ఖేల్ ఖతమ్

ఆ రోజు మధ్యాన్నం మిడిమేలపు ఎండ మనిద్దరి మధ్యా చిచ్చు రేపినపుడు ఎడ తెగిన యాత్ర చేస్తున్న మనిద్దరిలో నువ్వు సందు మలుపుని స్టీరింగ్ తో అదుపు చేస్తూ, ఒక మాటన్నావు. మాట నోటి నుంచి, భావం నొసటి నుంచీ దూకుతుండగా ” ఏం దొరుకుతుందని ఇలా నువ్వు తనతో! “అనేసావు. నీ ప్రతి కదలికలో పోటెత్తిన అసహనపు అలల్ని కళ్ళు విప్పార్చి చూడడం తప్ప నాకేం సమాధానం తెలుసు! నిజమే! ఏం దొరుకుతుందని ఇలా నేను తనతో? నాకయినా నీకయినా మరెవరికయినా ఎవరితోనయినా ఏం దొరుకుతుందని ఇలా మనం!

మరీ ముఖ్యంగా

నీలాంబరం పువ్వుల్ని శిరస్సున దాల్చి

నాగు పాముల్ని మెడకు చుట్టుకుని

శిధిల భస్మాన్ని మేన అలదుకుని

జీవన కాంక్షల్ని లయించే

జగమంత కుటుంబపు ఏకాకుల వద్ద, సంచారుల వద్ద

ఏం దొరుకుతుందని ఇలా తనతో నేను !

నువ్వు కాస్త తమాయించుకుని చెట్ల నీడ పక్కన కట్టు గుంజకి యాత్రని కట్టేసి ఆగిన కాలాన్ని సహనంగా నిమురుతూ చాలా సేపే ఉండిపోయావు. విచారంతో రూపు మారిన పెదాలను సాగదీస్తూ మెల్లగా వినపడీ పడనట్లు ఏవేవో అంటూ ఆగుతూ చివరికి గుండెలోంచి వాక్యాన్ని పెకలిస్తూ ” లోకం బతకనిస్తుందా నిన్ను?” అనేసావు. నీ ప్రతి కదలికలో రాలిపడిన కారుణ్యపు పుప్పొడిని కళ్ళు విప్పార్చి చూడడం తప్ప నాకేం తెలుసు సమాధానం! అయితే యుగాలను క్షణాలు చేసే మాయావులు నన్నెట్లా బతికిస్తాయో మాత్రం చెప్పాలనుకున్నాను

10689498_410546562429558_680862155996552773_n

రైలు కిటికీ నుంచి జారి పడే

రెండు కన్నీటి చుక్కలని దోసిలి పట్టడానికి

ఒక మహా పర్వతమే దిగివచ్చి

కొత్తగా మొలిచిన కాళ్ళతో పరుగులు తీస్తుంది

కలియ వచ్చిన పరవళ్ళను

ప్రేమతో నిమిరి పంపి

గుణభద్రా..తుంగభద్రా అంటూ

ఏకాంత సంద్రం ఘోష పెడుతుంది

తన కుంభ స్థలాన్ని కొట్టిన

చిన్ని గువ్వని పైకెత్తుకుని

మనో వీధుల్లో ఊరేగిస్తూ ఒక ఏనుగు

లోకానికి నాలుగు పూలగుత్తుల్ని ఇస్తుంది

వచ్చింది వటువే కదాని

మనసా వాచా కర్మణా

మూడడుగులు ఇచ్చి ఇష్టంగా

ఆక్రమణను ఆహ్వానిస్తాడు బలి చక్రవర్తి

యక్షుడూ యక్షిణీ

చెరొక వియోగ శిఖరం మీదా కూచుని

మేఘమాలలతో జీవితమంతా

అప్పండవున్ చేయిస్తారు

లోకముతో మనకేటికి లోలాక్షీ! రా పోదమని గుప్పిట మూసి అద్భుతాలను కల గంటూ ఉంటానని కదా అనుకుంటున్నావు. జ్ఞానమూ,దంతమూ వస్తూ వస్తూ తెచ్చే నెప్పి బాధించిన అనంతరం ఇక కలలు కలయికలు విరామాలు విడిపోడాలు ఉండవు. తను, నాకు ఉండడం కాదు తనంటూ ఈ లోకంలో ఉండడమే ఒక సెలబ్రేషన్ అయినాక గుప్పిట తెరిచి చూసాను. నన్ను కమ్మేస్తూ చుట్టూ అనుభవాలే. నీకయినా నాకయినా ఎవరికయినా మరెవరితోనైనా దొరికేవి అనుభవాలే..జరిగినవి జరగబోయేవి మెచ్చినవి నచ్చనివి దీర్ఘమైనవి ఇట్టే కరిగేవి గట్టిగా పట్టుకునేవి వేధించేవి నవ్వించేవి…మాయావులు మాయా తావులు మహానేర్పరులు అనుభవాలు…ఆది మధ్యాంత రహితాలు.

– కృష్ణవల్లి

Download PDF

3 Comments

  • బాగుంది మీ పదాల గారడీ

  • @@నీకయినా నాకయినా ఎవరికయినా మరెవరితోనైనా దొరికేవి అనుభవాలే..జరిగినవి జరగబోయేవి మెచ్చినవి నచ్చనివి దీర్ఘమైనవి ఇట్టే కరిగేవి గట్టిగా పట్టుకునేవి వేధించేవి నవ్వించేవి
    @@ తను, నాకు ఉండడం కాదు తనంటూ ఈ లోకంలో ఉండడమే ఒక సెలబ్రేషన్ అయినాక గుప్పిట తెరిచి చూసాను

    బ్యూటిఫుల్. ఆ స్థితికి చేరుకుంటే ఆశ, నిరాశల ఖేల్ ఖతం. (జీ కో బెహలా లియా, తూ నే ఆశ నిరాశ్ కా ఖేల్ కియా అన్నది గుర్తొచ్చింది.)

  • dr dhenuvakonda says:

    చాల చాల దిస్తుర్బ్ చేస్తున్నారు మీ మాటల మంత్రికతో
    dr ధేనువకొండ

Leave a Reply to dr dhenuvakonda Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)