“ఆ శ్రీశ్రీ పద్యంలో ఉన్నది నేనే అనిపించేది”

images

కార్టూనిష్టు శంకర్ కుంచెలో శ్రీశ్రీ

 

“శ్రీశ్రీగురించి ఎందుకు రాయాలనుకుంటున్నావు?”

“అడిగారు కనక”.

“ఎందరో రాయమన్నవి నువ్వు రాయలేనన్నావు గతంలో. ఇప్పుడు?”.

“శ్రీశ్రీ కనక. దాదాపు ఎన్నడూ రాయలేదు కనక.”

“ఆయనగురించి అనేకమంది రాసారు. ఆయన కవిత్వం పట్టుకున్నవారు కవిత్వం గురించి రాసారు. వారిలో వ్యక్తిగతంగా దగ్గరైన వారు తమ సాన్నిహిత్యాన్నిచెప్పుకున్నారు, వ్యక్తిగా శ్రీశ్రీ గురించీ చెప్పారు. ఇంతమంది చెప్పాక నువ్వు కొత్తగా చెప్పటానికేముంది? ”

“రోజూ తిన్న అన్నమే తినుట ఏల? అందరూ పూజించు రామచంద్రమూర్తినే పూజించుట ఏల? అన్న ధోరణిలో విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం రాయటానికి కారణం చెప్పారు. 1910లో పుట్టి 1940ల నాటికి తన కవిత్వానికీ తనకీ ఆరాధకులను తయారు చేసుకున్నారు శ్రీశ్రీ. ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే దాదాపు నాలుగు తరాల యువకులను ఆయన కవిత్వం పట్టుకుంది. కమ్యూనిజం వైపు వారిని నెట్టింది. ఇంతమందిలో నేనొకడిని. నా అనుభూతులని కూడా చెప్పుకోటం కన్న ఏం చెపుతాను.”

“అంటే నీగురించి నువ్వు చెప్పుకుంటావన్నమాట. ”

“ఒక విధంగా అంతే. ఏ వ్యక్తిగత అనుభవంలోనన్నా, అనుభూతిలోనన్నా సామాజిక అంశ కొంత ఉంటుంది. దానిమీద నేను దృష్టిపెట్టి, చదువరుల దృష్టిపడేలా ప్రయత్నిస్తాను. పోతే- శ్రీశ్రీ నాకేమిటి అన్నదానికి జవాబివ్వటానికి ప్రయత్నిస్తాను.”

“ప్రయత్నించు”.

“ఒక పాఠకునికీ, కవికీ ఉండే సంబంధం అర్ధమయేలా చెప్పాలంటే ధార్మిక నమ్మకాలలో ముఖ్యమైన ఆత్మ అన్న భావనని నేను ఉపయోగిస్తున్నాను. ఆత్మపై నాకున్న విశ్వాస అవిశ్వాసాలను పక్కనుంచి, ఆ భావనను ఉపయోగించుకొంటేనే నాకు సరిగ్గా చెప్పానన్న తృప్తి కలుగుతుంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండి, దానికి చైతన్యం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వం అదే మాదిరి నా సమస్త స్పందనలనూ జీవంతో, చైతన్యంతో, కదలికతో నింపుతున్నదని అనుకుంటున్నాను. అందుకే శ్రీశ్రీ నాకు స్వాత్మ్యం.”

“నిన్ను నువ్వు తార్కికుడు అనుకుంటావు గదా?”

“నేను తార్కికుడినే. అయినా కేవలం కవిత్వంతో హృదయం తర్కాతీతమైన అనుభూతిని పొందగలదన్నది నాకు అనుభవమే. అంతకుమించి ఆ అనుభూతికి నేను ఇతర విలువలు ఆపాదించలేను, అర్ధాలు చెప్పను. అలాగే అటువంటి అనుభూతి ఒక మూఢత్వానికీ, పూర్తి దాసోహానికీ దారితీసి పాఠకుడిని క్రియాశీలుడిని చేయటం కూడా కాదనలేని వాస్తవం. అదీ నాకు అనుభవమే. శ్రీశ్రీ కవిత్వంతో క్రియాశీలులు అయిన ఎందరో చేసిన పనులతో తూచితే నేను చేసినది పూర్తిగా వీగిపోతుందనీ నాకు తెలుసు.”

“తార్కికుడు ఒక కవిత్వపు విలువను నిర్ణయించవలసి వస్తే కొన్ని ప్రమాణాలను ఏర్పరుచుకుంటాడు. ఆ ప్రమాణాలకు నిలిచేవీ, నిలవనివీ ఆ కవి కవిత్వ సృజనలోనుంచి గుర్తు పడతాడు. వేరు చేస్తాడు. తరతమాలను నిర్ణయిస్తాడు. ఒకే కాలానికి చెందిన, ఒకే భావజాలానికి చెందిన కవులను బేరీజు వేసేటపుడు అతడు తన ప్రమాణాలకే కట్టుబడతాడు. తనను ప్రభావితం చేసిన మహా కవుల, మహా రచయితల సాహితీ సృజన జాతికి అందించినదేమిటో చెప్పేటపుడు అందులో సమస్త మానవజాతికి కలిగించిన చిరు నష్టాన్నైనా ఉంటే చూడగలుగుతాడు, చూపగలుగుతాడు. ఎక్కిన ఎత్తులను గణించేటపుడు ఎక్కలేకపోయిన ఎత్తులనూ గుణించుతాడు. దిగిన లోతులకు దిగేటపుడు దిగలేకపోయిన లోతులకు కూడా తార్కికుడు దిగుతాడు. అవునా?”

“నిజమే. ఈ నా వ్యాసం పరిధి అంత సమగ్రమైనది కాదు. నేను అంత నిజాయితీగానూ, నిష్పక్షపాతంగానూ ఉండగలిగినా నాకున్న శక్తి చాలా పరిమితమైనది.”

2

“నేను 48లో పుట్టాను. మా కుటుంబంలో ఎవరికీ సాహిత్య వాసన లేదు. మా నాన్నగారు పుస్తకాలు చదివేవారు. 64 నాటికి చాలా పుస్తకాలు చదివాను. ప్రబంధాలు మొదలుకుని అదీ ఇదీ అని లేకుండా చదివాను. వాటిలో సాహిత్యం, చరిత్ర, జనవిజ్ఞానం నాకు ప్రధాన ఆసక్తులు. ఈ చదువులో ఏ సంవత్సరం. ఏ తేదీన శ్రీశ్రీ నాకు తటస్థపడ్డాడో, పడ్డపుడు నా తొలి స్పందనలేమిటో నేను చెప్పలేను. శ్రీమూర్తి అన్నమిత్రునితో నాకు స్పర్ధ ఉండేది. అతను కృష్ణశాస్త్రిని ఆరాధించేవాడు. నేను వేదులని ఆరాధించాను. దీపావళి అప్పట్లో నోటికి వచ్చేది. ..నాకు తలంపు లేదు లలనాజనతాకబరీ భరైక భూషాకలనన్.. అనటం వేదుల సమాజం చింతనగా, దేవులపల్లి మనసారగా ఏడ్వనీరు నన్ను అనటం సమాజ నిరాకరణగా అనిపించే అవకాశం ఉంది. 67 నాటికి చదువు పూర్తయింది. నిరుద్యోగం మొదలయింది. ప్రేమ అన్నది ఉందని, కనక ప్రేమించాలని చదువు చెప్తే, అదంతా కేవలం ఒక భావుక స్వభావం మాత్రమే, అలాంటిది ఉన్నా ఆకలి ముందు నిలవదని నా తర్కం చెప్పేది. ఈ ఘర్షణకీ, శ్రీశ్రీ ప్రభావానికీ సంబంధముందా అని ఇప్పుడు ఆలోచిస్తే లేదనే అనిపిస్తోంది. నాలోని ఈ ఘర్షణ నా జీవుడిని (మౌలిక స్వభావాన్ని) తెలియబరుస్తుంది. ఈ జీవునికి ఖచ్చితంగా అమరిన కవి శ్రీశ్రీ. లోకంలోని ఆకలిని ఒక వాస్తవంగా చూసాడు నా కవి. అదే సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి లోనై ఆ ఉద్వేగం అంతా తన పాఠకునిలో నింపగలిగాడు. నిజానికి ఆకలికీ, అనుభూతి తీవ్రతకీ చుక్కెదురు. నాదీ అదే పరిస్తితి. నాలో రెండూ ఉన్నాయి. అందుకే శ్రీశ్రీని నా స్వాత్మ్యం అనాలనిపిస్తోంది. మరికొంచెం ఆలోచిస్తే ఒక ప్రశ్న ఎదురవుతుంది”.

“ఏమిటది?”

“రాతిని కూడా గానం కరిగించగలదని అంటారు గాని అది సాధ్యమా? ఆ ఊహ కమ్మగా ఉంటుంది. అది గానం యొక్క గొప్పతనాన్ని అందంగా చెపుతుంది. కరగటానికి కరిగే లక్షణం కూడా అవసరం.”

“అది నీ ప్రత్యేక లక్షణమంటావు.”

“నాది అనుకోను. అది మానవజాతిలో సర్వే సర్వత్రా కనిపిస్తుంది.”

“శ్రీశ్రీతో నీకు విభేదం లేదంటావు”.

“అనను. ఇది విభేదం అనీ అనలేను. దీనికి చాలా వివరణ అవసరం. కవిత్వానికి ఛందస్సు, మాత్ర, లయ ఉంటాయి. కవులు ఓ లయను అనుసరిస్తున్నపుడు అది ఓ ఛందస్సును – అంటే కొన్ని గణ నియమాలనూ, కొన్ని వాక్య నియమాలనూ – అనుసరిస్తుంది. అలా ఆది కవులు స్వయంగా ఏర్పరుచుకున్న నియమాలను వర్గీకరణ చేసి, అవి తర్వాతి కవుల ఉపయోగం కోసం అందుబాటులోకి తేగా అది ఛందస్సు అనీ, అలాగే రాయాలని కవులు కానివారు పట్టుబట్టటం జరిగింది. ఇది భావప్రవాహాన్ని అడ్డుకుంటుందంటని శ్రీశ్రీ గొప్ప కవితావేశంలో కవితా ఓ కవితాలో అన్నారు. 68లోనే అని గుర్తు. పస్తులు, నిరుద్యోగాల మధ్య ఓ రాత్రి నేను వృత్త పద్యాలు రాయటం మొదలయింది. ఆ ఆవేశంలో రోజుల తరబడి పద్యాలు. కడుపు చేతబట్టుకుని ఇల్లు వదలి వెళ్లిపోయినపుడు నా దగ్గర ఉన్నది ఈ పద్యాలు, ప్రేమ-ఆకలి మధ్య సంఘర్షణ, శ్రీశ్రీ కవిత్వం.

ఈ బాటసారి పద్యంలో ఉన్నది నేనే అనిపించేది. కలకత్తా ఫుట్పాతులూ, బీహారు- ఒరిస్సా సరిహద్దులలోని గ్రామాలు తిరిగి జబ్బుపడి, చనిపోకుండా ఇంటికి రాగలిగాను. పోతన మీద ఒక మూడొంతుల కావ్యం, వామపక్ష భావాలతో కపోత సందేశం వృత్తాలలో రాసాను. పోతన కావ్యానికి ముందు మాటలుగా ఛందస్సును శృంఖలాలుగా భావించిన శ్రీశ్రీ అనుభవం గురించి చాలా ఆలోచన నడిచింది. ఛందస్సు వల్ల భావం ఉధృతి(force)ని కోల్పోతుందా పొందుతుందా అన్న చర్చ అనేక పుటలలో సాగింది. హృదయంలో భావాన్ని కవి అక్షరబద్ధం చేస్తాడు. ఈ భావంలో అవేశముంటే అది ఛందస్సు అనే పిచికారీ వల్ల మరింత ఉధృతితో పాఠకుడిని తాకుతుంది అన్నది ఆనాటి నా చర్చ ప్రధానాంశం. అక్షరంలో శబ్దం ఉంటుంది. అక్షరాల కూర్పులో శబ్ద విన్యాసం ఉంటుంది. అది భావావేశాన్ని మరింత గట్టిగా పఠితనూ, శ్రోతనూ కదిలిస్తుందన్నది మరో అంశం. ఇది మన పూర్వకవులు పలికి చూపించారు.  కవి శక్తిహీనుడైతే వచన పద్యాలలోనైనా కవిత్వం పలుకుతుందా? ఉధృతి వస్తుందా? అది మరో ఆలోచన.”

“నువ్వు రాసిన పద్యాలలో అలాంటి కవిత్వం, ఉధృతి ఉన్నాయంటావా? ”

” మారుమూల వృత్తాలు, గర్భకవిత్వం(పద్యంలో పద్యం) వంటి సర్కసు పద్యాలతో సహా అన్ని వృత్తాలూ, ఉదాహరణకి కవిరాజ విరాజితం, స్రగ్ధర, మహాస్రగ్ధర, మాలిని వంటి ఎన్నో, రాసాను. కోకిల రామాయణం పేరుతో మత్తకోకిల, తరళాలతో ఫోతన చెప్పినట్లు రామాయణం రాసాను. గోదావరి జిల్లా యాసలో సీసపద్యాలతో ముసురు అన్నపేరిట వ్యవసాయం గురించి కొన్ని రాసాను. ఇలా నేను రాసినవి పద్యాలేగాని కవిత్వమని ఎన్నడూ అనిపించలేదు. వచన పద్యాలు కూడా రాసాను. వాటిల్లో ఏదో కొంత తృప్తి ఉండేది.”

“శ్రీశ్రీ అభిప్రాయంతో ఏకీభవించానంటావు?”

“చెప్పలేను. వస్తువు పట్ల ఆవేశం, అభివ్యక్తి ఉన్నవారికి ఛందో నియమాలు వదిలెయ్యటం వల్ల కొంత వెసులుబాటు కలిగిన మాట వాస్తవం. మన నిచ్చెన మెట్ల సమాజంలో దేనికీ స్వచ్ఛత లేదు. స్పష్టత లేదు. కవిత్వం తీరికవర్గాల విలాసాలకు, వినోదాలకు ఎక్కువగా వినియోగపడింది. అంతేగాక, అది సామాన్య జనానికి అందని ఏదో పూర్వజన్మ సంస్కారఫలంగా, కవులు అసాధారణ వ్యక్తులుగా అనేక ఊహలు, వదంతులు చెలామణీలో ఉండేవి. “హయమట సీత” అంటూ ఆరింట త అక్షరం ఉంచి పద్యం చెపితే శత్రువు చనిపోయాడు వంటి కథలు ఉండేవి. ఈ రహస్యమయ అసాధారణ స్థానం నుంచి కవిత్వాన్ని అందరికీ అందేదిగా చేసిన గురజాడ, శ్రీశ్రీలను అంగీకరించకుండా ఎలా ఉండగలం? అదే సమయంలో పొట్టి, పొడుగు వాక్యాలతో, ఏ ఆవేశంగాని, వైచిత్రిగాని, రామణీయకత గాని లేని రాతలను పద్యాలుగా, అందులో కవిత్వం ఉందని నమ్మించజూచే వత్తాసు వ్యాసాలతో తెలుగు భాషలో ఒకప్పటి పేరుతో చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకునే లబ్ద ప్రతిష్టులూ, అమాయకులూ, సరైన మార్గదర్శకత్వం లేని కుర్రవాళ్లూ రాసేవి కంటబడినపుడు శ్రీశ్రీ పొరపడ్డాడా అనిపిస్తూనే ఉంటుంది.”

“మహాప్రస్థానంలో నీకు ఇష్టమైన కవిత?”

“రాత్రింబవళ్లు శ్రీశ్రీ, మనసు బాగుంటే శ్రీశ్రీ, ఓగుంటే శ్రీశ్రీ అన్నట్లు ఉండేది. కర్తవ్యం గురించి ఆలోచిస్తే జయభేరి, కవిత్వం గురించి ఆలోచిస్తే కవితా ఓ కవితా, కమ్యూనిజం గురించి ఆలోచిస్తే మహాప్రస్థానం, జీవిత మౌలిక లక్ష్యాలగురించి వెదుకుతుంటే శైశవగీతి, మానవజాతి గురించి ఆలోచిస్తుంటే మానవుడా ఇలా అనేకం నన్ను నడిపించాయి.”

CM24VIDU_2287311e

“శ్రీశ్రీతో వ్యక్తిగత పరిచయం ఉందా?”

“దాని గురించి చెప్పేముందు నా రచనలతో శ్రీశ్రీ గురించి చెపుతాను. ఋక్కులు తొమ్మిది పేర్లతో వారం పదిరోజులలో కథలు రాసాను. అందులో ఓ కథ రొట్టెముక్క. దానిని నా భార్య సాఫుచేసి పంపటం అది బహుమతి పొంది ప్రదురించబడటంతో నాకు తెలిసి నా ప్రచురణ పర్వం మొదలయింది. ఆ తొమ్మిది కథలూ వివిధ పత్రికలలో రావటం నాకు వ్యక్తిగతంగా గొప్ప సంతోషం కలిగింది. ఆ తర్వాత కవిత్వమెక తీరని దాహం(ప్రచురణకి ప్రయత్నించలేదు), ప్రపంచమొక పద్మవ్యూహం కూడా రాసాను. కాక కధలకు పేర్లు వెతుక్కోటానికి మహాప్రస్థానం ఆశ్రయించేవాడిని. ఇంక వ్యక్తిగత జీవితం. నా బిడ్డలకు నిద్రపుచ్చటానికి మహాప్రస్థానం పాడేవాడిని. వాళ్లు బడులలో పాడిన పాటలు శ్రీశ్రీవి. వంగపండు ప్రసాదరావూ, నేనూ షిప్ యార్డ్ లో కలిసి పనిచేసాం. అతని పాటలూ నా పిల్లలు పాడుతుండేవారు. మిత్రుడు అనంతుడు నా సహోద్యోగి. విశాఖ సాహితీ ప్రపంచంతో వ్యక్తిగత పరిచయానికి కారకుడు. వేణుగారు, కృష్ణక్క, ప్రసాద్ గార్ల ఇల్లు విశాఖ మేధోప్రపంచానికి కేంద్రం. దానిలో ప్రవేశమే నాకు అనేకమందిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం కలిగించింది. కాని నాకు పూనుకుని మాటలాడటం పూసుకుని తిరగటం అన్న భావన హెచ్చు. ఫొటోలకు ఎగబడటం అయిష్టం. అడిగితే చెప్పటం, చెప్పిన పని చేతనైన మేరకు చెయ్యటం నా పద్దతి. కవులు, రచయితల సృజనతో పొందే స్ఫూర్తి మీదనే నాకు ఆసక్తి ఉండేది. ఇలాంటి కారణాల వల్ల శ్రీశ్రీని కలిసిన సందర్భాలున్నా చెప్పుకోదగ్గ విషయాలు మాటలాడిన గుర్తులు లేవు. నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో గురజాడ కళా మందిరంలో 74 లో జరిగిన సభ. నా ప్రధమ సంతానం వీరారుణకవితకి ఎనిమిదో నెల. దానిని తీసుకుని నడుచుకుంటూ వెళ్లటం, వంగపండు పాటలు, శ్రీశ్రీ ఉపన్యాసం, ఆ రాత్రివేళ ఆ ఇసుకలో కూర్చుని శ్రీశ్రీ, కాళీపట్నం రామారావులు సభంతా తిరుగుతూ చందాలు వసూలు చేస్తుంటే దగ్గరగా వారిని చూడటం, సభానంతరం మళ్లీ నడుచుకుంటూ రామంతో కలిసి ఆ అనుభూతిని పంచుకోటం… ఒకమారు శ్రీశ్రీని స్టేషనుకి వెళ్లి తీసుకుని వస్తుంటే కారులో ఆయన పక్కనే కూర్చుంటే కారు తలుపులో నా చెయ్యి పడింది. అయ్యో అంటూ నా చెయ్యిని పట్టుకుని ఊదారు. ఇలాంటి చిన్ని చిన్ని సంఘటనలు వ్యక్తిగత పరిచయం కిందకి వస్తే ఉన్నట్టే అని చెప్పాలి”

“ఇంకా చెప్పుకోవలసినది ఏమైనా ఉందా?”

“ఉంది. అది నా ఆలోచనా ప్రపంచంలో శ్రీశ్రీ. కవిత్వమంటే ఏమిటి అన్నది చాలా చిక్కు ప్రశ్న. ఈ ప్రశ్న కలిగిన సందర్భాలన్నీ శ్రీశ్రీని చదివినపుడే కలిగాయి. జవాబు ఇచ్చుకోవాలనిపించినపుడు ఉదాహరణలు అన్నీ మహాప్రస్థానం నుంచే వెదుక్కున్నాను. ఈ ప్రశ్నకి శతాబ్దాలుగా జవాబివ్వటానికి మానవజాతి ప్రయత్నించింది. క్రిస్టఫర్ కాడ్వెల్ చేసిన చర్చ నాకు తృప్తి కలిగించింది. అతని చర్చ మానవ జాతి ప్రస్థానంలో కవిత్వం పుట్టుక చుట్టూ తిరుగుతుంది. అయితే కవిత్వ నిర్వచనానికి అది అంతగా సహాయపడదు.”

“ఆ నిర్వచన మేదో నీకు లభించిందా?”

“లేదు. కవిత్వ సృజన ఒక ప్రత్యేక శక్తి అనీ, అలాగే కవితాస్వాదన కూడా వ్యక్తి ప్రత్యేక శక్తి అనీ ఒక భావన ప్రముఖంగా ఉంది. రెంటికీ సాధన, అభ్యాసం అవసరమన్న ఊహ కూడా ఉంది. అంటే వ్యక్తులకు ఉండే ఒక ప్రత్యేక శక్తి గానో, ఆసక్తి గానో ఒక వివరణ ఉంది. ఈ శక్తులని మన సాంప్రదాయ భావనలలో రససిద్ధీ, సహృదయ భావనలతో వివరించవచ్చు. అయితే ఈ వివరణ అటుతిరిగీ, ఇటుతిరిగీ భగవద్దత్తంగా, జన్మ సంస్కార ఫలంగా, ఒక మానవాతీత వ్యవహారంగా కవిత్వాన్నీ, కవిత్వాస్వాదననూ విస్తరించటం గమనించినపుడు దీనిని నేను అంగీకరించలేను. జనచైతన్యానికి కవి నిలవాలని, కవిత్వం నిలుస్తుందనీ సంఘాభ్యుదయ కాముకులు అంటారు. సమాజం పరిపక్వమౌతున్న దశలో, అంటే మార్పులకు సిద్ధమౌతున్న దశలో, అది “కవి” రూపంలో “కవిత్వం”గా తనను తను ఆవిష్కరించుకుంటుందనేది వారి వివరణ. ఇది కవిని సమూహంలో భాగంగా, కవిత్వాన్ని సమూహ వ్యక్తీకరణ రూపంగా చూస్తుంది. ఈ వివరణతో నాకు చాలావరకూ ఏకీభావం ఉంది. అయితే ఈ వివరణ కూడా కవిత్వాన్ని కొంతవరకూ ఒక ప్రత్యేక వ్యవహారంగానే చూస్తుంది. కవితాస్వాదకులు ప్రత్యేక వ్యక్తులుగా వారి వినియోగానికి మాత్రమే కవిత్వం అన్న నిర్ణయానికి చేర్చే వాదనను నేను ఒప్పుకోలేను. అలాంటి ప్రత్యేక శక్తి నాకు ఏమాత్రం లేదు. బహుశా అందువల్ల కవిత్వ నిర్వచనం నాకు దొరకలేదు.”

“నీకింకా కవిత్వ నిర్వచనం మీద అన్వేషణ ఉంది.”

“ఉంది. కవిత్వంలో ఆధునిక దశపై కొన్ని ఆలోచనలు ఈ అన్వేషణలో కలిగాయి. కవిలో “అసంకల్పితంగా” ఉన్న సామాజిక బాధ్యత “సంకల్పితం” కావటం ఈ దశకి ఆరంభం. జంటపక్షుల వియోగం వాల్మీకిని కదలించి రామాయణానికి కారణం అయిందట. కవి బాహిర ప్రపంచంలోని ఒక ఘటన అతని అంతఃప్రపంచాన్ని కుదిపివేసినపుడు, ఆ కుదుపుని అతను బాహిరప్రపంచంతో పంచుకోజూస్తాడు. ఇందులో ఆ కుదుపు, ఆ వియోగం కలిగించిన దఃఖం, దాన్ని పంచుకోవాలన్న ఆవేశం అన్న మూడు దశలు కనిపిస్తాయి. ఈ మూడూ “అసంకల్పితం” కావటం మనం గమనించవచ్చు. ఆధునిక కవిత్వ దశలోనూ ఈ మూడు దశలూ ఉంటాయి. అయితే కవి చైతన్యం పూర్తిగా అతని అంతఃనిర్మాణానికి పరిమితమైనది కాదు. బాహిర ప్రపంచ ఘటనలు కవి వశంలో ఎన్నడూ ఉండవు. అయితే ఆతని స్పందనలు ఆతని చైతన్యం మీద, ఎఱుక మీదా ఆధారపడే అవకాశం ఉంది. పక్షులు విడిపోవటం బాధాకరం కాటానికి అది బాధాకరమన్న ఎఱుక అవసరం లేకపోవచ్చు. పేదరికం, అసమానత అన్నవి బాధాకరం కాటానికి పట్టణంలో బ్రతుకుదామని వెళ్లిన బాటసారికి కలిగిన కష్టం దైవకృతం కాదని, మానవ కృతమేనన్న ఎఱుక అవసరం. అలసిన కన్నులు కాంచేదేమిటో కాంచటానికి ఆ ఎఱుక అవసరం. ఆధునిక దశ బీజాలు ఈ తరహా ఎఱుక పుట్టుకలో ఉన్నాయి. భావ కవిత్వపు వెల్లువకి భగవంతుడిని స్త్రీగా భావించి ఆరాధించే సూఫీతత్వం కన్న స్త్రీ సాంఘిక స్థితి పట్ల సమాజంలో ఉన్న అసమ్మతి ఎక్కువ దోహదపడిందని గమనించవచ్చు. వేమన, గురజాడలకు శ్రీశ్రీ ఇచ్చిన ప్రాధాన్యతను గమనించినపుడు మాత్రమే అతని కవిత్వంలోని మూడు దశలలో రెండవ, మూడవ దశలలోని “సంకల్ప” “అసంకల్ప” అంశాలను విడదీసి చూడవచ్చు. కవి consious, subconsious అవస్తలూ, ఆధునిక కవిత్వ లక్షణాలూ అర్ధం చేసుకోవచ్చు.”

“………..”

“ఆధునిక కవిత్వం అనగానే పాతనంతా – రూపంలో, వస్తువులో – విసర్జించాలన్నది చాలామంది ఆశించే విషయం. ఈ ఆశ ఎంతవరకూ సబబైనది అన్న విషయాన్ని పక్కనుంచి ఎంతవరకూ సాధ్యం అని నేను ఆలోచించాను. కొత్త ఆలోచనలు వ్యక్తి చైతన్య సంబంధి. చటులాలంకారపు మటుమాయల నటనలలో నీరూపం కనరానందున… అంటాడు శ్రీశ్రీ. అలంకారాల ప్రగల్భాలను చూడగలిగాడు కనక ఆ చైతన్యంతో వాటిని తొలగించుకోవాలన్న సంకల్పం సాధ్యం. వ్యాకరణాలను సంకెళ్లుగా, ఛందస్సులను సర్ప పరిష్వంగాలుగా, నిఘంటువులను శ్మశానాలుగా చూడగలిగినపుడు వాటిని వదిలించుకొనే ప్రయత్నం చేయగలుగుతాడు. ఈ సంకెళ్లు అతని బాహిర ప్రపంచం వేసినవి. ఇవేకాక మరికొన్ని సంకెళ్లు లేదా మరికొంత పాత ఉండే ఉండవచ్చు. ఉదాహరణకు నరక లోకపు జాగిలమ్ములు, యముని మహిషపు లోహఘంటలు ధార్మిక కల్పనలు. వీటిని పాత కవులెవరూ శ్రీశ్రీ వాడిన ఉద్దేశ్యంలో వాడే అవకాశం లేదు. అయినా ఇవి పాతను సూచిస్తాయి. ఎవరినైనా తూచాలనుకున్నపుడు ఆ కవి తెంచుకున్న సంకెళ్లను లెక్కించాలా తెంచుకోలేకపోయిన సంకెళ్లను లెక్కించాలా అన్నది నా ప్రశ్న. అలాగే రాసిన అంశాలను చర్చించాలా? రాయని అంశాలను లిస్టించాలా? ఓ కవి అభ్యుదయతను, ఆధునికతనూ, సామాజిక స్పందనలనూ తూచటానికి కూర్చున్నపుడు అతని కవిత్వంలో ఉన్న అంశాలను ఆధారం చేసుకోవాలా? లేని అంశాలను – అవి అప్పటికే బాహిర ప్రపంచంలో ఉన్నాయి గనుక – పరిగణనలోకి తీసుకోవాలా? ప్రజాస్వామిక దృక్పధంతో అన్నీ తీసుకోవచ్చు. కాని అభిశంసన కోసం కూర్చున్నపుడు జరిగేదేమిటో మనకు తెలుసు. ఆ అభిశంసనకి కారణం కవి పట్ల విముఖత, ఆ విముఖతకి కారణం ఆ కవి నిలబడిన విలువల పట్ల అసమ్మతి, అతడు స్వప్నించే మరో ప్రపంచం పట్ల అసహనం అన్నది గమనించవచ్చు. అలాంటపుడు సాధ్యతకి సంబంధించిన ప్రశ్న పుట్టదు. శ్రీశ్రీ గురించి తలెత్తిన వివాదాలను పరిశీలనాత్మకంగా చూసినపుడు ఆయనకి ముందు వేమన, గురజాడ వేసిన కాలిబాటలు ఉండవచ్చు. వాటిని ప్రధాన రాచమార్గాలుగా మలచటంలో శ్రీశ్రీ కవిత్వం వహించిన పాత్ర ఒక యుగకవిగా ఆయనను నిలబెడుతుంది.   కవిత్వ నిర్వచన అన్వేషణలో ఇవీ నేను గట్టిగా ఆలోచించిన విషయాలు.”

“చివరగా?”

“విశ్వమానవ భావన తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అందించిన మహత్తర కానుక. అది తెలుగు సాహిత్యం మానవ జాతి సాహిత్యం కావటానికి దోవలు తెరిచింది. తానొక అణువునన్న గుర్తింపు మానపుడిని ఏకం చేసి అనంత విశ్వంలో భాగం చేస్తుంది. నామటుకు నాకు ఈ పెను సత్యం రవ్వంతైనా అందటానికి కారకుడు శ్రీశ్రీ.”

 -వివిన మూర్తి

vivina murthy

Download PDF

6 Comments

  • bhavani says:

    శ్రీ శ్రీ గారి గురించీ , కవిత్వం గురించీ చాలా బాగా చెప్పారు సర్ , ధన్యవాదాలు

  • amarendra says:

    ఒక్క వివిన మూర్తే రాయగల రచన ఇది ..ఎన్ని ఆలోచనలో..ఇప్పటికీ శ్రీ శ్రీ ఒక తీరని దాహం ..తీరగూడని దాహం ..

  • Manam.Venkata Vijaya Kumar says:

    శ్రీ శ్రీ గురించి నేను చెప్పడం తగదు! ఎందుకంటే … నాకు.చదవడమే …తప్ప….చెప్పడం..రాదు.. కాబట్టి !…అయన Latham చల్ల వరకు చదివా !…అది నా py

    • Manam.Venkata Vijaya Kumar says:

      శ్రీ శ్రీ కవిత్వం మానవత్వాన్ని మేలుకోలుపుతుంది !…..మనిషి గా బ్రతకమని చెబుతుంది!….అదే నేను తెలుసుకుంది !..జీవన గమనం లో ఆచరిస్తుంది!…అందువల్ల కష్టాల్,నష్టాల్,పాపాల్,శాపాల్ రానీ…రానీ…కవీ…పవీ ….అనుకుంటూ …అనుభవిస్తూ …అధిగమిస్తూ …బండి …లాగిస్తున్నా!…..మిత్రులారా !..నోట్ : పై పోస్ట్ తప్పులోచాయి !..విస్మరించండి

  • మృత్యుంజయరావు says:

    ఒక్క పడికట్టు పదం లేకుండా, గాఢమైన ఆలోచనల్లోంచి పుట్టే ఇలాంటి విమర్శను నేనింతకు ముందు చదవలేదు. శ్రీ శ్రీ స్వాత్మ్యం కావడం వల్లనే వివిన మూర్తి గారికి ఇది సాధ్యపడిందని అనుకుంటాను. కవిత్వ పరంగా శ్రీ శ్రీ శబ్దాధికారిగానో కాకుంటే వామపక్ష సామ్యవాదిగానో మాత్రమే చాలా మందికి తెలుసు. ఆయన ఆత్మిక తీవ్రత, ఆయన కవిత్వానికున్న సాంద్రత వివిన మూర్తి గారు చక్కగా విశదం చేశారు. వివిన మూర్తి గారి వ్యాసం లోని ప్రతి అక్షరాన్నీ అత్యంత ప్రియంగా చదువుకున్నాను. దాచుకుంటాను.

    • కల్లూరి భాస్కరం says:

      జీవితంలో ఏ ఉన్మత్త, ఉద్వేగ క్షణాలలోనో కవులు, రచయితలు మనసును పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక జీవిత కాలమంతా వాళ్ళతో జీవిస్తాం. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే అంతకన్నా అపురూపమైనవి లేవనిపిస్తుంది. మీ వ్యాసంలో ఆ మెరుపు, మైమరుపు అంతా నిండిపోయింది వివినమూర్తిగారూ. చాలా సంతోషం.

Leave a Reply to bhavani Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)