“చూడుమా చందమామా…అటు చూడుమా…”

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.స.న. సమాఖ్య అనే ప్రసిద్ధ నాటక సంస్థ ఉండేది. రెడ్డిగారే కాక ఎందరో ప్రసిద్ధనటులు అందులో సభ్యులుగా ఉండేవారు. నటులు కనుక రెడ్డిగారు మాటలో, నడకలో, ఆహార్యంలో మంచి స్టైల్ గా ఉండేవారు.

విషయమేమిటంటే, రెడ్డిగారి క్లాసు చాలా సరదాగా, నవ్వులు, తుళ్ళింతలతో సాగిపోయేది. కౌమారదశకదా… మగ, ఆడపిల్లల్ని గిలిగింతలు పెడుతూ సిగ్గుల దొంతర్లలో ముంచెత్తే సరసమైన జోకులు అప్రయత్నంగా ఆయన నోట జాలువారుతూ ఉండేవి. మధ్య మధ్య సినిమాల ముచ్చట్లూ దొర్లేవి. ఆయన అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. “మీరు ఏ సినిమా చూడండి…చందమామ ఒక్కసారైనా కనిపించకుండా ఉండడు” అనేవారాయన. అప్పటినుంచి ఏ సినిమా చూస్తున్నా పనిగట్టుకుని చందమామ ఉన్నాడా లేదా అన్నది చూడడం నాకు పరిపాటి అయిపోయింది. ప్రతిసారీ, రెడ్డిగారు చెప్పింది నిజమే సుమా అనుకుని ఆశ్చర్యపోయేవాణ్ణి.

ఆకాశమూ, చంద్రుడు, తారలు, వెన్నెల, పువ్వులు సినీ జగత్తుకే కాక కావ్యజగత్తుకూ తప్పనిసరి నేపథ్యాలు. కవిసమయాలుగా అలంకారశాస్త్రాలలో చోటుచేసుకున్నవి కూడా. కావ్యాలు, ప్రబంధాలలో ప్రకృతివర్ణనలు, విరహంలో ఉన్న ప్రేయసీప్రియులు చంద్రోపాలంభన పేరిట చంద్రుని ఆడిపోసుకోవడాలు సర్వసాధారణం. చాలా సినిమాల్లో చంద్రుని ఉద్దేశించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేయసీప్రియులు ఒకరిపై ఒకరి అనురక్తిని, కోపతాపాలను, ఫిర్యాదులను చెప్పుకోడానికి చంద్రుడే దిక్కవుతూ ఉంటాడు.

ఈ సందర్భంలో నాకు ఎంతో ఇష్టమైన రెండు పాటలు గుర్తొస్తున్నాయి. మొదటిది, ‘సువర్ణసుందరి’ సినిమాలోది. ఆ పాట సముద్రాల పేరుతో ఉన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసారంటారు. “హాయి హాయిగా ఆమని సాగే” అనేది ఈ పాట పల్లవి. అందులో ఒక చరణంలో “చూడుమా చందమామా, అటు చూడుమా చందమామా” అని ప్రేయసి అంటుంది. “కనుమా వయారి శారదయామిని కవ్వించే ప్రేమా” అని ప్రియుడు అంటాడు. “వగల తూలే విరహిణుల మనసున మోహము రేపు నగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా” అని ప్రేయసి అంటుంది. “కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా” అని ప్రియుడు అంటాడు. చంద్రుడు, శారదయామిని(శరత్కాలపు వెన్నెల రాత్రి) విరహిణులు, మోహము, చంద్రోదయంతో కలువలు విరియడం-ఇలా కవితా సామగ్రి అంతా ఇందులో అమిరింది.

రెండో పాట ‘వాగ్దానం’ సినిమాలోది. దాశరథిగారు రాసిందనుకుంటాను. “నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’ అని ప్రేయసి కోరడం ఈ పాట పల్లవి. “ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో, జాబిలి వెలిగేను మనకోసమే” నని ప్రేయసి అంటుంది. “ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా” అని ప్రియుడు అంటాడు. “మేఘాలలో వలపు రాగాలలో దూరదూరాల స్వర్గాలు చేరుదమా” అని ప్రేయసి అంటుంది. ఆ తర్వాత తనే “ఈ పూలదారులూ ఆ నీలితారలూ తీయని స్వప్నాల తేలించగా” అంటుంది.

కేవలం ఈ రెండు పాటలను ఉదహరించి కవితాజగత్తులో చంద్రుడికి, తారలకు, పూవులకు, వెన్నెలకు ఉన్న ప్రాముఖ్యానికి పూర్తి న్యాయం చేయలేనని నాకు తెలుసు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, జార్జి థాంప్సన్ ను, జోసెఫ్ క్యాంప్ బెల్ ను చదివిన అనుభవం నుంచి ఇలాంటి పాటలు వింటున్నప్పుడు, కావ్యాలలోని చంద్రోదయ, చంద్రోపాలంభనలతో సహా ప్రకృతివర్ణనలు గుర్తొచ్చినప్పుడు వీటి మూలాలు ఏ ఆదిమ అస్తిత్వంలోకి వ్యాపించి ఉన్నాయో, వాటి పురాచరిత్ర ఎలాంటిదో, వాటి విశ్వజనీన స్వభావం ఎలాంటిదో స్ఫురించి విచిత్రమైన రహస్యానుభూతికి లోనవుతుంటాను.

ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రుడికి, పువ్వులకు, వెన్నెలకు కావ్యజగత్తులో ఎంత ప్రాధాన్యం ఉందో పురామానవ పరిణామ చరిత్రలోనూ అంతే ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యం బహుశా పురామానవఅస్తిత్వ చరిత్రనుంచే కావ్యజగత్తుకు విస్తరించింది.

ఈ మాటలు రాస్తున్నప్పుడు ఉన్నపళంగా జార్జి థాంప్సన్ అనే సముద్రంలోకి లంఘించాలని నాకు అనిపిస్తోంది కానీ, నాకు ఎంతో అపురూపం అనిపించే ఆ విషయంలోకి పూర్తిస్థాయిలో వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం కనుక వాయిదా వేస్తాను.

***

నలదమయంతులు/ఓడిసస్ కథల నేపథ్యంలో జోసెఫ్ క్యాంప్ బెల్ పేర్కొన్న female principle గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. దానిని ‘స్త్రీ సూత్రం’గా తర్జుమా చేసుకుందామని కూడా అనుకున్నాం. ఈ స్త్రీ సూత్రంలో భాగంగానే స్త్రీల మార్మిక లేదా మాంత్రిక ప్రపంచం గురించీ; ఆ ప్రపంచంలో చంద్రుడికీ, సర్పానికీ, పంటకీ ఉన్న ప్రాముఖ్యం గురించీ చెప్పుకున్నాం. అందులోకి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెడదాం:

ఆదిమ, పురాతన, ప్రాచ్య పురాణగాథలన్నీ ప్రధానంగా దేవత గురించే చెబుతాయి. దేవతతో ముడిపడి ఉన్న ఒక ప్రధాన ఆరాధనారూపం, సర్పం. దేవతకు సర్పం భర్త కూడా. ఇప్పుడు సైప్రస్, ఇజ్రాయిల్, సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనాలు ఉన్న ప్రాంతాన్ని ‘లెవంట్’ అని పిలుస్తారు. ఇప్పటికి పదివేల సంవత్సరాల క్రితమే లెవంట్ లో నాగదేవతను పూజించేవారు. పారిస్ లోని లౌరే మ్యూజియంలో సబ్బు రాయితో చేసిన ఒక ఆకుపచ్చని కలశం ఉంది. సుమేరులోని లగాష్ అనే నగరరాజ్యాన్ని పాలించే గుడియా అనే రాజు క్రీ.పూ. 2౦25 లో దేవత భర్త అయిన సర్పానికి ఈ కలశాన్ని సమర్పించాడు. దాని మీద ఒక చిత్రం ఉంది. అందులో మధ్యలో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న రెండు పాములు ఒక దండాన్ని చుట్టుకుని ఉంటాయి. డానికి అటూ, ఇటూ రెక్కలున్న జంతురూప రాక్షసులు నిలబడి ఉంటారు. పెనవేసుకున్న పాములు గ్రీకు దేవుడు హెర్మెస్ చేతిలోని దండాన్ని లేదా పాశాన్ని పోలి ఉంటాయి. హెర్మెస్ మార్మిక జ్ఞానానికి, పునర్జన్మకు చెందిన దేవుడు. ఓడిసస్ కథలో హెర్మెస్ ప్రస్తావన వచ్చింది. ఇతడు ఓడిసస్ కు అనుకూల దేవుడు.
the sepent lord

సర్పానికి పాతచర్మం వదిలేసి కొత్త చర్మం ధరించడం ద్వారా తిరిగి నవ యవ్వనాన్ని సంతరించుకునే అద్భుత సామర్థ్యం ఉందని చెప్పుకున్నాం. ఆ విధంగా సర్పం పునర్జన్మకు, మృత్యువు మీద గెలుపుకు ప్రతీకగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. వృద్ధి, క్షయాల రూపంలో ఇలాంటి సర్పలక్షణమే చంద్రుడికీ ఉంది. చంద్రుడు నీడ లేదా చీకటి అనే పాతచర్మం వదిలేసి, వెన్నెల అనే కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటాడు. స్త్రీ ఋతుక్రమానికీ, జీవిని పుట్టించే స్త్రీ గర్భానికీ తద్వారా కాలానికీ చంద్రుడు అధిష్టాన దైవం, కొలమానం కూడా. కాలంలోనే పుట్టుక, మరణం సంభవిస్తూ ఉంటాయి. ఆ విధంగా చంద్రుడు చావు-పుట్టుకల రహస్యానికి అధిదైవం. నిజానికి చావు-పుట్టుకలనేవి ఒకే నాణేనికి బొమ్మా-బొరుసు లాంటివి. చంద్రుడు సముద్రపు ఆటుపోట్లకు; పైరుపంటలకు కారణమైన రాత్రి కురిసే మంచుబిందువులకు కూడా ప్రభువు.

ఇక సర్పం జలాధిదేవత. అది నీటిలోనూ, భూమి మీదా కూడా ఉంటుంది. నీటి మీద అలల్లా అది పయనిస్తుంది, చెట్టు కొమ్మల మీంచి వేలాడుతూ ఉంటుంది. అప్పుడది మృత్యుఫలంలా కనిపిస్తుంది. సర్పం ఆకారం స్త్రీ(నోరు) పురుష(మిగతా శరీరం)జననేంద్రియాలను రెంటినీ గుర్తుచేస్తుంది. అలాగే, పాము కాటు అగ్నికీ, నీటికీ సూచన.

the serpent lord enthroned

సుమేరియాలో అక్కాడియన్ల కాలానికి (క్రీ.పూ. 2350-2150) చెందిన ఒక సీలు మీద ఒక పురుషదేవుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అతని ముందు అగ్నివేదిక ఉంటుంది. అతని చేతిలో అమరత్వాన్ని సూచించే ఒక పాత్ర ఉంటుంది. దాని పైన చంద్రవంక ఉంటుంది. ఆ దేవుడి వెనక పాములు పెనవేసుకున్న చిత్రం ఉంటుంది. ఆ దేవుడి ముందు కిరీటం ధరించిన భక్తుడు నిలబడి ఉంటాడు. అతనే ఆ సీలు జారీ చేసినవాడు. అతని వెనక తల మీదనుంచి పాము వేలాడుతున్న వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత్ర ఉంది, అతను ఆ దేవుడి ద్వారపాలకుడు.

The garden of immortality

The Garden of Immortality అనే మరో చిత్రంలో అందరూ స్త్రీలే ఉన్నారు. ఇది కూడా సుమేరియాకు చెందిన చిత్రం. ఇందులో చంద్రవంక, దాని కింద నైవేద్యంగా సమర్పించే ఒక ఫలమూ, చెట్టు ఉన్నాయి. ఓ పండ్ల కొమ్మను పట్టుకుని ఆ ఫలాన్ని స్వీకరిస్తున్న భక్తురాలు ఉంది. మిగిలిన ఇద్దరు స్త్రీలు అధోజగత్తులో ఉండే గుల-బావు అనే దేవత ద్వంద్వఅంశలు. వీరే అనంతరకాలానికి చెందిన గ్రీకు ఐతిహాసిక యుగంలో డిమీటర్, పెరెస్పోన్ అనే దేవతలయ్యారు.

కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడానికి జోసెఫ్ క్యాంప్ బెల్ ఈ చిత్రాలను ఉదహరించారు. అవేమిటంటే, ఈ చిత్రాలు సమీప ప్రాచ్యా(Near East)నికి చెందిన ఆదిమ పౌరాణిక వ్యవస్థకు సంబంధించినవి. వీటిలో పురుషదేవుడు, స్త్రీ దేవతా కూడా ఉన్నారు. అయితే ఈ దేవతలు నామరూపాలకు అతీతమైన ఒక సూత్రానికి లేదా తాత్వికతకు ముసుగులు మాత్రమే. ఇక్కడ ఆ తాత్వికతే ప్రధానం,

బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా తలకిందు లయిందో క్యాంప్ బెల్ వివరిస్తారు. పైన చెప్పిన వాటి ప్రతిరూపాలు అన్నీ బైబిల్ లోనూ కనిపిస్తాయి. అయితే, అవి పురాతన విశ్వాసాలకు భిన్నమైన వాదాన్ని ముందుకు తెస్తాయి. ఉదాహరణకు ఈవ్ కు సంబంధించిన చెట్టు సన్నివేశంలో కూడా ఒక సర్పం ఈవ్ తో సంభాషిస్తుంది. కానీ ఆ సర్పం అప్పటికి వేల సంవత్సరాలుగా పూజ లందుకుంటున్న దేవత అనే సూచన అందులో ఉండదు. పైగా ఈడెన్ తోటలోని చెట్టుకు వేలాడుతున్న జ్ఞానఫలాన్ని ఆదాము తిన్నట్టు తెలిసాక యెహోవా సర్పాన్ని శపిస్తాడు. ఆ తర్వాత ఆదామును తోటనుంచి బహిష్కరించి నేల దున్నుకుని బతకమని చెబుతాడు. ఈడెన్ తోటలోని జీవవృక్షానికి రక్షణగా, రెక్కలున్న పక్షి రూపంలోని సింహాలను, మంటలు చిమ్ముతూ అన్ని వైపులకూ తిరిగే కరవాలాన్ని తోటకు తూర్పున ప్రతిష్టిస్తాడు.

అంటే, పై చిత్రాలు అద్దంపట్టే ఆదిమపౌరాణిక వ్యవస్థలో లేని తప్పు, దైవాగ్రహం, ప్రమాదం, తోటనుంచి బహిష్కరణ, జీవవృక్షానికి కాపలా అనేవి బైబిల్ లో ప్రవేశించాయన్నమాట. ఆదిమ పౌరాణిక వ్యవస్థలో అపరాధభావన అనేది లేకపోవడమేకాక, జ్ఞానవృక్షఫలాన్ని ఎవరైనా అందుకోవచ్చు. అయితే అందుకు తగిన సంకల్పం, సంసిద్ధత ఉండాలి.

The Goddess of the Tree

The Goddess of the Tree అనే చిత్రంలో ఒక సర్పము, దానికి ముందు ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎదురుగా చంద్రవంకరూపంలో కొమ్ము కిరీటాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తారు. వారి మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు, దానికి రెండు ఫలాలు కనిపిస్తాయి. ఆ స్త్రీ సుమేరియన్ దేవత గుల-బావు; ఆ పురుషుడు ఆమె కొడుకు-భర్త అయిన దుముజి. ఆ ఫలాలలో ఒకటి జ్ఞానఫలం, రెండోది, అమరత్వఫలం. ఇది కంచు యుగానికి చెందిన చిత్రం. ప్రయత్నించి ఎవరైనా ఆ రెండు ఫలాలు పొందవచ్చు. బైబిల్ కథలో ఉన్నట్టు ఇందులో ఎలాంటి తప్పు, నిషేధమూ లేవు. ఇది బైబిల్ కు పూర్వపు చిత్రం.

Demeter and Plutus

దీనితో పోల్చగల గ్రీసు-రోమన్ చిత్రాలూ కనిపిస్తాయి. Demeter అనే చిత్రంలో కనిపించే ఈ స్త్రీ ఎల్యూసీనియన్ రహస్యాల దేవత అయిన డిమీటర్. ఆమె ఎదురుగా ఉన్న బాలుడు ఆమె కొడుకు ప్లుటూస్. ఒక సూచన ప్రకారం ప్లుటూస్ భూసంపదకు ప్రతిరూపం. ఇంకో విస్తృతార్థంలో నిగూఢత్వ దైవమైన డయోనిసస్ కు ప్రతిరూపం. ఆదిమ పౌరాణికతలోనూ, ప్రాచ్య పౌరాణికతలోనూ ఇటువంటి దేవుళ్ళు చాలామంది కనిపిస్తారు. వీరు విశ్వదేవత(The Great Goddess of the Universe) భర్తలు, కొడుకులు కూడా అవుతారు. చావు రూపంలోనో, లేదా మరో కల్పన ప్రకారం, వివాహ రూపంలోనో వీరు దేవత అక్కున చేరుతూ ఉంటారు. చంద్రుడి వృద్ధి క్షయాలలా, సర్పం పాతచర్మాన్ని విడిచేసి కొత్త చర్మాన్ని ధరించినట్టుగా వీరు చావు-పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇందుకు సంబంధించిన దీక్షా తంతులో భాగంగా ఈ మాతృ దేవత ఆరాధకులు తమ ఐహిక జీవితానికి చెందిన కష్ట సుఖాల నుంచి నిర్లిప్తత చెంది రహస్యాధిదేవత అయిన ఆ దేవతను ధ్యానిస్తారు. అనేక జీవుల రూపాలలో మళ్ళీ మళ్ళీ జన్మించే మూల జీవం ఏదైతే ఉందో దానితో మమేకం కావడానికి ప్రయత్నిస్తారు. శోకమూ, మృత్యువూ మాత్రమే తాండవించే ఈ లౌకిక ప్రపంచంలో సమాధిస్థితిని అమరత్వ ప్రతీకగా గుర్తిస్తారు.

స్పష్టత కోసం పైన చెప్పుకున్న వాటి సారాంశాన్ని ఇలా క్రోడీకరిస్తాను:

  1. చంద్రుడు, సర్పము, చెట్టు, ఫలాలు మొదలైనవి ఆదిమ పౌరాణికతకు చెందిన తాత్వికతలో ముఖ్యమైన ప్రతీకలు. ఇవి స్త్రీ సూత్రానికి చెందినవి.
  2. తర్వాత రూపొందిన బైబిల్ కూడా వీటిలో కొన్ని ప్రతీకలను స్వీకరించింది. అయితే ఆదిమ పౌరాణికతకు భిన్నమైన అర్థంలో వాటిని చిత్రించింది. ఆదిమ పౌరాణికతలో లేని తప్పు, నిషేధమూ, శిక్ష ఇందులో అడుగుపెట్టాయి.
  3. ఆదిమ పౌరాణికతకు చెందిన ప్రతీకలు, తాత్వికత తర్వాతి కాలపు గ్రీసు-రోమన్ చిత్రాలలోకి కూడా విస్తరించాయి. అయితే దేవతల పేర్లు మారాయి. ఇవే ప్రాచ్య పౌరాణికతలో కూడా కనిపిస్తాయి. ఇందులో స్త్రీ సూత్రం ఉంది. Demeter చిత్రం గురించిన వివరణలో మనదేశంలో నేటికీ ఉన్న అమ్మవారి ఆరాధన లక్షణాలను గమనించవచ్చు.

క్యాంప్ బెల్ ప్రకారం చారిత్రకంగా జరిగింది ఏమిటంటే, క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్ది నాటికి, మాతృస్వామ్యానికి చెందిన నూతన శిలా యుగ, కంచు యుగ నాగరికతలు వర్ధిల్లుతున్న భూముల్ని ఇనప యుగానికి చెందిన పితృస్వామిక హిబ్రూలు ఆక్రమించుకున్నారు. వారు మాతృస్వామిక పురాణగాథల్నే తీసుకుని వాటిపై పితృస్వామికతను ఆపాదిస్తూ తలకిందులు చేశారు. అందుకే వాటికి ఎంత గట్టిగా పితృస్వామికతను అన్వయించి చెప్పినా, బైబిల్ లోని మౌలిక ప్రతీకల అన్వయంలో అంతర్గతంగా ఉన్న అస్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రరూపంలో అవి హృదయానికి ఒక అర్థాన్ని అందిస్తుంటే, వాక్య రూపంలో మెదడుకు సరిగ్గా దానికి వ్యతిరేకమైన అర్థాన్ని అందిస్తుంటాయి. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం మూడూ పాత నిబంధన వారసత్వాన్ని పంచుకుంటున్నవే కనుక మూడింటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు.

ఒక్క బైబిల్ లోనే కాదు, ఇలా అర్థం తలకిందులు కావడం గ్రీసు పౌరాణికతలోనూ కనిపిస్తుందంటారాయన. బహుశా ఈ ఛాయలు మన దగ్గరా కనిపిస్తాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం 

Download PDF

8 Comments

  • bhavani says:

    ఎన్నో పాతవైన కొత్త విషయాలని తెలియజేస్తున్నారు సర్ , ధన్యవాదాలు

  • Manjari Lakshmi says:

    నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో నే చదువుకున్నానండీ. AKTPMH స్కూల్ మా ఇంటి వెనకనే. దానికి మా ఇంటికి గోడ ఒకటే అడ్డం. రెడ్డిగారు తెలుసు కాని (అప్పుడప్పుడు మా క్లాస్ కొచ్చేవారు – ఆయన జోక్స్ కొంచం మోటుగానే ఉండేవి) మాకప్పుడు madams ఎక్కువగా వచ్చే వాళ్ళు. నేను 1967-71(10th). మీరెప్పుడు చదివారు? అప్పుడు మీరే పేటలో ఉండేవాళ్ళు? రెడ్డిగారి నడక కొంత ప్రత్యకంగా ఉండేది. ఆయన నాటకాలేసే వారని, అందుకే అలా ఉండేదని, మీరిప్పుడు చెపితేనే తెలిసింది. వాళ్ళబ్బాయి గౌతమ్ రెడ్డి మొన్న YSR తరఫున నిలబడి ఓడిపోయాడు.

    • కల్లూరి భాస్కరం says:

      అవునా? మీరు కూడా AKTPMH విద్యార్థులా! ఎంత మంచి వార్త చెప్పారు మంజరి లక్ష్మిగారూ… అయితే ఒక ఆశాభంగం. మన ఒకే క్లాసు అయ్యే అవకాశం కాదు సరికదా, ఒకేసారి స్కూల్లో చదువుకున్న అవకాశం కూడా లేదు. 1967 కు నేను లెవెన్త్ క్లాస్. నాది SSLC last but one బ్యాచ్. ఆ ఒక్క ఏడూ పశ్చిమ గోదావరి జిల్లాలో మా సొంత ఊళ్ళో చదివాను. మేము సత్యనారాయణపురం పార్క్ దగ్గర ఓ డాబా ఇంట్లో ఉండేవాళ్లం. ఆ వీధి చివరిలో, స్కూలు వైపు అలనాటి ప్రముఖ రంగస్థల, సినీనటుడు పి. సూరిబాబు, ఆయన భార్య, రంగస్థలనటి రాజేశ్వరి గార్ల మేడ ఉండేది. సూరిబాబు గారు ఏవో పద్యాలు, పాటలు పాడుకుంటూ ఆ వీధిలో తిరగడం ఎన్నోసార్లు చూశాను. స్కూలుకు ఒక పక్కనే ప్రసిద్ధ సినీ నటి కన్నాంబగారి మేడ ఉండేది. ఏమైతేనేం, మన టీచర్లు చాలామంది కామన్ అయుంటారు. మీరన్నట్టు రెడ్డిగారి జోకులు ఇప్పుడాలోచిస్తే కాస్త మొరటుగానే ఉండేవి. వాళ్ళబ్బాయి గురించి మీరు చెప్పేదాకా నాకు తెలియదు.

  • johnson choragudi says:

    భాస్కరం గారు నమస్తే-

    మానవ నాగరికత లో రెండు సందర్భాల్లో స్త్రీ – తీసుకున్న చొరవ కారణంగా వర్తమాన మానవ చరిత్ర గమనం నడుస్తున్నది. కాలం – క్రీ పూ 1450 – 1410
    స్థలం – ఇప్పుడు మనం అంటున్న ‘మిడిల్ ఈస్ట్’
    మొదటిది –
    దేవుని (యెహోవ) ఆజ్ఞ కు వ్యతిరేకంగా – ఆడం కు జత గా వున్న స్త్రీ ఈవ్ నిషిద్ధ ఫలం తిని, మనిషి పట్ల ఆయన (దేవుని) ఒరిజినల్ ప్లాన్ ను మార్చడం.
    రెండవది –
    కాలము – క్రీ పూ 2091
    స్థలము – అబ్రహం ఇంటిలో
    అబ్రహం నకు దేవుని వాగ్దానం అతని భార్య శార ద్వారా ఇస్రాయిల్ జన విస్తరణ చేయడం.
    కాని అది సంభవించడాని కంటే ముందే, శార తన ఇంట వున్న ఈజిప్ట్ బానిస స్త్రీ – హాగరు ను; సంతానం కోసం తన భర్త అబ్రహం తో శయనింప చేసింది.
    ముందు హాగరు కు, తరువాత శార కు కొడుకులు పుట్టారు.
    వర్తమానంలో- హత్తింగ్టన్ చెబుతున్న ‘క్లాష్ అఫ్ సివిలిజేషన్’ కు మూలం ఇదే.
    ఇలా రెండు సార్లు దేవుని ప్రణాలికలను స్త్రీ మార్చింది.
    ఇలా, స్త్రీ మానవ నాగరికతలో ప్రధాన మలుపులకు హేతువయింది!
    – జాన్సన్ చోరగుడి

  • కల్లూరి భాస్కరం says:

    నమస్తే జాన్సన్ గారూ…ఎలా ఉన్నారు?

    మీ పరిశీలన ఆసక్తికరంగా ఉంది. దేవుడి ఆజ్ఞ, వాగ్దానం అన్నప్పుడు అది పూర్తిగా విశ్వాసంలోకి వెడుతుందా, దానిని చారిత్రకంగా ఎలా అన్వయించాలి అనే సందేహం కలుగుతుంది. కాస్త స్పష్టత అవసరమేమో! అలాగే క్లాష్ ఆఫ్ సివిలిజేషన్స్ గురించి కూడా.

  • మీరు చెప్పిన విషయాలని బైబిల్‌కి అన్వయం చేస్తే పూర్తి క్లారిటి వచ్చింది. బైబిల్ కధలన్నీ సంపూర్ణంగా పురుష స్వామ్యాన్ని, పురుషాధిపత్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రమే. మొదటి నుంచి చివరి వరకూ పురుష దేవుళ్ళ గురించే ఉంటుంది గాని, దేవతల గురించి ఒక్క వాక్యం కూడా ఉండదు. మీరు చెప్పినట్లు జ్ణనం సర్పం ద్వారాను, తద్వారా స్త్రీ ద్వారా, వంశానుగతంగా మనుషులకి అందుతుంది అనే భావన ప్రపంచంలో అన్ని సంప్రదాయాల్లోను ఉంది. ఒక కొత్త దేవుడిని ప్రజల్లో వ్యాప్తి చేసి, తద్వారా రాజకీయ లక్ష్యం నెరవేరాలంటే, ముందు సర్పాన్నీ, స్త్రీలను అణగద్రొక్కాలి. అందుకే బైబిల్ మొదటి పేజీలొనే ఇద్దరినీ దోషులుగా చిత్రీకరించడం జరిగింది. తద్వారా, వారి మతవిశ్వాశాల్లో జ్ఞానానికి ఆధారభూతమయ్యే ఇద్దరినీ పక్కకు పెట్టి, కొత్త దేవుడు (యెహోవా) ని ప్రతిపాదించడం జరిగింది అని అర్ధం చేసుకోవచ్చు. ఈ కొత్త దేవుడి ద్వారా అప్పటికే ఉన్న దైవీక శక్తుల మధ్య సర్దుబాటు కాకుండా, సర్పానికి, స్త్రీకి కూడా శాపం మరియు నిషేధం విధించబడ్డాయి అని అర్ధం చేసుకోవచ్చు. మీ విశ్లేషణ ద్వారా నాకు ఎప్పటికీ దొరకదనుకున్న అద్భుతమయిన చారిత్రిక లంకె నాకు దొరికింది. కృతజ్ఞతలు భాస్కరం గారు..

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు జగదీశ్ రెడ్డి గారూ…నా విశ్లేషణ ద్వారా అద్భుతమైన చారిత్రక లంకె మీకు దొరికిందనడం ఎంతో ఉత్సాహకరం. ముందు ముందు కూడా పై విషయానికి సంబంధించిన ప్రస్తావనలు అనేకం రావచ్చు.

Leave a Reply to కల్లూరి భాస్కరం Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)