కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…

దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత అవసరమైన ఈ పుస్తకాన్ని ఇంత ఆలస్యంగానైనా తెలుగు చేసే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు గొప్ప సంతోషం. ఈ పుస్తకాన్ని మాత్రమే కాక, ఎన్నో ప్రామాణిక గ్రంథాలను భారతీయ భాషలన్నిటిలోకీ అనువదింపజేసే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్న నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, ఆ బాధ్యతను తెలుగులో పంచుకుంటున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ గ్రంథానువాదానికి నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

భారత చరిత్రకు సంబంధించి నిశితమైన ఆలోచనలు చేసి, మూడు పుస్తకాలు, దాదాపు వంద వ్యాసాలు రాసినప్పటికీ దామోదర్ ధర్మానంద్ కోసంబి (31 జూలై 1907 – 29 జూన్ 1966) ప్రాథమికంగా చరిత్రకారుడు కాదు. ఆయన అనేక శాస్త్రశాఖలతో సంబంధం ఉన్న అరుదైన మేధావి. గణితశాస్త్ర అధ్యయనం దగ్గర ప్రారంభించి ఆయన ఎన్ని శాస్త్రాలలో ప్రవేశించారో, ఎన్ని శాస్త్రాలలో మౌలిక ఆలోచనలు చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గణిత శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, జన్యుశాస్త్రం, రేఖాగణితం, నాణాల్ని బట్టి చరిత్రను కనుకొనే పణశాస్త్రం, సాహిత్య విమర్శ, పురాతత్వశాస్త్రం, భారత అధ్యయన శాస్త్రం, రాజకీయార్థిక శాస్త్రం,  చరిత్ర వంటి అనేక శాస్త్రాలలో ఆయన చెరగని ముద్ర వేశారు. మాతృభాష కొంకణితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, పాళీ, ప్రాకృతం, లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ భాషల్లో మూల రచనలు చదివేంత, రచనలు చేసేంత ప్రావీణ్యం సంపాదించారు.

ఆయన తండ్రి ఆచార్య ధర్మానంద్ దామోదర్ కోసంబి బౌద్ధ అధ్యయనాలలో, పాళీ భాషలో నిష్ణాతుడుగా పూనాలోని ఫెర్గూసన్ కాలేజిలో అధ్యాపకుడిగా ఉండేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను అతిథి అధ్యాపకుడిగా, ప్రత్యేక ప్రణాళికల సభ్యుడిగా మూడు వేరువేరు సందర్భాలలో ఆహ్వానించింది. అలా తండ్రి రెండవసారి హార్వర్డ్ వెళ్లినప్పుడు ఆయన వెంట దామోదర్ కోసంబి తన పదకొండో ఏట హార్వర్డ్ కు వెళ్లి ఉన్నత పాఠశాల విద్య అక్కడే అభ్యసించారు. తర్వాత తండ్రి భారతదేశానికి వచ్చినప్పటికీ దామోదర్ కోసంబి కళాశాల విద్య కోసం అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని 1929లో భారతదేశానికి తిరిగివచ్చి మొదట బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు, తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పని చేశారు. తన తండ్రి పనిచేసిన పూనా ఫెర్గూసన్ కాలేజిలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా 1933లో చేరి, పద్నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆతర్వాత, 1946లో అప్పుడే ప్రారంభించిన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమి భాభా ఆహ్వానంతో అక్కడ శాస్త్రవేత్తగా చేరారు గాని అణుశక్తి వంటి శాస్త్ర విషయాలలోనూ, నెహ్రూ విధానాల వంటి రాజకీయాంశాలలోనూ భాభాతో విభేదాల వల్ల 1962లో ఆ పదవి వదులుకున్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ 1964లో ఇచ్చిన సైంటిస్ట్ ఎమెరిటస్ గుర్తింపుతో పూనాలో తానే స్వయంగా మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రారంభించారు. ఖడక్ వస్లా లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఆర్కియలాజికల్ సొసైటీ స్థాపించారు. యాభైతొమ్మిదో ఏట, 1966 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. దాదాపు 1920ల నుంచీ రచనలు చేస్తూ అనేక రంగాలలో వందలాది వ్యాసాలు రాసినప్పటికీ ఆయన జీవితకాలంలో ప్రచురితమైనవి చరిత్ర మీద రెండు పుస్తకాలు మాత్రమే.

కోసంబి మేధో పరిణామం, ఆయన ఒక్కొక్క శాస్త్రంలోకీ విస్తరించిన తీరు, చివరిదాకా ఆయనలో సాగిన అన్వేషణా తపన ఆశ్చర్యపరుస్తాయి. స్టెప్స్ ఇన్ సైన్స్ అనే పాక్షిక ఆత్మకథాత్మక వ్యాసంలో తాను ఏయే శాస్త్ర రంగాలలోకి ఎలా ప్రవేశించవలసి వచ్చిందో ఆయనే చెప్పుకున్నారు. అది చూస్తే యూరప్ లో పునరుజ్జీవన యుగంలో సకల శాస్త్రాలలో ప్రవేశించిన వ్యక్తులు, ‘సమస్త జ్ఞానాన్నీ నా పరిధిలోకి తీసుకున్నాను’ అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నట్టు అనగల వ్యక్తులు గుర్తుకొస్తారు. “కోసంబిని చాల తరచుగా మహామేధావిగా, ‘పునరుజ్జీవన యుగపు వ్యక్తి’ గా, అసాధారణమైన మేధో మూర్తిగా వర్ణిస్తూ ఉంటారు. ఆయనను సన్నిహితంగా చూసి ఉండకపోతే అటువంటి మనిషి ఉండగలడని నేను నమ్మేదాన్ని కాదు” అని ఆయన కూతురు మీరా కోసంబి ఆయన శతజయంతి సందర్భంగా ఆయన వ్యక్తిగత, సామాజిక, మేధో జీవితం గురించి రాసిన వివరమైన వ్యాసంలో అన్నారు.

గణితశాస్త్రం కచ్చితమైన శాస్త్రమనీ, అది ప్రకృతి భాష అనీ, తనను అది సమ్మోహపరిచిందనీ ఆయనే చెప్పుకున్నారు. ఆయన తొలి ఆలోచనలు, పరిశోధనలు, రచనలు గణితశాస్త్రంలో, ప్రత్యేకించి టెన్సర్ అనాలిసిస్ పాథ్ జామెట్రీ వంటి రంగాలలో సాగాయి. ఆ క్రమంలోనే ఆయన 1943లో జన్యు శాస్త్రంలో ప్రవేశించి క్రోమోజోమ్ మాపింగ్ మీద ఒక రచన చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘కోసంబి సూత్రం’ అనేదాన్ని తయారుచేశారు. గణితశాస్త్రం నుంచి సహజమైన కొనసాగింపుగా సంఖ్యాశాస్త్రంలో ప్రవేశించి 1944లో ప్రాపర్ ఆర్థోగొనల్ డికాంపోజిషన్ అనే విశిష్ట సాంకేతిక పద్ధతిని కనిపెట్టారు. ఆ క్రమంలో నాణాల పరిశోధన ప్రారంభించారు. ఏడువేల నాణాలను తాను స్వయంగా తూచానని ఆయనే చెప్పుకున్నారు. ఆ నాణాల తూకం మార్పుల గురించి చేసిన ఆలోచనలతో ఆయన పణశాస్త్రానికి శాస్త్రీయమైన పునాది వేశారు. నాణాలను అవి ముద్రించిన రాజుల కోసమో, వాటి లోహాల కోసమో కాక, వాటి మీద సంతకం చేసిన సమకాలీన సమాజం కోసం అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ఈ నాణాల అధ్యయన క్రమంలోనే ఆయనకు ప్రాచీన చరిత్ర పట్ల, మొత్తంగా చరిత్ర పట్ల ఆసక్తి కలిగింది. అదే మరొకవైపు ప్రాచీన సంస్కృత, పాళీ సాహిత్య అధ్యయనానికీ, పరిష్కరణకూ, సాహిత్య విమర్శకూ దారి తీసింది. చరిత్ర రచనకు గతకాలపు ఆధారాలు ఎంత కీలకమో, ‘భారతదేశం అనేది ఒక సుదీర్ఘ అవశేషాల దేశం’ అనే అవగాహనతో వర్తమానంలో జీవిస్తున్న గతాన్ని అధ్యయనం చేయడమూ అంతే ముఖ్యమని ఆయన అనుకున్నారు. అందువల్ల పురాతత్వ శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఇంకా ఆదిమ తెగ జీవితం గడుపుతున్న సమూహాలకూ, ఆధునికులమనుకుంటున్నవారిలోని ఆదిమ ఆచారాలకూ అంతే ప్రాధాన్యమిచ్చారు. ఆ రకంగా కోసంబి అసాధారణమైన చరిత్రకారుడిగా, పురాతత్వవేత్తగా ఎదిగారు.

కోసంబి మరణం తర్వాత అర్ధశతాబ్ది గడిచాక ఆయన మేధో జీవితం నుంచి మాత్రమే కాదు, సామాజిక జీవితం నుంచి కూడ గ్రహించవలసినవి ఉన్నాయి. ఆయన తనది చారిత్రక భౌతికవాద దృక్పథమని, అంటే మార్క్సిజమని స్పష్టంగానే ప్రకటించుకున్నారు. అయితే తాను చూస్తున్న భారత కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొందరు అనుసరిస్తున్న మార్క్సిజం నుంచి తనను తాను వేరు చేసి కూడ చూపుకున్నారు. వారికి అధికార మార్క్సిస్టులు (అఫీషియల్ మార్క్సిస్టులు) అని పేరు పెట్టి, ఆ ఇంగ్లిషు మాట పొడి అక్షరాలలో ఒ ఎం – ఓం – అవుతుంది గనుక అలా వ్యంగ్యంగా కూడ పిలిచారు.

“రాజకీయ అనివార్యతో కోసమో, పార్టీ సంఘీభావం కోసమో అయినా సరే, మార్క్సిజాన్ని ణితశాస్త్రం లాగ మొరటు రూపవాదానికి కుదించగూడదు. అలాగే దాన్ని ఒక ఆటోమాటిక్ కోతయంత్రం మీద పని వంటి ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞానంగానూ చూడడానికి వీలులేదు. మానవసమాజం అనే దానిలో ఉన్న పదార్థానికి అనంతమైన వైవిధ్యం ఉంది. పరిశీలకుడు తాను కూడ పరిశోధిస్తున్న జనాభాలో భాగమే. పరిశీలకుడు పరిశీలిస్తున్న జనాభాతో బలంగానూ, పరస్పరంగానూ చర్య-ప్రతిచర్యలో ఉంటాడు. అంటే అర్థం సిద్ధాంతాన్ని విజయవంతంగా అన్వయించాలంటే విశ్లేషణాశక్తి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఒక నిర్దిష్ట స్థితిలో కీలక అంశాలేవో వెలికితీయగల సామర్థ్యం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇది కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునే విషయం కాదు. దాన్ని నేర్చుకోవాలంటే ప్రజానీకంలోని ప్రధాన భాగాలతో నిరంతర సంబంధంలో ఉండాలి. ఒక మేధావి విషయంలో, దాని అర్థం, కొన్ని నెలలైనా శారీరక శ్రమలో గడపడం, శ్రామిక వర్గంలో ఒకరిగా తన జీవనోపాధి సంపాదించుకోవడం. ఏదో ఉన్నతవ్యక్తిలాగనో, సంస్కరణవాదిలాగనో, మురికివాడలను సందర్శించే సున్నితమనస్కుడైన “ప్రగతిశీల” వ్యక్తిగానో కాదు” అని ఆయన రాసిన మాటలు గుర్తుంచుకోదగ్గవి.

ఈ దృక్పథంతోనే ఆయన శాంతి ఉద్యమంలో పనిచేశారు. యన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీని భారత – సోవియట్ మైత్రికి అంకితం చేశారు. చైనా ప్రభుత్వానికి ప్రణాళికా రచనలో సలహాదారుగా పనిచేశారు. భారత ప్రభుత్వం కొత్తొక వింత అన్నట్టుగా ప్రమాదకరమైన అణుశక్తి వైపు చూస్తున్నదనీ, నిజానికి భారత దేశం సౌరశక్తి అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టాలనీ అన్నారు.

10933839_10152645132701700_7940360244292075573_n

“…యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ని మళ్లీ చదవడం ఒక గొప్ప అనుభవమని రుజువవుతుంది. అది అపారమైన ప్రతిభతో మాత్రమే కాదు, హేతువాదపు బలోపేతమైన నిర్ధారణతో ముఖాముఖీ కూడ…. ఆ అధ్యయనంలో పాథకులు కోసంబిలోని మరొక మౌలికమైన అంశాన్ని కూడ గుర్తించగలరు. అది నిజమైన మార్క్సిస్టు చరిత్ర అధ్యయనం ప్రయత్నాలన్నిటికీ ఉమ్మడి అంశం. అదేమంటే గతాన్ని వర్తమానంతోనూ, (భవిష్యత్తు తోనూ) కూడ అనుసంధానించడం. అణచివేతకూ దోపిడీకీ గురవుతున్నవారి విముక్తి సాధించాలనే మౌలిక నిబద్ధత” అని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.

సరిగ్గా అరవై సంవత్సరాల కింద 1954లో, న్యూయార్క్ నుంచి వెలువడే మాసపత్రిక ‘మంత్లీ రివ్యూ’ లో ‘ఆన్ ది క్లాస్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా’ అనే వ్యాసంలో “భారత దేశానికి పరిష్కారం సోషలిజమే. అది మాత్రమే పెరుగుతున్న సరఫరాకు తగిన గిరాకీని సృష్టించగలదు. అటువంటి పరిష్కారాన్ని ఉపయోగించుకోగలిగినది అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదనీ, వెనుబడిన దేశాలు కూడ ఉపయోగించుకోగలవనీ చైనా చూపుతున్నది. అటువంటిది లేకపోతే ప్రణాళికా విధానం నిష్ప్రయోజకమవుతుంది. అయితే, భారత బూర్జువావర్గం ఉత్పత్తి కోసం ఆధునిక విదేశీ యంత్రాలను దిగుమతి చేసుకున్నట్టే, మిగిలిన పరిష్కారాలన్నీ విఫలమైనప్పుడు, రాజకీయాలలో తాజా పెట్టుబడిదారీ పరిణామాలను కూడ దిగుమతి చేసుకుంటుంది. అంటే సోషలిజానికి దీర్ఘకాలికంగా ఏకైక ప్రత్యామ్నాయమైన ఫాసిజాన్ని దిగుమతి చేసుకోవడం అని అర్థం. ఇప్పటికే ‘ఉక్కు మనిషి’ కావాలి అనే మాట అభిజ్ఞవర్గాలలో వినబడుతున్నది. అందుకు నమూనాలు కూడ అందుబాటులో ఉన్నాయి” అని డి డి కోసంబి రాశారు.

ఆ మాటలకు ప్రాధాన్యత పెరిగిన రోజుల్లో ఈ తెలుగు అనువాదం వెలుగు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది.

**

డి డి కోసంబి రచనలతో నా పరిచయం 1978 మొదట్లో జరిగిందని గుర్తు. ‘సంస్కృత సాహిత్యం – వర్గ పరిణామాల ప్రతిబింబం’ అనే కోసంబి వ్యాసాన్ని సృజన మార్చ్ 1978 సంచికలో అచ్చువేశాం. ఆ వ్యాసానికి రచయితగా కోసంబి పేరు ఉంది గాని అది కోసంబి రాసిన వ్యాసానికి పరిచయ వ్యాసమే. పరిచయకర్త పేరు అచ్చు కాలేదు గాని బహుశా అంతకుముందు ఎమర్జెన్సీ సమయంలో జైలులో నడిపిన లిఖిత పత్రికలలో కె వి రమణారెడ్డి రాసిన వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసం చదివిన నాటి నుంచీ కోసంబి గురించి వింటూ ఆయన రాసిన పుస్తకాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉండగా మూడు నాలుగేళ్ల తర్వాత బెజవాడలో ఈ పుస్తకం నాచేతికి దొరికింది. ఏలూరు రోడ్డులో నవోదయ బుక్ హౌజ్ లో ముందు రెండు పెద్ద గదుల్లో పుస్తకాలు కాక రామమోహనరావు గారు కూచునే వెనుక గదిలో చరిత్ర, అర్థశాస్త్రం పుస్తకాల బీరువా ఉండేది. అక్కడ ఈ యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకం మొదటిసారి చూశాను. ఇప్పటికి ఎన్నోసార్లు చదివి తోలులా మారిపోయిన ఆ పుస్తకం మీద సంతకాన్ని బట్టి దాన్ని 1982 ఏప్రిల్ 17న కొన్నాను. అప్పుడది ఇరవై ఎనిమిది రూపాయల పుస్తకం. ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ పుస్తకం నా కాపీ 1984 ఏప్రిల్ 19న మద్రాస్ మూర్ మార్కెట్ లో కొన్నానని సంతకం ఉంది. అలాగే మిగిలిన పుస్తకాలన్నీ సంపాదించి చదవడం, కోసంబికి అభిమానిగా మారడం జరిగాయి. కోసంబి ఆలోచనల్లో, సూత్రీకరణల్లో కొన్ని మారవలసిన అవసరం ఉన్నదని తెలిసినా ఆయన తీసుకున్న మౌలిక దృక్పథం వల్ల, విస్తారమైన పరిజ్ఞానాన్ని అలవోకగా అందించే ఆయన పద్ధతి వల్ల ఆ అభిమానం తగ్గలేదు. ఇరవై సంవత్సరాల కింద ఒక ఔత్సాహిక ప్రచురణకర్త ఈ పుస్తకాన్ని అనువదించమని అడిగితే వెంటనే అంగీకరించాను, కారణాంతరాలవల్ల ఆ ప్రచురణ ప్రతిపాదనే వెనక్కిపోయి, ఇప్పుడిది మాత్రం వెలుగు చూస్తోంది.

పుస్తకావిష్కరణ సభలో ఉమా చక్రవర్తితో వేణు

పుస్తకావిష్కరణ సభలో ఉమా చక్రవర్తితో వేణు

కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధోప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృతంగానే ఉన్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తంగా కొశాంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్ ‘భారత చరిత్ర – డి డి కోసంబి పరిచయం’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నముందే కోసంబి రచనలలో ‘భగవద్గీత – చారిత్రక పరిణామం’ ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1985) వెలువడింది. ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు – ‘భారత చరిత్ర – పరిచయ వ్యాసాలు’ (అనువాదం: హెచ్చార్కె, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986); ‘ఆచరణలో గతితర్కం’ (ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణ, 1991) వెలువడ్డాయి. తర్వాత ‘ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత’ (కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇన్ ఏన్షియెంట్ ఇండియాకు ఆర్ వెంకటేశ్వర రావు అనువాదం, తెలుగు అకాడమి ప్రచురణ, 1998) కూడ తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి కూడ రావడంతో ఇంగ్లిషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.

నిజానికి ఇతర పుస్తకాల కన్న, వ్యాసాల కన్న యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్ర మీద స్థూల అవగాహన ఇవ్వడం మాత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి ఉండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నాలు ఫలించక, చివరికి ఇది నాకోసం మిగిలిపోయింది.

దాదాపు ముప్పై సంవత్సరాలకింద రాస్తూనే కోసంబి గురించి ఇప్పుడెందుకు అనే ప్రశ్న వస్తుందని బాలగోపాల్ అనుమానించారు. నిజంగానే ఈ ఆరు దశాబ్దాలలో కోసంబి ఆలోచనలను సమర్థించే, బలపరిచే అధ్యయనాలు, పరిశోధనలు ఎన్ని జరిగాయో, ఆయన ఆలోచనల్లో కొన్నిటిని విమర్శించే, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసే, పూర్వపక్షం చేసే అధ్యయనాలు అన్ని జరిగాయి.

ఈ పుస్తక అనువాదంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, అవరోధాలు, నేను ప్రయత్నించిన పరిష్కారాలు పాఠకులకు తెలియజేయడం నా బాధ్యత. కోసంబి రచనాశైలిలో అనువాదానికి లొంగని, అనువాదంలో ఇబ్బందికరంగా కనబడే అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పుస్తక రచనలో ఆయన అధ్యాయాల విభజన, ప్రతి అధ్యాయంలోనూ ఉప అధ్యాయాల విభజన సరిగానే చేశారు గాని పేరాగ్రాఫుల విభజన అంత సరిగా చేయలేదు. ఒక ఆలోచన, ఒక వాదన ఒక పేరాగ్రాఫులో ఉండాలనే సాధారణ ఆనవాయితీకి భిన్నంగా ఆయన ఒకే పేరాలో అనేక ఆలోచనలు, వాదనలు గుదిగుచ్చారు. అందువల్ల ఒక ఆలోచన ముగించే వాక్యం తర్వాత అదే పేరాగ్రాఫులో మరొక ఆలోచన సాగుతుంది. ఒక్కోసారి ఆ ఒక్క వాక్యమే ఒక ఆలోచన కూడ కావచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా ఒక ఆలోచన ఆగిపోయి ఏదో సుదూరమైన అంశంలోకి వెళ్లడం కూడ జరుగుతుంది. రచయితకు ఉండిన విస్తారమైన భాషా పరిజ్ఞానం, విభిన్న దేశాల, చరిత్రల పరిచయం వల్ల హఠాత్తుగా ఎక్కడో సుదూరపు ఉదాహరణ, పోలిక కూడ ప్రవేశిస్తాయి. లోతుగా, మననం చేసుకుంటూ, రచయితతో పాటు ఆలోచిస్తూ చదవని పాఠకులను ఈ పద్ధతి ఇబ్బంది పెడుతుంది. ఆ సంగతి పూర్తిగా తెలిసినా నేను ఆయన రచనా శైలిని మార్చే, పేరాగ్రాఫులను మార్చే సాహసం చేయలేదు. ఇటువంటి సైద్ధాంతిక రచనలో అనువాదకులు వీలైనంత తక్కువ చేయి చేసుకోవాలనే ధోరణి నాది.

గతంలో కోసంబి గురించి తెలుగులో రాసినవారు, రచనలను అనువాదం చేసినవారు కోసంబి వాడిన పైనుంచి భూస్వామ్యం అనే మాటకు సామంత భూస్వామ్యం అనీ, కింది నుంచి భూస్వామ్యం అనే మాటకు గ్రామీణ భూస్వామ్యం అనీ వాడారు. ఆ పదప్రయోగాలు వివరణాత్మకంగా సరిపోయేవే గాని, సంపూర్ణంగా కోసంబి అవగాహనను తెలిపేవి కావని నేననుకున్నాను. అందువల్ల కోసంబి వాడినట్టుగా పైనుంచి భూస్వామ్యం, కింది నుంచి భూస్వామ్యం అనే మాటలే వాడాను.  ఒక భాషా పదానికి మరొక భాషలో నిర్దిష్టమైన అర్థం ఇచ్చే పదం ఉండడం ఎంత వాస్తవమో, అనువాదంలో అటువంటి సమానార్థక పదాలను వాడాలనడం ఎంత సరైన అనువాద పద్ధతో తెలిసి కూడ, నేను ఏ పదానికైనా అది వాడిన సందర్భం ఒక అర్థం ఇస్తుందనీ, కనుక ఒక పదానికి ఒక అర్థం అనే సూత్రం ఎల్లవేళలా సరిపోదనీ భావిస్తాను. అందువల్ల పారిభాషిక పదాలు మినహా మిగిలిన పదాలకు భిన్న అర్థాలు వాడిన సందర్భాలు ఉండవచ్చు.

అనువాద పద్ధతికి సంబంధించిన  నా ఈ అవగాహనతో పాటు ఈ అనువాదం గురించి చెప్పవలసిన మరొక అంశం కూడ ఉంది. నామవాచకం విశిష్టమైనదనీ, పరభాషా నామవాచకాలను మార్చగూడదనే ఆలోచనా ధోరణి నాది. ఆయా భాషల ఉచ్చారణ ఏమిటో తెలియని రోజుల్లో మనకు తోచినట్టుగా, లేదా ఆ భాషా సంప్రదాయంతో సంబంధం లేకుండా, కేవలం వర్ణక్రమాన్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో నామవాచకాలను తెలుగీకరించి ఉన్నాం. అది తప్పు అని నా అభిప్రాయం. మరీ ముఖ్యంగా సంస్కృత నామవాచకాలను కూడ తెలుగీకరించి చివర డు, ము, వు, లు చేర్చిన సంప్రదాయం మనది. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరిగిపోయింది గనుక ఇప్పుడు దాన్ని సవరించడమూ ఎబ్బెట్టుగానే ఉంటుందని యథాతథంగా ఉంచాను.

కోసంబి తాను ఉటంకించిన వనరులన్నిటికీ – అవి పుస్తకాల పేర్లయినా, రచయితల పేర్లయినా – అబ్రివియేషన్స్ (పొడి అక్షరాలు) వాడారు. తెలుగులో అటువంటి పొడి అక్షరాలు పంటికింద రాళ్ల లాగ ఉంటాయి గనుక నేను పూర్తి పేరు, సంక్షిప్తం చేసిన పేరు వాడాను. ఉపయుక్త గ్రంథసూచి ఇంగ్లిషులోనే ఇచ్చాను. అలాగే ఇంగ్లిషులో ఒక్క పేజీ నుంచి ఉటంకిస్తే పి. అనీ, ఒకటి కన్న ఎక్కువ పేజీల నుంచి ఉటంకిస్తే పిపి. అనీ రాసే సంప్రదాయం ఉంది. తెలుగులో అది లేదు గనుక అన్నిటికీ పే. అనే వాడాను. ఒక ఉటంకింపు తర్వాత మరొక ఉటంకింపు అదే వనరు నుంచి అయితే ఇంగ్లిషులో ఇబిడ్ అనే సంప్రదాయం ఉంది. తెలుగులో పై.ఉ. (పైన ఉదహరించినది), అ.పు. (అదే పుస్తకం) అని వాడుతున్నారు గాని, మరొకసారి పుస్తకం పేరో, రచయిత పేరో రాయడమే మంచిదని నాకనిపించింది. ఇంగ్లిషులో వేరువేరుగా గుర్తించదగిన అనేక రకాల ఖతులు (ఫాంట్లు), ప్రతి ఫాంట్ లోనూ మళ్లీ పెద్ద అక్షరాలు (కాపిటల్స్) ముద్ద (బోల్డ్), ఏటవాలు (ఇటాలిక్) అక్షరాల సంప్రదాయం ఉండగా, తెలుగులో అన్ని రకాల అచ్చు అక్షరాలూ లేవు, వాలిన అక్షరాలు స్పష్టంగా, పోల్చుకునేటట్టుగానూ ఉండవు. అందువల్ల మూలంలో అట్లా ప్రత్యేకంగా చూపిన అంశాలను తెలుగు అనువాదంలో చూపించలేకపోతున్నాం. అలాగే ఇంగ్లిష్ మూలంలో కోసంబి ప్రచురించిన ఫొటోలను కూడ, వాటి నాణ్యత దృష్ట్యా తెలుగులో పునర్ముద్రించడం సాధ్యం కాలేదు. వాటి వివరణలు మాత్రం యథాతథంగా ఉంచాం.

నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్ మాజీ డైరెక్టర్ ప్రొ. అదితి ముఖర్జీ, ప్రస్తుత డైరెక్టర్ ప్రొ. వి. శరత్ చంద్రన్ నాయర్, అక్కడ తెలుగు విభాగపు బాధ్యుడు డా. ప్రత్తిపాటి మాథ్యూ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకురాలు గీతా రామస్వామి, మొదట ఈ అనువాదపు నమూనా పేజీలనూ, ఆ తర్వాత మొత్తం అనువాదాన్నీ పరిశీలించి విలువైన సూచనలు చేసిన అజ్ఞాత పరిశీలకులు, మొత్తం అనువాదాన్ని జాగ్రత్తగా చదివి, ఎన్నో సూచనలు చేసిన మోతుకూరి నరహరి, ఈ అనువాదాన్ని చెపుతుండగా టైప్ చేసిన రాజశేఖర్ చిమ్మన్, కట్టా కవిత, అనువాదానికి మామూలు కన్న ఎక్కువ సమయం పట్టినా ఆ కాలమంతా నా పనులను పంచుకుని, చికాకు భరించిన వై రామచంద్రం, సి వెంకటేశ్, ఎ మల్లేష్ లకు కృతజ్ఞతలు. నా జీవితంలో అవిభాజ్య భాగాలైన వనజ, విభాతలు ఈ కృషిలో కూడ భాగం పంచుకున్నట్టే.

(కోసంబి పుస్తకానికి అనువాదకుడిగా వేణు ముందు మాట ఇది)

– ఎన్ వేణుగోపాల్

venu

Download PDF

9 Comments

  • కల్లూరి భాస్కరం says:

    నాలాంటి వారికి ఎందరికో ఆరాధ్యచరిత్రకారుడు, మార్గదర్శి కొశాంబీ రచనను తెలుగు చేసినందుకు అభినందనలు వేణుగోపాల్ గారూ…

    • N Venugopal says:

      ధన్యవాదాలు భాస్కరం గారూ…

      కోసంబిని అన్వయిస్తూ అభివృద్ధి చేస్తూ మీరు చేస్తున్న కృషి ముందు నేను చేసింది చాల తక్కువ.

  • Manjari Lakshmi says:

    కె. బాలగోపాల్ ‘భారత చరిత్ర – డి డి కోసంబి పరిచయం’ ఇదివరకు చదివాను(చూశాను అంటం న్యాయమేమో నాకు పెద్దగా అర్ధం కాలేదు). అయితే అదే original అనువాదం అనుకుని ఇది మళ్ళా వచ్చిందని చదివి మళ్ళా మీరు చేసారేమిటా అనుకుంటున్నాను. ఇది చదివిన తరువాత నా అనుమానం తీరింది. అది ఉత్త పరిచయం మాత్రమేనన్నమాట.

  • palamarubalaji says:

    charitra eppatikee avasarame sir.tq

  • Srinivas Vuruputuri says:

    ఈ బుక్కు, ఈ-బుక్కు రూపేణా లభిస్తుందా అండీ?

    • N Venugopal says:

      శ్రీనివాస్ గారూ,

      ఇది భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్ చేయించిన అనువాదం. తెలుగు అనువాదం మీద హక్కులు వాళ్లవే. వాళ్లు బహుశా ఈ-బుక్ విడుదల చేయకపోవచ్చు….

  • Rajendra Prasad Chimata says:

    చాలా బాగుంది.ఈ పుస్తకం తెప్పించుకోవడం ఎలా

Leave a Reply to N Venugopal Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)