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ ఇంద్రకుమారి వస్త్రం అపహరించడమంటే ఆమెను నగ్నంగా మార్చడమే. కాకపోతే, ఓడిసస్, నలదమయంతుల కథలో నగ్నత్వం పురుషుడిదైతే ఇక్కడ స్త్రీది. పక్షులు ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి తనకు లభించి, దానిని ధరించగానే బాహుకుడు నలుడిగా మారిపోతాడు. నగ్నంగా ఉన్న తనకు నౌసికా అనే రాచబాలిక ఇచ్చిన వస్త్రం ధరించిన తర్వాత ఓడిసస్ కు ఫేషియన్ల సాయం లభించి అతడు స్వస్థలానికి వెళ్లగలుగుతాడు. అలాగే ప్రతాప్ ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి పొందిన తర్వాత ఇంద్రకుమారి దేవకన్యగా మారి దేవలోకానికి వెళ్లిపోతుంది.

***

ఇప్పుడు విజయావారిదే ఇంకో ప్రసిద్ధ సినిమా చూద్దాం. అది, ‘పాతాళభైరవి’(1951). ఈ కథ కూర్పులో అనుసరించిన ఫార్ములా కూడా పై కథలోలానే ఉంటుంది. తోటరాముడు ఇందులో హీరో. అతి సామాన్యుడైన అతను ఉజ్జయిని రాకుమారిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. నా తాహతుకు తగినంత సంపదను సాధించుకువస్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేస్తానని రాజు షరతు పెడతాడు. తోటరాముడు స్నేహితునితో కలసి సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అతనికి పాతాళభైరవిని కొలిచే ఒక నేపాళమాంత్రికుడు తారసపడతాడు. ఒక వీరుని బలి ఇచ్చి శక్తులు పొందే ఆలోచనలో ఉన్న మాంత్రికుడు అతనికి సాయపడుతున్నట్టు నటిస్తూ అతనిచేత అనేక సాహసాలు చేయించి వీరుడే నని ధ్రువీకరించుకుంటాడు. అతని పన్నాగాన్ని తెలుసుకున్న తోటరాముడే మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహం పొంది అన్ని సంపదలూ సాధిస్తాడు. అంతలో మాంత్రికుని శిష్యుడు సంజీవిని సాయంతో గురువును బతికిస్తాడు. రాకుమారిని పెళ్లాడాలనుకున్న రాజుగారి బావమరిది తోటరాముని అడ్డు తొలగించుకోవాలనుకుని అతని దగ్గర ఉన్న పాతాళభైరవి శక్తిని అపహరించి మాంత్రికుడికి అందిస్తాడు. మాంత్రికుడు తోటరాముని సంపదను అంతటినీ మాయం చేసేసి, పెళ్లి పీటల మీంచి రాకుమారిని అదృశ్యం చేస్తాడు. అప్పుడు తోటరాముడు మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని చంపి రాకుమారిని, సంపదనూ కూడా తిరిగి దక్కించుకుంటాడు. అంటే, పైన చెప్పిన ఆయా కథల్లోలానే మంత్రతంత్రాలు, మహిమలతో కూడిన మార్మికప్రపంచంలోకి సాహసయాత్ర జరిపివచ్చిన తర్వాతే, తోటరాముడు వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి రాకుమారితోపాటు రాజ్యాన్నీ పొందాడన్నమాట.

ఇప్పుడిక పై రెండు సినిమా కథల తాత్విక మూలంలోకి వెడదాం:

రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత; పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని నేపాళమాంత్రికుడు ఉగ్రరూపంలోని అమ్మవారి భక్తుడు. దేవత రూపాలూ, పూజించే పద్ధతులు వేరైనా ఆశించే ఫలితం ఒక్కటే. ఉగ్రపూజలో బలులు, తన అవయవాలను తనే నరుక్కోడాలూ, రక్తతర్పణాలూ ఉంటాయి. అయితే, నరుక్కున్న అవయవం, పోయిన ప్రాణం తిరిగి వస్తాయి! పాతాళభైరవిలోనే చూడండి…మాంత్రికుడు భైరవి ముందు చేతిని నరుక్కుంటాడు. తెగిన చోట సంజీవినీ మూలికను రాయగానే చేయి మళ్ళీ వస్తుంది. మాంత్రికుని తోటరాముడు బలి ఇచ్చినప్పుడు శిష్యుడు సంజీవినితో మాంత్రికుని బతికిస్తాడు.

సాత్విక పూజ బహిరంగం. ఉగ్రపూజ రహస్యం. అది ఏ పాతాళ గుహల్లోనో, నరసంచారం అంతగా లేని వనాలు, లేదా తోపుల్లోనో జరుగుతుంది. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ఆవాసం పాతాళగుహే. అంతేకాదు, సాత్విక పూజ కంటే ఉగ్రపూజ పురాతనం, ఆదిమం.

ఈ ఉగ్ర, సాత్విక పూజా ప్రక్రియలు రెండూ ఒక తాత్విక సూత్రాన్ని చెబుతాయి: సాత్వికత లేదా ప్రసన్నత అనేది జీవం, జీవించడం, లేదా వెలుగు! ఉగ్రత అనేది హింస, ఆత్మహింస, చావు, కష్టాలు, చీకటి! మళ్ళీ ఈ సాత్వికత, ఉగ్రత అనేవి రెండూ ఒకే బొమ్మకు రెండు పక్కలే తప్ప వేర్వేరు కావు. ఎలాగంటే, జీవం నుంచి చావు పుడుతుంది. చావునుంచి జీవం పుడుతుంది. విత్తనాన్ని భూమిలో పాతి పెట్టడం చావు. దాని నుంచి మొక్క రావడం జీవం. కష్టసుఖాలు, చీకటి వెలుగులు ఇదే చక్రభ్రమణాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రాణాన్ని, లేదా పునరుజ్జీవనాన్ని పొందాలంటే చావును ఎదుర్కోవాలి. సుఖాలను అందుకోవాలంటే కష్టాల కారడవిలోకి(నలుడు, జగదేకవీరుడు, తోటరాముడు), కడగండ్ల సముద్రంలోకి(ఓడిసస్) సాహసోపేతంగా అడుగుపెట్టాలి. వెలుగులోకి రావాలంటే చీకటిలోకి పయనించాలి.

ఈ చక్రభ్రమణానికి అద్దంపట్టే భౌతికరూపాలు కొన్ని ఉన్నాయి. అవి: చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క మొదలైనవి. చంద్రునికి వృద్ధి, క్షయాలు ఉంటాయి. వృద్ధి అంటే జీవవికాసం, క్షయమంటే చావు. అలాగే వృద్ధి అనేది వెలుగు, క్షయమనేది చీకటి. సర్పం పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటుంది. దాన్నే కుబుసం విడవడం అంటాం. పాత చర్మాన్ని వదిలేయడం చావు. కొత్త చర్మాన్ని ధరించడం పునర్జన్మ. ఒక కాలంలో మోడువారిన చెట్టు ఇంకోకాలంలో చిగురిస్తుంది. ఇందులోనూ చావు-పుట్టుకల క్రమం ఉంది. అలాగే, ఒక విత్తనాన్ని భూమిలో సమాధి చేస్తే(చావు) దాని లోంచి మొక్క పుట్టి అనేక విత్తనాలను ఇస్తోంది.

images1

అర్తెమిస్-అక్తియాన్…అక్తియాన్ పై వేటకుక్కలు దాడి చేస్తున్న దృశ్యం

ఇలా చంద్రుడికీ, సర్పానికీ, మొక్కకూ కూడా తనకు ఉన్నట్టే చావు-పుట్టుకల లక్షణం ఉండడం మనిషిని ఆకర్షించింది. అయితే మనిషికి భిన్నంగా చంద్రుడు, సర్పము, మొక్క మళ్ళీ మళ్ళీ చచ్చి, మళ్ళీ మళ్ళీ పుట్టడం ప్రత్యేకించి మనిషిలో ఆలోచనను, ఆశను రేకెత్తించింది. తనకూ అలాగే పునర్జన్మ, బహుశా ఇప్పటికంటే మెరుగైన జన్మ ఉంటుందనిపించింది. అలా మనిషిలో ఒక ఆదిమ తాత్వికత అంకురించింది. ఆ తాత్వికతకు అనుగుణమైన ఆచారకాండ రూపొందింది. చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క గొప్ప తాత్విక ప్రతీకలు అయ్యాయి. ఆ అవడం ఏదో ఒక్క చోట కాదు, ప్రపంచంలో అనేక చోట్ల అయింది. ఒకచోట పుట్టిన ఈ తాత్వికతే ఇతర చోట్లకు విస్తరించిందన్న వాదమూ ఉంది.

మన దేవీ దేవులతోనూ, ఆరాధనా రూపాలతోనూ చంద్రుడికీ, సర్పానికీ, పంటకు లేదా మొక్కకూ ఉన్న ముడి తెలిసినదే. శివుని శిరసు మీద, అమ్మవారి శిరసు మీదా కూడా చంద్రవంక ఉంటుంది. శివుని మెడలో సర్పముంటుంది. సర్పాన్ని, చెట్టును పూజించడం మన దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఉంది. అమ్మవారి చేతిలో చెరుకుగడో లేదా మరో రకమైన పంటరూపమో ఉంటుంది. ఇవే ప్రతీకలు ఇతర పురాతన మత విశ్వాసాలలో, ఆరాధనా ప్రక్రియలలో కూడా ఎలా ఉన్నాయో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ ఆదిమ తాత్విక సూత్రంలోనూ, ప్రక్రియలోనూ కీలకభూమిక పురుషదేవుడిదీ, పురుషుడిదీ కాదు; స్త్రీ దేవతదీ, స్త్రీదీ!

ఆదిమకాలంలో స్త్రీ శాసించిన ఆ మతవిశ్వాసరంగం ఓ రహస్యప్రపంచం. ఆ రహస్యప్రపంచానికి స్త్రీ రారాణి. అది చీకటివెలుగులు, భయనిర్భయాలు, కష్టసుఖాలు, చావుపుట్టుకలు అన్నీ కలగలసిన ప్రపంచం. అక్కడి దేవతలోని ఒక అంశ ఉగ్రకాళిగా, మృత్యుదేవతగా, రక్తపిపాసిగా కనిపించి భయపెడుతుంది. అంతర్లీనంగా ఉండే ఆ దేవత మరో అంశ, ప్రసన్నత, సాత్వికత. అది బతుకునీ, సుఖాన్నీ, వెలుగునూ ఇచ్చి నిర్భయుణ్ణి చేస్తుంది. గుహలు, తోపులు,వనాలు ఈ రహస్యప్రపంచ స్థావరాలు. ఆదిమకాలంలో అవే దేవతాలయాలు.

మన పురాణ, ఇతిహాసాలలో ఈ గుహలు, తోపులు, వనాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, వీటి ప్రస్తావన ఇతర పురాణ, ఇతిహాసకథల్లోనూ రావడం! స్త్రీ రహస్యప్రపంచంలోకి మగవాడు అన్నివేళల్లోనూ ప్రవేశించడానికి వీల్లేదు. ప్రవేశిస్తే శిక్ష తప్పదు. అది మరణశిక్ష కూడా కావచ్చు. ఇప్పటికిప్పుడు స్ఫురించే ఒక కథలో నారదుడు స్త్రీల రహస్యప్రదేశంలోకి అడుగుపెట్టి స్త్రీగా మారిపోతాడు. ఇంకో కథలో పార్వతి తన ఒంటి నలుగుపిండితో గణపతిని చేసి, అతన్ని కాపలా ఉంచి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ప్రవేశించబోతాడు. గణపతి అడ్డుపడతాడు. శివుడు అతని శిరసును ఛేదిస్తాడు. ఆ తర్వాత ఒక ఏనుగు తలను అతనికి తగిలిస్తాడు. ఇది కూడా స్త్రీ రహస్యప్రపంచాన్ని సంకేతిస్తూ ఉండచ్చు. దేవీభాగవతం వంటి అమ్మవారికి సంబంధించిన పురాణాలలో మరిన్ని ఉదాహరణలు లభించవచ్చు.

ఇందుకు సంబంధించిన కథలు మన దగ్గరే కాక, ఇతర ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రీకు పురాణ కథ ఇలా ఉంటుంది: ఓ నడివేసవి రోజున అర్తెమిస్ అనే దేవత ఒక కీకారణ్యపు లోయలో వేటాడి అలసిపోతుంది. కన్యా కూపం(Maiden’s Well), లేదా కన్యా సరోవరంలో జలకాలాడుతూ ఉంటుంది. ఆమెలానే వేటకు వచ్చిన అక్తయాన్ అనే పురుషుడు తన వేటకుక్కల వెంట సరిగ్గా అదే ప్రదేశానికి వచ్చి ఆమెను చూస్తాడు. అతను తను చూసింది ఇంకొకరికి చెప్పకుండా నివారించడానికి అర్తెమిస్ అతన్ని ఒక లేడిగా మార్చివేస్తుంది. అతనితో ఉన్న వేటకుక్కలు లేడి రూపంలో ఉన్న అతని మీద పడి తినేస్తాయి.

జగదేకవీరుని కథలో దేవకన్యలు జలకాలాడుతుండగా చూసిన ప్రతాప్ శిలగా మారిపోతాడు!

ఇంకో గ్రీకు కథలో లూకిపస్ అనే యువకుడు డఫ్నే అనే యువతిని ప్రేమిస్తాడు. స్త్రీ వేషంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సన్నిహిత నేస్తాలలో ఒకడిగా అయిపోతాడు. మిగతా నేస్తాలతోపాటు ఆమె వెంట వేటకు వెడుతుంటాడు. ఒకరోజున యువతులందరూ దుస్తులువిప్పి లాడన్ అనే సరోవరంలో జలకాలాడాలనుకుంటారు. లూకిపస్ అందుకు నిరాకరిస్తాడు. దాంతో వాళ్ళకు అనుమానం వస్తుంది. బలవంతంగా అతని చేత దుస్తులు విప్పించి, పురుషుడన్న సంగతి తెలుసుకుంటారు. అప్పటికప్పుడు అతన్ని కత్తితో పొడిచి చంపేస్తారు.

మన దేశంలో స్త్రీ రహస్యప్రపంచపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. చాలా వ్యాసాల క్రితం ఒక వ్యాసంలో దీని గురించి రాశాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

Download PDF

1 Comment

  • భాస్కరం గారూ ,,మన జానపద గాధలకు ఆనాటి ప్రపంచ సాహిత్యంతో ఉన్న పోలికలను సమన్వయము చేయడము లో మీరు సిద్ధహస్తుల్ ,చాలా విషయాలు తెలుస్తున్నాయి ఆలోచింప చేస్తున్నాయి ,మన కాసీమజిలీకధాలు అపూర్వచింతామణి గురించికూడా ఆలోచిస్తే …….అలాగే ఎలా సాధ్యమోకూడా …….

Leave a Reply to Ikkurthi narasimharao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)