శిశిరానికేం తొందర?

winter_rainbow_by_annmariebone-d89tjoe

నా తోటకి హేమంతం వచ్చేసింది
నిన్నటిదాకా హరితఛత్రాన్ని ధరించిన
నా ఆశల తరువులన్నీ
పసుపుదుప్పటీ కప్పుకుంటున్నాయి,
రేపో మాపో ఆకురాల్చడం మొదలైపోతుంది
నా తోటంతా రక్తమాంసాలు కోల్పోయిన
అస్థిపంజరంలా కళావిహీనమవుతుంది!

ఓ కాలమా, తొందర పడకు!
నా సుందర వనాన్ని వివస్త్రను చెయ్యకు!
ఋతుధర్మాన్ని పాటించక తప్పదంటావా?
ఐతే, ఇదిగో, మా మనుషులం తీసుకొనే
అలసత్వపు మందు!
కొంచెం సేవించి రోజుకో ఆకుని మాత్రం రాల్చు!
ఎందుకంటే,
ఈ పత్రసంచయమంతా నా ఆశలకు ప్రతీకలు!
వాటి ఉనికే నా సాఫల్యానికి ఆయువుపట్టు
నిత్యవసంతాన్నే కోరుకుంటూ
నా చెట్లకిందే నేనెన్నో కలల ఇంద్రధనుస్సులపైకెక్కి
నాట్యంచేస్తుంటాను!

నా స్వప్నాలని శీర్ణంచేసే శిశిరాన్ని
నా తోటకి ఆవలే
ప్రతీక్షచేయమను!

-శివరామకృష్ణ

sivaramakrishna

Download PDF

2 Comments

 • Rekha jyothi says:

  ‘ నిత్యవసంతాన్నే కోరుకుంటూ
  నా చెట్లకిందే నేనెన్నో కలల ఇంద్రధనుస్సులపైకెక్కి
  నాట్యంచేస్తుంటాను!’ ఎంతో సహజమైన ఆశ కవి కలం లో చాలా భావయుక్తం గా వుంది సర్

 • మైథిలి అబ్బరాజు says:

  ఇదిగో, మా మనుషులం తీసుకొనే
  అలసత్వపు మందు!
  కొంచెం సేవించి రోజుకో ఆకుని మాత్రం రాల్చు!…భలే చెప్పారండి . అర్థవంతమైన ఆశా పూరితమైన కవిత.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)