‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

స్త్రీ ప్రపంచం రహస్యమే కాదు, మాంత్రికం కూడా!

ఈమధ్య దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి అయినప్పుడు, అబ్బాయిని పెళ్లికొడుకును చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. అక్కడ జరుగుతున్న తంతూ, కనిపించిన సన్నివేశాలూ కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. మామూలుగా అయితే పెళ్లికొడుకును, పెళ్లికూతురును చేయడం తంతు అబ్బాయి, అమ్మాయిల ఇళ్ళల్లో విడివిడిగా జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమంలో పెళ్లికూతురు, ఆమె తరపువారు కూడా పాల్గొన్నారు.

పెళ్లికొడుకును చేయడం పూర్తయింది. ఆ తర్వాత పెళ్లికూతురును తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టారు. ఇక ఆడవాళ్ళ హడావుడి ప్రారంభమైంది. ‘చందనబ్బొమ్మ…చందనబ్బొమ్మ’ అంటూ ఓ పెద్దావిడ తొందరపెట్టింది. పెళ్లి వస్తువుల్లోంచి ఓ చెక్కబొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. కొందరు ఆడవాళ్ళు కలసి వధూవరుల ముందు ఒక చీర ఉయ్యాల కట్టారు. అందులో బొమ్మను ఉంచి పెళ్లికూతురు, పెళ్ళికొడుకు చేత ఊపించారు.

పద్ధతుల్లో తేడా ఉండచ్చు కానీ, అన్ని ప్రాంతాల పెళ్లితంతుల్లోనూ ఈ చందనబ్బొమ్మ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.  శోభనం రోజున వధూవరుల మధ్య గంధర్వుడు తిష్టవేశాడని సంకేతిస్తూ ఓ చందనబ్బొమ్మను ఉంచుతారని ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. దాని అంతరార్థాన్ని సూచించే రాంభట్ల, తిరుమల రామచంద్ర గార్ల వాక్యాలను, కొన్ని పెళ్లిమంత్రాలను ప్రస్తావించుకున్నాం. ‘చందన’బ్బొమ్మ పేరులోనే ‘గంధ’ర్వ సూచన ఉంది.

అయితే,  పైన జరిపిన తంతు మరో రకం. అది పెళ్లి అయిన తర్వాత బిడ్డ పుట్టడాన్ని సూచించే తంతు. ఇక్కడ చందనబ్బొమ్మ అన్నా, దానిని ఓ కొయ్యబొమ్మగానే తీసుకుందాం. ఇందులో విచిత్రం ఏమిటంటే, పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టడం తంతును జరిపించేయడం!

పెళ్లి తంతు నిజంగానే ‘తంతు’గా మిగిలిపోయిందనిపించింది, ఇది చూడగానే!  పద్ధతులు, ముందు వెనకలు పాటించకపోయినా తంతు జరిపించామనిపిస్తే చాలు! చెక్కబొమ్మ అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ బొమ్మతోనే పని జరిపించేస్తున్నారు. అదలా ఉంచితే, ఏ తంతు ఎందుకు జరుపుతున్నారో, దాని చరిత్ర ఏమిటో, ఎన్ని వేల సంవత్సరాలుగా అది తరం వెంట తరానికి సంక్రమిస్తూ వస్తోందో, మనకు తెలియకుండానే దానికి మనం ఎలా వాహికలమవుతున్నామో, కనిపించని ఓ పురాతన వృక్షపు వేళ్ళలా; మానవ అస్తిత్వపు వేళ్ళు అందులో ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో-అక్కడున్నవాళ్ళలో ఎవరికైనా తెలుసా అనిపించింది.

ఒక్క మాటలో చెప్పాలంటే,  ఆయా తంతుల రూపంలో మనం (ముఖ్యంగా ఆడవాళ్ళు) మనిషి అస్తిత్వ చరిత్రను అవిచ్ఛిన్నం చేస్తున్నాం. వేల సంవత్సరాల గతానికీ, వర్తమానానికీ మధ్య వారధి అవుతున్నాం. చరిత్రను అస్థిపంజర ప్రాయంగానే అయినా భద్రంగా మోసుకొస్తున్నాం. అయితే అలా మోసుకొస్తున్న విషయం మనకు తెలియదు!!

తెలియకపోగా మనం ఇంకొకటి కూడా చేస్తున్నాం. ఇలాంటి తంతు వెనుక తర్కాన్ని, హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నాం. మూఢాచారాలుగా కొట్టిపారేస్తున్నాం. నవ్వుకుంటున్నాం. వయసొచ్చిన ఇద్దరు యువతీ యువకులు ఒకటవడానికి ఇంత తంతు జరపాలా అంటున్నాం. ఒక కోణం నుంచి చూస్తే, నిజమే కదా అనిపిస్తుంది.

కానీ ఇంకో కోణం నుంచి చూడండి…ఈ తంతు పూర్తిగా అదృశ్యమైపోయిన పరిస్థితిని ఊహించుకుంటే భయమూ, దిగులూ కలగచ్చు. పెళ్లి తంతు, ఆ మాటకొస్తే ఏ తంతు అయినా అదృశ్యమైపోవడమంటే ఏమిటి? దాంతోపాటు అది మోసుకొచ్చే చరిత్ర కూడా అదృశ్యమైపోవడమా? గతంతో మనకు ఉన్న ముడి అదృశ్యమైపోవడమా? వేళ్ళు తెగిన చెట్టులా మనం నిర్జీవంగా శూన్యంలో వేలాడవలసి రావడమా?…

పశ్చిమదేశాల్లో చాలావరకూ జరిగింది ఇదే. ఇప్పుడిప్పుడు కీళ్ళు సడలుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ  మనదేశంలో వేళ్ళు ఎంతో కొంత పదిలంగానే ఉన్నాయి. మనదగ్గర గణవ్యవస్థ తాలూకు లక్షణాలు ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ ఆ సంగతి మనకు తెలియదు!

మన తెలియనితనం ఇంకా వేనవేల రూపాల్లో వ్యక్తమవుతూ ఉండచ్చు.  మనం ఆయా తంతులను మతవిశ్వాసంగా, అందులోనూ మన మతానికి మాత్రమే చెందిన విశ్వాసంగా అపోహ పడుతూ ఉంటాం. కానీ ఇలాంటి తంతులే దాదాపు ప్రపంచమంతటా ఉన్నాయి, లేదా ఉండేవి. అలాగే, మతానికి, సంస్కృతికి ఉన్న తేడా మనలో చాలామందికి  తెలియదు. ఉమ్మనీటితోపాటు పసికందునూ పారబోసినట్టుగా మతవిశ్వాసంతోపాటు సంస్కృతినీ పారబోస్తున్నామా?

ఇందులో నేను వ్యక్తిగతంగా ఒక దాన్ని సమర్థించడం, ఇంకో దాన్ని వ్యతిరేకించడం అన్నది లేదు. ఇది బహిరంగంగా సాగించే ఆలోచనల కలబోత మాత్రమే. కాలంలో, ప్రకృతిలో సంభవించే ఏ పరిణామాన్నీ ఆపలేనంత చిన్నది మనిషి పిడికిలి. అందులో దేనిని బంధించాలని చూసినా అది వేళ్ళ సందుల్లోంచి తప్పించుకుంటూనే ఉంటుంది.

***

పెళ్లి తంతు ఇప్పుడొక వేడుకగా, ఆచారంగా; చందనబ్బొమ్మ ఒక బొమ్మగా కనిపించవచ్చు. కానీ పురామానవుడి విషయంలో ఆ తంతు కేవలం ఒక వేడుకా కాదు, ఆ బొమ్మ ఒక బొమ్మా కాదు. అతని జీవితంతో పూర్తిగా పెనవేసుకున్న మాంత్రికతలో అవి భాగాలు. ఆ తంతు మొత్తం మంత్రపూతమైన ప్రక్రియ. చందనబ్బొమ్మ మంత్రపూతమైన వస్తువు. ఉయ్యాలలో బొమ్మను ఉంచి వధూవరులు ఊపడం అనేది, భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా భౌతికవాస్తవికతను ప్రభావితం చేసి, రేపు బిడ్డ అనే ఫలితాన్ని పొందడం కోసమే. అంటే రేపటి ఫలితానికి అది రిహార్సల్. పురామానవుడి దృష్టిలో అసలుకు, రిహార్సల్ కు ఎలాంటి తేడా లేదు. ఉయ్యాల్లో ఊపిన ఆ బొమ్మ అతని దృష్టిలో ఆ క్షణంలో ఒక సజీవమైన పసిపాపే.

బొమ్మ ఒకటే కాదు; రాయి, రప్ప, కొండ, గుట్ట, చెట్టు, పుట్టతో సహా ప్రకృతిలో ప్రతిదీ పురామానవుడి దృష్టిలో మాంత్రికతకు అర్హమైనవే. అంతవరకూ ఒక రాయి అనుకున్నది హఠాత్తుగా దేవతగా మారిపోవచ్చు. అలాగే ఒక చెట్టు, ఒక పుట్ట…ఈ క్రమంలో మనిషి ఉపయోగించే శిలాసాధనాలు, లోహసాధనాలూ కూడా మాంత్రిక సామగ్రిగా మారిపోతాయి.

sindhu

శిలాసాధనాలకే వస్తే, రుబ్బురోలు-పొత్రం ఒక ఉదాహరణ. రాతియుగం చివరిలో, వ్యవసాయం ప్రారంభమైన తొలినాళ్లలో వాడుకలోకి వచ్చిన సాధనాలలో ఇదొకటి. వేల సంవత్సరాలుగా కాలంతోపాటు కలసి ప్రయాణిస్తూ వచ్చిన, మన్నికైన ఆదిమ సాంకేతిక పరికరం ఇది. మనదేశంలో అన్ని తరగతులవారిలొనూ  నిన్నమొన్నటివరకూ ఇది ఉపయోగంలో ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో వాడుకలో ఉంది. ఈ రుబ్బురోలు-పొత్రం గురించి కోశాంబి (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా ఉంటుంది.

రుబ్బురోలు-పొత్రం ఆనవాళ్ళు ప్రపంచమంతటా పురావస్తు తవ్వకాల్లో దొరికాయి. కాలగతిలో ఈ సాధనం భిన్నరూపాలు తీసుకుంటూ వచ్చింది.. మొదట్లో ఇది చిత్రంలో చూపిన ఆకారంలో ఉండేది. సింధులోయలో ఇలాంటివే దొరికాయి. అన్నింటి కన్నా ఆంద్ర ప్రాంతంలో ఉపయోగించే రుబ్బురోలు-పొత్రం మరింత సమర్ధమైన రూపం అంటారు కోశాంబి. పొత్రం రోట్లో దాదాపు పూర్తిగా నిండిపోతుంది. ఈ సాధనాన్ని వాడడంలో మళ్ళీ ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాల తేడాలు కూడా ఉన్నాయి. ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్ళు ఉపయోగించే విధానం సులువుగా ఉంటే,  నిమ్నవర్గాలవారు ఉపయోగించే విధానంలో శ్రమ ఎక్కువ.  ఇందులో ప్రాంతాల తేడాలు కూడా ఉన్నాయి. సులువైన విధానం ఉత్తరభారతీయులది. కాస్త శ్రమతో కూడింది దక్షిణభారతీయులది. రోలు-పొత్రము దక్షిణభారతానికి తదుపరి కాలంలో పరిచయమవడం కూడా ఒక కారణం. వాడడంలో ఉన్న తేడాలను బట్టి దక్షిణభారతంలోని బ్రాహ్మణులు ఉత్తరభారతంనుంచి వచ్చారని భావించడమూ ఉంది.

అదలా ఉంచితే, ఎప్పుడో ఊహకు అందని కాలంనాటి వ్యవసాయ ప్రారంభదశకు చెందిన ఈ సాధనం ఒక తంతులో భాగమైంది. శిశువుకు బారసాల జరిగే రోజున లేదా, డానికి ముందు పొత్రానికి ఒక కొత్త బట్టను టోపీలా తొడిగి, పసుపు, కుంకుమ అద్ది, ఒక ఆభరణం అలంకరించి ఉయ్యాలలో శిశువు చుట్టూ తిప్పుతారు. ఆ తర్వాత డానిని శిశువు పాదాల దగ్గర ఉంచుతారు. ఆ పొత్రంలానే శిశువు కూడా దృఢంగా ఉండాలనీ, ఆరోగ్యంగా ఎదగాలని కోరుకోవడం ఈ తంతులోని అంతరార్ధం. అలాగే ఆ పొత్రం, డానికి చేసిన అలంకరణ అమ్మవారికి కూడా ప్రతీక. శిశువుకు అమ్మవారి ఆశీస్సులు లభించాలన్న కోరిక అందులో ఇమిడి ఉంటుంది. ప్రస్తుతం మనకు అవసరమైన ముఖ్య సమాచారం ఏమిటంటే, ఈ తంతులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. పిల్లలుగల ఒక ముత్తైదువ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇదీ, ఇంకా ఇలాంటి అనేక తంతులూ ఋషులు చెప్పినట్టు పేర్కొనే ప్రామాణిక గ్రంథాలలో ఉండవనీ, అయినాసరే బ్రాహ్మణులు కూడా వీటిని పాటిస్తారనీ కోశాంబి అంటారు.

అంటే, అజ్ఞాతకాలంనుంచీ ఆనవాయితీగా కొనసాగుతున్న ఇలాంటి తంతులను స్త్రీలే కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట. మామూలుగా కాదు, అతి రహస్యంగా! ఒకే కప్పు కింద ఉంటున్నా తల్లులు కొడుకులకు తెలియకుండా కూతుళ్ళకు ఈ రహస్యవారసత్వాన్ని భద్రంగా బదిలీ చేసే తీరు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కొబ్బరికాయలోకి నీరు చేరినట్టుగా; తమను ఏమార్చి తమ కళ్ళ ముందే  అక్కలు, చెల్లెళ్ళు ఈ గుప్తవారసత్వాన్ని అందుకుని ఆరిందలుగా మారిపోతుండడం మగవాణ్ణి ఎప్పుడూ ఆశ్చర్యచకితం చేస్తూనే ఉంటుంది. ఈ తంతులపై ప్రత్యేకంగా స్త్రీముద్ర ఉండడానికి కారణం ఉహించలేనిదికాదు. ఇవి వారు మార్మికప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసించినరోజులనుంచీ వస్తున్న తంతులు.

ఆ తర్వాత ఆ అధికారం స్త్రీ చేతుల్లోంచి పురుషుడి చేతుల్లోకి బదిలీ అయ్యాక పురుషుడి ముద్ర గల తంతులు మొదలయ్యాయి. అవి స్త్రీముద్ర గల తంతులతో పోల్చితే మరింత అభివృద్ధి రూపాన్నీ, ప్రామాణికతనూ తెచ్చుకుంటూ వ్యవస్థీకృతం అవుతూవచ్చాయి. క్రమంగా గ్రంథరూపం ధరించడమూ ప్రారంభించాయి. స్త్రీ తంతులకు  ఆ గ్రంథాలలో చోటివ్వకుండా పురుషుడు జాగ్రత్తపడ్డాడు. అయినాసరే, మౌఖికంగానే తరం వెంట తరానికి అందుతూ కాలాన్ని ప్రతిఘటించి అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే, ఆ మేరకు పురుషుడు రాజీపడ్డాడన్నమాట.

ఇది మన అనుభవం. కానీ, పాశ్చాత్య, ఇస్లామిక్ ప్రపంచాలలో స్త్రీ మార్మిక ప్రపంచాన్ని పనిగట్టుకుని అంతమొందించినట్టు కనిపిస్తుంది, ఆ క్రమంలోనే స్త్రీ ‘మంత్రగత్తె’ అయింది.

***

మనమిప్పుడు ఓసారి  జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AEGEAN)ను పలకరిద్దాం. స్త్రీ మార్మిక ప్రపంచం విశ్వవ్యాప్తం అనే కాక, ఆ ప్రపంచంలో ‘బొమ్మ’లకు ఎంతో ప్రాధాన్యం ఉందంటాడాయన. ఆయన ప్రకారం:

నేటి మన పిల్లలలానే ఆటవిక దశలోని పిల్లలు కూడా బొమ్మలతో ఆడుకునేవారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా బొమ్మలతో ఆడుకునేది ప్రధానంగా ఆడపిల్లలే. అలా బొమ్మలతో ఆడుకోవడం అనేది రేపు వారు పోషించబోయే  అమ్మపాత్రకు రిహార్సల్ మాత్రమే. అయితే ఈ ఆట, ఆధునిక కాలంలో కంటే ఆటవిక కాలంలో మరింత గంభీరమైన వ్యవహారం. దురదృష్టవశాత్తూ దాని గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఆటవిక పురుషుడు ఈ బొమ్మలాటలోకి తొంగి చూడకూడదు. చూస్తే తప్పవుతుంది.

అలాగే, పురుష మానవపరిణామ శాస్త్రవేత్త కూడా.  భర్తలకు తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్న తమ రహస్యాలను స్త్రీలు తెల్లతోలు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అసలే చెప్పరు.  మహిళల సామాజిక స్థాయి, మానవపరిణామశాస్త్ర అధ్యయనానికి వారిని ప్రోత్సహించదు. అందుకే స్త్రీల ఆదిమజీవితం గురించిన సగం చరిత్ర నమోదు కాకుండా పోయింది. ఈ పరిస్థితిలో మిస్ ఎర్తీకి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమె దక్షిణాఫ్రికా వాలెంగ్ బాలికలను అమ్మపాత్రకు సిద్ధం చేసే తంతును పూసగుచ్చినట్టు రాశారు.

ఆ ఏడాదిలో పెద్దమనుషులైన ఆడపిల్ల లందరినీ ఒకచోట చేర్చమని వసంతం ఆరంభంలో తెగ నాయకుడు చాటింపు వేయిస్తాడు. అందరినీ ఒకచోట చేర్చిన తర్వాత వారికి తర్ఫీదు ఇచ్చే తంతు నెలరోజులపాటు జరుగుతుంది. ఈ శిక్షణ తంతును ‘న్యంబుత్సి’ అని పిలిచే ఒక మహిళ పర్యవేక్షిస్తుంది. తల్లినుంచి కూతురికి సంక్రమించే హోదా అది. అలాగే ఒక ప్రత్యేకమైన బుట్ట కూడా తల్లినుంచి కూతురికి వారసత్వంగా అందుతూ ఉంటుంది. అందులో ఒక డోలు(drum), ఒక కొమ్ము(horn), స్త్రీ, పురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీ, పురుషుల కొయ్యబొమ్మలు ఉంటాయి. ఈ పరికరాలు అన్నింటికీ ఎర్రని రంగు పూస్తారు.

మొదటి రోజున న్యంబుత్సి పర్యవేక్షణలో ఆడపిల్లలందరూ డోలు వాద్యానికి అనుగుణంగా నగ్నంగా నృత్యం చేస్తారు. డోలు స్త్రీగర్భానికి ప్రతీక. మొదట్లో ఆడపిల్లలు భయంతో ఏడుపు మొదలుపెడతారు. సాయంత్రం వరకు అలా నృత్యం జరిగిన తర్వాత ‘పవిత్రమైన కొమ్ము’తో ఒక్కొక్క ఆడపిల్ల కన్నెపొర తొలగిస్తారు.

మరునాడు, లైంగికజీవితం గురించి ఒక పద్ధతిగా వారికి బోధిస్తారు. బుట్టలో ఉన్న స్త్రీపురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీపురుషుల బొమ్మలు అందుకే.  తమ పూర్వీకుల ఆత్మలు ఆవహించి ఉంటాయన్న భావనతో వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ తర్ఫీదులో భాగంగానే ఆడపిల్లలకు ఒక గుప్తభాషను బోధిస్తారు. ఒకరి వస్తువులు ఒకరు దొంగిలించమని కూడా ప్రోత్సహిస్తారు. మొదటి రోజున చేసిన నృత్యమే చివరిరోజున కూడా చేస్తారు. ఈసారి ఒంటినిండా ఎరుపురంగు పులుముకుంటారు. ఇప్పుడిక ఏ ఆడపిల్లా భయంతో ఏడవడు. చివరిసారి బుట్ట తెరచి అందులోని వస్తువులను చూపించమని న్యంబుత్సిని బతిమాలతారు. ఆమె అలాగే చేస్తుంది. ఆ వస్తువుల చుట్టూ వాళ్ళు ఆనందంతో చప్పట్లు చరుస్తూ, పాట పాడుతూ నృత్యం చేస్తారు. ఆ పాట శిశువులను ఆహ్వానిస్తున్నట్టు  ఉంటుంది.

శిక్షణ అయిపోతుంది. న్యంబుత్సి తన బుట్ట సర్దుకుంటుంది. ఆడపిల్లలు ఇంటికి చేరుకుంటారు. తమ ఒంటి మీది అలంకరణలను తీసేస్తారు. తల్లి ఎంతో మురిపెంగా వాటిని తీసుకెళ్లి ఒక రహస్యప్రదేశంలో దాస్తుంది.

ఆదిమసమాజాల్లో నిర్బంధ లైంగిక విద్య ఉండేదని ఈ తంతు చెబుతోంది.

మిగతా విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం 

 

 

Download PDF

15 Comments

  • తంతులు కేవలం తంతులే గాక చరిత్ర వాహకాలని తెలుసుకున్నాక వాటిమీద గౌరవం కలుగుతోంది.

    ఏదో తూర్పుదేశంలో ఆడవాళ్ళకే తెలిసిన ప్రత్యేకమైన భాష వుందని విన్నాను.

    • కల్లూరి భాస్కరం says:

      నిజమే ప్రసాద్ గారూ…తంతులు చరిత్ర వాహకాలన్న సంగతి చరిత్ర తెలిస్తేనే తెలుస్తుంది. అప్పుడు వాటిని తటస్థ దృష్టినుంచి చూడగలుగుతాం. విషాదం ఏమిటంటే, మనకు ఉన్న చరిత్రకు కూడా మసి పూయడం మీదే తప్ప చరిత్ర మీద ఆసక్తి, ఖాతరు లేవనిపిస్తుంది. బహుశా ఇది మన ఒక్కళ్ళ ప్రత్యేకతే అనిపిస్తుంది.

  • ch v prabhakar rao says:

    ఈ మీ వ్యాసం చాల బాగుంది. పెళ్లి అంటే నే ఆచారాల వ్యవహారాల పరస్పర మార్పిడి. ఇందులోని అనేకానేక విషయాలు మరుగున పడిపోయి, రోడ్డుమీద డాన్సులు బోజనాలు ముందుకువచ్చాయి.
    పెళ్లి తంతులో బొమ్మ పాత్ర చాల ఉంది. తెలంగాణా ప్రాంతంలో ముక్యం గా కరీంనగర్ నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో -పెళ్లి తరువాత నాగవెల్లి సందర్బంగా పెళ్లి కూతురు అందరి దగ్గర వీడుకోలు తీసుకొని వెళ్ళే మెండు ఒక చీర తో ఉయ్యాల కట్టి అందులో బొమ్మను వేసి జోల పాట ను పాడి అందరి ఆశిస్సులు తీసుకోవడం ఒక సాంప్రదాయం. ఆ బొమ్మాను అన్ని పీలి వస్తువులలాగానే అందం గా అలంకరించి తయారు చేయడం లో ఆడపెళ్ళివారు ప్రత్యెక శ్రద్ధ చూపుతారు.
    నాగవెల్లి సందర్బంగా పెళ్ళికూతురు – ఆమె కుటుంబ సభ్యులు,ఆమె తరఫు బందువులు పడిన బాదను, పెళ్ళికూతురు తమను విడిచి పోతుందనే బాదను మరిచిపోయి, ఏంటో వేడుకగా బొమ్మను తోట్లేలో వేసే కార్యక్రమాన్ని జరిపిస్తారు.
    ఈ వేగవంతమైన జీవితాల్లో పెళ్లి తంతే ఒక తప్పని సరి క్రియలా మారిపోయింది. పెళ్లి అంటే షాపింగ్ లు నగలు కొనడం బట్టల డిజైన్ లుచేయాడం లా మారి పోయింది. గంటల తరబడి క్ప్రయానం చేసి వచ్చే బందువులు స్నేహితులు పెళ్లి జరిగే గంట సేపు కూర్చోవడానికి సిద్దంగా ఉండరు. మొహుర్తానికి పదినిశాల ముందు రావడం భోజనం చేసి పోవడం ఇప్పటి ఆచారం అయింది. పెళ్లి ఇంటివారికైనా పెళ్లి ప్రక్రియపై ఆసక్తి ఉంటుందా అంటే వారికి లేదు. పెళ్లి ఒక ఆడంబరంగా జరిపే హోదాకు గుర్తుగా మారిందే తప్ప రెండు మనసులను రండు కుటుంబాలను కలిపి నూతన ప్రపంచ సృష్టికి జరిగే అంకురార్పణ అనెఅ విషయాన్ని మరచిపోయి అన్ని పెల్ తంతు లను మూడనమ్మకాలుగా భావించే జాఢ్యమ్ వచ్చింది.
    దీని కి కారణం తెలిసి తెలియకే తప్పుడు వ్యాఖ్యాన్నలు చేసే కుహనా మేధావులు.పెళ్ళే కాదు మన సమాజం లో ఎ పండగయినా ఎ ఆచారం అయినా ముందుగా జీవితానికి పనికివచ్చే లేదా జీవితంలో ఉపయోగపడే లేదా చేయబోయే లేదా ఎదుర్కొన బోఎస్ పరిస్తితులకు అనుగుణంగా మనిషిని తయారుచేయడానికి వీలుగా ఉన్నాయి, ఉండేవి.
    మంచి చరిత్ర వారసత్వంగా వస్తుంది వచ్చింది. కాని మనలోని దురహంకారం లేదా మరేదన్నా కాని గతాన్ని లేల్సి తెలియక తప్పుడు పద్దతులుగా మూర్ఖంగా అన్చానావేస్తూ, పక్కకు పెడుతున్నారు.
    సైన్స్ అబివృద్ది చెందుతున్న దశలో, చరిత్రను ఆనతి వారి అభిప్రాయాలను లిఖించి ప్రచారం చేసే పరిస్తితులు లేనందున వాటిని మౌఖికంగా ఒకరినుని ఒకరికి ఆచారాల రూపం లో వారసత్వంగా అందించారు. కాటిన గోడలు కూలగొట్టి పెంకులు ఎరుకోన్నాట్లుగా ఉంది ఇప్పటి పరిస్తితి. కొంతమంది సాంప్రదాయవాదులు అన్నింటిని బ్రహ్మనీకరిస్తూ పోతుంటే, గ్రామీణ శ్రామికుల ఆచారాలకు పూజా విదానాలకు మంత్రాలు తంత్రాలు వచ్చి చేరుతునాయి. గ్రామీణ ప్రాంతంలో (ఇప్పుడు నగరాలలో కూడా)
    గ్రామదేవతలకు చేసే పూజలకు కూడా మంత్రాలు మంత్రం పుష్పాలు వచ్చి చేరి బ్రాహ్మణా పూజారుల చేతిలోకి ఆ వ్యవస్థ చేరిపోయింది.
    గ్రామ దేవతలు లేదా అడిదేవతలైనా పోచమ్మ మైసమ్మ లను కూడా పార్వతి లక్ష్మి దేవి అవతారాలను చేసి వాటి అసలైన వారసులను వారి ఆచారాలను కాలరాస్తుంటే మన ఆచాలరలోని సంప్రదాయాని, అందులోని జీవ్విత తాత్వికతను ఎవరు అర్థం చేసుకోవాలి.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు ప్రభాకర్ రావు గారూ…ఒకనాటి పెళ్లి తంతు యథాతథంగా ఇప్పుడూ అమలు జరగాలని భావించలేము కానీ ఆ తంతును చరిత్ర కోణం నుంచి చూడడం వల్ల కొన్ని అపోహలకు అవకాశం ఉండదు. గ్రామదేవతల విషయంలో మీరు చెప్పినది నిజం.

  • Thirupalu says:

    గ్రామదేవతలను బ్రాహ్మనీకరించడమంటే వైవిధ్యమున్న సంస్కృతిని హిందుకీరించడం అన్న మాట. ఇది రాజకీయ ఏకీకృతం కోసం అఖండం లో భాగంగా జరుగుతున్నదే.

    • కల్లూరి భాస్కరం says:

      అవును. బ్రాహ్మణీకరణ, లేదా సంస్కృతీకరణ ఒక నిరంతర ప్రక్రియ. అది పరస్పర అంగీకారంతో జరిగేది కూడా.

  • మీరు చెప్పింది అక్షరాలా నిజం భాస్కరం గారు… ఏదయినా సంస్కృతి వేల సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రయాణించాలంటే దానికి స్త్రీ సహకారం ఖచ్చితంగా కావాలి. స్త్రీల సహకారం లేని సంస్కృతులు కాల గర్భలో కలిసిపోతాయి. మధ్య యుగాల్లో పాశ్చాత్య దేశాల్లోను, ఇస్లామిక్ దేశాల్లోనూ, స్త్రీలనే టార్గెట్ చేసింది ఎందుకంటే, పురాతన ఆచారాలు పూర్తిగా సమసిపోవాలంటే, వాటికి సజీవ వాహకాలయిన స్త్రీలని రూపుమాపాలి. ఆ విధంగా సాగిందే “విచ్ హంట్” (మంత్రగత్తెల వేట). కొన్ని లక్షల మంది పురాతన ప్రకృతి మతాన్ని ఆరాధించే, ఆచరించే స్త్రీలని మంత్రగత్తెలనే నెపంతో అత్యంత కృరంగా వేటాడారు. ఇప్పుడు భారత దేశం వంతు వచ్చింది. కాకపోతే, వారిని కపట మోసంతో తమ సంస్కృతికి దూరం చేస్తున్నారు. మీ వ్యాసం ఎంతో విలువయిన సమాచారం ఇచ్చింది, ఆలోచింపచేసింది.. కృతజ్ఞతలు.

    • కల్లూరి భాస్కరం says:

      నిజం జగదీశ్ రెడ్డి గారూ…ధన్యవాదాలు

  • P Mohan says:

    ”ఉమ్మనీటితోపాటు పసికందునూ పారబోసినట్టుగా మతవిశ్వాసంతోపాటు సంస్కృతినీ పారబోస్తున్నామా?..”
    చాలా లోతుగా చర్చించాలిసిన విషయం. అసలు సంస్కృతి అంటే ఏమిటి అన్నదానిపైనే బోలెడు వివాదాలు. మతం, సంస్కృతి కలగలసిన ఈ దేశంలో మతానికి అతీతంగా సంస్కృతి మనుగడ సాగించలదా?

    • కల్లూరి భాస్కరం says:

      అవును మోహన్ గారూ…ఇది లోతుగా చర్చించాల్సిన విషయమే. కొన్నింటికి వెంటనే సమాధానం దొరకదు. అసలు దొరక్కపోవచ్చు కూడా. ఇది కూడా అలాంటిదే కావచ్చు.

  • padma says:

    సర్,
    అసలు స్త్రీ ప్రపంచం రహస్యంగా ఎందుకుండాలి?
    మీరు ఎంతో స్థూలంగా వివరించిన బొమ్మ తంతు మహిళలకు ఏ సంకేతాన్నిస్తోంది?
    పెళ్లికి ముందునుండే, మాతృత్వం బాధ్యత నీపై ఉంటుదనే హెచ్చరికగానే నాకు కనిపిస్తోంది.
    అంతకన్నా మహిళలను కొత్త జీవితంలోకి మానసికంగా, శారీరకంగా ఏ రకంగానూ అది సంసిద్ధం చేస్తున్న సంకేతాలు లేవు.
    గిరిజన తెగల్లోనో, లేదా మనం చెప్పే నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న జనమసమూహాల్లోని మహిళలు మాత్రమే కొంతమేరకైనా నిర్భయంగా బతికారేమోననిస్తుంది. మహిళల జీవితం రహస్యంగా, వారి శరీరాల్లో జరిగే పరిణామాలు మాంత్రికంగా ఉండడం సరైంది కాదేమోననిపిస్తోంది. ఒకే ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్లలతో సమానంగా, ఆ ఇంట్లో మగపిల్లలకు కూడా ఆ జ్నానం అవసరమనిపిస్తుంది.

    • కల్లూరి భాస్కరం says:

      “అసలు స్త్రీ ప్రపంచం రహస్యంగా ఎందుకుండాలి?”

      అవును పద్మగారూ…మీ ప్రశ్న సహేతుకమైనదే. ప్రకృతిని నిగూఢమైందిగా, మాంత్రికమైందిగా చూసిన పురా కాలంనాటి నుంచి వస్తున్న తంతులవి. స్త్రీ జీవితం రహస్యం కావడానికి అదే కారణం. ఇప్పటి అవగాహన వేరు.

  • Thirupalu says:

    //అసలు స్త్రీ ప్రపంచం రహస్యంగా ఎందుకుండాలి?//
    మంచి ప్రశ్న సందించారు పద్మ గారు, ఈ పోష్టు మీద ఒక్క మహిల కాడా స్పందిచక పోవడం ఆశ్చర్యమనిపించింది.

  • padma says:

    మాతృస్వామ్య వ్యవస్థ రద్దయ్యాకే, మహిళలు అణచివేతకు గురవడం మొదలైంది. ఆ తరువాత కాలమంతా పురుషాధిపత్యమే కొనసాగుతోంది. అందుకే స్త్రీ ప్రపంచాన్ని రహస్యంగా ఉంచాలని లిఖితంగానో, మౌఖికంగానో, మరో రూపంలోనో కొనసాగేలా చేస్తోంది పురుషస్వామ్యమే. అందుకే స్త్రీ కి అటువంటి స్థితికి పరిమితం చేసారు. అందుకే మీరు చెప్పే ఆచారాలు కొనసాగించాల్సిన అవసరం లేదని, వాటిని వారసత్వ సంపదగా ఈ తరం భుజాల మీద మోయాల్సిన పనిలేదని నా బలమైన ఫీలింగ్.

    • కల్లూరి భాస్కరం says:

      ప్రతి తరమూ ఆచారాలను తిరగరాస్తూనే ఉంటుంది. అనవసర మనుకున్నవి రద్దైపోతాయి. అది నిరంతర సంఘర్షణ. ధన్యవాదాలు పద్మగారూ…

Leave a Reply to Jagadeesh Reddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)