కవిసంగమం మూడో మైలురాయి!

kalankariతెలుగు కవిత్వంలోకి ఈ కాలపు వాళ్లు రావటంలేదు,ముప్పై అయిదులోపు వయసువాళ్లు రావటం లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో సాహిత్య కార్యక్రమాల్లో చాలావరకు వినిపించే మాటలు. నిజమే ననిపించేది దానికి కారణం. బయట అనేక సంస్థలు నిర్వహించే సమ్మేళనాల్లో లబ్దప్రతిష్టులైన కవులు,అంతో ఇంతో పేరున్న కవులు, సాహితీ వేత్తలు మాత్రమే పాల్గొనేవారు.ఇలా నిండిపోయిన సభల్లో కొత్త గొంతుకలు కనిపించేవికావు. కచ్చితంగా కరణాన్ని అంచనాకట్టాలంటే స్థలాభావమే ఎక్కువ.ఉన్న సమయంలో కొత్తవాళ్లకు సమయాన్ని కేటాయించాలంటే నిర్వాహకులకు కష్టమే. ఇప్పటికి కవిత్వం బతుకుతుంది.రేపటి విషయం ఏమిటి ?అనే ప్రశ్న చాలామందిని తొలిచేది. నిజానికి తెలుగు మరుగున పడుతోందో అని బాధపడేవాళ్లతో బాటు.కవిత్వం మరుగున పడుతోందనే వారిసంఖ్యా లెక్కించదగిందే.

బాగా అర్థం చేసుకుంటే ఎక్కడైన స్థలాభావమే ఇప్పటిసమస్య.ఆన్ లైన్ మాధ్యమం ఒకటి చేరువయ్యాక అన్ని తరాలను కలిపే అవకాశమొకటి వచ్చింది.కొన్ని తరాల కవిత్వాన్ని ఒక దగ్గర చేర్చేందుకు కవిసంగమం తెరమీదకు వచ్చింది.ఈ తొమ్మిది ఫిబ్రవరి నాటికి కవిసంగమం నడకకు మూడేళ్లు.చాలావరకు సంస్థలు ఆర్ద్రలో పుట్టి పుబ్బలో పోయేవే అనే సామేతకు దగ్గరివే.ఇలాంటి సాహసంలో “కవిసంగమం” మొదటిదనలేం కాని మూడుపువ్వులు ఆరుకాయల్లా వికసించినవాటిలో మొదటి స్థానంలో ఉంటుందనటంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. కవిసంగమం నడక వెనుక కవి యాకూబ్ కృషి గమనించదగింది.కేవలం తెలుగుకు సంబంధించిన మూడుతరాలను మాత్రమే కాదు. భారతీయ తెలుగేతరభాషల్లో లబ్దప్రతిష్టులైన శాహితీ వేత్తలుకూడా కవిసంగమం వేదిక పంచుకోవడంలో ప్రధానంగా యాకూబ్ ఆలోచనలు హర్షించదగినవి. అతనికి సాయంగా ఉన్న మిత్రుల నిబద్దతనుకూడా అభినందించవలసిందే.

సంవత్సరం వరకు కవిత్వం గ్రూప్ గా నడచిన కవిసంగమం భారతీయభాషల కవులను వేదికపై పరిచయం చేసింది.మొదటి వార్షికోత్సవం నాటికి సుభోధ్ సర్కార్ అతిథిగా హాజరయ్యారు.రెండవ వార్షికోత్సవానికి శీతాశు యశశ్చంద్ర ,కాస్త ముందుగా జరిగిన ఈసంవత్సరపు వేడుకల్లో రజతసల్మ పాల్గొన్నారు.మధ్యకాలంలో ఒక కార్యక్రమంలో చేరన్ రుద్రమూర్తి తో పరిచయకార్యక్రమాన్ని,ఈ సంవత్సరం సింధీకవి లక్ష్మణ్ దూబే తో పరిచయాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమాన్ని పున:పున:చూడడానికి యూట్యూబ్ లోనూ కార్యక్రమాలను చేర్చి తాముగాహాజరుకాలేని ఇతరప్రాంత సాహితీ మిత్రులకు ఈ అవకాశాన్ని కలిగించింది.

జనవరి ఇరవైఏడు 2013 నుండి ప్రారంభమైన కవిసంగమం “లెర్నింగ్ ఇన్ ప్రాసెస్”కార్యక్రమం సుమారు ఇప్పటివరకు ఒకటిన్నర సంవత్సరాలపాటు నిరాటంకంగా నడచి మూడుతరాలను ఒకదగ్గరికి చేర్చి తరాలమధ్య ఉండే అంతరాన్ని దూరం చేసింది.వరవర రావు,నగ్నముని,నిఖిలేశ్వర్,దేవీప్రియ,అమ్మంగి వేణుగోపాల్,మొదలైన లబ్దప్రతిష్టులైన కవుల్ని కొత్తతరానికి ,కొత్తతరాన్ని మిగతాకవులకు పరిచయం చేసింది.ఈ మార్గంలో స్థలాభావాన్ని ఒక నిర్ణీతమార్గంలో దూరం చేయగలిగింది. అంతే కాదు యువత కవిత్వంలోకి రావటం లేదన్న మాటని అసత్యంగా నిరూపించింది. ఇప్పటికే కవిసంగమం ద్వారా కవితా రచన ప్రారంభించి కొంత అనుభవాన్నిసమకూర్చుకున్న యువతరం పుస్తకాలను ముద్రించుకుని తమనడకకు సార్థకతను కలిగించుకున్నారు.కవిసంగమం సాధించిన లక్షాలలో ఈ అంశం గమనించదగింది.

వృత్తిరీత్యా,ఇతరకారణాలతో తెలుగునేలకు దూరంగాఉన్న తెలుగు కవులతోకూడా కొత్తతరాన్ని కలిపింది. ఇందులో భాగంగా “మీట్ ది పోయట్”కార్యక్రమంలో నారయణ స్వామి వెంకట యోగి,అఫ్సర్(27 జూలై)కృష్ణుడు (7 డిసంబర్)మొదలైన కవులతో పరిచయాన్ని సంభాషణను నిర్వహించింది. పుస్తకముద్రణల్లో భాగంగా రెండవసంవత్సరం నూటా నలభైనాలుగుమందికవుల కవిత్వంతో పుస్తకాన్ని తీసుకువచ్చింది.

నిరంతర సాహిత్యచర్చలకోసం గతంలో సాహిత్యంతో స్ఫూర్తివంతమైనపరిచయాలుగల కవులు,విమర్శకులు,అనువాదకులతో రోజువారీశీర్శికలను నిర్వహిస్తోంది.సీనియర్ కవులసలహాలను ఎప్పటికప్పుడు కొత్తవారికి చేర్చడంతోపాటు,కొత్తగారాస్తున్నవారిలో దొరలే తప్పుల్ని తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి నౌడూరి మూర్తిగారు(కవిత్వతో ఏడడుగులు)కాసుల ప్రతాప రెడ్డి (కవిస్వరం) వేణుగోపాల్ (కవిత్వంతో ములాఖాత్)సత్య శ్రీనివాస్(మట్టిగూడు)అబ్దుల్ వాహెద్ (ఉర్దూకవిత్వ నజరానా)శ్రీనివాస్ వాసుదేవ్(The winged word)అన్నవరం దేవేందర్(తొవ్వ)అఫ్సర్(కరచాలనం)తో పాటు సిరా,రాజారాం తుమ్మచెర్ల(నేను చదివిన కవిత్వ సంపుటి) మొదలైనవాళ్ళు  శీర్శికలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్.జీవితం-కవిత్వం(అబ్దుల్ వాహెద్ రచన)ఎం.నారాయణ శర్మ(ఈనాటికవిత-కవిత్వ విమర్శ)ముద్రించి పుస్తకముద్రనవైపునడిచింది.మూడుతరాల కవిత్వాన్ని ఒకవేదికనుంచి అందించడమేకాక భవిష్యత్తులోని రెండుమూడుతరాలనుకూడా కవిసంగమం పరిచయం చేసింది.రక్షితసుమ “దారిలోలాంతరు”ను ఆవిష్కరించుకుంది.కమలాకర్,మరికొంతమంది పాఠశాల విద్యార్థులు కవిసంగమం తోటలో వికసిస్తున్న రేపటి కవితా కుసుమాలు.

ఈనడకను గమనిస్తున్న వారెవరైనా కవిసంగమం తీసుకువచ్చిన కవితాస్పృహను గుర్తించగలుగుతారు.ఇంత నిబద్దమైన నిర్వహణలొ ఉండే సాధకబాధకాలు అందరూ గుర్తించగలిగేవే.వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది.కవుల్ని, కవిత్వాన్ని మాత్రమే ఆధారం చేసుకున్న నడక మరింత శక్తివంతంగా ముందుకుసాగాల్సి ఉంది.అందుకు ఈ మూడేళ్ళమైలురాయే మంచిపాఠంగానిలుస్తుంది.

ఎప్పటికైనా కవితాత్మకస్పృహను అందుకోలేనికవులను దారికితెచ్చుకోవాల్సిన అవసరమూ ఇప్పుడు కవిసంగమం భుజాలపై ఉంది.మరిన్ని తరాలనుకలుపుతూ కవిసంగమం జీవనదిలాప్రవహించాల్సిన అవసరం ఉంది.ఈ పచ్చని చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదికూడా.

-ఎం.నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

 

 

 

 

 

 

కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది: కవి యాకూబ్ 

మూడేళ్ళ కవిసంగమం ప్రయాణ అనుభవం ఎలా ఉంది?

జ. తెలుగులో కవిత్వానికి కొత్తవేదికగా కవిసంగమం ఏర్పాటు చేసుకున్నాం. ఫేస్‌బుక్‌ లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన, సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఏర్పడిన సమూహం. కవిత్వసృజన, కవిత్వపఠనం, కవిత్వ సంబంధిత అంశాలు – ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా ‘‘కవిసంగమం’’ సీరీస్‌ సభలు ‘‘పోయెట్రీ వర్క్‌ షాపుల్లా” జరుగుతున్నాయి. వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్‌ వాల్‌ మీద పోస్టు చేయడం, నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌’’ మార్గంలో సాగుతోంది .

కవిసంగమం ప్రారంభంలోని ఈ దశను ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఎంతో హాయిగా, సంతోషంగా ఉంది.

ఫిబ్రవరి 9, 2012 – కవిసంగమం మొదలయ్యింది. ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది. ఇవ్వాళ ఫేస్‌ బుక్‌ కవితావేదికగా నిలబడింది. అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాసున్నవాళ్ళు ఎందరో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, సందోహాలు -వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్‌ చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఆ మార్గంలో సాగుతున్నారు. కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది.

ఆగష్టు 15, 2012 న ఇఫ్లూ లో జరిగిన ‘‘కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్‌’’ ఒక గొప్ప ప్రయోగం. ఆంధ్రజ్యోతి, పాలపిట్ట, దక్కన్‌ క్రానికల్‌, హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి. అలాగే ఒక ప్రయత్నంగా, ఒక ప్రయోగంగా 144 కవితలతో ‘‘కవిసంగమం-2012 ’’ కవితా సంకలనం వెలువడిరది . ఇందులో తొట్టతొలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి. ‘కవితత్వాలు’ పేరుతో యశస్వీసతీష్  ఫేస్బుక్లో రాస్తున్న కవుల పరిచయ పుస్తకం ప్రచురించారు. 2014లో ’’సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్‘‘ పేరుతో వాహెద్ రాసిన ఫైజ్ కవితలు జీవితం గురించిన పుస్తకాన్ని, ’’ఈనాటి కవిత‘‘ పేరుతో ఎం.నారాయణశర్మ రాసిన 75 మంది కవుల కవితల విశ్లేషణా పుస్తకాన్ని ప్రచురించాం.

***

2012 లో బెంగాలీ కవి సుబోధ్‌ సర్కార్‌ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్‌ ను చూసి ముచ్చటపడ్డాడు. గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు. అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆ తర్వాత  వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్‌ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు, చదివిన కవిత్వం మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌ ’’గా ఎంతో ఉపయోగపడ్డాయి.

కవిసంగమం ఫేస్‌బుక్ గ్రూపులో 3000 పైగా సభ్యులున్నారు.ప్రతి రోజు కవితలు వాలుతు వుంటాయి. అలానే ప్రతిరోజూ, రోజుకొక అంశానికి సంబంధించిన వ్యాసాలుంటాయి. ఇప్పుడు కవిసంగమం కవిత్వానికి సంబంధించిన గ్రంధాలయం.
9-2-2012 నుంచి నేటి వరకు తెలుగు సాహిత్యానికి ఎందరో నూతన కవుల్ని పరిచయం చేసింది. ఈ నూతన కవుల్ని కేవలం అంతర్జాలం మాధ్యమానికే పరిమితం చేయకుండా పాత తరానికి కొత్త తరానికి మధ్య కవిత్వ వారధి అయ్యింది. ఈ బాటలో వచనకవిత్వం అనుబంధిత అంశాలపై నిరంతర సంభాషణ కొనసాగుతుం ది. అందులో భాగంగా వర్క్ షాపులు కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని పంపిణీ చేయడం, ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ మార్గాన్ని సృష్టించింది.
1779260_10203144783201536_2074735339_n

 

  1. ఫేస్బుక్ గ్రూప్ గానే కాకుండా ప్రత్యక్షంగా వివిధ కార్యక్రమాల ద్వారా కవిసంగమం తీసుకొచ్చిన చైతన్యానికి ముఖ్యంగా ఈ తరం నుంచి ఎలాంటి స్పందన చూస్తున్నారు?

జ. ముఖ్యంగా కవిత్వ పండుగల వల్ల ఇతర భాషలకు చెందిన ప్రముఖ కవులను కొత్తతరం కవులు కలుసుకునే వాతావరణం ఏర్పడింది. దానివల్ల చాలా మందికి నేర్చుకునే అవకాశం లభించింది. మీకు తెలుసు, కవిత్వం నేర్పడానికి విశ్వవిద్యాలయ కోర్సులేవీ ఉండవు. కవిత్వం రాయాలన్న తపన ఉన్నవారికి ఇలాంటి సందర్భాలు అవసరమైన లెర్నింగ్ అవకాశాలు కల్పించాయి. నెలనెల జరిగే పొయట్రీ మీట్ ల ద్వారా పాతతరం కవులు, కొత్త తరం కవులు కలుసుకోవడం వల్ల సీనియర్ల నుంచి కొత్తతరం కవులు నేర్చుకునే అవకాశాలు లభించాయి. తెలుగు కవిత్వంలో ఇది ఒక చక్కని వాతావరణాన్ని ఏర్పరచింది. అన్నింటికి మించి, హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కవిసంగమం పేరుతో ఒక స్టాల్ తీసుకుని నడిపాము. అక్కడ కేవలం కవిత్వ పుస్తకాలు మాత్రమే అమ్మకానికి ఉంచాము.

తెలుగు కవులు చాలా మంది తమ పుస్తకాలు తీసుకొచ్చి స్టాల్ లో ఉంచారు. తెలుగులో కవిత్వం కొని చదివేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆ స్టాల్ నిరూపించింది. ఆ పదిరోజుల్లో మేము దాదాపు 40 వేల రూపాయల పుస్తకాలు అమ్మగలిగాము. కవులకు వారి పుస్తకాలు అమ్మకానికి పెట్టే ఒక వేదికనివ్వగలిగాము. ఇవన్నీ ఫేస్ బుక్ కు ఆవల జరిగిన కార్యక్రమాలే. నిజానికి ఫేస్ బుక్ కవులను పరోక్షంగా కలిపింది. వారి కవిత్వంతో పరిచయం ఏర్పడేలా చేసింది. కవిత్వం రాయాలనుకుంటున్న వారికి కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపు ఒక వేదికగా ఉపయోగపడింది. ప్రాధమికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది . ఆ తర్వాత కవిసంగమం చేపట్టిన నెలవారి సమావేశాలు, కవిత్వపండుగలు, బుక్ ఫెయిర్లలో స్టాల్ నిర్వహణ వంటి కార్యక్రమాలు కవులను ప్రత్యక్షంగా కలుసుకునే, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకునే, ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే అవకాశాలు కల్పించాయి. జయహో కవిత్వం ‘అని అందరితో అన్పించగలుగుతున్నాం.

  1. ఇతర భాషల కవులని ఆహ్వానించి, వారి గొంతు వినిపించడం ఒక ప్రయోగం. దాన్ని మన కవులు ఎలా స్వీకరిస్తున్నారు?

పరభాషా కవుల అనుభవాలు, అక్కడి కవిత్వ ధోరణులు, కవిత్వ వాతావరణం గురించి మనవారికి ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగింది.  వారిని వినేందుకు,ముచ్చటించేందుకు ,కలుసుకునేందుకు ఎక్కువ సంఖ్యలోనే హాజరు అవుతున్నారు. ఆ ఆసక్తి ఆశాజనకమైన మార్పే. అప్పటికప్పుడు కవులు తమకు ఇతర భాషల్ని వినడం ద్వారా ఏం ఒనగూడిందో చెప్పకపోవొచ్చుకానీ, ఖచ్చితంగా ఆ ప్రభావం మాత్రం ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో కవిత్వం అనే ప్రక్రియ సీరియస్ నెస్ ని అర్థం చేసుకోగలుగుతారు .

ఇతర భాషలలో ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. తెలుగునేలమీద ఇటువంటి అనుభవం రమారమిగా లేదనే చెప్పాలి. ఒక రకపు కవిత్వ సభలకు అలవాటుపడి పోయాం. ఇతర భాషల కవుల్ని పిలిచే కార్యక్రమం ద్వారా ఇక్కడి కవిత్వ వాతావరణంలో క్రొంగొత్త తీరును ప్రతిష్టించాలని కూడా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలితాల్ని ఇస్తున్నట్టే కన్పిస్తుంది. ఇటీవలి బుక్ ఫెస్టివల్ లో కవిత్వ సంకలనాల అమ్మకం ఒక కొలమానంగా చూపవచ్చేమో !

  1. కవిసంగమం భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి?

జ. భవిష్యత్తులో మరిన్ని కవిత్వ కార్యక్రమాలు ఫేస్బుక్ బయట కూడా ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా అనేకమంది కొత్త కవులు రాస్తున్న పుస్తకాలకు ప్రచురణ వేదిక ఒకటి ఏర్పాటు చేయాలని, వారి పుస్తకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నాం. తెలుగులో కవిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణం ఏర్పాటు చేయాలన్నదే మా అభిమతం. కవిత్వానికి మరింత ఊపు,ఉత్సాహం తీసుకురావాలన్నదే ప్రధాన ధ్యేయం. నిరంతరం కవిత్వం కోసం కవిత్వ సందర్భాల్ని సృష్టిస్తూ కవిత్వాన్ని సజీవంగా ఉంచాలని ప్రయత్నం.

*

 

 

Download PDF

5 Comments

  • balasudhakarmouli says:

    కవిత్వం వర్ధిల్లాలి .

  • srinivasu Gaddapati says:

    క్రొత్తపాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా అన్నట్లు మూడుతరాల కవులను ఒకవేదికమీద నిలిపిన ఘనత కవిసంగమానిదే…జయహోకవిత్వం…

  • కపిల రాంకుమార్ says:

    నారాయణ శర్మ గారి వ్యాసం సంక్షిపమైనా………విహంగ వీక్షణంగా చక్కగానే ఆవిష్కరించారు..చాల సంతోషం. గుర్తుపెట్టుకుని ఎంతో అభిమానంగా నాకు పోస్ట్ పెట్టినందుకు. మీ లాంటి అబ్బాయిలుండగా మరింత ఉత్సాహంగా మరికొంత కాల ఆనందంగా బలంగా మనకలుగుతాను.

  • K.WILSONRAO says:

    కవిసంగమం గ్రూపులో సభ్యులందరికీ జయహో!
    మంచి కవిత్వం వర్దిల్లాలి
    మరెంతమందో కవులు తయారు కావాలి

  • కర్లపాలెం హనుమంత రావు says:

    కవిసంగమం పదికాలాల పాటు వర్ధిల్లాలని ఇప్పుడు ఎవ్వరం దీవించాల్సిన దశ దాటి పోయినందుకు ఆనందంగా ఉంది. ముందు జాతీయ కవిత్వ అవగాహన.. ఆనక అంతర్జాతీయ కవిత్వంవైపుకి చూపే ఇహ మిగిలిన లక్ష్యాలుగా సాగాలని అభిలషిస్తున్నా. కవిసంగమ సంబంధీకులందరికీ ‘జయహో’

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)