వేటూరి కిలికించితాలు!

Veturi-Best-useful-song-pic-1

Veturi-Best-useful-song-pic-1(జనవరి 29: వేటూరి పుట్టిన రోజు )

సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. కాబట్టి పాటలో కథ సందర్భమూ, పాత్రలూ, కథ పోకడని బట్టి సాహిత్యం రాసిచ్చేవారు. కాలక్రమేణా కథల్లో సారం తగ్గిపోయి పాటలయొక్క అవసరంలేకపోయినా పూర్వం ఉన్న ఆచారాన్ని ఉల్లంఘించే సాహసం చెయ్యలేక కొనసాగించారు. పాటలకోసం ఐదారు సందర్భాలు సృష్టించడం మొదలైంది. సహజమైన సన్నివేశాలకు రాసేరోజుల్లో కవికి కథే ప్రేరణనిచ్చేది. కథలోని బలాన్ని బట్టి సన్నివేశానికి అమరేలా కవి తన ప్రతిభను చూపిస్తూ సాహిత్యం అందించేవాడు. కవి రాసిన సాహిత్యానికి సంగీత దర్శకులు బాణీకట్టేవారు.

సృష్టించిన సన్నివేశాలు కవినెలా ప్రేరేపిస్తాయి? మెల్లమెల్లగా సంగీత దర్శకుల ఆధిక్యత మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ లు ట్యూన్ లు (బాణీలు) ఇచ్చేవారు కవులు దానికి తగినట్టు పదాలు కూర్చేవారు. ఛందోబద్దంగా పద్యాలల్లే ప్రతిభ ఉన్నా సంగీత దర్శకులిచ్చే గజిబిజి ట్యూన్స్-లో పదాల్ని అమర్చడం అందరికీ సాధ్యంకాలేదు. చతురత ఉన్న కొందరు కవులు తమ సొంత ప్రతిభనూ, చెయ్యదలచిన ప్రయోగాలనూ, చమత్కారాల్నూ ఆ ట్యూన్-లో ఇమిడ్చేవాళ్ళు. బలమైన కథలున్న రోజుల్లో సినిమాలకి పాటలు రాసిన కొందరు భాషా ప్రవీణులు కథలు నీరసపడిపోయే రోజులకల్లా నీరుగారిపోయి పాటలు రాయడం మానుకున్నారు.

వేటూరి సుందరరామమూర్తి సినిమాల్లోకి ప్రవేశించినది ఆ సంధి కాలంలో. సరైన సన్నివేశం వస్తే ఒకపక్క సారవంతంగా రాసిస్తూనే మరో పక్క అర్థంపర్థంలేని సన్నివేశాలకు తన చమత్కారాన్నీ, భాషా ప్రావీణ్యాన్ని పాటల్లో నింపుతూ సినిమా పాటల్ని కొత్త మార్గంలోకి నడిపాడు. ఆ కాలంలో ఈ మార్పు ఒక్క తెలుగు సినిమా పాటలకే కాదు, మిగిలిన భాషల సినీ సాహిత్యానికీ వర్తించింది.

ఎలాంటి ట్యూన్ ఇచ్చినా ఆశువుగా, అతివేగంగా, కొత్తగా, చమత్కారంగా, చిలిపిగా రాయగలిగినందువలనేమో వేటూరికి 1970లలో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలొచ్చాయి. వేటూరి ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు!

అట్లాంటి రోజుల్లో, లోతైన కవిత్వాన్నీ, భాషా ప్రతిభనీ ప్రదర్శించే అవకాశం కల్గిన ఓ అరుదైన సన్నివేశం ఇది. ఆదిత్యా 369 సినిమాలోని ఆ సందర్భం ఏమంటే, “హీరో, హీరోయిన్ లు టైమ్ మెషిన్ ఎక్కి వెనక్కి ప్రయాణిస్తారు. వాళ్ళు కృష్ణదేవరాయలు పరిపాలించిన పదహారో శతాబ్దానికి చేరుకుంటారు. విజయనగర సామ్రాజ్యపు ఆస్థాన నర్తకి నాయకుడి మీద మనసుపడుతుంది. వశపరుచుకుని మోజు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని చూసిన హీరోయిన్ అపార్థం చేసుకుని ఉడికిపోతుంది. నర్తకిని వదిలించుకుని జరిగింది చెప్పి హీరోయిన్ కోపాన్ని తీర్చాలి”. ఈ సన్నివేశానికి పాట రాయడంలో రచయితకు ఏం సవాలు ఉంటుంది అనుకోవచ్చు! కథ నడుస్తున్నది పదహారవ శతాబ్దం.

ఇచ్చిన ట్యూన్ కి ఆ నాటి భాషలోనూ నేటి భాషలోనూ పాట రాయాలి. ఒక పల్లవి, రెండు చరణాలు. పల్లవి మూడుసార్లొస్తుంది. మొదటిసారి ఆస్థాన నర్తకి పాడుతుంది, రెండోసారి హీరో పాడుతాడు, మూడోసారి హీరోయిన్ ఒకలైను, హీరో ఒకలైను పాడుతారు. ఒకే పల్లవి లింగభేదంలేకుండ, ముగ్గురికీ సరిపోవాలి. భావపరంగానూ, భాషాపరంగానూ పల్లవికి న్యాయం చెయ్యాలి. మొదటి చరణం పదహారవ శతాబ్దానికి తగినట్టుగానూ, రెండో చరణం ఇరవయ్యో శతాబ్దానికి చెందిన నాయకుడి భాషలోనూ ఉండాలి.

పల్లవి
నెర జాణవులే వరవీణవులే కిలికించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

చరణం 1
మోమటు దాచి, మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వంపులలో హంపికళా ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా

చరణం 2
చీకటి కోపం చెలిమికి లాభం, కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం, ఈ చలిలో!
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి, పగవానికి ఒక న్యాయమింక సాగునా

కొన్నిపదాలకు అర్థాలు :
జాణ = నేర్పెరిగిన వ్యక్తి, నేర్పరి
వరవీణ = వరములు పొందిన వీణ
కిలికించితం = తెప్పరిల్లిన స్థితి; ఎదురుచూడనివేళ ప్రియుడు కౌగిలించుకుంటే ప్రియురాలు నిశ్చేష్టురాలయ్యే స్థితి
మృదుపాణి – మృదువైనచేతులుగల వ్యక్తి
సన్న = (కను) సైగలు; జాడ; సంజ్ఞ; సిగ్నల్ – (అన్నమయ్య కీర్తనల్లో విరివిగా వాడబడిన మాట ఇది)
మోవి = పెదవి
తుంగ – హంపీనగరంలో ప్రవహించే నది – మరో అర్థం : ఒకరకమైన (దుంప) గడ్డి
విరిపానుపు – పువ్వుల పడక/మంచం

జాణ అంటేనే నేర్పరి, “నెర” అని విశ్లేషణం కూడా జతచేసి చెప్తున్నాడంటే “అన్నిటా నేర్పరి” – జాణతనం తొణికిసలాడే వ్యక్తి అని. చాలా మందికి కలిగే అనుమానం “జాణ” అని మగవారిని అంటారా అని? జాణ రెండులింగాలకూ సరిపడే పదం కాబట్టి ఈ పదాన్ని చక్కగా వాడుకున్నాడు వేటూరి! పూర్వం “నరవరా కురువరా” పాటలో ఇలాంటొక సన్నివేశంలో సుముద్రాల గారు కూడా “జాణ” అన్న పదం వాడారు.

పాటలోని భావం (క్లుప్తంగా):
శృంగార చేష్టలు చేసి, వరవీణపలికే స్వరాలులాంటి తీయని మాటలు చెప్పి పులకింపజేసే నేర్పరివి. మెత్తటి చేతులుగలవాడివి / (దానవి). కన్నుల్లో సరసపు వెన్నెల కాస్తుందా అనిపించేలాంటి చూపులు, కనుసైగలలో గుసగుస సందేశాల తెమ్మెరలు! — ఈ భావం కవ్వించే నర్తకి పాడినా సరిపోతుంది, అలిగిన ప్రేయసీ, ప్రియులు పాడుకున్నా సరిపోతుంది.
నర్తకి కవ్విస్తూ పాడే చరణంలో రెండు లైన్లలో హీరో తనని ఎందుకాకర్షించాడో చెప్తుంది. తర్వాత తన అందం గురించి, తన స్థితి గురించీ చెప్తుంది. నాటి కళాసంపదకి నిలయమైన హంపికళంతా తన సొగసుల్లోనే ఉందనీ, వారి రాజ్యంలో సాగే తుంగా నది పొంగులే తన పయ్యెదలో పొంగులనీ పాడుతుంది! (ఎండు బీడునేలపైన ఒక వర్షం పడగానే మరసటి రోజుకల్లా తుంగ దుంపలు మట్టిని చీల్చుకుని పైకి మొలకెత్తుతాయి, అవి గోపురాల్లా కనిపిస్తుంటాయి). ఆడది కోరి వస్తుంటే చిరాకుపడి వెళ్ళడం మర్యాదకాదు. కనీసం ఈ పూలపానుపైనా సవరించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళరాదా అని గారాలు పోతోంది. గమనిస్తే, ఇక్కడ వేటూరి వాడిన ఉపమానాలు రెండూ (హంపి కళ, తుంగ నది) విజయనగర సామ్రాజ్యానికి చెందినవే. చక్కగా సాహిత్యంలో ఒదిగేవే!.
ఇక రెండో చరణంలో అలిగిన తన ప్రేయసిని ముద్దుచేసుకుంటున్నాడు హీరో. “ఏంటి ప్రియా అలిగావా? నీకు తెలియదేమో చీకట్లో అలిగిన ప్రేయసిని బతిమాలుతూ, ప్రాధేయపడుతూ ఉంటే వలపు ఇంకాస్త రసవత్తరం అవుతుంది. వెన్నెల సొగసూ, చలి రాత్రీ కలిసి తాపాన్ని పెంచేస్తూ వయసుకు మరికాస్త ఉద్వేగాన్నిస్తుంది. ఉడుక్కోవడం ఆపి నా మన్మథ సామ్రాజ్యపు రతీదేవిలా, నా వలపు కోవెలలో హారతిలా నవ్వమని అడుగుతున్నాడు. కోపాన్ని పగవాళ్ళతో ప్రదర్శించాలిగానీ పరువంలో ఉన్న చెలికాడితో కాదు” అని అంటున్నాడు.
ఈ పదాలన్నీ ఎక్కడికక్కడ ఎంత చక్కగా నప్పాయో గమనిస్తే, వేటూరి తనకు తాను ఒక ముద్ర ఎలా ఏర్పరచుకున్నాడో తెలిసిపోతుంది.

-అవినేని భాస్కర్ 

Avineni Bhaskar

Download PDF

5 Comments

 • Praveena says:

  బాగుంది భాస్కర్ గారు. తెలుగు పాటలకు సాహిత్యపు టచ్ ని ఇచ్చిన వారిలో వేటూరి ఒకరు.

 • సురేశ్ కొలిచాల says:

  ఎందుకూ పనికిరాని పాట. వేటూరి కొక్కిరిబిక్కిరిగా ఏదో గిలికి రాసిపడేసిన పాట. పల్లవిలో గానీ, చరణాల్లో గానీ, 16వ శతాబ్దపు తెలుగు ఛాయలు చూపించే ప్రయత్నం ఏదీ నాకు కనబడలేదు. మోజు (موج mauj, मौज), వైఖరి, సంతకము వంటి హిందుస్తానీ పదాలు ఆ రోజుల్లో నర్తకీమణులు వాడేవారా? వాక్యనిర్మాణం కూడా 16వ శతాబ్దపు తెలుగులా ఏ కోశానా అనిపించదు. “-లే” (జాణవులే, వీణవులే, మృదుపాణివిలే) అన్న clitic ఆ రోజుల్లో వాడేవారని నాకు తెలిసి ఏ ఆధారాలు లేవు.

  ఇక పాట విషయానికి వస్తే, వేటూరి పాటల్లో తరచుగా కనిపించే అసంయోజితమైన (unconnected) భావాలే తప్ప ఒక రసస్ఫోరకమైన భావచిత్రం కనిపించదు. “జాణవులే” అని రెండు సార్లు ఏ అర్థభేదం లేకుండా వాడడానికి కారణమేమిటో తెలియదు. “మోవి కని, మొగ్గ కని మోజు పడిన వేళలో” అన్నప్పుడు మొగ్గ అని ఏ శరీర భాగాన్ని సంబోధిస్తుందో తెలియదు. వెన్నెలలు, తెమ్మెరలు పెదవి చూసి, మొగ్గ చూసి మోజు పడ్డాయట. మొగ్గ అనేది యమకం కోసం వాడిన ప్రాస మాత్రమేనా?

  కిలకించితం అన్నది ధ్వన్యనుకరణ (onomatopoeic) శబ్దం మాత్రమే. “కిలకిల నవ్వు” అన్న దేశ్య పదం సంస్కృతంలో కిలకిలాయతి-, కిలకించిత- గా మారింది. మురిపెము అన్నది ప్రధానంగా “నడకయందలి కులుకు”కు మాత్రమే వాడుతారు. “మొము అటు దాచి” వేస్తే “నడకయందలి కులుకు” ఎందుకు పెరుగుతోందో తెలియదు. లాహిరి అంటే మైకము కాబట్టి ఏదైనా సాధ్యమే అనుకోవాలి. “మూగవుగానే మురళిని ఊదే” అన్న దానికంటే “మౌనముగానే మురళిని ఊదే” అంటే సరైన అర్థం చప్పున స్ఫురిస్తుందేమో. తుంగ అంటే నది మాత్రమే. పయ్యద పొంగులను గడ్డితో పోల్చితే మరింత రసాభాసమౌతుంది. “విరిపానుపు సవరించవేమిరా” అంటే అర్థం ఏమిటి? కొప్పు సవరించుకొంటారు, కానీ పానువు సవరించడం అంటే ఏమిటి? “పానుపు నలరించవేమిరా?” అంటే కొంత అర్థవంతంగా ఉండేదేమో. “హారతిలా నవ్వడం” అంటే ఏమిటి? “తొలి సోయగము” అంటే అర్థం ఏమిటి? తొలి యవ్వనము అంటే అర్థం చేసుకోవచ్చు: యౌవనంలో తొలిదశ అని. కానీ, తొలి సోయగము అంటే ఏమిటి?

  ముందుగా చెప్పినట్టు, ఎందుకూ పనికిరాని పాట. వేటూరి కొక్కిరిబిక్కిరిగా ఏదో గిలికి రాసిపడేసిన పాట!

  • Srinivas Vuruputuri says:

   సంతకము – సంస్కృతమట (చూ. ఆంధ్రభారతి). వైఖరి కూడా.

   మురిపెము అంటే ముద్దు అనే అర్థం కూడా ఉన్నది కదా?

  • Thirupalu says:

   /“మోవి కని, మొగ్గ కని మోజు పడిన వేళలో” /
   ఇక్కడ మొగ్గను కేవలం ప్రాస కోసం వాడినట్లు లేదు. సిగ్గుల మొగ్గను గుర్తుతెస్తుంది. శరీర భాగం కాదు.
   / “జాణవులే” అని రెండు సార్లు ఏ అర్థభేదం లేకుండా వాడడానికి కారణమేమిటో తెలియదు./
   కిలికించితాలలో, మధు సంతకాలలో ఆమె జానె మాత్రమే కాదు, నెరజాననే కనుక అర్దభేదం లేకపోయినా పరవలేదు.

   /మురిపెము అన్నది ప్రధానంగా “నడకయందలి కులుకు”కు మాత్రమే వాడుతారు./
   కాదు మురిపెము అంటే సంతోషము లేక కోరిక.’ ముద్దు మురిపెం ‘ అన్న నానుడి చూడండి.
   /మోమటు దాచి, మురిపెము పెంచే లాహిరిలో/
   /“మొము అటు దాచి” వేస్తే “నడకయందలి కులుకు” ఎందుకు పెరుగుతోందో తెలియదు./
   సిగ్గుతో మోమును పక్కకు తిప్పుకుంటే మురిపెము (కోరిక) పెరుగుతుంది మత్తుగా. లాహిరి అంటే మత్తు.
   /మరియాదకు విరిపానుపు సవరించవేమిరా/

   విరులు అంటే కురులు కాదు. పువ్వులే. పూల పానుపు- కురులు, విరులు కలిసి ఉండే జడ. కోరి వచ్చిన సఖిని మరియాదకైనా తలని నిమర మని అర్ధం చెప్పుకోవచ్చు.
   తుంగకు రెండు అర్దాలు ఉన్నాయి. తుంగ దుంపలకు సువాసనలు వెద జల్లె గుణం వున్నది. ఇవి కాస్మోటిక్సులో కూడా వాడతారు. ఈ అర్ధం కూడా తీసుకోవచ్చు.
   తెలుగుకు గ్రహణం పడుతుంది. వేటూరి గారు మంచి కవి అనటంలో ఎటువంటి సదేహాం లేదు గాని, ఆయన ఎవరికోసం కవిత్వం సృష్టించారు. ద్వందార్ధాలతో అన్నదే ప్రశ్న.

Leave a Reply to Srinivas Vuruputuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)